ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఉధృతి
సాక్షి, అమరావతి/ఎటపాక/చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/పోలవరం రూరల్/ ధవళే శ్వరం/దేవీపట్నం/హోళగుంద/బుట్టాయగూడెం: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంవల్ల మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కడెంవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని తదితర ఉప నదులు ఉప్పొంగుతుండటంతో సోమవారం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. దీనికి ఉప నదుల నుంచి వస్తున్న వరద తోడవడంతో సరస్వతి, లక్ష్మీ బ్యారేజీల గేట్లు ఎత్తేసి.. 8.68 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
ఈ వరదకు ఉప నదులు, వాగులు, వంకల నుంచి వచ్చిన వరద తోడవడంతో సమ్మక్క బ్యారేజీలోకి 11.82 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ఆ మొత్తాన్ని దిగువకు వదిలేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీ దిగువన పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంవల్ల సీతమ్మసాగర్‌లోకి 14,30,597 (123.62 టీఎంసీలు) క్యూసెక్కులు చేరుతుండగా.. వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ఫలితంగా భద్రాచలంలో వరద గంటగంటకూ పెరుగుతోంది. ఇక్కడ వరద మట్టం 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.
విలీన మండలాల్లో రాకపోకలు బంద్
గోదావరికి వరద పోటెత్తడంతో విలీన మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక, రాయనపేట, నెల్లిపాక, వీరాయిగూడెం, గౌరిదేవిపేట, నందిగామ, మురుమూరు గ్రామాల వద్ద రహదారిపైకి వరద చేరింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు జాతీయ రహదారులపై నిలిచిపోయాయి. శబరి నది కూడా ఎగపోటుకు గురవుతోంది. దీంతో చింతూరు మండలంలో పలు వాగులు పొంగుతున్నాయి. ఈ ప్రాంతంలోనూ పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరద అధికంగా ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు.
ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని.. నిత్యావసర వస్తువులు, టార్పాలిన్లు సమకూర్చాలన్నారు. అలాగే, జ్వరాలు, డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుజాగ్రత్తగా లక్ష వాటర్ ప్యాకెట్లు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతర నిత్యావసర సరకులతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ మీడియాకు తెలిపారు. అంతేకాక.. వేలేరుపాడు, కుక్కునూరులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జేసీ అరుణ్‌బాబు, ఐటీడీఏ పీఓ జి.శ్రీనుకుమార్, ఆర్‌డీఓ ఎం.ఝాన్సీరాణి ఆయా గ్రామాల్లో పర్యటించారు.
ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేత
పోలవరం నుంచి వస్తున్న వరద జలాలతో ధవళేశ్వరం బ్యారేజీలో సోమవారం రాత్రి 7 గంటలకు బ్యారేజీలోకి 8,02,114 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 10.10 అడుగులకు పెరిగింది. నాలుగు వేల క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేసి, మిగులుగా ఉన్న 7,98,114 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. సోమవారం రాత్రికి బ్యారేజీలోకి పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశముంది. ఎస్సారెస్సీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరి ప్రధాన పాయపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం 15.70 మీటర్లు ఉంది.
వరద ఉధృతి కారణంంగా కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్లా, ఎస్పీ సురేష్‌కుమార్ రెడ్డి సోమవారం ఆయా గ్రామాలకు పడవపై లంకలోకి వెళ్లి వరద ఇబ్బందులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామన్నారు. జూలై రెండో వారంలో ఈ స్థాయిలో గోదావరికి వరద రావడం ఇదే ప్రథమం అని అధికారులు చెబుతున్నారు.
ఆల్మట్టి గేట్లు ఎత్తివేత..
మరోవైపు.. కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లోకి 75 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఆదివారం, సోమవారం పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడం.. ఉప నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఎగువ నుంచి భారీ వరద వస్తుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దాంతో.. ముందుజాగ్రత్తగా ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తేసి దిగువకు 75 వేల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. నారాయణపూర్ కూడా నిండుకుండలా మారడంతో ఆ డ్యామ్ గేట్లు కూడా మంగళవారం ఎత్తివేయనున్నారు.
కృష్ణాలో వరద ఉధృతి ఇలాగే కొనసాగితే.. మరో ఐదు రోజుల్లో శ్రీశైలానికి కృష్ణమ్మ చేరుకునే అవకాశముంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఈ డ్యామ్‌లోకి 81 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 91 టీఎంసీలకు చేరుకుంది. మరో 9 టీఎంసీలు చేరితే తుంగభద్ర నిండుతుంది. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం ఉదయం ఈ డ్యామ్ గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, పులిచింతల దిగువన బేసిన్‌లో కురిసిన వర్షాలకు 43 వేల క్యూసెక్కుల ప్రవాహం ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతోంది. ఇందులో ఐదు వేల క్యూసెక్కులను డెల్టా కాల్వలకు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 38 వేల క్యూసెక్కులను బ్యారేజ్ 50 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు.
వరదలకు జాగ్రత్తలు తీసుకోవాలి
– మంత్రి అంబటి రాంబాబు
రికార్డు స్థాయిలో గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సోమవారం వరద పరిస్థితిని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఈఎన్‌సీ నారాయణరెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రమాదం తొలగే వరకు ప్రజలను పునరావాస శిబిరంలో ఉంచి వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. వరద పెరగడంతో డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలోకి వరద నీరు చేరిందన్నారు. ఫలితంగా.. పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. నిజానికి.. గత ప్రభుత్వ హయాంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. దీనిని నిపుణుల బృందం పరిశీలిస్తోందని, వారిచ్చిన నివేదిక మేరకు కొత్తది నిర్మించాలా లేదా మరమ్మతులు చేయించాలా అనే విషయం తేలాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment