చేసిన అప్పులు తీర్చే మార్గం లేక .. ఓ రైతు గుండె ఆగింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని మక్తాకొత్తగూడెంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మక్తాకొత్తగూడెం గ్రామానికి చెందిన గుండాల దేవలింగం(38)కు ఎనిమిది ఎకరాల భూమి ఉంది.
అందులో దేవలింగం పన్నెండేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. గత రెండేళ్లుగా పంటలు లేక పోవడం.. బోర్లు వేసినా.. నీళ్లు పడక పోవడంతో అప్పుల పాలయ్యాడు. రెండేళ్లుగా వస్తున్న నష్టాలతో పాటు.. ప్రై వేటు వ్యక్తుల వద్ద తెచ్చిన అప్పు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పెరిగింది. ఈ ఏడాది వేసిన పత్తి వేశాడు.. నీరు లేక పంట ఎండి పోయింది.
ఈ క్రమంలో గురువారం ఉదయం చేను వద్దకు వెళ్లివచ్చిన దేవలింగం గ్రామంలో తోటి రైతులతో పంట ఎండి పోయిందని మాట్లాడుతూ.. కుప్పకూలి పోయాడు.. గ్రామస్తులు ఆటోలో సూర్యాపేటకు తరలిస్తుండగానే.. మార్గ మధ్యలో మృతిచెందాడు, సమాచారం తెలుసుకున్న తహశీల్దారు, ఏవో, ఎస్సైలు గ్రామానికి చేరుకుని.. మృతికి గల కారణాలు విచారించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు దేవలింగంకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. తండ్రి మృతిని తట్టుకోలేక పెద్ద కుమార్తె సొమ్మ సిల్లి పోయింది. ఆమెను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేస్తున్నారు.