southwest monsoons
-
నైరుతి తిరోగమనం షురూ...
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ మొదలైంది. బుధవారం నుంచి ప్రారంభమైన రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ దేశవ్యాప్తంగా దాదాపు 3 వారాలపాటు కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మే 30న కేరళను తాకిన రుతుపవనాలు... క్రమంగా విస్తరిస్తూ జూన్ 6 నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తొలుత అత్యంత చురుకుగా సాగిన రుతుపవనాలు... జూలైలో మందగించాయి. దీంతో జూలైలో ఎక్కువ రోజులు వర్షాలు కురవలేదు. రాష్ట్రంలోని చాలాప్రాంతాలు ఆగస్టు రెండో వారం నాటికి లోటు వర్షపాతంతోనే ఉన్నాయి. ఆగస్టు మూడో వారం నుంచి రుతుపవనాల కదలికలు చురుకవడంతో వర్షాలు ఊపందుకున్నాయి. ఆగస్టు నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సీజన్లో రాష్ట్రంలో నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం 72.52 సెం.మీ.. ఈ సీజన్లో ఇప్పటివరకు కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతం 67.42 సెం.మీ. కాగా, నమోదైన వర్షపాతం 89.81 సెం.మీ.. ఈ లెక్కన సాధారణ వర్షపాతం కంటే 22% అధికంగా నమోదైంది.నిష్క్రమణ సమయమూ కీలకమే... రుతుపవనాలు నిష్క్రమించే సమయం కూడా కీలకమైందని నిపుణులు చెప్పారు. ఇప్పటివరకు ముందుకు కదులుతూ దేశాన్ని చుట్టేసిన రుతుపవనాలు... ఇప్పుడు తిరోగమన దిశలో ప్రయాణిస్తున్నాయి. ఈ సమయంలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గత పదేళ్లలో ఎక్కువగా వర్షాలు తిరోగమన సమ యంలోనే నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఇప్పటివరకు వర్షపాతం సాధారణం నుంచి అత్యధిక స్థాయిలో నమోదైంది. ఇందులో ఐదు జిల్లాలు అత్యధిక వర్షపాతం కేటగిరీలో ఉండగా... 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 7 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత సీజన్లో లోటు వర్షపాతం ఉన్న జిల్లాలేవీ నమోదు కాలేదు. గత మూడేళ్లుగా జిల్లా కేటగిరీలో లోటు వర్షపాతం నమోదు కాకపోవడం గమనార్హం. వర్షపాతం ఎక్కడ ఎలా? అత్యధిక వర్షపాతం: మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణ పేట అధిక వర్షపాతం: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్–మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు సాధారణ వర్షపాతం: ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హనుమకొండ, కామారెడ్డి, జనగామ, యాదాద్రి–భువనగిరి -
ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంపైన నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణశాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. సోమవారం రాష్ట్రంలో సగటున 1.85 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో సగటున 4.39 సెం.మీ. వర్షం కురవగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4.33 సెం.మీ. వికారాబాద్ జిల్లాల్లో 4.16 సెం.మీ., మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4.04 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. -
రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ద్రోణి ప్రభావంతో వచ్చే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఏపీ, యానాం మీదుగా నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో పలు చోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ⇒ మంగళవారం శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ⇒ బుధవారం అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ⇒ గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ⇒ జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా సగటు సాధారణ వర్షపాతం 99.4 మిల్లీ మీటర్లు నమోదుకావాల్సి ఉండగా 162.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 19 జిల్లాల్లో అత్యధిక, 5 జిల్లాల్లో అధిక, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. -
నేడు రాయలసీమలో భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు స్థిరంగా కదులుతున్నాయి. గాలుల కోత, షీర్ జోన్ ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరోవైపు మరఠ్వాడా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మంగళవారం రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో, బుధవారం నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. గురువారం బాపట్ల, కోనసీమ, పశి్చమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవవచ్చని పేర్కొంది. -
తుంగభద్ర ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లు అందేనా?
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ(ఐఎండీ) అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది తుంగభద్ర డ్యామ్‌లో 170 టీఎంసీల లభ్యత ఉంటుందని తుంగభద్ర బోర్డు, ఏపీ, కర్ణాటక, తెలంగాణ జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే ఈనెల 1 నుంచి తుంగభద్ర బేసిన్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఇప్పటికి 0.67 టీఎంసీలు తుంగభద్ర డ్యామ్‌లోకి చేరాయి. ఇక శనివారం డ్యామ్‌లోకి 1,490 క్యూసెక్కులు చేరాయి. గతేడాది ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు సక్రమంగా కురవలేదు. దాంతో తుంగభద్ర డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహం వచ్చింది. తాగునీటి అవసరాలకుపోను మిగతా నీటితో ఆరుతడి పంటలను ఆయకట్టు రైతులు సాగుచేశారు. ఈ ఏడాదైనా తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత పుష్కలంగా పెరుగుతుందని.. ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందాలని రైతులు ఆశిస్తున్నారు. కేటాయింపుల మేరకైనా లభ్యత ఉండేనా.. తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. తగ్గిన నిల్వ సామర్థ్యం.. నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. గతేడాది తుంగభద్ర డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చింది. అంటే.. బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దాంట్లో కేవలం 49.81 శాతం మేర మాత్రమే తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత ఉన్నట్లు స్పష్టమవుతోంది.తుంగభద్ర డ్యామ్‌లోకి 2016–17లో కేవలం 85.719 టీఎంసీలే చేరాయి. డ్యామ్ చరిత్రలో అదే కనిష్ట వరద ప్రవాహం కావడం గమనార్హం. ఈ ఏడాదైనా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకైనా నీటి లభ్యత ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. నాలుగేళ్లూ పుష్కలంగా నీటి లభ్యత.. తుంగభద్ర డ్యామ్‌లోకి 2015 నుంచి 2018 వరకు అరకొరగానే ప్రవాహం వచ్చింది. ఇక 2019–20 నుంచి 2022–23 వరకు నాలుగేళ్లు టీబీ డ్యామ్‌లో బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దానికంటే అధికంగా లభ్యత నమోదైంది. బేసిన్లో భారీ వర్షాలు కురవడంతో డ్యామ్‌లోకి వరద ప్రవాహం కొనసాగింది. నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో రాయలసీమ, కర్ణాటక, తెలంగాణలోని ఆయకట్టు రైతులు భారీ ఎత్తున పంటలు సాగుచేయడంతో సస్యశ్యామలమైంది. దిగుబడులు భారీగా రావడం.. గిట్టుబాటు ధర దక్కడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. -
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
విశాఖపట్నం (ఏయూ క్యాంపస్): నైరుతి రుతు పవనాలు మధ్య అరేబియా సముద్రంలోను, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాం«ధ్ర మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోణంగి కూర్మనాథ్ వెల్లడించారు. శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శనివారం అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువులో 44 మి.మీ, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 40 మి.మీ, శ్రీ సత్యసాయి జిల్లా నంబుపూలకుంటలో 39 మి.మీ, నెల్లూరు జిల్లా సైదాపురంలో 39 మి.మీ, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 36 మి.మీ, తిరుపతి జిల్లా పుత్తూరులో 30 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైందని వివరించారు. తిరుమలలో భారీ వర్షం తిరుమల: తిరుమలలో భారీ వర్షం కురిసింది. తిరుమల అంతా జలపాతాలను తలపిస్తున్నాయి. భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురైనా ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. తిరుమలలో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. భారీగా కురిసిన వర్షానికి నాలుగు మాడ వీధులు జలమయమయ్యాయి. -
చురుగ్గా విస్తరిస్తున్న నైరుతి
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే రాయలసీమ, నెల్లూరులోకి ప్రవేశించిన రుతుపవనాలు సోమవారం కోస్తాంధ్రలోని కృష్ణా, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల వరకు, పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఆవరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది. నైరుతి రుతుపవనాలు, ఆవర్తనం ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం.. శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అలాగే బుధవారం విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు సంభవిస్తాయని, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.నంద్యాలలో కుంభవృష్టిరుతుపవనాల ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. అనేకచోట్ల ఆకాశం మేఘావృతమై ఉండటంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సోమవారం ఉదయం 3.50–4 గంటల మధ్య మొదలైన వర్షం 8.30 గంటల వరకు కురిసింది. నంద్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఎమ్మిగనూరులో 69.2 మి.మీ., నంద్యాల జిల్లా బనగానపల్లిలో అత్యధికంగా 178.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా జూన్ నెల సాధారణ వర్షపాతం 76.8 మి.మీ. కాగా.. ఒక్కరోజులోనే 56.7 మి.మీ. వర్షం కురిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిశాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం మొదలై తెల్లవార్లూ మోస్తరు నుంచి భారీగా కురిసింది. అనంతపురం జిల్లాలోని 31 మండలాల పరిధిలో ఏకంగా 31.7 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. బొమ్మనహాళ్ మండలంలో 91 మి.మీ., బెళుగుప్ప 84.2 మి.మీ., కణేకల్లు 80 మి.మీ., గుత్తి 62.6 మి.మీ. మేర భారీ వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లోనూ మోస్తరు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు ప్రవహించాయి. శ్రీసత్యసాయి జిల్లాలోని 18 మండలాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా కనగానపల్లి మండలంలో 43.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. బత్తలపల్లిలో 29.2 మి.మీ., తాడిమర్రిలో 28.4 మి.మీ., గుడిబండలో 23.2 మి.మీ., రొళ్లలో 22.2 మి.మీ., ఎన్పీ కుంట 19.2 మి.మీ., కదిరిలో 18.2 మి.మీ., ధర్మవరంలో 12.4 మి.మీ., తనకల్లు మండలంలో 10.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 10 –1.2 మి.మీ. మధ్య వర్షపాతం నమోదైంది. -
5వ తేదీ నాటికి రాష్ట్రంలోకి నైరుతి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణశాఖ సూచించింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున కేంద్రీకృతమైనట్టు వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మంగళవారం కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబగద్వాల, వనపర్తి జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదు కావొచ్చని వివరించారు. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 25.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. నైరుతి ఋతుపవనాలు ఆదివారం కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలతోపాటు కర్ణాటక, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్టు వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాల కదలిక చురుగ్గా ఉంటే ఈనెల 5వ తేదీ నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వివరించింది. -
పత్తిసాగులో మెరుగైన యాజమాన్య పద్ధతే మేలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి సకాలంలో ప్రవేశిస్తాయన్న వాతావరణశాఖ సూచనలతో రైతాంగం వ్యవసాయ పనుల్లో బిజీ అవుతోంది. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇతర ఇన్పుట్స్ కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. విత్తనాల ఎంపిక, యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పత్తి రైతులకు పలు సూచనలు చేసింది. అందుబాటులో ఉన్న వివిధ పత్తి హైబ్రిడ్లలో వరి, మినుము, సోయాచిక్కుడు పంటలలో మాదిరిగా ఎక్కువగా వైవిధ్యం లేదని, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ పి.రఘురామిరెడ్డి చెబుతున్నారు. » ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 55 లక్షల ఎకరాలలో పత్తి సాగయ్యే అవకాశాలున్నాయి.» గతేడాదితో పోలిస్తే పత్తిసాగు 10 లక్షల ఎకరాలు అదనం. డిమాండ్ దృష్ట్యా 1.20 కోట్ల విత్తన ప్యాకెట్లు వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచింది.» రైతులు కొన్నిచోట్ల ఒకటి, రెండు కంపెనీల విత్తనాల కోసం డిమాండ్ చేయడం, ఆ కంపెనీల విత్తనం మాత్రమే కావాలని అడుగుతున్నారు. కానీ యాజమాన్య పద్ధతులే దిగుబడికి కారణం అవుతాయని అధికారులు చెబుతున్నారు.» గతంలో కూడా రైతులు ఇలాగే ఒకే రకమైన విత్తనాలు కావాలని కోరితే, మార్కెట్లో అందుబాటులో ఉన్న హైబ్రిడ్లపై విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. దిగుబడులపై అంచనా వేసింది. ఆ హైబ్రిడ్ల దిగుబడుల్లో పెద్దగా తేడా లేదని పరిశోధనలో తేలింది.» రెండుమూడేళ్లుగా అధిక సాంద్రత పత్తి సాగుకు ప్రాధాన్యం ఇచ్చారు. పొలాల్లో కూడా ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎకరాకు రెండున్నర నుంచి 3 క్వింటాళ్ల అధిక దిగుబడి వచ్చిందని పరిశోధనలో తేలింది. మొక్కల సంఖ్య పెంచడం, మొక్కకు సరాసరి 10–12 కాయలు ఉన్నప్పుడు ఆశించిన దిగుబడులు సాధిస్తున్నట్టు గుర్తించారు. » సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లనే ఇది సాధ్యమైందని, ఎరువుల యాజమాన్యం, పోషకాల యాజమాన్యంతో మంచి దిగుబడులను సాధిస్తున్నట్టు పరిశీలనలో వెలుగు చూసింది.» సూక్ష్మ పోషకలోపాలను సరిదిద్ది, మేలైన చీడపీడల యాజమాన్యం పాటించడం వల్ల పత్తి పంటలో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.» వర్షాధారంగా పత్తిని ఎవరైతే సాగు చేస్తున్నారో, ఆ రైతులు, పెద్ద కాయలు ఉన్న హైబ్రిడ్ల కన్నా, మధ్యస్థంగా కాయలు వచ్చే హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవడం మంచిది.» నీటి వసతులు ఉన్నచోట, నల్ల భూములు ఉన్నచోట పెద్ద కాయలు వచ్చే హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవచ్చు.» భూమి తడిసి, 50– 60 మిల్లీ మీటర్ల వర్షపాతం పడిన తర్వాతనే పత్తి గింజలు విత్తుకోవాలి.» చెలక భూములు, తేలిక భూములు, వర్షాధార భూముల్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల దిగుబడులు పెంచుకోవచ్చు.» ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం సరైన మోతాదులో ఎరువుల యాజమాన్యం చేపట్టడం వల్ల పత్తిలో మంచి దిగుబడులు సాధించవచ్చు. » అవసరం మేరకు పోషకాల పిచికారీ (19:19:19 / 13:0:45/యూరియా) చేపట్టాలి. -
‘నైరుతి’ నిష్క్రమణ షురూ
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమవుతోంది. సాధారణంగా సెప్టెంబర్ మూడో వారం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలై అక్టోబర్ రెండో వారం నాటికి పూర్తవుతుంది. కానీ ఈ ఏడాది నైరుతి రాక ఆలస్యమైంది. జూన్ నాలుగో వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు మందకొడిగానే కదలడం వల్ల సాదాసీదా వర్షాలే పడ్డాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం రాజస్తాన్‌లో ప్రారంభమవగా వచ్చే నెల 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని భారత వాతావరణ విభాగం వర్గాలు చెబుతున్నాయి. సాధారణ వర్షాలతోనే సగటును దాటి... ఈసారి నైరుతి సీజన్లో రాష్ట్రంలో కేవలం నాలుగు అల్పపీడనాలే ఏర్పడ్డాయి. అవి కూడా స్వల్పంగానే ప్రభావం చూపడంతో భారీ వర్షాలు నమోదు కాలేదు. వాయుగుండాలు, తుపానులు ఏర్పడితే సమృద్ధిగా వానలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ బంగాళాఖాతంలో ఒక్క వాయుగుండం లేదా తుపాను కూడా ఏర్పడలేదు. దీంతో రాష్ట్రంలో ఈ సీజన్ సాధారణ వర్షాలతోనే ముగుస్తోంది. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో 72.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. ఇందులో భాగంగా ఈ నెల 25 నాటికి 71.73 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 84.01 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 17 శాతం అధికంగా వర్షాలు కురిసినప్పటికీ అతితక్కువ సమయంలో భారీ వర్షాలు కురవడంతో డ్రైస్పెల్స్ (వర్షాల మధ్య అంతరం) ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సమయంలోనూ వర్షాలు నైరుతి రుతుపవనాల తిరోగమనంలోనూ వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలకు ఆస్కారం ఉంటుందని... రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటే భారీ వార్షాలకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇలా తిరోగమనంలో కురిసే వర్షాలతో రాష్ట్రంలో మరింత సమృద్ధిగా వర్షపాతం గణాంకాలు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. తిరగమన ప్రభావం వచ్చే నెల 15 వరకు ఉంటుందని, అప్పటివరకు వర్షాలకు అవకాశం ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. నైరుతి ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
నైరుతి వానలన్నీ పడ్డట్టే!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్‌కు సంబంధించి వర్షపాతం సంతృప్తికర స్థాయికి చేరింది. మొత్తం సీజన్లో పడాల్సిన సాధారణ వర్షపాతం అంతా ఇప్పటికే నమోదైంది. ఇకపై రాష్ట్రంలో కురిసే వర్షాలన్నీ అధిక వర్షాలుగా పరిగణించవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఏటా జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వరకు ఉన్న కాలాన్ని నైరుతి రుతపవనాల సీజన్‌గా పేర్కొంటారు. ఈ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో 72.10 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవుతుంది. అదే ఈసారి ఇప్పటికే (సెప్టెంబర్ 6 నాటికే) 74.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 1.03 శాతం ఎక్కువగానే పడింది. ఇకపై కురిసే వానలన్నీ అదనంగా కురిసే వానలేనని చెప్తున్నారు. కొంత కలవరపెట్టినా.. నిజానికి ఈసారి నైరుతి సీజన్ వర్షాలు ఆలస్యంగా మొదలయ్యాయి. జూన్ నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను చూసి రైతులు ఆందోళన చెందారు. పంటల సాగు కూడా ఆలస్యమైంది. అయితే జూలై మొదటి నుంచే పరిస్థితి మారిపోయింది. ఏకంగా రెట్టింపు వర్షపాతం నమోదైంది. మళ్లీ ఆగస్టులో లోటు వర్షపాతం నమోదవగా.. సెప్టెంబర్‌లో వానలు ఊపందుకున్నాయి. గతేడాది 40శాతం అధికంగా.. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా నైరుతి సీజన్ వర్షపాతం అధికంగానే నమోదవుతూ వస్తోంది. 2021లో ఏకంగా 49శాతం అధిక వర్షపాతం నమోదుకాగా.. 2022లో 40శాతం అధికంగా (100.97 సెంటీమీటర్లు) వానలు పడ్డాయి. ఈ ఏడాది ఇప్పటికే 74.35 సెంటీమీటర్లు కురవగా.. నెలాఖరు నాటికి ఎంత వర్షపాతం నమోదవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి కూడా గణనీయంగానే అధిక వర్షపాతం నమోదుకావొచ్చని అధికారులు భావిస్తున్నారు. నాలుగు జిల్లాల్లో సాధారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా వానలు పడటంతో జిల్లాల వారీగా కూడా లోటు వర్షపాతం లేకుండా పోయింది. అయితే నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మాత్రం వర్షపాతం కాస్త తక్కువగా, మిగతా జిల్లాల్లో 20శాతం కంటే అధికంగా నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు సిద్దిపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం, 22 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవగా.. మిగతా 10 జిల్లాలు సాధారణ వర్షపాతం కేటగిరీలో ఉన్నాయి. నేడు, రేపు మోస్తరు వానలు రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలహీనపడిందని.. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రెండ్రోజుల పాటు వానలు పడతాయని పేర్కొంది. -
