Cotton crop
-
ధరలేక దిగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం రైతు దగా పడుతున్నట్లుగానే పత్తి రైతు కూడా చిత్తవుతున్నాడు. మద్దతు ధర కల్పనకు తేమ శాతం సాకుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మోకాలడ్డుతుంటే అంతర్జాతీయ మార్కెట్‌ను సాకుగా చూపి వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయారు. ఫలితంగా గతంలో ఎన్నడూలేని విధంగా పత్తి ధర పతనమైందని.. సర్కారు తీరువల్ల పెట్టుబడి కూడా దక్కడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు. గతేడాది 15 లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది 9.82 లక్షల ఎకరాల్లో సాగైంది. వరదలు, వర్షాలకు తోడు గులాబీ తెగులు ప్రభావంతో ఎకరాకు 4–6 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడంలేదంటున్నారు. ఈ ఏడాది కనీస మద్దతు ధరగా మధ్యస్థ రకానికి క్వింటా రూ.7,121, పొడవు రకానికి రూ.7,521గా కేంద్రం నిర్ణయించింది. కానీ, ఈ ఏడాది తొలితీత ప్రారంభానికి ముందే మార్కెట్లో ధరల పతనం మొదలైంది. గతేడాది క్వింటా రూ.10వేలకు పైగా పలికిన పత్తి ప్రస్తుతం మార్కెట్లో గ్రేడ్‌ను బట్టి క్వింటా రూ.4వేల నుంచి రూ.5,800 మించి పలకడంలేదు. మరోవైపు.. ఏటా అక్టోబరు మూడోవారంలో ప్రారంభం కావాల్సిన సీసీఐ కేంద్రాలు ఈ ఏడాది నవంబరు 11నాటికి కానీ ప్రారంభం కాలేదు. పైగా.. 33 ఏఎంసీల పరిధిలో 61 జిన్నింగ్ మిల్లులు ఏర్పాటుచేయాలని సంకలి్పంచగా, 45 జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే కొనుగోళ్లు మొదలయ్యాయి. సుదూర ప్రాంతాల్లో కేంద్రాలు.. ఇక కొనుగోలు కేంద్రాలను మారుమూలనున్న మిల్లుల వద్ద ఏర్పాటుచేయడంతో రవాణా, లోడింగ్ చార్జీలు రైతులకు తడిసిమోపెడవుతున్నాయి. ఉదా.. వైఎస్సార్ జిల్లాలో ఒక్క కేంద్రం ఏర్పాటుచేయలేదు. ఈ జిల్లాకు చెందిన రైతులు నంద్యాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే, గుంటూరు జిల్లా తాడికొండ రైతులు కూడా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్తిపాడు మండలంలోని కోయపాలెం మిల్లుకు వెళ్లాల్సి వస్తోంది. పోనీ ధర పెరిగే వరకు నిల్వచేసుకుందామనుకుంటే క్వింటాకు రూ.400–500 వరకు అద్దెలు చెల్లించాల్సి రావడంతో చేసేదిలేక అయినకాడకి అమ్ముకుంటున్నారు. తేమ శాతం పేరిట కొర్రీలు..కేంద్ర నిబంధనల మేరకు 8 శాతం తేమతోనే పత్తిని కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత 12 శాతం వరకు ఒక్కో శాతం చొప్పున ఎమ్మెస్పీ ధరలో కోత విధిస్తారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో పత్తి పిందె, పూతకొచ్చే దశలో కురిసిన అధిక వర్షాల కారణంగా తేమ శాతం 15–30 శాతం చొప్పున నమోదవుతుండగా, ప్రస్తుతం కురుస్తున్న మంచు ప్రభావంతో పెరుగుతున్న తేమశాతం రైతులకు ఇబ్బందికరంగా మారింది. కేంద్రాల్లో ఏర్పాటుచేసిన రెండు రకాల యంత్రాల్లో ఒక్కోదాంట్లో ఒక్కో రీతిలో తేమ శాతం నమోదవడంతో రైతులు నష్టపోతున్నారు. జిన్నింగ్ పరిశ్రమల యాజమాన్యాలతో సీసీఐ అధికారులు కుమ్మక్కై సర్వర్ నెమ్మదిగా ఉందని, తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకులు చెబుతూ మద్దతు ధర దక్కనీయకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉన్న పత్తిని నిల్వచేస్తే రంగు మారుతుండగా, నాణ్యమైన దిగుబడులొచి్చన చోట కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లలేక రైతులు అయినకాడకి అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడింది.ఒక్క కేంద్రం కూడా ఏర్పాటుచేయలేదు.. మా జిల్లాలో ఒక్క కేంద్రం కూడా ఏర్పాటుచేయలేదు. ఫలితంగా నంద్యాల జిల్లాలోని కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి వేలకు వేలు ఖర్చుపెట్టి లారీల్లో పత్తిని తీసుకుకెళ్తే అక్కడ నిమ్ము ఎక్కువగా ఉందని నాణ్యతలేదని రేటు తగ్గించేస్తున్నారు. మా జిల్లా నుంచి ఎవరు వెళ్లడంలేదు. ఇక్కడే అమ్ముకుంటున్నారు. గతేడాది మద్దతు ధరకు మించి పలికింది. ఈ ఏడాది రూ.6 వేలకు మించి పలకడంలేదు. దీంతో పాతది, ఇప్పటిదీ కలిపి దాదాపు 400 క్వింటాళ్ల పత్తిని ఇంట్లోనే ఉంచుకున్నాను. – నంద్యాల భాస్కర్‌రెడ్డి, రాజుపాలెం, వైఎస్సార్ జిల్లా ఎకరాకు రూ.5వేల నష్టం.. గతేడాది నవంబరులోనే గుంటూరు, ఒడిశా, రాయగడ, గుణుపూర్ ప్రాంతాలకు చెందిన వర్తకులు క్వింటా రూ.7వేలకు పైగా కొనుగోలు చేశారు. కానీ, ఈ ఏడాది రూ.6వేలకు మించి కొనడంలేదు. ఇలా అయితే ఎకరాకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ ఒక్కరికీ లభించడంలేదు. – పెద్దకోట జగన్నాథం, కర్లెం, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా -
కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల!
దేశవ్యాప్తంగా పత్తి పంటకు పెనునష్టం కలిగిస్తున్న గులాబీ పురుగును సమర్థంగా అరికట్టే కృషిలో నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశో«దనా సంస్థ (ఐసిఎఆర్–సిఐసిఆర్) పెద్ద ముందడుగు వేసింది. కృత్రిమ మేధ (ఎఐ)తో నడిచే హైటెక్ ఫెరమోన్ ట్రాప్లను పంజాబ్ రైతులకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. పంటలపై పురుగుల నియంత్రణలో కృత్రిమ మేధ సాంకేతికతను దేశంలోనే మొట్టమొదటి సారిగా వాడిన ఘనతను సిఐసిఆర్ దక్కించుకుంది.సంప్రదాయ లింగాకర్షక బుట్టలతోపోల్చితే ఈ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ట్రాప్‌లు చాలా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయని పంజాబ్ పత్తి రైతులు సంతోషిస్తున్నారు. పురుగుల తీవ్రతపై ప్రతి గంటకు రైతుల మొబైల్‌కు, కంప్యూటర్‌కు సమాచారం అందించటం ఈ ఎఐ ఫెరమోన్ ట్రాప్ ప్రత్యేకత. దీని ప్రకారం వ్యవసాయ విస్తరణాధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు వెంటనే నియంత్రణ చర్యలు సూచిస్తున్నారు.అదే రోజు ఆ చర్యలను రైతులు అమలు చేస్తుండటం వల్ల గులాబీ పురుగు వల్ల నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతున్నానని పంజాబ్ రైతు జగదేవ్‌సింగ్ చె΄్పారు. 2021 నుంచి వరుసగా మూడేళ్లుగా ఉగ్రరూపం దాల్చిన గులాబీ పురుగు బారిన పడి పంటను తీవ్రంగా నష్ట΄ోయిన రైతుల్లో ఈయన ఒకరు. ఎకరంన్నరలో బీజీ2 పత్తి సాగు చేస్తున్నారు. మూడు జిల్లాల్లో మరో 17 మంది రైతులు సిఐసిఆర్ పైలట్ ప్రాజెక్టు వల్ల ఈ ఏడాది పత్తి పంటపై దిగులు లేకుండా గడుపుతున్నారు.పత్తి పంటలో గులాబీ పురుగు తీవ్రతను గుర్తించడానికి హెక్టారుకు 5 చొప్పున లింగాకర్షక బుట్టలు పొలంలో వేలాడగడతారు. గాసిప్లూర్ అనే రసాయనిక ల్యూర్‌ను ఈ బుట్టలో పెడతారు. అది అడ పురుగుల వాసనగా పొరపడి ఆకర్షితులై వచ్చే మగ పురుగులు ఆ బుట్టలో చిక్కుకుంటాయి. వీటి సంఖ్యను బట్టి గులాబీ పురుగు తీవ్రతను అంచనా వేసి, క్రిమిసంహారకాలు చల్లుతారు. స్మార్ట్ ట్రాప్ ఎలా పనిచేస్తుంది?డిజిటలీకరించిన ఈ స్మార్ట్ ట్రాప్ సోలార్ విద్యుత్‌తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ట్రాప్ వ్యవస్థలో సింగిల్ బోర్డ్ కంప్యూటర్, కెమెరా మోడ్యూల్, వాతావరణ సెన్సార్, సోలార్‌తో నడిచే జిఎస్ఎం ట్రాన్స్మిటర్, రీచార్జిబుల్ బ్యాటరీ ఉంటాయి. ట్రాప్‌లోకి వచ్చి అతుక్కు΄ోయిన పురుగులను నిరంతరం ఈ కెమెరా ఫొటోలు తీసి, క్లౌడ్‌లోని రిమోట్ సర్వర్‌కు ఎప్పటికప్పుడు పంపుతుంది. ఆ ఫొటోలను మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించి ఏయే రకాల పురుగులన్న విశ్లేషణ జరుగుతుంది. గులాబీ పురుగునకు చెందిన రెక్కల పురుగులు ఎన్ని అనే విషయం ఇలా నిర్థారణ అవుతుంది. ఈ సమాచారంతో పాటు వాతావరణ వివరాలు స్మార్ట్ ట్రాప్‌కు అనుసంధానించిన మొబైల్/కంప్యూటర్లకు సంక్షిప్త సందేశాల రూపంలో చేరుకుంటాయి. ఈ విధంగా రైతులు సకాలంలో పురుగు తీవ్రతను గుర్తించి, క్రిమిసంహారాలు వాడి పత్తిని గులాబీ పురుగు నుంచి రక్షించుకుంటున్నారు.‘గతంలో సాధారణ లింగార్షక బుట్టలను పత్తి పొలంలో పెట్టి, ప్రతి 3 రోజులకోసారి స్వయంగా పొలానికి వెళ్లి చూసేవాడిని. నేను వెళ్లి చూసినప్పుడు పురుగులు పెద్దగా లేక΄ోవచ్చు. కానీ, తర్వాత రెండు రోజులు అటు వెళ్లను. ఆ తర్వాత రోజు వెళ్లేటప్పటికే పురుగు ఉధృతితో పంటకు తీవ్ర నష్టం జరిగి΄ోతూ ఉండేది. ఏ రోజు, ఏయే వేళలో పురుగు ఎక్కువ పంటను ఆశించిందీ మాకు తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు ఆ సమస్యల్లేవు. ప్రతి గంటకు మెసేజ్ వస్తుంది. అవసరమనిపిస్తే వెంటనే స్పందించి పిచికారీలు చేసి పంటను కాపాడుకుంటున్నాం..’ అన్నారు రైతు జగదేవ్‌సింగ్. సకాలంలో గులాబీ పురుగుకు చెక్..పత్తి పొలంలోని లింగాకర్షక బుట్టల్లో వరుసగా 3 రోజులు రోజుకు 8 చొప్పున గులాబీ రెక్కల పురుగులు కనిపిస్తే.. పంట దిగుబడిని భారీగా నష్టపరిచే స్థాయిలో పురుగు ఉందని అర్థం. అయితే, సాధారణ లింగాకర్షక బుట్టలను రైతులు పొలంలో పెట్టుకున్నప్పటికీ.. వాటిలో ఎన్ని పురుగులు పడుతున్నాయో గమనించే రైతులను మేం గతంలో చాలా అరుదుగా చూశాం. ఎందుకంటే, ఆ పని చేయటానికి వారికి చాలా సమయం అవసరం పడుతుంది. రైతు లు పత్తితో పాటు ఇతర పంటల పనులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది కదా.ఈ కొత్త వ్యవస్థ వారి సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతుంది. ఫోన్లోకి వచ్చే సమాచారంతో పత్తి రైతులు గులాబీ పురుగు ఉనికిని సకాలంలో గుర్తించగలుగుతారు. తగిన సమయంలో క్రిమిసంహారకాలను చల్లి, పంట నష్టాన్ని సమర్థవంతంగా తగ్గించుకుంటున్నారు. కృత్రిమ మేధతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫెరమోన్ ట్రాప్ తక్కువ ఖర్చుతోనే గులాబీ పురుగును సమర్థవంతంగా అరికడుతోంది. ఇవి రైతులు స్వయంగా పొలాల్లో ఏర్పాటు చేసుకోవటానికి ఉద్దేశించి రూపొందించినవి కాదు. తహసిల్ స్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు పురుగు తీవ్రతను సకాలంలో గుర్తించి, రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వటానికి డిజిటల్ సాధనాలుగా వాడుకోవడానికి స్మార్ట్ ట్రాప్స్ ఉపయోగపడుతాయి. తక్కువ సాంద్ర గ్రిడ్ పద్ధతిలో రైతుల పొలాల్లో ప్రభుత్వం ఈ స్మార్ట్ ట్రాప్లను ఏర్పాటు చేయవచ్చు.– డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్ -
పత్తికి ‘పచ్చ’ తెగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పత్తి పంటకు ‘పచ్చ’ తెగులు పట్టింది. వాస్తవాలను మరుగున పరిచి ఈనాడు రామోజీరావు విషం కక్కారు. వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 56 నెలల్లో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే, పత్తి రైతులకు అన్యాయం జరిగి పోయిందంటూ ‘వి‘పత్తి’పై.. నిర్లక్ష్యపు కత్తి’ అంటూ ఓ అబద్ధాల కథనాన్ని అచ్చేశారు. ఈ కథనంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.. ఆరోపణ: సగానికి తగ్గిన సాగు, దిగుబడులు వాస్తవం: పత్తి సాధారణ విస్తీర్ణం 15.26 లక్షల ఎకరాలు కాగా, ఖరీఫ్ – 2023లో 10.35 లక్షల ఎకరాల్లో సాగయింది. 12 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అంతర్జాతీయంగా పత్తి ధరలు తగ్గడం వల్ల పత్తి రైతులు మిరప, మొక్కజొన్న, ఆముదం, సోయాబీన్, జామ, డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్ వంటి పంటలకు మళ్లారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు, కోత దశలో మిచాంగ్ తుపాను ప్రభావం ఖరీఫ్–2023 సీజన్‌పై పడింది. పత్తి రైతులు ఇతర పంటలవైపు మళ్లడంతో మిరప 3.90 లక్షల ఎకరాల నుంచి 6.54 లక్షల ఎకరాలకు, మొక్కజొన్న 6.57 లక్షల ఎకరాల నుంచి 8.05 లక్షల ఎకరాలకు, ఆముదం 90 వేల ఎకరాల నుంచి 1.63 లక్షల ఎకరాలకు, సోయాబీన్ 2 వేల ఎకరాల నుంచి 22 వేల ఎకరాలకు పెరిగింది. పోనీ చంద్రబాబు హయాంలో ఏమైనా పెరిగిందా అంటే అదీ లేదు. 2014–15 లో 20.37 లక్షల ఎకరాల్లో సాగవగా, 27.51 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అదే 2018–19కి వచ్చేసరికి సాగు విస్తీర్ణం 15లక్షల ఎకరాలకు పడిపోయింది. దిగుబడులు 14.91 లక్షల టన్నులకు దిగజారిపోయాయి. ఆరోపణ: క్వింటాకు రూ.1,000 కంటే తక్కువకే అమ్మకాలు వాస్తవం: చంద్రబాబు హయాంలో ఏనాడూ పత్తి క్వింటాకు రూ.6,400 మించి పలకలేదు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో దాదాపు అన్ని సీజన్లలో ఎమ్మెస్పీకి మించి ధర పలికింది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.13 వేలు పలికింది. అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ లేకపోయినప్పటికీ, రాష్ట్రంలో క్వింటా పొడుగు పత్తి గింజ ఎమ్మెస్పీ రూ.7020 కాగా, ఆదోని మార్కెట్లో బుధవారం రూ.7029 పలికింది. మధ్యస్థ గింజ ఎమ్మెస్పీ రూ.6,800 కాగా, రూ.6,620 పలికింది. మరొక వైపు ధరలు పతనమైన ప్రతిసారీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ద్వారా పత్తిని కొంటోంది. ఇలా 4.5 ఏళ్లలో 83,413 మంది రైతుల నుంచి రూ.1,789 కోట్ల విలువైన 3.21 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేసింది. ఆరోపణ: నకిలీ విత్తనాలతో దోపిడీ వాస్తవం: నాసిరకం విత్తన తయారీ, విక్రయదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 351 నాసిరకం విత్తనాల ఉత్పత్తిదారులపై చర్యలు తీసుకుంది. మరో 168 నాసిరకం విత్తన ఉత్పత్తిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. 2,702 డీలర్‌షాపులను తనిఖీ చేసి రూ.40.97లక్షల విలువైన 34.20 లక్షల క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకొంది. రూ.12.84 లక్షల విలువైన 2,255 క్వింటాళ్ల విత్తనాల విక్రయాలను నిలిపివేసింది. బాధ్యులైన 16 మంది డీలర్లపై 6ఏ కేసులు, నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌్సలో పరీక్షించి, సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తోంది. ఇలా 2022–23లో 108.44 క్వింటాళ్లు, 2023–24లో 18 క్వింటాళ్ల సర్టిఫైడ్ పత్తి విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. ఆరోపణ: తెగుళ్లు, చీడపీడల నియంత్రణ చర్యలేవీ? వాస్తవం: గులాబీ రంగు పురుగు ఉ«ధృతికి అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించింది. 6,820 హెక్టార్లలో 682 క్షేత్ర స్థాయి ప్రదర్శనలు నిర్వహించి, గులాబీ పురుగు నివారణకు అవసరమైన వనరులను 50 శాతం సబ్సిడీపై ఇచ్చింది. ఫలితంగా 2023–24 సీజన్లో ఈ పురుగు ఉధృతి గణనీయంగా తగ్గింది. నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా 3,895 పొలంబడుల ద్వారా 1.17లక్షల మంది రైతులకు శిక్షణనిచ్చింది. ఇలా అడుగడుగునా పత్తి రైతుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తుంటే వాస్తవాలకు ముసుగేసి విష ప్రచారం చేయడం ఈనాడుకు తగదని రైతులు హితవు పలుకుతున్నారు. ఆరోపణ: ప్రభుత్వ ప్రోత్సాహమేది? వాస్తవం: ప్రభుత్వ ప్రోత్సాహం లేదనడమే అసంబద్ధం. వైఎస్ జగన్ ప్రభుత్వం అడగడుగునా రైతులకు అండగా ఉంది. అన్ని రకాలుగా ప్రోత్సాహాన్నిస్తోంది. రైతులపై పైసా భారం పడకుండా పత్తి పంటకు పంటల బీమా వర్తింపజేసింది. గత 4.5 ఏళ్లలో 8,33,989 మందికి రూ.1,045.40 కోట్ల బీమా పరిహారం చెల్లించింది. వాతావరణ ఆధారిత పథకం కింద అన్ని జిల్లాల్లో ఒకే రీతిలో బీమా వర్తింపజేస్తోంది. ఈ 4.5 ఏళ్లలో వైపరీత్యాల వల్ల నష్టపోయిన 1.28 లక్షల మందికి రూ.123.56 కోట్లు పంట నష్ట పరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) అందించింది. ఖరీఫ్–2023లో వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన 2.23 లక్షల మందికి రూ.337.17 కోట్లు, మిచాంగ్ తుపాన్ వల్ల దెబ్బతిన్న 2,513 మంది రైతులకు రూ.2.32కోట్ల ఇన్పుట్ సబ్సిడీని త్వరలో జమ చేయనుంది. చంద్రబాబు హయాంలో ఒక్క రైతుకు కూడా బీమా పరిహారం ఇవ్వలేదు. -
పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా?
పత్తి అయినా, మరో పంటైనా.. వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా? వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. పత్తి, కూరగాయలు, సోయా, వేరుశనగ.. పంట ఏదైనా సరే.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు(రెయిజ్డ్ బెడ్స్) చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకోవటం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రవీణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా ఎత్తుమడులపై పత్తిని సాగు చేయటంపై ప్రయోగాలు చేస్తూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. దుక్కి చేసిన పొలంలో ట్రాక్టర్ ద్వారా ఇలా ఎత్తు మడులు/బోదెలు తోలుకోవాలి దుక్కి దున్ని, ట్రాక్టర్‌కు అమర్చిన బెడ్ మేకర్ ద్వారా బోదెలు తోలాలి. తగుమాత్రంగా వర్షం పడిన తర్వాత ఆ బెడ్‌పై ఒకే వరుసలో విత్తుకోవాలి. చదునుగా ఉండే పొలంలో సాగు చేసిన పత్తి పంట కంటే బోదెలు తోలి సాగు చేసిన పత్తి పంట మంచి దిగుబడినిచ్చింది. వర్షం పడిన తర్వాత ఒక వరుసలో పత్తి విత్తనం వేసుకోవాలి వర్షాలకు అధిక నీరు పొలంలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్లిపోవటం వల్ల పత్తి పంట ఉరకెత్త లేదు. గాలి, వెలుతురు మొక్కల మొదళ్లకు బాగా తగలటం వల్ల, ఎత్తు మడిలో మట్టి గుల్లగా ఉండటంతో వేరు వ్యవస్థ బాగా విస్తరించటం వల్ల పంట ఆరోగ్యంగా ఎదిగింది. ఎత్తు మడులపై ఆరోగ్యంగా పెరుగుతున్న పత్తి పైరు ఫ్లాట్ బెడ్‌పై విత్తనాలు నాటిన దానితో పోల్చితే అధిక పత్తి దిగుబడులు రావటానికి ఎత్తు మడుల పద్ధతి బాగు ఉపయోగపడిందని డా. ప్రవీణ్ కుమార్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఒక వేళ వర్షాలు తక్కువ పడితే, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చినా కూడా ఎత్తుమడిపై ఉన్న పంట వేరు వ్యవస్థలో తేమ త్వరగా ఆరిపోదు. అందువల్ల బెట్టను తట్టుకునే శక్తి కూడా బోదెలపై నాటిన పంటకు చేకూరుతుంది. ఎత్తు మడులు / బోదెలపై పత్తి పంటను విత్తుకోవటం గురించి తాజా వీడియోను ‘కేవీకే ఆదిలాబాద్’ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. రైతులు ఆ వీడియోను చూసి అవగాహన పెంచుకోవచ్చు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: జీవన ఎరువుల ప్రయోగశాల) -
Telangana: రైతులకు వి‘పత్తి’!
సాక్షి, వరంగల్/ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చాలామంది రైతుల ఇళ్లు ఇరుగ్గా మారిపోయాయి.. ఇంటి ఆవరణలు, పశువుల కొట్టాల్లో కూడా జాగా లేకుండా పోయింది.. ఉన్నట్టుండి ఇలా అయిపోవడానికి కారణం ‘పత్తి’ తెచ్చిన తంటాలే. అసలే అడ్డగోలు పెట్టుబడులు, పైగా తగ్గిన దిగుబడితో ఆందోళనలో ఉన్న రైతులకు పత్తి ధరలు తగ్గిపోవడం అశనిపాతంగా మారింది. తక్కువ ధరకు అమ్ముకుని అప్పులు మిగుల్చుకోలేక.. ఎక్కువ ధర ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ.. పత్తిని ఇళ్ల వద్ద, కొట్టాల్లో నిల్వ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ సమయానికల్లా వానాకాలం పత్తి అమ్మేసుకుని, యాసంగి పంటపై దృష్టిపెట్టే రైతులు.. ఈసారి ఇంకా పంటను విక్రయించకుండా ఎదురుచూస్తున్నారు. దీనితో కాటన్, జిన్నింగ్ మిల్లులు బోసిపోయి కనిపిస్తున్నాయి. అమ్మింది 3.17 లక్షల టన్నులే.. మార్కెట్లో గత ఏడాది పత్తికి గరిష్టంగా క్వింటాల్‌కు రూ.13 వేలకుపైగా ధర పలికింది. ఈ క్రమంలో వరిసాగు తగ్గించి, పత్తి పెంచాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. అయితే సీజన్ ప్రారంభంలో భారీ వర్షాలు పడటంతో పలుచోట్ల మొదట వేసిన పత్తి విత్తనాలు కుళ్లిపోయాయి. దాంతో రైతులు మళ్లీ విత్తనాలు వేశారు. మరోవైపు అధిక వర్షాలు కొనసాగడంతో పత్తి దిగుబడి కూడా తగ్గింది. ఎకరాకు 10 క్వింటాళ్లకుపైగా దిగుబడి రావాల్సి ఉన్నా.. ఐదారు క్వింటాళ్లే వచి్చందని రైతులు చెప్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా.. 26 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో జనవరి మూడో తేదీ నాటికి మార్కెట్‌కు కేవలం 3.17 లక్షల టన్నులే వచి్చందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు చెప్తున్నారు. మిగతా పత్తినంతా రైతులు నిల్వ చేసుకున్నట్టు వివరిస్తున్నారు. బోసిపోయిన మిల్లులు రాష్ట్రవ్యాప్తంగా 350 మిల్లుల్లో రోజూ పత్తిని జిన్నింగ్ చేయాలంటే.. కనీసం 4 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్లకు రావాలి. ప్రస్తుతం అందులో సగం కూడా రావడం లేదని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు చెప్తున్నాయి. దీనితో మార్కెట్ యార్డులు, కాటన్, జిన్నింగ్ మిల్లులు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. తగ్గిన ధర.. మళ్లీ పెరుగుతుందనే ఆశలు గత ఏడాది పత్తి ధర రూ.13 వేలు కూడా దాటింది. 6 నెలల కిందటి వరకు కూడా క్వింటాల్‌కు రూ.10 వేలు పైన పలికినా.. తర్వాత తగ్గిపోయింది. ప్రస్తు తం రకాన్ని బట్టి క్వింటాల్ రూ.6,200 నుంచి రూ.8,300 మధ్య కొనుగోలు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కొన్నిచోట్ల వ్యాపారులు రూ.6 వేల వరకే చెల్లించారు. దీనితో ఆందోళనలో పడ్డ రైతులు భవిష్యత్తులో మంచి ధర వస్తుందన్న ఆశ తో నిల్వ చేసుకున్నారు. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో మాత్రం కొంతమేర పత్తి మార్కెట్‌కు వస్తోంది. గత శుక్రవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి ధర గరిష్టంగా క్వింటాల్‌కు రూ.8,170గా నమోదైంది. ఆదిలాబాద్ మార్కెట్లో రూ.8,150, ఖమ్మం, జమ్మికుంట మార్కెట్లలో రూ.8,300 పలికింది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత క్వింటాల్‌కు ధర రూ.10 వేలు దాటుందని రైతులు ఆశిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఒక క్యాండీ (గింజలు తీసిన 3.56 క్వింటాళ్ల పత్తి) ధర రికవరీ అవుతోంది. గతేడాది జూన్, జూలై వరకు రూ.1,10,000గా ఉన్న క్యాండీ ధర తర్వాత రూ.52 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రూ.62 వేలు దాటింది. త్వరలో ఇది రూ.90 వేలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పత్తి గింజల ధర కూడా పెరుగుతోందని.. ఈ లెక్కన పత్తి ధర పెరుగుతుందని అంటున్నాయి. కౌలుకు తీసుకుని సాగు చేసి.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన తుమ్మ రాజారెడ్డి తన పదెకరాలతోపాటు మరో పదెకరాలను కౌలు తీసుకొని పత్తిసాగు చేశాడు. రూ.15 లక్షల వరకు పెట్టుబడి అయింది. ఇప్పటికే కూలీలను పెట్టి 120 క్వింటాళ్ల పత్తి ఏరారు. కానీ గిట్టుబాటు ధర రాక విక్రయించకుండా నిల్వ చేశారు. చేనులో ఇంకా పత్తి ఉన్నా చేతిలో డబ్బుల్లేక అలాగే వదిలేశాడు. ఇంటి బయట ఎండా వానకు.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బీడ చిన్న లచ్చయ్య ఎనిమిది ఎకరాల్లో పత్తి వేశాడు. మార్కెట్లో ధర లేదని పత్తిని ఇలా ఇంటి బయట, వరండాలో ప్లాస్టిక్ కవర్లు కప్పి నిల్వ చేశాడు. ఎప్పుడు ధర పెరుగుతుందో, ఎప్పుడు అమ్ముతానో అని ఆవేదన చెందుతున్నాడు. సంగారెడ్డి జిల్లా జరాసంఘం మండలం బొప్పన్పల్లికి చెందిన రైతు రాములు ఇంట్లో పరిస్థితి ఇది. దిగుబడి వచి్చన పత్తిని అమ్ముకుందామంటే సరైన ధర రాక ఇంట్లోనే నిల్వచేసుకున్నాడు. ఉన్న రెండు గదుల్లోనూ పత్తి నిండిపోవడంతో.. దానికి ఓ పక్కన స్టవ్ పెట్టుకుని వంట చేసుకుంటున్నారు. ఆ కొంత స్థలంలోనే కుటుంబమంతా నిద్రపోతున్నారు. -
'ఆ పురుగు మనిషిని తాకితే 5 నిమిషాల్లో చనిపోతారు'.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..
అనంతపురం అగ్రికల్చర్: రెండు మూడు రోజులుగా వాట్రాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఫొటోలు, సందేశాలు నిరాధారమైనవని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.మల్లీశ్వరి తెలిపారు. “పత్తి పంటలో ఒక పురుగు ఉంది. ఆ పురుగు మనిషిని తాకితే 5 నిమిషాల్లో చనిపోతున్నారు... జాగ్రత్తగా ఉండండి’ అంటూ అందరూ ఆందోళనకు గురయ్యేలా పురుగు ఫొటోలు, చనిపోయిన మనుషుల ఫొటోలు, ఆడియో సందేశాలు పంపిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ పూర్తీగా అవాస్తవమని పేర్కొన్నారు. అలాంటి పురుగు పత్తి పంటకు అసలు ఆశించదని, అది ఎక్కువగా చెరకు, పండ్ల తోటల్లో కనిపిస్తుందన్నారు. లద్దె పురుగు ఆకారంలో శరీరంపై వెంట్రుకలు కలిగి ఉంటుందన్నారు. వెంట్రుకల చివరి భాగంలో స్వల్ప విషపూరిత పదార్థం ఉంటుందన్నారు. ఒకవేళ ఆ పురుగు మనిషి శరీరాన్ని తాకినా కేవలం తగిలిన చోట దురద , లేదంటే చిన్నగా వాపు వస్తుందని, ఒకట్రెండు రోజుల్లో తగ్గిపోతుందని స్పష్టం చేశారు. రైతులు, ప్రజలు ఆ విషయాన్ని గమనించాలని సూచించారు. చదవండి: (AP: విద్యాశాఖలో మరో కీలక సంస్కరణ) -
పత్తి ధర ఆల్‌టైమ్ రికార్డ్: 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
సాక్షి, వరంగల్ రూరల్, స్టేషన్‌ఘన్‌పూర్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా మంగళవారం క్వింటా పత్తి ధర రూ.14 వేలు పలికింది. మార్కెట్‌కు ఒకే రోజు 1,500 బస్తాలు, 750 క్వింటాళ్ల పత్తి వచ్చింది. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన రైతు యాట ప్రభాకర్ 20 బస్తాల పత్తిని విక్రయానికి తీసుకురాగా.. రూ.14 వేలు పలికి ఆల్‌టైం రికార్డుగా నమోదైంది. పత్తి క్వింటాల్‌కు రూ.14 వేలు ఇస్తామని చెప్పడంతో షాక్‌కు గురైనట్లు, ఈధరతో ఎంతో సంతోషంగా ఉన్నానని రైతు హర్షం వ్యక్తం చేశాడు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్లో మంగళవారం క్వింటా పత్తి ధర రూ.13,500 పలికింది. కనిష్టంగా రూ.10,500 ధర పలికింది. జఫర్‌గఢ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు 4 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు తీసుకురాగా.. రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి బివి రాహుల్ మాట్లాడుతూ.. పత్తి పంట సీజన్ అక్టోబర్‌లో ప్రారంభమై మే నెలలో కొనుగోళ్లకు చివరి నెల అని తెలిపారు.. అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ కారణంగా పత్తి ధర రికార్డు స్థాయికి చేరుకుందని అన్నారు. గోడౌన్లలో పత్తి నిల్వలు ఉంచిన రైతులు అధిక డిమాండ్‌ను ఉపయోగించుకుని తమ పంటను విక్రయించాలని సూచించారు. -
ఎత్తు మడులపై పత్తి అంతరపంటగా కంది!
పత్తి సాగులో సమస్యలను అధిగమించడానికి బెడ్స్ (ఎత్తు మడులు) పద్ధతిని అనుసరించడం మేలని నిపుణులు చెబుతున్నారు. ట్రాక్టర్‌తో బెడ్స్ ఏర్పాటు చేసుకొని ఒక సాలు పత్తి, పక్కనే మరో సాలు కందిని మనుషులతో విత్తుకోవటం మేలని సూచిస్తున్నారు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా.. కండగల నల్లరేగడి నేలలైనా, తేలికపాటి ఎర్రనేలలైనా.. బెడ్స్‌పై పత్తిలో కందిని అంతర పంటగా విత్తుకోవటం రైతులకు ఎన్నో విధాలుగా ఉపయోగకరమని చెబుతున్నారు. పత్తి పంటను ఎత్తుమడుల (బెడ్స్)పై విత్తుకోవటమే మేలని, అందులో కందిని అంతర పంటగా 1:1 నిష్పత్తిలో వేకోవటం వల్ల రైతులకు అనేక ప్రయోజనాలున్నాయని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగాత్మక సాగులో తొలి అనుభవాలు తెలియజేస్తున్నాయి. బెడ్స్‌పై పత్తి, కంది మిశ్రమ సాగుపై రెండేళ్లుగా అనేక విధాలుగా ప్రయోగాలు చేస్తున్న డా. ప్రవీణ్ మూడేళ్ల తర్వాత పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని అన్నారు. అయితే, ఇప్పటికి గ్రహించిన దాన్ని బట్టి పత్తిలో కంది పంటను బెడ్స్‌పై 1:1 నిష్పత్తిలో విత్తుకోవటం మేలని భావిస్తున్నారు. కందిని 1:1 నిష్పత్తిలోనే విత్తుకోవాలనేం లేదని, 4:1 నిష్పత్తిలో (4 సాళ్లు పత్తి, 1 సాలు కంది) కూడా విత్తుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు. కండగల నల్లరేగడి నేలల్లో అయినా, తేలికపాటి ఎర్ర నేలల్లో అయినా బెడ్స్ పద్ధతిలో పత్తిలో కందిని అంతరపంటగా విత్తుకుంటే వర్షం ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. గత ఏడాది నల్ల రేగడి నేలలో బెడ్స్‌పై పత్తిలో కంది పంటను 1:1 నిష్పత్తిలో విత్తి మంచి ఫలితాలు సాధించారు. బెడ్ వెడల్పు అడుగు. రెండు బెడ్స్ మధ్య దూరం 5 అడుగులు. ట్రాక్టర్ సహాయంతో బెడ్స్ ఏర్పాటు చేయించారు. మొక్కల మధ్య అడుగు దూరం పాటించారు. మనుషులతో బెడ్స్‌పై విత్తనం నాటించారు. గత ఏడాది సాధారణం కన్నా అధిక వర్షాలు కురిసినప్పటికీ.. బెడ్స్ పద్ధతి వల్ల పొలంలో నీరు నిలబడలేదు. దీని వల్ల పంట పెరుగుదలకు ఎటువంటి ఆటంకం కలగలేదు. బెడ్స్‌పై సాగు వల్ల ఉపయోగాలేమిటి? బెడ్స్ మీద విత్తిన విత్తనం సాధారణ పొలంలో కన్నా ఒకటి, రెండు రోజులు ముందే మొలిచింది. అంతేకాదు, 90% వరకు మొలక వచ్చింది. వర్షపు నీరు ఒక్క రోజు కూడా పొలంలో నిలవకుండా కాలువల ద్వారా బయటకు వెళ్లిపోయింది. దీని వల్ల తొలి దశలో మొక్క పెరుగుదల ఒక్క రోజు కూడా కుంటుపడలేదు. బెడ్స్ లేకపోతే ఎక్కువ వర్షం పడినప్పుడు ఉరకెత్తే సమస్య ముఖ్యంగా నల్లరేగడి పొలాల్లో సాధారణం. బెడ్స్ వల్ల ఈ సమస్య లేకుండా పోయింది. అంతేకాదు, కాయకుళ్లు సమస్య కూడా తీరిపోయిందని డా. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బెడ్స్ లేకుండా సాగు చేసే పొలాల్లో పత్తి మొక్కలకు కింది కొమ్మలకు మొదట్లో వచ్చే 5–10 కాయలు కుళ్లిపోతూ ఉంటాయి. బెడ్స్ మీద వేయటం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి, తేమ తగుమాత్రంగా ఉండటం వల్ల కాయ కుళ్లు లేదన్నారు. పత్తి, కంది.. 11 క్వింటాళ్ల దిగుబడి బెడ్స్ పద్ధతిలో విత్తిన పొలాల్లో కూడా గులాబీ రంగు పురుగు ఉధృతి మామూలుగానే ఉంది. గులాబీ పురుగు ఉధృతి ఎక్కువయ్యే కాలానికి, అంటే నవంబర్ ఆఖరు నాటికే పత్తి మొక్కలను తీసేశాం. అయినా ఎకరానికి 5.5 క్వింటాళ్ల మేరకు పత్తి దిగుబడి వచ్చిందని డా. ప్రవీణ్‌కుమార్ అన్నారు. గులాబీ పురుగును సమర్థవంతంగా అదుపు చేయగలిగితే మరో 3–4 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదన్నారు. నవంబర్ ఆఖరులో పత్తి తీసేసినా.. కంది పంట జనవరి వరకు ఉంచారు. ఎకరానికి 5.5 క్వింటాళ్ల కందుల దిగుబడి కూడా వచ్చింది. అంటే, ఒక ఎకరంలో రెండు పంటలూ కలిపి 11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఒకవేళ పత్తి పంట ఏ కారణంగానైనా దెబ్బతింటే.. కంది పంటయినా రైతును ఆదుకుంటుందని.. అందుకని పత్తితో పాటు కందిని కూడా వేసుకోవటం మేలని డా. ప్రవీణ్ కుమార్ రైతులకు సూచిస్తున్నారు. బెడ్స్‌పై కాకుండా మామూలుగా నల్లరేడగడి పొలంలో పత్తి మాత్రమే విత్తుకున్న రైతులు కూడా చాలా మంది ఐదారు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి తీయగలిగారన్నారు. అధిక వర్షాల వల్ల పంట పెరుగుదల లోపించటం, గులాబీ పురుగు ఉధృతిని అదుపు చేయలేకపోవటం వల్ల దిగుబడి తగ్గిందన్నారు. తేలికపాటి ఎర్ర నేలల్లో అయినా పత్తితోపాటు కందిని బెడ్స్‌పై విత్తుకుంటే వర్షం ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బంది ఉండదన్నారు. తేమ త్వరగా ఆరిపోకుండా ఉండటానికి బెడ్స్ ఉపయోగపడతాయన్నారు. ఈ ఏడాది కూడా సాధారణం కన్నా అధికంగానే వర్షాలు పడతాయని భావిస్తున్న నేపథ్యంలో బెడ్స్ పద్ధతిని రైతులు అనుసరించడం మేలు. బెడ్స్ పద్ధతిలో సాగుపై ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం యూట్యూబ్ చానల్ ఓఠిజు అఛీజీ ్చb్చఛీ లో వీడియోలు ఉన్నాయి. ఆసక్తి గల రైతులు చూడవచ్చు. ఆ తర్వాత కూడా సందేహాలుంటే డా. ప్రవీణ్ కుమార్ (99896 23829)ను సంప్రదించవచ్చు. -
పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపించిన వర్షాలు
-
పంటలకు వరద పోటు..
సాక్షి, నెట్వర్క్: భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. ప్రధానంగా పత్తి పంట దెబ్బ తినగా, నాట్లు వేసిన వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. కొన్ని చోట్ల నీటి ప్రవాహానికి మొక్కలు కొట్టుకుపోయాయి. మంచిర్యాల జిల్లాలో ఏటా ప్రాణహిత తీరంలో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుండగా.. గత రెండు రోజులుగా కురిసిన వానలతో వేలాది ఎకరాల్లో భారీగా వరద నీరు చేరింది. పత్తి చేనుల్లో నీటి చేరికతో పాటు ఇసుక మేటలు వేయడంతో పత్తి మొలక, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా వరి నాట్లు వేస్తుండగా, ఈ వర్షాలతో నారు ఎదగకుండా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 6,864 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 5, 099 ఎకరాల్లో పత్తి, 1,447 ఎకరాల్లో వరి, 312 ఎకరాల్లో మిరప, 6 ఎకరాల్లో కంది నీట మునిగింది. పత్తికే ఎక్కువ నష్టం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 6 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా వేయగా, ఇప్పటివరకు సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. అలాగే సుమారు లక్ష న్నర ఎకరాల్లో పత్తి పంట వేశారు. భారీ వర్షాలతో చాలాచోట్ల ఇప్పటికే వేసిన వరి నాట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం తో పొలాలు మునిగిపోయాయి. పల్లపు ప్రాంతాల్లో పంటల మునక ఖమ్మం జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 2,70,000 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1,82,068 ఎకరాల్లో పంట వేశారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2,52,500 ఎకరాలు కాగా.. ఇప్పటికి 49,233 ఎకరాల్లో నాట్లు వేశారు. జిల్లాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో పల్లపు ప్రాంతాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 2.86 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. అలాగే పత్తి 2,363 ఎకరాల్లో సాగైంది. -
రైతుల కోసం 'క్రాప్ దర్పణ్'!
హైదరాబాద్: పంటలకు సంబంధించి రైతుల సమస్యలు తీర్చేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రత్యేక యాప్ రూపొందించింది. పత్తి పంటకు సోకే వ్యాధుల నిర్ధారణలో రైతులకు సాయం చేసేందుకు 'క్రాప్ దర్పణ్' పేరిట యాప్ తయారు చేశారు. భారత్-జపాన్ జాయింట్ రీసెర్చ్ లేబొరేటరీ ప్రాజెక్టు కింద దీన్ని రూపొందించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐటీ హైదరాబాద్, బాంబే ఐఐటీ సహకారంతో ట్రిపుల్ ఐటీ ఈ యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.(చదవండి: కాళేశ్వరంలో పడవ ప్రయాణం) తొలుత పత్తి పంటపై మాత్రమే రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. తదుపరి దశల్లో ఇతర పంటలపై కూడా దృష్టి పేట్టి యాప్‌ల రూపకల్పన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్ ప్రొఫెసర్ పి.కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అరవింద గాడమశెట్టి, రేవంత్ పర్వతనేని, సాయిదీప్ చెన్నుపాటి, శ్రీనివాస్ అన్నపల్లి కలసి ఈ యాప్ రూపొందించారు. గతంలో కూడా వ్యవసాయ సలహా వ్యవస్థను, గ్రామ స్థాయిలో ఈ-సాగును ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేసింది. చీడపీడలపై రైతులకు అవగాహన పత్తి పంట పెరుగుదలను ప్రభావితం చేసే సమస్యలు, తెగుళ్లు, బ్యాక్టీరియా, శిలీంద్ర వ్యాధులు, పోషక లోపాలకు సంబందించిన అంశాలు ఈ యాప్‌లో పాందుపర్పారు. చీడపీడలపై రైతులపై మార్గనిర్దేశం చేయడమే కాకుండా అవగాహన కల్పిస్తుంది. https://www.cropdarpan.in/cropdarpan/ పోర్టల్‌లో లింకు ద్వారా ఈ యాప్‌ను స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పత్తి పంటపై మాత్రమే తెలుగు, ఇంగ్లిష్ భాషలలో రూపొందించారు. త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాప్‌లోని ప్రశ్నలను ఎంపిక చేసుకుంటే వాటికి సమాధానాలు, తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. విత్తనాలు ఎప్పుడు వేయాలో, పోషకాలు ఎలా అందించాలో ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. -
బుల్లెట్‌పై వెళ్లి పత్తి ఏరిన కలెక్టర్..
భూపాలపల్లి రూరల్ : పల్లె ప్రగతి పనుల చివరి రోజు సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదివారం పలు గ్రామాలను సందర్శించారు. ఆముదాలపల్లికి బుల్లెట్ వాహనంపై వెళ్లారు. మార్గమధ్యలో పత్తి చేలల్లో కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూలీలతో కలసి పత్తి ఏరుతూ వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి పత్తి ఏరుతున్న ఇంటర్ విద్యార్థిని ఝాన్సీతో కాసేపు మాట్లాడారు. వ్యవసాయ పనుల్లో కుటుంబానికి ఆసరాగా నిలిచిన ఝాన్సీని అభినందించిన కలెక్టర్, బాగా చదువుకోవాలని అన్నారు. -
పత్తి రైతులకు పొంచి ఉన్న విపత్తు
భూమిలో విత్తనాలు నాటిన నాటినుండి మొదలైన రైతు కష్టాలు పంటచేతికి వచ్చి మార్కెట్లో పంటలను అమ్ముకునేవరకు నిత్యకృత్యంగా మారాయి. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోతుంటే పాలకులు, అధికారులు మాత్రం ‘‘నిమ్మకు నీరెత్తనట్లుగా’’ వ్యవహరిస్తున్నారు. పత్తివిత్తనాల్లో కల్తీ, వాటి ధరలను పెంచుకుపోతున్న దోపిడీకి పాలకులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పత్తిరైతులకు నష్టాలు విత్తనాల విక్రయంలో అధిక ధరలు నకిలీల బెడద నుండి మొదలై మార్కెట్లో మద్దతు ధర ఇచ్చే వరకు అన్ని స్థాయిల్లోనూ దోపిడీకి గురవుతున్నారు. చరిత్రలోనే అత్యధికంగా తెలంగాణలో 46.92 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగు చేశారు. ఈ పంటకు మద్దతు ధర ఇప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అన్నదాతలకు చేరడం లేదు. ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,550గా కేంద్రం నిర్ణయించింది. కొత్త పత్తిపంటను రైతులు మార్కెట్టుకు తేవడం మొదలైంది. తీరా తొలిపంట ఉత్పత్తికి మార్కెట్లో మద్దతు ధరను వ్యాపారులు చెల్లించిన దాఖలాలు లేవు. ఇప్పుడిప్పుడే వస్తున్న కొత్తపత్తికి మద్దతు ధర లేకపోవడాన్ని బట్టిచూస్తే పంటల దిగుబడి పూర్తిస్థాయిలోకి వచ్చాక రైతులకు మద్దతు ధర లభించడం ఎండమావుల్లో నీటిని వెతుక్కున్నట్లే అనిపిస్తుంది. మార్కెట్లో కనిష్టంగా క్వింటాలుకు రూ. 4,221 నుంచి గరిష్టంగా రూ. 5,211 వరకు అతికష్టంమీద చెల్లిస్తున్నారు. దూదిలో తేమ సాకుతో ధరను వ్యాపారులు బాగా తగ్గిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తరపున ‘భారత పత్తి సంస్థ’ (సీసీఐ) మద్దతు ధరకు పత్తిని కొంటుంది. అలాకొనే కేంద్రాలను 340 వరకు ఏర్పాటు చేయాలని కోరింది. అందులో వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేసినవి 34 మాత్రమే సుమా ! మిగిలిన 306 కేంద్రాలను జిన్నింగ్ మిల్లులో పెట్టాలని నిర్ణయించారు. మిల్లు యాజమాన్యాలు మద్దతు ధర ఇస్తారనేది అందని ద్రాక్షేనని రైతులు భావిస్తున్నారు. కొత్తపత్తికే మద్దతు ధర అందడం లేదు. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా మార్కెట్లకు పత్తిపంట వస్తే, పత్తిపంట అంతటికి మద్దతు ధర ఇస్తారనడం రైతులు నమ్మలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రతిరైతుకు మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేసేలా వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఇలా వుంటే ? అందరికీ మద్దతు ధర ఇచ్చినా క్వింటాలుకు రైతు పెట్టిన వ్యయాన్ని ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 9,502. కేంద్రం ఇస్తున్న మద్దతు ధర రూ. 5,550. ఈ లెక్కన చూసినా క్వింటాలుకు రూ. 4,000 నష్టాన్ని రైతులు పెట్టుబడిలోనే భరిస్తున్నారు. ఇలా ఇట్టి వ్యయాన్ని లెక్కించినపుడు నష్టాల బారిన రైతాంగం పడక తప్పదు. రైతులు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాల్సి ఉంది. రాయితీలు మాత్రమే కాదు? మార్కెట్ల మాయాజాలం, కల్తీ విత్తనాలు, పురుగు మందులు ఇలా అన్ని స్థాయిల్లో దోపిడీని నివారించినప్పుడే రైతులు వ్యవసాయం చేయగలుగుతారు. ఈ సంవత్సరం భారీగా పత్తి ఉత్పత్తి రాబోతున్న వేళ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోకపోతే చాలా విపత్కర పరిస్థితికి కారకులవుతారని గమనించండి. రైతుల పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు పెట్టుబడికి కనీసం 150 శాతం వచ్చేలా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించాలి. ఆ ధరకు మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేయని ఎడల ఎలాంటి షరతులు పెట్టకుండా రైతుల వద్ద నుండి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. రైతు పెట్టుబడికి మద్దతు ధరకు మధ్య క్వింటాలుకు రూ. 4,000 వరకు నష్టపోతున్నందువల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అన్ని ఉత్పత్తులకు అండగా ఉంటున్న పాలకులు రైతు ఉత్పత్తులకు ఎందుకు అండగా ఉండరు? రైతుకు భిక్షం వేసినట్టు కేంద్రం మద్దతు ధర రూ. 100, రూ. 200 పెంచుతూ పోవడం భావ్యం కాదు. మట్టిని నమ్ముకున్న రైతు నోట మట్టికొట్టే విధానాలు మారనంత కాలం రైతు కుటుంబాల్లో వెలుగులు రావు. పత్తి రైతుల మద్దతు ధరకు ఉత్పత్తి వ్యయానికి మధ్య అగాధాన్ని పూడ్చాలి. వ్యవసాయాన్ని లాభాలబాట పట్టించాలి. రైతు ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులదే. మేకిరి దామోదర్ వ్యాసకర్త రచయిత, ఉపాధ్యాయుడు మొబైల్ : 95736 66650 -
పత్తి ఏరుతుండగా పిడుగుపడటంతో..
సాక్షి, మరిపెడ రూరల్ : పొలంలో పత్తి ఏరుతుండగా ఒక్కసారిగా పడిన పిడుగు తండ్రీ కొడుకుల ప్రాణాలను బలితీసుకుంది. మరొకరు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల శివారు వాల్యాతండా గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన తేజావత్ కిషన్ (48), భార్య తారతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పత్తి ఏరడానికి వెళ్లారు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ పత్తి ఏరుతుండగా కొడుకు తేజావత్ సంతోష్ (14) మధ్యాహ్న భోజనం తీసుకెళ్లాడు.భోజన విరామం అనంతరం అమ్మానాన్నలతో కలిసి తాను సైతం పత్తి ఏరుతుండగా.. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో వాన మొదలైంది. అంతలోనే వారికి అతి సమీపంలో పిడుగు పడటంతో తండ్రీ కొడుకులు కిషన్, సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా.. తార స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
గద్వాల నుంచి జిల్లాలోకి..
కర్నూలు(అగ్రికల్చర్) : రాష్ట్రంలో పత్తి సాగయ్యే జిల్లాల్లో కర్నూలు ప్రధానమైంది. జిల్లాలో దాదాపు 3 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగవుతుంది. కొద్ది నెలలుగా పత్తి ధరలు ఆశాజనకంగా ఉండటం, జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటంతో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో గ్రామాలను నకిలీ బీటీ పత్తి విత్తనాలు ముంచెత్తుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్లకు పైగా నకిలీ విత్తన వ్యాపారం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ వ్యవసాయ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఎమ్మిగనూరు, ఆస్పరి, దేవనకొండ, కర్నూలు, సి.బెళగల్, కోసిగి, మంత్రాలయం, హొళగుంద, హాలహర్వి, పెద్దకడబూరు, గోనెగండ్ల, మద్దికెర, తుగ్గలి, ఓర్వకల్ తదితర మండలాల్లో నకిలీ బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. గద్వాల నుంచి.. బీటీలో నకిలీ విత్తనాలకు కర్నూలు జిల్లా పెట్టింది పేరు. చాలా ఏళ్లుగా ఈ పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సరఫరా అవుతున్నాయి. ఇక ఆశ్చర్యం కల్గించే అంశం ఏమిటంటే.. తెలంగాణలోని గద్వాల జిల్లా నుంచి ఇక్కడికి నకిలీ విత్తనాలు వస్తుండడం. కర్నూలు సబ్ డివిజన్లోని వివిధ మండలాల రైతులు గద్వాల విత్తనాలను కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారు. బీటీ నకిలీ పత్తి విత్తనాలను ఏప్రిల్, మే నెలల్లోనే గ్రామాలకు చేర్చినట్లు సమాచారం. గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పరచుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. ప్యాకెట్ రూ.500 నుంచి రూ.600 ప్రకారం విక్రయిస్తుండడంతో ఎక్కువ శాతం మంది రైతులు వాటినే కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు గ్రామాల్లో లూజు విత్తనాల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కంపెనీ విత్తనమైతే ఇలా ఉండాలి... కంపెనీ బీటీ విత్తన ప్యాకెట్లను సులభంగా గుర్తించవచ్చు. ప్యాకెట్‌పై కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే రింగ్ వస్తుంది. ఒకవేళ రింగ్ కాకపోతే నకిలీ విత్తనంగా అనుమానం పడొచ్చు. అలాగే కంపెనీ పేరు, అడ్రెస్, వెరైటీ తదితర వివరాలన్నీ ఉండాలి. ఇటీవల పట్టుబడిన నకిలీ విత్తనాల ప్యాకెట్లను పరిశీలిస్తే కస్టమర్ కేర్ నెంబర్లు లేవు. బ్రాండెడ్ కంపెనీల పేరుతోనే నకిలీ విత్తనాల ప్యాకెట్లు లభిస్తుండటం గమనార్హం. వీటి విక్రయిస్తున్న వారిని అక్కడక్కడ అరెస్టు చేస్తున్నా.. సూత్రధారులెవరనే విషయాన్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ జేడీ ఠాగూర్ నాయక్‌ను వివరణ కోరగా..నకిలీ విత్తనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందాల ద్వారా ట్రాన్స్‌పోర్టు కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లను తనిఖీ చేయించామన్నారు. రైతులు సహకరిస్తేనే నకిలీ విత్తనాల నియంత్రణ సాధ్యమని స్పష్టం చేశారు. -
పత్తి.. పండలే..
ఖమ్మం వ్యవసాయం: పత్తి దిగుబడి జిల్లాలో గణనీయంగా తగ్గిపోయింది. సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉన్నా.. పంట ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పంట భూమిలో దాదాపు 40 శాతం పత్తి పంట సాగు చేశారు. వర్షాధారంగా, నీటిపారుదల కింద పండే పంట కావడంతో ఇక్కడి రైతులు పత్తి పంటకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 2017–18లో 5,81,767.5 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం కాగా.. 5,31,822.5 ఎకరాల్లో వివిధ రకాల పంటలను ఖరీఫ్‌లో సాగు చేశారు. మొత్తం విస్తీర్ణంలో అధికంగా 2,41,752.5 ఎకరాల్లో రైతులు పత్తి పంట వేశారు. ప్రతి ఏటా దాదాపు ఇంతే విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. సాగు ఆరంభంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. పూత, కాత దశలో వాతావరణ ప్రభావంతో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. జూన్‌లో కురిసిన వర్షాలకు పంట విస్తారంగా సాగు చేశారు. జూలైలో వర్షం అనుకూలించలేదు. దీంతో పైరు ఆశాజనకంగా లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పైరుకు గులాబీ రంగు పురుగు ఆశించింది. ఇక ఆగస్టులో సాధారణానికి మించి కురిసిన వర్షాలు పంటను బాగా దెబ్బతీశాయి. వర్షాలకు పూత రాలిపోగా.. కాయ విచ్చుకునే దశలో నీరు లోనకు చేరి పనికి రాకుండా పోయింది. అరకొరగా చేతికొచ్చిన పంట కూడా నాణ్యతగా లేని పరిస్థితి. సెప్టెంబర్ చివరి నుంచి పంట తొలితీతను రైతులు ప్రారంభించారు. అక్టోబర్‌లో తొలితీత తీసిన తర్వాత రైతుల్లో పంటపై ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. సహజంగా పైరు నుంచి రెండు, మూడో తీతలు ఆశాజనకంగా ఉంటాయి. కానీ.. ఆగస్టు వర్షాలతో అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. దిగుబడులు లేకపోవడంతో విక్రయాలు లేక జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో గల యార్డులు వెలవెలబోతున్నాయి. పత్తి పంటకు ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకోవడంతో రైతులు ఆ పంటను తొలగించి.. దాని స్థానంలో మొక్కజొన్న వేశారు. జిల్లాలో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. సాగు విస్తీర్ణం గణం.. దిగుబడి దారుణం జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా ఉన్నా.. పంట దిగుబడి మాత్రం దారుణంగా పడిపోయింది. దాదాపు 2.41 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. నీటిపారుదల కింద ఎకరాకు 15 క్వింటాళ్లు, వర్షాధారంగా 10 క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తాయి. ఈ లెక్కన జిల్లాలో సుమారు 25 లక్షల క్వింటాళ్ల మేర ఉత్పత్తి రావాల్సి ఉండగా.. కేవలం 5.5 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి మాత్రమే వచ్చింది. అంటే దాదాపు ఐదోవంతు పంట మాత్రమే పండింది. ఇంత దారుణమైన దిగుబడి ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు 2.50 క్వింటాళ్లకు మించలే.. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల కారణంగా పత్తి ఎకరాకు సగటున 2.50 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. తొలితీత ఎకరాకు క్వింటా, రెండో తీతలో క్వింటాన్నరకు మించి దిగుబడి రాలేదు. నీటిపారుదల, వర్షాధారంగా కూడా ఇవే రకమైన దిగుబడులు వచ్చాయి. ముంచిన తెగుళ్లు, వర్షాలు ఈ ఏడాది పంట దిగుబడులు తగ్గేందుకు ప్రధాన కారణం వర్షాలు. దీనికి తోడు తెగుళ్లు. ఆగస్టులో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంట దిగుబడులపై తీవ్రంగా ఉంది. ఆగస్టు రెండు, మూడు వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో గాలి, నేలలో తేమశాతం విపరీతంగా పెరిగి పైరుకు ప్రతికూలంగా మారి.. పైరు పండుబారిపోయింది. తెగుళ్లు కూడా ఆశించాయి. ప్రధానంగా గులాబీ రంగు పురుగు ఆశించి నష్టం కలిగించింది. పల్లపు ప్రాంతంలో వేసిన పంట కనీసం పనికి రాలేదు. ఆ తర్వాత అరకొరగా ఉన్న పంటపై డిసెంబర్లో ‘పెథాయ్’ తుపాను మరోసారి నష్టం కలిగించింది. ఇక అరకొరగా పండిన పంట కూడా వర్షాల వల్ల రంగుమారి నాణ్యత లేకుండా పోయింది. వెలవెలబోయిన మార్కెట్లు జిల్లాలో వ్యవసాయ మార్కెట్లకు విక్రయానికి వచ్చే పత్తి పంట దిగుబడులు లేకపోవడంతో ఆయా మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఖమ్మం, ఏన్కూరు, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు జరుగుతుంటాయి. సీజన్లో ఖమ్మం మార్కెట్లో నిత్యం సగటున 25వేల బస్తాలు విక్రయానికి వస్తుంటాయి. ఈ ఏడాది 5వేల నుంచి 6వేలకు మించి పత్తి బస్తాలు విక్రయానికి రాలేదు. దీంతో వ్యవసాయ మార్కెట్లు కళ తప్పాయి. అంతేకాక మార్కెట్లకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతోంది. వ్యాపారులు కూడా పంట విక్రయాలకు రాకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు. పత్తి స్థానంలో మొక్కజొన్న ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తిని రైతులు తొలగించి.. నీటి వనరులున్న ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేశారు. కొందరు రైతులు పత్తి పంటను వదిలేశారు. పత్తి స్థానంలో వేసిన మొక్కజొన్న పంట కూడా ఆశాజనకంగా లేదు. ఈ పంటకు కత్తెర పురుగు ఆశించింది. దీంతో ఈ పంట కూడా రైతులకు నిరాశ కలిగిస్తోంది. నాలుగెకరాల్లో 8 క్వింటాళ్లు.. నాలుగెకరాల్లో పత్తి పంట సాగు చేశా. తొలితీతలో ఎకరానికి క్వింటా చొప్పున 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రెండో తీతలో 4 క్వింటాళ్లు వచ్చింది. మొత్తం 8 క్వింటాళ్లు వచ్చింది. గత ఏడాది ఎకరాకు 7 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. – బొల్లి కృష్ణయ్య, రైతు, విశ్వనాథపల్లి, సింగరేణి మండలం ఆశించిన దిగుబడి రాలేదు.. ఈ ఏడాది పత్తి కనీస ఉత్పత్తి లేదు. వ్యవసాయ మార్కెట్లకు కనీసంగా కూడా పంట విక్రయానికి రావడం లేదు. నిత్యం సీజన్లో 30వేల నుంచి 40వేల బస్తాల పత్తి విక్రయానికి వచ్చేది. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కేవలం 10వేల నుంచి 15వేల బస్తాల పత్తి కూడా విక్రయానికి రావడం లేదు. మార్కెటింగ్ శాఖ ఆదాయంపై కూడా ప్రభావం పడింది. – రత్నం సంతోష్‌కుమార్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి -
వైద్యం కోసం ఎన్ని పాట్లో..!
నార్నూర్: ఆత్మహత్యకు యత్నించిన భార్యను కాపాడుకునేందుకు ఆమె భర్త చేసిన ప్రయత్నం విఫలమైంది. భుజంపై ఎత్తుకుని వాగు దాటి ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రీలో సోమవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రాథోడ్ రాము, పుష్ప దంపతులు ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశారు. ఇటీవల వర్షానికి పత్తి పంట దెబ్బ తినడంతో ఆందోళనకు గురైంది. పంట అంతంత మాత్రంగానే ఉండటంతో చేసిన అప్పులు ఎలా తీర్చా లో తెలియక మనస్తాపం చెందింది. సోమవారం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. పుష్పను ఆమె భర్త గ్రామంలోని ఓ వ్యక్తి సహాయంతో వాగు వరకు 2 కిలోమీటర్ల దూరం బైక్‌పై తీసుకొచ్చాడు. మండల కేంద్రం నార్నూర్‌లోని ఆస్పత్రికి తరలించాలంటే గ్రామ సమీపంలోని వాగు దాటాల్సిందే. మోకాళ్లలోతు నీళ్లు ఉండటంతో గత్యంతరం లేక తన భుజంపై ఎత్తుకుని వాగు దాటించాడు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని నార్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. వైద్యం అందకుండానే మార్గమధ్యంలోనే పుష్ప మృతిచెందింది. -
గులాబీ పురుగును బుట్టలో వేయరా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పత్తి పంటను గులాబీ రంగు పురుగు పట్టి పీడిస్తున్నా వ్యవసాయశాఖ పట్టించుకోవడం లేదు. నియంత్రణ చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గులాబీ పురుగును గుర్తించి నియంత్రించడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు లింగాకర్షక బుట్టలను రైతులకు సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో గులాబీ రంగు పురుగు పత్తి చేలలో విజృంభిస్తోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఈసారి అంచనాలకు మించి 44.30 లక్షల (105%) ఎకరాల్లో సాగైంది. గత నెలలోనే దాడి ప్రారంభం.. గత నెల్లోనే పత్తిపై గులాబీ పురుగు దాడి ప్రారంభమైందని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నల్లగొండ, నిర్మల్, ఆసిఫాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పెద్ద ఎత్తున పత్తిని పీడిస్తున్నట్లు అంచనా వేశాయి. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ దీని జాడలున్నట్లు గుర్తిం చాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఏడెనిమిది లక్షల ఎకరాల్లో గులాబీ రంగు పురుగు విస్తరించి ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. అయితే దాన్ని నియంత్రించడంలో మాత్రం నామ మాత్రపు చర్యలకే పరిమితమయ్యాయి. 25 వేల ఎకరాలకే బుట్టలు.. గులాబీ రంగు పురుగును గుర్తించడానికి లింగాకర్షక బుట్టలను వాడాల్సి ఉంటుంది. అయితే వీటిని కేవలం తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఎకరాలకే సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అందుకు ప్రతిపాదనలు సైతం తయారుచేసింది. దాదాపు ఏడెనిమిది లక్షల ఎకరాల వరకు పురుగు సోకిందని అంచనా వేసినా అధికారులు కేవలం 25 వేల ఎకరాలకే లింగాకర్షక బుట్టలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా ఒక్కో ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను వాడాలి. ఆ ప్రకారం 25 వేల ఎకరాలకు 2 లక్షల లింగాకర్షక బుట్టలను మాత్రమే వ్యవసాయశాఖ ఆర్డర్ చేసింది. ఇదిలాఉంటే మరో వైపు గులాబీ పురుగు ఇంతింతై విస్తరిస్తోంది. ఇప్పటికే బుట్టలు అమర్చాల్సి ఉన్నా వ్యవసాయశాఖ ఆర్డర్లకే పరిమితమైంది. అవెప్పుడు అందుబాటులోకి వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. రైతుల్లో ఆందోళన.. కొన్ని చోట్ల గులాబీ పురుగు కారణంగా రైతులు పత్తి మొక్కలను పీకేస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదికేడాదికి గులాబీ పురుగు ఉధృతి పెరుగుతోంది. వ్యవసాయశాఖ దీన్ని ప్రాధాన్య అంశంగా గుర్తించి గులాబీ పురుగుపై యుద్ధం చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ వ్యవసాయశాఖ ఆ మేరకు ఏర్పాట్లు చేయడం లేదు. గతేడాది గులాబీ పురుగు కారణంగా పెద్ద ఎత్తున దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 5–6 క్వింటాళ్ల మేర తగ్గింది. గతేడాది 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా, 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. సాగు ఎంత పెరిగినా గులాబీ పురుగు నుంచి రక్షణ కల్పించకుంటే తమ శ్రమంతా వృథాయేనని రైతులు వాపోతున్నారు. లాభాలు దేవుడెరుగు నష్టాలతో అప్పులే మిగులుతాయని ఆందోళన చెందుతున్నారు. -
‘కత్తెర’ కాటు
సాక్షి, హైదరాబాద్:‘గులాబీ’గుబులు రేపుతోంది. ‘కత్తెర’కాటు వేస్తోంది. పురుగులు చేల వైపు పరుగులు తీస్తున్నాయి. పంటలపై దాడి చేస్తున్నాయి. పత్తిని గులాబీరంగు పురుగు, మొక్కజొన్నను కత్తెర పురుగు పీల్చి పిప్పి చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆ రెండు పంటల పరిస్థితి దయనీయంగా మారింది. మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పూత దశలో ఉన్న పత్తి పంటకు గులాబీ పురుగు సోకినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లోనూ దాని ఛాయలు కనిపిస్తున్నాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 42.99 లక్షల(102%) ఎకరాల్లో సాగైంది. అందులో దాదాపు 15 శాతం వరకు గులాబీ రంగు పురుగు సోకినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాల్లో మొక్కజొన్న పంటను తీవ్రంగా నష్టపరుస్తున్న కత్తెర పురుగు ఉధృతిని కేంద్రం అత్యవసర పరిస్థితిగా గుర్తించిందని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రానికి చెందిన మొక్కల సంరక్షణ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్, వర్గల్ మండలాల్లో మొక్కజొన్న చేలను పరిశీలించారు. ఎక్కడ చూసినా కత్తెర పురుగు ధాటికి తీవ్రంగా ధ్వంసమైన పంటలే కనిపించాయి. వాటిలో మొక్కలకు ఆశించిన పురుగులను, వాటి గుడ్లను, లార్వాను పరిశీలించారు. విదేశాల నుంచి వచ్చిన ఈ కత్తెర పురుగు(ఫాల్ ఆర్మీ వామ్)పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాల్లో 50 శాతం మేర మొక్కజొన్నకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. దీనిపై కేంద్రానికి ఆ బృందం నివేదిక సమర్పించనుంది. తెలంగాణ మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.88 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో ఏ స్థాయిలో కత్తెర పురుగు సోకిందోనన్న ఆందోళన రైతులను పట్టి పీడిస్తోంది. ఆసియాలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే ఈ పురుగు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వరినాట్లు పుంజుకున్నాయి. 17.52 లక్షల (74%) నాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే... రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా ఇప్పటికీ 13 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయింది. విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి శుక్రవారం ఉదయానికి నైరుతి మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. అనేకచోట్ల భారీవర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంటలు మునిగిపోయాయి. దాదాపు 50 వేల ఎకరాల్లో పంటలు మునిగినట్లు అంచనా వేస్తున్నారు. పంటలు మునుగుతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్న విమర్శలున్నాయి. -
పత్తి పైనే ఆసక్తి
జిల్లాలో రైతులు ఈసారి కూడా పత్తిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయశాఖ అంచనా మేరకు ఈ ఖరీఫ్‌లో 1,13,839 హెక్టార్ల సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 72,123 హెక్టార్ల (63 శాతం)లో వివిధ పంటలు వేశారు. అయితే.. కేవలం 13,005 హెక్టార్లలో వరి సాగు కాగా, 50,499 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. మిగిలిన 8,619 హెక్టార్లలో 7,415లలో మొక్కజొన్న, మిగతా ముతకధాన్యాలు తదితర పంటలు వేశారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: రైతులు ఈ ఖరీఫ్‌లోనూ పత్తిసాగుపైనే మొగ్గు చూపుతున్నారు. రెండేళ్ల క్రితం వరకు తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడగా.. అత్యధికంగా పత్తి సాగైంది. గతేడాది, ఈసారి అనుకూలంగా వర్షాలు పడుతున్నా.. రైతులు పత్తిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాగైన పంటల వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా పత్తిసాగే కనిపిస్తోంది. వర్షాకాలం ఆరంభమై రెండు నెలలు కావస్తున్నా ప్రాజెక్టులు, చెరువులకు నీరు రాకపోవడం కూడా వరిసాగుకు ప్రతికూలంగా మారిందని, అందుకే ఆరుతడి పంటలవైపు మొగ్గు చూపుతున్నారని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో మొత్తం 16 మండలాలకు గాను ఇంకా 5 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పత్తి, ఆ తర్వాత మొక్కజొన్న, ఆరుతడి పంటలు వేశారని అంటున్నారు. వ్యవసాయశాఖ అంచనా ఇదీ.. ఇప్పటికి సాగు 63 శాతమే.. గత ఖరీఫ్ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు 2017 ఖరీఫ్ యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. ఈ మేరకు జిల్లాలో 1,13,839 హెక్టార్ల సాగు లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 72,123 హెక్టార్లలో వివిధ పంటలు వేశారు. అయితే.. 36,347 హెక్టార్లకు కేవలం 13,005 హెక్టార్లలో వరి సాగు కాగా, 47,523 హెక్టార్లలో పత్తి సాగు లక్ష్యానికి ఇప్పటికే 50,499 హెక్టార్ల (106 శాతం)లో పత్తి పంట వేశారు. మిగిలిన 8,619 హెక్టార్లలో 7,415లలో మొక్కజొన్న వేయగా, మిగతా 1,204 హెక్టార్లలో ముతకధాన్యాలు తదితర పంటలు వేశారు. జిల్లాలో ఏడాది సగటు వర్షపాతం 898.3 మిల్లీమీటర్లు కాగా, గతేడాది జూలై 31 వరకు 347.90 మిల్లీమీటర్లు నమోదైతే, ఈసారి 252 మి.మీటర్లుగా ఉంది. ఫలితంగా ఖరీఫ్ ఆరంభమై రెండు నెలలు కావస్తుండగా ఇప్పటికీ జిల్లాల్లో సగటు సాగు 63 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే జిల్లా ఆయకట్టుకు జీవనాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ఎల్ఎండీలకు గతేడాదితో పోలిస్తే ఈసారి ఆశించిన నీరు చేరలేదు. దీంతో వరి రైతులు పొలాలు, నారుమళ్లు, వరినారు సిద్ధం చేసుకున్నా.. వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. రబీలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఆచీతూచీ సేద్యం వైపు కదులుతున్నారు. ఈ ఖరీఫ్‌లో తొలకరి జల్లులు కొన్ని మండలాల్లో ఆశాజనకంగానే ఉన్నా.. ఇప్పటికీ ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరలేదు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో వర్షపాతం పూర్తిగా తగ్గిపోయింది. సాధారణ వర్షపాతం, గత రెండేళ్లలో నమోదైన వర్షపాతంతో పోల్చిచూస్తే వర్షాలు పడుతున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో వరి తదితర పంటలకు స్వస్థి చెప్పి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారని, వరిసాగుపై వేచిచూసే ధోరణితో ఉన్నారని అధికారులు చెప్తున్నారు. -
‘గులాబీ’ విలయం
సాక్షి, హైదరాబాద్: ‘గులాబీ రంగు పురుగు ప్రళయం ముంచుకొస్తోంది’.. ఈ మాటలన్నది స్వయానా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త. గులాబీ పురుగు వల్ల పత్తి పంటకు ఈసారి భారీ నష్టం జరగనుందని ఆయన ఆవేదన. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో గులాబీ రంగు పురుగు కనిపిస్తోందని, వర్షాలతో మున్ముందు దాని విస్తరణ మరింత వేగం కానుందని ఆ శాస్త్రవేత్త హెచ్చరించారు. సాధారణంగా కాయ దశలో కనిపించాల్సిన ఆ పురుగు.. మొక్క దశలోనే దాడి చేయడంపై అన్నదాతల ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. దీన్ని నియంత్రించేందుకు పరిశోధనలు విస్తృతం చేయాలని, పురుగుపై యుద్ధం చేయాలని సూచిస్తున్నారు. ఒకచోట గులాబీరంగు పురుగుంటే ఆ చుట్టుపక్కల 30–40 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఆదిలాబాద్‌లో అనేకచోట్ల గులాబీ పురుగును గుర్తించినట్లు వ్యవసాయాధికారుల నుంచి వర్సిటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు గులాబీ పురుగు సోకిందని.. ఈసారి రెండు వారాల్లోనే దాని ఉధృతి కనిపించిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది గుజరాత్ రైతులను అతలాకుతలం చేసిన ఆ పురుగు.. జాగ్రత్తలు తీసుకోకుంటే ఈసారి తెలంగాణ రైతులను తీవ్రంగా నష్టపరిచే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఐదు లక్షల ఎకరాల్లో? రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. ఇప్పటివరకు 52.72 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వాటిలో అధిక భాగం పత్తి పంటదే. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 30.30 లక్షల ఎకరాల్లో సాగైంది. విస్తీర్ణం ఇంకా పెరగనుంది. ఇప్పుడు సాగైన 30 లక్షల ఎకరాల్లో దాదాపు 5 లక్షల ఎకరాల పత్తిలో గులాబీ పురుగు ఉండే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వారం రెండు వారాల్లో ఉధృతి పెరిగితే అడ్డుకోవడం కష్టమైన వ్యవహారమంటున్నారు. గులాబీ పురుగు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య పత్తి మొక్కపైకి వస్తుంది. ఆ సమయంలో చూడలేం. కాబట్టి లింగాకర్షక బుట్టలు వీలైనన్ని వేస్తే అందులో వచ్చి పడతాయి. అలా పురుగును గుర్తించవచ్చు. ఒక బుట్టలో 4 పురుగులు పడితే తీవ్రత ఎక్కువగా ఉందని అంచనా వేస్తారు. పురుగును గుర్తించాక క్రిమిసంహారక మందులతో అరికట్టవచ్చు. లింగాకర్షక బుట్టలను ఇప్పటికే రైతులకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం అందించలేదు సరికదా వాటిని తెప్పించడంలోనూ విఫలమైందని వ్యవసాయ శాస్త్రవేత్తలే విమర్శిస్తున్నారు. 10 రోజుల క్రితమే జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) కింద నిధులు కేటాయించి బుట్టలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని,ఇంకా కొనలేదని విమర్శలున్నాయి. మరోవైపు పత్తి సరఫరా చేసే జిన్నింగ్ మిల్లుల నుంచి కూడా పంట వైపునకు పురుగు వ్యాపిస్తుందని చెబుతున్నారు. బీటీ–2 వైఫల్యమే బీటీ–2 టెక్నాలజీ వైఫల్యం వల్లే పత్తి పంటను గులాబీ రంగు కాయతొలుచు పురుగు పీడిస్తోంది. దాన్ని నివారించేందుకు బీటీ టెక్నాలజీలో ఓ కణాన్ని జొప్పించి 2002లో బీటీ–1 పత్తి విత్తనాన్ని మోన్శాంటో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే 2006 నాటికి బీటీ–1 గులాబీ పురుగును నాశనం చేసే శక్తి కోల్పోయింది. దీంతో రెండు కణాలు జొప్పించి బీటీ–2ను తీసుకొచ్చారు. 2012 నాటికి దీనిలోనూ గులాబీ పురుగును తట్టుకునే శక్తి నశించింది. కానీ దాన్ని రద్దు చేయకుండా 3 కణాలు జొప్పించి బీటీ–3 తీసుకొచ్చారు. దానికితోడు పత్తి కలుపును నాశనం చేసేందుకు గ్లైఫోసెట్ పురుగుమందును తీసుకొచ్చారు. దీని వల్ల జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుందని తెలియడంతో కేంద్రం అనుమతివ్వలేదు. అయినా రహస్యంగా రైతులకు అంటగడుతూనే ఉన్నారు. బీటీ టెక్నాలజీ విఫలమైనా గులాబీ పురుగు పీడిస్తున్నా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలున్నాయి. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉండగా గులాబీ పురుగు కారణంగా గతేడాది రాష్ట్రంలో అనేకచోట్ల 6–7 క్వింటాళ్లకు మించి రాలేదు. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న వాదనలున్నాయి. మరోవైపు గులాబీ పురుగుతో పత్తి పంట పోతే రైతుకు బీమా పరిహారం రాదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం గతేడాది గులాబీ పురుగుతో నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించింది. పత్తి విత్తన కంపెనీల నుంచీ పరిహారం ఇప్పించింది. రాష్ట్రంలో అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. -
వచ్చే ఎన్నికల్లో గులాబీ పీడ విరగడవుతుంది
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు పరంపరగా కొనసాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. రాష్ట్రానికి పట్టిన ‘గులాబీ’ పీడ వచ్చే ఎన్నికల్లో విరగడవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పంట చేతికొచ్చే సమయంలో వరి, పత్తి దిగుబడి తగ్గిపోయిందని, వర్షానికి తడిసి పత్తి రంగు మారిందని, వరికి దోమపోటు, పత్తి పంటకు గులాబీ చీడ పట్టిందన్నారు. ఆయా పంటల వివరాలు తెప్పించుకుని కేంద్రానికి పంపించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవడాన్ని సర్కార్ నామోషీగా భావిస్తున్నదని అన్నారు. అకాలవర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో పంటనష్టం వివరాల నివేదిక కేంద్రానికి పంపకపోవడంతో ఇన్పుట్ సబ్సిడీ పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. -
గడపదాటని తెల్ల బంగారం
యర్రగొండపాలెం: ప్రారంభంలోనే పత్తి ధరలు పతనమయ్యాయి. ఖరీఫ్‌లో వేసిన పత్తి పంట ఆశాజనకంగా ఉన్నప్పటికీ వరుసగా వర్షాలు కురవడంతో పూత, కాయపగిలిన దశలో ఉన్న పత్తి పంట నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువగా పురుగు సోకడంతో పలు పర్యాయాలు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. ఎరువులు పురుగు మందులకే రైతులు పెట్టుబడులు పెట్టలేక అల్లాడిపోయారు. ఎకరా పత్తి పంటకు రైతు స్థోమతను బట్టి రూ.60 వేలు నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. దిగుబడులు కూడా ఎకరాకు 15 క్వింటాళ్లు దాటవచ్చని రైతులు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుత ధరలను బట్టిచూస్తే పంటపై పెట్టిన పెట్టుబడులు చేతికందే పరిస్థితి కనిపించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో దాదాపు 1,44,938 ఎకరాల్లో ఈ ఏడాది రైతులు పత్తి సాగు చేశారు. వీటి నుంచి దాదాపు ఏడు లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. గత సంవత్సరం ప్రారంభంలోనే క్వింటా పత్తి రూ.4వేలకు పైబడి ధర పలికింది. ఆ తరువాత క్వింటా రూ.5,650 వరకు రైతులు అమ్ముకోగలిగారు. ఈ ఏడాది కూడా మంచి ధర లభిస్తుందని రైతులు భావించారు. దీనికితోడుగా ఖరీఫ్ ప్రారంభలోనే వర్షాలు కురిశాయి. భూములను దుక్కులు దున్నుకొని పత్తి పంటను సాగుచేశారు. మొదట్లో వేసిన పంట రైతుల ఇళ్లకు చేరుతోంది. వెంటనే దళారులు కూడా గ్రామాల్లో పంటను కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు కురవడంతో పత్తి తడిచి ముద్దయిందని క్వింటా రూ.1500కు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత రూ.300 పెంచి రూ.1800కు కొనుగోలు చేస్తున్నారని ఆయా ప్రాంతాల రైతులు తెలిపారు. పత్తి తీయటానికి ఒక్కో కూలీకి రూ.200 చెల్లించాల్సి వస్తోందని, ఆ లెక్కన పది మందికి రెండు వేలు ఇవ్వాల్సి వస్తోందని వారు తెలిపారు. మొదటి కోతకు రెండు నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. ధరలేక పోవడంతోనే ఎక్కువ మంది కోసిన పత్తిని ఇళ్లలో నిలువ ఉంచుకుంటున్నారు. ప్రత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి వెంటనే ప్రత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రత్తి రైతులకు రవాణా ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలి. గిట్టుబాటు ధర లభించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకుంటే రైతులు నష్టాలపాలవుతారు. – పుచ్చకాయల సుబ్బారావు, రాష్ట్ర అధ్యక్షుడు, రైతు సంక్షేమ సేవా సంఘం రైతులు అప్పులపాలే.. పత్తి ధరలు ఇదేవిధంగా కొనసాగితే రైతులు అప్పులపాలు అవుతారు. గత నాలుగేళ్లుగా ఇప్పుడిప్పుడే పంట దిగుబడులు చూస్తున్నాం. ధరలు కూడా అదేస్థాయిలో ఉంటే బాగుంటుంది. – గోళ్ల వీరయ్య, పత్తి రైతు, కొలుకుల -
‘పత్తి’ రైతు ఆత్మహత్య
పురుగుల మందు తాగి బలవన్మరణం అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులే కారణం ఐనవోలు(వర్ధన్నపేట) : పత్తి పంట కాటుకు ఓ యువ రైతు బలయ్యాడు. పెట్టుబడికి చేసిన అప్పులు తేర్చే మార్గం కనిపించక తనవాళ్లనొదిలి తనదారిన తాను వెళ్లిపోయాడు. భార్యాపిల్లల్ని కన్నీళ్లసంద్రంలోకి నెట్టివేశాడు. ఈ హృదయ విదారక ఘటన ముల్కలగూడెం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఐనవోలు ఎస్సై కె.అశోక్‌కుమార్ కథనం ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని ముల్కలగూడెం గ్రామానికి చెందిన యువ రైతు గుండెకారి మల్లాజి(33) ఆదివారం సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు మల్లాజి భార్య పద్మకు సమాచారం అందించారు. ఆమె బంధువులు, గ్రామస్తుల సాయంతో వరంగల్ ఎంజీఎంకు తరలించే ప్రయత్నం చేస్తుండగానే అతడు మరణించాడు. పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌కుమార్ తెలి పారు. ఆర్థిక ఇబ్బందులే.. మల్లాజికి మూడెకరాల భూమి ఉంది. అందులో పత్తి పంటను మూడేళ్లుగా సాగు చేస్తున్నాడు. కాలం కలిసి రాక, పంట సరిగా చేతికి రాక మూడేళ్లుగా వ్యవసాయంలో నష్టాలను చవిచూశాడు. తెలిసిన వాళ్ల దగ్గర ఐదు లక్షల రూపాయాలను అప్పుగా తీసుకున్నాడు. అప్పులు తేర్చేందుకు గత సంవత్సరం గ్రామంలో ఓ రైతు వద్ద పాలేరుగా పనికి చేశాడు. మళ్లీ ఈ ఏడాది వ్యవసాయంపై నమ్మకం ఉంచి ఎలాగైనా అప్పులు తీర్చాలన్న పట్టుదలతో తనకున్న మూడెకరాలతో పాటు పక్కనే ఉన్న మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. కానీ అధిక వర్షంతో పత్తి కాతా,పూత లేకుండా పోయింది. దాంతో పాటు తెగుళ్లు సోకాయి. తీవ్ర ఆందోళనకు గురైన మల్లాజి అప్పులు తీర్చాలో తెలియక ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. మల్లాజి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
95.50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు
వరి నాట్లు 78 శాతానికే పరిమితం సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ పంటలు 95.50 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 88.34 శాతం విస్తీర్ణంలో సాగైనట్లు వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అత్యధికంగా పత్తి పంట సాగుకావడం గమనార్హం. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.9 లక్షల ఎకరాలు కాగా, అంచనాలకు మించి ఏకంగా 46.85 లక్షల (111%) ఎకరాల్లో సాగైంది. పంటల్లో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 39.97 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అందులో వరి విస్తీర్ణం మాత్రం గణనీయంగా పడిపోయింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 18.32 లక్షల (78%) ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.22 లక్షల (88%) ఎకరాలకే పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 6.95 లక్షల ఎకరాలకు గాను 6.25 లక్షల ఎకరాలు సాగైంది.