Farmers' Suicides
-
పండించారు... వడ్డించారు!
రైతుకు కొత్త నిర్వచనం కావాలి. వ్యవసాయానికి కొత్త అర్థం చెప్పాలి. మహిళ సాగు చేస్తే నేల పులకిస్తుంది. గాజుల చేతిలో గరిటే కాదు... నాగలి కూడా గర్వంగా చాలుదీరుతుంది. అనంతపురంలో మహిళలు ‘ఆదర్శసాగు’ చేస్తున్నారు. ఆరోగ్యం కోసం ఏం తినాలో ఎలా తినాలో నేర్పిస్తున్నారు. దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు. వినడానికి బావుంటుంది. దేశానికి కంచంలో అన్నంగా మారేది గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలే... కాబట్టి గ్రామానికి, రైతుకి అంతటి గుర్తింపు వచ్చింది. మరి అదే పొలం రైతుకి సమాధి అవుతుంటే వ్యవసాయం బతికి బట్టకట్టేదెలా? నాగలి కర్రు రైతు గుండెను చీలుస్తుంటే భూమిలో బంగారం పండేదెప్పుడు? రైతు వాణిజ్య పంటల మాయలో పడి అప్పుల పాలైతే ఆ రైతుని, ఎరువులతో కలుషితమైన ఆ భూమిని కాపాడేదెవరు? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే కసితో రైతు మహిళలు ఆ పనిని చేపట్టారు. భర్తను మింగేసిన పంటపొలాల్లోనే భవితను వెతుక్కుంటున్నారు. సంఘటితంగా వ్యవసాయం చేస్తూ దిగుబడితో లాభాలు కళ్ల చూస్తున్నారు. ఇది అనంతపురంలోని మహిళలు సాధించిన విజయం. వాళ్లకు దారి చూపిన భానుజ సంకల్పం. అనంతపురం జిల్లా, రూరల్ మండలం, కురుగుంట్ల గ్రామం. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలను చూసిన గ్రామం. ఇప్పుడు ఆ రైతు కుటుంబాల మహిళలు నిర్వహిస్తున్న రెస్టారెంట్‌ను చూస్తోంది. ఆ రెస్టారెంట్లో వంటకు అవసరమైన ధాన్యాలను పండిస్తున్న వ్యవసాయ క్షేత్రాలను చూస్తున్నారు. ఈ విజయాన్ని ‘చెరువు భానుజ’... సాక్షితో పంచుకున్నారు. ‘ఒంటరి’ పోరాటం! ‘‘భర్త వాణిజ్య పంటలతో నష్టాల ఊబిలో కూరుకుపోయి, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే... అగమ్యగోచరంగా, అచేతనంగా మిగిలిన వాళ్లకు అండగా నిలిచాను. సింగిల్ పేరెంట్‌గా పిల్లల పోషణ బాధ్యతను మోస్తున్న మహిళలే వీరంతా. భర్తను కోల్పోయిన వాళ్లకు తక్షణ సహాయం చేస్తూ, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం కోసం కార్యాలయాలకు వెళ్లి పని చేయించడం వరకు తోడుగా ఉంటున్నాను. అంతటితో ఆ కుటుంబం గట్టెక్కదు. ఉపాధి కావాలి, వాళ్లకు వచ్చిన పని వ్యవసాయమే. అయితే పొలం లేదు. దాంతో కలెక్టివ్ ఫార్మింగ్ కోసం పొలం లీజుకు తీసుకున్నాం. వ్యవసాయ క్షేత్రాలకు ‘పుడమి తల్లి, మన భూమి’ అని పేర్లు పెట్టుకుని సేద్యం మొదలు పెట్టాం. తక్కువ ఖర్చుతో పంట చేతికి రావడానికి మిల్లెట్స్ సాగు, ఏడాది పొడవుగా రాబడి కోసం కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నాం. మా ప్రయాణంలో అసలైన టర్నింగ్ పాయింట్ ఇక్కడే. పంటతో ఆపేయకుండా వంట కూడా మొదలుపెట్టాం. మార్కెట్ పుట్టింది! హరిత విప్లవంతో మనదైన సాగు కనుమరుగైంది. మిల్లెట్స్ సాగు మర్చిపోయాం, విత్తనాలు అంతరించే దశకు చేరుకున్నాయి. ఇక ఈ వంటల గురించి ఈ తరానికి తెలియనే తెలియదు. ప్రభుత్వ సంస్థల సహకారంతో విత్తనాలు సేకరించాను. సేద్యం తెలిసిన మహిళలు కావడంతో సాగులో పెద్దగా ఇబ్బందులు రాలేదు. కానీ వీటిని ఎలా వండాలో నేర్పించడానికి మాస్టర్ షెఫ్‌లతో శిక్షణ ఇప్పించి మరీ కురుకుంట్లలో రెస్టారెంట్ పెట్టాం. రెస్టారెంట్ పెట్టడానికి ముందు ఆ ఊరిని డయాబెటిక్ ఫ్రీ విలేజ్‌గా మార్చాలనే సంకల్పంతో ఉచితంగా వండిపెట్టాం. డైటీషియన్లు సూచించినట్లు చిరుధాన్యాల వంటలను మూడుపూటలా తినాల్సిన మెనూను వండి వడ్డించాం. నాలుగవ వారానికి షుగర్ లెవెల్స్ అదుపులోకి రావడాన్ని స్వయంగా తెలుసుకున్నారు పేషెంట్లు. మిల్లెట్స్ పట్ల గ్రామస్థుల్లో అవగాహన కోసం చేసిన ప్రయత్నం అది. అయితే ఆ భోజనం తిన్న వాళ్లు, తెలిసిన వాళ్లు రెస్టారెంట్ పెట్టమని సూచించారు. మా మహిళలు కూడా ఉత్సాహంగా ముందుకొచ్చారు. అలా రెండు నెలల కిందట ‘పుడమి తల్లి మిల్లెట్ హోటల్’ ప్రారంభమైంది. ‘ఆర్థిక భద్రత, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత’ మా ట్యాగ్‌లైన్. ఊహించనంత గొప స్పందన వచ్చింది. ఆఫీసర్లు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. హోటల్ అనేక ప్రదేశాల్లో శాఖలు తెరవమని అడుగుతున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే హోటల్ మరో శాఖ ప్రారంభం కావాలంటే అందుకు తగిన వ్యవసాయ క్షేత్రాన్ని విస్తరించాలి. ఇప్పుడు మేము సాగు చేస్తున్న పొలంలో సహజమైన సేంద్రియ పద్ధతుల్లో పండినవే మా రెస్టారెంట్లో వండుతున్నాం. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నాలుగు శాఖల్లో మొత్తం 1800 మంది రైతుమహిళలు మాతో సంఘటితమై ఉన్నారు. వారందరికీ ఉపాధిమార్గాల అన్వేషణ కోసం విస్తృతంగా పని చేయాల్సి ఉంది. వెలుగు పుట్టింది! ‘సూర్యోదయం అవుతున్నప్పుడు పుట్టింది, ఇంటికి వెలుగు తెస్తుంద’ని... మా నాన్న నాకు భానుజ అని పేరు పెట్టారు. మాది అనంతపురం జిల్లా, నల్లమాడ మండలం, బడవాండ్ల పల్లి. నాన్న చదువుకున్నది తక్కువే, కానీ కమ్యూనిస్ట్ నేపథ్యంలో చాలా నేర్చుకున్నారాయన. పాటలు రాసి పాడేవారు. చిన్నప్పుడు నాన్నతో సమావేశాలకు వెళ్లేదాన్ని. ఆ జ్ఞానమే నన్ను ఇలా తీర్చిదిద్దింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు, సందర్శనకు వచ్చన అధికారులకు మా హాస్టల్లో వసతులలేమిని చెప్పే ధైర్యం ఉండేది. టెన్త్ చదువుతూనే యంగ్ ఇండియా సంస్థలో వాలంటీర్‌గా పని చేశాను. అమ్మ పట్టుపట్టి ఇంటర్లో చదువాపించి మరీ పెళ్లి చేసింది. కానీ నేను గృహిణిగా ఇంటికే పరిమితం కాకుండా సామాజిక కార్యకర్తనయ్యాను. మహిళలు, పిల్లలు, దళితుల ఉన్నతి కోసం పని చేయాలనే ఉద్దేశంతో 1996లో రెడ్స్ స్థాపించాను. ట్రాఫికింగ్‌కి గురైన మహిళలను కాపాడడం నుంచి, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, ఉమ్మడి అటవీ సంరక్షణ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పని చేశాను. మహిళల అక్రమ రవాణాకు పాల్పడిన ఏజెంట్లు కదిరిలో నా ఇంటిని కాల్చేశారు. దాంతో నా నివాసం అనంతపూర్ పట్టణానికి మారింది’’ అని తన సమాజ సేవాయాత్రను వివరించారు భానుజ. – వాకా మంజులారెడ్డి -
కౌలు రైతు దంపతుల ఆత్మహత్య
వైఎస్ఆర్ జిల్లా , గాలివీడు : గోరాన్‌చెరువు గ్రామం బీసీ కాలనీకి చెందిన పందికుంట యర్రంరెడ్డి(59), రెడ్డమ్మ(50) సోమవారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. మృతుడు యర్రంరెడ్డి కౌలుకు తీసుకున్న 5 ఎకరాలతో పాటు తన తల్లిపేరుతో ఉన్న రెండు ఎకరాల భూమిలో టమాట, వేరుశనగ పంటలు సాగు చేశాడు. ఇందుకోసం రూ, 6 లక్షలు అప్పు చేశాడు. నాలుగు సంవత్సరాల నుంచి సరైన వర్షాలు లేవు. సాగు చేసిన పంట చేతికి రాలేదు. అప్పుల భారం ఎక్కువైంది. మరోవైపు రూ లక్ష వ్యయంతో రెండేళ్ల కిందట మూడు పాడి ఆవులు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నాడు. సంవత్సరం కిందట పాడి ఆవులు మృత్యువాతపడ్డాయి. అప్పు చెల్లించాల్సిన గడువు సమీపించడంతో ఏమి చేయాలో దిక్కుతోచలేదు. దీంతో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఊరిబయట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి ముగ్గురు కుమారులు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రహంతుల్లా, సీఐ యుగంధర్, ఎస్ఐ ఇనాయతుల్లా, ఏఓ మధుసూధన్ మంగళవారం సంఘటన స్ధలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. -
మరాఠ్వాడాలో మరణ మృదంగం
సాక్షి ముంబై: మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలోనే 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల పలితాల అనంతరం అధికారం కోసం ఒకవైపు కుమ్ములాటలు కొనసాగుతున్న సమయంలోనే ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 300 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం ప్రకటించింది. 2019 అక్టోబరు 14 నుంచి 2019 నవంబరు 11వ తేదీ వరకు ఒక్క మరాఠ్వాడా ప్రాంతంలోనే 68 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే, 2019 నవంబరు నెలలో 300 రైతులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే దిగ్భ్రాంతికర విషయాన్ని రెవెన్యూ శాఖ శుక్రవారం వెల్లడించింది. అక్టోబర్‌లో అకాల వర్షాల కారణంగా మరాఠ్వాడాలో 70 శాతం ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో అక్టోబర్, నవంబర్ నెలలో ఆత్మహత్యలు 61 శాతం వరకు పెరిగినట్లు పేర్కొంది. ఇలా ఒకే నెలలో 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడటం 2015లోనూ చోటుచేసుకుందని తెలిపింది. -
ఏపీలో 409 మంది రైతుల ఆత్మహత్య: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగేళ్ళ కాలంలో 409 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి పురోషత్తమ్ రూపాల శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. గడచిన నాలుగేళ్ళ కాలంలో రాష్ట్రంలో 2 వేల మందికి పైగా రైతులు బలవన్మరణానికి పాల్పడిన విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? రైతు రుణమాఫీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోపాటు రుణాల ఊబిలో కూరుకుపోవడమే రైతు ఆత్మహత్యలకు కారణాలన్న విషయం వాస్తవమేనా అంటూ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. రైతు ఆత్మహత్యలపై ఏపీ ప్రభుత్వం అందించిన సమాచారాన్ని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో, జిల్లా స్థాయిలో ఏర్పాటైన త్రిసభ్య సంఘం సమర్పించిన నివేదికల ప్రకారం 409 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు మంత్రి వెల్లడించారు. ‘2014 నుంచి 2018 వరకు 409 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బోరు బావుల వైఫల్యం, భారీ ఖర్చుతో వాణిజ్య పంటల సేద్యం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభ్యం కాకపోవడం, నోటిమాటతో చేపట్టే కౌలు సేద్యం, బ్యాంకు రుణాలు పొందే అర్హత లేకపోవడం, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం, వర్షాభావం, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, పిల్లల చదువుల కోసం భారీగా వ్యయం, అనారోగ్యం వంటి అంశాలే రైతుల ఆత్మహత్యకు ప్రధాన కారణాలు. ఈమేరకు వివిధ జిల్లాలకు చెందిన త్రిసభ్య సంఘాలు గుర్తించాయి. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం. వ్యవసాయ రంగం అభివృద్ధి ఆయా రాష్ట్రాల ప్రాధమిక బాధ్యత. అయితే తగిన విధానపరమైన చర్యలు, బడ్జెట్ మద్దతు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు అమలు చేసే కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తుంద’ని కేంద్ర మంత్రి తెలిపారు. -
గాంధీ భవన్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
-
పంట పొలాల్లో మృత్యుగీతం
సాక్షి, అమరావతి: పచ్చటి పంటలు పండాల్సిన పొలాల్లో చావు డప్పు మోగుతోంది. బ్యాంకుల్లో రుణాలు మాఫీ కాకపోవడం.. కొండల్లా పెరిగిపోతున్న అప్పుల భారం.. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కకపోవడం వంటి కారణాలతో రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటిదాకా 28 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. కష్టాల సాగు చేయలేక అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం చలించడం లేదు. తనువు చాలించిన రైతుల కుటుంబాలను ఆదుకోవడం మాట అటుంచి.. కనీసం పరామర్శించేందుకైనా సీఎం, మంత్రులకు తీరిక చిక్కడం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వృద్ధి నానాటికీ పెరిగిపోతోందంటూ కాకిలెక్కలు చెబుతూ కాలం గడిపేయడం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పాలకులు గుర్తించడం లేదు. కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తూ అన్నదాతలను మరణ శయ్యలపైకి తోసేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో వెలుగులోకి వచ్చిన ఆత్మహత్యల సంఖ్య 28. బయటపడని బలవన్మరణాలు ఇంకెన్ని ఉంటాయో ఊహించుకోవచ్చు. నాలుగున్నరేళ్లలో 2,000 మంది.. రాష్ట్రంలోని 670 రెవెన్యూ మండలాలకు గాను 394 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 296 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు విషయంలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు రైతుల ఇళ్లల్లో ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉరికొయ్యలకు వేలాడుతున్నారని సాక్షాత్తూ ‘నాబార్డ్’ నివేదిక తేల్చిచెప్పింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో 2,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి. చనిపోయిన రైతు కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.5 లక్షల పరిహారాన్ని ఎగ్గొట్టేందుకు వారి ఆత్మహత్యలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆరోపిస్తున్నాయి. యువ రైతులే అధికం ఖరీఫ్ సీజన్ అధికారికంగా జూన్ 1న ప్రారంభమైంది. అదే నెల 27న సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో అట్టహాసంగా ఏరువాకకు శ్రీకారం చుట్టారు. రైతు చనిపోతే గరిష్టంగా రూ.2 లక్షల నష్టపరిహారం ఇస్తామంటూ తన పేరిట ఓ పథకాన్ని కూడా ప్రకటించారు. ఇప్పటికి దాదాపు 80 రోజులవుతోంది. ఒక్క రైతు కుటుంబానికైనా పరిహారం ఇచ్చిన పాపానపోలేదు. ఖరీఫ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో రైతుల బలవన్మరణాలు చోటుచేసుకున్నాయి. అర్ధాంతరంగా కన్నుమూస్తున్న వారిలో యువ రైతులే అధికంగా ఉండడం గమనార్హం. హామీలు మాఫీ చనిపోయిన రైతులందరి గోస దాదాపు ఒకటే. తాను అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదు. అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు నుంచి నోటీసులు వస్తున్నాయి. రుణాల కోసం కుదువపెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి. కొత్త అప్పులు పుట్టే మార్గం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఇంత చేసినా ఆఖరికి పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. అప్పుల కత్తి మెడపై వేలాడుతుండడంతో దిక్కుతోచక తనువు చాలిస్తున్నారు. పరిహారం ఇవ్వకుండా మొండిచేయి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ప్రకారం.. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న రైతులు సహజంగా చనిపోయినా రైతు బీమా పథకం కింద రూ.2 లక్షలు, 51 నుంచి 60 ఏళ్ల లోపు వారు చనిపోతే రూ.30 వేల పరిహారం వస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల లోపు రైతులు ప్రమాదవశాత్తూ మరణించినా, పూర్తి అంగవైకల్యానికి గురైనా రూ.5 లక్షల పరిహారం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రకరకాల సాకులు, నిబంధనలతో పరిహారం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల వివరాలను ప్రభుత్వం సేకరించడం లేదు. బాబు పాలనలో రైతుల ఆత్మహత్యల్లో వృద్ధి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నట్టు జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలు చెబుతున్నాయి. 2014తో పోలిస్తే 2015లో రైతుల ఆత్మహత్యలు 322 శాతం పెరిగాయి. 2014లో 160 మంది రైతుల ఆత్మహత్యలు నమోదు కాగా, 2015లో 516కి పెరిగినట్టు ఎన్సీఆర్బీ చెబుతుండగా అంతకు రెండు రెట్లు ఎక్కువ ఉంటాయని రైతు సంఘాల పేర్కొంటున్నాయి. 2016, 2017లో కూడా రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగింది. -
చితిలో కాలని అప్పు
‘ఏమైనా సుబ్బయ్యన్న చేసినంత పనులు చేయటం మనవల్ల కాదు. తొలకరి రాలగానే ముందు దున్నే పొలం ఆయనదే. ఊళ్లో అందరి కంటే ముందే పంట వేయడం దగ్గర్నుంచి, మబ్బుతో లేచి వెళ్ళి మోటారేయటం కూడా అందరి కంటే ముందే’ అన్నాడు లక్ష్మీపతి ఇంటిముందున్న అరుగు మీద కూర్చుంటూ. ‘ఆ...నిజమే. కానీ అంత తొందరగా వెళ్ళొద్దన్నా వినడు. అందరూ నాలుగింటికెళ్తే ఈయన రెండు గంటలకే బయల్దేరుతాడు‘ విసుగ్గా అంది సుబ్బయ్య భార్య మునెమ్మ రోజూ లేపి టార్చ్, దుప్పటి, కర్ర అని అడగటం, తలుపుకు గొళ్ళెం పెట్టుకొమ్మని మంచి నిద్ర పాడుచేస్తాడన్న కోపంతో. ‘మనం రైతులం. అదున్లో పనిచెయ్యాల. నిద్ర, సుఖం చూసుకుంటే బ్రతకటం కష్టం. ఏమంటావురా లక్ష్మీపతి?‘ భార్య ఇచ్చిన కాఫీ గ్లాసు తీసుకుంటూ అన్నాడు సుబ్బయ్య. అప్పటికే మునెమ్మ ఇచ్చిన కాఫీ ఊదుకుని తాగుతూ ‘అవునక్కా. మనూళ్ళో అంతా అన్న ఈ వయసులో కూడా ఇంత హుషారుగా వుంటాడని, కొడుకులు ఇద్దరున్నా వాళ్ళకైనా ఇంత హుషారు లేదని అనుకుంటా వుంటారు’ అన్నాడు లక్ష్మీపతి. ‘ఏం హుషార్లే మామా..చీకట్లో ఎళ్ళి ఎన్ని సార్లు గతుకుల్లో పడ్డాడో, పాము కరిసిందో నీకూ తెల్సుకదా? కొంచెం ఆగితే మేమూ వస్తామన్నా ఇనడు కదా?’ అన్నాడు పెద్ద కొడుకు మాణిక్యం. ‘అంతేనా అందరి కంటే ముందే పంట అమ్మేస్తాడు. అప్పుడు ధర వుండదు. ధర పలికే సమయానికి మన దగ్గర పంట వుండదు. అంత ఆత్రం దేనికి చెప్పు. కొంచెం ఆగమంటే వినడు. అందుకే ప్రతిసారీ మనకే నష్టాలెక్కువ‘ భుజం మీది తువ్వాలు విసురుగా విదిల్చి తలకు చుట్టి ఆవు దగ్గరికి నడిచాడు చిన్నకొడుకు రాజేంద్ర పాత్రలో పాలు పిండటానికి. ఇంతలో రాజేంద్ర భార్య రమ ఉత్తరం తెచ్చి భర్త చేతికిచ్చింది. రాజేంద్ర గిన్నె పక్కన పెట్టి చదవసాగాడు. ‘ఎక్కడ్నుంచిరా ఉత్తరం రాజేంద్రా?‘ అడిగాడు సుబ్బయ్య. ‘మన ఉత్తేజ్ దగ్గర్నుంచీ నాన్నా. ఎంట్రన్స్ పరీక్షలు బాగా రాశానని రాశాడు‘ చెప్పాడు రాజేంద్ర. ‘సరే మరి మన జయరాం సంగతేందిరా?‘ పెద్దకొడుకుని అడిగాడు. ‘ఇద్దరూ అక్కడ్నే కదా కోచింగులో చేరుండేది. వాడూ బాగానే రాసినానన్నాడు నాన్నా’ చెప్పాడు మాణిక్యం. ‘ఎందుకైనా గానీ మంచి కాలేజీల్లో చేర్చడానికి డబ్బులు రెడీ చేసుకోమని అంటున్నారన్నా పిల్లోళ్ళిద్దరూ’ మాణిక్యంతో అన్నాడు రాజేంద్ర. ‘దేవుని దయవల్ల మంచి మార్కులొచ్చి ఫ్రీ సీట్లొస్తే ఇద్దరికీ బాగుండు. తిరుపతి వెంకన్న దగ్గరికి కాలినడకన వస్తానని మొక్కుకున్నా కూడా’ చెప్పింది మాణిక్యం భార్య సువర్ణ. ‘అయినా పోయినేడు మన స్వాతి పెళ్ళికి చేసిన అప్పే ఇంకా తీరలేదు’ నిట్టూర్చాడు మాణిక్యం. ‘ఈ సంవత్సరం మామిడి తోట బాగా కాసింది కదన్నా. తీర్చేద్దాం లే’ అంటూ పొలానికి బయలుదేరాడు రాజేంద్ర. మాణిక్యం కూడా టౌన్‌కి ఎరువుల కోసం బయలుదేరాడు. వరిలో సరిగా దిగుబడి రాలేదు. మామిడి ఆ సంవత్సరం మంచి ధర పలకలేదు. అప్పులు సగమే తీరాయి. ఆశాజీవిగా మరో పంట వేయడానికి మాత్రం సుబ్బయ్య కుటుంబం వెనక్కు తగ్గలేదు. మళ్లీ నాట్లు, ఎరువులు అంటూ పొలం పని ఎప్పట్లా జరుగుతోంది. ఈలోగా పెళ్లికి అప్పిచ్చిన వాళ్లు ఇంటి మీదికొస్తుంటే మునెమ్మ గాజులకు, సువర్ణ నెక్లెస్‌కు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. ఆ రాత్రి పెందలాడే భోంచేసి ముసుగుతన్నాడు సుబ్బయ్య. తొలికోడితో బాటే నిద్రలేచి ఏమనుకున్నాడో గానీ మునెమ్మను లేపకనే కర్ర, టార్చ్, దుప్పటి తీసుకుని తలుపు దగ్గరికి వేసుకుని వెళ్ళిపోయాడు. ఉదయం ఆరవుతోంది. నిద్రలేచి మునెమ్మ ముఖం కడుక్కొచ్చేలోగా వీధిలో కేకలు, గొడవ. ఇంట్లో వాళ్లంతా బయటకు పరుగుతీశారు. ఇద్దరు మనుషులు సుబ్బయ్య దేహాన్ని మోసుకొచ్చి వరండాలో పడుకో బెట్టారు. ఐదు గంటలకు పొలం వైపెళ్తున్న శివరాం గమనించాడట. హైటెన్షన్ వైరు మీద కాలేసి చచ్చిపడున్న సుబ్బయ్యను. చుట్టుపక్కల అందర్నీ కేకలేసి అంతా కలిసి పట్టుకొచ్చి చూసేసరికే ప్రాణం పోయి ఎంతసేపో అయ్యి వొళ్లు కర్రలా బిగుసుకుపోయుందట. సాయంత్రానికి సుబ్బయ్య దేహం మట్టిలో కలిసిపోయింది. మునెమ్మ అమ్మగారింటి వాళ్లు వచ్చారు. చివరిగా పసుపు కుంకుమలిచ్చి వెళ్ళారు. ‘ఒరే రాజేంద్రా! మామ ఫొటో పెద్దగా వుండి మన వాళ్లందరి పేర్లతో చుట్టుపక్కల పల్లెలందరికీ తెలిసేలా నాలుగైదు పేపర్లలో వేయించరా. అప్పుడే మన ఇంటిపేరు, మనం ఎంత ఘనంగా ఆయనకు కర్మ చేస్తున్నామో తెలిసేది‘ అన్నాడు వెనకింటి సుబ్బయ్య తమ్ముని కొడుకు నారాయణ. రాజేంద్ర, మాణిక్యం తమ కొడుకుల్ని ఆ పని చూడమని టౌనుకి పంపించారు. సాయంత్రానికి కాళ్లీడ్చుకుంటూ వచ్చారు వాళ్లు. ‘మనం అనుకున్నంత సైజుతో నాలుగైదు దినపత్రికల్లో వెయ్యాలంటే వందలు కాదు వేలు కావాలి ఏ మూలకూ సరిపోవు’ అని చెప్పారు. ‘అయితే ఏమైందిలేరా వెధవ డబ్బు ఇయ్యాళుంటుంది రేపు వుండదు. కానీ ఎప్పటికీ నిలిచేది మనం ఎంత గ్రాండ్‌గా ఆయన కర్మ చేశామన్నదే రా’ అన్నాడు నారాయణ. అప్పుడొచ్చాడు సుబ్బయ్య చిన్నతమ్ముడు ధనుంజయులు. ‘ఒరేయ్ అబ్బాయిలూ! అన్నకు సమాధి మాత్రం గ్రానైటు రాయితో బాగా కట్టించాల్రా. చుట్టుపక్కల ఏ వూళ్లో లేనంత బాగా వుండాలి’ అన్నాడు. ‘అది సరేగానీ అన్నా.. ముందు కర్మ రోజు ఏమేం వంటలనుకున్నారు? నా కూతురు వాళ్ల అత్తగారు, కోడలు వాళ్ల బంధువులు కూడా వస్తున్నారు బెంగళూరు, చెన్నైల నుంచి. మా అన్న కర్మంటే వాళ్లు భలే జరిగిందని అనుకోవాలి. లేకుంటే నాకు పరువు తక్కువ‘ అంది సుబ్బయ్య చెల్లెలు వరలక్ష్మి. ‘అదంతా రెడీనే అత్తా.. ఏమీ తక్కువ కాదు. లడ్డూ, జాంగ్రీ రెండురకాల వేపుళ్ళు, మూడురకాల పచ్చళ్ళు, రెండురకాల అన్నాలు, మామూలు అన్నం సాంబారు, అప్పడం వడియాలు, దప్పళం..’ అని మాణిక్యం చెప్తుంటే అడ్డొచ్చిందామె మళ్ళీ. ‘ఏంటీ ఇవన్నీ వంటవాళ్ళతోనా? సరుకులు సరంజామా అందిస్తూ మీరు కూర్చుంటే మా సంబంధులు మీరు బాగా రిసీవ్ చేసుకోలేదని అలుగుతార్రా. అయినా ఈ రోజుల్లో వంటవాళ్ల కన్నా కేటరింగ్‌కి ఆర్డర్ చేసేయండి. నా కొడుకు విజయ్ లేడూ వాడి ఫ్రెండ్‌ది ప్రక్క టౌన్లోనే కేటరింగ్ సర్వీస్. వాడు ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తారు. డబ్బులిచ్చేయండంతే‘ అని తేల్చేసింది వరలక్ష్మి. ‘మాణిక్యం... మీరేమన్నా చేసుకోండి. కానీ మనూళ్లో పక్కూళ్లలో అంతా ఉన్న పద్ధతి ప్రకారం మర్చిపోకుండా కర్మ రోజు రాత్రి కథ చెప్పించాల్రా. ఏముంది... కథ చెప్పేవాళ్ళకు అన్నం పెట్టి ఓ పదివేలిస్తే చాలు’ అన్నాడు ఎదురింటి వెంకటేశ్వర్లు. తలలు ఊపారు గానీ మాణిక్యం, రాజేంద్రల ముఖాల్లో కళ లేకుండా పోయింది. రాత్రంతా ఇద్దరూ మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. ఒకసారి పోతే పోయిందిలే వెధవ డబ్బులు తండ్రి కోసమే కదా! అప్పుచేసైనా ఖర్చుపెట్టి నలుగుర్లో తండ్రికి బాగా చేయాలని అనుకున్నా, మరోసారి ఎలా తీర్చాలి ఇంతప్పు? ఇప్పుడున్న అప్పునే ఇంకా తీర్చలేదన్న భయం మరోవైపు అనిపించి. తెల్లవారు జామున కలత నిద్రపోయారు. దినం రోజుకు రెండ్రోజుల ముందొచ్చాడు మునెమ్మ తమ్ముడు. ‘ఒరేయ్ అబ్బాయిలూ! మా అక్క మెడ తరువాత బోసిగా వుండకూడదు. ఒకడు మెడలోకి పగడాలు, ముత్యాలతో హారం చేయించాలి. ఇంకొకడు నాలుగు గాజులు చేయించి చేతికి రెండు చొప్పున వేయండి. లేకుంటే సుబ్బయ్య కొడుకులు తల్లిని బికారి దాన్లా వదిలేశారని అనుకుంటారు. ఎక్కడికి పోతుంది? అంతా మీకే కదా?‘ అన్నాడు. ‘అంతా సరే గానీ దినం రోజు వంటలు తిని, గ్రానైటు రాయితో సమాధి కడితే సరిపోదురా. అవన్నీ ఆయన ఆత్మను స్వర్గానికి తీసుకుపోవు. ఒక మంచి పాడి ఆవును దూడతో సహా దానమివ్వాలి, కనీసం మీ శక్తికొద్దీ బంగారం, బట్టలు, కాసంత భూదానం కూడా చేస్తే ఎకాఎకిని ఆత్మ స్వర్గానికెళ్లిపోతుందట. పెదనాయన ఆత్మ అలమటిస్తే మనకే మంచిది కాదురా రాజిగా‘ ముక్కుచీదుతూ చెప్పింది సుబ్బయ్య పెద్ద తమ్ముడు కూతురు శ్యామల. ఆ రాత్రి రాజేంద్ర కనిపించలేదు. రాత్రి పది గంటల వరకు వెతికి వెతికి అంతా భయపడిపోయారు. చివరికి మర్నాడు ఉదయం రాజేంద్ర కొడుకు ఏడుస్తూ ఒక ఉత్తరం పట్టుకొచ్చి మాణిక్యం చేతికిచ్చాడు.‘అన్నా. నాన్న దినం బాగా జరగాలి. ఇప్పుడు ఇంట్లో వున్న మన కొడుకుల కాలేజీ సీట్ల కోసం అప్పుచేసి తెచ్చిన డబ్బులు సరిపోవు. మన ఈరిగాడు ఎవరికో కిడ్నీ కావాలని చెప్తుంటే విన్నాను. రెండు మూడు లక్షలు ఇస్తారంట. మనిషికి ఒక కిడ్నీ సాలంట. నాకేమి భయం లేదు. పెద్దకొడుకువి కాబట్టి నువ్వుంటే చాలు దినాలకు. నా కొడుకుతో పంపితే నేను హాస్పిటల్లోనే పుణ్యావాసం నీళ్ళు చల్లించుకుంటా. వారం రోజులకే ఇంటికొచ్చేస్తా’ అని రాసుంది. అది విన్న మునెమ్మకు ఎక్కడలేని ఆవేశం వచ్చేసింది. ‘రేయ్ మాణిక్యం.. ఎళ్ళి ఈరిగాడ్ని పట్టుకోని తమ్ముడ్ని తీసుకురా. ఒక్కపైసా కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. కార్డులేసి అందరికి దినం పత్రికలు పంపావుకదా అది సాలు. కథలు చెప్పించాల్సిన అవసరం లేదు. ఆత్మ వచ్చి కథలు వినదు. దానధర్మాలు మనస్ఫూర్తిగా వున్నప్పుడు వున్నదాంట్లో చెయ్యాలిగానీ అప్పులు చేసి చెయ్య పనిలేదు. భర్తపోయిన దుఃఖంలో వున్న నాకిప్పుడు నగలు సింగారించుకోవాలన్న కోరికేం లేదు. అసలు చనిపోయిన ఆయనే బ్రతికుంటే అప్పు చేసిన డబ్బులతో గ్రానైట్ సమాధి కడతానంటే ఒప్పుకునేవాడు కాదు. దానికన్నా మనవళ్ల చదువే ముఖ్యం. ఎవరి పరువు కోసమో, ఎవరి గొప్పల కోసమో మనం ప్రాణాల మీదికి తెచ్చుకోవాల్సిన పనిలేదు. వెళ్ళండ్రా’ అని కోపంగా అరిచేసరికి ఎక్కడి వాళ్ళక్కడ తేలుకుట్టిన దొంగల్లా జారుకున్నారు. మాణిక్యం, కొడుకులు అంతా వెళ్ళి ఆపరేషన్ టేబుల్ ఎక్కకముందే రాజేంద్రను వారించి ఇంటికి తీసుకొచ్చారు. మర్నాడు సిమెంటుతో కట్టిన తండ్రి సమాధికి పూజలు చేశారు. పంతులుకి దక్షిణ ఇచ్చారు. వంటవాళ్ళతో రుచికరమైన భోజనం చేయించి వడ్డించారు. అంతా హాయిగా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కాలచక్రం పదేళ్లు తిరిగింది. మాణిక్యం కొడుకు ఇప్పుడు ఎందరికో కిడ్నీ వ్యాధుల్ని నయం చేసే స్పెషలిస్ట్ డాక్టరయ్యాడు. రాజేంద్ర కొడుకు ఇంజనీరై తాతకు మాంచి గ్రానైటు రాయితో, మెరిసే అక్షరాలు, సుబ్బయ్య ఫొటోతో సమాధి కట్టాడు. అంతే కాదు, ఆరోజు ముఖం తిప్పుకుంటూ వెళ్లిన వాళ్లంతా పెదవుల్లో నవ్వుల్ని సాగదీసుకుంటూ పెళ్లి సంబంధాలు చూడటానికి ఎగబడ్తున్నారు. లోకం నాలుకకు ఎన్నో చీలికలు. మనం అవసరమైనవే తీసుకోవాలి. లేదంటే ప్రతి నాలుకా విషపు కోరలతో వెంటబడుతుంది. ఆరోజు కాలిపోయిన సుబ్బయ్య కట్టె కోసం అప్పులు కూడా కరిగిపోయుంటే మిగిలిన వాళ్ళంతా కూడా జీవచ్ఛవాలయ్యేవాళ్లు. అందుకే తాహతునుబట్టి బతికినపుడే పైకెదిగే అవకాశం వుంటుంది. అనవసర గొప్పలకు పోకుంటే బాగుపడ్తారనటానికి సుబ్బయ్య కుటుంబమే ఉదాహరణైంది. - డేగల అనితాసూరి -
కాటేసిన కరువు
ఎండిపోయిన పైర్లు.. బీళ్లుగా మారిన పొలాలు.. కబేళాలకు తరలుతున్న పశువులు, వలస బాట పట్టిన రైతన్నలు.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రామాల్లో ఇలాంటి హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. అన్నదాతలు కరువు కాటుకు చిక్కి విలవిల్లాడుతున్నారు. పంటల సాగు కోసం చేసిన అప్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతటి కరువును తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని రైతులు బోరుమంటున్నారు. దుర్భిక్షం ధాటికి పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్న తమను ప్రభుత్వం సైతం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంట చేతికి రాక, ఉన్న ఊళ్లో బతుకుదెరువు లేక పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. రాయలసీమ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన పంట భూములు కరువు ధాటికి బీళ్లుగా మారాయి. జూన్ ఆరంభంలో అరకొర వర్షాలకు విత్తిన పైర్లు వాడిపోయాయి. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆలూరు, అనంతపురం జిల్లాలోని కదిరి, గుత్తి, వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, గాలివీడు, చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు, పెద్దమండ్యం తదితర ప్రాంతాల్లో ఎండిపోయిన వేరుశనగ పైర్లను ట్రాక్టర్లతో దున్నేస్తున్న దృశ్యాలు కంటతడి తెప్పిస్తున్నాయి. తేమలేక ఎండిపోయిన ఉల్లిని చాలామంది రైతులు పీకకుండానే అలాగే పొలాల్లో వదిలేశారు. టమోటా, మిరప, బెండ తదితర కూరగాయల తోటలు సైతం చేతికి రాకుండా పోయాయి. అప్పులు చేసి వేసిన పంటలు కరువు కాటుకు మట్టిలోనే కలిసి పోవడంతో రైతన్నలు కుమిలిపోతున్నారు. చేసిన అప్పులు భయపెడుతున్నాయి. చాలాచోట్ల తాగడానికి గుక్కెడు నీరు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. దుర్భిక్షం వల్ల మేత, నీరు సమకూర్చడం కష్టం కావడంతో చాలామంది రైతులు విధిలేని పరిస్థితుల్లో పశువులను కారుచౌకగా కబేళాలకు విక్రయిస్తున్నారు. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు లారీల్లో కబేళాలకు తరలిపోతున్నాయి. ఇప్పటికే రాయలసీమ నుంచి ఎంతోమంది అన్నదాతలు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్లారు. వేరుశనగ రైతులకు రూ.2,250 కోట్ల నష్టం రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంట 90 శాతానికి పైగా ఎత్తిపోయింది. ఇప్పటికే పంట కాలం పూర్తికావడం వల్ల పశువుల మేతకైనా మొక్కలు బాగా పెరిగే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రెయిన్ గన్లతో సెంటు భూమి కూడా ఎండిపోకుండా పంటలను కాపాడామని ఘనంగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఈ ఏడాది రెయిన్ గన్ల ఊసే మర్చిపోయింది. రాయలసీమలో 16.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కాగా, 15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది దీంతో రైతులు రూ.2,250 కోట్ల మేర నష్టపోయినట్లు అనధికారిక అంచనా. మండుతున్న ఎండలు.. వట్టిపోతున్న బోర్లు రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అధికారిక గణాంకాల ప్రకారం 16.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కాగా, ఇందులో 90 శాతం పంట ఎండిపోయింది. కర్నూలు జిల్లాలో 50.3 శాతం, అనంతపురం జిల్లాలో 47.4 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో పంటలన్నీ ఎండిపోయాయి. వేసవి కాలాన్ని తలపించేలా ఎండలు మండుతున్నాయి. రెండు మూడు రోజుల క్రితం రాయలసీమలో అక్కడక్కడా కొద్దిపాటి వర్షం పడింది. ఎండిపోయిన పంటలు ఈ వర్షానికి కొంచెం పచ్చగా మారినా మళ్లీ ఎండ తీవ్రత వల్ల వాడిపోతున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చేతికందాల్సిన దశలో ఉల్లిపంట చాలావరకు ఎండిపోయింది. దిగుబడి 25 నుంచి 30 శాతం లోపే వచ్చిందని రైతులు వాపోతున్నారు. వర్షాధారంగా వేసిన పంటలే కాకుండా బోర్ల కింద వేసిన పైర్లు కూడా ఎండిపోతున్నాయి. వరుస కరువులతో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. చందోలిలో నీటికి కటకట కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని చందోలి గ్రామంలో 400 ఇళ్లు ఉన్నాయి. ఈ గ్రామస్థులు తాగునీరు దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామంలో గత నాలుగేళ్లలో 14 బోర్లు వేసినా అన్నీ ఎండిపోయాయని, ఒక బోరులో మోటారు వేస్తే కొద్దిసేపు సన్నటి ధార వచ్చి ఆగిపోతోందని సర్పంచి లక్ష్మీదేవి కుమారుడు రంగప్ప తెలిపారు. గ్రామంలోని బోర్ల నుంచి నీరు రానందున గ్రామస్థులు పొలాల్లో కొద్దికొద్దిగా బోర్ల నుంచి వస్తున్న నీరు తెచ్చుకుంటున్నారని, పంటలు ఎండిపోతున్నందున పొలాల యజమానులు అభ్యంతరం చెబుతున్నారని రంగప్ప వివరించారు. గొర్రెలు, మేకలు ఉన్న వారు ఎడ్ల బండిలో డ్రమ్ములు పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. సీమలో 51.1 శాతం వర్షంపాత లోటు రాయలసీమలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఈ సీజన్లో ఇప్పటి (జూన్ 1 నుంచి సెప్టెంబర్ 12వ తేదీ) వరకూ రాయలసీమ జిల్లాల్లో 329.2 మిల్లీమీటర్ల సగటు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 160.9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సాధారణం కంటే 51.1 శాతం తక్కువ వర్షం కురవడం వల్ల పంటలు ఎండిపోయాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ కరువు తీవ్రత అధికంగానే ఉంది. వర్షాభావం వల్ల పంటలు చేతికి రాలేదు. గుంటూరు జిల్లాలో 16.1 శాతం లోటు వర్షపాతమే ఉన్నప్పటికీ పల్నాడు ప్రాంతంలో కరువు ఎక్కువగా ఉంది. ఇలాంటి కరువు ఎప్పుడూ చూడలేదు రాయలసీమ జిల్లాల్లో కరువు వల్ల పనులు దొరక్క, ఉపాధి కోసం ఇప్పటికే చాలామంది రైతులు, రైతు కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వలస వెళ్ల లేని వారు గ్రామాల్లో రచ్చబండలు, గ్రామ చావిళుపై కూర్చుని తీవ్రంగా మథన పడుతున్నారు. పెద్దవయసు వారు పొద్దుపోక మేక–పులి ఆట ఆడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని చందోలి గ్రామంలోని సుంకులమ్మ గుడి వద్ద కూర్చున్న కొందరు రైతులను ‘సాక్షి’ పలుకరించగా.. ఇంతటి కరువును తాము ఇప్పటివరకూ చూడలేదని 65 ఏళ్ల వీరన్న, 64 ఏళ్ల తిమ్మప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికే మా గ్రామం నుంచి చాలామంది పనుల్లేక వలస వెళ్లారు. త్వరలో పీర్ల పండుగ ఉందని ఆగాం. పండుగ తర్వాత పౌర్ణమికి మేము కూడా బెంగళూరుకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాం’’ అని చందోలి గ్రామంలోని పలువురు రైతన్నలు చెప్పారు. చివరకు అప్పులే మిగిలాయి ‘‘రెండెకరాల్లో పత్తి, ఒకటిన్నర ఎకరాల్లో వేరుశనగ పంటలు వేశా. నీరు సరిపోదనే ఉద్దేశంతో పత్తికి డ్రిప్ పెట్టా. రూ.40 వేలు వెచ్చించి రాళ్లతో పెద్ద తొట్టి కట్టించా. బోరు నుంచి మొదట నీటిని ఈ తొట్టిలోకి మోటారు ద్వారా ఎక్కించి, తర్వాత తొట్టి నుంచి డ్రిప్ ద్వారా పొలానికి అందించి పంటలను రక్షించుకునేందుకు ప్రయత్నించా. దురదష్టవశాత్తూ పత్తి పంట రెండడుగుల ఎత్తు కూడా పెరగకముందే బోరు ఎండిపోయింది. పత్తి, వేరుశనగ పంటలు చేతికి రాలేదు. ఇన్నాళ్లూ నేను చేసిన కష్టమంతా మట్టిపాలైంది. చివరకు అప్పులే మిగిలాయి’’ – కురువ ఆనంద్, పత్తికొండ, కర్నూలు జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి ‘‘వేరుశనగ ఎండిపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు కోల్పోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. గత నాలుగేళ్లుగా వర్షాభావంతో పంటలు పండలేదు. ఐదు ఎకరాల్లో వేరుశనగ వేస్తే పూర్తిగా ఎండిపోయింది’’ – చింతల రాయుడు,టీఎన్ పాళ్యం, అనంతపురం జిల్లా రూ.30 వేల పెట్టుబడి మట్టిపాలు ‘‘నాకున్న రెండు ఎకరాల్లో వేరుశనగ వేశా. ఇందుకోసం రూ.30 వేలు పెట్టుబడిగా పెట్టా. జూన్‌లో కురిసిన వానకు పంట వేశా. ఆ తరువాత చినుకు జాడేలేదు. దీంతో పంటంతా ఎండిపోయింది. కనీసం పశువుల మేతకు కూడా పనికిరాలేదు. పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలైంది’’ – దుగ్గిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, దేవలంపల్లె, లక్కిరెడ్డిపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా -
ఉసురు తీసిన అప్పులు
గోనెగండ్ల/ నందికొట్కూరు/ గూడూరు రూరల్/ బొమ్మనహాళ్: వరుస పంట నష్టాలు వారిని అప్పుల్లోకి నెట్టాయి. ఆదుకోవాల్సిన సర్కారు చోద్యం చూస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కాల క్షేపం చేస్తోంది. దీంతో దిక్కుతోచని రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోగా.. అనంతపురంలో మరొకరు తనువు చాలించారు. అన్నదాతలపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దంపడుతున్న ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూరు గ్రామానికి చెందిన బెస్త మల్లయ్యకు(58) ఐదెకరాల పొలం ఉంది. వర్షాభావంతో నాలుగేళ్లుగా పంటలు సక్రమంగా పండకపోవడంతో పాటు వాటికి గిట్టుబాటు ధర లభించలేదు. ఈ ఏడాదీ వేసిన పత్తి వర్షాల్లేక ఎండిపోయింది. దీంతో సాగుకు, కుటుంబ పోషణ నిమిత్తం చేసిన ప్రైవేట్ అప్పులు దాదాపు రూ.6లక్షలకు చేరాయి. రుణదాతల ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో వీటిని తీర్చే మార్గం కానరాక ఆదివారం రాత్రి పురుగు మంది సేవించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మల్లయ్య మరణించాడు. పంటలు పండక.. అప్పులు తీర్చలేక.. నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి చెందిన ఎద్దుల రాజేశ్వరరెడ్డి (26) నాలుగేళ్లుగా పంట నష్టాలను చవిచూశాడు. రెండేళ్ల క్రితం అప్పులు తీర్చేందుకు ఐదెకరాల సొంత భూమి అమ్మినా అప్పులు పూర్తిగా తీరలేదు. ఈ నేపథ్యంలో 22 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రెండేళ్లుగా సాగు చేస్తున్నా పంటలు సక్రమంగా పండలేదు. దీంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులు రూ.8 లక్షలకు పైగా చేరాయి. బంగారు తాకట్టు పెట్టి రూ.2.50 లక్షలు కూడా తీసుకున్నాడు. అప్పులన్నీ తలకు మించిన భారం కావడంతో ఈ నెల 4వ తేదీ రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొనఊపిరితో ఉన్న రాజేశ్వరరెడ్డిని కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పొలంలోనే పురుగుమందు సేవించి.. ఇదే జిల్లా గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన చాకలి చిన్న గిడ్డన్న (45) తనకున్న 2.25 ఎకరాల భూమితో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పంటలు సాగుచేసేవాడు. మూడేళ్లుగా ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. గత ఏడాది ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా పత్తి పంట పూర్తిగా ఎండిపోయింది. అప్పులు తీర్చే పరిస్థితి కనిపించక ఈ నెల 7న పొలంలోనే పురుగుల మందు తాగాడు. రైతులు, కూలీలు అతన్ని కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. పంటను కాపాడుకోలేక... అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన దాసరి హనుమంతప్ప కుమారుడు దాసరి నాగరాజు(24)కు 1.5 ఎకరాల పొలం ఉంది. వరి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు, క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రి చికిత్సకు రూ.3.50 లక్షల దాకా అప్పు చేశాడు. బ్యాంకుల్లో పంట రుణం కింద రూ.2లక్షలు తీసుకున్నా వడ్డీలకే సరిపోయింది. దీంతో కొంతకాలం బళ్లారిలో కూలీగా, ఆ తర్వాత ఆటో డ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవల గ్రామం చేరుకుని వరి సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపుగా ఉన్న పంటను కాపాడుకునేందుకు అవసరమైన డబ్బు చేతిలో లేకపోవడం.. అప్పటికే అప్పులు ఎక్కువవడంతో అప్పు దొరికే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మౌలిక సదుపాయాల మాటేమిటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నివారణకు ఏర్పాటైన రైతు రుణవిమోచన కమిషన్‌కు.. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన రైతు సాధికార సమితికి అవసరమైన సిబ్బందితోపాటు పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. సిబ్బంది, మౌలిక సదుపాయాలు ఇచ్చినప్పుడే ఏ లక్ష్యంతో రైతు రుణ విమోచన కమిషన్, రైతు సాధికార సమితులను ఏర్పాటు చేశారో, ఆ లక్ష్యం నెరవేరుతుందని తెలిపింది. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో వివరించేందుకు ఆ ప్రభుత్వాలకు గడువునిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వు లు జారీ చేసింది. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకునేలా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కొల్లి శివరామిరెడ్డి, పాకాల శ్రీహరిరావు మరికొందరు కోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఇటీవల ధర్మాసనం విచారణ జరిపింది. రైతు రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, తాము రైతు సాధికార సమితి ని ఏర్పాటు చేసినట్లు ఏపీ న్యాయవాది వివరించారు. వాటికి మౌలిక సదుపాయాలు, సిబ్బంది కేటాయింపుల గురించి ధర్మాసనం ఆరా తీసింది. రైతుల సమస్యల పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థల సేవలను ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడింది. -
దిగుబడి తగ్గి.. దుఃఖం మిగిలి
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారు. అయితే ఉల్లి పండించే రైతులకు మాత్రం ఎలాంటి మేలూ జరగడం లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడులు తగ్గినా..గిట్టుబాటు ధర లభించడం లేదు. తీవ్ర నష్టాలు వచ్చి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదు. రాష్ట్రంలో ఉల్లి పంట అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే సాగు అవుతోంది. ఖరీఫ్ సాధారణ సాగు 20,357 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 18,500 హెక్టార్లలో సాగైంది. దిగుబడులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఎకరాకు కనీసం 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చి.. ధర రూ.1500 లభిస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఈ ఏడాది వర్షాభావంతో ఉల్లి పంట దెబ్బతిని..ఎకరాకు సగటున 50 క్వింటాళ్లు కూడా రావడం లేదు. కర్నూలు మార్కెట్లో ధర రూ.800 కూడా పలకడం లేదు. పట్టించుకోని ప్రభుత్వం.. ధరలు లేనపుడు ఉల్లి రైతులు నష్టపోకుండా టీడీపీ మంత్రులు స్పష్టమైన హామీలు ఇచ్చారు. గతంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న పరటాల సునీత.. కర్నూలు మార్కెట్‌ను సందర్శించి గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నదాతలకు భరోసానిచ్చారు. ధరలేనప్పుడు ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేస్తుందని చెప్పారు. హామీ ప్రస్తుతం అమలు కావడం లేదు. ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు ఉల్లి రైతులు బలవన్మరణాలకు పాల్పడారు. ధర వచ్చింటే బాబూరావు బతికుండేవాడేమో.. సి.బెళగల్ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన బండారి బాబురావు రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. అప్పు తెచ్చి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. వర్షాభావ పరిస్థితుల్లో కేవలం 35 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. దీనిని కర్నూలు మార్కెట్‌కు తీసుకరాగా.. క్వింటాకు రూ.600 మాత్రమే ధర లభించింది. చేతికి రూ.21 వేలు మాత్రమే రావడంతో అప్పు తీర్చే మార్గం కానరాక గత నెల 28న కర్నూలు మార్కెట్ యార్డులోనే పురుగుల మందుతాగాడు. చికిత్స పొందుతూ... శనివారం మృతిచెందాడు. గిట్టుబాటు ధర వచ్చి ఉంటే బాబురావు బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. 90 శాతం రైతులకు అతి తక్కువ ధరే.. కర్నూలు మార్కెట్‌కు వచ్చే ఉల్లి రైతుల్లో పది శాతం మందికి క్వింటాకు రూ.300లోపే ధర లభిస్తోంది. 30 శాతం మంది రైతులకు రూ.301 నుంచి రూ.600 వరకు ధర వస్తోంది. ఎక్కువగా 50 శాతం మంది తెచ్చిన సరుకుకు రూ.601 నుంచి రూ.800 వరకు ధర లభిస్తోంది. మొత్తం 90 శాతం మంది రైతులకు గిట్టుబాటు ధర లేదనే చెప్పొచ్చు. కేవలం 10 శాతం మంది రైతులకు మాత్రమే రూ.1000 ఆపైన ధర లభిస్తోంది. నష్టాలను ఎలా భరించాలి? మూడు ఎకరాల్లో ఉల్లిసాగు చేశాను. పెట్టుబడులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోతే అప్పు తెచ్చుకున్నాను. ఎకరాకు రూ.50 వేల ప్రకారం రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాను. వర్షాలు పడక పంట అభివృద్ధి చెందలేదు. బోరు ఉన్నా నీరు అడుగంటి పోయింది. దిగుబడులు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయి. ప్రస్తుత ధరల్లో అమ్ముకుంటే రూ.60వేలు కూడా దక్కే పరిస్థితి లేదు. నష్టం రూ.90వేల వరకు ఉంటోంది. ఇంత భారీ స్థాయిలో నష్టాలను ఎలా భరించాలో తెలియడం లేదు. వెంకటేష్, పొన్నకల్ గ్రామం, గూడూరు మండలం -
ఇవి సర్కారీ హత్యలు
ఆలూరు /కర్నూలు సిటీ: సక్రమంగా అమలు కాని రుణమాఫీ రైతుల ఉసురు తీసుకుంటోంది. రుణం మాఫీ అవుతుందని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న కర్షకులకు మనోవేదనే మిగుల్చుతూ బలవన్మరణాలకు పాల్పడేలా చేస్తోంది. విడతల వారీగా అరకొరగా చేస్తున్న రుణ మాఫీ వడ్డీలకు కూడా సరిపోవడంలేదు. అప్పునకు వడ్డీ పెరిగిపోగా బ్యాంకు నోటీసులు పంపడంతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుంబళబీడు గ్రామంలో మంగళవారం ఇలాంటి దుర్ఘటనే చోటుచేసుకుంది. రుణమాఫీ సక్రమంగా కాక బ్యాంకు అప్పు పేరుకుపోవడంతో గ్రామానికి చెందిన బోయ నెరణికి రామయ్య (63), అతని భార్య వండ్రమ్మ (58) బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామయ్యకు 3.75 ఎకరాల పొలం ఉంది. ఇందులో బోరు తవ్వించుకొని మిరప, పత్తి సాగు చేస్తున్నారు. పంటల సాగు నిమిత్తం 2011లో ఆలూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో జాయింట్ అకౌంట్లో (ఖాతా నంబర్ 19059135974) రూ.81 వేలు అప్పుగా తీసుకున్నారు.వడ్డీతో కలిపి 2014 నాటికి రూ.1,12,955 అయింది. అర్హత రావడంతో మొదటి విడత రూ.27,219, రెండో విడత రూ.23,900, మూడో విడత రూ.25,101 మాఫీ అయింది. మిగతా రెండు విడతల్లో రూ. 41,831 రైతు ఖాతాలోకి జమ కావాల్సి ఉంది. అయితే పంట సాగుకోసం 2015 సెప్టెంబర్‌లో రైతు రామయ్య రూ.41,831 చెల్లించి రూ.1,23,000 అప్పును రెన్యువల్ చేయించుకున్నారు. నాలుగేళ్లుగా పంటలు పండకపోవడంతో అప్పు చెల్లించలేపోయారు. దీంతో అప్పు వడ్డీతో కలిపి రూ.1,54,000 అయింది. ఈ నేపథ్యంలో అప్పు చెల్లించాలని ఆగస్టు 17వ తేదీన లాయర్ ద్వారా రైతు రామయ్యకు ఏపీజీబీ అధికారులు నోటీసు పంపారు. ఈ ఏడాది పంటలు పండకపోవడంతో రైతు చేతిలో చిల్లగవ్వ లేదు. బ్యాంకు అధికారులు ఇంటికి తాళాలు వేస్తారేమోననిని మనస్తాపం చెంది.. దంపతులిద్దరు సోమవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగారు. మంగళవారం ఉదయం విషయాన్ని గమనించి బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుల బాధతోనే తమ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారని కుమారులు తిమ్మప్ప, లేపాక్షి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ ఐపీసీ 174 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ దస్తగిరి బాబు తెలిపారు. రైతు దంపతుల ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. రైతు దంపతుల ఆత్మహత్యపై విచారణ రైతు దంపతుల ఆత్మహత్యపై డివిజనల్ స్థాయి కమిటీతో విచారణ చేయించామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రుణ మాఫీ కింద మూడు విడతలు రైతు బ్యాంక్‌ఖాతాకు జమ అయిందన్నారు. మిగిలిన రెండు విడతలు రావాల్సి ఉండగా వారు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వ దృష్టికి తీసుకపోయి ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవి బాబు హత్యలు – కర్నూల్ జిల్లా రైతు దంపతులకు రూ.20లక్షల పరిహారం ఇవ్వాలి – వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి సాక్షి, విశాఖపట్నం: రైతు రుణమాఫీ అమలు కాక... బ్యాంకుల నుంచి నోటీసులొస్తుంటే ఆత్మాభిమానం చంపుకోలేక రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనేందుకు యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లా తుమ్మల గుంట గ్రామానికి చెందిన రైతు రామయ్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితి అద్దంపడుతోందన్నారు. ఇవి ఆత్మహత్యలు కావు.. బాబు చేసిన హత్యలని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యలేనన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తరపున ఒక్కటే హామీ ఇస్తున్నాం.. ఆర్నెల్లు ఓపిక పట్టండి.. మనందరి ప్రభుత్వం వస్తుంది.. జగన్ నాయకత్వంలో రైతులకు మళ్లీ సువర్ణయుగం వస్తుందన్నారు. కర్నూలులో ఆత్మహత్యకు పాల్పడిన రామయ్య దంపతుల కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి, అనకాపల్లి పార్లమెంటు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సుంకర రుద్రి తదితరులు పాల్గొన్నారు. -
వీర జవాన్, పేద కిసాన్లకు 2.5 కోట్లు
ముంబై: వీర జవాన్ కుటుంబాలు, పేద రైతులను ఆదుకునేందుకు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముందుకు వచ్చారు. అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు రూ.కోటి, రైతుల రుణమాఫీకి మరో రూ.1.5 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 10’లో భాగంగా ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ వివరాల ప్రకారం 44 మంది జవాన్ల కుటుంబాలకు ఈ సహాయం అందుతుందని చెప్పారు. నిధిలో 60 శాతం జవాన్ భార్యకు, మిగిలిన 40 శాతాన్ని తల్లిదండ్రులకు కేటాయించామన్నారు. ‘ఓసారి వైజాగ్‌లో షూటింగ్లో ఉన్న సమయంలో రూ.15, 20, 30వేల అప్పు కట్టలేక రైతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలను చదివి చలించిపోయాను. రైతుల కుటుంబాలకు నా వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. 200 కుటుంబాల రుణమాఫీకి రూ. 1.5 కోట్లు చెల్లిస్తున్నాను’అని ఆయన పేర్కొన్నారు. -
పంట మునిగిందని రైతు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం : మంచిర్యాల పోలీస్‌స్టేషన్ పరధిలోని ర్యాలీగఢ్‌పూర్ గ్రామంలోని బాబానగర్‌కు చెందిన చిప్పకుర్తి రాజయ్య (55) శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలి.. ఇటీవల మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లడంతో ర్యాలీవాగు సమీపంలో ఉన్న రాజయ్య పత్తి సేను పూర్తిగా మునిగిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. రాజయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. -
అన్నదాతల ఆత్మహత్యలకూ చలించరా?
అనకాపల్లిటౌన్: అన్నదాతలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యనారాయణ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇక్కడ జైల్‌భరో నిర్వహించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నా చేశారు. నెహ్రూచౌక్ జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసులు 118 మందిని అరెస్టు చేసి, పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 555 జిల్లాలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. భూములను అన్లైన్లో నమోదు చేయాలంటే ఎకరాకు రూ.30వేలు లంచం తీసుకుంటున్నారని తెలిపారు. బడాబాబులు, కార్పొరేట్ సంస్థలకు రెవెన్యూ అధికారులు కొమ్ముకాస్తున్నారని తెలిపారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఆధికారంలోనికి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు భద్రత లేకుండా పోవడంతో వారు పట్టణాలకు వలసపోవలసి వస్తోందన్నారు. స్వామినాథన్ కమిటీ సూచనల మేరకు ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని ఆయన కోరారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా రుణవిముక్తి చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని, 2013 భూసేకరణ చట్టాన్ని యథాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయడంలో చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు బకాయి ఉన్న కార్పొరేట్ సంస్థలకు రుణమాఫీ చేయడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు కల్లబొల్లిమాటలు చెప్పి మరోసారి గద్దెనెక్కడానికి సిద్ధపడుతున్నారన్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, ఆశవర్కర్లు, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ రైతులను రోడ్డున పడేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతందన్నారు. 60 సంవత్సరాలు దాటిన పేద, మధ్యతరగతి రైతులకు నెలకు రూ.5వేల చొప్పున పింఛన్ అందజేయాలని కోరారు. వచ్చేనెల 5న 10 లక్షల మంది రైతులతో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మళ్ల సత్యనారాయణ, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎ.బాలకృష్ణ, ఐద్వా జిల్లా సహయకార్యదర్శి డి.డి.వరలక్ష్మి, బుగిడి నూక అప్పారావు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
అన్నదాతను బలిగొన్న అప్పులు
ఆదిలాబాద్‌రూరల్: పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో దిగాలు చెంది ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని లాండసాంగ్వి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌రూరల్ ఎస్సై తోట తిరుపతి, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బీరెల్లి అశోక్ (32) తనకున్న మూడెకరాలతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది ఎనిమిది ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా, గులాబీ పురుగు ఉధృతి కారణంగా పంట నష్టపోయి అప్పుల పాలయ్యాడు. పెట్టుబడి డబ్బులు సైతం రాలేదు. ఈయేడాది కూడా ఆశించిన స్థాయిలో పంట ఎదుగుదల లేక దిగాలు చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు, కుటుంబీకులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. అశోక్‌కు భార్య గంగమ్మ ఉంది. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబీకుల రోదన చూసి గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. అందరితో కలుపుగోలుగా ఉండే అశోక్ మృతి చెందడాన్ని గ్రామస్తులు, కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఆత్మహత్య.. ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన ఎస్.విఠల్ (33) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదిలాబాద్‌రూరల్ ఎస్సై తోట తిరుపతి తెలిపారు. విఠల్ మతిస్థిమితం సరిగాలేక గతంలో సైతం రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. మంగళవారం కుటుంబీకులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. మధ్యాహ్న ఇంటికొచ్చిన మృతుడి తండ్రి గణపతి విషయాన్ని గమనించి స్థానికులు, కుటుంబీకులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య మంగళ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నేటి నుంచి రైతు బీమా పత్రాల పంపిణీ
-
‘గులాబీ’ చీడ..అప్పుల పీడ
బోథ్ (ఆదిలాబాద్): పత్తికి సోకిన గులాబీ పురుగు ఓ గిరిజన రైతును బలిగొంది. దిగుబడి రాదనే బెంగతో మండలంలోని మందబొగడ గ్రామానికి చెందిన సెడ్మకి మారుతి(33) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతి తనకున్న 3 ఎకరాల్లో గత ఏడాది పత్తి వేశాడు. పంట కోసం రూ.లక్ష అప్పు తెచ్చాడు. ఇంతలోనే పత్తికి గులాబీ పురుగు సోకి దిగిబడి అమాంతం పడిపోయింది. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. తెచ్చిన అప్పు మీదపడింది. ఈ ఏడాది మళ్లీ రూ.లక్ష అప్పు తెచ్చి పత్తి వేయగా తొలి దశలోనే పత్తి పువ్వులో గులాబీ పురుగు ఉధృతంగా ఉండటంతో దిగుబడిపై దిగులు చెందాడు. మొత్తం రెండు లక్షల అప్పు ఉండటంతో మనస్తాపం చెందాడు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అప్పు విషయమై గ్రామ పెద్దలతో చర్చించేందుకు భార్య కవిత బయటికి వెళ్లింది. మూడేళ్ల కూతురు ధనలక్ష్మి, ఎనిమిది నెలల బాబు సోమేశ్వర్‌ల ముందే మారుతి పురుగుల మందు తాగాడు. హుటాహుటినా గ్రామస్తులు బోథ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మారుతికి భార్య, కూతుళ్లు పూజ(4), ధనలక్ష్మి(3), 8 నెలల బాబు సోమేశ్వర్ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అబ్దుల్బాకీ తెలిపారు. జైనథ్ మండలంలో ఒకరు.. జైనథ్: మండలంలోని గూడ గ్రామానికి చెందిన రైతు అమ్ర విఠల్(42) పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పుల్లయ్య కథనం ప్రకారం.. విఠల్ తన భార్య వెంకటమ్మ, ఇద్దరు పిల్లలతో ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్‌లో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. పిల్లల చదువుల కోసం ఆదిలాబాద్‌లో ఉంటూ గూడలో తమకున్న 4 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది పత్తి వేశాడు. శుక్రవారం ఎప్పటిలాగానే భార్యాభర్తలిద్దరు చేనుకు వెళ్లారు. కాగా ఉదయం 10గంటలకు భార్య పనులు చేస్తుండగా, విఠల్ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య పక్క చేన్లో ఉన్న భగవాండ్లు అనే రైతు సహాయంతో ఎడ్లబండిపై గూడకు తీసుకొచ్చింది. అక్కడి నుంచి ఆటోలో రిమ్స్‌కు తరలిస్తుండగా చనిపోయాడు. కాగా గిమ్మ బీవోఎం బ్యాంకులో విఠల్‌కు రూ.లక్ష అప్పు ఉంది. పత్తి పంట సరిగ్గా రాలేదని, కొన్నేళ్లుగా ఆర్థిక పరిస్థితులు సరిగ్గాలేకపోవడంతో అత్మహత్యకు పాల్పడినట్లు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరువలేని మమకారం
కర్ణాటక : తన కష్టసుఖాల్లో భాగమైన పాడి పశువులు శాశ్వతంగా దూరమయ్యాయని తెలిసి ఆ బడుగుజీవి కన్నపిల్లలనే కోల్పోయినంతగా రోదించాడు. ధారవాడ జిల్లా హొసయెల్లాపురలో బుధవారం ఉదయం ఈ విషాదం జరిగింది. మంగళవారం రాత్రి ఈదురుగాలులు, వర్షానికి గ్రామానికి చెందిన గురుప్రసాద్‌కు చెందిన పాక కూలిపోయింది. శిథిలాల కింద చిక్కి రెండు ఎనుములు, ఒక దూడ సజీవ సమాధి అయ్యాయి. ఉదయాన్నే ఈ ఘోరాన్ని గమనించిన గురుప్రసాద్ ఎనుములను గుండెలకు హత్తుకుని విలపించాడు. ఈ దృశ్యం చూపరుల హృదయాలను పిండేసింది. -
శెభాష్ కామేగౌడ : వి.వి.ఎస్. లక్ష్మణ్
కర్ణాటక, మండ్య: ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కాలం వృథా చేయకుండా ఆ సన్నకారు రైతు నడుంబిగించి జల సిరులను సృష్టించారు. సొంత డబ్బులతో నీటి నిల్వ కోసం సుమారు 14 చెరువులను తవ్వించిన మండ్య జిల్లాలోని మళవళ్లి తాలుకాలో ఉన్నదాసనగొడ్డి గ్రామానికి చెందిన రైతు కామేగౌడ సేవను తెలుసుకున్న బారత మాజీ క్రికెట్ దిగ్గజం వి.వి.ఎస్. లక్ష్మణ్ అభినందిస్తు ట్వీట్ చేశారు. రైతు కామేగౌడ వేసవి కాలంలోప్రజలకు, జంతువులకు తాగునీటి కొరత ఉండకూడదనే ఆశయంతో దాసనదొడ్డి గ్రామంలో సుమారు 14 నీటి కుంటలను తవ్వించాడు. దాంతో ఎప్పడు ఈ నీటి చెరువుల్లో నీరు నిల్వ ఉంటుంది. వీటిని తవ్వడానికి ఈ రైతు సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న లక్ష్మణ్... కామేగౌడను ట్విట్టర్లో ప్రశంసించారు. వి.వి.ఎస్. లక్ష్మణ్ చేసిన ట్వీట్ -
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి
మిరుదొడ్డి (దుబ్బాక): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అందెలో రూ.1.6 కోట్ల నిధులతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్‌ను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఏదో ఒక మూలన రైతుల ఆత్మహత్యలు జరిగేవని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ రోజుల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయంటే తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని అన్నారు. తెలంగాణలో ఉన్న రైతులను రాజులను చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్, వారికి బీమాతో భరోసా, పంటలకు మార్కెటింగ్ సౌకర్యం, గోడౌన్ల నిర్మాణం, ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర, పెట్టుబడి సాయంతో పాటు ప్రాజెక్టులతో సాగు నీరు అందిస్తున్నారని వివరించారు. ఖరీఫ్‌లో పంట సాయం అందించిన మాదిరిగానే రబీ సీజన్లో సైతం ఎకరానికి రూ.4వేలు అందించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోందన్నారు. పాలమూరు ఎత్తిపోతలు, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, దిండి ప్రాజెక్టు నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందన్నారు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులు వచ్చే ఏడాదిలోగా పూర్తయితే తెలంగాణలో ఉన్న కోటి ఎకరాల భూములు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో దుబ్బాక రైతుల కాళ్లను తడుపుతామన్నారు. రైతులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని హరీశ్‌రావు కోరారు. ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే పంటలకు తగినంత సాగు నీరు లభిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, దేశం కలిస్తే ఒరిగేదేమీ లేదు ‘సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలే బలం, ప్రజలే దేవుళ్లు, ప్రజల సంక్షేమం కోసం నిరంతర కృషి చేస్తాం’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజాబలం లేని కాంగ్రెస్, తెలుగుదేశం, కోదండరాం, సీపీఎంలు ఒక్కటవుతాయట.. అంటూ ఎద్దేవా చేశారు. వీరు కలిస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఉచిత కరెంట్ కాదు.., ఉత్త కరెంటే ఇచ్చింది’అని విమర్శించారు. వారి హయాంలో గంటకోసారి కరెంటు ట్రిప్పు, పంటకోసారి మోటార్లు కాలిపోయాయన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం నాణ్యమైన కరెంటును ఉచితంగా అందిస్తోందన్నారు. రాష్ట్రంలో కరెంటు లేకున్నా, మోటార్లు కాలిపోయినా కాళేశ్వరం నీటితో పొలాలు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరత, కరెంటు కోత, విత్తనాల కొరత రైతులను పట్టి పీడించాయన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు కోసం తమ ప్రభుత్వం రూ.16 వేల కోట్లు ఖర్చు పెడుతోందని వెల్లడించారు. విద్యకు పెద్ద పీట.. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 570 ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసిందన్నారు. అలాగే 238 బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతీ మండలానికి బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉసురు తీసిన అప్పులు
ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట) : ఆరుగాలం శ్రమించి.. అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టినా చివరకు ఉత్తచేతులే మిగలడంతో ఆ రైతులు కలత చెందారు. ఓ వైపు పూటగడవని దైన్యం.. మరో వైపు అప్పులవారి ఒత్తిడికి తట్టుకోలేకపోయారు. ఇక చావే శరణ్యమనుకుని బలవన్మరణాలకు పా ల్పడ్డారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మం డలం రామన్నగూడెం ఆవాసం తెట్టేకుంట తండా కు చెందిన బాణోతు రాణ్య (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు సంవత్సరాలుగా ఏపూరు రైతుకు చెందిన పదెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సాగు పెట్టుబడులకు దాదాపు 4లక్షల రూపాయలు అప్పు చేశాడు. కాలం కలిసి రాక దిగుబడి ఆశాజనకంగా రాలేదు. దీంతో ఈ సంవత్సరం కౌలు వదిలి కోటపహాడ్‌కు చెందిన ఒక రైతు వద్ద 80వేలకు జీతం కుదిరాడు. కాగా అప్పుతీర్చే మార్గం కనిపించిక శనివారం 8గంటల సమయంలో పురుగుల తాగాడు.గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందాడు. అతడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతు డి కుమారుడు శ్యామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ తొగరు సత్యనారాయణ తెలిపారు. -
‘గులాబీ’ గుబులు..అప్పుల తిప్పలు
జైనథ్(ఆదిలాబాద్): పంట నష్టంతో మనస్తాపం చెందిన మండలంలోని పెండల్వాడ గ్రామానికి చెందిన రైతు బొల్లి రమేశ్ (40) పురుగుల మందు తాగి శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పుల్లయ్య కథనం ప్రకారం.. రమేశ్ తల్లి పేరిట 5 ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది మొత్తం 9 ఎకరాల్లో పత్తి పంట వేశాడు. సాగు కోసం రూ.లక్ష బ్యాంకు అప్పు, మరో లక్ష ప్రైవేటు అప్పు ఉంది. ప్రస్తుతం పంటలో అక్కడక్కడ గులాబీరంగు పురుగు కనిపించడంతో గత కొంతకాలంగా ఆందోళన చెందుతున్నాడు. పురుగు ఉధృతి పెరిగితే పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాదనే దిగాలుతో శుక్రవారం రాత్రి ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలాపూర్ వరకు ఆటోలో తీసుకొని రాగా, అక్కడి నుంచి 108లో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు.చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. భార్య నామమ్మ, ఇద్దరు కుమారు ఉన్నారు. కాగా మృతుడి తండ్రి హన్మాండ్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పేర్కొన్నారు. భీమిని(బెల్లంపల్లి): భీమిని మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన రైతు చౌదరి దేవాజీ(45) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం..దేవాజీ కొన్నేళ్లుగా పత్తి పంట సాగు చేస్తున్నాడు. గతేడాది పంట దిగుబడి సరిగా రాలేదు. ఈ ఏడాది కూడా నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. అలాగే కుమార్తె పెళ్లికి చేసిన అప్పులు అన్ని కలుపుకొని సుమారు రూ.3 లక్షలు అప్పులయ్యాడు. దీంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. దేవాజీకి భార్య లక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులకు బేడీలు.. కార్పొరేట్లకు మాఫీలు
మన దేశంలో అప్పులు కట్టలేని రైతులను కారాగారాలకు పంపిస్తారు. అయితే, ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల రుణాలు ఎగవేసే బడా కార్పొరేట్ సంస్థల యజమానులను జైళ్ల పంపిన సందర్భాలు లేవు. రుణగ్రస్తత, దివాలా నిబంధనలతో ఇలాంటి పెద్ద మనుషులను కాపాడుతున్నారు. మరి రైతులకు కూడా ఈ హెయిర్‌కట్ వంటి రాయితీ ఎందుకు ఇవ్వడం లేదు? రుణాలు తిరిగి చెల్లించలేకపోయిన పెద్ద, చిన్న రైతులకు కూడా ఇలాంటి వెసులుబాటు ఇవ్వాలి కదా! పంజాబ్‌లో రెండు లక్షల రూపాయలకు మించని వ్యవసాయ రుణాల మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిమితికి కేవలం రూ.100 దాటిన కారణంగా అనేక మంది రైతులకు రుణమాఫీ నిరాకరించారు. రుణ విధానానికి రెండు ముఖాలుంటాయి. ధనికు లకు ఓ రకంగా, పేదలకు మరో విధంగా బ్యాంకులు రుణాలిచ్చే విషయంలో వ్యవహరిస్తుంటాయి. పంజాబ్ వ్యవసాయ అభి వృద్ధి బ్యాంక్ వ్యవహారాన్నే తీసుకుందాం. రుణా లుగా తీసుకున్న రూ. 229.80 కోట్ల బకాయిలను ఒకే సారి తిరిగి చెల్లించకపోతే రైతుల పొలాలను అమ్మి వేస్తామని బెదిరిస్తూ వారికి ఈ బ్యాంక్ లీగల్ నోటీసులిచ్చింది. మరో పక్క, రుణం ఎగ్గొట్టే స్థితికి చేరిన ఆధునిక్ మెటాలిక్స్ లిమిటెడ్(ఏఎంఎల్) అనే కంపెనీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోల్కత్తా శాఖ భారీ స్థాయిలో వెసులుబాటు కల్పించింది. ఈ కంపెనీ బకాయి మొత్తంలో 92 శాతం మాఫీ చేసింది. అంటే రుణంలో 8 శాతం చెల్లించి చేతులు దులు పుకునే అవకాశం ఈ కంపెనీకి ఇచ్చింది. రుణాల వసూలులో ఇలాంటి ‘రాయితీ’ని బ్యాకింగ్ పరి భాషలో ‘హెయిర్‌కట్’(క్షౌరం) అంటారు. కిందటి వారం ఇలాంటిదే జరిగింది. మానెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ అనే కంపెనీకి తన రుణ బకా యిల చెల్లింపులో 78 శాతం మాఫీ(హెయిర్‌కట్) లభించింది. ఈ కంపెనీ రుణ బకాయిల మొత్తం రూ.11,014 కోట్లు. రుణం తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా ఈ కంపెనీపై వేసిన ఖాయిలా ప్రక్రియ విచారణ పూర్తయ్యాక ఇంతటి భారీ రాయితీ కల్పిం చారు. ఈ నిర్ణయం వల్ల ఈ కంపెనీ తనకు అప్పి చ్చిన సంస్థలకు కేవలం రూ.2,457 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.8,557 కోట్లను మొండి బాకీ కింద మాఫీ చేస్తారు. రుణాలు ఎగవేసే వ్యాపా రుల విషయంలో ఇంతటి ‘పెద్ద మనసు’తో వ్యవహ రించడం వల్లే అప్పులు చెల్లించని కంపెనీల యజ మానుల జీవన శైలి మారడం లేదు. రైతులకు ఇలాంటి రాయితీలు ఇవ్వకపోవడంతో వారు చివరికి చేసేదేమీ లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరు ఇలాగే ఉంటోంది. పరిశ్రమలు చెల్లించాల్సిన బకాయిల మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని మాఫీ చేయడానికే ప్రతి అవకాశాన్ని బ్యాంకులు వాడుకుంటున్నాయి. పైన చెప్పిన ఏఎంఎల్ కంపెనీ విషయానికి వస్తే, ఇంగ్లండ్‌కు చెందిన లిబర్టీ హౌస్‌తో రూ.410 కోట్లకు ఒప్పందం కుదిరిన తర్వాత ఖాయిలా పరిశ్రమలకు వర్తించే రుణగ్రస్తత, దివాలా నిబంధనల కింద (ఐబీసీ) ఈ కంపెనీకి 92 శాతం అంటే రూ. 4.960 కోట్ల భారీ ‘హెయిర్‌కట్’ మాఫీ లభించింది. ‘ఖాయిలా’ ముద్రతో రుణాల ఎగవేత! మళ్లీ పంజాబ్ రైతుల రుణాల విషయానికి వస్తే– 12,625 మంది రైతుల రుణాల బకాయిల మొత్తం రూ.229.80 కోట్లను పంజాబ్ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు వసూలు చేయడానికి ఎలాంటి పద్ధతి అవ లంబిస్తోందో చూడండి. ఓ భారీ పారిశ్రామిక కంపె నీకి మాఫీ చేసిన మొత్తంలో ఇది చాలా మొత్తం. ఓ కంపెనీ ఖాయిలా పడిందని ప్రకటించాక రుణ చెల్లింపు పరిష్కార ఒప్పందం కింద ఇంతటి భారీ రాయితీని మాఫీ రూపంలో బ్యాంకులు అందిస్తు న్నాయి. వాస్తవానికి అప్పును మాఫీ చేయడం కన్నా ఎక్కువగా కంపెనీలకు మేలు చేయడానికి ఆడుతున్న నాటకమే దివాలా తీసినట్టు ప్రకటించడం. దీనికి ఖాయిలాపడటమనే మాట వాడుతున్నారు. రుణం తీసుకున్నాక కంపెనీ యజమాని దాన్ని తిరిగి బ్యాంకులకు చెల్లించకుండా తెలివిగా నష్టాలతో నడిచే తన కంపెనీని అమ్మేసి స్వేచ్ఛగా తిరుగుతు న్నాడు. అంటే దాదాపు రుణం మొత్తాన్ని పన్నులు చెల్లించే ప్రజలే చివరికి భరిస్తున్నారు. ఈ తరహా వ్యవహారానికి ప్రఖ్యాత అమెరికా మేధావి నోమ్ చామ్స్కీ ‘కటువు ప్రేమ’ అని పేరు పెట్టారు. అంటే ఇది పేదలకు భారంగా, ధనికులకు ప్రేమగా పరిణమిస్తుంది. కార్పొరేట్ కంపెనీల రుణా లను మాఫీచేయడం ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే నిజమైతే, రైతుల రుణాల మాఫీ ఆర్థికాభివృద్ధికి ఎందుకు దారితీయదో నాకు అర్థంకావడం లేదు. నిజానికి, రైతులు, పారిశ్రామిక కంపెనీలు ఒకే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాయి. మరి అలాంటప్పుడు కార్పొరేట్ మొండి బాకీల మాఫీ ఆర్థికాభివృద్ధికి దారితీస్తే, వ్యవసాయ రుణాల రద్దు నైతికపరమైన ప్రమాదానికి ఎందుకు కారణమౌ తుంది? రుణాల మాఫీ కోరే రైతులను ఎందుకు ఏహ్యభావంతో చూస్తున్నారు? రుణాల చెల్లింపులో అరాచకానికి రైతుల అప్పుల మాఫీయే కారణమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్పర్సన్ గతంలో నిష్టూరంగా మాట్లాడారు. అలాగే, వ్యవసాయ రుణాల మాఫీ నైతికపరమైన ముప్పుగా మారిందని, దీనివల్ల జాతీయ ఆదాయ, వ్యయాల పట్టిక తలకిందులవు తోందని భారతీయ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడ్డారు. రుణాలు చెల్లించని 12,625 మంది రైతుల వ్యవసాయ భూములను బహిరంగ వేలం వేసే ఉద్దేశం నిజంగా తనకు లేదని, లీగల్ నోటీసు కేవలం బెదిరింపు మాత్రమేనని పంజాబ్ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు ప్రకటించింది. అయితే, రూ.1363.87 కోట్ల రుణాలను బ్యాంకుకు తిరిగి చెల్లించని 71,432 మంది రైతులపై కత్తి వేళ్లా డుతూనే ఉంది. హరియాణాలో సాగునీటి పైప్‌లైన్ వేయడానికి ఆరు లక్షల రూపాయల రుణం తీసు కున్న ఓ రైతు అప్పు కట్టలేకపోయాడు. అందుకు ఫలితంగా అతను రూ.9.83 లక్షల జరిమానా చెల్లిం చాలని, రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాలని జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. పరిశ్రమలకు భారీ రాయితీ కోట్లాది రూపాయల రుణ బకాయిలు వసూలు చేసే సామర్ధ్యం లేకనే పైన ఉదహరించిన ఏఎంఎల్ కంపె నీకి భారీ రాయితీ (హెయిర్ కట్) కల్పించారు. సినర్జీస్ డోరే ఆటోమేటివ్ లిమిటెడ్ కంపెనీకి 94.27 శాతం భారీ రుణమాఫీ ఇవ్వడంతో దీని నుంచి ఆర్థిక సంస్థలు కేవలం రూ. 54 కోట్లు మాత్రమే వసూలు చేస్తాయన్న మాట. వాస్తవానికి ఈ కంపెనీ మొత్తం రుణ బకాయిలు రూ.972.15 కోట్లు అంటే ఏ స్థాయిలో అప్పులు ఎగవేసే అవకాశం దీనికి లభిం చిందో ఊహించుకోవచ్చు. కార్పొరేట్ కంపెనీలు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించకుండా మొండి బాకీలుగా మారిపోయే పరిస్థితులు తలెత్తిన సంద ర్భాల్లో ఈ అప్పులు కట్టడానికి వాటికి తగిన వెసు లుబాటు కల్పించేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎంతో కొంత మొత్తం రుణం కింద చెల్లించడానికి వీలుగా ఈ కంపెనీలకు ‘హెయిర్ కట్’లు ఇస్తున్నారు. ఇలాంటి కంపెనీల రుణాల వసూలుకు 2004లో ‘స్ట్రెస్డ్ అసెట్ స్టెబి లైజేషన్ ఫండ్’ పేరుతో ఓ నిధిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ ఇలాంటి మొండి బకాయిలను వసూలు చేయడానికి కొన్ని కంపెనీ లకు 90 శాతానికి పైగా ‘హెయిర్‌కట్‌లు’ ఇచ్చింది. స్థిరీకరణ నిధి పేరుతో ఉన్న ఈ సంస్థ అందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్లకు జైలు శిక్షలుండవు అప్పులు కట్టలేని రైతులను కారాగారాలకు పంపి స్తారు. అయితే, ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల రుణాలు ఎగవేసే బడా కార్పొరేట్ సంస్థల యజమా నులను జైలుకు పంపిన సందర్భాలు లేవు. రుణగ్రస్తత, దివాలా నిబంధనావళి ఈ పెద్ద మనుషులను కాపాడుతోంది. మరి రైతులకు కూడా ఈ హెయిర్ కట్ వంటి రాయితీ ఎందుకు ఇవ్వడం లేదు? రుణాలు తిరిగి చెల్లించలేకపోయిన పెద్ద, చిన్న రైతులకు కూడా ఇలాంటి వెసులబాటు ఇవ్వాలి కదా! పెద్దగా నష్టపోకుండా అప్పుల ఊబి నుంచి బయటపడటానికి రైతులకు కూడా అవకాశాలు కల్పించాలి. పంజాబ్‌లో రెండు లక్షల రూపాయలకు మించని వ్యవసాయ రుణాల మాఫీ చేస్తున్నట్టు ప్రక టించారు. ఈ పరిమితికి కేవలం రూ.100 దాటిన కారణంగా అనేకమంది రైతులకు రుణమాఫీ ప్రయో జనం నిరాకరించారు. ఇది నిజంగా అన్యాయం. మాఫీ చేసే మొత్తానికి ఇలా గరిష్ట పరిమితి విధిస్తూ ఆర్థిక న్యాయం కొందరికే పరిమితం చేస్తు న్నారు. ఈ సందర్భంగా రైతుల రుణభారం తగ్గించడానికి కేర ళలో 2007లో ఏర్పాటు చేసిన కేరళ స్టేట్ డెట్ రిలీఫ్ కమిషన్ ఎలా పనిచేస్తోందో తెలుసు కుంటే మంచిది. రైతుల వ్యవసాయ రుణాల పాత బకాయిలను సగ టున 50 నుంచి 75 శాతం వరకూ మాఫీ చేసిందని ఈ సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఫలితంగా వ్యవ సాయదారులు పాత అప్పులను వదిలించుకుని తాజాగా రుణాలు తీసుకోవడానికి వీలవుతోంది. రైతులు పేదవారు కాబట్టి వారికి ఆర్థిక స్వాతం త్య్రాన్ని నిరాకరించకూడదు. రైతన్నలను నిరంతర రుణభారం నుంచి విముక్తిచేయాల్సిన అవసరం ఉంది. భిన్న వర్గాలకు భిన్న రీతుల్లో రుణ విధానం అమలు చేయడం సబబు కాదు. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ప్రాణాలకు తెగించి అడవి పందితో రైతు పోరాటం