
ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మొత్తం 42 గేట్లను పైకెత్తడంతో గోదావరిలోకి పోటెత్తుతున్న వరద నీరు
♦ భారీ వర్షాలతో మహోగ్రంగా గోదావరి, ఉపనదులు
♦ ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్‌ల గేట్లు ఎత్తివేత
♦ ఇంద్రావతి, ప్రాణహిత పరీవాహకంలోనూ వ రద ముప్పు
♦ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
♦ కృష్ణా నదిలోనూ పెరిగిన ప్రవాహాలు..
♦ శ్రీశెలానికి 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
♦ కరీంనగర్ జిల్లాలో తెగిన మిడ్‌మానేరు డ్యామ్ మట్టికట్ట
♦ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలకు తోడు భారీ వర్షాలతో చేరుతున్న నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి అయితే మహోగ్రరూపంతో పారుతోంది. ఈ బేసిన్‌లోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు డ్యాం, కడెం ప్రాజెక్టులన్నీ నిండు కుండలుగా మారాయి. దీంతో ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. అటు కృష్ణా పరీవాహకంలో వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఆ నీటిని వచ్చింది వచ్చినట్లుగా వదిలేస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రాజెక్టులోకి భారీగా నీరు రావడం, నదులన్నీ పొంగడంతో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పరిస్థితిని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయం గా పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టుల పరిధిలో పర్యటిస్తూ అధికారులకు సూచనలు జారీచేస్తున్నారు.
ఉప్పొంగిన గోదావరి
మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్‌కు ఆదివారం కూడా 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద కొనసాగింది. శనివారమే ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసిన అధికారులు.. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రానికి 1090 అడుగుల వద్ద 84 టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తున్నారు. ఇక మంజీరా నది కూడా ఉప్పొంగుతుండడంతో సింగూరు ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తేశారు. సింగూరుకు ఆదివారం ఉదయం లక్షా 20వేల క్యూసెక్కుల వరదరాగా.. సాయంత్రానికి అది 70 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఔట్‌ఫ్లో 62 వేల క్యూసెక్కుల వరకు ఉంది.
ఈ నీటితోపాటు హల్దివాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా కలిపి నిజాం సాగర్ ప్రాజెక్టుకు 1.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.9 టీఎంసీలుకాగా.. సాయంత్రానికి 14 టీఎంసీలకు చేరింది. మరింత వరద వస్తుండటంతో ఆదివారం రాత్రి ప్రాజెక్టు 23 గేట్లను ఎత్తి 1.5 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. గత మూడేళ్లలో తొలిసారిగా ఈ మూడు ప్రాజెక్టులు నిండడం గమనార్హం. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో 4.49 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.
ఈ నీళ్లన్నీ దిగువకు విడుదల చేస్తున్నారు. వీటికితోడు ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ప్రభుత్వం నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసింది. ఇక ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి మట్టం ఆదివారం 21 అడుగులుగా నమోదైంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో.. నీటిమట్టం ప్రమాదకర స్థాయికి పెరగొచ్చ ని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు లోయ ర్ మానేరు డ్యామ్‌లోకి భారీగా వరద చేరుతోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ఆదివారం రాత్రి వరకు 14 టీఎంసీల నిల్వ ఉంది.
శ్రీశైలానికి భారీ వరద
మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టులు నిండిపోవడంతో.. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. దీంతో ఆదివారం జూరాల ప్రాజెక్టుకు 1.80 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 9.65 టీఎంసీలుకాగా.. 8.86 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువల ద్వారా మరో 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద మరింతగా పెరిగే అవకాశాలుండడంతో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి 1.98 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.
ఈ నీరంతా చేరుతుండడంతో ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ 185.56 టీఎంసీలకు చేరింది. ఇదే స్థాయిలో వరద కొనసాగితే మరో రెండు రోజుల్లోనే రిజర్వాయర్ నిండిపోనుంది. వరద పెరిగే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఎడమగట్టు, కుడిగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ.. 68,645 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా నాగార్జునసాగర్‌కు చేరుతోంది. ప్రస్తుతం సాగర్‌లో 141.91 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇది పూర్తిగా నిండాలంటే మరో 170.14 టీఎంసీలు అవసరం. నల్లగొండ జిల్లాలోని మూసీ రిజర్వాయర్‌కు ఆదివారం ఉదయం 11 వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో మధ్యాహ్నానికి 25 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో 5 గేట్లను ఎత్తి 11 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
మిడ్‌మానేరుకు గండి
వరద నీటి ఉధృతికి కరీంనగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న మిడ్ మానేరు జలాశయం స్పిల్‌వే మట్టికట్టకు గండిపడింది. అది ఉధృతమై ఆదివారం రాత్రి 20 మీటర్ల మేర తెగిపోయింది. దీంతో దిగువన ఉన్న చొక్కారావుపల్లె, యూస్వాడ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆదివారం ఉదయమే మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామం నీట మునగడంతో 450 కుటుంబాలను ఖాళీ చేయించారు. మంత్రి కేటీఆర్ అక్కడికి చేరుకుని తెగిపోయిన కట్టను పరిశీలించారు. ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇక 4.25 టీఎంసీల నిల్వతో మధ్య మానేరు రిజర్వాయర్ నిండుకుండలా మారింది.
స్వయంగా పర్యవేక్షిస్తున్న హరీశ్‌రావు
ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుతుండడం, నీటి విడుదలతో పరీవాహక ప్రాంతాలకు ముప్పు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి, జిల్లాల అధికారులతోపాటు మహారాష్ట్ర అధికారులతోనూ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టును హరీశ్‌రావు పరిశీలించారు. ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి వివరించారు. మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి నీటిని వదులుతామని.. ఎల్‌ఎండీ నిండితే దిగువకు విడుదల చేస్తామని వివరించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పరిస్థితి వివరాలు కూడా చెప్పారు. ఈ మేరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ సూచించారు.