=టీఆర్‌ఎస్ నేతల నిరసన
=జేడీఏకు వినతిపత్రం
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తుపాన్‌తో నష్టపోయిన పత్తి, మొక్కజొన్న రైతులకు సర్వే స్థాయిలోనే అన్యాయం చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. హన్మకొండలోని జేడీఏ కార్యాలయం వద్ద సోమవారం టీఆర్‌ఎస్ ప్రతినిధులు నిరసన తెలియజేశారు. తుపాన్ ప్రభావం తగ్గిన పది రోజుల తర్వాత సర్వే చేపట్టడాన్ని వారు తప్పుబట్టారు. పంట చేలలో నీళ్ళుంటేనే పరిహారానికి అర్హులుగా భావించడం సరికాదన్నారు. ఈ మేరకు జేడీఎ రామారావుకు టీఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని జేడీఎ రామారావు వారికి హామీ ఇచ్చారు. అనంతరం టీఆర్‌ఎస్ జిల్లా ఇంచార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, డాక్టర్ రాజయ్యలు విలేకరులతో మాట్లాడారు. సర్వేలో లోపాలు నెలకొంటే పరిహారం రాకుండా పోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఇప్పటికే నీలం తుపాన్ వల్ల రైతులు నష్టపోయినా పరిహారం రాకుండా పోయిందని గుర్తుచేశారు.
తక్షణం స్పందించి సర్వేలో లోపాలు లేకుండా గట్టి చర్యలు చేపట్టాలని కోరారు. 50శాతం పంట నష్టం వాటిల్లితేనే పరిహారం లభిస్తుందంటూ సర్వే బృందాలు చెప్పడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్వే బృందాలను నిర్బంధించిన విషయాన్ని వివరించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన చేపడుతామని టీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రాంతంలో కరువొచ్చినా..తుపానొచ్చినా ఈ ప్రభుత్వాలు ఆదుకోవడంలో వివక్ష కనబరుస్తున్నారని విమర్శించారు. పరిహారానికి అర్హత పొందకుండా నిబంధనలు పెట్టి సర్వే స్థాయిలోనే పట్టించుకోవడం లేదన్నారు. పత్తి రైతులకు ఈ దఫా అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోకుంటే గ్రామాలకు వచ్చే అధికారులను, సిబ్బందిని నిర్బంధిస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జి ఆరూరి రమేష్, జిల్లా నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మార్నేని రవీందర్‌రావు, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు సెవెల్ల సంపత్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, టీఆర్‌ఎస్ నాయకుడు శంకర్‌నాయక్, యూత్ అర్బన్ నాయకులు చాగంటి రమేష్ తదితరులు ఉన్నారు.