సర్కారు దెబ్బకు పత్తి రైతూ చిత్తు
ఈ ఏడాది కనీస మద్దతు ధర రూ.7,521
కానీ, ఏ ఒక్క రైతుకూ దక్కని పరిస్థితి ∙ ఇక్కడా తేమ శాతం సాకుతో కొర్రీలు
సీసీఐ కేంద్రాల్లో అమ్ముకునేందుకూ నానాపాట్లు
పెట్టుబడి కూడా దక్కక గగ్గోలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం రైతు దగా పడుతున్నట్లుగానే పత్తి రైతు కూడా చిత్తవుతున్నాడు. మద్దతు ధర కల్పనకు తేమ శాతం సాకుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మోకాలడ్డుతుంటే అంతర్జాతీయ మార్కెట్‌ను సాకుగా చూపి వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయారు. ఫలితంగా గతంలో ఎన్నడూలేని విధంగా పత్తి ధర పతనమైందని.. సర్కారు తీరువల్ల పెట్టుబడి కూడా దక్కడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు. గతేడాది 15 లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది 9.82 లక్షల ఎకరాల్లో సాగైంది.
వరదలు, వర్షాలకు తోడు గులాబీ తెగులు ప్రభావంతో ఎకరాకు 4–6 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడంలేదంటున్నారు. ఈ ఏడాది కనీస మద్దతు ధరగా మధ్యస్థ రకానికి క్వింటా రూ.7,121, పొడవు రకానికి రూ.7,521గా కేంద్రం నిర్ణయించింది. కానీ, ఈ ఏడాది తొలితీత ప్రారంభానికి ముందే మార్కెట్‌లో ధరల పతనం మొదలైంది. గతేడాది క్వింటా రూ.10వేలకు పైగా పలికిన పత్తి ప్రస్తుతం మార్కెట్‌లో గ్రేడ్‌ను బట్టి క్వింటా రూ.4వేల నుంచి రూ.5,800 మించి పలకడంలేదు. మరోవైపు.. ఏటా అక్టోబరు మూడోవారంలో ప్రారంభం కావాల్సిన సీసీఐ కేంద్రాలు ఈ ఏడాది నవంబరు 11నాటికి కానీ ప్రారంభం కాలేదు. పైగా.. 33 ఏఎంసీల పరిధిలో 61 జిన్నింగ్ మిల్లులు ఏర్పాటుచేయాలని సంకలి్పంచగా, 45 జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే కొనుగోళ్లు మొదలయ్యాయి.
సుదూర ప్రాంతాల్లో కేంద్రాలు..
ఇక కొనుగోలు కేంద్రాలను మారుమూలనున్న మిల్లుల వద్ద ఏర్పాటుచేయడంతో రవాణా, లోడింగ్ చార్జీలు రైతులకు తడిసిమోపెడవుతున్నాయి. ఉదా.. వైఎస్సార్ జిల్లాలో ఒక్క కేంద్రం ఏర్పాటుచేయలేదు. ఈ జిల్లాకు చెందిన రైతులు నంద్యాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే, గుంటూరు జిల్లా తాడికొండ రైతులు కూడా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్తిపాడు మండలంలోని కోయపాలెం మిల్లుకు వెళ్లాల్సి వస్తోంది. పోనీ ధర పెరిగే వరకు నిల్వచేసుకుందామనుకుంటే క్వింటాకు రూ.400–500 వరకు అద్దెలు చెల్లించాల్సి రావడంతో చేసేదిలేక అయినకాడకి అమ్ముకుంటున్నారు.
తేమ శాతం పేరిట కొర్రీలు..
కేంద్ర నిబంధనల మేరకు 8 శాతం తేమతోనే పత్తిని కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత 12 శాతం వరకు ఒక్కో శాతం చొప్పున ఎమ్మెస్పీ ధరలో కోత విధిస్తారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో పత్తి పిందె, పూతకొచ్చే దశలో కురిసిన అధిక వర్షాల కారణంగా తేమ శాతం 15–30 శాతం చొప్పున నమోదవుతుండగా, ప్రస్తుతం కురుస్తున్న మంచు ప్రభావంతో పెరుగుతున్న తేమశాతం రైతులకు ఇబ్బందికరంగా మారింది. కేంద్రాల్లో ఏర్పాటుచేసిన రెండు రకాల యంత్రాల్లో ఒక్కోదాంట్లో ఒక్కో రీతిలో తేమ శాతం నమోదవడంతో రైతులు నష్టపోతున్నారు.
జిన్నింగ్ పరిశ్రమల యాజమాన్యాలతో సీసీఐ అధికారులు కుమ్మక్కై సర్వర్ నెమ్మదిగా ఉందని, తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకులు చెబుతూ మద్దతు ధర దక్కనీయకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉన్న పత్తిని నిల్వచేస్తే రంగు మారుతుండగా, నాణ్యమైన దిగుబడులొచి్చన చోట కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లలేక రైతులు అయినకాడకి అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడింది.
ఒక్క కేంద్రం కూడా ఏర్పాటుచేయలేదు..
మా జిల్లాలో ఒక్క కేంద్రం కూడా ఏర్పాటుచేయలేదు. ఫలితంగా నంద్యాల జిల్లాలోని కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి వేలకు వేలు ఖర్చుపెట్టి లారీల్లో పత్తిని తీసుకుకెళ్తే అక్కడ నిమ్ము ఎక్కువగా ఉందని నాణ్యతలేదని రేటు తగ్గించేస్తున్నారు. మా జిల్లా నుంచి ఎవరు వెళ్లడంలేదు. ఇక్కడే అమ్ముకుంటున్నారు. గతేడాది మద్దతు ధరకు మించి పలికింది. ఈ ఏడాది రూ.6 వేలకు మించి పలకడంలేదు. దీంతో పాతది, ఇప్పటిదీ కలిపి దాదాపు 400 క్వింటాళ్ల పత్తిని ఇంట్లోనే ఉంచుకున్నాను. – నంద్యాల భాస్కర్‌రెడ్డి, రాజుపాలెం, వైఎస్సార్ జిల్లా
ఎకరాకు రూ.5వేల నష్టం..
గతేడాది నవంబరులోనే గుంటూరు, ఒడిశా, రాయగడ, గుణుపూర్ ప్రాంతాలకు చెందిన వర్తకులు క్వింటా రూ.7వేలకు పైగా కొనుగోలు చేశారు. కానీ, ఈ ఏడాది రూ.6వేలకు మించి కొనడంలేదు. ఇలా అయితే ఎకరాకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ ఒక్కరికీ లభించడంలేదు. – పెద్దకోట జగన్నాథం, కర్లెం, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment