అప్పులు పెరిగి.. ఆత్మస్థైర్యం కోల్పోయి..
కలసపాడు: వరుస కరువులు.. ఏటా తగ్గిన దిగుబడి.. చేతికొచ్చిన పంటకు గిట్టుబాట్టు ధరలు లేవు..పెట్టిన పెట్టుబడిలో సగం ఫలితం కూడా అందలేదు.. ఆశ చావక ఐదేళ్లుగా వ్యవసాయ జూదంలో అప్పులు చేసి ఓడిపోయిన కౌలు రైతు సీటా విఠలయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. కలసపాడు మండలం చింతలపల్లె పంచాయతీ పరిధిలోని జాతివర్తిపల్లె గ్రామానికి చెందిన సీటా విఠలయ్య వ్యవసా యంపై ఆధారపడి బతుకుతుండేవాడు.
గ్రామంలో మోతుబరి రైతుల పొలాలను కౌలుకు తీసుకుని పంటలు వేయడం మొదలు పెట్టాడు. ఐదేళ్ల నుంచి కరువు వెంటాడుతున్నా వ్యవసాయాన్ని మాత్రం వదలలేదు. పైరుకు గిట్టుబాటు ధరలేదు. అప్పులు పెరిగి పోయాయి. రుణదాతల ఒత్తిడి తీవ్రమైంది. విధిలేని పరిస్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పదెకరాల్లో ఎండిన పంటలు: ఈ ఏడాది విఠలయ్య చేసిన అప్పులకు తోడు మరో రెండు లక్షలు అప్పులు చేసి పొలంపై పెట్టుబడులు పెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఐదెకరాల్లో పత్తి, నాలుగు ఎకరాల్లో సజ్జ ,ఎకరంలో వరి సాగు చేసినట్లు తెలిపారు. అయితే ఇప్పటికీ వర్షాలు లేకపోవడంతో విఠలయ్య వేసిన పంటలు పూర్తిగా ఎండి పోయాయి. దీంతో అప్పులు తీర్చే మార్గంలేక మృత్యు ఒడికి చేరుకున్నాడు. విఠలయ్యకు భార్య వీరమ్మ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
పైసా రుణం ఇవ్వని బ్యాంకులు
కౌలు రైతులకు అప్పులు ఇస్తున్నామన్న ప్రభుత్వం కౌలు రైతు విఠలయ్యకు మాత్రం పైసా కూడా అప్పు ఇవ్వలేదు. మండలంలో దాదాపు 300 మందికి పైగా ఉన్న కౌలు రైతులకు ఇప్పటికీ కలసపాడులోని ఏ బ్యాంకు రుణం మంజూరు చేయకపోవడం గమనార్హం.