అంతం చూసిన అప్పులు
ధర్మాతండాలో రైతు బలవన్మరణం
తిరుమలాయపాలెం : ఆరుగాలం కష్టించి పంటలు పండించినా గిట్టుబాటు ధరలు లేక, సాగుకు చేసిన అప్పులు తీరక తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం పరిధి ధర్మాతండాకు చెందిన బర్మావత్ బాలు(42) అనే రైతు ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..తనకున్న రెండెకరాలతో పాటు మరో నాలుగెకరాలను కౌలుకు తీసుకొని రెండెకరాల్లో పత్తి, మూడెకరాల్లో వరి, ఎకరంలో మిర్చి పంట సాగు చేశాడు. గత సంవత్సరం భారీగా పెట్టుబడులు పెట్టి మిర్చి పంట పండించినప్పటికీ సరైన ధర లేక అప్పులే మిగిలాయి. ఈ ఏడాది మిర్చినారు పోస్తే అది తెగుళ్లతో ఎండింది.
నర్సరీల్లోలో నారు కొని వేశాడు. ఒక్కగానొక్క కుమార్తె ప్రేమజ్యోతి వివాహం కోసం రూ.లక్ష అప్పుచేసి ఇటీవల నిశ్చితార్థం చేశాడు. పోయినేడు, ఈ ఏడాది కలిపి రూ.6 లక్షలవరకు అప్పులు మిగిలాయి. భార్య బుజ్జిని అత్తగారి ఊరయిన చౌటపల్లికి అప్పు కోసం పంపించాడు. అప్పులు ఎలా తీర్చాలనే మనోవేదనదో..ఆదివారం రాత్రి ఇంట్లో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం తెల్లవారుజామున చుట్టుపక్కల వారు గమనించగా..అప్పటికే చనిపోయాడు. పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.