
నార్నూర్: ఆత్మహత్యకు యత్నించిన భార్యను కాపాడుకునేందుకు ఆమె భర్త చేసిన ప్రయత్నం విఫలమైంది. భుజంపై ఎత్తుకుని వాగు దాటి ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రీలో సోమవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రాథోడ్ రాము, పుష్ప దంపతులు ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశారు. ఇటీవల వర్షానికి పత్తి పంట దెబ్బ తినడంతో ఆందోళనకు గురైంది. పంట అంతంత మాత్రంగానే ఉండటంతో చేసిన అప్పులు ఎలా తీర్చా లో తెలియక మనస్తాపం చెందింది.
సోమవారం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. పుష్పను ఆమె భర్త గ్రామంలోని ఓ వ్యక్తి సహాయంతో వాగు వరకు 2 కిలోమీటర్ల దూరం బైక్‌పై తీసుకొచ్చాడు. మండల కేంద్రం నార్నూర్‌లోని ఆస్పత్రికి తరలించాలంటే గ్రామ సమీపంలోని వాగు దాటాల్సిందే. మోకాళ్లలోతు నీళ్లు ఉండటంతో గత్యంతరం లేక తన భుజంపై ఎత్తుకుని వాగు దాటించాడు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని నార్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. వైద్యం అందకుండానే మార్గమధ్యంలోనే పుష్ప మృతిచెందింది.
Comments
Please login to add a commentAdd a comment