![Low pressure turning to be Cyclone says Indian Meteorological Department - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/11/TOOFAN.jpg.webp?itok=eaZ-mb05)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల ఇది తదుపరి నాలుగైదు రోజుల్లో మరింత బలపడి తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇది దిశ మార్చుకుని బర్మా మీదుగా ప్రయాణించనుంది.
బర్మా సమీపానికి వెళ్లిన తర్వాత మళ్లీ దిశ మార్చుకుని దక్షిణ ఒడిశా వైపు రానుంది. ఫలితంగా ఈ తుపాను ప్రభావమంతా ఒడిశాపైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండురోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 17న రాష్ట్రాన్ని తాకాల్సిన ఈశాన్య రుతుపవనాలు 23 లేదా 24వ తేదీన వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఒకటిరెండు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నట్లు పేర్కొంది.
పిడుగులకు ఇద్దరి దుర్మరణం
పొదలకూరు/దొరివారిసత్రం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం చెందారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. నేదురుమల్లి గ్రామంలో పశువుల్ని మేతకు తోలుకెళ్లిన కోవూరు పెంచలనాయుడు (42), దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాళెం ఎస్సీ కాలనీలో గొర్రెల్ని మేతకు తోలుకెళ్లిన తిరునామల్లి నవీన్ (21) పిడుగులు పడి ప్రాణాలు కోల్పోయారు. నేదురుమల్లికి చెందిన కోవూరు రత్నమ్మ తీవ్రంగా గాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment