Cyclones
-
తుపాన్లు తలొంచుతున్నాయ్..! వారం రోజుల ముందే హెచ్చరికలతో..
మాండాస్, సిత్రాంగ్, అసానీ, గులాబ్, బిపర్ జోయ్. పేరు ఏదైనా కానివ్వండి ఆ తుపాను ఎంత తీవ్రమైనదైనా కానివ్వండి మనం తట్టుకొని నిలబడుతున్నాం. 1990,–2000నాటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు తుపాన్లు, వరదలంటే భారీగా ప్రాణ నష్టాలే జరిగేవి. ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ముందస్తుగా తుపాన్లను గుర్తించి పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాల్ని ఇస్తోంది. గుజరాత్లో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన తరలించడంతో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. తుపాన్ల సన్నద్ధతలో ఒడిశా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆ రాష్ట్ర చర్యలకు ఐక్యరాజ్య సమితి కూడా శభాష్ అనడం విశేషం. అది 1999 సంవత్సరం అక్టోబర్ 29. ఒడిశా ప్రజలకు అదో కాళరాత్రి. పారాదీప్ సూపర్ సైక్లోన్ రాష్ట్రంపై విరుచుకుపడింది. సముద్రం అలల ధాటికి 14 జిల్లాల్లో భారీ విధ్వంసం జరిగింది. జగత్సింగ్పూర్ జిల్లాకి జిల్లాయే తుడిచిపెట్టుకుపోయింది. తుపాను దెబ్బకి 10 వేల మంది జలసమాధి అయ్యారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 30 వేల మంది వరకు ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారని ఒక అంచనా. అప్పట్లో భారత వాతావరణ కేంద్రం దగ్గర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. దీంతో తుపాను ముంచుకొస్తోందని కేవలం 48 గంటల ముందు మాత్రమే తెలిసింది. వాతావరణ శాఖ అధికారులు ఒడిశా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినప్పటికీ సన్నద్ధత లేని కారణంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 వేలు నుంచి 30 వేల మంది మరణిస్తే, 3.5 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు గ్రామాలే నీళ్లలో కొట్టుకుపోయాయి. 25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెండు లక్షల జంతువులు మరణించాయి. గంటకి 250 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నాశనమైంది. ఒడిశాతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ పెను విధ్వంసంతో అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తుపాన్లు ఎదుర్కోవడంలో నవీన పంథా సూపర్ సైక్లోన్ ముంచెత్తిన తర్వాత సంవత్సరం 2000లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నవీన్ పట్నాయక్ తుపాన్లు ఎదుర్కోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. సూపర్ సైక్లోన్ తుపాను బీభత్సం నుంచి అప్పటికి ఇంకా రాష్టం కోలుకోలేదు. భౌగోళికంగా ఒడిశా తుపాన్ల తాకిడిని తప్పించుకోవడం అసాధ్యం. 1891 నుంచి 100కి పైగా తుపాన్లు ఒడిశాను వణికించాయి. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం నవీన్ పట్నాయక్ ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు ► రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా ఒక రాష్ట్రం విపత్తు నిర్వహణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయడం అదే మొదటి సారి. జిల్లాలు, బ్లాక్ స్థాయిలో కూడా విపత్తు కమిటీలు ఏర్పాటు చేశారు. 22 వేల గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక యువకుల్ని సభ్యులుగా నియమించారు. తుపాను హెచ్చరికలు అందిన వెంటనే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే వీరు చేయాల్సిన పని ► రాష్ట్రంలోని 480 కి.మీ. పొడవైన తీర ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లపై ప్రజల్ని అప్రమత్తం చేయడానికి 2018లో ప్రభుత్వం ఎర్లీ వార్నింగ్ డిస్సెమినేషన్ సిస్టమ్ (ఈడబ్ల్యూడీఎస్) ఏర్పాటు చేసింది. తుపాన్లు ముంచుకొస్తే లోతట్టు ప్రాంత ప్రజలకి కనీసం అయిదారు రోజుల ముందే హెచ్చరికలు అందుతాయి. ► తీర ప్రాంతాల్లో నివసించే వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చింది ► ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లో బాగా విస్తరించి సుశిక్షితులైన సిబ్బందిని 20 రెట్లు పెంచింది. వారి దగ్గర 66 రకాల ఆధునిక పరికరాలు అంటే జనరేటర్లు, చెట్లను కట్ చేసే, రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు, పడవలు, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ వంటివి ఎప్పుడూ ఉండేలా చర్యలు తీసుకుంది. ► 1999 సూపర్ సైక్లోన్ సమయం నాటికి ఒడిశాలో కేవలం ఆరు జిల్లాల్లో కేవలం 23 శాశ్వత తుపాను శిబిరాలు ఉండేవి. తీర ప్రాంతాల్లో అడుగడుక్కీ బహువిధాలుగా ఉపయోగపడే శిబిరాలు నిర్మించారు. ఇప్పుడు వాటి సంఖ్య 870కి చేరుకుంది. ఒక్కో శిబిరంలో వెయ్యి మంది వరకు తలదాచుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రశంసలు 2013 సంవత్సరంలో ఫాలిని అత్యంత తీవ్రమైన తుపానుగా ఒడిశాను ముంచెత్తింది. అప్పుడు భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ తుపాను సమయంలో లక్షలా ది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఒడిశా ప్రభుత్వ సహాయక చర్యలకు ఐక్యరాజ్యసమితి ఫిదా అయింది. ఒడిశా ప్రభుత్వం చారిత్రక విజయాన్ని సాధించిందని అభినందించింది. కేంద్రం మూడంచెల వ్యవస్థ బిపర్జోయ్ మహా తుపాను గుజరాత్లో విధ్వంసం సృష్టించినా ప్రాణ నష్టం జరగలేదు. దీనికి తుపాన్లపై ముందస్తు సన్నద్ధతే కారణం. తుపాను ముప్పుని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం మూడంచెల వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ పనితీరుతో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాలు కాపాడగలిగారు. తుపాన్లు ఎప్పుడు ఏర్పడతాయి? ఏ దిశగా ప్రయాణిస్తాయి, ఎక్కడ తీరం దాటుతాయన్న అంశాలను వారం రోజులు ముందుగానే గుర్తించే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజల్లో తుపాన్లపై అవగాహన పెరుగుతుంది. ఇక రెండో అంచెగా శిబిరాల నిర్మాణం, ప్రజల్ని తరలించడం ఒక యుద్ధంలా చేస్తారు. ఇక మూడో దశలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్లో విద్యుత్ లైన్లు, మంచినీటి పైపుల నిర్మాణం, రైల్వే, విమానాశ్రయాల్లో రాకపోకలు సాగేలా ఏర్పాట్లు వంటి వాటిపై దృష్టి పెట్టింది. ఫలితాలు ఇలా..! ప్రకృతి వైపరీత్యాలతో జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించలేకపోయినా ప్రాణలైతే కాపాడగలుగుతున్నాం. గత కొద్ది ఏళ్లలో ఒడిశాను అల్లకల్లోలం చేసిన తుపాన్లలో ప్రాణనష్టం తగ్గుతూ వస్తోంది. -
‘నైరుతి’కి తంటా!.. ఆ రెండు తుపానుల వల్లే..
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు మోకా, బిపర్జోయ్ తుపానులు ప్రతిబంధకాలుగా మారాయి. రుతుపవనాల ప్రవేశం నుంచి విస్తరణ వరకు ఇవి అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ఫలితంగా ఒకవైపు వడగాడ్పులు విజృంభిస్తుంటే మరోవైపు వర్షాలకు బ్రేకులు పడుతున్నాయి. సాధారణంగా అండమాన్ సముద్రంలోకి ప్రవేశంతో ‘నైరుతి’ ఆగమన ప్రక్రియ ఆరంభమవుతుంది. అక్కడ నుంచి బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించి పది రోజుల్లో జూన్ ఒకటో తేదీ నాటికి కేరళను తాకుతాయి. అనంతరం వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది అండమాన్ సముద్రంలోకి నిర్ణీత సమయానికి రెండ్రోజుల ముందే అంటే మే 18 నాటికే రుతుపవనాలు ప్రవేశించాయి. అక్కడ నుంచి అవి బంగాళాఖాతంలోని ఇతర ప్రాంతాలకు చాలా నెమ్మదిగా విస్తరించాయి. దీంతో ఈ రుతుపవనాలు కేరళలోకి వారం రోజులు ఆలస్యంగా ఈ నెల 8న ప్రవేశించాయి. ఆ తర్వాత కూడా అవి ఆశించినంతగా చురుకుదనాన్ని సంతరించుకోలేదు. ఫలితంగా వర్షాలు కురవడం లేదు. పైగా రోహిణీకార్తె వెళ్లి మృగశిర కార్తె ప్రవేశించినా ఇంకా రోహిణిని తలపించే ఉష్ణోగ్రతలే (42–45 డిగ్రీల వరకు) నమోదవుతున్నాయి. వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకా ఈనెల 18 వరకు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ రెండు తుపానుల వల్లే.. రుతుపవనాల ప్రవేశానికే కాదు.. వాటి విస్తరణలో ఆలస్యానికి ఇటీవల సంభవించిన తుపానులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత నెల 9న బంగాళాఖాతంలో ‘మోకా’ తుపాను ఏర్పడింది. అనంతరం అది అత్యంత తీవ్ర తుపానుగా మారి బంగ్లాదేశ్ వైపు పయనించి తీరాన్ని దాటింది. దీంతో బంగాళాఖాతంలోని తేమను ఈ తుపాను అటు వైపు లాక్కుని పోయింది. దీంతో రుతుపవనాలు బంగాళాఖాతంలోకి వేగంగా విస్తరించకుండా, ఆపై కేరళలోకి సకాలంలో ప్రవేశించకుండా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈనెల 8న నైరుతి రుతుపవనాలు కేరళను తాకినా ఆ తర్వాత కూడా మందగమనమే కొనసాగుతోంది. తాజాగా అరేబియా సముద్రంలో ఈనెల 6న ‘బిపర్జోయ్’ తుపాను సంభవించింది. ఈ తుపాను కూడా అత్యంత తీవ్ర తుపానుగా బలపడి గుజరాత్ వైపు పయనిస్తోంది. ఈ తుపాను కూడా ‘మోకా’ మాదిరిగానే నైరుతి రుతుపవనాల వేగానికి కళ్లెం వేసింది. అరేబియా సముద్రంలోని తేమను తుపాను ప్రభావిత ప్రాంతం వైపు తీసుకెళ్లిపోవడంతో రుతుపవనాలు ఆశించినంతగా విస్తరించడం లేదు.. వర్షించడం లేదు. వాస్తవానికి సాధారణ పరిస్థితులుంటే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించి విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉంది. అయితే ఇప్పటికీ రాయలసీమలో ఒకట్రెండు చోట్ల అరకొరగా మినహా రాష్ట్రంలో ఎక్కడా రుతుపవనాల వర్షాలు కురవడం లేదు. ఇంకా రాష్ట్రంలో ఎక్కడైనా అడపా దడపా వానలు కురుస్తుండడానికి రుతుపవనాల ఆగమనానికి ముందస్తుగా ఏర్పడే థండర్ స్టార్మ్ (ఉరుములు, మెరుపులు, పిడుగులు ఈదురుగాలులతో కూడిన వాతావరణం) పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 18 తర్వాతే రాష్ట్రంలో రుతుపవనాల వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు. మందకొడిగా నైరుతి రుతుపవనాలు.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినా మందకొడిగా కదులుతున్నాయి. ఈ నెల 11వ తేదీన అవి శ్రీహరికోట వద్ద రాయలసీమను తాకినా ఆ తర్వాత పెద్దగా ముందుకు కదల్లేదు. ఈపాటికి రాయలసీమలోని అన్ని జిల్లాలకు విస్తరించి తెలంగాణ, కోస్తా జిల్లాల్లోకి ప్రవేశించాల్సివుంది. కానీ మంగళవారం నాటికి ఇంకా రాయలసీమలోనే పూర్తిగా విస్తరించలేదు. అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలకు కొద్దిమేర విస్తరించినా అక్కడ పెద్దగా వర్షాలు కూడా పడడంలేదు. ఈ నెల 16 వరకు రుతుపవనాలు ఇలా నెమ్మదిగానే కదిలే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖాదికారులు తెలిపారు. బిపర్జోయ్ తుపాను ప్రభావం 16వ తేదీ నుంచి తగ్గే అవకాశం ఉండడంతో ఆ తర్వాత రుతుపవనాల గమనంలో వేగం పెరుగుతుందని భావిస్తున్నారు. 20 నాటికి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పటి నుంచి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అక్కడక్కడా వర్షాలు పడుతున్నా అది నామమాత్రంగానే ఉంది. -
Andhra Pradesh: ఏడేళ్లు.. 10 వరదలు.. 6 తుపానులు
సాక్షి, అమరావతి: వరుస విపత్తులతో ఆంధ్రప్రదేశ్ వణుకుతోంది. తుపానులు, వరదలు, కరువు తరచూ ప్రజలకు కడగండ్లు మిగుల్చుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు పదిసార్లు వరదలు ముంచెత్తి రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఆరుసార్లు తుపానులు విరుచుకుపడ్డాయి. అల్పపీడనాలు, వాయుగుండాలు ఏటా మూడు, నాలుగుసార్లు పలకరించి నష్టాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ప్రస్తుత వరదలు బీభత్సం సృష్టించాయి. 2015 నవంబర్లోనూ ఇప్పటి మాదిరిగానే చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయ్యాయి. నవంబర్ 9 నుంచి 23 వరకు నెల్లూరు జిల్లా బలయపల్లెలో 100.5 సెంటీమీటర్లు, వైఎస్సార్ జిల్లా కోడూరులో 99.9, చిత్తూరు జిల్లా ఏర్పేడులో 87.5 సెంటీమీటర్ల వర్షం పడడంతో వరదలు ముంచెత్తాయి. ఆ వరదల్లో 81 మంది మృత్యువాతపడ్డారు. 2014లో వచ్చిన హుద్‌హుద్ తుపాను ఉత్తరాంధ్రలో పెను బీభత్సం సృష్టించింది. 2014 నుంచి 2018 వరకు వరుస కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2018లో భారీ వర్షాలు, రెండు తుపాన్లు, ఖరీఫ్–రబీ సీజన్లలో కరువు విరుచుకుపడ్డాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు మార్చుకుంటున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ముప్పు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీకి రెండో స్థానం దేశంలో ప్రకృతి వైపరీత్యాల ముప్పు ఎక్కువగా ఉన్న మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ (ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్) అధ్యయనం తేల్చింది. వరదలు, తుపానుల తీవ్రత ఏపీలో ఎక్కువని, విపత్తుల తీవ్రత అసాధారణంగా ఉన్న దేశంలోని ఐదు జిల్లాల్లో విజయనగరం ఒకటని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలు తరచూ విపత్తుల బారిన పడుతున్నాయని పేర్కొంది. 2005 నుంచి దేశంలో విపత్తుల తీవ్రత 200 శాతం పెరిగిందని, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్‌తోపాటు ఆ జిల్లాల్లోని భౌగోళిక పరిస్థితుల్లో మార్పులే దీనికి కారణమని వివరించింది. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ఫలితం రాష్ట్రానికి అనేక శతాబ్దాల నుంచి తుపానుల ముప్పు వుంది. కానీ.. కొన్నేళ్లుగా సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ దీనికి కారణం. దీనివల్ల తుపానుల ఉధృతి ఎక్కువగా ఉంటోంది. మరోవైపు వర్షం కురిసే రోజులు తగ్గిపోతున్నాయి. 30 రోజులు కురవాల్సిన వర్షాలు పది రోజుల్లోనే కురుస్తున్నాయి. దీనివల్ల వరదలు వస్తున్నాయి. ఎక్కువ రోజులు వర్షం పడకపోవడం (డ్రై స్పెల్స్) వల్ల కరువు వస్తోంది. రాష్ట్రంలో గత పదేళ్లుగా వర్షం కురిసే రోజులు తగ్గి డ్రై స్పెల్స్ పెరిగాయి. అందుకే కరువు వస్తోంది. వేడి గాలుల తీవ్రత పెరిగింది. మారుతున్న వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణం. – డీవీ భాస్కరరావు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ మెటిరియలాజికల్ విభాగం -
నేడు అల్పపీడనం.. అనంతరం తుపాను
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల ఇది తదుపరి నాలుగైదు రోజుల్లో మరింత బలపడి తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇది దిశ మార్చుకుని బర్మా మీదుగా ప్రయాణించనుంది. బర్మా సమీపానికి వెళ్లిన తర్వాత మళ్లీ దిశ మార్చుకుని దక్షిణ ఒడిశా వైపు రానుంది. ఫలితంగా ఈ తుపాను ప్రభావమంతా ఒడిశాపైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండురోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 17న రాష్ట్రాన్ని తాకాల్సిన ఈశాన్య రుతుపవనాలు 23 లేదా 24వ తేదీన వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఒకటిరెండు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నట్లు పేర్కొంది. పిడుగులకు ఇద్దరి దుర్మరణం పొదలకూరు/దొరివారిసత్రం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం చెందారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. నేదురుమల్లి గ్రామంలో పశువుల్ని మేతకు తోలుకెళ్లిన కోవూరు పెంచలనాయుడు (42), దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాళెం ఎస్సీ కాలనీలో గొర్రెల్ని మేతకు తోలుకెళ్లిన తిరునామల్లి నవీన్ (21) పిడుగులు పడి ప్రాణాలు కోల్పోయారు. నేదురుమల్లికి చెందిన కోవూరు రత్నమ్మ తీవ్రంగా గాయపడింది. -
AP: ఈ నెలలో రెండు తుపానులు!
సాక్షి, విశాఖపట్నం: లానినా (సముద్ర వాతావరణం) పరిస్థితులతో పాటు హిందూ మహాసముద్రం డైపోల్ (ద్విధ్రువ) వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తుండటంతో బంగాళాఖాతంలో మరో రెండు తుపాన్లు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెల 14 లేదా 15వ తేదీన ఒక తుపాను, 21 తర్వాత మరో తుపాను రానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ తుపానులతో రాష్ట్రంలో సాధారణం కంటే అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదు కానుందని చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా ఈశాన్య గాలులు, ఉత్తరాంధ్ర మీదుగా వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో ఈశాన్య గాలుల ప్రభావంతో కామవరపుకోటలో 69.5 మిల్లీమీటర్లు, విజయవాడ, మంగళగిరిలో 56.3, అనంతగిరిలో 56, సత్తెనపల్లిలో 54, గుంతకల్లులో 49.5, అద్దంకిలో 47.5, గొలుగొండలో 44.5, జి.కొండూరులో 43.8, విస్సన్నపేటలో 42, నల్లజర్లలో 40.5, కొయ్యూరులో 38.7 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. చదవండి: ఆర్బీకేలు అద్భుతం.. కళ్లారా చూశా.. చాలా బాగున్నాయ్ -
ఇవి ప్రమాద సంకేతాలు
రెండు నెలలు... రెండు తుపాన్లు! రెండింటి మధ్యా వ్యవధి 14 రోజులు మాత్రమే. ఈ రెండూ భారీ నష్టం కలిగించే తుపానులని వాతావరణ విభాగం ప్రకటించింది. ఒకపక్క కరోనా మహమ్మారిని ఎదుర్కొనడం ఎలాగో తెలియక సామాన్యులు సతమతమవుతూ ఉపాధి లేక, తిండి దొరక్క కష్టాలు పడుతుండగా వచ్చిపడిన ఈ విపత్తులు తూర్పు, పడమర తీరాలను వణికించాయి. ఇందులో ఒకటి– మే నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ తుపానైతే, రెండోది అరేబియా సముద్రంలో ఏర్పడి బుధవారం ముంబై సమీపంలో తీరం దాటిన నిసర్గ. అంపన్ 1999 తర్వాత బంగాళా ఖాతంలో ఏర్పడ్డ అతి పెద్ద తుపాను. ప్రత్యేకించి పశ్చిమబెంగాల్‌కు 200 ఏళ్లలో ఇంత భారీయెత్తున ఎప్పుడూ తుపాను రాలేదు. అది సృష్టించిన విలయం, విధ్వంసం అంతా ఇంతా కాదు. తుపాను విరుచుకుపడిన రాత్రి 72మంది చనిపోగా వేలాది వృక్షాలు నేలకొరిగాయి. భారీగా పంట నష్టం సంభవించింది. అంపన్ తుపాను వల్ల లక్ష కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో ఒకటైన కోల్‌కతా చివురుటాకులా వణికింది. ఒడిశా కూడా పెను నష్టం చవిచూసింది. నిసర్గ సైతం అదే స్థాయిలో భయపెట్టింది. ముంబై మహానగరం వందేళ్లలో కనీవినీ ఎరుగనంతగా విధ్వంసాన్ని చవిచూడక తప్పదని వాతా వరణ నిపుణులు అంచనా వేశారు. అయితే ముంబై ముప్పును తప్పించుకుంది. 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచడం, ఇళ్లు కూలడంవంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఆరుగురు మరణించారు. పొరుగునున్న గుజరాత్లో కూడా ముప్పు తప్పించుకుంది. వెంటవెంటనే వచ్చిన ఈ రెండు తుపానులకూ మూల కారణాలు పర్యావరణ విధ్వంసంలోనే వున్నాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో ఏర్పడే తుపానులన్నీ సముద్ర జలాలు వేడెక్కడం వల్లే సంభవిస్తాయి. సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలు 26.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు మించి పెరిగితే తుపానులు ఏర్పడతాయని నిపుణులంటారు. మొన్న మార్చిలో ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా వుండే ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) విడుదల చేసిన నివేదిక చూస్తే పర్యావరణానికి ఏ స్థాయిలో ముప్పు ఏర్పడుతున్నదో అర్థమవుతుంది. భూతాపం కారణంగా వాతావరణంలో కలుగు తున్న మార్పులు మానవజీవనంపై పెను ప్రభావం చూపబోతున్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆర్కిటిక్ సముద్రంలో మంచు పలకలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, పర్యవసానంగా వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుని సాంఘికార్థిక అభివృద్ధి, ప్రజారోగ్యం, వలసలు పెను సమస్యలుగా మారతాయని, ఆహార భద్రతకు ముప్పు ఏర్ప డుతుందని తెలిపింది. ప్రపంచ దేశాల వాతావరణ విభాగాలు, అంతర్జాతీయ నిపుణులు, వివిధ దేశాలకు చెందిన శాస్త్ర, సాంకేతిక పరిశోధన సంస్థలు వగైరాలతో సంప్రదించి ఏటా ఈ నివేదిక రూపొందిస్తారు. ప్రపంచంలో పర్యావరణ పరిస్థితి ఏవిధంగా వున్నదో అంచనా వేయడానికి హవాయీ దీవుల్లో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. అక్కడ మొన్న జనవరి, ఫిబ్రవరి నెలల్లో కార్బన్ డై ఆక్సైడ్ కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగిందని నిపుణులు నిర్ధారించారు. ఈమధ్యే బ్రిటన్ వాతావరణ విభాగం ప్రపంచ ఉష్ణోగ్రతలు వచ్చే నాలుగేళ్లలో 1.06 డిగ్రీల సెంటి గ్రేడ్ నుంచి 1.62 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య పెరిగే అవకాశం వున్నదని తెలిపింది. కర్బన ఉద్గారాలు 1990 స్థాయిలో కనీసం 60 శాతం తగ్గకపోతే ప్రకృతి వైపరీత్యాలు ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాలుస్తాయని పాతికేళ్లనాడే నిపుణులు తేల్చిచెప్పారు. అయినా ప్రభుత్వాలు మేల్కొనకపోవడంతో నానాటికీ భూగోళానికి ముప్పు ఎక్కువవుతోంది. డబ్ల్యూఎంఓ తొలి నివేదిక విడుదల చేసిన 1994లో వాతావరణంలో కార్బన్‌డై ఆక్సైడ్ పరమాణువుల స్థాయి 357 పీపీఎం కాగా, ఇప్పుడది 414.11 పీపీఎం. నిరుటితో పోల్చినా అది 3 పీపీఎంలు పెరిగింది. పరిస్థితి ఇంతగా క్షీణిస్తున్నప్పుడు తరచుగా ఉత్పాతాలు విరుచుకుపడటంలో ఆశ్చర్యం ఏముంది? తాజా నివేదిక చూసైనా ప్రపంచ దేశాల వైఖరిలో మార్పొస్తుందని ఆశిస్తున్నామని డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ పెటెరీ తాలస్ అంటున్నారు. ముఖ్యంగా వచ్చే నవంబర్‌లో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరగబోయే వాతావరణ సదస్సులో తమ నివేదికను ప్రముఖంగా ప్రస్తావిస్తామని, వచ్చే పదేళ్లలో 2010నాటి స్థాయి కర్బన ఉద్గారాల్లో 45 శాతం కోత పడేందుకు అనువైన కార్యాచరణను సమష్టిగా రూపొందించుకోవాలని కోరుతామని చెబుతున్నారు. ఇంతవరకూ జరిగిన ప్రపంచ వాతా వరణ సదస్సుల వాలకం చూస్తే గ్లాస్గో సదస్సు ఫలితంపై ఎవరికీ పెద్దగా ఆశలు ఏర్పడవు. ఒకపక్క పర్యావరణానికి ముప్పు ముంచుకొస్తున్నదని చెప్పినా ఏ దేశమూ చిత్తశుద్ధితో నివారణ చర్యలపై దృష్టి పెట్టడం లేదు. పర్యవసానంగానే అంపన్, నిసర్గ వంటి తుపానులు విరుచుకుపడుతున్నాయి. నిసర్గ తుపాను వాస్తవానికి వాతావరణ శాస్త్రవేత్తలను పరుగులెత్తించింది. అల్పపీడనంగా వున్న దశలోనే తుపాను హెచ్చరిక జారీ చేయడం మన వాతావరణ విభాగం చరిత్రలో తొలిసారి నిసర్గ విషయంలోనే జరిగిందని అధికారి చెప్పారంటే అది మొదటినుంచి ఎంత దుందుడుకుగా వున్నదో ఊహించవచ్చు. సాధారణంగా అల్పపీడనం వాయుగుండంగా మారినప్పుడో, అది తీవ్ర వాయు గుండంగా మారినప్పుడో మాత్రమే తుపాను హెచ్చరిక జారీచేస్తారు. కానీ ఉన్నట్టుండి ఏర్పడ టమేకాక, పెనువేగంతో అది కదిలింది. నిసర్గ జూన్ 1న వాయుగుండంగా మారి, ఆ మర్నాటికే తీవ్ర వాయుగుండంగా, వెంటనే తుపానుగా పరివర్తనం చెందింది. అంపన్ మాత్రం మూడురోజుల తర్వాత తుపానుగా మారింది. తమ అభివృద్ధి నమూనాలను మార్చుకుంటామని ఈ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రపంచ దేశాలు ప్రతినబూనితేనే పరిస్థితి తెరిపిన పడుతుంది. భూగోళం సురక్షితంగా వుంటుంది. -
తుపానుల వలయంలో ముంబై
సాక్షి, న్యూఢిల్లీ : మరోసారి మహారాష్ట్రలోని ముంబై నగరానికి ‘నిసర్గ’ రూపంలో తుపాను వచ్చి పడింది. సముద్ర తీరమంతా అల్లకల్లోలంగా మారింది. వంద కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు చెట్లు చేమలు కూలిపోతున్నాయి. ముంబై నగరానికి తుపానులు, అధిక వర్షాల బెడద కొత్తకాదు. తరచుగా వస్తూనే ఉంటాయి. ఎంతో కొంత నష్టాన్ని తెస్తూనే ఉంటాయి. 2005, జూలై 26వ తేదీన కురిసిన కుంభవృష్టికి 447 మంది మరణించగా, అపార నష్టం సంభవించింది. నగర ప్రజలు ఆనాటి భయోపాతాన్ని ఇప్పటికీ మరచిపోలేక పోతున్నారు. (ముంబైని తాకిన నిసర్గ తుఫాను) 1618, మే 15న, 1742, సెప్టెంబర్ 11, 1887, జూన్ 15వ తేదీన సంభవించిన భారీ తుపానులు సృష్టించిన బీభత్సం అంతా ఇంతకాదు. అపార ప్రాణ, ఆస్తి నష్టాలను సృష్టించిన ఈ తుపానులు నగర చరిత్ర పుటల్లో నిలిచిపోయాయి. ఈ తుపానులు వచ్చినప్పుడు నగరంలో కుంభవృష్టి కురవడంతోపాటు సముద్రం అల్లకల్లోలమైంది. ఫలితంగా రాయల్ షిప్పులైన సోమర్సెట్, సాలిస్‌బరి ముఖ భాగాలు విరిగిపోయాయి. పలు ఇతర నౌకలు లంగర్లను తెంపేసుకొని రోడ్డ మీద వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ముంబై టౌన్ హాలు ముందున్న గార్డెన్లలో నడుం లోతు వరకు నీళ్లు వచ్చాయి. 1740, నవంబర్ 9, 1762, మార్చి 7, 1799, నవంబర్, 1854లో వచ్చిన ఓ మోస్తరు తుపానుల వల్ల కూడా దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ఎంతో నష్టం జరిగింది. ఇక ఈ తుపానుల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే జే. జర్సన్ డా కున్హా రాసిన ‘ది ఆరిజిన్ ఆఫ్ బాంబే’ చదవాల్సిందే. (నిసర్గ అలర్ట్: ఏం చేయాలి.. ఏం చేయకూడదు?!) -
తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు?
‘అంఫన్’ తుపాను.. ప్రస్తుతం విరుచుకుపడుతోంది. ‘అంఫన్’ అత్యంత తీవ్రమైన తుపాను అని, 1999 తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతి పెద్ద తుపానుగా భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. అసలు తుపానులకు పేర్లు ఎవరు.. ఎందుకు.. ఎలా పెడతారో తెలుసుకుందామా..? (అల్ల కల్లోలంగా ఉప్పాడ తీరం) సాక్షి, విశాఖటప్నం: హుద్‌హుద్.. తిత్లీ.. పెథాయ్ పేర్లు వేరైనా ఇవన్నీ మన రాష్ట్రంలో విరుచుకుపడిన తుపానులు. వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకే తుపానులకు పేర్లు పెట్టడం ఆనవాయితీ. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయాసియాలో దేశాలే తుపానులకు పేర్లు పెడుతున్నాయి. ఉదాహరణకు తిత్లీ పేరును పాకిస్థాన్, గజను శ్రీలంక సూచించాయి. తాజాగా ఒడిశా, పశ్చిమ బంగాలను భయపెడుతున్న తుపానుకు అంఫన్ అని పేరు పెట్టింది థాయ్‌లాండ్. అంఫన్ అంటే థాయిలాండ్ భాషలో ఆకాశం అని అర్థం. ప్రస్తుత జాబితాలో చివరి పేరు అంఫన్.. కనీసం 61 కి.మీ. వేగం గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అమెరికాలో తుపాన్లను టోర్నెడోలని, చైనాలో ఏర్పడే వాటిని టైఫూన్స్, హిందూ మహాసముద్రంలో సంభవించే వాటిని సైక్లోన్స్ అని పిలుస్తారు. అలాగే ఆ్రస్టేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుపాన్లను విల్లీవిల్లీస్, వెస్ట్ ఇండీస్ (పశ్చిమ ఇండీస్) దీవుల్లోని తుపాన్ల ను హరికేన్స్ అంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపానులకు పేర్లు పెట్టడం 2004 సెపె్టంబరులో మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుపాన్లకు పేర్లు పెట్టారు. ఎవరైనా సరే తుపాన్లకు పేర్లు పెట్టవచ్చు. భారత వాతావరణ విభాగానికి ఈ పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమోదిస్తే ఆ పేరు భారత తరపున జాబితాలో చేరుతుంది. (కృష్ణా జలాల వినియోగంలో రికార్డు) 2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి. దీంతో ఈ దేశాల సంఖ్య 13కు చేరుకుంది. ఏప్రిల్‌లో ఈ దేశాలు 169 పేర్లు సూచించాయి. తర్వాత వచ్చే తుపానులకు నిసర్గా (బంగ్లాదేశ్), గతి(భారత్), నివార్ (ఇరాన్), బురేవి (మాల్దీవులు), తౌక్టే (మయన్మార్), యాస్ (ఒమన్) పిలుస్తారు. భారతదేశం గతితో పాటు తేజ్, మురాసు, ఆగ్, వ్యోమ్, జహర్, ప్రోబాహో, నీర్, ప్రభాజన్, ఘుర్ని, అంబుడ్, జలాధి, వేగా వంటి పేర్ల సూచించింది. వాతావరణ శాఖ నిబంధనల మేరకే ఈ పేర్లు పెడతారు. ఉచ్ఛరించడానికి సులువుగా, ఎనిమిది అక్షరాల లోపే పేర్లు ఉండాలి. ఎవరి భావోద్వేగాలు, విశ్వాసాలను దెబ్బతీయకూడదు. -
ఇది తుపాన్ల సమయం
తూర్పు తీరానికి ఇది తుపాన్ల సమయమే. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ ఈ ప్రాంతాన్ని తుపాన్లు పలకరిస్తుంటాయి. 50 ఏళ్లలో పది పెద్ద తుపాన్లను జిల్లావాసులు చూశారు. వాటిలో రెండు పెను విషాదాన్ని నింపాయి. తూర్పుగోదావరి, అమలాపురం: బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పు తీరం తరచూ తుపాన్ల బారిన పడుతూనే ఉంది. సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో తుపాన్లు వస్తుంటాయి. అర్ధశతాబ్ద కాలంలో పది పెద్ద తుపాన్లను తూర్పు తీరం చవిచూసింది. వాటిలో 1969, 1996లో వచ్చిన పెనుతుపాన్లకు జిల్లా భారీ మూల్యం చెల్లించుకుంది. అవి వందల కోట్ల ఆస్తినష్టమే కాదు.. భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. 1969లో వచ్చిన పెను తుపానులో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. 1996 నవంబర్ 6వ తేదీ రాత్రి వచ్చిన పెను తుపాను కోనసీమకు కాళరాత్రిని మిగిల్చిం ది. తీరంలో ఐదు నుంచి పది మీటర్ల ఎత్తున రాకాశి ఆలలు ఎగిసిపడ్డాయి. ఈ తుపానుకు సుమారు 560 మంది మృత్యువాత పడ్డారు. ఐ.పోలవరం మండలం బలుసుతిప్ప, భైరవపాలెం, కాట్రేనికోన మండలం చిర్రయానాం, పల్లం, మగసానితిప్ప, కొత్తపాలెం, బలుసుతిప్పలో వందలాది మత్స్యకారులు మృత్యువాత పడ్డారు. వేట పడవలు కొట్టుకుపోయాయి. ఈ తుపాను వేళ గంటకు 200 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తొలుత తూర్పు నుంచి పడమరకు, తరువాత పడమర నుంచి తూర్పునకు పెనుగాలులు వీయడంతో కొబ్బరిచెట్లు ఈనుల్లా విరిగిపడ్డాయి. సుమారు 80 వేల ఎకరాల్లో కొబ్బరికి నష్టం వాటిల్లింది. 24 లక్షల కొబ్బరిచెట్లు నేలకు ఒరిగిపోగా, 33 లక్షల చెట్లు మొవ్వులు విరిగిపడ్డాయి. రహదారులపై భారీ వృక్షాలు పడ్డాయి. కొన్ని గ్రామాలకు వెళ్లడానికి అధికారులకు వారం రోజులుపైనే పట్టింది. 1996 తరువాత కొబ్బరికి నష్టం చేసిన తుపాన్లలో 2013 నవంబర్ 18న వచ్చిన హెలెన్ తుపాను ఒకటి. ఈ తుపానుకు కోనసీమలో 80 వేల కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. 2010లో ఏకంగా రెందు తుపాన్లు జిల్లాను ముంచెత్తాయి. దీనిలో లైలా విచిత్రంగా మే నెలలో సంభవించగా, అదే ఏడాది నవంబరు నెలలో జల్ తుపాను వచ్చింది. ఇవి కాకుండా వాయుగుండాలు, అల్పపీడ ప్రభావంతో భారీ వర్షాలు కురవడం వందలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిడం జిల్లాలో పరిపాటే. నష్టాల పాల్జేసిన తుపాన్లు సంవత్సరం తుపానుపేరు వచ్చిన తేదీ 1969 ను తుపాను డిసెంబర్ 6 1996 పెను తుపాను మే 17 2010 లైలా నవంబర్ 1 2010 జల్ అక్టోబర్ 28 2012 నీలం నవంబర్ 18 2013 హెలెన్ అక్టోబర్ 7 2014 హుద్‌హుద్ డిసెంబర్ 17 (తుని, ఏలేశ్వరం మండలాలు మాత్రమే) 2018 పెథాయ్ డిసెంబర్ 17 -
పెథాయ్ ప్రత్యేకత
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: సాధారణంగా తుపాన్లు సముద్ర తీర ప్రాంతంలో భూమిని తాకుతాయి. భూ ఉపరితలంపై కొద్ది దూరం ప్రయాణించాక బలహీనపడిపోతాయి. కానీ, సోమవారం తూర్పు గోదావరి తీరాన్ని తాకిన పెథాయ్ తుపాను మిగతా వాటికి భిన్న మైనది. ఇది తీరాన్ని దాటిన తర్వాత దిశను మార్చుకొని, సముద్రంలోకి వెళ్లింది. మళ్లీ రాత్రికి తూర్పుగోదావరిలోని తుని వద్ద రెండో సారి తీరాన్ని తాకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెథాయ్ తొలుత సోమవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కాట్రేనికోన – యానాంల మధ్య సోమవారం మధ్యాహ్నం తీరాన్ని దాటింది. వాస్తవానికి తుపాను తీరాన్ని దాటి భూమిపైకి వచ్చాక బలహీనపడుతుంది. అంతా అలాగే అనుకున్నారు. కానీ కాసేపటికే దిశను మార్చుకొని యానాం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి వెళ్లింది. సముద్రం మీదుగా ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ తీవ్ర వాయుగుండంగా బలహీనపడి సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కాకినాడకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ సోమవారం రాత్రి తుని వద్ద రెండోసారి తీరాన్ని తాకింది. ఇలా ఒకే తుపాను రెండుసార్లు భూమిని తాకడం చాలా అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సముద్ర తీరం వంపు కలిగి ఉండటం, తుపాను తన దిశను వేగంగా మార్చుకోవడం వల్ల ఈ విధంగా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా అరుదు ఇలాంటి ఘటనలు దశాబ్దాల తర్వాత సంభవిస్తుంటాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. డిసెంబరు నెలలో ఉపరితల గాలుల ప్రభావం వల్ల తుపానులు తీరం దాటాక కూడా దిశ మార్చుకోవడంతో ఇలాంటి పరిస్థితులేర్పడతాయని వాతావరణశాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. 1970 దశకంలో ఇలాగే జరిగిందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి ఒకరు వివరించారు. ‘సాధారణంగా తుపాను ఒకసారే తీరం దాటుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే తుపాను రెండుసార్లు కూడా తీరం దాటుతుంది. తాజాగా వచ్చిన ‘పెథాయ్’ కూడా అలాగే దాటింది. అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఇందుకు కారణం. పెథాయ్ తుపాను కాకినాడ – యానాం మధ్య తీరం దాటింది. ఈ ప్రాంతంలో భూమి ఆంగ్ల అక్షరం తిరగబడిన ‘యు’ ఆకారంలో సముద్రం లోపలకు ఉండి తిరిగి వెలుపలకు ఉంది. భూమి సముద్రం లోపలకు ఉన్న ప్రాంతంలో తుపాను తీరం దాటి అదే మార్గంలో వెళ్లడంతో మళ్లీ సముద్రంలోకి వెళ్లినట్లయింది. కొద్దిదూరం పోయిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి మరోసారి తీరాన్ని దాటింది. ఇలా అరుదుగా జరుగుతుంటాయి’ అని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం అధికారులు వైకే రెడ్డి, నాగరత్న ‘సాక్షి’కి వివరించారు. -
ఏపీని ఉదారంగా ఆదుకోండి
సాక్షి, అమరావతి: వరుస విపత్తుల వల్ల రాష్ట్రానికి కలిగిన తీవ్ర నష్టం గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరించి వీలైనంత ఎక్కువ ఆర్థికసాయం అందించేలా సిఫార్సు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర కరువు బృందానికి విజ్ఞప్తి చేశారు. అటు కరువు, ఇటు తుపాన్లు రాష్ట్రానికి ఏటా తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, అందువల్లే విభజన సమయంలోనే ఆంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని కోరానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు నష్టాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంతో శుక్రవారం సచివాలయంలో సీఎం భేటీ అయ్యారు. కేంద్ర బృందాల పర్యటనల్లో ఆయా జిల్లాల్లో వారు పరిశీలించిన అంశాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. కరువు వల్ల వరి, మొక్కజొన్న, జొన్న, శనగ తదితర ఆహార పంటలతోపాటు పొగాకు, పత్తి, మిర్చి తదితర వాణిజ్య పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని కేంద్ర బృంద సభ్యులు తెలిపారు. తాగునీటికి తీవ్ర ఎద్దడి ఉందని గమనించామన్నారు. వైఎస్సార్, కర్నూలు,చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పరిస్థితిని అధికారులు వివరించారు. నిబంధనలను సడలించాలి విపత్తు బాధిత రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రాయితీ చాలా స్వల్పమని సీఎం అన్నారు. ‘‘హెక్టారుకు వరికి కేంద్రం రూ. 13,800 కేంద్రం ఇస్తే, రాష్ట్రం మరో రూ. 1,200 అధికంగా రూ. 15 వేలు ఇస్తోంది. దేశంలో నెలకున్న ప్రస్తుత వ్యవసాయ సంక్షోభ పరిస్థితుల్లో కేంద్రం నిబంధనలను సడలించి రైతుల ఆదాయాలు రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండూ సమస్యల సాగుగా మారింది. అతికష్టం మీద తాగునీటిని సరఫరా చేస్తున్నాం. రాష్ట్రం 7 ఏళ్లుగా కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 9 జిల్లాల్లో 347 మండలాలను కరవు ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వర్షాభావంవల్ల 13.60 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 16.52 లక్షల చిన్న, సన్నకారు రైతులు నష్టపోయారు. రూ. 1,401.54 కోట్ల సహాయం కోరుతూ కేంద్రానికి నివేదిక పంపాం. కేంద్ర బృందాలు వీటిని సానుభూతితో పరిశీలించి ఏపీకి చేయూత అందించేలా చూడాలి’ అని చంద్రబాబు కోరారు. సమావేశంలో నీరజా అడిడాన్, శ్రీవాత్సవ, అజయ్ కుమార్, అమితవ్ చక్రవర్తి, ముఖేష్ కుమార్, విక్టర్ అమల్ రాజ్, రాజీవ్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. -
తుపాన్లు వస్తాయని చెప్పడం తప్పు
సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన పరిధి దాటడమే కాకుండా ఊహాగానాలను ప్రకటించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందంటూ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణ సమాచారా న్ని ఇస్రో నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపుతుండటంపై ఐఎండీ అసంతృప్తితో ఉంది. వచ్చే నెల (నవంబర్)లో మూడు తుపాన్లు వస్తాయంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వానికి ఇస్రో సమాచారం పంపడం, దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. దీంతో నవంబర్‌లో మూడు తుపాన్లు వస్తాయంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఐఎండీ ఖండించింది. ఇలాంటి తప్పుడు సమాచారంతో ప్రజలను భయపెట్టవద్దని సూచించింది. ‘తుపాన్లు ఎప్పుడు వస్తాయో ముందుగా గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం మనకు లేదు. అలాంటప్పుడు నవంబర్‌లో ఏకంగా మూడు తుపాన్లు వస్తాయని, చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండిపోతాయని, అప్రమత్తంగా ఉండాలని చెప్పడమంటే ప్రజలను భయపెట్టడమే కదా! ఇస్రో ఇలా చేయడం సరికాదు. మా విభాగం వ్యవహారాల్లో వేలుపెట్టి తప్పుడు (నిర్ధారణకాని) సమాచారం ఇవ్వడం గతంలో ఎన్నడూ చూడలేదు...’ అని వాతావరణశాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. పరోక్షంగా తప్పుబట్టిన డీజీ ఇస్రో తీరును ఐఎండీ డైరెక్టర్ జనరల్ (డీజీ) కేజే రమేశ్ ఇప్పటికే రెండుసార్లు పరోక్షంగా తప్పుపట్టారు. ‘ఇస్రో ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే పంపుతుంది. వాటిని విశ్లేషించి అదనపు సమాచారాన్ని జోడించి అల్పపీడనాలు వస్తాయా? లేదా అనే అంశాన్ని నిర్ధారించాల్సింది ఐఎండీనే. వాతావరణ మార్పులకు సంబంధించి ఇస్రో ఇచ్చే సమాచారం ఫైనల్ కాదు. ఇస్రో సమాచారాన్ని ఐఎండీకి పంపాలేగానీ నేరుగా ప్రకటించరాదు..పైగా మనకు ఇప్పటి వరకూ తుపాన్లు ఎప్పుడు వస్తాయో ముందుగా తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం లేదు. వాతావరణ సమాచారాన్ని ప్రజలకు, రైతులకు అందించే సాధికారత ఐఎండీకి మాత్రమే ఉంది’ అని కేజే రమేశ్ స్పష్టం చేశారు. తద్వారా ఇస్రో పరిధి దాటుతోందని చెప్పకనే చెప్పారు. -
తుఫాన్లపై అప్రమత్తం
విజయనగరం కంటోన్మెంట్: రానున్న రెండు నెలల్లో తుఫాన్లు సంభవించే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తం కావాలని కలెక్టర్ ఎంఎం నాయక్ సూచించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సైక్లోన్ మిటిగేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ హెచ్చరికలు అందగానే అధికార బృందం విధుల్లో చేరాలన్నారు. తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఏడు తీర ప్రాంతాల్లో ఏడుగురు ప్రత్యేకాధికారులను, శాఖల వారీగా అధికారుల బృందాలను నియమించామన్నారు. వీరంతా ఆయా గ్రామాల్లో పర్యటించి తుఫాన్ల అప్రమత్తతను పరిశీలించాలని ఆదేశించారు. గత అనుభవాలను తెలుసుకుని సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులను ఆనుకుని ఉన్న రైలు మార్గాలు, రోడ్డు మార్గాల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు గట్టు తెగినా, గండ్లు పడే అవకాశమున్నా మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఇసుక బస్తాలు, ఇతర సామగ్రిని సిద్ధం చేయాలన్నారు. తుఫాన్ షెల్టర్ల మరమ్మతులకు రూ.కోటీ ఎనిమిది లక్షలతో ప్రతిపాదనలు పంపించామని, నిధులు వచ్చిన వెంటనే పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్, గైడ్స్ విద్యార్థుల ఫోన్ నంబర్లతో సహా జాబితాను సిద్ధం చేయాలని డీఆర్వోకు సూచించారు. రక్షిత నీటి ప్రాజెక్టులకు మరమ్మతులు తాగునీటి సమస్య రాకుండా రక్షిత ప్రాజెక్టులకు మరమ్మతులు చేయించాలన్నారు. నీటిని పంపింగ్ చేసేందుకు జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకుని బోట్లను సిద్ధం చేసుకోవాలని మత్స్యశాఖ ఏడీ ఫణిప్రకాష్కు సూచించారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో సైక్లోన్ మిటిగేషన్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర మందులు, ఆహార పదార్థాలు సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్ఓ, పౌరసరఫరాల అధికారులకు సూచించారు. విపత్తుల శాఖ నుంచి మంజూరయ్యే సామగ్రిని భద్రపరిచేం దుకు శాశ్వత స్టోర్స్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ శ్రీకేశ్ బి లట్కర్, డీఆర్వో మారిశెట్టి జితేంద్ర, ఆర్డీఓలు ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్.గోవిందరావు, ఏఎస్పీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఒకేసారి రెండు వాయుగుండాలు
రెండ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఊపందుకోనున్న వర్షాలు కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు మత్స్యకారులు వేటకెళ్లొద్దని భారత వాతావరణ విభాగం హెచ్చరిక విశాఖపట్నం: దేశంలో ఇప్పుడు రెండు వాయుగుండాలు ప్రభావం చూపుతున్నాయి. వీటిలో ఒకటి ఈశాన్య బంగాళాఖాతంలోను, మరొకటి నైరుతి రాజస్థాన్‌కు ఆనుకుని గుజరాత్‌పైన కొనసాగుతున్నాయి. ఇలా ఒకేసారి రెండు వాయుగుండాలు ఏర్పడటం అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కదులుతోంది. ఇది రెండ్రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారి ఏపీలోని ఉత్తర కోస్తాపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతోంది. దీంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ చెదురుమదురు వానలు కురుస్తున్నాయి. దీనికి వాయుగుండం కూడా తోడవడంతో 30, 31, ఆగస్టు 1 తేదీల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నాటి బులెటిన్‌లో తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. ఒడిశా, బెంగాల్ సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశ నుంచి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు స్థానిక ప్రమాద సూచికను ఎగురవేశారు. మరోవైపు నైరుతి రాజస్థాన్ వద్ద కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరో రెండ్రోజుల్లో బలహీనపడనుంది. -
ఈ ఏడాది 10% అధికంగా ఉత్పత్తి: వైజాగ్ స్టీల్
న్యూఢిల్లీ: హుద్‌హుద్ తుపాన్ 10 రోజులపాటు ఉత్పత్తికి అంతరాయాన్ని కల్పించినప్పటికీ ఈ ఏడాది 10% వృద్ధిని సాధించగలమన్న ఆశాభావాన్ని ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్) వ్యక్తం చేసింది. వెరసి గత ఆర్థిక సంవత్సరం(2013-14)తో పోలిస్తే 10% అధికంగా 3.5 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేయగలమని అంచనా వేసింది. హుద్‌హుద్ కారణంగా అక్టోబర్ 12 నుంచి పది రోజులపాటు ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నదని కంపెనీ చైర్మన్ పి.మధుసూదన్ చెప్పారు. గతేడాది కంపెనీ చరిత్రలో కొత్త రికార్డును సృష్టిస్తూ 3.2 మిలియన్ టన్నుల సేలబుల్ స్టీల్‌ను ఉత్పత్తి చేసిన విషయం విదితమే. తుపాన్ ప్రభావం తరువాత కంపెనీ దశలవారీగా ఉత్పత్తి కార్యక్రమాలను మొదలుపెట్టింది. కాగా, ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో(ఏప్రిల్-అక్టోబర్) 1.86 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. గతేడాది ఇదే కాలంలో 1.77 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. -
హడలెత్తిస్తున్న అక్టోబర్
కోలుకోనివ్వని తుపాన్లు భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు మిగుల్చుతున్న పండుగల నెల 123 ఏళ్లలో 76 తుపాన్లు అక్టోబర్ నెలలోనే 31 విపత్తులు హైదరాబాద్: కోస్తా జిల్లాలను అక్టోబర్ వణికిస్తోంది. ఈనెల వచ్చిందంటే పెను తుపాన్లు ముంచేస్తాయని ప్రజల్లో కలవరం. కోతకొచ్చే దశలో పంటలు ధ్వంసమవుతాయని రైతుల్లో ఆందోళన. ప్రధానమైన దసరా, దీపావళి పర్వదినాలతో కూడిన ఈ నెలలోనే అధిక సంఖ్యలో తీవ్రమైన తుపాన్లు వచ్చి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగిస్తుండడమే ఇందుకు కారణం. ఈ ఏడాది కూడా అదే జరిగింది. గత ఏడాది అక్టోబర్ 10-15 తేదీల మధ్య పైలీన్, నవంబర్‌లో హెలెన్, లెహర్ తుపాన్లవల్ల కకావికలమైన సంఘటనలను ప్రజలు మరువకముందే ఈ ఏడాది హుదూద్ పెను విపత్తు ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టించింది. 1891 నుంచి అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకూ 76 తుపాన్లు సంభవించాయి. వీటిలో 31 అక్టోబర్‌లోనే రావడం గమనార్హం. అందుకే ఈ నెలను వాయుగుండాల (గండాల) మాసంగా విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అభివర్ణిస్తుంటారు. 123 ఏళ్లలో మొత్తం 76 తుపాన్లు రాగా అందులో 52 (మూడింట రెండొంతులు) అక్టోబర్, నవంబర్ నెలల్లోనే సంభవించాయి. రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద పెను విపత్తుగా నమోదైన దివిసీమ ఉప్పెన కూడా నవంబర్ నెలలోనే సంభవించడం గమనార్హం. 1977 నవంబర్ 15-20 తేదీల మధ్య సంభవించిన దివిసీమ ఉప్పెన పదివేల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ పెను విపత్తులో అధికారిక లెక్కల ప్రకారమే రెండున్నర లక్షల జంతువులు చనిపోయాయి. హా123 ఏళ్లలో అత్యధిక (23) తుపాన్లు నెల్లూరు జిల్లాలోనే తీరం దాటాయి. మరో 16 కృష్ణా జిల్లాలో తీరం దాటాయి. కోస్తాలోని తొమ్మిది జిల్లాలు సముద్రతీరంలోనే ఉన్నా నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనే ఎక్కువ తుపాన్లు తీరం దాటాయి. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క తుపాను కూడా తీరాన్ని దాటిన దాఖలాలు లేవు. ఇందుకు కారణాలేమిటనే విషయంపై పరిశోధనలు సాగించాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. హా1892 అక్టోబర్‌లో వారం వ్యవధిలోనే రెండు తుపాన్లు సంభవించినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. 1987 అక్టోబర్‌లో కేవలం పక్షం వ్యవధిలో మూడు తుపాన్లు ముంచెత్తాయి. ఒక్కోసారి వరుసగా నాలుగైదేళ్లలో తుపాన్లే రావు. కొన్నిసార్లు వరుసగా నెలలోనే రెండు మూడు తుపాన్లు వస్తుంటాయి. ‘ఇందుకు కారణాలేమిటో పరిశోధనల ద్వారానే తేలాల్సి ఉంది. ఇవి పరిశోధనలకు కూడా అందని ప్రకృతి రహస్యం అనేది నా అభిప్రాయం’ అని వాతావరణ శాఖకు చెందిన ఒక నిపుణుడు‘సాక్షి’తో అన్నారు. ఈశాన్యంలోనే తీవ్రం... మన రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కాలంలో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలో తుపాన్ల తీవ్రత అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అక్టోబర్‌లోనే మనకు ఎక్కువ తుపాను విపత్తులు సంభవిస్తుంటాయి. 1891 నుంచి గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఇప్పటిదాకా 76 తుపాన్లు వచ్చాయి. వీటిలో 31 విపత్తులు అక్టోబర్‌లోనే సంభవించడం గమనార్హం. జనవరి- ఏప్రిల్ మధ్య ఎన్నడూ తుపాన్లు రాలేదు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ నైరుతి రుతుపవనాలు ఉంటాయి. ఈ సమయంలో కూడా తుపాన్లు సంభవిస్తుంటాయి. నైరుతి రుతుపవనాల కాలంలో మన రాష్ట్రంలో ఇవి చాలా తక్కువే. ఈశాన్య రుతుపవనాల సమయంలో మాత్రం అధికంగా, తీవ్రంగా తుపాన్లు వచ్చి కోస్తా జిల్లాల్లో పంటలను ధ్వంసం చేయడమే కాకుండా విద్యుత్తు, రహదారి, సాగునీటి వనరుల వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పెను నష్టం కలిగించిన తుపాన్లన్నీ అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే రావడం గమనార్హం. ‘అక్టోబర్, నవంబర్ నెలల్లో సముద్ర ఉష్ణోగ్రతలు తుపాన్లకు చాలా అనువుగా ఉంటాయి. అల్పపీడనాలు తుపాన్లుగా మారుతుంటాయి. అందుకే ఈ నెలల్లోనే మనకు అత్యధిక తుపాన్లు, విపత్తు నష్టాలు సంభవిస్తుంటాయి’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రతినిధి నరసింహారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
పదేళ్లలో తుపాన్లు.. నష్టాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: గత పదేళ్లలో ఏడు తుపాన్లు జిల్లాపై దాడి చేశాయి. వీటిలో నాలుగు అక్టోబర్ నెలలోనే సంభవించి తీవ్ర నష్టం కలిగించాయి. ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్‌లో విరుచుకుపడిన పై-లీన్ తుపాను సుమారు రూ.వెయ్యి కోట్ల నష్టాల్లో ముంచెత్తింది. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు అంతే తీవ్రస్థాయిలో హుదూద్ తుపాను హడలుగొడుతోంది. 2003 నుంచి సంభవించిన తుపాన్లు, వాటిల్లిన నష్టాన్ని పరిశీలిస్తే... * 2003 అక్టోబర్ 6,7 తేదీల్లో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల 51 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. సుమారు 25వేల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. * 2004 అక్టోబరు 3, 4, 5 తేదీల్లో కురిసిన తుపాను వర్షాలకు 2,900 హెక్టార్లలో పంటలు పోయాయి. సుమారు 20 వేల మందిప్రజలు అవస్థలపాలయ్యారు. * 2005 సెప్టెంబరు 18,19 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు నాగావళి, వంశధార నదులకు వరదలు వచ్చాయి. ఈ నదుల పరివాహక ప్రాంతాల్లో 15వేల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. సుమారు 40 వేల మంది ప్రజలు నష్టపోయారు. * 2010 డిసెంబర్ 5-8 తేదీల మధ్య దాడి చేసిన జల్ తుఫాన్ అపార నష్టం మిగిల్చింది. సుమారు 3 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపింది. 1.60 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. పూరిళ్లు, కొన్ని చోట్ల పక్కా ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు వందల కోట్ల నష్టం వాటిల్లింది. * 2011 అక్టోబరులో సంభవించిన నీలం తుఫాన్ జిల్లాను అతలాకుతలం చేసింది. రెండేళ్ల క్రితం నాటి జల్ తుఫాన్‌తో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జిల్లా రైతాంగాన్ని ఇది మరింత కుంగదీసింది. * 2012 సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు లైలా తుఫాన్ దాడి చేసింది. దీని ఫలితంగా 3 లక్షల మంది ప్రభావితం కాగా 28వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. నలుగురు చనిపోగా, 24 పశువులు కూడా మృతి చెందాయి. వందల సంఖ్యలో పూరిళ్లు కూలిపోయాయి. సమాచార వ్యవస్థ, విద్యుత్, రోడ్లులకు భారీ ఎత్తున వందల కోట్లలో నష్టం సంభవించింది. * 2013 అక్టోబర్ 12న సంభవించిన పెను తుపాను పై-లీన్, అనంతరం కురిసిన భారీ వర్షాలకు ఉద్యాన, ఆహార పంటలు ఊడ్చుకుపోయాయి. సుమారు వెయ్యి కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. -
ముంచుకొస్తున్న మరో ముప్పు
అన్నదాతలపై ప్రకృతి కోపం మూడేళ్లుగా ముంచెత్తుతున్న వరుస తుపాన్లు ఇప్పుడు దూసుకొస్తున్న హుదూద్ అన్నదాతలపై ప్రకృతి పగబడుతోంది. అతివృష్టి, అనావృష్టిలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు కలవరపెట్టగా.. గత మూడేళ్లుగా లైలా నీలం, హెలెన్, రూపాల్లో తుపాన్లు పంటలను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు హుదూద్ రూపంలో తుపాను విరుచుకుపడుతోంది. వందల కిలోమీటర్లు దూరంలో ఉన్న ఇది ఈ నెల 12న విశాఖకు సమీపంలో తీరం దాటనుంది. ఈ సమయంలో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏటా నష్టాలను చవిచూస్తున్న అన్నదాతలు ఈ ఉపద్రవం ఎంత నష్టాన్ని మోసుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. విశాఖ రూరల్: ఖరీఫ్ ప్రారంభం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతుల పరిస్థితి దినదిన గండంగా ఉంటోంది. అతివృష్టి, అనావృష్టి జమిలీగా వెంటాడుతున్నాయి. రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి. ఏటా కరవు ఛాయలు నెలకొనడం, అష్టకష్టాలు పడి నాట్లు వేస్తే పంట చేతికొచ్చే సమయంలో తుపాన్లు విరుచుకు పడడం పరిపాటి అవుతోంది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 1,99,813 హెక్టార్లు. ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం వరుణుని కరుణతో అష్టకష్టాకోర్చి అన్నదాతలు 1,78,743 హెక్టార్లలో పంటలు చేపట్టారు. ఇందులో ప్రధానంగా వరి 88,893 హెక్టార్లలోను, చెరకు 37,459 హెక్టార్లలోను, రాగి 20,324 హెక్టార్లలోను సాగవుతోంది. కొద్ది రోజులుగా మళ్లీ వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు మండిపోవడంతో కొన్ని పంటలు వడలిపోతుండగా, ముఖ్యంగా వరికి తెగుళ్ల బెడద ఎక్కువైంది. గత 15 రోజులుగా అన్నదాతలు ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్ని చినుకులు రాలినా అనుకూలమే అనుకుంటున్నారు. అయితే ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో మాదిరి హుదూద్ తుపాను రూపంలో రైతులను కలవరానికి గురిచేస్తోంది. 2010లో ఝల్, 2011లో లైలా, 2012లో నీలం, 2013లో ఏకంగా లెహర్, హెలెన్, పైలిన్ తుపానుల్లా ఎక్కడ పంటలు ముంపునకు గురవుతాయోనన్న భయం రైతాంగంలో నెలకొంది. గతేడాది భారీ వర్షాలకు పడిన నదులు, చెరువులు, రిజర్వాయర్లు, కాలువ ల గండ్లు నేటికీ పూడ్చలేదు. దీంతో ఇసుక బస్తాలేసి గండ్లు పూడ్చి పంటలు కాపాడుకునేందుకు రైతులు అప్పుడే సిద్ధమవుతున్నారు. -
రైతుకేదీ బీ(ధీ)మా!
ముగిసిన గడువు లక్షన్నర మంది రైతులకు ఎదురుదెబ్బ పంటల బీమా గడువు ముగిసింది. రుణమాఫీపై ప్రభుత్వం తేల్చకపోవడంతో జిల్లా రైతాంగం బీమా ప్రీమియం చెల్లించ లేకపోయింది. దీంతో జిల్లాలో ప్రతి ఏటా బీమా పరిధిలోకి వచ్చే సుమారు లక్షన్నర మంది రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినపుడు రైతులకు ఎంతో కొంత అండగా ఉంటున్న బీమా ఈసారి లే కుండా పోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులకు బీమా వర్తించే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా పంట రుణాల కింద రూ.వెయ్యి కోట్లు వరకు బ్యాంకులు ఇస్తున్నాయి. పంటల బీమా పరిధిలోకి వచ్చే వరి, చెరకు వంటి పంటలను సాగుచేస్తూ బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్న రైతులు జిల్లాలో దాదాపు లక్షన్నర మంది వరకు ఉన్నారు. గతేడాది రూ.లక్ష అప్పు తీసుకున్న రైతు 5 శాతం ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. గత ఖరీఫ్‌లో జిల్లాలో రూ.600 కోట్లు రుణ లక్ష్యంగా కాగా 1,32,375 మందికి రూ.640 కోట్లు రుణాలు అందజేశారు. అలాగే గత రబీ సీజన్లో రూ.200 కోట్లు లక్ష్యానికి గాను 14,548 మంది రైతులకు రూ.104 కోట్లు రుణాలు మంజూరు చేశారు. దీని ప్రకారం వీరంతా వీరంతా దాదాపుగా బీమా ప్రీమియం కింద రూ.37 కోట్లకుపైగా చెల్లించారు. వీరితో పాటు బ్యాంకు రుణాలు పొందని మరో 230 మంది రైతులు రూ.లక్షన్నర వరకు ప్రీమియం కట్టారు. గడువు ముగియడంతో ఆందోళన హెలెన్, లెహర్ తుపాన్లు, భారీ వర్షాల సమయంలో జిల్లాలో పంటలు నీటమునిగాయి. ఈ సమయంలో 13,341 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనాలు వేశారు. మొత్తం 52,426 మంది రైతులు నష్టపోయారు. వీరికి ఇప్పటి వరకు బీమా పరిహారం రాకపోయినప్పటికీ వస్తుందనే ఆశ రైతుల్లో ఉంది. కానీ ఈసారి బీమా ప్రీమియంను ఆరు శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జూలై 31వ తేదీ తుది గడువుగా ప్రకటించింది. ప్రతి యేటా ఈ సమయానికి రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. దీంతో రుణం ఇచ్చేటప్పుడే ప్రీమియం సొమ్మును బ్యాంకుల మినహాయించుకుంటాయి. కానీ ఈసారి టీడీపీ రుణమాఫీ హామీ కారణంగా పరిస్థితి మారింది. సర్కారు నాన్చుడి ధోరణి వల్ల రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఖరీఫ్ ప్రారంభమై నెలదాటినా బ్యాంకులు ఇప్పటి వరకు రైతులకు సుమారుగా రూ.4 కోట్లు వరకు మాత్రమే రుణాలుగా అందించాయి. దీంతో రైతులు బీమా ప్రీమియం చెల్లించలేకపోయారు. గడువు పొడిగించని పక్షంలో రైతులకు బీమా వర్తించే అవకాశం లేకుండా పోతుంది. సెప్టెంబర్ 15 వరకు గడువు పెంపు! ముందు ప్రకటించిన విధంగా బీమా గడువు గత నెల 31తో ముగిసింది. కనీసం పదుల సంఖ్యలో కూడా రైతులు ప్రీమియం చెల్లించలేకపోయారు. దీంతో బీమా గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. అధికారికంగా ఇంకా ఉత్తర్వులు రాలేదని పేర్కొంటున్నారు. -
మత్స్యకారులకు మొండి‘చెయ్యి’
చీరాలటౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో మత్స్యకారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. వేట తప్ప మరో పని తెలియని వీరు ప్రస్తుతం ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం ఏటా ఏప్రిల్ 15 నుంచి మే 31వ తేదీ వరకు సముద్రంలో వేట నిషేధించింది. దీంతో గంగపుత్రులు కష్టాల సుడిగుండంలో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. వేట నిషేధ సమయంలో సముద్రంలో చేపలు గుడ్లు పెడతాయి. దీన్ని ఆసరా చేసుకుని మత్స్యకారులకు ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం ఏటా వేట నిషేదం విధిస్తోంది. ఆకలితో అలమటిస్తున్న మత్స్యకారులు వేట నిషేధం సమయంలో జీవనోపాధి లేక మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పూట గడవక గంగపుత్రుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో చీరాల వాడరేవు నుంచి రామాయపట్నం వరకు 102 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతంలో 74 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు 22 వేల మంది సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తం ఐదువేల వరకు బోట్లున్నాయి. మూడేళ్లుగా తీరంలో వేట సజావుగా సాగటం లేదు. అకాల వర్షాలు.. తుపాన్లు, అల్పపీడనాలు వంటి పకృతి వైపరీత్యాల కారణంగా సముద్రం ఉగ్రరూపం దాల్చి అల్లకల్లోలంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు తరుచూ సముద్రంలో చిక్కుకోవటంతో మిగిలిన మత్స్యకారులెవ్వరూ ఆ రోజుల్లో వేటకు వెళ్లడం లేదు. ఈ ఏడాదైతే వేటకు వెళ్లినా చేపలు సక్రమంగా పడలేదు. ఒకటి..రెండు నెలలు తప్పా ఏడాదంతా వేట సాగ లేదు. మరో పని తెలియని మత్స్యకారులు వేటకు వెళ్లని సమయాల్లో కుటుంబ పోషణ కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నిండా మునుగుతున్నారు. మహానేతను గుర్తుకు తెచ్చుకుంటున్న గంగపుత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకున్నారు. వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి 31 కిలోల బియ్యం అందించాలని జీఓ కూడా జారీ చేశారు. మహానేత మరణానంతరం మత్స్యకారులను పట్టించుకున్న దాఖలాలు లేవు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కోసం ప్రభుత్వం పొదుపు పునరావాస పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దాని గురించి పట్టించుకున్న పాలకులు లేరు. వారికి అందాల్సిన ఇంధన రాయితీ కూడా నేటికీ అందలేదు. రిజిస్టర్ బోట్లకు డీజిల్ సబ్సిడీ విడుదల చేయకపోవటంతో మత్స్యకారులు ఏడాదిన్నరగా నానా అవస్థలు పడుతున్నారు. ఉపాధి హామీ.. ఉత్తుత్తి హామీ వేట నిషేధ సమయంలో ఉపాధి పనులు కల్పిస్తామని ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రకటించింది. ఆచరణలో అది నోచుకోలేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా వేట నిషేధ సమయంలో వలలు, బోట్లు మరమ్మతులు చేసుకుంటామని, అందుకు గాను ఉపాధి కూలీలుకు ఇస్తున్న కూలే తమకూ ఇవ్వాలన్న మత్స్యకారుల డిమాండ్ చాలాకాలం నుంచి పెండింగ్‌లోనే ఉంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల అవస్థలపై చీరాల ఎఫ్‌డీవో కిషోర్‌బాబును వివరణ కోరగా మత్య్సకారులకు వేట నిషేధంలో అందించాల్సిన బియ్యాన్ని త్వరగా పంపించాలని ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు. బియ్యం విడుదలైన వెంటనే మత్స్యకారులకు పంపిణీ చేస్తామని వివరించారు. -
ఆ ‘రాజు’తోనే...
రాజన్న పాలనలో రైతే రాజు.. మహానేత మరణంతో కష్టాల్లో అన్నదాత ప్రకటనలకే పరిమితమైన ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా పంపిణీ కాని 2011 పరిహారం రూ.11 కోట్ల పరిహారానికి మోక్షం లేదు పథకంపై నమ్మకం కోల్పోయిన రైతులు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే రైతు విలవిలలా డాల్సిందే. ఆరుగాలం కష్టం నీటిపాలైతే కన్నీరుమున్నీరవాల్సిందే. ఆదుకునేవారులేక విలపించాల్సిందే. కరువుకాటకాలతో పంటలు పండకపోయినా పట్టించుకునేవారు కాదు. విత్తనాలు, ఎరువులు ఇచ్చినా అరకొరగానే. రైతు అడిగిన ఎరువు.. కోరిన విత్తనం ఇచ్చేవారు కాదు. మహానేత ముఖ్యమంత్రి అయ్యాక... పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ పథకంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఏ ఒక్కరైతూ తన పంట దెబ్బతిన్నదని..తనకు పంట నష్టపరిహారం రాలేదని..కోరుకున్న విత్తనాలు, కోరిన ఎరువులు ఇవ్వలేదని నిరుత్సాహ పడవద్దు.. వ్యవసాయం చేయడానికి వెనుకంజవేయవద్దు.. అని భావించిన మహానేత ఇన్పుట్ సబ్సిడీ పథకంలో మార్పులు తీసుకొచ్చారు. పంటనష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. వ్యవసాయాన్ని పండుగ చేశారు. కానీ ఇప్పుడు... ఎంత వేగంగా రైతు అభివృద్ధిపథంలోకి దూసుకెళ్లాడో అంతేవేగంగా అగాధంలోకి నెట్టివేయబడ్డాడు. దండగన్న వ్యవసాయాన్ని మహానేత పండగ చేస్తే ఆయన తర్వాత వచ్చిన పాలకులు మళ్లీ రైతును కష్టాల్లోకి నెట్టారు. ఆరుగాలం కష్టం నీటిపాలైతే ఆదుకునేవారులేక..2011సంవత్సరం నాటి నష్టపరిహారం నేటికీ సక్రమంగా పంపిణీ కాక రైతు దివాలా తీశాడు. పాలకుల నిర్లక్ష్యంతో ఇన్పుట్ సబ్సిడీ కాస్త ఇన్‘ఫట్’ సబ్సిడీగా మారిపోయింది. ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌లైన్: వైఎస్ మరణానంతరం ఇన్పుట్ సబ్సిడీ పథకం లక్ష్యం దెబ్బతింటోంది. అతివృష్టి, అనావృష్టి, అకాలవర్షాలతో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం ఉద్దేశించిన ఈ పథకం నిష్ర్పయోజనంగా మారింది. తొలుత ఈ పథకం ద్వారా విత్తనాలు, ఎరువులు అందించేవారు. ఆ తర్వాత పరిహారం రైతుల చేతికందేది. మహానేత మరణానంతరం ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు పొడిచింది. జిల్లాలో ఏటా పంట నష్టాలు సంభవించినా రైతులకు పరిహారం అందడం లేదు.ఐదేళ్లలో జిల్లాలో అన్నదాతకు కోలుకోలేని దెబ్బ తగిలింది. లైలా, జల్, నీలం తుపాన్లు, కరువు పరిస్థితులతో రైతులు పంటలను కోల్పోయారు. పంట నివేదికలను అధికారులు ఆర్భాటంగా తయారు చేసుకొని వెళ్లినా.. చివరకు అర్హులైన రైతులకు పరిహారం మాత్రం అందడం లేదు. మహానేత వైఎస్ పాలనలో... రైతును రాజుగా చూడాలని పరితపించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పంటనష్టపరిహారాలను ఏవిధంగా చెల్లించారో చూద్దాం. జిల్లాలో 2006లో పంటనష్ట పరిహారం కింద రూ. 7.22 కోట్లు, 2007లో రూ.40.49 లక్షలు, 2008లో రూ. 6.29 కోట్లు, 2009లో రూ.9.58 కోట్లను రైతులకు అందజేశారు. అప్పట్లో అర్హులైన రైతులందరికీ పరిహారం అందింది. పంట నష్టపోయినా సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు సబ్సిడీ కింద ఇచ్చారు. మహానేత మరణానంతరం రైతులు దిక్కులేని వారయ్యారు. సకాలంలో వర్షాలు పడలేదు. అనునిత్యం విద్యుత్ కోతలు, వాడకంపై ఆంక్షలు పెట్టి రైతులను అష్టకష్టాలు పెట్టారు. 2010లో సంభవించిన జల్ తుపాను రైతులను అతలాకుతలం చేసినా మొక్కుబడిగానే పరిహారం అందించారు. 2011లో జిల్లావ్యాప్తంగా కరువు నెలకొంది. అనావృష్టి కారణంగా వేసిన పంటలు ఎండిపోయాయి. జిల్లాలో మొత్తం 2,96,789 మంది రైతులకు పంటనష్ట పరిహారంగా రూ.111.6 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. కానీ బ్యాంకు ఖాతాలు తెరవాలని, ఆన్లైన్లో తప్పులు ఉన్నాయనే నెపంతో రెండేళ్లు రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. ఇప్పటికీ రూ. 11 కోట్ల పంపిణీ చేయకుండా వదిలేశారు. ‘నీలం’ బాధితులకు ఇంకా కన్నీళ్లే.. 2012 నవంబర్‌లో నీలంతుపాను సంభవించింది. జిల్లావ్యాప్తంగా 3.18 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో కుండపోత కురవడంతో పత్తి చేతికి అందకుండా పోయింది. జిల్లాలో 2,31,966 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ర్టంలోనే జిల్లాలో ఎక్కువగా పంట నష్టం జరిగిందని ప్రకటించారు. ఇంతజరిగినా కేంద్ర బృందం జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. 2.31 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కేవలం 27,247 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు లెక్కల్లో చూపించారు. మొత్తం 34,265 మంది రైతులకు ఈ పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అర్హులైన రైతుల్లో 29,539 మందికి రూ.9.35 కోట్లు పంపిణీ చేసి.. బ్యాంకు ఖాతాలు లేవన్న కారణంతో మిగతా రైతులకు పరిహారం అందజేయలేదు. రూ. కోట్లలో నష్టం జరిగితే నామమాత్రంగా పరిహారం పంపిణీ చేయడంపై రైతులు, రైతు సంఘాలు ఆందోళన చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. -
దిగజారిన దిగుబడులు
= ఎకరాకు 8 నుంచి 10 బస్తాలు తగ్గుదల = 3.50 లక్షల ఎకరాల్లో ప్రభావం = కౌలురైతుల పరిస్థితి దయనీయం చల్లపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. వీటినుంచి 12.24 లక్షల టన్నుల మేరకు దిగుబడులు వస్తాయని అధికారులు అంచనాలు వేశారు. గత నెలలో సంభవించిన వరుస తుపాన్లు, వాయుగుండాల వల్ల వరిపంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ విపత్తుల వల్ల 3.50 లక్షల ఎకరాల్లో పాలు పోసుకుంటున్న వరికంకులు చాలావరకు తాలు (తప్ప) కంకులుగా మారాయి. ప్రస్తుతం జిల్లాలో పలు ప్రాంతాల్లో యంత్రాలతో చేస్తున్న వరికోతలు, నూర్పిళ్లను పరిశీలిస్తే చాలాచోట్ల ఎకరాకు 22 బస్తాల దిగుబడులు మాత్రమే వస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఎకరాకు 8 నుంచి 10 బస్తాల దిగుబడులు తగ్గిపోయాయి. నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్న మరికొన్ని ప్రాంతాల్లో 12 నుంచి 15 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చే పరిస్థితి నెలకొంది. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా 3.5 లక్షల ఎకరాల్లో సగటున దాదాపు 2.12 లక్షల టన్నుల దిగుబడులు తగ్గనున్నాయని అధికారులు చెబుతున్నారు. కౌలు రైతుల కుదేలు... కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జిల్లాలో ప్రాంతాలను బట్టి ఎకరాకు 13 బస్తాల నుంచి 22 బస్తాల కౌలు ఇస్తున్నారు. ఈ ఏడాది చాలాచోట్ల ఎకరాకు 22 బస్తాలకు మించి దిగుబడులు రాని పరిస్థితి నెలకొంది. దీంతో వచ్చిన దిగుబడులు కౌలు చెల్లించేందుకే సరిపోతాయని, పెట్టిన పెట్టుబడులన్నీ నష్టమేనని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చాలామంది రైతులు అప్పులుచేసి సాగుచేసినవారే. వీరిలో వందకు ఐదు నుంచి ఏడు రూపాయలకు వడ్డీలకు తెచ్చిన రైతులు కూడా ఉన్నారు. పంట చేతికొచ్చిన తరువాత అప్పులు తీర్చేద్దామనుకున్న రైతులకు ఖర్చులు రాకపోవడంతో దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో రబీలో దాళ్వా కూడా లేకపోవడంతో కౌలు రైతులకు పాలుపోని పరిస్థితి నెలకొంది. ధాన్యం ధర అంతంతమాత్రమే... నాట్లు దగ్గర నుంచి పంట చేతికందేవరకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.23 వేలు వరకు రైతులు పెట్టుబడులు పెట్టారు. ధాన్యం ధర మాత్రం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అంతంతమాత్రంగానే ఉంది. గత ఏడాది ఈ సమయంలో కల్లాల్లో బస్తా బీపీటీ ధాన్యం రూ.1,500కు కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.1,300కు మాత్రమే కొంటున్నారు. దీంతో బస్తాకు రైతులు రూ.200 నష్టపోవాల్సి వస్తోంది. దీనివల్ల ఎకరాకు రూ.1,600 వరకు నష్టపోతున్నారు. ఈ ఏడాది అధిక దిగుబడులు వస్తాయని ఆశించిన రైతులకు వరుస తుపాన్లు, వాయుగుండాలు కోలుకోలేని దెబ్బతీశాయి. -
కష్టకాలం 2013
= కలిసిరాని 2013 = నాలుగేళ్లుగా ఏటా నాలుగేసి తుపాన్లు = ఈ ఏడాది ఫై-లీన్, హెలెన్ దెబ్బ = నిండా ముంచిన తుపాన్లు, భారీ వర్షాలు = వరిలో రూ.200కోట్లకు పైగా నష్టం = పత్తి రైతు చిత్తరుునా ఆదుకోని యంత్రాంగం = పరిహారం అందజేతలో పాలకుల మీనమేషాలు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న కర్షకుల జీవనచిత్రం గమనిస్తే గుండె తరుక్కుపోతుంది. సాగునీరు సకాలంలో రాదు.. విత్తనాలు, ఎరువులు సమకూరవు.. పంటకొచ్చే దశలో పురుగులు, తెగుళ్లు, ఎలుకల దాడి.. వాటిని తట్టుకుని నిలదొక్కుకుంటే ప్రకృతి వైపరీత్యాలు కుదేలు చేస్తారుు. ఇలా.. దుక్కిదున్నే దగ్గర్నుంచి పంట నూర్పిడి వరకు రైతులను అనేక సమస్యలు వ్యయప్రయాసలకు గురిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు అన్నమో రామచంద్ర.. అనే దుస్థితి దాపురించింది. జిల్లాలో దాదాపు 13.50లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలను రైతులు సేద్యం చేస్తున్నారు. 6లక్షల 42వేల ఎకరాల్లో వరిసాగు, దాదాపు 1.37లక్షల ఎకరాల్లో పత్తి, 75వేల ఎకరాల్లో చేపల చెరువులు, 35వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు, మిగిలిన ప్రాంతంలో మొక్కజొన్న, మిర్చి, వేరుశెనగ, పసుపు, సుబాబుల్, అరటి, తమలపాకులు, కూరగాయలు సాగు చేస్తున్నారు. వరుస తుపాన్లతో వరికి రూ.200కోట్ల నష్టం నాలుగేళ్లుగా రైతాంగాన్ని వరుస తుపాన్లు వెంటాడుతూనే ఉన్నాయి. 2010 నుంచి ఏటా నాలుగు తుపాన్లు రైతాంగాన్ని వెంటాడుతుంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అకాల వర్షాలు, అక్టోబర్‌లో భారీ వర్షాలు, నవంబర్‌లో ఫై-లీన్, హెలెన్ తుపాన్లు రూ.200కోట్ల నష్టాన్ని మిగిల్చారుు. రెండున్నర లక్షల ఎకరాల్లో వరి పంట ఘోరంగా దెబ్బతినడంతో దాదాపు రెండు లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలిన వరి పంట మాటెలా ఉన్న పెట్టుబడిలో కనీసం 50శాతం దక్కని దయనీయ స్థితి ఎదురైంది. తగ్గిన దిగుబడి.. ఈ ఏడాది వరిలో 13.90లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. వర్షాలు, తుపాన్ల కారణంగా దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. మరో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రంగుమారి, దెబ్బతిని రైతులకు సరైన ధర రాకుండా చేసింది. మిగిలిన 9.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆక్వాలో ఆటుపోట్లు ఈ ఏడాది ఆక్వారంగానికీ ఆటుపోట్లు తప్పలేదు. తుపాను కారణంగా ఈదురుగాలులు, మబ్బులు, వర్షాలతో ఆక్వా రంగానికి అవస్థలు తెచ్చిపెట్టాయి. జిల్లాలో సుమారు లక్షా 10వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. దీనివల్ల చేపల చెరువుల్లో ఎటువంటి ఇబ్బంది లేకపోయినా రొయ్యల చెరువుల్లో మాత్రం నష్టాల పట్టుబడి తప్పలేదు. రొయ్యలకు ఆక్సిజన్ సమస్యలతో జిల్లాలో కలిదిండి, కైకలూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో రైతులు సుమారు రూ.50లక్షలు నష్టపోయారు. వాతవరణం అనుకూలించకపోవడంతో కొందరు రైతులు రొయ్య సైజు(కౌంట్) పెరగకుండానే పట్టుబడి పట్టి అమ్మేశారు. ఈ ఏడాది మూడు నెలలపాలు సమైక్యాంధ్ర ఉద్యమంతో రవాణా నిలిచిపోయి పట్టుబడి లేకుండా చేపలు, రొయ్యలను చెరువుల్లోనే ఉంచేశారు. పెంచడానికి అధిక పెట్టుబడి కావడంతో ఆక్వా రైతులకు వ్యయప్రయూసలు తప్పలేదు. మొలకలు వచ్చిన మొక్కజొన్న.. కూరగాయల పంటకు నష్టం జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మొక్కజొన్న, కూరగాయ పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో సుమారు 18వేల ఎకరాల్లో మొక్కజొన్న, 40వేల ఎకరాల్లో చెరకు, 25వేల ఎకరాల్లో మిర్చి, పలు మండలాల్లో కూరగాయలు, అరటి, తమలపాకుల సాగు జరుగుతోది. వర్షాల కారణంగా ఆరబెట్టిన మొక్కజొన్న తడిసి మొలకలు వచ్చాయి. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ, మైలవరం ప్రాంతాల్లో మొక్కజొన్న చేలు నేలవాలాయి. అవనిగడ్డ, మోపిదేవి, తోట్లవల్లూరు, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు మండలాల్లో లేతగా ఉన్న బీర, దోస, కంద పొలాల్లోకి నీరు చేరిపోవడంతో మొక్కలు చనిపోయాయి. పసుపు చేలల్లో నీరు చేరి దుంప కుళ్లిపోయింది. టమాటా చేలల్లో నీరు చేరి దెబ్బతింది. కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల్లోని తమలపాకుల తోటల్లో నీరుచేరి దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టాలపై 26న నివేదిక వరుస విపత్తుల నేపథ్యంలో నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తున్నాం. హెలెన్ తుపాను నష్టాల నివేదికను ఈ నెల 26న ప్రభుత్వానికి అందిస్తాం. జిల్లాలో ఇటీవల హెలెన్ తుపాన్ కారణంగా నష్టపోయిన చేలను ప్రత్యక్షంగా పరిశీలించి రైతుల జాబితాలను సిద్ధం చేశాం. ఈ ఏడాదిలో రెండు పర్యాయాలు భారీ వర్షాలు, ఫ:-లీన్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతుల వివరాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు అందజేశాను. తాజాగా హెలెన్ తుపాన్‌కు నష్టాలను అంచానావేసి నష్టపోయిన వరి రైతుల జాబితాలు సిద్ధం చేస్తున్నాం. - బాలు నాయక్, ఇన్చార్జి జేడీఏ అన్నదాత మరణ మృదంగం కష్టాల సుడిగుండంలో చిక్కిన రైతులు వ్యవసాయం చేయలేక, చేసిన అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్నారు. అప్పులు రైతుల ప్రాణాలను కాటేస్తుంటే, పురుగుమందే పరమాన్నంగా, ఉరితాడే ఊయలగా రైతులు మరణమృదంగం మోగిస్తున్నారు. ఇలా 1998 నుంచి గత ఏడాది వరకు జిల్లాలో 68మంది రైతులు చనిపోగా, ఈ ఏడాది దాదాపు తొమ్మిది మంది రైతులు గుండెపోటు, ఆత్మహత్యలతో మృతిచెందారు. వీరిలో అత్యధికులు కౌలురైతులే ఉండటం గమనార్హం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతు కుటుంబాలను ఆదుకునేలా జీవో నంబర్ 321 తెచ్చి రైతు మరణాల వివరాలు కచ్చితంగా నమోదు చేసి, వారి కుటుంబాలను ఆదుకునేలా చర్యలు చేపట్టారు. చంద్రబాబు పాలనలోనూ, ప్రస్తుత కిరణ్ హయాంలోను రైతుల మరణాలను నమోదు చేయడంలోనే నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆదుకునే పరిస్థితి అసలే లేదు. బాప్రే ‘బీపీ’టీ.. జిల్లా రైతాంగాన్ని బీపీటీ నట్టేట ముంచింది. బీపీటీ రకాన్ని సాగుచేసిన రైతులకు కాలం కలిసిరాకపోవడంతో వారిలో మానసిక వత్తిడి పెరిగి బీపీ (రక్తపోటు) పెరిగేలా చేస్తోంది. నిద్రావస్థ లేకపోవడం, దోమ, అగ్గితెగులును తట్టుకోలేకపోవడం వంటి సమస్యలు ఉన్న బీపీటీకి మంచి ధరతో మార్కెటింగ్ సౌకర్యం ఉండటంతో రైతులు మక్కువ చూపుతున్నారు. అందుకే 1986 నుంచి దీని సాగు విస్తరిస్తోంది. జిల్లాలో గతంలో కేవలం రెండువేల ఎకరాల్లో బీపీటీ రకాన్ని సాగుచేసిన రైతులు ఈసారి ఏకంగా దాదాపు మూడు లక్షల ఎకరాల్లో సాగు విస్తరించారు. ఇటీవల వరుస తుపాన్లు, భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంట రైతులను నిండా ముంచింది. తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగుచేసిన బీపీటీ రకం పూర్తిగా దెబ్బతినగా, మిగిలిన ప్రాంతాల్లోకూ ఎకరానికి కనీసం ఐదు బస్తాల చొప్పున దిగుబడి పడిపోయింది. బీపీటీలో తగ్గిన దిగుబడితో జిల్లా రైతాంగం సుమారు రూ.10 నుంచి 15కోట్ల మేర నష్టపోయారు. పరిహారం.. పరిహాసం.. జిల్లాలో నిండా మునిగిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోగా, పరిహాసం ఆడుతోంది. నాలుగేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతుంటే దాదాపు రెండేళ్ల కిందటి పరిహారం ఇప్పటివరకు ఇవ్వలేదు. జిల్లా రైతాంగానికి ఇప్పటికే ఇవ్వాల్సిన సుమారు రూ.33.50కోట్ల నష్టపరిహారం విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇటీవల తుపాన్లకు పంటనష్టం అంచనాలు పూర్తిచేసి పరిహారం ఇవ్వాల్సి ఉంది. నీలం తుపాను నష్టపరిహారం రూ.3.50కోట్లు, థానే తుపాన్ పరిహారం రూ.21కోట్లు, రెండెళ్లపాటు భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులకు సుమారు రూ.9కోట్లు మేర పరిహారం విడుదల చేయాల్సి ఉంది. ఇటీవల భారీ వర్షాలు, తుపాన్లకు నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి పరిహారం అందించే విషయం ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. పత్తి రైతు చిత్తు జిల్లాలో ఈ ఏడాది భారీ వర్షాలకు పత్తి రైతులు చిత్తయ్యూరనే చెప్పాలి. లక్షా 35వేల ఎకరాల్లో సాగు జరుగుతున్న పత్తి ప్రస్తుతం పూత, కాయ దశలో ప్రకృతి విపత్తులకు తీవ్రంగా దెబ్బతింది. ఈ ఏడాది 20 నుంచి 25శాతం వరకు పంట దెబ్బతిన్నట్టు అంచనా. దీంతో ఎకరానికి కనీసం రెండు క్వింటాళ్ల పత్తి పంటను రైతులు కోల్పోవాల్సి వచ్చింది. దాదాపు కోటి రూపాయలకు పైగా పత్తి రైతులు పెట్టుబడులే నష్టపోయారు. పత్తి పంటలో కనీసం 50శాతం మేర నష్టం జరిగితేనే పరిహారం ఇవ్వాలన్న నిబంధన.. జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన పత్తిరైతుకు శరాఘాతంగా మారింది. -
విత్తనం దొరక్క అగచాట్లు
పాలకొల్లు, న్యూస్‌లైన్ : వరుస తుపాన్లు, భారీ వర్షాల కారణంగా నష్టపోరుున రైతులకు వరి విత్తనాల కొరత, వాటి ధరలు గోరుచుట్టుపై రోకలి పోటులా పరిణమించారుు. రైతులే స్వయంగా విత్తనాలు పండించుకున్న చేలు నీటమునగడం, దుబ్బులు నీటనాని కుళ్లిపోవడంతో దాళ్వా విత్తనాల కోసం ఏపీ సీడ్స్పైనే ఆధారపడాల్సి వస్తోంది. జిల్లాలో ఈ దాళ్వాలో 4లక్షల 86 వేల 250 ఎకరాల్లో వరి పండించాల్సి ఉంది. ఇందుకోసం వేసే నారుమడుల్లోకి 90 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 55వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులే పండించుకుంటారని అంచనా. ఈ దృష్ట్యా 35 వేల క్వింటాళ్లను ఏపీ సీడ్స్ ద్వారా అందుబాటులోకి తెస్తే సరిపోతుందని నిర్ణరుుంచిన వ్యవసాయ శాఖ అధికారులు ఆ మేరకు విత్తనాలను సిద్ధం చేయూలని నివేదించారు. ఇప్పటివరకూ సుమారు 6 వేల క్వింటా ళ్లను సొసైటీలు, లెసైన్స్ పొందిన వ్యాపార సంస్థలకు కేటారుుంచారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. రైతులు స్వయంగా 55 వేల క్వింటాళ్ల విత్తనాలను పండించాల్సి ఉండగా, విత్తన పంట నీటమునిగి పనికిరాకుండా పోవడంతో విత్తనాల కొరత ఏర్పడింది. సొంత విత్తనాలపైనే మక్కువ ఎక్కువ జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులు దాళ్వాకు అవరసమైన వరి విత్తనాలను సార్వాలో పండించుకోవడం ఆనవాయితీ. సొంతంగా పండించుకున్న విత్తనాలైతే నాణ్యం గా ఉంటారుు. అందులో కేళీలు ఉండవు. మొలక శాతంలోనూ ఇబ్బంది తలెత్తతు. ధర కూడా కొంత తక్కువగానే ఉంటుంది. ఈ కారణంగానే సార్వా సమయంలోనే రైతులు ఎంటీయూ 1010, ఎంటీయూ 1001, ఐఆర్-64 రకాలను విత్తన పంటగా సాగు చేస్తారు. పండించిన విత్తనాలు సొంత అవసరాలకు ఉపయోగించుకోగా.. మిగిలిన విత్తనాలను పొరుగు రైతులకు విక్రరుుస్తుం టారు. కొందరైతే కేవలం విత్తనాల కోసం మాత్రమే పంటను సాగు చేస్తుంటారు. అరుుతే,ఈ ఏడాది సార్వా సీజన్ ప్రారంభంలో కాలువలకు సాగునీరు ఆలస్యంగా విడుదల చేశారు. దీనివల్ల నాట్లు వేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఆ తరువాత కురిసిన భారీ వ ర్షాలు, తుపానుల కారణంగా విత్తన రకం పంట నేలకొరిగి నీటమునిగింది. ఈ పరిస్థితుల్లో రైతులంతా విత్తనాల కోసం ప్రభుత్వ సంస్థ అరుున ఏపీ సీడ్స్పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో నాట్లు వేయకపోతే నష్టమే.. రైతులకు సార్వా పంట చేతికి రాలేదు. మరోవైపు త్వరితగతిన దాళ్వా నాట్లు పూర్తిచేయాలని అధికారుల నుంచి ైఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు రానున్న రోజుల్లో సాగునీటి సమస్య తలెత్తే ప్రమా దం ఉంది. ఈ ఏడాది కాలువలను ముందుగానే కట్టేసేందుకు నిర్ణరుుంచిన నేపథ్యంలో రైతులు ముందుగా నారుమళ్లు వేసి, నాట్లు పూర్తి చేయూలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఒకపక్క సార్వా మాసూళ్లు పూర్తికాలేదు, మరోవైపు విత్తనాలు దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏంచేయూలో దిక్కుతోచక అన్నదాతలు అల్లాడుతున్నారు. కొరత రానివ్వం దాళ్వాకు విత్తనాల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ జారుుంట్ డెరైక్టర్ వీడీవీ కృపాదాస్ చెప్పారు. విత్తన కొరతపై ‘న్యూస్‌లైన్’ ఆయనను సంప్రదించగా... 35 వేల క్వింటాళ్ల విత్తనాల కోసం ఏపీ సీడ్స్‌కు లేఖ రాశామని చెప్పారు. ఇప్పటికే సుమారు 6వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. అవసరమైనన్ని విత్తనాలను రప్పిస్తామని, రైతులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. -
తుపాను బాధితులను ఆదుకుంటాం
జగన్‌కు శరద్‌పవార్ హామీ నేడు, రేపు గోదావరి జిల్లాల్లో జగన్ పర్యటన పై-లీన్, హెలెన్ తుపానుల వల్ల రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన రైతులు, ప్రజల కడగండ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించేందుకు కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల మద్దతును కూడగ ట్టడంలో భాగంగా జగన్ సోమవారం మధ్యాహ్నం ముంబయిలో పవార్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తుపానుల వల్ల సంభవించిన నష్టాన్ని కూడా ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. రైతుల దుస్థితికి సంబంధించిన వివరాలను సావధానంగా తెలుసుకున్న పవార్ కేంద్రం నుంచి రాష్ట్రానికి సాధ్యమైనంత ఎక్కువ ఆర్థిక సాయం అందజేయడానికి ప్రయత్నిస్తానని జగన్‌కు హామీ ఇచ్చారు. ఇలావుండగా జగన్ మంగళవారం నుంచి తుపాను తాకిడికి గురై నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు తూర్పుగోదావరి, రెండోరోజు పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆయన నష్టాన్ని పరిశీలిస్తారు. బాధిత రైతాంగాన్ని పరామర్శిస్తారు. జగన్ మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రికి చేరుకుంటారు. కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం రాత్రికి నర్సాపురంలో బస చేస్తారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తారు.