రాష్ట్రానికి రెడ్ అలర్ట్
నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో తాజాగా కురిసిన 46.3 సెంటీమీటర్ల వాన రాష్ట్రంలో మూడో అతి భారీ వర్షంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకుముందు 2013 జూలై 19న ములుగు జిల్లా వాజేడులో ఏకంగా 51.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే ఏడాది జూలై 23న కొమ్రంభీం జిల్లా దహెగాంలో 50.36 సెంటీమీటర్ల వాన పడింది. సాక్షి, హైదరాబాద్, సాక్షి నెట్వర్క్: ఎడతెరిపిలేని వానలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ఆకాశం చిల్లులు పడిందా అన్నట్టుగా వానలు పడుతున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడీ వానలు మరింత ముదురుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు కుండపోత వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే సోమవారం రాత్రి నుంచే ఈ వర్షాల ప్రభావం కనిపించడం మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌నూ వాన వణికిస్తోంది. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాల ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది. రికార్డు స్థాయిలో వానలు.. మంగళవారం రాష్ట్రంలో సగటున 4.39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిజామాబాద్‌తోపాటు జనగాం, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, మహబూబాబాద్, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో ఏకంగా 46.3 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్టు ప్రకటించింది. అదే జిల్లా ఆర్మూరు మండలం పెర్కిట్‌లో 33.1, వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తిలో 29.4, నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 26.4, జనగాం జిల్లా కునూర్‌లో 24.2, నిజామాబాద్ జిల్లాలోని కోనసమందర్లో 22.6, జక్రాన్‌పల్లిలో 22.2 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసింది. హైదరాబాద్‌లో గరిష్టంగా చార్మినార్ ప్రాంతంలో 7.3 సెంటీమీటర్ల వాన పడింది. 25 జిల్లాల్లో అధిక వర్షపాతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైన తర్వాత తొలి నెల రోజుల పాటు వర్షపాతం లోటు ఉండగా.. గత వారం రోజుల్లో అధిక వర్షపాతానికి చేరింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఏకంగా 60శాతం అధికంగా వానలు పడగా.. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, జనగాం, వరంగల్, కొమురంభీం, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్, జగిత్యాల, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వనపర్తి, మంచిర్యాల జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వరకు అధిక వర్షపాతం నమోదైంది. మిగతా ఎనిమిది జిల్లాల్లో సాధారణ స్థాయిలో వానలు పడ్డాయి. ఈ మూడు రోజులు జాగ్రత్త బంగాళాశాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది మరో 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. దీనికితోడు రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని.. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. పొలాల్లో రైతులు సెల్ఫోన్లు వాడొద్దు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. పొలాల్లో నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. పొలాల్లో ఉన్న సమయంలో వాన, ఉరుములు, మెరుపులు వస్తుంటే రైతులు, ఇతరులు ఎవరైనా సెల్ఫోన్లు వాడొద్దు. అలా వాడితే పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది. పొలాల్లో ఉన్నప్పుడు నేలపై కూర్చోవాలి. ఎత్తుగా నిలబడి ప్రయాణం చేయవద్దు. విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద కూడా నిలబడొద్దు. – నాగరత్న, హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ -
AP: వారం రోజులు వర్షాలే
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, రుతు పవన ద్రోణులు ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ ఒడిశాకు ఆనుకుని ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటం, బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతోపాటు నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో ఈ నెల 29వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఆదివారం విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా కొత్తవలసలో 11.3 సెం.మీ, విశాఖపట్నం మధురవాడలో 10.6 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. -
నైరుతి వాన.. 30శాతం లోటే! 23 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. వానాకాలం మొదలై దాదాపు నెలన్నర కావొస్తున్నా, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి మూడు వారాలు దాటినా ఎక్కడా సరైన వర్షపాతం నమోదు కాలేదు. జూన్‌లో వానల జాడే లేక పోగా.. జూలైలో అక్కడక్కడా చిరుజల్లులు, మోస్తరు వానలు మాత్రమే కురుస్తున్నాయి. భారీ వర్షాల ఊసే లేదు. దీనితో పంటల సాగుకు అదును దాటిపోతుండగా.. సీజన్‌పై ఆధారపడ్డ ఇతర రంగాలు కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నాయి. గత మూడేళ్లుగా సమృద్ధిగా వానలు పడ్డాయని.. కానీ ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొందని, ఇది కరువు తరహా పరిస్థితులకు సంకేతమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైన నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించింది. వ్యవసాయం,సాగునీటితోపాటు పలు ఇతర శాఖలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా భేటీ అయిన వివిధ శాఖల ఉన్నతాధికారులు.. కరువు పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 30శాతం లోటు సాధారణంగా మే నెలాఖరు లేదా జూన్ తొలివారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి జూన్ మూడో వారంలో రాష్ట్రాన్ని తాకాయి. మూడు రోజుల్లోనే రాష్ట్రమంతటా విస్తరించడంతో.. వానలు ఆశాజనకంగా ఉంటాయని తొలుత భావించినా, తర్వాత ఆ ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రాంత జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు పడగా.. మిగతా ప్రాంతాల్లో అడపాదడపా తేలికపాటి వానలు మాత్రమే కురుస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో లోటు ఉంది. రాష్ట్రంలో సాధారణంగా నైరుతి సీజన్లో ఇప్పటివరకు(జూలై 10వ తేదీ వరకు) సగటున 19.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 13.49 సెంటీమీటర్ల మేర మాత్రమే కురిసింది. అంటే 30శాతం లోటు ఉంది. ఇందులోనూ కొన్ని జిల్లాల్లో తీవ్రమైన లోటు ఉంది. కొనసాగుతున్న లోటు.. జూన్ నెలలో రాష్ట్రంలో సగటున 12.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 7.20 సెంటీమీటర్లు అంటే 55.68 శాతమే వర్షం మాత్రమే కురిసింది. జూలైలో ఇప్పటివరకు 6.29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణమే అయినా.. ఇప్పట్లో వానలు పడే అవకాశాలు కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తొలకరి వానలతో సాగు మొదలుపెట్టిన రైతులు ఆందోళనలో పడ్డారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో వర్షాలు ఆశించినంతగా లేవు. 23 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ జిల్లాల్లోనూ కొన్నిప్రాంతాలకే వానలు పరిమితం అయ్యాయని అధికారులు చెప్తున్నారు. మిగతా 23 జిల్లాల్లో లోటు, అత్యంత లోటు వర్షపాతమే ఉన్నట్టు వివరిస్తున్నారు. ప్రత్యామ్నాయాలపై కసరత్తు లోటు వర్షపాతం కొనసాగితే ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఉన్నతాధికారులు వివిధ రంగాలు, అంశాల వారీగా పడే ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అధికారులు తెలిపారు. -
ఈసారి మరీ లేట్
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. సాధారణంతో పోల్చితే ఇప్పటికే వారం, పది రోజులకుపైగా ఆలస్యంకాగా.. నైరుతి ఆగమనానికి మరో వారం వరకూ సమయం పట్టవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 20–22వ తేదీ నాటికి రావొచ్చని పేర్కొంటోంది. ఇది గత పదేళ్లతో పోల్చితే ఏకంగా పది, పన్నెండు రోజులు ఆలస్యం కావడం గమనార్హం. రుతుపవనాలు రాకపోవడంతో వానలు పడక వ్యవసాయంపై ప్రభావం పడు తోంది. పంటల సాగు మొదలుపెట్టేందుకు జాప్య మవుతోందని, ఇలాగైతే పంటల దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వచ్చి.. మందకొడిగా మారి.. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి ఈ నెల 8న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తర్వాత క్రమంగా తమిళనాడుతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. కానీ ఆ తర్వాత మందకొడిగా మారిపోయాయి. రుతుపవనాలు చురుకుగా కదిలేందుకు బంగాళాఖాతంపై నెలకొనే వాతావరణ పరిస్థితులే కీలకం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి, అల్పపీడనాలు వంటివి ఏర్పడితే రుతుపవనాలు వేగంగా వ్యాప్తి చెందుతాయని అధికారులు చెప్తున్నారు. కానీ ఈసారి బంగాళాఖాతంలో అలాంటి పరిస్థితులేవీ నెలకొనలేదని.. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుపాను ప్రభావంతో నైరుతి మందకొడిగా మారిందని అంటున్నారు. ఇంతకు ముందు కాస్త లేటయినా.. నైరుతి రుతుపవనాలు మే చివరివారం నుంచి జూన్ తొలివారం మధ్య కేరళలో ప్రవేశిస్తాయి. తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. అల్పపీడనాలు, తుఫానులు వంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రుతుపవనాల కదలికలు ఉంటాయి. గత పదేళ్లలో రుతుపవనాల రాకను పరిశీలిస్తే 2014, 2016, 2019 సంవత్సరాల్లో ఆలస్యంగా వచ్చాయి. చివరిసారిగా 2019లో లేటుగా ప్రవేశించినా.. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో, వేగంగా పది రోజుల్లోనే దేశంలోని మెజారిటీ రాష్ట్రాలకు విస్తరించాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ► ప్రస్తుతం ఈనెల 8న కేరళను తాకిన రుతుపవనాలు తదుపరి మూడు రోజుల్లోనే తమిళనాడు, ఏపీ, కర్ణాటకల్లోకి ప్రవేశించాయి. ఈ నెల 15 నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తొలుత అంచనా వేశారు. కానీ రుతుపవనాల కదలిక మందకొడిగా ఉందని.. తెలంగాణలోకి రావడానికి మరో వారం పడుతుందని వివరిస్తున్నారు. తొలకరి వానల కోసం ఎదురుచూడక తప్పదని అంటున్నారు. రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఒకట్రెండు వర్షాలకే విత్తనాలు నాటితే.. సాగుకు అనుకూలించే అవకాశాలు తక్కువగా ఉంటాయని సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత.. ఉక్కపోత.. నైరుతి మందగమనంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇంకా అధికంగానే నమోదవుతున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారం తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తగ్గిపోతాయి. కానీ ఈసారి చాలాచోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికితోడు వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత కొనసాగుతోందని.. ఈ పరిస్థితి మరో వారంపాటు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
‘నైరుతి’కి తంటా!.. ఆ రెండు తుపానుల వల్లే..
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు మోకా, బిపర్జోయ్ తుపానులు ప్రతిబంధకాలుగా మారాయి. రుతుపవనాల ప్రవేశం నుంచి విస్తరణ వరకు ఇవి అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ఫలితంగా ఒకవైపు వడగాడ్పులు విజృంభిస్తుంటే మరోవైపు వర్షాలకు బ్రేకులు పడుతున్నాయి. సాధారణంగా అండమాన్ సముద్రంలోకి ప్రవేశంతో ‘నైరుతి’ ఆగమన ప్రక్రియ ఆరంభమవుతుంది. అక్కడ నుంచి బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించి పది రోజుల్లో జూన్ ఒకటో తేదీ నాటికి కేరళను తాకుతాయి. అనంతరం వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది అండమాన్ సముద్రంలోకి నిర్ణీత సమయానికి రెండ్రోజుల ముందే అంటే మే 18 నాటికే రుతుపవనాలు ప్రవేశించాయి. అక్కడ నుంచి అవి బంగాళాఖాతంలోని ఇతర ప్రాంతాలకు చాలా నెమ్మదిగా విస్తరించాయి. దీంతో ఈ రుతుపవనాలు కేరళలోకి వారం రోజులు ఆలస్యంగా ఈ నెల 8న ప్రవేశించాయి. ఆ తర్వాత కూడా అవి ఆశించినంతగా చురుకుదనాన్ని సంతరించుకోలేదు. ఫలితంగా వర్షాలు కురవడం లేదు. పైగా రోహిణీకార్తె వెళ్లి మృగశిర కార్తె ప్రవేశించినా ఇంకా రోహిణిని తలపించే ఉష్ణోగ్రతలే (42–45 డిగ్రీల వరకు) నమోదవుతున్నాయి. వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకా ఈనెల 18 వరకు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ రెండు తుపానుల వల్లే.. రుతుపవనాల ప్రవేశానికే కాదు.. వాటి విస్తరణలో ఆలస్యానికి ఇటీవల సంభవించిన తుపానులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత నెల 9న బంగాళాఖాతంలో ‘మోకా’ తుపాను ఏర్పడింది. అనంతరం అది అత్యంత తీవ్ర తుపానుగా మారి బంగ్లాదేశ్ వైపు పయనించి తీరాన్ని దాటింది. దీంతో బంగాళాఖాతంలోని తేమను ఈ తుపాను అటు వైపు లాక్కుని పోయింది. దీంతో రుతుపవనాలు బంగాళాఖాతంలోకి వేగంగా విస్తరించకుండా, ఆపై కేరళలోకి సకాలంలో ప్రవేశించకుండా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈనెల 8న నైరుతి రుతుపవనాలు కేరళను తాకినా ఆ తర్వాత కూడా మందగమనమే కొనసాగుతోంది. తాజాగా అరేబియా సముద్రంలో ఈనెల 6న ‘బిపర్జోయ్’ తుపాను సంభవించింది. ఈ తుపాను కూడా అత్యంత తీవ్ర తుపానుగా బలపడి గుజరాత్ వైపు పయనిస్తోంది. ఈ తుపాను కూడా ‘మోకా’ మాదిరిగానే నైరుతి రుతుపవనాల వేగానికి కళ్లెం వేసింది. అరేబియా సముద్రంలోని తేమను తుపాను ప్రభావిత ప్రాంతం వైపు తీసుకెళ్లిపోవడంతో రుతుపవనాలు ఆశించినంతగా విస్తరించడం లేదు.. వర్షించడం లేదు. వాస్తవానికి సాధారణ పరిస్థితులుంటే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించి విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉంది. అయితే ఇప్పటికీ రాయలసీమలో ఒకట్రెండు చోట్ల అరకొరగా మినహా రాష్ట్రంలో ఎక్కడా రుతుపవనాల వర్షాలు కురవడం లేదు. ఇంకా రాష్ట్రంలో ఎక్కడైనా అడపా దడపా వానలు కురుస్తుండడానికి రుతుపవనాల ఆగమనానికి ముందస్తుగా ఏర్పడే థండర్ స్టార్మ్ (ఉరుములు, మెరుపులు, పిడుగులు ఈదురుగాలులతో కూడిన వాతావరణం) పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 18 తర్వాతే రాష్ట్రంలో రుతుపవనాల వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు. మందకొడిగా నైరుతి రుతుపవనాలు.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినా మందకొడిగా కదులుతున్నాయి. ఈ నెల 11వ తేదీన అవి శ్రీహరికోట వద్ద రాయలసీమను తాకినా ఆ తర్వాత పెద్దగా ముందుకు కదల్లేదు. ఈపాటికి రాయలసీమలోని అన్ని జిల్లాలకు విస్తరించి తెలంగాణ, కోస్తా జిల్లాల్లోకి ప్రవేశించాల్సివుంది. కానీ మంగళవారం నాటికి ఇంకా రాయలసీమలోనే పూర్తిగా విస్తరించలేదు. అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలకు కొద్దిమేర విస్తరించినా అక్కడ పెద్దగా వర్షాలు కూడా పడడంలేదు. ఈ నెల 16 వరకు రుతుపవనాలు ఇలా నెమ్మదిగానే కదిలే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖాదికారులు తెలిపారు. బిపర్జోయ్ తుపాను ప్రభావం 16వ తేదీ నుంచి తగ్గే అవకాశం ఉండడంతో ఆ తర్వాత రుతుపవనాల గమనంలో వేగం పెరుగుతుందని భావిస్తున్నారు. 20 నాటికి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పటి నుంచి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అక్కడక్కడా వర్షాలు పడుతున్నా అది నామమాత్రంగానే ఉంది. -
రాయలసీమను తాకిన రుతుపవనాలు
సాక్షి, అమరావతి/తిరుమల: నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఆదివారం రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు తాకాయి. రుతు పవనాలు కేరళను తాకిన తర్వాత ఏపీకి రావడానికి సాధారణంగా నాలుగు రోజుల సమయం పడుతుంది. ఈ నెల 8వ తేదీన అవి కేరళలో ప్రవేశించగా.. 12వ తేదీ నాటికి ఏపీకి వస్తాయని భావించారు. కానీ.. బిపర్జోయ్ తుపాను కారణంగా అవి చురుగ్గా కదలడంతో ఒకరోజు ముందుగానే ఏపీని తాకాయి. ఆదివారం తిరుపతి జిల్లా శ్రీహరికోట మీదుగా ఏపీలోకి ప్రవేశించాయి. వచ్చే 48 గంటల్లో అవి రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలు, కోస్తాలోని పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. వారం రోజుల్లో మొత్తం రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రుతు పవనాల వల్ల ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. మరో వారం ఎండల తీవ్రతే రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించే వరకు ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. అంటే మరో వారం రోజులపాటు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత, వడగాలులు ఉండనున్నాయి. సోమవారం 134 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇదిలావుండగా ఆదివారం అనకాపల్లి జిల్లా అనకాపల్లి, కాకినాడ జిల్లా కరప, విజయనగరం జిల్లా జామిలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ జిల్లా పద్మనాభంలో 44.7, మన్యం జిల్లా భామిని, కోనసీమ జిల్లా శివలలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 86 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 110 మండలాల్లో వడగాల్పులు వీచాయి. మరోవైపు పలుచోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. మబ్బుల ‘సన్’దడి తిరుమలలో ఆదివారం ఉదయం నుంచే నీలాకాశం మబ్బులతో నిండిపోయింది. వెండి మబ్బులు దోబూచులాడుతూ భానుడితో ఆటలాడడం ప్రారంభించాయి. సాయంత్రానికి మరిన్ని మబ్బులు చేరి సందడి చేశాయి. దాదాపు రెండు నెలలపాటు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్టయ్యింది. -
చల్లని కబురు.. రేపు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: కొన్నాళ్లుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకనున్నాయి. సాధారణంగా ఏటా జూన్ ఒకటో తేదీకి ఇవి కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందస్తుగా అంచనా వేసింది. అయితే ఆ అంచనాలు కూడా తప్పాయి. ఈనెల ఏడు, లేదా ఎనిమిది తేదీల్లో కేరళలోకి ప్రవేశించవచ్చని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులేర్పడ్డాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమట గాలులు కొనసాగుతున్నాయి. పశ్చిమ గాలుల లోతులో పెరుగుదల, ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ తీర ప్రాంతాలపై మేఘావృతం ఉధృతం వంటి పరిణా మాలున్నాయి. దీంతో శుక్రవారం నాటికల్లా నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ బుధవారం వెల్లడించింది. అనంతరం ఈ రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగుతాయని తెలిపింది. అలాగే అరేబియా సముద్రం, మొత్తం లక్షద్వీప్, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాలు, నైరుతి, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి ప్రవేశానికి అనుకూల పరిస్థితులున్నాయని వివరించింది. మరో మూడు రోజులు వడగాలులే ఇటు రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం రాష్ట్రంలో భగభగలతో జనం విలవిల్లాడారు. కరీంనగర్ జిల్లా తంగులలో 45.8 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మేడారంలో 45.5 డిగ్రీలు నమోదైంది. కాగా, రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. మరికొన్నిచోట్ల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
‘నైరుతి’ దోబూచులాట.. మరో 10 రోజుల పాటు ఉష్ణతాపం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: నైరుతి రుతుపవనాలు ఊరిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. ఏటా సాధారణంగా జూన్ 1వ తేదీకల్లా నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. అయితే.. ఈ ఏడాది ఒకింత ఆలస్యంగా జూన్ 4 నాటికి కేరళను తాకుతాయని ఐఎండీ తొలుత అంచనా వేసింది. కానీ ‘నైరుతి’ కేరళను తాకకుండా దోబూచులాడుతూనే ఉంది. వాస్తవానికి రుతుపవనాలు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి మే 20–22 మధ్య ప్రవేశిస్తాయి. అనంతరం నాలుగైదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలతో పాటు పరిసర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అక్కడ నుంచి జూన్ 1వ తేదీకి కేరళను తాకుతాయి. కానీ.. ఈ ఏడాది అండమాన్ సముద్రంలోకి సకాలంలో అంటే మే 20 నాటికే ప్రవేశించాయి. కానీ.. అప్పటినుంచి వాటి విస్తరణలో మాత్రం మందగమనం చోటుచేసుకుంటోంది. ఫలితంగా రుతుపవనాలు కేరళలో ప్రవేశించడానికి జాప్యం జరుగుతోంది. దీంతో ఐఎండీ ముందుగా ఊహించినట్టుగా జూన్ 4వ తేదీ కంటే మరో నాలుగైదు రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నాయి. అంటే సాధారణం కంటే వారం రోజుల ఆలస్యంగా ఇవి కేరళలోకి ప్రవేశించనున్నాయి. ఆలస్యం ఎందుకంటే..! నైరుతి రుతుపవనాల ఆగమనంలో జాప్యానికి గత నెలలో సంభవించిన ‘మోచా’ తుపాను, ఉత్తరాదిన ఏర్పడిన పశ్చిమ ఆటంకాలు (వెస్టర్న్ డిస్టర్బెన్స్) ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత నెల 9న బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుపాను ఆ తర్వాత అత్యంత తీవ్ర తుపానుగా మారి 15న బంగ్లాదేశ్, మయన్మార్ల మధ్య తీరాన్ని దాటింది. దీంతో ఈ తుపాను బంగాళాఖాతంలోని తేమను మయన్మార్ వైపు లాక్కెళ్లిపోయింది. మరోవైపు కొద్దిరోజుల నుంచి ఉత్తరాదిన వెస్టర్న్ డిస్టర్బెన్స్‌లు చురుగ్గా ప్రభావం చూపిస్తున్నాయి. ఇవి దిగువన బంగాళాఖాతంపై ఉన్న తూర్పు గాలులను బలహీన పరిచాయి. ఫలితంగా అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు విస్తరించడకుండా వెస్టర్న్ డిస్టర్బెన్స్ అడ్డుపడుతున్నాయి. ఈ కారణాల వల్ల నైరుతి రుతుపవనాలు సకాలంలో కేరళలోకి ప్రవేశించకుండా జాప్యానికి కారణమయ్యాయని వాతావరణ శాఖ మాజీ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. కొన్నాళ్లు ఎండలు.. వానలు! రుతుపవనాల రాక ఆలస్యం కానుండటంతో రాష్ట్రంలో ఉష్ణతాపం మరికొన్నాళ్లు కొనసాగనుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశానికి మరో 10 రోజులు పట్టవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటివరకు పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయి. అప్పుడప్పుడూ వడగాడ్పులకు ఆస్కారం ఉంది. అదే సమయంలో మధ్యమధ్యలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. రుతుపవనాల ఆగమనానికి ముందు ఇలాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. 10 రోజులు ఎండల తీవ్రతతో పాటు వర్షాలు కూడా కురవనున్నాయని చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మండిన ఎండలు.. నేడు వడగాడ్పులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 43.3 డిగ్రీలు, ఏలూరు జిల్లా శ్రీరామవరంలో 43.1, తిరుపతి జిల్లా గొల్లగుంటలో 42.9, కృష్ణా జిల్లా కాజలో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 మండలాల్లో వడగాడ్పులు వీచినట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. మంగళవారం అల్లూరి జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 212 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మంగళవారం అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వెల్లడించారు. -
చేదు వార్త.. నైరుతి రుతుపవనాలు ఆలస్యం.. రాక ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: కేరళ తీరాన్ని ఇప్పటికే తాకాల్సిన నైరుతి రుతుపవనాల రాక ఇంకాస్త ఆలస్యం కానుంది. మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా ఏటా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకి దేశమంతటా విస్తరించడంతో వానలు కురుస్తాయి. ఒక్కో ఏడాది వాటి రాక వారం దాకా ఆలస్యమవుతుంది. గత అంచనాల మేరకు జూన్ 4 కల్లా రుతుపవనాలు కేరళకు రావాల్సింది. ‘‘వాటి రాకకు అన్నీ అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. పశ్చిమం నుంచి వస్తున్న గాలులు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా బలంగానే వీస్తున్నాయి. ఆదివారం నాటికి సముద్ర మట్టానికి 2.1. కిలోమీటర్ల పైకి వీస్తున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఆకాశం దట్టంగా మేఘావృతమై ఉంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల మరో మూడు నాలుగు రోజుల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నాం’’ అని ఐఎండీ ప్రకటనలో వివరించింది. -
జూన్ మొదటి వారం వరకూ మంటలే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత జూన్ మొదటి వారం వరకూ కొనసాగనుంది. నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా కదులుతుండటమే దీనికి కారణమని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు గత మూడు రోజుల నుంచి బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ సమయానికి బంగాళాఖాతంలో ఎక్కువ ప్రాంతాలకు విస్తరించి అండమాన్ నికోబార్ దీవులను తాకాల్సి ఉంది. కానీ ఇంకా అవి బంగాళాఖాతంలోనే నెమ్మదిగా కదులుతుండడంతో నెలాఖరుకు కేరళను తాకే అవకాశం తక్కువేనంటున్నారు. వాతావరణం అనుకూలించి రెండు, మూడు రోజుల్లో రుతు పవనాలు ముందుకు కదిలితే వచ్చే 3, 4 తేదీల్లో కేరళలో ప్రవేశించి.. ఆ తర్వాత జూన్ రెండో వారానికి రాష్ట్రాన్ని తాకే అవకాశముంటుందని భావిస్తున్నారు. ఎల్‌నినో పరిస్థితుల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీన్నిబట్టి జూన్ 8వ తేదీ వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలకు కారణం అరేబియన్ సముద్రం నుంచి వస్తున్న గాలులేనని వాతావరణ శాఖ చెబుతోంది. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్‌లో 44.7, ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జువ్విగుంటలో 44.5, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో 44.4, బాపట్ల జిల్లా బల్లికురువు మండలం కొప్పెరపాడులో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు, గుంటూరు జిల్లా గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు, పల్నాడు జిల్లా అమరావతి, అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. -
ఎల్‌నినో ఉన్నా మంచి వానలే! భారత వాతావరణ శాఖ స్పందన ఇదే!
న్యూఢిల్లీ: భారత్‌లో వర్షాభావ పరిస్థితులకు కారణమయ్యే ‘ఎల్ నినో’ దాపురించే అవకాశాలు ఉన్నాసరే ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవన వర్షపాతం సాధారణస్థాయిలో కొనసాగి వ్యవసా య రంగానికి మేలుచేకూర్చనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం అంచనావేసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమేట్ సోమవారం ప్రకటించిన మరుసటి రోజే వాతావరణ శాఖ మరోలా అంచనాలు వెల్లడించడం గమనార్హం. భారత్‌లో వ్యవసాయం ప్రధానంగా వర్షాలపై ఆధారపడింది. మొత్తం పంట విస్తీర్ణంలో దాదాపు 52 శాతం భూభాగం వర్షాధారం. దేశ మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం.. ఈ భూభాగంలో పండించే పంట నుంచే వస్తోంది. ఇది దేశ ఆహారభద్రతకు, ఆర్థిక సుస్థిరతకు కీలక భూమికగా మారింది. ఈ పరిస్థితుల్లో దేశంలో వర్షపాతం సాధారణంగా ఉంటుందని అంచనావేసి వ్యవసాయరంగానికి ఐఎండీ తీపికబురు మోసుకొచ్చింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితర జలాలు వేడెక్కితే ఎల్ నినో అంటారు. దీనివల్ల భారత్‌లో రుతుపవన గాలులు బలహీనమై పొడిబారి వర్షాభావం తలెత్తుతుంది. సగటు వానలు జూన్ నుంచి సెప్టెంబర్ దాకా నైరుతి సీజన్లో దాదాపుగా సుదీర్ఘకాల సగటు అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని కేంద్ర భూ శాస్త్ర శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ చెప్పారు. సాధారణం, అంతకు ఎక్కువ వానలు పడేందుకు 67 శాతం ఆస్కారముందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర అంచనావేశారు. ‘‘రెండో అర్ధభాగంపై ఏర్పడే ఎల్‌నినో ప్రభావం చూపొచ్చు. అంతమాత్రాన వర్షాభావం ఉంటుందని చెప్పలేం. ఎన్నోసార్లు ఎల్‌నినో వచ్చినా సాధారణ వర్షపాతం నమోదైంది’’ అని ఆయన వివరించారు. -
'హర్ష'పాతం
సాక్షి, విశాఖపట్నం: కరువు ఛాయల్లేకుండా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలు కురిపించాయి. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇవి ప్రభావం చూపుతాయి. ఖరీఫ్ పంటలకు ఈ రుతుపవనాలే కీలకం. అందుకే నైరుతి రుతుపవనాల ప్రభావం ఎలా ఉంటుందోనని ఇటు రైతులు, అటు ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తి చూపుతాయి. అయితే, ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు ఇప్పటివరకు వానల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. తరచూ తేలికపాటి నుంచి మోస్తరుగాను, అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిశాయి. ఇలా వరుసగా నాలుగేళ్ల నుంచి ఖరీఫ్ సీజనులో వరుణుడు రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిపిస్తూనే ఉన్నాడు. ఇందుకు అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఎంతో దోహదపడ్డాయి. రుతుపవనాల సీజను మొదలైన జూన్ నుంచి ఇప్పటివరకు బంగాళాఖాతంలో ఏడు అల్పపీడనాలు, రెండు వాయుగుండాలు ఏర్పడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కొద్దిరోజుల్లో ‘నైరుతి’ సీజన్ ముగింపు ఇక మరికొద్ది రోజుల్లోనే నైరుతి రుతుపవనాల సీజను ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్డీపీఎస్) గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు గాను 20 జిల్లాల్లో సాధారణం, ఐదు జిల్లాల్లో అధిక, ఒక జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. విజయనగరం, కాకినాడ, బాపట్ల, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో అధిక వర్షపాతం, శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధిక వర్షపాతం రికార్డయింది. అరకొర వర్షాలతో కరువు పరిస్థితులేర్పడే అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ ఏడాది సాధారణానికి మించి అధిక వర్షం కురవడం విశేషం. సాధారణం కంటే అధికం.. మరోవైపు.. నైరుతి రుతుపవనాల సీజనులో జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 514.7 మి.మీల వర్షపాతం కురవాల్సి ఉండగా 544.3 మి.మీలు కురిసింది. ఇది సాధారణం కంటే దాదాపు 6.0 శాతం అధికమన్నమాట. ఒక్క సెప్టెంబర్‌లోనే 95 మి.మీలకు గాను 115.9 మి.మీలు (22 శాతం అధికంగా) వర్షపాతం నమోదైంది. నిజానికి.. సాధారణంకంటే 20 శాతానికి పైగా తక్కువ వర్షం కురిస్తే లోటు వర్షపాతంగా పరిగణిస్తారు. ఇలా ఈ నైరుతి రుతుపవనాల సీజనులో రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లోటు వర్షపాతం రికార్డు కాలేదు. ఈ నేపథ్యంలో కరువు ఛాయలు ఏర్పడకుండా ఖరీఫ్ సీజను ముగుస్తుండడం, అవసరమైనప్పుడల్లా వర్షాలు కురుస్తూ పంటలకు ఢోకా లేకపోవడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. -
సిక్కోలు, ఉమ్మడి విశాఖలో కుంభవృష్టి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం వేకువజాము నుంచి కుండపోతగా వర్షం కురిసింది. గార మండలంలో దాదాపు 15 సెం.మీ. వర్షం పడగా, శ్రీకాకుళంలో 7, ఆమదాలవలసలో 6, నరసన్నపేటలో 4 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 722 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షానికి శ్రీకాకుళం నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. సూర్యమహల్ వద్ద ముంపు అంచనా వేయలేకపోవడంతో ఓ కారు కల్వర్టులోకి దూసుకెళ్లిపోయింది. పెదపాడు చెరువు పొంగి ప్రవహించడంతో జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు మునిగిపోయేంత మేర నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై నీటిని కల్వర్టుల ద్వారా మళ్లించారు. ఇక నందిగాం మండలం కాపుతెంబూరుకు చెందిన రైతు కొల్లి వనజనాభం (40) పొలంలో నీటిని మళ్లిస్తుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. భారీ వర్షాలతో 13 మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉమ్మడి విశాఖలోనూ కుండపోత.. మరోవైపు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ కుంభవృష్టి కురిసింది. సోమవారం అర్థరాత్రి దాటాక మొదలైన వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. విశాఖ నగర శివారుల్లో పల్లపు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. భీమునిపట్నంలో అత్యధికంగా 17.9 సెం.మీల వర్షపాతం రికార్డయింది. గోపాలపట్నంలో 12.1, విశాఖ రూరల్‌లో 10.8, గాజువాక 8.2, అనకాపల్లి జిల్లా పరవాడలో 6.3, అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.8, చింతపల్లిలో 4.6 సెం.మీల చొప్పున వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గుముఖం పట్టింది. రుతుపవన ద్రోణితో భారీ వర్షాలు ఇక రుతుపవన ద్రోణి చురుగ్గా ఉండడం భారీ వర్షాలకు దోహదపడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల సీజనులో ఇప్పటివరకు ఒక్క విశాఖ జిల్లా మాత్రమే లోటులో ఉంది. నాలుగు రోజుల క్రితం వరకు ఈ జిల్లా వర్షపాతం సాధారణం కంటే 20.9 శాతం లోటులో ఉండేది. కానీ, ప్రస్తుత వర్షాలతో 3.9 శాతం అధిక వర్షపాతానికి చేరుకుంది. అంటే మూడ్రోజుల వ్యవధిలో దాదాపు 24 శాతం వర్షపాతం పెరిగినట్లయింది. -
సిరిసిల్ల అతలాకుతలం
సిరిసిల్ల: నైరుతి రుతుపవనాలకుతోడు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీటమునగగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. వర్షాలు, వరద సంబంధ ఘటనల్లో ఐదుగురు మృతిచెందగా ఒకరు గల్లంతయ్యారు. పలుచోట్ల పిడుగుపాట్లకు వందలాది గొర్రెలు మృత్యువాతపడ్డాయి. పలుచోట్ల రోడ్లకు గండ్లుపడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సిరిసిల్లలో..:భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా అతలాకుతలమైంది. శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా ముస్తాబాద్‌లో 17.76 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలైన సర్దార్‌నగర్, అశోక్‌నగర్, సంజీవయ్యనగర్, శాంతినగర్, సిద్ధార్థనగర్ జలమయమయ్యాయి. ముస్తాబాద్ మండలంలో ఎగువమానేరు కాల్వకు గండిపడి జనావాసాలు, పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. జిల్లాలో మానేరువాగు, మూలవాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు కోతకు గురికావడంతో వీర్నపల్లి, నిమ్మపల్లి ప్రాంతాలకు రవాణా సౌకర్యం తెగిపోయింది. మధ్యమానేరు జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న యోగా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పలు జిల్లాల బాలలు అశోక్‌నగర్‌లో జలదిగ్బంధంలో చిక్కుకోగా వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిజామాబాద్, కామారెడ్డి విలవిల.. నిజామాబాద్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు భారీ వర్షాలకు విలవిల్లాడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్లో అత్యధికంగా 17.68 సెంటీమీటర్ల వర్షం కురవగా పట్టణంలోని వివిధ ప్రాంతాలు నీటమునిగాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని మాణిక్‌భండార్ వద్ద ఆదివారం సాయంత్రం మహారాష్ట్రలోని భరాడా గ్రామానికి చెందిన ప్రభు కాంబ్లే అనే యువకుడు కాలువలో పడి గల్లంతయ్యాడు. బోధన్ మండలంలోని సాలూర వద్ద మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మంజీర వంతెనలపై నుంచి తెలంగాణ, మహరాష్ట్రల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని గడ్డమీద తండా వద్దనున్న లోలెవల్ వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డిలో వాటర్ ట్యాంకుపై పిడుగు పడడంతో పిల్లర్ పెచ్చులూడాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఎదులపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పిడుగుపాటుకు 152 గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయి. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణ సమీపంలో బతుకమ్మ వాగుకు వరద పోటెత్తడంతో వాగుపై నిర్మించిన వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు కోతకు గురై పెద్ద బుంగ పడింది. దీంతో ఇరువైపులా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. -
ఈ ఏడాదీ లోటు లేదు
సాక్షి, విశాఖపట్నం: వర్షాల కోసం రైతన్నలు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వరుణుడి కరుణతో ఈ ఏడాదీ నైరుతి రుతుపవనాలు ‘లోటు’ లేకుండా మేలు చేస్తున్నాయి. జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన నాటి నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడుతూ రుతుపవనాల్లో చురుకుదనాన్ని పెంచి వానలకు కారణమవుతున్నాయి. ఈ సీజన్లో బంగాళాఖాతంలో ఇప్పటివరకు ఐదు అల్పపీడనాలు, రెండు వాయుగుండాలు ఏర్పడ్డాయి. ఇవి మోస్తరు నుంచి భారీ వర్షాలకు దోహదపడ్డాయి. దీంతో గత రెండు నెలల కాలంలో రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్డీపీఎస్) నివేదిక ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజనులో ఇప్పటివరకు రాష్ట్రంలో 370.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 379.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 2.4 శాతం అధికంగా వర్షం పడింది. సత్యసాయి జిల్లాలో అత్యధికంగా.. ఈ సీజనులో రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 19.7 శాతం తక్కువ వర్షం కురిసింది. బాపట్ల, కాకినాడ, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. సత్యసాయి జిల్లా 58.7 శాతం అధిక వర్షపాతంతో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కురిసిన జిల్లాగా మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో బాపట్ల (+51.3 శాతం), అనంతపురం (+34.3 శాతం), కాకినాడ (+21.1 శాతం) జిల్లాలున్నాయి. సాధారణం కంటే 20 శాతానికి పైగా వర్షపాతం తక్కువ నమోదైతే లోటు వర్షపాతంగా పరిగణిస్తారు. ఖరీఫ్‌కు ఢోకా లేదు.. నైరుతి రుతుపవనాల సీజన్ జూన్‌లో మొదలై సెప్టెంబర్‌తో ముగుస్తుంది. గత రెండు నెలలుగా ఎప్పటికప్పుడు వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రం మొత్తమ్మీద ఎక్కడా కరువు పరిస్థితులు ఏర్పడలేదు. ఇది రైతులకు ఎంతో ఊరట కలిగిస్తోంది. 40 రోజుల్లో నైరుతి రుతుపవనాల సీజన్ ముగియనుంది. రానున్న రోజుల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. ఈదఫా నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. వరుసగా నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడం, ఈ ఏడాదీ అదే పరిస్థితి కొనసాగుతుండడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది కూడా.. గత ఏడాది కూడా నైరుతి రుతుపవనాల సీజన్లో ఆశాజనకంగానే వర్షాలు కురిశాయి. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజనులో సాధారణ వర్షపాతం 514.4 మిల్లీమీటర్లు కాగా 613.3 మిల్లీమీటర్ల వర్షం (19 శాతం అధికం) కురిసింది. ధాన్యలక్ష్మితో రైతన్నల లోగిళ్లు కళకళలాడాయి. -
Heavy Rains-Telugu States: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల పరీవాహక ప్రాంతాల్లో (బేసిన్లో) విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చితే.. గోదావరి మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. వంశధారలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర, గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, తుంగభద్ర పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 1,81,246 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో బుధవారం మంత్రాలయం వద్ద ప్రమాదకర రీతిలో 312.04 మీటర్లు వద్ద తుంగభద్ర ప్రవహిస్తోంది. కర్నూలు వద్ద 272.76 మీటర్లకు చేరుకుంది. దాంతో మంత్రాలయం, కర్నూలు నగరాలలో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత ఎగువ నుంచి వస్తున్న వరదకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకల ద్వారా చేరుతున్న జలాలు తోడవడంతో శ్రీశైలంలోకి 3,60,436 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీరు నిల్వ ఉండటంతో పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,17,460 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 29,833, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు వదులుతున్నారు. నేడు సాగర్ గేట్లు ఎత్తివేత శ్రీశైలం నుంచి భారీగా వస్తున్న జలాలతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. సాగర్‌లోకి 3,61,296 క్యూసెక్కులు వస్తున్నాయి. నీటి నిల్వ 583.5 అడుగుల్లో 293.4 టీఎంసీలకు చేరుకుంది. మరో 19 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండిపోతుంది. గురువారం ఉదయం 6 గంటలకు సాగర్ ఒక గేటును ఎత్తివేయనున్నారు. ఆ తర్వాత ప్రతి గంటకూ ఒక గేటు చొప్పున ఎత్తుతూ 2 లక్షల నుంచి 2.50 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయనున్నారు. గత మూడేళ్లుగా ఆగస్టులోనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండుతోంది. సాగర్ డ్యాం గేట్ల నిర్వహణ పనులను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. డ్యాం 26 క్రస్టు గేట్లకు కొత్త ఇనుప రోప్‌లను బిగించారు. గేట్లకు గ్రీజింగ్, ఇతర మరమ్మతులు పూర్తి చేశారు. వరద నియంత్రణపై అధికారుల దృష్టి ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో వరద నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జలవనరుల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ నుంచి 75,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నందన పులిచింతలలో నీటి నిల్వ 40 టీఎంసీల లోపు ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో పులిచింతల ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 80,737 క్యూసెక్కులు చేరుతోంది. ఆ నీటినంతా ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రమాదకరంగా గోదావరి బేసిన్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్దకు 11 లక్షల క్యూసెక్కులు వస్తోంది. నీటి మట్టం 50.6 అడుగులకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం 55 అడుగులకు చేరుతుందని కేంద్ర జల వనరుల శాఖ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 10,10,387 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్‌వే ఎగువన 33.37 మీటర్లు, దిగువన 24.76 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి వచ్చిన వరదను 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద రాత్రి 10 గంటలకు నీటి మట్టం 13.40 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజ్‌లోని మొత్తం 175 గేట్లను పూర్తిగా పైకి లేపి 12,43,405 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి డెల్టాకు 6,500 క్యూసెక్కులు వదులుతున్నారు. వంశధారలో వరద ఉద్ధృతి బేసిన్లో కురుస్తున్న వర్షాలతో వంశధార వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 24,124 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 2849 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 21,275 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
కృష్ణా, గోదావరి పోటాపోటీ
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్/ధవళేశ్వరం/విజయపురిసౌత్/గాంధీనగర్(విజయవాడ సెంట్రల్)/: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు వరద ఉధృతితో పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్ర మంత్రాలయం వద్ద ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో అధికారులు ప్రమాద హెచ్చరికను ఎగురవేసి ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే.. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశాలలో కురుస్తున్న వర్షాలకు పెన్ గంగ, ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉరకలెత్తుతుండటంతో గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహం పెరుగుతోంది. ఇక్కడ మంగళవారం సా.6 గంటలకు 9,74,666 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 44 అడుగులకు చేరుకుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మరోవైపు..కృష్ణా, గోదావరి నదుల్లో బుధవారం వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉందని బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అప్రమత్తం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత.. కృష్ణా, తుంగభద్రల నుంచి భారీ వరదకు తోడు వాగులు, వంకల వరద తోడవవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. మంగళవారం సా.6 గంటలకు 2,72,943 క్యూసెక్కులు చేరుతుండటంతో.. ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,95,559 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,617 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.7 అడుగుల్లో 213.88 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇక సాగర్‌లోకి 1,91,646 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 577.6 అడుగుల్లో 276.09 టీఎంసీలకు చేరుకుంది. మరో 36 టీఎంసీలు వస్తే రెండ్రోజుల్లో సాగర్ నిండిపోతుందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రకాశం బ్యారేజ్‌లోకి భారీ వరద సాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న నీటికి మూసీ, వైరా జలాలు తోవడవుతండటంతో పులిచింతలలోకి 30,197 క్యూసెక్కులు చేరుతున్నాయి. ముప్పు నివారణ కోసం ప్రాజెక్టులో కొంతభాగాన్ని ఖాళీచేస్తూ.. స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 51,831 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 40.07 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల నుంచి దిగువకు వదిలేస్తున్న నీటికి.. పాలేరు, మున్నేరు, కట్టలేరు వరద తోడవుతుంటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,07,985 క్యూసెక్కులు చేరుతోంది ఇక్కడ నుంచి 70 గేట్లు ఎత్తి 1,00,590 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరదెత్తిన వంశధార.. ఇక ఒడిశా, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వంశధారలో వరద ఉధృతి మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజ్‌లోకి 21,004 క్యూసెక్కులు చేరుతుండగా.. ముంపు ముప్పును నివారణకు 22,040 క్యూసెక్కులను బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నది నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 10,200 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. పోలవరం వద్ద అప్రమత్తం ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గంట గంటకూ వరద ప్రవాహాన్ని అంచనావేస్తూ.. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తూ వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. మంగళవారం సా.6 గంటలకు పోలవరం ప్రాజెక్టులోకి 6,92,948 క్యూసెక్కులు చేరుతుండటం.. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 33.06, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 23.14 మీటర్లకు చేరుకుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 7,81,627 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో భారీ వర్షాలు.. గోదారి ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/ఎటపాక/చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/పోలవరం రూరల్/ ధవళే శ్వరం/దేవీపట్నం/హోళగుంద/బుట్టాయగూడెం: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంవల్ల మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కడెంవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని తదితర ఉప నదులు ఉప్పొంగుతుండటంతో సోమవారం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. దీనికి ఉప నదుల నుంచి వస్తున్న వరద తోడవడంతో సరస్వతి, లక్ష్మీ బ్యారేజీల గేట్లు ఎత్తేసి.. 8.68 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు ఉప నదులు, వాగులు, వంకల నుంచి వచ్చిన వరద తోడవడంతో సమ్మక్క బ్యారేజీలోకి 11.82 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ఆ మొత్తాన్ని దిగువకు వదిలేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీ దిగువన పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంవల్ల సీతమ్మసాగర్‌లోకి 14,30,597 (123.62 టీఎంసీలు) క్యూసెక్కులు చేరుతుండగా.. వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ఫలితంగా భద్రాచలంలో వరద గంటగంటకూ పెరుగుతోంది. ఇక్కడ వరద మట్టం 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. విలీన మండలాల్లో రాకపోకలు బంద్ గోదావరికి వరద పోటెత్తడంతో విలీన మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక, రాయనపేట, నెల్లిపాక, వీరాయిగూడెం, గౌరిదేవిపేట, నందిగామ, మురుమూరు గ్రామాల వద్ద రహదారిపైకి వరద చేరింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు జాతీయ రహదారులపై నిలిచిపోయాయి. శబరి నది కూడా ఎగపోటుకు గురవుతోంది. దీంతో చింతూరు మండలంలో పలు వాగులు పొంగుతున్నాయి. ఈ ప్రాంతంలోనూ పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరద అధికంగా ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని.. నిత్యావసర వస్తువులు, టార్పాలిన్లు సమకూర్చాలన్నారు. అలాగే, జ్వరాలు, డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుజాగ్రత్తగా లక్ష వాటర్ ప్యాకెట్లు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతర నిత్యావసర సరకులతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ మీడియాకు తెలిపారు. అంతేకాక.. వేలేరుపాడు, కుక్కునూరులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జేసీ అరుణ్‌బాబు, ఐటీడీఏ పీఓ జి.శ్రీనుకుమార్, ఆర్డీఓ ఎం.ఝాన్సీరాణి ఆయా గ్రామాల్లో పర్యటించారు. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేత పోలవరం నుంచి వస్తున్న వరద జలాలతో ధవళేశ్వరం బ్యారేజీలో సోమవారం రాత్రి 7 గంటలకు బ్యారేజీలోకి 8,02,114 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 10.10 అడుగులకు పెరిగింది. నాలుగు వేల క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేసి, మిగులుగా ఉన్న 7,98,114 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. సోమవారం రాత్రికి బ్యారేజీలోకి పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశముంది. ఎస్సారెస్సీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరి ప్రధాన పాయపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం 15.70 మీటర్లు ఉంది. వరద ఉధృతి కారణంంగా కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్లా, ఎస్పీ సురేష్‌కుమార్ రెడ్డి సోమవారం ఆయా గ్రామాలకు పడవపై లంకలోకి వెళ్లి వరద ఇబ్బందులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామన్నారు. జూలై రెండో వారంలో ఈ స్థాయిలో గోదావరికి వరద రావడం ఇదే ప్రథమం అని అధికారులు చెబుతున్నారు. ఆల్మట్టి గేట్లు ఎత్తివేత.. మరోవైపు.. కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లోకి 75 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఆదివారం, సోమవారం పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడం.. ఉప నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఎగువ నుంచి భారీ వరద వస్తుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దాంతో.. ముందుజాగ్రత్తగా ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తేసి దిగువకు 75 వేల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. నారాయణపూర్ కూడా నిండుకుండలా మారడంతో ఆ డ్యామ్ గేట్లు కూడా మంగళవారం ఎత్తివేయనున్నారు. కృష్ణాలో వరద ఉధృతి ఇలాగే కొనసాగితే.. మరో ఐదు రోజుల్లో శ్రీశైలానికి కృష్ణమ్మ చేరుకునే అవకాశముంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఈ డ్యామ్‌లోకి 81 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 91 టీఎంసీలకు చేరుకుంది. మరో 9 టీఎంసీలు చేరితే తుంగభద్ర నిండుతుంది. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం ఉదయం ఈ డ్యామ్ గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, పులిచింతల దిగువన బేసిన్లో కురిసిన వర్షాలకు 43 వేల క్యూసెక్కుల ప్రవాహం ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతోంది. ఇందులో ఐదు వేల క్యూసెక్కులను డెల్టా కాల్వలకు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 38 వేల క్యూసెక్కులను బ్యారేజ్ 50 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. వరదలకు జాగ్రత్తలు తీసుకోవాలి – మంత్రి అంబటి రాంబాబు రికార్డు స్థాయిలో గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సోమవారం వరద పరిస్థితిని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఈఎన్సీ నారాయణరెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రమాదం తొలగే వరకు ప్రజలను పునరావాస శిబిరంలో ఉంచి వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. వరద పెరగడంతో డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలోకి వరద నీరు చేరిందన్నారు. ఫలితంగా.. పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. నిజానికి.. గత ప్రభుత్వ హయాంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. దీనిని నిపుణుల బృందం పరిశీలిస్తోందని, వారిచ్చిన నివేదిక మేరకు కొత్తది నిర్మించాలా లేదా మరమ్మతులు చేయించాలా అనే విషయం తేలాల్సి ఉందన్నారు. -
Telangana Rains: వానలు డబుల్! సాధారణంతో పోలిస్తే రెట్టింపు వర్షపాతం
మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని, పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్: సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు.. ఆరెంజ్ అలర్ట్: నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు.. ఎల్లో అలర్ట్: మిగతా జిల్లాలకు.. బలపడుతున్న అల్పపీడనం: దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని.. అది మరింత బలపడనుందని తెలిపింది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో.. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు వెళ్తున్న వరద సాక్షి, హైదరాబాద్: చురుకుగా కదులుతున్న నైరుతి రుతు పవనాలతో రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వానలు పడుతున్నాయి. సగటు సాధారణ వర్షపాతం కంటే రెండింతలు ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఏటా జూన్ ఒకటో తేదీ నుంచి నైరుతి సీజన్ మొదలై సెప్టెంబర్ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ నాలుగు నెలల కాలంలో సాధారణంగా అయితే 72.12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. ఇందులో జూలై 11వ తేదీనాటికి 20.39 సెంటీమీటర్లు కురవాలి. కానీ ఈసారి జూలై 11 నాటికే ఏకంగా 39.57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 94 శాతం అధికం కావడం గమనార్హం. వాస్తవానికి జూన్ నెలలో సాధారణం కంటే తక్కువ వాన పడింది. ఈ నెల ప్రారంభంలోనూ అలాగే ఉంది. కానీ గత వారం రోజుల్లోనే ఒక్కసారిగా పెరిగింది. లోటు భర్తీ కావడమేకాదు.. రెండింతల వాన నమోదై రికార్డు సృష్టించింది. 29 జిల్లాల్లో అత్యధికంగా..: వారం రోజులుగా కురుస్తున్న వానలతో రాష్ట్రంలో పలుచోట్ల చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పొలాల్లో నీళ్లు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యాయి. ఇందులో 29 జిల్లాల్లో అతి ఎక్కువ స్థాయిలో వానలు పడగా.. ఆదిలాబాద్, హైదరాబాద్, వికారాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాలు మాత్రమే కాస్త ఎక్కువ వానల జాబితాలో ఉన్నాయి. సొమవారం రాష్ట్రవ్యాప్తంగా సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జల దిగ్బంధంలో ఏడుపాయల ఆలయం మెదక్ జిల్లాలో సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో వనదుర్గ ప్రాజెక్టు (ఘనపురం ఆనకట్ట) పొంగి పొర్లుతోంది. దీనితో ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం చుట్టూ నీళ్లు ప్రవహిస్తున్నాయి. -
Andhra Pradesh : 5 జిల్లాల్లో వర్షాలే వర్షాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు ప్రవేశించిన తొలి వారంలో (గత వారం రోజుల్లో) రాయలసీమలోని ఐదు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. వైఎస్సార్ జిల్లాలో అనూహ్యంగా సాధారణ వర్షపాతం కంటే 108.7 శాతం అధికంగా పడింది. సాధారణంగా ఈ వారం రోజుల్లో 56.8 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా 117.3 మి.మీ. కురిసింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 52.8 మి.మీ. పడాల్సి ఉండగా 102.9 మి.మీ. (94.9 శాతం అధికం) కురిసింది. అనంతపురం జిల్లాలో 48.3 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 78.5 మి.మీ. (62.5 శాతం అధికం) పడింది. అన్నమయ్య జిల్లాలో 59 మిల్లీమీటర్లు కురవాల్సివుండగా 100 మిల్లీమీటర్ల (69.5 శాతం అధికం) వర్షం పడింది. చిత్తూరు జిల్లాలో 65.5 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 97.7 మి.మీ. (49.5 శాతం అధికం) కురిసింది. 9 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ.. పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ లోటు శ్రీకాకుళం, ఎన్టీఆర్ జిల్లాల్లో మాత్రం భారీ లోటు ఏర్పడింది. సాధారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ సమయానికి మంచి వర్షాలు కురవాలి. వారం రోజుల్లో ఆ జిల్లాలో 100.5 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా కేవలం 34.9 మి.మీ. (65.3 శాతం తక్కువ) కురిసింది. ఎన్టీఆర్ జిల్లాలో 75.3 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 22.2 మి.మీ. వర్షం (70.5 శాతం తక్కువ) మాత్రమే పడింది. విజయనగరం, పార్వతీపురం మన్యం..అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కురవాల్సిన దానికంటె స్వల్పంగా తక్కువ వర్షం కురిసింది. సాధారణంగా నైరుతి రుతు పవనాలు ప్రారంభ సీజన్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వర్షాలు, రాయలసీమలో తక్కువ వర్షాలు కురుస్తాయి. ఈసారి అందుకు విరుద్ధంగా రాయలసీమలో విస్తారంగా కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో తగ్గాయి. రాబోయే పది రోజుల్లోనూ ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. జూలై, ఆగస్టు నెలల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. -
తెలంగాణలో భారీ వర్షాలు నీట మునిగిన కాలనీలు
-
చల్లటి పవనం పలకరించింది..
సాక్షి, అమరావతి: ఎండ వేడిమితో ఉడికిపోతున్న రాష్ట్రాన్ని నైరుతి రుతు పవనం చల్లగా పలకరించింది. సోమవారం రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు ఇవి విస్తరించాయి. రుతు పవన గాలులు బలంగా ఉండటంతో వచ్చే రెండు రోజుల్లో రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలకు, ఆ తర్వాత రెండు రోజుల్లో కోస్తా ప్రాంతాలకు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. చల్లని గాలులు వీస్తూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. రాబోయే ఐదు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు ఈ వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 566 మిల్లీ మీటర్లు. ఈసారి దీనికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈసారి అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఈ నెలలో రెండు, మూడు వారాల నుంచి వర్షాలు బాగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నైరుతి సీజన్లో సాధారణంగా జూన్, జూలై నెలల్లో ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడతాయి. జులై, ఆగస్టు నెలల్లో మధ్య కోస్తా జిల్లాలు, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వారం రోజులు ఆలస్యం నైరుతి రుతు పవనాలు ఈసారి వారం రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి వచ్చాయి. అసని తుఫాను ప్రభావంతో కొంచెం ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. గత నెల 28న (సాధారణంగా జూన్ 1న తాకాలి) కేరళను తాకాయి. అదే వేగంతో ముందుకు కదిలి ఈ నెల 3, 4 తేదీల్లో (సాధారణంగా జూన్ 5న) ఏపీలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ రాజస్థాన్ వైపు నుంచి పశ్చిమ గాలుల ప్రభావం తీవ్రమవడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో రుతు పవనాలు కర్ణాటక నుంచి ఏపీ వైపు కదలకుండా ఉండిపోయాయి. ఎట్టకేలకు అనుకూల వాతావరణం ఏర్పడడంతో వారం రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. -
నైరుతి వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మహబూబ్‌నగర్ జిల్లా వరకు అవి విస్తరిం చినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాల వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. దీంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరో నాలుగురోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశంఉన్నట్లు వాతావరణ శాఖ అం చనా వేస్తోంది. సాధారణంగా జూన్ మొదటివారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేవి. ఈ ఏడాది మే నెల 30న కేరళను తాకిన రుతుపవనాలు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అవి మందగించాయి. ఆ తర్వాత పశ్చిమదిశల నుంచి గాలుల ప్రభావంతోపాటు ఇతర పరిస్థితుల వల్ల రుతుపవనాల కదలికల్లో చురుకుదనం ఏర్పడింది. దీంతో వాటి వ్యాప్తి సంతృప్తికరంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మూడురోజులు భారీ వర్షాలు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. రానున్న మూడు రోజులు వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. సోమవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 41 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.3 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
24 గంటల్లో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు వచ్చే 24 గంటల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం పుణే, బెంగళూరు, పుదుచ్చేరి ప్రాంతాల్లో రుతుపవనాలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. సోమవారానికి రాయలసీమ ప్రాంతంతోపాటు తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ మధ్య–వాయవ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి రుతుపవనాలు విస్తరించే అవకాశముందని తెలిపింది. ఆ తర్వాత మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. రుతు పవనాలు విస్తరిస్తున్న క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 4 నాటికే రుతుపవనాలు రాయలసీమను తాకాల్సి ఉంది. అయితే పశ్చిమ గాలుల ప్రభావం, ఉపరితల ఆవర్తనం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడంతో ఏపీలోకి విస్తరించడం ఆలస్యమైంది. ప్రస్తుతం పశ్చిమ గాలుల ప్రభావం తగ్గి ఉష్ణోగ్రతలూ తగ్గడంతో రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయని, 24 గంటల్లో రాయలసీమను తాకుతాయని అధికారులు వివరించారు. -
రుతుపవనాల మందగమనం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ముందుకు కదలడంలేదు. ఈ నెల 4వ తేదీనే రాయలసీమను తాకాల్సి ఉన్నా కర్ణాటకలోనే కదలకుండా స్థిరంగా ఉండిపోయాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి సంవత్సరం జూన్ ఒకటో తేదీన కేరళను తాకి 5వ తేదీకల్లా ఏపీకి విస్తరిస్తాయి. అంటే కేరళను తాకిన నాలుగైదు రోజుల్లో ఏపీలోకి ప్రవేశిస్తాయి. ఈ సంవత్సరం నాలుగు రోజుల ముందుగానే మే 28వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. అక్కడి నుంచి వేగంగా కదిలి 31వ తేదీకి కర్ణాటక, ఏపీ సరిహద్దు వరకు వచ్చాయి. అప్పటి నుంచి బెంగళూరు, ధర్మపురి ప్రాంతంలోనే కదలకుండా ఉండిపోయాయి. మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో రుతుపవనాలు మన రాష్ట్రం వైపు కదలడంలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఒకటి, రెండు రోజుల్లో రుతుపవనాలు రాయలసీమను తాకే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవి ఒకసారి కదిలితే వేగంగా విస్తరిస్తాయని చెబుతున్నారు. అప్పటివరకు కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. -
కాడి కట్టి, మేడి పట్టి అరకలు.. ఉరకలు
సాక్షి, అమరావతి: సహకరిస్తున్న ప్రకృతితోపాటు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మేడి పట్టి ముందస్తు ఏరువాకకు అన్నదాతలు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. కేరళపై విస్తరించిన నైరుతి పవనాలు మరో ఐదు రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో కాడెద్దులతో అన్నదాతలు ముందస్తుకు సన్నద్ధమయ్యారు. ఈసారి వాతావరణం బాగా అనుకూలించి ముందస్తుగా రుతు పవనాల రాకతో వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల నుంచి ఎరువుల దాకా సర్వం సిద్ధం చేసి ఇప్పటికే రైతన్నలకు అందుబాటులో ఉంచింది. ముందస్తు ఖరీఫ్ సాగు కోసం రాష్ట్రవ్యాప్తంగా వేరుశనగ విత్తనాల పంపిణీ జోరుగా సాగుతుండగా నేటి నుంచి వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా వరితోపాటు ఇతర పంటల విత్తనాల పంపిణీ ప్రారంభం కానుంది. తొలిసారిగా ఆర్బీకేల్లో పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల పంపిణీ మొదలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ముందస్తు ఖరీఫ్‌కు అనుగుణంగా ఎరువులను కేటాయించేందుకు కేంద్రం అంగీకరించడంతో జూన్–జూలై నెలల్లో డిమాండ్‌కు సరిపడా నిల్వ చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు సాగునీటి ప్రణాళికకు అనుగుణంగా గోదావరి డెల్టాకు నేడు నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఎరువులు.. విత్తనాలు గత ఖరీఫ్‌లో రాష్ట్రంలో 15.34 లక్షల టన్నుల ఎరువులను వినియోగించగా ఈసారి 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. రబీలో మిగిలిన నిల్వలతో పాటు ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏప్రిల్, మేలో కేంద్రం 3.47 లక్షల టన్నులను కేటాయించడంతో 7.69 లక్షల టన్నుల ఎరువులున్నాయి. ఇందులో 1.21 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరగడంతో 6.48 లక్షల టన్నులను క్షేత్రస్థాయిలో సిద్ధం చేశారు. వీటిలో 1.50 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల్లో నిల్వ చేశారు. తొలిసారిగా ఆర్బీకేల ద్వారా పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. వీటి కోసం ఇప్పటికే 23 కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. తొలుత తూర్పు, పశ్చిమ డెల్టాలో గోదావరి తూర్పు డెల్టా కింద 2 లక్షలు, సెంట్రల్ డెల్టా పరిధిలో 1.7 లక్షల ఎకరాలు, వెస్ట్రన్ డెల్టా పరిధిలో 4.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తొలుత ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో 6.3 లక్షలకు పైగా ఎకరాల్లో ఖరీఫ్ సాగు ప్రారంభం కానుంది. సెంట్రల్ డెల్టా పరిధిలో కోనసీమతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాలకు నీరందేందుకు కనీసం 15 రోజులు పడుతుంది. నీటి విడుదలతో ముందుగా రాజమహేంద్రవరం, మండపేట, రాయవరం, రామచంద్రాపురం, కొవ్వూరు, నిడదవోలు, మార్టేరు, పెనుగొండ తదితర ప్రాంతాల్లో నారుమళ్లు పోసుకునేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాలువలకు విడుదలయ్యే నీటిని సద్వినియోగం చేసుకునేలా ఆర్బీకేల ద్వారా రైతులను చైతన్యం చేస్తున్నారు. ► ఖరీఫ్‌లో 95.23 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం ► ఈసారి ఖరీఫ్‌లో 95.23 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 40.76 లక్షల ఎకరాల్లో వరి, 18.26 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 15,97 లక్షల ఎకరాల్లో పత్తి, 8.88 లక్షల ఎకరాల్లో అపరాలు 3.94 లక్షల ఎకరాల్లో మిరప, 2.95 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయనున్నారు. ► ఖరీఫ్ కోసం 6,16,664 క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేశారు. 29,417 క్వింటాళ్ల విత్తనాలను 90 శాతం సబ్సిడీతో ఇవ్వనుండగా 5,87,247 క్వింటాళ్ల విత్తనాన్ని 25 నుంచి 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. ► ఆర్బీకేల్లో 94,542 క్వింటాళ్ల పచ్చి ట్ట విత్తనాల పిణీ జోరుగా జరుగుతోంది. మరో వైపు 3,29,688 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను అందచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 1,73,635 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో సిద్ధం చేశారు. ఇప్పటివరకు 1,25,318 క్వింటాళ్ల విత్తనాల కోసం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ► వరి సహా ఇతర పంటలకు సంబంధించి 1,92,433 క్వింటాళ్ల విత్తనాలను బుధవారం నుంచి పంపిణీ చేయనున్నారు. ఇందులో 1,72,234 క్వింటాళ్ల వరి విత్తనాలతో పాటు ఇతర పంటలకు సంబంధించినవి ఉన్నాయి. వెంటనే నారుమళ్లు పోస్తాం.. మూడు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నా 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. నీటి విడుదలలో ఆలస్యం వల్ల ఏటా కోతకొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. గతేడాది వర్షాలు, తుపాన్ల వల్ల ఎకరాకు 30 బస్తాలకు మించి రాలేదు. ఈఏడాది ప్రభుత్వం జూన్ 1నే డెల్టాకు నీరిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. వెంటనే నారుమళ్లు పోసి నాట్లు వేసుకుంటా. ఈసారి స్వర్ణతో పాటు ఎంటీయూ 1318, పీఎల్ 1100 రకాలు సాగు చేస్తా. –సంకురాత్రి సుబ్బారావు, ఉండ్రాజవరం, ఏలూరు జిల్లా వ్యవసాయానికి మంచిరోజులు వ్యవసాయానికి నిజంగా మంచిరోజులొచ్చాయి. ముందుగా సాగునీరు ఇవ్వాలని కోనసీమలో గతంలో రైతులంతా లక్ష ఎకరాల్లో సాగు సమ్మె చేశారు. నాటి డిమాండ్ నేడు సాకారమైంది. ప్రభుత్వం ముందస్తుగా సాగు నీరివ్వడం నిజంగా రైతులకు వరం లాంటిది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీటి వృథాను అరికట్టి సాగు చేపట్టాలి. –కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రైతులకెంతో మేలు ముందస్తు ఖరీఫ్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కాలువలకు ప్రభుత్వం ముందుగా నీటిని విడుదల చేస్తోంది. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకుని అదును దాటిపోకుండా ఖరీఫ్ సాగు చేపట్టాలి. –జున్నూరి రామారావు(బాబి) రైతు, ఏపీ వ్యవసాయ కమిషన్ సభ్యుడు అదునులో సాగుతో అదనపు దిగుబడి ‘నాకు 59 సెంట్ల సొంత భూమి ఉంది. మరో 5 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. గతేడాది అకాల వర్షాలు, తుపాన్ల వల్ల దిగుబడి తగ్గింది. ఈసారి జూన్ 1వ తేదీనే డెల్టాకు నీరిస్తుండటంతో బుధవారమే నారుమడి పోస్తున్నా. అదునులో సాగు చేపడుతుండటంతో ఎకరాకు కనీసం 40 బస్తాల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. ముందుగా నీళ్లిస్తున్న ప్రభుత్వానికి రైతులు రుణపడి ఉంటారు’ – కె.శ్రీనివాసరెడ్డి, పసలపూడి, రాయవరం మండలం, కోనసీమ జిల్లా -
మూడు రోజుల ముందే నైరుతి
తిరువనంతపురం/న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ, ఆర్థిక రంగాలకు ఎంతో కీలకమైన నైరుతి రుతు పవనాలు ఈ సీజన్లో ముందుగానే కేరళను తాకనున్నాయి. సాధారణంగా జూన్ ఒకటో తేదీన రావాల్సిన రుతు పవనాలు ఈసారి మూడు రోజులు ముందుగానే కేరళలో ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి కేరళలో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని 14 వాతావరణ పరిశీలన కేంద్రాలకు గాను పదింటి పరిధిలో 2.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రుతు పవనాల రాక ప్రారంభమైందనేందుకు ఇదే ప్రధాన సంకేతమని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో బలమైన పశ్చిమ గాలులు వీస్తుండటం కూడా రుతు పవనాల ఆగమనానికి సూచిక అని ఆయన తెలిపారు. కేరళలో రుతు పవనాల ప్రారంభానికి ఇతర అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రాక మొదలైనప్పటికీ బంగాళాఖాతంలో అండమాన్ దీవులపైన పవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని మహాపాత్ర చెప్పారు. దీనివల్ల, కర్ణాటక, గోవా, ఈశాన్య భారతంలోకి రుతు పవనాల ప్రవేశం కాస్త ఆలస్యం కానుందని అంచనా వేశారు. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో కేరళ మొత్తం,, తమిళనాడు, కర్ణాటకల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతు పవనాలు వ్యాపించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో జూన్ 8వ తేదీ వరకు సాధారణం, అంతకంటే తక్కువగానే వర్షాలు కురుస్తాయన్నారు. కాగా, తెలంగాణ మినహా అన్ని దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి–మే 28 మధ్య కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని ఆదివారం ఒక ప్రకటనలో వివరించారు. -
రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు
-
గుడ్‌న్యూస్: నైరుతి ఆగమనం
సాక్షి,అమరావతి/చిత్తూరు అగ్రికల్చర్: అనుకున్నట్లుగానే నైరుతి రుతుపవనాలు ముందస్తుగా దేశంలోకి ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవుల్లో ఎక్కువ భాగాలు, అండమాన్ సముద్ర ప్రాంతాన్ని సోమవారం రుతుపవనాలు తాకాయి. సాధారణంగా ఈ నెల 22న రుతుపవనాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా వారం ముందే ప్రవేశించాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులతోపాటు తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నట్లు వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపాయి. వీటి ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గాయి. భూవాతావరణంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోనూ 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాకపోతే ఉక్కపోత ఉండడంతో కోస్తా ప్రాంతంలో వాతావరణం వేడిగా ఉంది. రాయలసీమలో భారీ వర్షాలు మరోవైపు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా బిహార్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర – దక్షిణ ద్రోణి మరింతగా విస్తరించి ఉంది. ఇది ఉత్తర తమిళనాడు, కర్ణాటక మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించింది. దీనికితోడు నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరప్రాంతాల్లో ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో జోరు వానలు కురిశాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, రేణిగుంట, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, పలమనేరు, చిత్తూరు, తిరుమల, చంద్రగిరి, కుప్పం, ఐరాల, జీడీ నెల్లూరు, వెదురుకుప్పం, కురబలకోట, గుర్రంకొండ, వాల్మీకిపురం, సుండుపల్లి, వీరబల్లి, ఆదోని, పత్తికొండ, బద్వేలు, దువ్వూరు, పోరుమామిళ్ల, సిద్ధవఠం, మైదుకూరు, రాయచోటి, సంబేపల్లె తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీలు నేలకూలాయి. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం అరుదూరులోని శివాలయంలో ధ్వజస్తంభం కూలిపోయింది. ఇద్దరు గొర్రెల కాపర్లు మృత్యువాత వైఎస్సార్ జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. దువ్వూరు మండలంలో పిడుగుపాటుకు గొర్రెల కాపర్లు.. నల్లబోతుల హనుమంతు (56), శెట్టిపల్లె మునిరావు (32) మృతి చెందారు. గొర్రెలు మేపుకునేందుకు గుట్టకు వెళ్లిన వీరు వాన ప్రారంభం కావడంతో సమీపంలోని మర్రిచెట్టు వద్దకు వెళ్లారు. అంతలోనే పెద్ద శబ్దంతో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. బద్వేలులోని సురేంద్రనగర్‌లో ఓ ఇంటిపై పిడుగు పడటంతో గృహోపకరణాలు కాలిపోయాయి. వల్లూరు మండలం తప్పెట్ల బస్టాప్ వద్ద భారీ చెట్టు వర్షానికి కూలిపోయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని అనిబిసెంట్ వీధిలో ఓ మొబైల్ దుకాణంలోకి వర్షపునీరు చేరడంతో రూ.లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్స్ పరికరాలు నీటమునిగాయి. కోస్తాలో మోస్తరు వానలకు ఆస్కారం కాగా, వచ్చే రెండు రోజులు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక చోట్ల పిడుగులు పడతాయని పేర్కొంది. కోస్తా ప్రాంతంలోనూ పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. -
గుడ్‌న్యూస్ చెప్పిన భారత వాతావరణశాఖ
-
Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన
Rain Forecast In Telangana.. దేశ ప్రజలకు భారత వాతవరణ శాఖ శుభవార్త చెప్పింది. సోమవారం అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. దీంతో, 23 రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/6NpNiMmPYG — IMD_Metcentrehyd (@metcentrehyd) May 16, 2022 ఇక, రుతుపవనాల రాకతో అండమాన్ నికోబర్ దీవులు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరోవైపు, రానున్న నాలుగు, ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ కర్నాటక తీరంలోభారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మరో 24 గంటల్లో తమిళనాడు, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు బలపడేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నది. pic.twitter.com/iR01cGDsAS — IMD_Metcentrehyd (@metcentrehyd) May 16, 2022 ఇది కూడా చదవండి: జీవవైవిధ్యం ఉట్టిపడేలా.. ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్కు -
సమృద్ధిగా వర్షాలు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవనున్నాయి. గత సంవత్సరానికంటే మెరుగ్గా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతు పవనాలు ముందే దేశంలోకి ప్రవేశిస్తుండటం, అవి బలంగా ఉండడంతో ఈ సీజన్లో వర్షాలు బాగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారానికి నైరుతి రుతు పవనాలు ఈశాన్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి. ఈ నెల 27వ తేదీకి కేరళను తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత వారంలోనే.. అంటే జూన్ 4, 5కల్లా రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో కేరళను తాకుతాయి. గత ఏడాది జూన్ 3న కేరళలో ప్రవేశించి 10న ఏపీలోకి వచ్చాయి. ఈ సంవత్సరం ఇంకా ముందే వస్తుండటం వ్యవసాయానికి అనుకూలమని భావిస్తున్నారు. మండుతున్న ఎండల నుంచి కూడా ఉపశమనం లభించనుంది. అసని తుపానుతో అనుకూల పరిస్థితులు ఇటీవల వచ్చిన అసని తుపాను వల్ల వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. భూమధ్య రేఖ వద్ద ఉండే గాలులు, ఉత్తర, పశ్చిమ భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడం, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే గాలులు బలంగా ఉండడం వంటి పలు అంశాలు నైరుతి రుతు పవనాలకు అనుకూలంగా మారాయి. దీనికి సముద్రంలో లానినో పరిస్థితులు కూడా కలిసి వచ్చింది. మామూలుగా మే 22కి దక్షిణ అండమాన్, ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లోకి నైరుతి రుతు పవనాలు వస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న అనుకూల పరిస్థితుల వల్ల 15వ తేదీకే అవి అక్కడకు చేరాయి. అక్కడి నుంచి కేరళకు తర్వాత ఏపీకి రానున్నాయి. ఎండలు కొద్ది రోజులే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరో వారం, పది రోజులు మాత్రమే కొనసాగుతాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకు 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. జూన్ మొదటి వారం నుంచి వాతావరణం చల్లబడి, వర్షాలు కురిసేందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. -
28 ఏళ్ల తర్వాత మార్చిలో వాయుగుండం
సాక్షి, అమరావతి బ్యూరో: నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీజనులోను, ఈ సీజన్లకు ముందు, తర్వాత అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడడం సర్వసాధారణం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపుతాయి. అలాగే, నైరుతి రుతు పవనాల సీజనుకు ముందు ప్రారంభమయ్యే ప్రీ మాన్సూన్ సీజను (ఏప్రిల్, మే)లోను, ఈశాన్య రుతుపవనాలు ముగిసే పోస్ట్ మాన్సూన్ సీజనుగా పేర్కొనే జనవరిలోనూ అడపాదడపా వాయుగుండాలు, తుపాన్లు సంభవిస్తాయి. కానీ, మార్చి ఆరంభంలోనే అల్పపీడనం, వాయుగుండం వంటివి ఏర్పడడం అరుదైన విషయమే. ఇలాంటి ప్రత్యేకత సంతరించుకునేలా ఈనెల 2న దక్షిణ మధ్య బంగాళాఖాతం, భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 24 గంటల్లో గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగానూ మారనుంది. ఇటీవల కాలంలో మార్చి ఆరంభంలో ఇలాంటివి ఏర్పడిన దాఖలాల్లేవు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వద్ద ఉన్న సమాచారం ప్రకారం 1994 మార్చి 21న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఆపై వాయుగుండంగా మారింది. ఆ తర్వాత అంటే గత 28 ఏళ్లలో ఇప్పటివరకు మార్చిలో అల్పపీడనం గాని, వాయుగుండంగానీ ఏర్పడిన పరిస్థితిలేదు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటాన్ని వాతావరణ నిపుణులు అరుదైనదిగా పేర్కొంటున్నారు. ‘నైరుతి’ సీజన్లో మంచి వర్షాలు ఇక సాధారణంగా ఏప్రిల్ నుంచి సముద్ర ఉపరితల జలాలు వేడెక్కుతుంటాయి. ఫలితంగా అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడటానికి దోహదపడతాయి. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే అధికంగా నమోదవుతున్నాయి. ఇవి నైరుతి రుతుపవనాల సీజనులో మంచి వర్షాలు కురవడానికి సానుకూల సంకేతంగా భావిస్తారు. వీటిని లానినా పరిస్థితులుగా పేర్కొంటారు. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో లానినా పరిస్థితులుండడమే అకాల అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడటానికి ఒక కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరాన్ని తాకి రీకర్వ్ అయ్యే అవకాశం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భూమధ్య రేఖకు సమీపంలో ఏర్పడే వాయుగుండాలు తుపానుగా బలపడే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. మార్చి ఆరంభంలోనే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడం అరుదైన పరిణామమని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. -
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయి. ఈ నెల 26న ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల రాక ప్రారంభం కానుంది. మరోవైపు అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి తేమ రాష్ట్రం వైపు వస్తోంది. దీంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. తిరుపతిలో 106.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
15న రెండు అల్పపీడనాల ప్రభావం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ రెండు రోజుల్లో మొదలవుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి వెళ్లిపోతున్నాయని పేర్కొంది. ఈ నెల 15న రాష్ట్రంలో వాతావరణపరంగా అరుదైన ప్రక్రియ.. రెండు అల్పపీడనాలు ప్రభావం చూపే సూచనలున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉంది. ఇది అల్పపీడనంగా మారి ఈ నెల 15న చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి తదుపరి 24 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరానికి చేరుకోనుంది. ఇది ఈ నెల 15న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు ఉభయగోదావరి జిల్లాలపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు అల్పపీడనాలు రాష్ట్రంపై ప్రభావం చూపించడం అరుదని చెబుతున్నారు. అల్పపీడనం తుపానుగా బలపడే సూచనలు ప్రస్తుతానికి కనిపించడం లేదని, రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే రెండురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గత 24 గంటల్లో చిల్లకూరులో 72 మిల్లీమీటర్లు, బండారుపల్లెలో 65.5, మారేడుమిల్లిలో 60, వెంకటగిరికోటలో 56.5, పలమనేరులో 56, గోపాలపురంలో 52, సైదాపురంలో 49.5, బోగోలులో 47.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
నేడు అల్పపీడనం.. అనంతరం తుపాను
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల ఇది తదుపరి నాలుగైదు రోజుల్లో మరింత బలపడి తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇది దిశ మార్చుకుని బర్మా మీదుగా ప్రయాణించనుంది. బర్మా సమీపానికి వెళ్లిన తర్వాత మళ్లీ దిశ మార్చుకుని దక్షిణ ఒడిశా వైపు రానుంది. ఫలితంగా ఈ తుపాను ప్రభావమంతా ఒడిశాపైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండురోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 17న రాష్ట్రాన్ని తాకాల్సిన ఈశాన్య రుతుపవనాలు 23 లేదా 24వ తేదీన వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఒకటిరెండు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నట్లు పేర్కొంది. పిడుగులకు ఇద్దరి దుర్మరణం పొదలకూరు/దొరివారిసత్రం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం చెందారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. నేదురుమల్లి గ్రామంలో పశువుల్ని మేతకు తోలుకెళ్లిన కోవూరు పెంచలనాయుడు (42), దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాళెం ఎస్సీ కాలనీలో గొర్రెల్ని మేతకు తోలుకెళ్లిన తిరునామల్లి నవీన్ (21) పిడుగులు పడి ప్రాణాలు కోల్పోయారు. నేదురుమల్లికి చెందిన కోవూరు రత్నమ్మ తీవ్రంగా గాయపడింది. -
సంతృప్తికర స్థాయిలో వర్షాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రాష్ట్రంలో సంతృప్తికర స్థాయిలో వర్షాలు కురిపించాయి. జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో తొమ్మిది అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అందులో మూడు తీవ్ర అల్పపీడనాలుగా మారాయి. జూన్‌లో ఒకటి, జూలైలో మూడు, ఆగస్టులో రెండు, సెప్టెంబర్‌లో మూడు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ చివరలో గులాబ్ సెప్టెంబర్‌లో ఏర్పడ్డ రెండు వాయుగుండాల్లో ఒకటి తీవ్ర వాయుగుండంగా బలపడింది. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసే సమయంలో సెప్టెంబర్ చివరలో గులాబ్ తుపాను ఏర్పడింది. మొత్తంగా సెప్టెంబర్‌లోనే ఒక తుపాను, ఒక వాయుగుండం, ఒక తీవ్ర వాయుగుండం, రెండు తీవ్ర అల్పపీడనాలు, ఒక అల్పపీడనం ఏర్పడడం విశేషం. వీటన్నింటిలో గులాబ్ తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో వచ్చే తుపానులు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో తీరం దాటుతాయి. అక్టోబర్, నవంబర్‌ల్లో వచ్చే తుపానులు ఎక్కువగా మన రాష్ట్రంలో తీరం దాటుతాయి. గత కొన్నేళ్ల వాతావరణ విశ్లేషణలు ఈ అంశాలను స్పష్టం చేస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా ఈ సెప్టెంబర్‌లో వచ్చిన తుపాను మన రాష్ట్రంలోని కళింగపట్నం దగ్గర తీరం దాటి తీవ్ర ప్రభావం చూపింది. విస్తారంగా వర్షాలు ఈ నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 514 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సివుండగా 613.3 మి.మీ వర్షం కురిసింది. 19 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. దీన్ని వాతావరణ శాఖ సాధారణ వర్షపాతంగానే (20 శాతం వ్యత్యాసం ఉంటే సాధారణమే) పరిగణిస్తుంది. వైఎస్సార్, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అధిక వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలో 49 శాతం అధిక వర్షపాతం కురవగా వైఎస్సార్ జిల్లాలో 32 శాతం అధిక వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం జిల్లాలో 37 శాతం, విజయనగరం జిల్లాలో 36 శాతం, గుంటూరు జిల్లాలో 33 శాతం, తూర్పుగోదావరిలో 29 శాతం, కృష్ణాలో 28 శాతం అధిక వర్షాలు కురిశాయి. అనంతపురం, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మిగిలిన జిల్లాల కంటె కొంచెం తక్కువ వర్షం కురిసింది. స్వల్పంగా లోటు వర్షం కురిసినా అది పది శాతంలోపే కావడంతో సాధారణంగానే పరిగణిస్తున్నారు. మొత్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సీజన్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ నెల 6 నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైంది. రాయలసీమకు భారీ వర్ష సూచన సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 14న వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు పయనించనుంది. ఇది 15వ తేదీన తుపానుగా బలపడే సూచనలు పుష్కలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) చెబుతోంది. నిష్క్రమిస్తున్న నైరుతి రుతు పవనాలు క్రమంగా మన రాష్ట్రం వైపు వస్తుండటంతో వారం రోజుల పాటు వర్షాలు పుంజుకోనున్నాయి. వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులు, అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఆదివారం దక్షిణ కోస్తాలోని ఒకట్రెండు చోట్ల, సోమవారం రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. కె.బిట్రగుంటలో 90.25 మి.మీ., ప్రత్తిపాడులో 63.5, కిర్లంపూడిలో 62.7, గోరంట్లలో 60, జగ్గంపేటలో 59, పమిడిలో 57, పలగలపల్లిలో 52.5, పెద్దతిప్పసముద్రంలో 45, ఓబుళదేవర చెరువు, శంఖవరంలో 44.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, వైఎస్సార్ జిల్లాను శనివారం వర్షం ముంచెత్తింది. కడప, పులివెందుల, రాయచోటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని ప్రధాన నదులైన పాపాగ్ని, మాండవ్య నదులు వరద నీటితో ప్రవహిస్తున్నాయి. వీరబల్లి మండలంలోని గడికోట వద్ద మాండవ్య నది దాటుతూ కాకినాడకు చెందిన గోవిందరావు (45) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. -
రెండ్రోజులు మోస్తరు వానలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య భారత దేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరగోమనం చెందాయి. వారం రోజుల్లో తెలంగాణ, ఏపీ నుంచి నైరుతి నిష్క్రమణం మొదలవ్వనుంది. మరోవైపు తూర్పు అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కర్ణాటక, సీమ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఈ నెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తా, సీమల్లో అక్కడక్కడా మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. -
AP: ఈ నెలంతా వానలే
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతోపాటు తుపాన్ల కాలం సమీపిస్తుండటంతో ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరందుకోనున్నాయి. బుధవారం నుంచి వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలుకానుంది. మరోవైపు తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం పైకి వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. సూళ్లూరుపేటలో 176.50 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా ఏర్పేడులో 139.5, ముత్తుకూరులో 133.25, బుచ్చినాయుడుకండ్రిలో 114.25, ఇందుకూరుపేటలో 99.25, తడలో 96, గూడూరులో 86.5, మనుబోలులో 79.5, చిల్లకూరులో 70.25, నెల్లూరులో 70, సత్యవేడులో 64.25, కొరుటూరులో 63, శ్రీకాళహస్తిలో 59.5, తొట్టంబేడులో 57.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ముందే ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: మంచి వర్షాలు అందించిన నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న వేళ.. మరో చల్లని కబురు అందింది. నైరుతి మాదిరిగానే ఈశాన్య రుతుపవనాలు కూడా ముందే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. సాధారణంగా అక్టోబర్ చివరి వారంలో రావాల్సిన ఈశాన్య రుతుపవనాలు ఈ ఏడాది అక్టోబర్ మూడో వారంలోనే రానున్నట్లు భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈశాన్య రుతుపవనాల రాకతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంపై మంచి ప్రభావమే చూపించాయి. 13 జిల్లాలోనూ మంచి వర్షాలు కురిశాయి. ఏడు జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 560 మిల్లీమీటర్లు. ఈ కాలంలో ఈ ఏడాది 8.77 శాతం అధికంగా మొత్తం 609.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరులో 49 శాతం అధికంగా వర్షాలు కురవగా విశాఖపట్నంలో 37, విజయనగరంలో 36, గుంటూరులో 33, వైఎస్సార్ కడపలో 32, తూర్పు గోదావరిలో 29, కృష్ణా జిల్లాలో 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. రెండురోజులు తేలికపాటి వానలు ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణాంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో పెనమలూరులో 63.8 మీల్లీమీటర్లు, వేటపాలెంలో 58.5, మచిలీపట్నంలో 55.6, రాజమండ్రిలో 54.8, మంగళగిరిలో 51, టి.నర్సాపురంలో 49, తణుకులో 48.8, ఒంగోలులో 45.6, పెడనలో 43.8, చింతలపూడిలో 43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
స్థిరంగా అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని చాంద్‌బలికి దక్షిణంగా సోమవారం తీరం దాటింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ రానున్న 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా మధ్యప్రదేశ్ వైపు కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని అధికారులు తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్: పాతాళ గంగ.. కరువు తీరంగ
సాక్షి, అమరావతి: పాతాళ గంగ పైపైకి వస్తోంది. దుర్భిక్ష ప్రాంతాల్లోనూ కరువు తీర్చే కల్పవల్లిగా అవతరిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగాయి. మే 31 నాటికి రాష్ట్రంలో సగటున 9.88 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభ్యమయ్యేవి. ఇప్పుడు సగటున 8.24 మీటర్లలో లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. రుతు పవనాల ప్రభావం వల్ల జూన్ నుంచి ఈ నెల 6 వరకూ రాష్ట్రంలో సగటున 433.59 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాలి. కానీ.. 382.55 మిల్లీమీటర్ల వర్షపాతమే కురిసింది. సాధారణం కంటే 11.77 శాతం తక్కువ వర్షపాతం నమోదైనా భూగర్భ జలమట్టం భారీగా పెరగడం గమనార్హం. దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఏకంగా 4.84 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. 163.55 టీఎంసీల భూగర్భ జలాలు రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,63,099 చదరపు కిలోమీటర్లు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఇప్పటివరకూ కురిసిన వర్షపాతం పరిమాణం 2,233.47 టీఎంసీలు. ఇందులో 163.55 టీఎంసీలు భూగర్భ జలాల రూపంలోకి మారాయి. దాంతో భూగర్భ జలమట్టం 8.24 మీటర్లకు చేరుకుంది. గతేడాది సెప్టెంబర్ 6వ తేదీ నాటికి సగటున 13.27 మీటర్లలో భూగర్భ జలాలు లభ్యయ్యేవి. అంటే.. గతేడాది సెప్టెంబరు 6తో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటున 5.03 మీటర్లు పెరిగినట్టు స్పష్టమవుతోంది. అనంతపురం జిల్లాలో మే 31 నాటికి 15.54 మీటర్లలో భూగర్భ జలమట్టం ఉండేది. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావం వల్ల ఆ జిల్లాలో భూగర్భ జలమట్టం 10.70 మీటర్లకు చేరుకుంది. అంటే ఏకంగా 4.84 మీటర్ల మేర జలమట్టం పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భ జలాలు పెరిగిన జిల్లా అనంతపురమే కావడం గమనార్హం. నెల్లూరు జిల్లాలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల అధికంగా వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం ఆ జిల్లాపై తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆ జిల్లాలో భూగర్భజలమట్టం తగ్గింది. అక్కడ భూగర్భ జలమట్టం మే 31 నాటితో పోల్చితే సోమవారం నాటికి 0.71 మీటర్లు తగ్గింది. ఇబ్బందులు తప్పినట్టే.. రాష్ట్రంలో సుమారు 13 లక్షల బోరు బావుల కింద దాదాపు 24 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. తాగు, గృహ అవసరాల నీటి కోసం 2.33 లక్షల బోరు బావులపై ప్రజలు ఆధారపడతారు. భూగర్భ జలమట్టం భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పినట్టేనని అధికారులు విశ్లేషిస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఈ నెలతో పాటు అక్టోబర్‌లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రుతుపవనాలతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తూర్పు ప్రాంతం, ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంపై అధికంగా వర్షాలు కురుస్తాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే జలమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. -
2 నెలలు... జోరు వానలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నైరుతి సీజన్ మొదలైన రెండు నెలలకే సాధారణ వర్షపాతం కంటే 53.5 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. జూన్ 3న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా తొలకరి సమయంలోనే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి. నెలలో కురవాల్సిన సగటు వర్షపాతం దాదాపు 4–5 రోజుల్లోనే నమోదైంది. అనంతరం రుతుపవనాల కదలికలు కాస్త నెమ్మదించినప్పటికీ జూలైలో తిరిగి చురుకుగా ప్రభావం చూపడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 36.31 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... సోమవారం నాటికి 56.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే 53.5 శాతం అధికంగా వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆరు జిల్లాల్లో రెట్టింపు వర్షపాతం... రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు కురవగా ఆరు జిల్లాల్లో సాధారణం కంటే రెట్టింపు వర్షాలు కురిశాయి. జగిత్యాల, నారాయణపేట, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సాధారణం కంటే 100–150 శాతంఅధిక వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వివరించింది. మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లోనూ జూన్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదు కావడంతో అక్కడ కూడా 150 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో అత్యధిక వర్షాలు నమోదవగా 18 జిల్లాల్లో అధిక వర్షాలు, 6 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో గతేడాది నైరుతి రుతుపవనాల సీజన్లో 107.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కానీ ఈసారి కేవలం జూలైలోనే సాధారణం కంటే 57% అధికంగా వర్షాలు కురిశాయి. అత్యధికం: నిజామాబాద్, వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాయ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి అధికం: అదిలాబాద్, ఆసీఫాబాద్, జగిత్యాల, మహబుబాబాద్, వరంగల్ రూరల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మల్కాజ్గిరి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం సాధారణం: మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, ములుగు. -
రాష్ట్రంలో భారీ వర్షాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): నైరుతి రుతుపవనాల కదలికలు జోరుగా ఉండటంతో రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని, వీటివల్ల కూడా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. -
వచ్చే రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అనేక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల్లో కదలిక నెమ్మదిగా ఉంది. వారం, పది రోజల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించే పరిస్థితి ఉందని, వర్షాలకు ఢోకా లేదని అంచనా వేస్తున్నారు. -
తీరంలో ఈదురుగాలులు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో వచ్చే 48 గంటల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాల జోరు తగ్గిందని, పశ్చిమ గాలుల వల్ల వాయవ్య భారతదేశంలో మిగిలిన భాగాల్లో వీటి పురోగతి నెమ్మదిగా ఉందని తెలిపారు. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణ, ఢిల్లీల్లో రుతుపవనాల ప్రవేశానికి అంత అనుకూలంగా లేదని చెప్పారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో దిగువ స్థాయిలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా.. మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు నెమ్మదిగా ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. -
2 రోజుల్లో మరో అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం ఉండగా.. రెండు, మూడు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. వాయవ్య జార్ఖండ్ పరిసరాలపై ఉన్న ఈ అల్పపీడనం ఇప్పుడు తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్లపై ఉంది. కొత్తగా ఏర్పడనున్న అల్పపీడనం ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపుగా కదులుతుందని, దీని ప్రభావం మన రాష్ట్రంపై ఉండదని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలకు , దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మరోవైపు నైరుతి రుతుపవనాల జోరు తగ్గింది. పశ్చిమ గాలుల వల్ల వాయవ్య భారతదేశంలో మిగిలిన భాగాల్లో రుతుపవనాల పురోగతి నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. -
రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం, నైరుతి రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తీరాలపై అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉంది. ఇది పడమర దిశగా ప్రయాణించొచ్చు. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని అధికారులు చెప్పారు. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం, నైరుతి రుతుపవనాలతో రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా విస్తరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వంగి ఉంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదలే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వీటికితోడు నైరుతి రుతుపవనాల విస్తరణతో రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు. -
మరింత బలపడుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం శనివారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఒడిశా మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదలవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం తుపానుగా మారే అవకాశం లేదని చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో 2 రోజులు పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో వాటి ప్రభావంతో కూడా వర్షాలు ఎక్కువగా కురిసే పరిస్థితి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 15వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని సూచించింది. -
వరుణుడి కరుణ
రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల కింద 105.79 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2019–20, 2020–21 నీటి సంవత్సరాల్లో వరద జలాలను ఒడిసి పట్టిన ప్రభుత్వం.. ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకుపైగా నీళ్లందించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాదీ వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి.. రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించడానికి చర్యలు చేపట్టింది. గోదావరి డెల్టాకు ఈ నెల 15 నుంచి నీళ్లందించడానికి జల వనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కృష్ణాలో వరద ప్రవాహం.. గోదావరిలో నీటి మట్టం 14 మీటర్లకు దాటగానే కృష్ణా డెల్టాకు నీళ్లందించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం పెరగగానే.. వంశధార, తోటపల్లి, మడ్డువలస తదితర ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మిగతా ప్రాజెక్టుల్లోకి చేరే వరద ప్రవాహం, నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీళ్లందించడంపై నీటి పారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశాల్లో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాల ప్రారంభంలోనే నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్)తో పాటు రాష్ట్రంలోనూ సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటం.. దుర్భిక్ష రాయలసీమలో అప్పుడే బాహుదా, హంద్రీ వంటి నదుల్లో వరద ప్రవాహం ప్రారంభం కావడాన్ని నీటి పారుదల రంగ నిపుణులు మంచి శకునాలుగా అభివర్ణిస్తున్నారు. గతేడాది ఇదే రోజుతో పోల్చితే ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు 88.26 టీఎంసీలు అధికంగా ఉన్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అంచనా వేసింది. ఆ అంచనాల మేరకు సమృద్ధిగా వర్షాలు కురిస్తే గతేడాది కంటే ముందుగానే ఈ ఏడాది ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంటుంది. గత రెండేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ ఖరీఫ్‌లో గరిష్ట స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల ఈ నెల 1 నుంచి ఆదివారం వరకు 16.21 మి.మీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 29.90 మి.మీల వర్షం కురింది. నెల్లూరు మినహా మిగతా 12 జిల్లాల్లోనూ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. దుర్భిక్ష రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనూ సాధారణం కంటే సగటున 170 శాతం అధిక వర్షపాతం కురవడం గమనార్హం. నైరుతి రుతు పవనాల ప్రారంభ దశలోనే రాష్ట్రంతోపాటు.. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులు నిండాలంటే 557.53 టీఎంసీలు అవసరం ► రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు అప్పుడే నదుల్లో వరద ప్రవాహం ప్రారంభమైంది. చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు బాహుదా నది ఉరకలెత్తడంతో ఎన్టీఆర్ జలాశయం నిండింది. దాంతో గేట్లు ఎత్తి దిగువకు వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పెన్నాలో వరద ప్రవాహం ప్రారంభమైంది. సోమశిల ప్రాజెక్టులోకి 6,600 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కర్నూలు జిల్లాలో హంద్రీ నది ద్వారా గాజులదిన్నె, శ్రీశైలం ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద ప్రవాహం చేరుతోంది. నాగావళి, వంశధారలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. ► కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, వెలిగోడు, గాజులదిన్నె, అవుకు తదితర ప్రాజెక్టుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 601.13 టీఎంసీలు. ప్రస్తుతం 230.78 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ నిండాలంటే 370.35 టీఎంసీలు అవసరం. కృష్ణా బేసిన్లో ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో గతేడాది కంటే ఈ ఏడాది అధికంగా నీటి నిల్వలు ఉన్నాయి. బేసిన్లో సమృద్ధిగా వర్షాలు కురిస్తే గతేడాది కంటే ఈ ఏడాది ముందుగానే కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం చేరే అవకాశం ఉంటుంది. గతేడాది తరహాలోనే వరద ఉధృతి కొనసాగితే బేసిన్లో ప్రాజెక్టులన్నీ త్వరగా నిండే అవకాశం ఉంటుంది. ► పెన్నా బేసిన్లో ఎన్నడూ లేని రీతిలో ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీరు నిల్వ ఉంది. బేసిన్లో మొత్తం ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 261.58 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 146.57 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ నిండాలంటే 115.01 టీఎంసీలు అవసరం. పెన్నాలో ఆదిలోనే వరద ప్రవాహం ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే ప్రాజెక్టులన్నీ నిండే అవకాశం ఉంటుందని నిపుణుల అంచనా. ► గోదావరిలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. రాష్ట్రంలో గోదావరి బేసిన్లో ప్రాజెక్టుల నీటి నిల్వ 12.56 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.09 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► వంశధార, నాగావళి, ఏలేరు తదితర నదుల్లో వరద ప్రవాహం ప్రారంభమైంది. ఈ బేసిన్లలో ప్రాజెక్టుల పూర్తి స్థాయి నీటి నిల్వ 107.08 టీఎంసీలు.. ప్రస్తుతం 42.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు నిండాలంటే 64.69 టీఎంసీలు అవసరం. వరుసగా మూడోసారి సకాలంలో నైరుతి రుతు పవనాలు మూడేళ్లుగా వాతావరణం అనుకూలంగా మారడంతో నైరుతి రుతుపవనాలు సకాలంలో విస్తరిస్తున్నాయి. రుతుపవనాలు ఇలా రావడం గత 23 ఏళ్లలో ఇదే ప్రథమం. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాతావరణ పరిస్థితి.. లానినో ప్రభావంతో సముద్రంలో వేడి తగ్గడం రుతు పవనాల గమనానికి అనుకూలంగా మారింది. 2019 నుంచి లానినో ఉంది. ప్రస్తుతం లానినో వల్ల వాతావరణం చల్లబడి వర్షాలు బాగా కురుస్తున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. మన రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏటా 566 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సివుంది. లానినో వల్ల గత ఏడాది సాధారణం కంటే ఎక్కువగా 720 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రుతు పవనాలంటే.. భూమధ్య రేఖ నుంచి ప్రయాణించే గాలులు ఎత్తుగా ఉన్న హిమాలయాలు అడ్డు రావడంతో అక్కడ ఆగిపోతాయి. వాటినే నైరుతి రుతు పవనాలుగా పిలుస్తారు. ఆ గాలుల్లో తడి శాతం ఎక్కువగా ఉండడం వల్ల మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. అక్కడ ఆగిపోయిన ఆ గాలులు మళ్లీ భూమధ్య రేఖ వైపు వెనక్కి వస్తాయి. వీటిని ఈశాన్య రుతు పవనాలుగా పిలుస్తారు. ఈ గాలుల్లో తడి శాతం తక్కువగా ఉండడం వల్ల పెద్దగా వర్షాలు పడవు. ఎలినినో, లానినో అంటే.. పసిఫిక్ మహాసముద్రంలో సాధారణం గాలులు భూమధ్య రేఖ వెంబడి పడమటి వైపు వీస్తూ దక్షిణ అమెరికా నుండి ఆసియా వైపు వేడి నీటిని పీల్చుకుంటాయి. ఆ నీటిని భర్తీ చేయడానికి, చల్లటి నీరు సముద్రం లోతుల నుండి పైకి వస్తుంది. అక్కడ వీచే గాలులను అడ్డుకునే వాతావరణ పరిస్థితులను ఎలినినో, లానినో అంటారు. వీటి ప్రభావం అన్ని సముద్రాలపైనా పడి వాతావరణ, పర్యావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఎలినినో మన దేశంలో సాధారణ వాతావరణ పరిస్థితులను అడ్డుకుంటుంది. ఇది ఉంటే వర్షాలు పడవు. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. లానినో ద్వారా అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. సాధారణంగా ఇవి 9 నుండి 12 నెలల వరకు, కొన్నిసార్లు సంవత్సరాలపాటు ఉంటాయి. రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలు అంతటా విస్తరించాయి. రాయలసీమ.. తెలంగాణ, మహారాష్ట్రల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించాయి. సోమవారం సాయంత్రం నాటికి దక్షిణాంధ్ర జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయని, రాగల రెండు రోజుల పాటు కోస్తా, సీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో నంబులపూలకుంటలో 11 సెం.మీ, చినమండెంలో 9, ఊటుకూరులో 8, సంబెపల్లె, అనంతపురంలో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
వేగంగా విస్తరిస్తున్న ‘నైరుతి’
సాక్షి,అమరావతి/నెట్వర్క్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్నాయి. శుక్రవారం రాయలసీమలోకి ప్రవేశించిన రుతుపవనాలు శనివారం నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాలను తాకాయి. శనివారం రాత్రికి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో విస్తరించే వీలుందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఇదే వేగం కొనసాగితే రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని చెప్పారు. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రతోపాటు రాయలసీమలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని తెలిపారు. వేగంగా కదులుతున్న రుతుపవనాలు.. నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన తర్వాత మన రాష్ట్రాన్ని తాకేందుకు సాధారణంగా ఐదు రోజుల సమయం పట్టేది. రాష్ట్రమంతా వ్యాపించడానికి కనీసం 10 నుంచి 15 రోజుల సమయం పట్టేది. కానీ ఈ సంవత్సరం కేరళను తాకిన 24 గంటల్లోపే మన రాష్ట్రంలోనూ రుతుపవనాలు విస్తరించాయి. రెండు, మూడు రోజుల్లోనే రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించే పరిస్థితి నెలకొంది. యాస్ తుపాను, ఇతర వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాలు చల్లబడిపోవడం రుతుపవనాలకు అనుకూలించిందని, దీంతో కేరళను తాకిన తర్వాత రుతుపవనాలు అత్యంత వేగంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. పలుచోట్ల వర్షాలు రుతుపవనాల ప్రభావంతో శనివారం రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తిరుపతి, తిరుమలతోపాటు తిరుపతి రూరల్, రేణిగుంట మండలాల్లో శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఏకధాటిగా కుండపోత వానపడింది. అనంతపురం జిల్లాలోని 58 మండలాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా నల్లచెరువులో 65.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, సీతారాంపురం, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. వరికుంటపాడు మండలం కొత్తపల్లి గ్రామంలో పిడుగుపడి 30 గొర్రెలు మృతి చెందాయి. కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 26 మండలాల్లో వర్షం కురిసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షం కురిసింది. పిడుగుపాటుతో రాష్ట్రంలో శనివారం ముగ్గురు మృతిచెందారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలోని మావిళ్లపాడు దళితవాడకు చెందిన గ్రామ వలంటీర్ శ్రీలత(31) పిడుగుపాటుతో మృతిచెందగా, ప్రకాశం జిల్లా హెచ్‌ఎంపాడు మండలంలో ఒకరు, గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో ఒకరు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో 25.8 మిల్లీమీటర్లు, నెల్లూరులో 19.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కర్నూలు జిల్లా తుగ్గలిలో 15.8, విశాఖ జిల్లా పెదబయలులో 13.8, చిత్తూరు జిల్లా రామకుప్పంలో 12.5, గుంటూరులో జిల్లా వినుకొండలో 11.8, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 11.5 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు నమోదైంది. -
Southwest Monsoon: 'నైరుతి' పలకరింపు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించాయి. రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు శుక్రవారం తాకాయి. గురువారం కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు శుక్రవారం దక్షిణ అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతం, లక్షద్వీప్, కేరళ మొత్తం వ్యాపించాయి. ఏపీతో పాటు, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోను ఇవి వ్యాపించినట్లు అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. ఈ నెల 7, 8 తేదీల్లో కోస్తాలోని కృష్ణాజిల్లా వరకు, అనంతరం నెమ్మదిగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు, 11వ తేదీన ఉత్తరాంధ్ర అంతటా రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యంలో మూడురోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కర్ణాటక నుంచి భారీ మేఘాలు రాయలసీమ వైపుగా విస్తరిస్తుండటంతో శనివారం అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీవర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. మరోవైపు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడి అనేకచోట్ల వర్షాలు పడ్డాయి. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలోని ఎక్కువచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలో 55 మండలాలకుగాను 47 మండలాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షం కురిసింది. అనంతపురంలో 12 సెంటీమీటర్లు, నంబులిపులికుంటలో 10, రాప్తాడులో 9, రాయచోటి, సింగనమలల్లో 8, లక్కిరెడ్డిపల్లె, సెత్తూరు, అమరపురాల్లో 7, ధర్మవరంలో 6, కంబదూరు, మదనపల్లె, ఓక్‌లలో 5, నెల్లిమర్ల, అరకు, కైకలూరు, బ్రహ్మసముద్రం, ఊటుకూరు, గుర్రంకొండ, కూనుర్పి, తాడిమర్రి, కనెకల్లు, తాడిపత్రి, సంబపల్లె, కల్యాణదుర్గంలలో 4 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిశాయి. . పిడుగులుపడి ఇద్దరి మృతి గుడుపల్లె/మదనపల్లె టౌన్: చిత్తూరు జిల్లాలోని గుడుపల్లె, మదనపల్లె మండలాల్లో శుక్రవారం పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. గుడుపల్లె మండలం తిమ్మనాయనపల్లెలో పిడుగుపాటుకు మునెప్ప (50) ప్రాణాలు కోల్పోయాడు. మదనపల్లె మండలం ఈశ్వరమ్మకాలనీకి చెందిన వారు మైదానంలో క్రికెట్ ఆడుకుంటుండగా పిడుగుపడింది. ఆడుకుంటున్న 8 మంది గాయపడ్డారు. వీరిలో ఆటోనడుపుకొంటూ జీవనం సాగించే ఎస్.రోషన్ (25) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన ఆరీఫ్ (25)ను తిరుపతి ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. -
మూడు రోజుల పాటు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఆగ్నేయ అరేబియాలో నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. రుతుపవనాలు గురువారం కేరళను తాకనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాల రాక వల్ల అకాల వర్షాలు వస్తాయని, ఆ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రా, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బుధవారం రాష్టంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా నూజివీడులో 122 మిల్లీమీటర్లు, అగిరిపల్లిలో 109, తోటపల్లిలో 99, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 98.5, పలాసలో 50, కంచిలిలో 48, మెళియాపుట్టి, రాజాంలలో 47, ఇచ్ఛాపురంలో 46.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా బొండపల్లి, నెల్లిమర్లలో 44.25 మిల్లీమీటర్లు, సీతానగరంలో 41.5, విశాఖ జిల్లా కె.కోటపాడులో 34.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. ముంచంగిపుట్టు మండలంలోని బిరిగూడ, ముత్తగుమ్మి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. 23 పశువులు, 6 మేకలు మృత్యువాత పడగా.. ఓ పశువుల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. -
Southwest Monsoon: సకాలంలోనే రాష్ట్రానికి నైరుతి
సాక్షి, విశాఖపట్నం: ముందుగా అనుకున్నట్లుగానే రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకనున్నాయి. జూన్ 5 లేదా 6వ తేదీ నాటికి రాయలసీమని నైరుతి తాకనుంది. ఆ సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు విస్తరించి, దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు రానున్నాయి. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు విస్తరిస్తాయి. అలాగే, జూన్ 11 లేదా 12 నాటికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు విస్తరించనున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత పదేళ్ల రికార్డులను బట్టి చూసినా కూడా ఇదే తరహాలో నైరుతి విస్తరణ జరుగుతూ వస్తోందని వారు వివరిస్తున్నారు. గత రెండేళ్లు మాదిరిగానే.. ఈసారీ రుతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని, పంటలకు అనుకూలంగా వర్షాలు కురిసి అన్నదాతలకు మేలు చేకూరుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐఎండీ భిన్న ప్రకటనల్లో వాస్తవమెంత? తొలుత మే 31న నైరుతి కేరళని తాకనున్నట్లు కొద్ది రోజుల క్రితం భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటన చేసింది. ఆ తర్వాత ఆ ప్రకటనను మార్చి రుతుపవనాలు కాస్త ఆలస్యమవుతున్నాయని, జూన్ 3న కేరళని తాకనున్నాయని ఐఎండీ తాజాగా మరో ప్రకటన చేసింది. వాస్తవానికి మే 27 నాటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే అప్పటికే రుతుపవనాలు బలహీనంగా మారటంతో విస్తరణలో జాప్యం జరుగుతోందని, మరో రెండ్రోజుల్లో తిరిగి బలపడి విస్తరణలో వేగం పుంజుకుంటాయని స్పష్టం చేస్తున్నారు. రెండు రోజులపాటు వర్షాలు సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా దడ పుట్టించిన ఎండల తీవ్రత సోమవారం తగ్గింది. అక్కడక్కడా కొన్నిచోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి.మరోవైపు రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. అల్పపీడనాలు లేకపోవడం వల్ల.. నైరుతి రుతుపవనాలు సకాలంలోనే రాష్ట్రంలోకి రానున్నాయి. రుతుపవనాలు వచ్చిన తర్వాత తొలకరి వర్షాలు మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఇప్పటికే కేరళని తాకిన రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల వర్షాలు కేరళకు మాత్రమే పరిమితమైపోయాయి. అయినా త్వరలోనే వేగం పుంచుకుంటాయి. జూన్ నెలలో తొలి రెండు వారాల వరకు బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనాలు ఏర్పడే అవకాశం లేనందున రుతుపవనాలు విస్తరించనున్నాయి. – సాయి ప్రణీత్, వాతావరణ నిపుణుడు -
యాస్ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: యాస్ తుపాను గురువారం బలహీనపడి వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఇంకా బలహీనపడి తీవ్రత తగ్గుతుందని వివరించింది. ప్రస్తుతం జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్లు సూచిస్తూ, దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా లేదని స్పష్టం చేసింది. నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పూర్తిగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో చాలాభాగం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొంతభాగం వరకు బలమైన గాలులు ప్రవేశించాయని వివరించింది. రాష్ట్రానికి పశి్చమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నైరుతి రుతుపవనాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శని, ఆది, సోమవారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీలో ఓ మాదిరి వానలు పడతాయని వివరించింది. ఇక రాష్ట్రంలో గురువారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 22.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
Southwest Monsoon: రేపు ‘నైరుతి’
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి శుక్రవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. 22వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని పేర్కొంది. ఇది క్రమంగా బలపడి వాయవ్యదిశగా కదులుతూ తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపానుగా మారితే దీనికి యాస్ పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇది మే 26 నాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా రుతుపవనాల రాకకు సంకేతంగా తూర్పు, పశ్చిమ తీరాల్లో తుపాన్లు ఏర్పడుతుంటాయని చెబుతున్నారు. ఈ తుపాను ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండబోదని, కేవలం కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాగల రెండు రోజులు కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మాత్రం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు. -
సకాలంలోనే రుతుపవనాలు
సాక్షి, అమరావతి: నైరుతీ రుతుపవనాలు ఈసారి కూడా సకాలంలోనే రాష్ట్రంలో ప్రవేశిస్తాయని భారతీయ వాతావరణశాఖ అంచనా వేసింది. వ్యవసాయ రంగానికి ఎంతో కీలకమైన ఖరీఫ్ సీజన్ (జూన్ నుంచి సెపె్టంబర్ వరకు)లో కురిసే వర్షాలు నైరుతీ రుతుపవనాల ప్రభావంతో పడేవే. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈనెల 31న రుతుపవనాలు కేరళను తాకుతాయి. జూన్ 1కి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు తొలుత కేరళలో ప్రవేశిస్తుంటాయి. ఆరేబియా మహా సముద్రంలో ప్రస్తుతం ఏర్పడిన టౌటే తుపాను రుతుపవనాల రాకను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావంతో ఈనెల 21 నాటికే అండమాన్ నికోబార్ దీవుల నుంచి రుతుపవనాల కదలికలు ప్రారంభం కావచ్చని అంచనా. రుతుపవనాలకు ఒక నెల ముందు అరేబియా మహాసముద్రం లేదా బంగాళాఖాతంలో అల్పపీడనాలో, తుపాన్లో ఏర్పడుతుంటాయి. వీటివల్ల రుతుపవనాల్లో కదలిక వస్తుంది. అయితే ఈసారి అరేబియా మహాసముద్రంలో తుపాను వల్ల ఇప్పటికే కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, కర్ణాటక, గోవాలలో భారీవర్షాలు కురుస్తున్నాయి. మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఓమోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాల్లో మరో నాలుగైదు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, ఆ సమయానికి కాస్త అటు ఇటుగా రుతుపవనాలు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ప్రకటించింది. గత ఏడాది జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ ప్రకటిస్తే జూన్ 5న ప్రవేశించాయి. ఈసారి మాత్రం జూన్ ఒకటికి ఒకరోజు ముందే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. మే నెలలో అండమాన్‌లో వర్షాలు పడ్డాయంటే రుతుపవనాలు రాకడ ప్రారంభమైనట్టుగా భావిస్తుంటారు. రాష్ట్రంలో రెండురోజులు తేలికపాటి వానలు సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి గుజరాత్ వైపు తేమ గాలులు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో వచ్చే రెండురోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చెదురుమదురు వానలు పడే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ప్రత్తిపాడులో 3 సెంటీమీటర్లు వంతున వర్షపాతం నమోదైంది. -
రాయలసీమకు కాస్త తక్కువ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, న్యూఢిల్లీ: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. వరుసగా మూడో ఏడాదీ సాధారణ వర్షపాతం నమోదయ్యేలా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వెల్లడించింది. సాధారణ వర్షపాతం నమోదైతే దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడవు. ఏటా రుతుపవనాల సీజనుకు ముందు ఏప్రిల్, మే నెలల్లో ఐఎండీ నైరుతి రుతుపవనాల తీరుతెన్నుల (దీర్ఘకాలిక వ్యవధి సగటు–ఎల్పీఏ) అంచనాలను రూపొందిస్తుంది. ఈ అంచనాల తొలి నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజనులో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల పాటు ప్రభావం చూపుతాయి. ఐఎండీ 1961–2010 మధ్య కాలానికి దేశవ్యాప్తంగా ఎల్పీఏ సగటు 88 సెంటీమీటర్ల వర్షపాతంగా తేల్చింది. ఎల్పీఏ సగటు 96 నుంచి 104 శాతం (అంటే ఐదు శాతం ఎక్కువ లేదా తక్కువ) అంచనా వేస్తే.. ఆ ఏడాది సాధారణ వర్షపాతమని లెక్క. వచ్చే నైరుతిలో 98 శాతం వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. ప్రస్తుత నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో కోస్తా కంటే రాయలసీమలో వర్షాలు తక్కువగా కురిసే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు వర్ష సూచనలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఐఎండీ మే నెలలో రెండోవిడత నివేదిక విడుదల చేస్తే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటంతో ఎప్పుడూ మే 31 లేదా జూన్ మొదటి వారంలో కేరళని తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి 5 నుంచి 7 రోజుల ముందే వచ్చే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలోను సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భూశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రాజీవన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహపాత్రా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే తక్కువ, రాయలసీమలో కొన్నిచోట్ల సాధారణ వర్షపాతం, కొన్నిచోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. -
మొదలైన చలి ప్రభావం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన వేళ.. ఈశాన్య గాలుల ప్రభావం రాష్ట్రంలో మొదలైంది. పలుచోట్ల చలి ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత మొదలైంది. ఆరోగ్యవరంలో 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4.5 కి.మీ. ఎత్తు వద్ద నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతోంది. అదేవిధంగా తూర్పు బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాల్లో 1.5 కి.మీ. నుంచి 4.5 కి.మీ. మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
‘నైరుతి’ నిష్క్రమణం.. ‘ఈశాన్యం’ ఆగమనం
సాక్షి, విశాఖపట్నం: విస్తారమైన వానల్ని కురిపించిన నైరుతి రుతు పవనాలు సోమవారం రాష్ట్రం నుంచి నిష్క్రమించాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 28న నైరుతి రుతు పవనాలు వైదొలగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారత్‌పై దిగువ ట్రోపో ఆవరణం స్థాయిలో ఈశాన్య గాలులు ఏర్పడ్డాయి. ఇవి ముందుకు కదిలి.. కోస్తాంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్ఛేరి ప్రాంతాల్లో 28న వర్షాలతో ప్రవేశించనున్నాయని అధికారులు పేర్కొన్నారు. మొత్తానికి ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు 8.7 శాతం మిగులు వర్షపాతంతో వైదొలగనున్నాయి. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈశాన్య, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. రాగల రెండు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
రేపు తెలుగు రాష్ట్రాల నుంచి ‘నైరుతి’ నిష్క్రమణం
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు సోమవారం నిష్క్రమించనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహరాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కింతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాలుగు రోజుల్లో దేశం నుంచి నైరుతి నిష్క్రమణ పూర్తికానుందని పేర్కొంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో 1.5 నుంచి 3.1 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
అల్పపీడనాలే ఆదుకున్నాయ్!
సాక్షి, అమరావతి బ్యూరో: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో అల్పపీడనాలే ఆదుకున్నాయి. సీజన్ ఆరంభమైనప్పట్నుంచి ముగిసే వరకు బంగాళాఖాతంలో ఐదు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఒక్క వాయుగుండంగానీ, తుఫాన్గానీ ఏర్పడకుండానే సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జూన్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ ఆఖరు వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల్లో కనీసం రెండు వాయుగుండాలుగానీ, ఒకట్రెండు తుఫాన్లుగానీ వస్తుంటాయి. కానీ ఈసారి అలా జరగలేదు. అల్పపీడనాలే పుష్కలంగా వర్షాలు కురిపించి రైతులకు, రాష్ట్రానికి మేలు చేశాయి. వీటితో పాటు ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ద్రోణులు వంటివి మరో 12 వరకూ ఏర్పడ్డాయి. ఇవి కూడా రాష్ట్రంలో వర్షాలకు దోహదపడ్డాయి. కోస్తా కంటే సీమలోనే అత్యధిక వర్షపాతం సబ్ డివిజన్‌వారీగా చూస్తే కోస్తాంధ్ర కంటే ఈ సారి రాయలసీమలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అక్కడ 411.6 మి.మీల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 756.1 మి.మీల వర్షం కురిసింది. సీమలో అత్యధికంగా కడప జిల్లాలో 401.3 మి.మీలకు గాను 843.6 మి.మీలు నమోదైంది. ఇక కోస్తాంధ్ర (యానాంతో కలిపి)సబ్‌డివిజన్‌లో సాధారణ వర్షపాతం 586.9 మి.మీ కాగా, 725.3 మి.మీల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా మినహా.. రాష్ట్రంలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే లోటు వర్షపాతం నమోదైంది. అక్కడ 742.4 మి.మీలకు 558.5 మి.మీల వర్షపాతమే రికార్డయింది. నెలలవారీగా చూస్తే జూలైలో అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టులో స్వల్పంగానే వానలు పడా ్డయి. జూన్‌లో 32 శాతం, జులైలో 74 శాతం, ఆగస్టులో 6 శాతం, సెప్టెంబర్‌లో 58 శాతం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. పొంగుతున్న వాగులు, వంకలు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యా ప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, ఓర్వకల్లు మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పాపాఘ్ని నది ఉప్పొంగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో గరిష్టంగా 76.8 మి.మీ. వర్షం కురిసింది.విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అనంతపురం, జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలతో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు పలుచోట్ల కోతకు గురైంది. ఇక్కడి జియోట్యూబ్ రక్షణ గోడ పూర్తిగా ధ్వంసమైంది. కృష్ణమ్మకు మళ్లీ వరద ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 38,516 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. రాత్రి 7 గంటలకు రెండు గేట్లను 10 అడుగుల మేరకు తెరిచి మొత్తం 56,058 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 215.8070 టీఎంసీల నీరు నిల్వగా ఉండగా, డ్యామ్ నీటిమట్టం 885 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంలోకి ఆదివారం దాదాపు 52 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ముందు జాగ్రత్తగా 16 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
నైరుతి రాగం.. రైతుకు లాభం
సాక్షి, అమరావతి: ఊహించిన దాని కంటే అధిక వర్షాలు కురిపించిన నైరుతి రుతు పవనాలు అన్నదాతల్లో సంతోషాన్ని నింపాయి. వాతావరణ శాఖ అంచనాల కంటే ఈసారి రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌తోపాటు అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర, కుందూ, వంశధార, మహేంద్ర తనయ నదుల్లో వరద పోటెత్తడంతో భూగర్భ జలమట్టం పైకి వచ్చింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే.. ప్రస్తుత సీజన్లో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. జూన్ 1న ఆరంభమైన ప్రస్తుత ఖరీఫ్ సీజన్ (నైరుతి రుతు పవనాల కాలం) బుధవారంతో ముగియనుంది. ► నైరుతి సీజన్లో శ్రీకాకుళం, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లో సాధారణ, అధిక వర్షపాతం నమోదైంది. ► రాష్ట్రంలో సాధారణ సగటు వర్షపాతం 549.1 మిల్లీమీటర్లు కాగా.. ప్రస్తుత సీజన్లో 691.6 మిల్లీమీటర్ల (26 శాతం అధికం) వర్షపాతం నమోదైంది. ► మొత్తం 670 మండలాలకు గాను 437 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ► 173 మండలాల్లో సాధారణ.. 57 మండలాల్లో లోటు, 3 మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. ► వైఎస్సార్ జిల్లాలో అత్యధికంగా 76.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పెరిగిన సాగు ► మంచి వర్షాలు కురవడంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. గత ఏడాది ఖరీఫ్‌లో 32.64 లక్షల హెక్టార్లలో పంటలు వేయగా.. ఈ ఏడాది ఈ నెల 23వ తేదీ నాటికే సాగు విస్తీర్ణం 34.05 లక్షల హెక్టార్లకు చేరింది. ► వారం రోజుల్లో సాగులోకి వచ్చే పంటల్ని చేరిస్తే సాగు విస్తీర్ణం 35 లక్షల హెక్టార్లకు చేరుతుందని అంచనా. ► గత ఏడాది 5.30 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేయగా.. ఈ ఏడాది ఈ నెల 23వ తేదీ నాటికే 6.62 లక్షల హెక్టార్లకు చేరింది. ► గత ఖరీఫ్‌లో 13.71 లక్షల హెక్టార్లలో వరి సాగవగా.. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే 14.35 లక్షల హెక్టార్లకు చేరింది. ► నూనెగింజల సాగు విస్తీర్ణం గత ఖరీఫ్‌లో 5.81 లక్షల హెక్టార్లు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 7.16 లక్షల హెక్టార్లకు పెరిగింది. -
దేశంలో నైరుతి నిష్క్రమణ మొదలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య భారతం (పశ్చిమ రాజస్థాన్, పంజాబ్ పరిసర ప్రాంతాల నుంచి) నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణంగా ఈ నెల 20 నాటికి రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించేవి. కానీ.. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి అక్టోబర్ మొదటి వారం నుంచి వీటి నిష్క్రమణ ఉంటుందని అధికారులు తెలిపారు. నైరుతి నిష్క్రమణం ప్రారంభం కావడంతో.. ఈశాన్య రుతుపవనాల కాలం మొదలైందని చెప్పారు. అక్టోబర్ రెండో వారంలో ఇవి రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ఈశాన్య రుతుపవనాలతో సీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు ► ఈశాన్య రుతుపవనాల కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ► రానున్నది తుపాన్ల కాలమనీ.. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో తుపానులు ఏర్పడే సూచనలున్నాయని అంటున్నారు. ► రాష్ట్రంలో ఈ నైరుతి కాలంలో ఇప్పటివరకు సాధారణం కంటే 43 శాతం అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. నేడు రాయలసీమకు భారీ వర్ష సూచన ► ఏపీ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి 3.1 కిమీ ఎత్తు వరకూ కొనసాగుతోంది. ► అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4.5 నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఉంది. ► దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం సీమలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. -
24 గంటల్లో ‘నైరుతి’ వెనక్కి
సాక్షి, హైదరాబాద్: వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ మొదలు కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ రాజస్తాన్, పరిసర ప్రాంతాల్లో ఇందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు తెలి పింది. జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి ప్రభా వంతో దాదాపు మూడున్నర నెలలపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వర్షాలు కురవడంతో 90 శాతానికి పైగా చెరువులు నిండాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థి తులు ఏర్పడటంతో సోమవారా నికల్లా ఇవి పశ్చిమ రాజస్తాన్, పరిసర ప్రాంతాల్లో నిష్క్రమించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 107 సెం.మీ. వర్షపాతం.. వర్షాకాలంలో తెలంగాణ వ్యాప్తంగా 70.7 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈసారి ఏకంగా 107.0 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు వాతా వరణ శాఖ వెల్లడించింది. జూన్ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశించగా... అప్పట్నుంచి ప్రతి నెలలో కూడా సాధారణ వర్ష పాతం కంటే అధికంగా వానలు కురిశాయి. ఆగస్టు, సెప్టెంబర్ లలో సాధారణం కంటే రెట్టింపు వానలు కురవడంతో రికార్డు స్థాయిలో ప్రాజెక్టులు నిండి గేట్లు తెరుచుకున్నాయి. గతేడాదిఇదే సీజన్లో కేవలం 77.6 సెంటీమీటర్ల వర్షం కురిసి సాధారణ వర్షపాతాన్ని నమోదు చేసింది. కొనసాగుతున్న ఉపరితల ద్రోణి... దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది తూర్పు బిహార్, దాన్ని ఆనుకొని ఉన్న సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్ వైపు కొనసాగుతోంది. అదేవిధంగా సిక్కింలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు పశ్చిమ బెంగాల్, కోస్తా ఒడిశా మీదుగా సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. -
వాన భళా.. సాగు కళ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో అధిక వర్షాలు నమోదుకావడంతో సాగు కళ సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 72.78 లక్షల (70%) ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి సాగైన పంటల విస్తీర్ణం కంటే ఇది దాదాపు రెట్టింపని వ్యవసాయ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం కోటి 25 లక్షల ఎకరాల్లో సాగును ప్రతిపాదించినప్పటికీ, గత ఐదేళ్ల సాగు ఆధారంగా వ్యవసాయ శాఖ సాధారణ సాగు అంచనాలను లెక్కిస్తుంది. దీని ప్రకారం రాష్ట్రంలో ఈ వానా కాలంలో కోటి 3 లక్షల ఎకరాల సాధారణ సాగు అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా పత్తి సాధారణ సాగు అంచనా 44.50 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 113 శాతం సాగు చేశారు. పత్తి పంటనే అధికంగా సాగైంది. ప్రభుత్వం నియం త్రిత సాగులో భాగంగా 60.16 లక్షల ఎకరాల్లో పత్తి పంటను ప్రతిపాదించగా ఇప్పటికే 50.41 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇక ఇప్పుడిప్పుడే వరి నాట్లు పుంజుకుంటు న్నాయి. వరి 27.25 లక్షల ఎకరాల సాధారణ సాగుకుగాను 6.42 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. అలాగే జొన్న సాధారణ సాగు 1.19 లక్షల ఎకరాలు కాగా 96,198 ఎకరాల్లో, కందు లు 7.61 లక్షల ఎకరాలకుగాను 7.44 లక్షల ఎకరాల్లో, పెసర్లు 2.21 లక్షల ఎకరాలకు గాను 1.04 లక్షల ఎకరాల్లో, మినుములు 68,584 ఎకరాలకుగాను 36,408 ఎకరాల్లో వేశారు. మొత్తం పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 8.86 లక్షల ఎకరాలుగా నమోదైంది. మొక్కజొన్న సాధారణ సాగు అంచనా 11.76 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికే 1.23 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సోయాబీన్ 4.88 లక్షల ఎకరాలకుగాను 3.65 లక్షల ఎకరాల్లో వేశారు. ఇప్పటికే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వందశాతం సాగు పూర్తయింది. మరో 11 జిల్లాల్లో 76% నుంచి 100% మధ్యలో సాగు నమోదైంది. మూడు జిల్లాల్లో 25 % కంటే తక్కువగా పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొంది. ఇప్పటికి అధిక వర్షపాతమే... రాష్ట్రంలో నైరుతి రుతు పవనాల ప్రభావంతో 22 జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. 10 జిల్లాల్లో సాధారణ వర్ష పాతం రికార్డయింది. నిర్మల్ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైనట్లు నివేదికలో పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలతో ఈ సీజన్లో 720.4 మిల్లిమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. జూన్ లో 34% అధికంగా వర్షం కురిసింది. ఇక జూలైలో 244.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా బుధవారం నాటికి 145.8 మిలిమీటర్లు్ల కురిసిందని వ్యవసాయశాఖ తెలిపింది. -
జోరుగా వర్షాలు
నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకటి రెండు జిల్లాలు మినహాయించి విస్తారంగా వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వానలు పడటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల రహదారులపైకి నీరు చేరడంతో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లోకి నీరు చేరింది. గుంటూరు జిల్లాలోని ఎత్తిపోతల జలపాతం జలకళను సంతరించుకుంది. సాక్షి నెట్వర్క్: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. పలు జిల్లాల్లో వాగులు పొంగుతున్నాయి. పొలాలు నీట మునిగాయి. ► కృష్ణా జిల్లా లింగగూడెం వద్ద గండి వాగు పొంగటంతో పెనుగంచిప్రోలు–విజయవాడ మధ్య.. మరోవైపు ముండ్లపాడు మీదుగా నందిగామ, విజయవాడకు రాకపోకలు స్తంభించాయి. జి.కొండూరు మండలంలో పులివాగుపై కల్వర్టు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ► తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో వరి చేలు ముంపు బారినపడ్డాయి. విశాఖ, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. మరో మూడు రోజులు వర్షాలు ► వచ్చే మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. ► ఈ నెల 18న కోస్తాంధ్ర, 19న ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. -
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులపాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో 1.5 నుంచి నుంచి 7.6 కిలోమీటర్ల త్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని స్పష్టం చేసింది. సముద్ర తీరంలో ఏర్పడిన గాలుల కలయిక (షియర్ జోన్) ప్రభావంతో ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అదేవిధంగా... నైరుతి రుతుపవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో మరో రెండు రోజులపాటు రాష్ర్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు రాష్ర్ట వ్యాప్తంగా చాలాచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. (నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన )