చితిలో కాలని అప్పు | A story of a farmer | Sakshi
Sakshi News home page

చితిలో కాలని అప్పు

Published Sun, Sep 16 2018 12:33 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

A story of a farmer - Sakshi

‘ఏమైనా సుబ్బయ్యన్న చేసినంత పనులు చేయటం మనవల్ల కాదు. తొలకరి రాలగానే ముందు దున్నే పొలం ఆయనదే. ఊళ్లో అందరి కంటే ముందే పంట వేయడం దగ్గర్నుంచి, మబ్బుతో లేచి వెళ్ళి మోటారేయటం కూడా అందరి కంటే ముందే’ అన్నాడు లక్ష్మీపతి ఇంటిముందున్న అరుగు మీద కూర్చుంటూ. ‘ఆ...నిజమే. కానీ అంత తొందరగా వెళ్ళొద్దన్నా వినడు. అందరూ నాలుగింటికెళ్తే ఈయన రెండు గంటలకే బయల్దేరుతాడు‘ విసుగ్గా అంది సుబ్బయ్య భార్య మునెమ్మ రోజూ లేపి టార్చ్, దుప్పటి, కర్ర అని అడగటం, తలుపుకు గొళ్ళెం పెట్టుకొమ్మని మంచి నిద్ర పాడుచేస్తాడన్న కోపంతో. ‘మనం రైతులం. అదున్లో పనిచెయ్యాల. నిద్ర, సుఖం చూసుకుంటే బ్రతకటం కష్టం. ఏమంటావురా లక్ష్మీపతి?‘ భార్య ఇచ్చిన కాఫీ గ్లాసు తీసుకుంటూ అన్నాడు సుబ్బయ్య. అప్పటికే మునెమ్మ ఇచ్చిన కాఫీ ఊదుకుని తాగుతూ ‘అవునక్కా. మనూళ్ళో అంతా అన్న ఈ వయసులో కూడా ఇంత హుషారుగా వుంటాడని, కొడుకులు ఇద్దరున్నా వాళ్ళకైనా ఇంత హుషారు లేదని అనుకుంటా వుంటారు’ అన్నాడు లక్ష్మీపతి.

‘ఏం హుషార్లే మామా..చీకట్లో ఎళ్ళి ఎన్ని సార్లు గతుకుల్లో పడ్డాడో, పాము కరిసిందో నీకూ తెల్సుకదా? కొంచెం ఆగితే మేమూ వస్తామన్నా ఇనడు కదా?’ అన్నాడు పెద్ద కొడుకు మాణిక్యం. ‘అంతేనా అందరి కంటే ముందే పంట అమ్మేస్తాడు. అప్పుడు ధర వుండదు. ధర పలికే సమయానికి మన దగ్గర పంట వుండదు. అంత ఆత్రం దేనికి చెప్పు. కొంచెం ఆగమంటే వినడు. అందుకే ప్రతిసారీ మనకే నష్టాలెక్కువ‘ భుజం మీది తువ్వాలు విసురుగా విదిల్చి తలకు చుట్టి ఆవు దగ్గరికి నడిచాడు చిన్నకొడుకు రాజేంద్ర పాత్రలో పాలు పిండటానికి. ఇంతలో రాజేంద్ర భార్య రమ ఉత్తరం తెచ్చి భర్త చేతికిచ్చింది. రాజేంద్ర గిన్నె పక్కన పెట్టి చదవసాగాడు. ‘ఎక్కడ్నుంచిరా ఉత్తరం రాజేంద్రా?‘ అడిగాడు సుబ్బయ్య. ‘మన ఉత్తేజ్‌ దగ్గర్నుంచీ నాన్నా. ఎంట్రన్స్‌ పరీక్షలు బాగా రాశానని రాశాడు‘ చెప్పాడు రాజేంద్ర.

‘సరే మరి మన జయరాం సంగతేందిరా?‘ పెద్దకొడుకుని అడిగాడు. ‘ఇద్దరూ అక్కడ్నే కదా కోచింగులో చేరుండేది. వాడూ బాగానే రాసినానన్నాడు నాన్నా’ చెప్పాడు మాణిక్యం. ‘ఎందుకైనా గానీ మంచి కాలేజీల్లో చేర్చడానికి డబ్బులు రెడీ చేసుకోమని అంటున్నారన్నా పిల్లోళ్ళిద్దరూ’ మాణిక్యంతో అన్నాడు రాజేంద్ర. ‘దేవుని దయవల్ల మంచి మార్కులొచ్చి ఫ్రీ సీట్లొస్తే ఇద్దరికీ బాగుండు. తిరుపతి వెంకన్న దగ్గరికి కాలినడకన వస్తానని మొక్కుకున్నా కూడా’ చెప్పింది మాణిక్యం భార్య సువర్ణ. ‘అయినా పోయినేడు మన స్వాతి పెళ్ళికి చేసిన అప్పే ఇంకా తీరలేదు’ నిట్టూర్చాడు మాణిక్యం. ‘ఈ సంవత్సరం మామిడి తోట బాగా కాసింది కదన్నా. తీర్చేద్దాం లే’ అంటూ పొలానికి బయలుదేరాడు రాజేంద్ర. మాణిక్యం కూడా టౌన్‌కి ఎరువుల కోసం బయలుదేరాడు.

వరిలో సరిగా దిగుబడి రాలేదు. మామిడి ఆ సంవత్సరం మంచి ధర పలకలేదు. అప్పులు సగమే తీరాయి. ఆశాజీవిగా మరో పంట వేయడానికి మాత్రం సుబ్బయ్య కుటుంబం వెనక్కు తగ్గలేదు. మళ్లీ నాట్లు, ఎరువులు అంటూ పొలం పని ఎప్పట్లా జరుగుతోంది. ఈలోగా పెళ్లికి అప్పిచ్చిన వాళ్లు ఇంటి మీదికొస్తుంటే మునెమ్మ గాజులకు, సువర్ణ నెక్లెస్‌కు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. ఆ రాత్రి పెందలాడే భోంచేసి ముసుగుతన్నాడు సుబ్బయ్య. తొలికోడితో బాటే నిద్రలేచి ఏమనుకున్నాడో గానీ మునెమ్మను లేపకనే కర్ర, టార్చ్, దుప్పటి తీసుకుని తలుపు దగ్గరికి వేసుకుని వెళ్ళిపోయాడు. ఉదయం ఆరవుతోంది. నిద్రలేచి మునెమ్మ ముఖం కడుక్కొచ్చేలోగా వీధిలో కేకలు, గొడవ. ఇంట్లో వాళ్లంతా బయటకు పరుగుతీశారు. ఇద్దరు మనుషులు సుబ్బయ్య దేహాన్ని మోసుకొచ్చి వరండాలో పడుకో బెట్టారు. ఐదు గంటలకు పొలం వైపెళ్తున్న శివరాం గమనించాడట. హైటెన్షన్‌ వైరు మీద కాలేసి చచ్చిపడున్న సుబ్బయ్యను. చుట్టుపక్కల అందర్నీ కేకలేసి అంతా కలిసి పట్టుకొచ్చి చూసేసరికే ప్రాణం పోయి ఎంతసేపో అయ్యి వొళ్లు కర్రలా బిగుసుకుపోయుందట. సాయంత్రానికి సుబ్బయ్య దేహం మట్టిలో కలిసిపోయింది. మునెమ్మ అమ్మగారింటి వాళ్లు వచ్చారు. చివరిగా పసుపు కుంకుమలిచ్చి వెళ్ళారు.

‘ఒరే రాజేంద్రా! మామ ఫొటో పెద్దగా వుండి మన వాళ్లందరి పేర్లతో చుట్టుపక్కల పల్లెలందరికీ తెలిసేలా నాలుగైదు పేపర్లలో వేయించరా. అప్పుడే మన ఇంటిపేరు, మనం ఎంత ఘనంగా ఆయనకు కర్మ చేస్తున్నామో తెలిసేది‘ అన్నాడు వెనకింటి సుబ్బయ్య తమ్ముని కొడుకు నారాయణ. రాజేంద్ర, మాణిక్యం తమ కొడుకుల్ని ఆ పని చూడమని టౌనుకి పంపించారు. సాయంత్రానికి కాళ్లీడ్చుకుంటూ వచ్చారు వాళ్లు. ‘మనం అనుకున్నంత సైజుతో నాలుగైదు దినపత్రికల్లో వెయ్యాలంటే వందలు కాదు వేలు కావాలి ఏ మూలకూ సరిపోవు’ అని చెప్పారు. ‘అయితే ఏమైందిలేరా వెధవ డబ్బు ఇయ్యాళుంటుంది రేపు వుండదు. కానీ ఎప్పటికీ నిలిచేది మనం ఎంత గ్రాండ్‌గా ఆయన కర్మ చేశామన్నదే రా’ అన్నాడు నారాయణ. అప్పుడొచ్చాడు సుబ్బయ్య చిన్నతమ్ముడు ధనుంజయులు. ‘ఒరేయ్‌ అబ్బాయిలూ! అన్నకు సమాధి మాత్రం గ్రానైటు రాయితో బాగా కట్టించాల్రా. చుట్టుపక్కల ఏ వూళ్లో లేనంత బాగా వుండాలి’ అన్నాడు.

‘అది సరేగానీ అన్నా.. ముందు కర్మ రోజు ఏమేం వంటలనుకున్నారు? నా కూతురు వాళ్ల అత్తగారు, కోడలు వాళ్ల బంధువులు కూడా వస్తున్నారు బెంగళూరు, చెన్నైల నుంచి. మా అన్న కర్మంటే వాళ్లు భలే జరిగిందని అనుకోవాలి. లేకుంటే నాకు పరువు తక్కువ‘ అంది సుబ్బయ్య చెల్లెలు వరలక్ష్మి. ‘అదంతా రెడీనే అత్తా.. ఏమీ తక్కువ కాదు. లడ్డూ, జాంగ్రీ రెండురకాల వేపుళ్ళు, మూడురకాల పచ్చళ్ళు, రెండురకాల అన్నాలు, మామూలు అన్నం సాంబారు, అప్పడం వడియాలు, దప్పళం..’ అని మాణిక్యం చెప్తుంటే అడ్డొచ్చిందామె మళ్ళీ. ‘ఏంటీ ఇవన్నీ వంటవాళ్ళతోనా? సరుకులు సరంజామా అందిస్తూ మీరు కూర్చుంటే మా సంబంధులు మీరు బాగా రిసీవ్‌  చేసుకోలేదని అలుగుతార్రా. అయినా ఈ రోజుల్లో వంటవాళ్ల కన్నా కేటరింగ్‌కి ఆర్డర్‌ చేసేయండి. నా కొడుకు విజయ్‌ లేడూ వాడి ఫ్రెండ్‌ది ప్రక్క టౌన్‌లోనే కేటరింగ్‌ సర్వీస్‌.

వాడు ఫోన్‌ చేస్తే చాలు వచ్చేస్తారు. డబ్బులిచ్చేయండంతే‘ అని తేల్చేసింది వరలక్ష్మి. ‘మాణిక్యం... మీరేమన్నా  చేసుకోండి. కానీ మనూళ్లో పక్కూళ్లలో అంతా ఉన్న పద్ధతి ప్రకారం మర్చిపోకుండా కర్మ రోజు రాత్రి కథ చెప్పించాల్రా. ఏముంది... కథ చెప్పేవాళ్ళకు అన్నం పెట్టి ఓ పదివేలిస్తే చాలు’ అన్నాడు ఎదురింటి వెంకటేశ్వర్లు. తలలు ఊపారు గానీ మాణిక్యం, రాజేంద్రల ముఖాల్లో కళ లేకుండా పోయింది. రాత్రంతా ఇద్దరూ మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. ఒకసారి పోతే పోయిందిలే వెధవ డబ్బులు తండ్రి కోసమే కదా! అప్పుచేసైనా ఖర్చుపెట్టి నలుగుర్లో తండ్రికి బాగా చేయాలని అనుకున్నా, మరోసారి ఎలా తీర్చాలి ఇంతప్పు? ఇప్పుడున్న అప్పునే ఇంకా తీర్చలేదన్న భయం మరోవైపు అనిపించి. తెల్లవారు జామున కలత నిద్రపోయారు.

దినం రోజుకు రెండ్రోజుల ముందొచ్చాడు మునెమ్మ తమ్ముడు. ‘ఒరేయ్‌ అబ్బాయిలూ! మా అక్క మెడ తరువాత బోసిగా వుండకూడదు. ఒకడు మెడలోకి పగడాలు, ముత్యాలతో హారం చేయించాలి. ఇంకొకడు నాలుగు గాజులు చేయించి చేతికి రెండు చొప్పున వేయండి. లేకుంటే సుబ్బయ్య కొడుకులు తల్లిని బికారి దాన్లా వదిలేశారని అనుకుంటారు. ఎక్కడికి పోతుంది? అంతా మీకే కదా?‘ అన్నాడు. ‘అంతా సరే గానీ దినం రోజు వంటలు తిని, గ్రానైటు రాయితో సమాధి కడితే సరిపోదురా. అవన్నీ ఆయన ఆత్మను స్వర్గానికి తీసుకుపోవు. ఒక మంచి పాడి ఆవును దూడతో సహా దానమివ్వాలి, కనీసం మీ శక్తికొద్దీ బంగారం, బట్టలు, కాసంత భూదానం కూడా చేస్తే ఎకాఎకిని ఆత్మ స్వర్గానికెళ్లిపోతుందట. పెదనాయన ఆత్మ అలమటిస్తే మనకే మంచిది కాదురా రాజిగా‘ ముక్కుచీదుతూ  చెప్పింది సుబ్బయ్య పెద్ద తమ్ముడు కూతురు శ్యామల. ఆ రాత్రి రాజేంద్ర కనిపించలేదు. రాత్రి పది గంటల వరకు వెతికి వెతికి అంతా భయపడిపోయారు. చివరికి మర్నాడు ఉదయం రాజేంద్ర కొడుకు ఏడుస్తూ ఒక ఉత్తరం పట్టుకొచ్చి మాణిక్యం చేతికిచ్చాడు.‘అన్నా. నాన్న దినం బాగా జరగాలి. ఇప్పుడు ఇంట్లో వున్న మన కొడుకుల కాలేజీ సీట్ల కోసం అప్పుచేసి తెచ్చిన డబ్బులు సరిపోవు.

మన ఈరిగాడు ఎవరికో కిడ్నీ కావాలని చెప్తుంటే విన్నాను. రెండు మూడు లక్షలు ఇస్తారంట. మనిషికి ఒక కిడ్నీ సాలంట. నాకేమి భయం లేదు. పెద్దకొడుకువి కాబట్టి నువ్వుంటే చాలు దినాలకు. నా కొడుకుతో పంపితే నేను హాస్పిటల్లోనే పుణ్యావాసం నీళ్ళు చల్లించుకుంటా. వారం రోజులకే ఇంటికొచ్చేస్తా’ అని రాసుంది. అది విన్న మునెమ్మకు ఎక్కడలేని ఆవేశం వచ్చేసింది. ‘రేయ్‌ మాణిక్యం.. ఎళ్ళి ఈరిగాడ్ని పట్టుకోని తమ్ముడ్ని తీసుకురా. ఒక్కపైసా కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. కార్డులేసి అందరికి దినం పత్రికలు పంపావుకదా అది సాలు. కథలు చెప్పించాల్సిన అవసరం లేదు. ఆత్మ వచ్చి కథలు వినదు. దానధర్మాలు మనస్ఫూర్తిగా వున్నప్పుడు వున్నదాంట్లో చెయ్యాలిగానీ అప్పులు చేసి చెయ్య పనిలేదు. భర్తపోయిన దుఃఖంలో వున్న నాకిప్పుడు నగలు సింగారించుకోవాలన్న కోరికేం లేదు. అసలు చనిపోయిన ఆయనే బ్రతికుంటే అప్పు చేసిన డబ్బులతో గ్రానైట్‌ సమాధి కడతానంటే ఒప్పుకునేవాడు కాదు. దానికన్నా మనవళ్ల చదువే ముఖ్యం. ఎవరి పరువు కోసమో, ఎవరి గొప్పల కోసమో మనం ప్రాణాల మీదికి తెచ్చుకోవాల్సిన పనిలేదు. వెళ్ళండ్రా’ అని కోపంగా అరిచేసరికి ఎక్కడి వాళ్ళక్కడ తేలుకుట్టిన దొంగల్లా జారుకున్నారు.

మాణిక్యం, కొడుకులు అంతా వెళ్ళి ఆపరేషన్‌ టేబుల్‌ ఎక్కకముందే రాజేంద్రను వారించి ఇంటికి తీసుకొచ్చారు. మర్నాడు సిమెంటుతో కట్టిన తండ్రి సమాధికి పూజలు చేశారు. పంతులుకి దక్షిణ ఇచ్చారు. వంటవాళ్ళతో రుచికరమైన భోజనం చేయించి వడ్డించారు. అంతా హాయిగా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కాలచక్రం పదేళ్లు తిరిగింది. మాణిక్యం కొడుకు ఇప్పుడు ఎందరికో కిడ్నీ వ్యాధుల్ని నయం చేసే స్పెషలిస్ట్‌ డాక్టరయ్యాడు. రాజేంద్ర కొడుకు ఇంజనీరై తాతకు మాంచి గ్రానైటు రాయితో, మెరిసే అక్షరాలు, సుబ్బయ్య ఫొటోతో సమాధి కట్టాడు. అంతే కాదు, ఆరోజు ముఖం తిప్పుకుంటూ వెళ్లిన వాళ్లంతా పెదవుల్లో నవ్వుల్ని సాగదీసుకుంటూ పెళ్లి సంబంధాలు చూడటానికి ఎగబడ్తున్నారు. లోకం నాలుకకు ఎన్నో చీలికలు. మనం అవసరమైనవే తీసుకోవాలి. లేదంటే ప్రతి నాలుకా విషపు కోరలతో వెంటబడుతుంది. ఆరోజు కాలిపోయిన సుబ్బయ్య కట్టె కోసం అప్పులు కూడా కరిగిపోయుంటే మిగిలిన వాళ్ళంతా కూడా జీవచ్ఛవాలయ్యేవాళ్లు. అందుకే తాహతునుబట్టి బతికినపుడే పైకెదిగే అవకాశం వుంటుంది. అనవసర గొప్పలకు పోకుంటే బాగుపడ్తారనటానికి సుబ్బయ్య కుటుంబమే ఉదాహరణైంది.

- డేగల అనితాసూరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement