
మద్దతు ధరపై ఊరించి ఉస్సూరుమనిపించిన కూటమి ప్రభుత్వం
పంట కొనుగోలుపై మొదటి నుంచీ మోసపూరిత వైఖరే
కేంద్రానికి లేఖల పేరిట తొలుత హంగామా
కేంద్రమే కొంటుందంటూ హడావుడి
ఆచరణకు వచ్చేసరికి చేతులెత్తేసిన వైనం
ఇదేంటని ప్రశ్నిస్తే మద్దతు ధరకు మించి మార్కెట్ ధర ఉందంటూ ప్రచారం
మరోవైపు మార్కెట్–మద్దతు ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ నాటకం
రైతుల సమావేశం సాక్షిగా హామీ ఇచ్చి పట్టించుకోని సీఎం చంద్రబాబు
నష్టానికే అమ్ముకుంటున్న రైతులు.. పైసా సాయం చేయని ప్రభుత్వం
కనీసం బోనస్ అయినా ఇవ్వాలని కోరుతుంటే నోరెత్తని పాలకులు
కూటమి నేతల మాటలు నమ్మి నిలువునా నష్టపోయిన రైతులు
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: మిరప రైతుల నెత్తిన టీడీపీ కూటమి ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టింది. మద్దతు ధర పేరిట ఊరించి ఊహల పల్లకిలో ఊరేగించి నిలుపునా ముంచేసింది. మద్దతు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసానికితోడు రైతుల ఖాతాకు జమ చేస్తామని కొంతకాలం, బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామంటూ మరికొంత కాలం నాన్చింది. ఇప్పుడు మార్కెట్‌లో ధరలు ఎగబాకిపోతున్నందున ఇక మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెబుతోంది. మరి నష్టానికి అమ్ముకుంటున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల నోరు పెగలడం లేదు. బోనస్ విషయంలో చేతులెత్తేశారు.
తేజ రకం తప్ప మిగిలిన రకాలన్నీ నేటికీ మద్దతు ధర కంటే తక్కువగానే పలుకుతున్నాయి. అయినా సరే ధరలు ఎగబాకిపోతున్నాయంటూ అసెంబ్లీ సాక్షిగా మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడుతూ అబద్ధాలు వల్లె వేస్తున్నారు. విదేశాలకు ఎగుమతుల ఆర్డర్లు తగ్గడంతో పంట మార్కెట్‌కు వచ్చే సమయంలోనే ధరల పతనం మొదలైంది. మరో వైపు ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనతో మసాలా కంపెనీలు కూడా కొనుగోలు నిలిపివేశాయి.
ఇదే విషయమై ఓ వైపు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం హెచ్చరికలు చేసినా, మార్కెటింగ్ శాఖ ముందుగానే గుర్తించించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా రంగంలోకి దిగి మిర్చి యార్డుకు వెళ్లి మిరప రైతులకు బాసటగా నిలవడంతో కూటమి పెద్దలు నానా హంగామా చేశారు. చేతిలో ఉన్న మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి ఆదుకోవల్సింది పోయి కేంద్రానికి లేఖలు రాశామని, సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారని.. మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం దిగివచ్చేసిందంటూ ఊదరగొట్టారు.
కేంద్రంపై భారం మోపి.. చేతులెత్తేశారు
దిగుబడుల్లో కనీసం 30 శాతం (3 లక్షల టన్నులపైన) పంట సేకరిస్తే రూ.3,480 కోట్లు ఖర్చవుతుందని.. ఆ భారం కేంద్రమే భరించేలా ఒప్పిస్తామంటూ తొలుత రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. ఆ తర్వాత మార్కెట్ ధర, మద్దతు ధర మధ్య వ్యత్యాసంలో 50 శాతం (మిగతా 50 శాతం కేంద్రం) భరించేలా ఫిబ్రవరి మూడో వారంలో ఎకరాకు 5 క్వింటాళ్ల చొప్పున 25 శాతం (2.9 లక్షల టన్నులు) పంటకు రూ.846.15 కోట్లు, 50 శాతం (5.83 లక్షల టన్నులు) పంట కొనుగోలుకు రూ.1,692.31 కోట్లు, 75 శాతానికి (8.75 లక్షల టన్నులు) రూ.2,538.46 కోట్లు ఖర్చవుతుందని అధికారులు రెండోసారి ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. రూ.11,781 చొప్పున కేంద్రం కొంటుందంటూ కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని గొప్పగా ప్రకటించారు.
అన్నీ తెలిసి దొంగ నాటకాలు
సీఎం చంద్రబాబు మిర్చి రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులతో గత నెల 21న ఏర్పాటు చేసిన సమావేశంలో తమకు శుభవార్త చెబుతారని రైతులు ఎంతగానో ఆశగా ఎదురు చూశారు. 25 శాతానికి మించి కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితులు కన్పించడం లేదంటూ తేల్చి చెప్పేశారు. వాస్తవానికి మద్దతు ధర పెంచాలన్నా, 25 శాతానికి మించి కొనుగోలు చేయాలన్నా, కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సిందే.
నాటి భేటీలో వారం పది రోజుల్లో మరోసారి భేటీ అయ్యి తాము నిర్దేశించిన మద్దతు ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చేసి మూడు వారాలు దాటినా మళ్లీ ఆ ఊసెత్తడం లేదు.
ధరలు పెరిగిపోయాయంటూ అబద్ధాలు
మద్దతు–మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ హంగామా చేశారు. ఆ మేరకు యార్డులో మిర్చి విక్రయించిన రైతుల వివరాలను సేకరించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోంది.
పైగా ఈ హడావుడి తర్వాత మార్కెట్‌లో ధరలు పెరిగిపోతున్నాయంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా పోటీపడి స్టేట్‌మెంట్లు ఇస్తూ సమస్యను నీరుగార్చేస్తున్నారు. వాస్తవానికి గురువారం మిర్చి యార్డులో తేజ రకానికి మాత్రమే గరిష్టంగా రూ.14 వేలు, కనిష్టంగా రూ.5,500 పలికింది. తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు ఎంతో కొంత బోనస్ ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఈయన పేరు కన్నెబోయిన బాలసాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లి స్వగ్రామం. తనకున్న మూడెకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేశారు. ఎకరాకు రూ.1.75 లక్షలు ఖర్చయ్యింది. గతేడాది ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ ఏడాది తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో 15 క్వింటాళ్ల లోపే వచ్చింది. సగానికి పైగా తాలు. గత సీజన్‌లో క్వింటా రూ.23వేల నుంచి రూ.27 వేల మధ్య పలికిన తేజ రకం కాయలు నేడు రూ.11వేల నుంచి రూ.12 వేల మధ్య పలుకుతున్నాయి.
తాలు రకానికి గత సీజన్‌లో క్వింటాకు రూ.17 వేలు ధర వస్తే ఈ ఏడాది రూ.5 వేలు కూడా దక్కలేదు. ‘గత నెల మొదటి వారంలో 40 బస్తాలు గుంటూరు యార్డుకు తీసుకొస్తే క్వింటాకు రూ.15 వేలు ధర వస్తే నేడు 50 బస్తాలు తెస్తే క్వింటా రూ.11 వేలు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ.11,781గా ప్రకటించిన తర్వాత ధరలు మరింత పతనమయ్యాయి.
రైతులను పట్టించుకునే నాథుడే లేడు. మిర్చి పంట అమ్ముకోవాలంటే భయం వేస్తోంది. ఇళ్ల వద్ద కూలీలతోపాటు ఎరువులు, మందుల షాపుల వారు కాచుకుని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. క్వింటాకు రూ.20 వేలు ధర పలికితే పెట్టుబడి వస్తుంది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం’ అని బాలసాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాగు, దిగుబడి లెక్కలివి..
రాష్ట్రంలో 2023–24 సీజన్‌లో 6 లక్షల ఎకరాలకు పైగా మిరప సాగైంది. 14.50 లక్షల టన్నులకుపైగా దిగుబడులొచ్చాయి. అలాంటిది 2024–25లో వరుస వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్వాకంతో కేవలం 3.95 లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప సాగైంది. దిగుబడి 11 లక్షల టన్నులొస్తాయని అంచనా వేయగా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కన్పించడం లేదు.
మరోపక్క గుంటూరు మార్కెట్ యార్డుకు ఈ ఏడాది 4.76 లక్షల టన్నులు మిరప వస్తుందని అంచనా వేయగా, జనవరిలో 61 వేల టన్నులు, ఫిబ్రవరిలో 1.10 లక్షల టన్నులు రాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 1.09 లక్షల టన్నులొచ్చాయి. ఈ నెలలో మరో లక్ష టన్నులు, ఏప్రిల్‌లో 65 వేల టన్నులు, మేలో 30 వేల టన్నులు మార్కెట్‌కు వస్తాయని అంచనా.
ఈ దుస్థితి ఏనాడు లేదు
దశాబ్దాలుగా మిర్చి పంటను పండిస్తున్నా. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. కాయలు కోత కోద్దామంటే కూలీలు వచ్చే పరిస్థితి లేదు. గత సీజన్‌లో కిలో ఎండు మిర్చి తీతకు రూ.10 ఇస్తే, ఈ ఏడాది రూ.25 ఉంది. గతేడాది తేజ రకం మిర్చి క్వింటా రూ.20 వేలకు పైగా అమ్మితే ఈ ఏడాది రూ.10 వేలకు మించి కొనడం లేదు. విచిత్రంగా మిర్చి ధర తగ్గి కూలీల ధర పెరగటం దారుణం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.11,781 దేనికీ సరిపోదు. – దొండపాటి అంజయ్య, అడిగొప్పుల, పల్నాడు జిల్లా
అప్పులే మిగిలాయి
3 ఎకరాల్లో మిరపసాగుకు ఎకరాకు రూ.75 వేలకుపైగా పెట్టుబడి పెట్టా. వైరస్ సోకి ఎకరాకు 8 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. మార్కెట్‌లో ధర లేదు. చివరికి క్వింటా రూ.9 వేలకు అమ్ముకున్నా. కనీస పెట్టుబడి కూడా మిగల్లేదు. అప్పులు మాత్రమే మిగిలిపోయాయి. – అహ్మద్, కమాన్‌దొడ్డి, కొసిగి మండలం, కర్నూలు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment