chilli farmers
-
అకాల వర్షం.. మిర్చి రైతుకు అపార నష్టం
-
రాష్ట్రమంతా ఈ–మిర్చ్
సాక్షి, అమరావతి/గుంటూరురూరల్: మిరపలో నాణ్యత, దిగుబడుల పెంపే లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘ఈ–మిర్చ్’ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రమంతా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని డిజిటల్ గ్రీన్ వ్యవస్థాపకుడు రికీన్ గాంధీ(యూఎస్ఏ), బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కంట్రీ హెడ్ శ్రీవల్లీకృష్ణన్లు తెలిపారు. 2021లో చేపట్టిన ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వ సహకారంతో విజయవంతమైందన్నారు. తామందించిన సాంకేతిక పరిజ్ఞానం రైతు భరోసా కేంద్రాల వల్ల గ్రామ స్థాయిలో రైతులకు వేగంగా చేరిందని, ఆర్బీకే వ్యవస్థ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ముందడుగని అభివర్ణించారు. ఆర్బీకేల ద్వారా వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టును రాష్ట్రమంతా విస్తరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మిరపతో పాటు ఇతర పంటలకు కూడా అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తామని చెప్పారు. మిరప రైతుల కోసం డిజిటల్ ఆవిష్కరణలపై గుంటూరులో బుధవారం నిర్వహించిన ఒక రోజు జాతీయ వర్క్‌షాప్‌లో వారు మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని మిర్చి రైతులకు డిజిటల్ మార్గాల ద్వారా సలహాలు అందించామన్నారు. రసాయన పురుగు మందుల వినియోగాన్ని నియంత్రించుకుంటూ.. విత్తు నుంచి మార్కెటింగ్ వరకు అనుసరించాల్సిన ఉత్తమ యాజమాన్య పద్ధతులపై 4–6 నిమిషాల నిడివితో రూపొందించిన వీడియో సందేశాలను ఆర్బీకే స్థాయిలో పికో ప్రొజెక్టర్ల ద్వారా రైతులకు చేరువచేశామని వివరించారు. ఉద్యాన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్ ఉత్పత్తి, ఉత్పాదకతలతో పాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు డిజిటల్ గ్రీన్, బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. -
మిర్చిపై ‘నల్ల తామర’ పంజా!
సాక్షి, మహబూబాబాద్: గత ఏడాది మిర్చి రైతులను గగ్గోలు పెట్టించిన నల్లతామర పురుగు మళ్లీ పంజా విసురుతోంది. మెల్లగా 40శాతం పంటకు వ్యాపించిన పురుగు.. మిర్చి పంటను నిలువునా నాశనం చేస్తోంది. ఎన్ని మందులు కొట్టినా ఫలితం ఉండటం లేదని, పూత రాలిపోయి మొక్కలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ పురుగు సోకిన విషయం తెలిసిన నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్సెక్ట్ రిసోర్సెస్ (ఎన్‌బీఏఐఆర్)–బెంగళూరు, సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ (సీఐపీఎంసీ)–హైదరాబాద్ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో పంటలను పరిశీలిస్తూ.. రైతులకు సూచనలు ఇస్తున్నారు. గత ఏడాది ఆగమాగం చేసి.. గత ఏడాది రాష్ట్రంలో మిర్చి పంటకు నల్లతామర పురుగు సోకింది. మొదటి పూత సమయంలోనే ప్రతాపం చూపింది. వేల ఎకరాలకు విస్తరించి తీవ్ర నష్టం కలగజేసింది. చాలా మంది రైతులు పెట్టుబడి కూడా చేతికి రాక అప్పుల పాలయ్యారు. మనస్తాపానికి గురై ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 24మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మిర్చికి మంచి ధర ఉండటంతో ఈసారైనా పంట బాగుంటే అప్పులు తీర్చుకోవచ్చన్న ఉద్దేశంతో అదే పంట వేశారు. మొత్తంగా రాష్ట్రంలో 2,41,908 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇందులో చాలా మంది రైతులకు మొదటి పూత దశ వరకు పంట బాగానే ఉండటంతో సంతోషపడ్డారు. కానీ మొదటి కాత పడిన కొద్దిరోజులకే మళ్లీ నల్లతామర పురుగు సోకింది. ఇప్పటివరకు 90వేల ఎకరాలకుపైగా వ్యాపించింది. మరింతగా విస్తరిస్తుండటంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. భూమి చదును చేయడం నుంచి విత్తనాల సేకరణ, ఎరువులు, పురుగు మందులదాకా మిర్చి సాగుకోసం ఇప్పటివరకు ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. సోకిన ఒకట్రెండు రోజుల్లోనే.. నల్లతామర పురుగు సోకితే ఒకట్రెండు రోజుల్లోనే పంటకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు చెప్తున్నారు. చేనులో పూలన్నీ రాలిపోతున్నాయని.. చెట్టు మోడుబారడం మొదలవుతోందని అంటున్నారు. పంటను రక్షించుకునేందుకు రకరకాల మందులు వాడామని.. పది, పదిహేను రోజుల్లో ఎకరానికి రూ.40 వేలకుపైగా విలువచేసే మందులు పిచికారీ చేసినా లాభం లేదని వాపోతున్నారు. జిల్లాల్లో శాస్త్రవేత్తల పరిశీలన నల్లతామర సోకిన విషయం తెలుసుకున్న ఎన్‌బీఏఐఆర్ శాస్త్రవేత్తలు కె.శ్రీదేవి, రచన, కందన్, సీఐపీఎంసీ శాస్త్రవే త్తలు సునీత, నీలారాణి, రవిశంకర్‌లతోపాటు ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు శ్రీధర్, వెంకటరమణ, ఇతర ఉద్యాన శాస్త్ర వేత్తలు వారం రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మి ర్చిసాగు అధికంగా ఉన్న ఖమ్మం, మహబూబాబాద్, గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జయశంకర్ భూపా లపల్లి, వరంగల్ జిల్లాలకు వెళ్లి.. గత ఏడాదికి ఇప్పటికి పురుగులో వచ్చిన తేడా, పంటను ఆశించిన తీరును పరి శీలించారు. నల్ల తామర నియంత్రణ కోసం బవేరియా భాసియానా, లెకానీసీలియం లెకానీ, సూడోమోనాస్, బ్యాసిల్లస్, సబ్‌టైలిస్ పౌడర్లను ప్రయోగత్మకంగా రైతుల మిర్చి తోటల్లో పిచికారీ చేయించారు. కీటకనాశని జీవ శిలీంధ్రాలతో ఫలితం నల్ల తామర పురుగు నివారణ కోసం ఎన్‌బీఏఐఆర్ శాస్త్రవేత్త కందన్ నేతృత్వంలో తయారుచేసిన కీటకనాశని జీవ శిలీంధ్రాలు మంచి ఫలితం ఇస్తున్నాయి. కర్ణాటకలోని మిర్చి తోటలపై ప్రయోగాత్మకంగా పిచికారీ చేశాం. తెలంగాణలోనూ అదే రకమైన నల్లతామర పురుగు ఆశించినట్టు నిర్ధారించాం. ఇక్కడా బ్యాలిల్లస్, సూడోమోనాస్ తదితర మందులను పిచికారీ చేయించాం. పంటలు రికవరీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. – కె.శ్రీదేవి, ఎన్‌బీఏఐఆర్ శాస్త్రవేత్త రైతులు జాగ్రత్తలు పాటించాలి తెలంగాణలో మిర్చి అధికంగా సాగుచేసిన ఏడు జిల్లాల్లో పర్యటించాం. పురుగు తీవ్రత గత ఏడాది కన్నా తక్కువగా ఉంది. గత ఏడాది సన్నమిర్చి రకాలకు రాలేదు. కానీ ఇప్పుడు తేజ రకం విత్తనాలకు ఎక్కువగా ఆశిస్తున్నట్టు గుర్తించాం. దీనికి విరుగుడు బ్యాక్టీరియా, శిలీంధ్రాలతో తయారు చేసిన కీటక నాశనులే అని ప్రయోగాల్లో తేలింది. రైతులు విత్తన శుద్ధి, పంట మార్పిడి మొదలైన సస్యరక్షణ చర్యలు కూడా పాటించాలి. – లీలారాణి, సీఐపీఎంసీ శాస్త్రవేత్త -
మిర్చి రైతుకు పరిహారం ఇవ్వాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు, వడగళ్ల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి పంటకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రెండ్రోజులుగా వరంగల్, కరీంనగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలో వడగండ్లు, అకాల వర్షాలతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నర్సంపేట ప్రాంతంలో పండుకు వచ్చిన మిర్చి పంట పూర్తిగా నీట మునిగిందన్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలపై సీఎం కేసీఆర్ స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా ఆదేశించాలని, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపు కోకుండా ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. -
మిర్చి రైతులను ఆదుకోండి
సాక్షి, న్యూఢిల్లీ/నరసరావుపేట: ఆంధ్రప్రదేశ్‌లో నష్టపోయిన మిరప రైతుల్ని ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. గుంటూరు మిర్చి సుమారు రూ.5 వేల కోట్లకు పైగా టర్నోవర్‌తో 40కి పైగా దేశాలకు ఎగుమతి అవుతోందని తెలిపారు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 1.4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల రెండు తుపాన్లతో విస్తృతంగా పంట నష్టం జరిగిందన్నారు. 14 వేల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలోని పంటపై నల్లతామర తెగులు ప్రభావం చూపిందని, సుమారు రూ.500 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. పురుగు ఎందు కు ఆశిస్తోందో అధ్యయనం చేసి నివారణ చర్యల గురించి రైతులకు మార్గనిర్దేశం చేయడానికి నిపుణుల బృం దాన్ని పంపాలని, నల్లతామర ప్రభావం తగ్గించడానికి అవసరమైన పురుగుమందులను ఏపీ ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాలో పీఎం ఫసల్ బీమా యోజన సార్వత్రిక కవరేజీ ముందస్తుగా నిర్ధారించాలని కోరారు. నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నష్టపోయిన పంటను సేకరించాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన అభ్యర్థనను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం గురువారం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని ఐసీఏఆర్–ఎన్‌సీఐపీఎం సైంటిస్టు డాక్టర్ కె.రాఘవేంద్ర, బెంగళూరుకు చెందిన ఎంట మాలజీ సైంటిస్టు డాక్టర్ రచనారుమాణీ, ఫరీదా బాద్‌కు చెందిన డాక్టర్ ఒ.పి.వర్మ, విజయవాడ సీఐపీఎంఈ డిప్యూటీ డైరెక్టర్ ఎం.పి.గోస్వామి, రాష్ట్ర ఉద్యానవనశాఖ అధికారిని నియమించింది. -
రైతుల చావు కేకలు వినిపించడం లేదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తామర పురుగుతో నష్టపోయి మిర్చి రైతులు, ధాన్యం కొనుగోళ్లు లేక వరి రైతుల చావు కేకలు వినిపించడం లేదా అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరి, మిర్చి రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గురువారం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన మిర్చి కేవలం ఐదు క్వింటాళ్లు రావడమే గగనంగా మారిందని, లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి మిర్చి పండించిన రైతులు దిక్కుతోచని పరిస్థితిల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సగటున ఒక్కో మిర్చి రైతు నెత్తిన ఐదు నుంచి రూ.10 లక్షల అప్పు ఉందని, ఏ పత్రిక తిరగేసినా మిర్చి రైతుల ఆత్మహత్యలే దర్శనమిస్తున్నాయని వెల్లడించారు. పంట మార్పిడికి భరోసా ఏదీ? వరి వద్దు ...పంటల మార్పిడి చేయాలంటోన్న మీరు మిర్చి రైతులకు ఇచ్చిన భరోసా ఏమిటో చెప్పాలని రేవంత్ లేఖలో డిమాండ్ చేశారు. ఏడున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో సుమారు 40 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మెజారిటీ రైతులకు పరిహారం కూడా అందలేదని, పరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. తక్షణం మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతుల్లో భరోసా నింపేలాచర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టపోయిన మిర్చి రైతులకు తక్షణం పరిహారం ప్రకటించాలని, తిరిగి పంట వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటుగా రూ.లక్ష రుణమాఫీని తక్షణం అమలు చేసి వారిని ఆదుకోవాలని కోరారు. లేదంటే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణతో రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. -
ధర ‘తేజం’.. రైతుకు ఉత్తేజం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మిర్చి రైతులకు మంచి రోజు వచ్చి వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ పొందే ‘తేజ’రకం మంచి ధర పలుకుతోంది. ఇక సాధారణ రకం కూడా ఊరటనిచ్చే విధంగా ఉండటంతో మిర్చి రైతులు సంబరపడుతున్నారు. ‘మిర్చి’ధర దారుణంగా పతనమై 2017 లో రైతులు ఖమ్మం మార్కెట్ యార్డులో చేపట్టిన ఆందోళన, ఆగ్రహం, విధ్వంసం, అరెస్టులకు గురైన సంఘటన వారిని అప్పట్లో కలచి వేసింది. ఆ సంఘటన తర్వాత అదే ఖమ్మం మార్కెట్లో ఈ ఏడాది రైతులకు ఎంతో ఉపశమనం లభించింది. సాధారణం కంటే... సాధారణ రకానికి ప్రస్తుతం మార్కెట్లో రూ. 17 వేలకు పైగా ఉండగా, తేజ రకం మిర్చికి రూ. 21,300 పలికింది. గతేడాది గరిష్టంగా రూ. 10 వేలలోపు మాత్రమే ధర ఉండేది. బుధవారం ఖమ్మం మార్కెట్లో క్వింటాలుకు రూ. 21,300 పలకడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అయ్యింది. అంతర్జాతీయ స్థాయి డిమాండ్‌తోనే... రాష్ట్రంలో ఖరీఫ్‌లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 1.84 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 1.12 లక్షల (61%) ఎకరాల్లోనే సాగైంది. పంట సమయంలో వచి్చన భారీ వర్షాలకు అక్కడక్కడ దెబ్బతిన్నా, మొత్తంగా మంచి నాణ్యమైన పంట పండింది.దేశంలో ఇతర ప్రాంతాల్లో అధిక వర్షాలతో భారీగా దెబ్బతినిపోయింది. అలాగే మలేసియా, థాయ్‌లాండ్, సింగపూర్లలోనూ మిర్చి దెబ్బతిని పోయిందని వ్యాపారులు చెబుతున్నారు.దీంతో ‘తేజ’రకం మిర్చికి చైనా, సింగ పూర్, థాయ్‌లాండ్, అరబ్ దేశాల్లో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. 50 రోజుల్లో దాదాపు రూ. 6 వేలు అధికం... 50 రోజుల నుంచి మిర్చి పంట మార్కెట్‌కు వస్తోంది. నవంబర్ 18న తేజ రకం మిర్చికి రూ. 15,811 ధర పలికింది. 50 రోజుల వ్యవధిలో అది రూ. 6 వేల వరకు పెరిగి రూ. 21,300కు చేరుకుంది.గత నెల 26న ఆ రకం మిర్చి ధర రూ. 19,200 పలుకగా, 27న రూ. 400 పెరిగి రూ. 19,600కు చేరింది. అదే నెల 30 నాటికి మరో రూ. 421కు పెరిగి రూ.20,021కు చేరింది. 31వ తేదీన రూ. 20,021 పలికింది. ఈ నెల2న రూ. 21 వేలు పలికింది. ఇప్పుడు రూ. 21,300లకు చేరింది. -
జలంధర్ దిష్టిబొమ్మ దహనం
తల్లాడ ఖమ్మం : రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి ఐపీ పెట్టిన వ్యాపారి పెరంబుదూరు జలంధర్ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. స్థానిక జలంధర్ ఇంటి వద్ద నుంచి ప్రదర్శనగా బయలు దేరి రైతులు, రైతు సంఘం నాయకులు బస్టాండ్ సెంటర్లో దిష్టిబొమ్మన తగులబెట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాదినేని రమేష్, తాతా భాస్కర్‌రావు మాట్లాడారు. రూ.2.5 కోట్లకు ఐపీ పెట్టి రైతుల నోట్లో మన్ను కొట్టిన మిర్చి వ్యాపారిని అరెస్ట్ చేసి ఆయన ఆస్తులను వేలం వేసి రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. జలంధర్‌ను అరెస్ట్ చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. జలంధర్‌ను ర ప్పించి రైతుల సమక్షంలో చర్చించి ఎవరికెన్ని డబ్బులు ఇవ్వాలో మొత్తం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో రోజు జలంధర్ ఇంటి వద్ద రైతులు, రైతు సంఘం నాయకులు, అఖిల పక్ష నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం అఖిలపక్షం, రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యాపారి ఇంటి ఎదుట రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బాధిత రైతుల పోరాట కమిటీ కన్వీనర్ గుంటుపల్లి వెంకటయ్య, రైతు సంఘం నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, బీజేపీ నాయకులు ఆపతి వెంకటరామారావు, కాంగ్రెస్ నాయకులు కాపా రామారావు, దగ్గుల రఘుపతిరెడ్డి, గోవింద్ శ్రీను, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, దర్మసోత్ ధశరధ్‌నాయక్, భూక్యా అంజయ్య, మహిళా సంఘం నాయకురాలు శీలం ఫకీరమ్మ, భాదిత రైతులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి, రఘునాథపాలెం : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరంతండా రైతు బాదావత్ రామా(25) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రామా తన ఎకరన్నరతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిరప పంటలు సాగు చేయగా రూ.6 లక్షలకు పైగా అప్పులయ్యాయి. దీంతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
రైతన్నకు సంకెళ్లు
ఖమ్మం మిర్చి మార్కెట్ ఘటనలో 12 రోజులుగా జైల్లో ఉన్న రైతులు సాక్షి, ఖమ్మం: ఖమ్మం మార్కెట్ యార్డు విధ్వంసం ఘటనలో రిమాండ్‌లో ఉన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం సంచలనం సృష్టించింది. పోలీసులు అత్యుత్సాహంతో రైతులను కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లతో తీసుకురావడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై గురువారం కోర్టు వద్ద రైతుల బంధువులు, న్యాయవాదులు, విపక్షాల నాయకులు, మానవ హక్కుల ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసు ఉన్నతా ధికారులు వెంటనే స్పందించారు. అత్యుత్సాహంతో రైతులకు బేడీలు వేసి తీసుకువచ్చిన ఇద్దరు ఏఆర్ ఎస్సైలను సస్పెండ్ చేయడంతోపాటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి రెండు కేసుల్లో ఖమ్మం జిల్లా కోర్టు పది మంది రైతులకు బెయిల్ మంజూరు చేసింది. ఆవేదనతో విధ్వంసం గత నెల 28న ఖమ్మం మార్కెట్‌కు సుమారు 2 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. దాని కంటే ముందు రెండు రోజులు మార్కెట్‌కు సెలవులు కావడం, తర్వాత రెండు రోజులు సెలవులు ఉంటాయనే ప్రచారంతో పెద్దసంఖ్యలో రైతులు మార్కెట్‌కు మిర్చిపంటను తీసుకువచ్చారు. దీంతో వ్యాపారులు, ఏజెంట్లు కుమ్మక్కై మిర్చిధరను ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులంతా ఆందోళనకు దిగారు. అది ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు ఆగ్రహంతో మార్కెట్ కార్యాలయం, చైర్మన్ చాంబర్, ఈ–నామ్ కార్యాలయాల్లో ఫర్నీచర్, కంప్యూటర్లను, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ధ్వంసం చేశారు. ఆ ఘటనపై కలెక్టర్ ప్రభుత్వానికి 8 పేజీల నివేదిక పంపారు. కొందరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు మార్కెట్ సెలవులు ఉంటాయని ప్రచారం చేయడం, ధర తగ్గించడం వంటి అంశాలను ఆ నివేదికలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వచ్చిన సమయంలోనే దాడి మొదలైందని వివరించారు. మొత్తంగా మార్కెట్ ధ్వంసంపై సీసీ కెమెరాలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌ల ఆధారంగా ఎమ్మెల్యే సండ్రతో పాటు పదిమంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 10 మందిపై క్రిమినల్ కేసులు పోలీసులు ఈకేసులో సండ్ర వెంకట వీరయ్య పరారీలో ఉన్నట్లు చూపిస్తూ.. మిగతా పది మంది రైతులను గతనెల30న అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 147 (దాడి చేయడానికి వెళ్లడం), 148 (మరణాయుధాలతో దాడిచేయడం), 353 (ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం), 427 (ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం), 446, 448 (అక్రమంగా, దురుద్దేశంగా ప్రవేశించడం), 120 (బి) (కుట్రపూరిత నేరం), రెడ్‌విత్149, సెక్షన్ 3 అండ్ 4 పీడీ పీపీ యాక్ట్ (ప్రభుత్వ ఆస్తులకు భంగం, నష్టం కలిగించుట), 436 (వస్తువులు, ఫర్నీచర్‌ను తగలబెట్టడం), 506 (ఉద్దేశపూర్వకంగా నేరం చేయదలచుకోవడం) కింద కేసులు నమోదు చేశారు. ఆద్యంతం ఉత్కంఠ ఏఆర్ పోలీసులు రైతులను తీసుకుని జైలు నుంచి ఉదయం 11 గంటలకు వ్యాన్‌లో 3వ అదనపు ఫస్ట్‌క్లాస్ కోర్టు వద్దకు వచ్చారు. రైతులందరికీ సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. ఈ సమయంలో రైతులను పరామర్శించేందుకు రాజకీయ నాయకులు, రైతుల బంధువులు, వారి తరఫు న్యాయవాదులు కోర్టు వద్ద వేచి ఉన్నప్పటికీ వారిని కలవనీయలేదు. కోర్టు ఆవరణలో ఉన్నంతసేపు సంకెళ్లతోనే ఉంచారు. ఈలోపు మీడియా ప్రతినిధులు, న్యాయవాదులు సంకెళ్ల విషయమై పోలీసులను నిలదీశారు. ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి పోలీసులు సంకెళ్లు తొలగించి రైతులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, బయటకు తీసుకువచ్చారు. అప్పటికీ ప్రతిపక్షాలు, న్యాయవాదులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీంతో రైతులను తిరిగి జైలుకు తరలించేటప్పుడు సంకెళ్లు లేకుండా తీసుకెళ్లారు. కాగా.. రైతులకు సంకెళ్లపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు న్యాయవాదులు తెలిపారు. షరతులతో బెయిల్.. ఖమ్మం లీగల్: మార్కెట్ యార్డు ఘటనకు సంబంధించి పది మంది రైతులపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఈ రైతులకు బెయిల్ కోసం కాంగ్రెస్, టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు జిల్లాకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక కేసులో ఈనెల8నే బెయిల్ మంజూరు కాగా.. ఖమ్మం త్రీటౌన్ పోలీసులు రైతులను పీటీ వారెంట్‌పై మరో రెండు కేసుల్లో కస్టడీలోకి తీసుకున్నారు. ఆ రెండు కేసుల్లోనూ బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. అవి గురువారం ఖమ్మం ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుటకు వచ్చాయి. ప్రాసిక్యూషన్ తరఫున ఇన్చార్జి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొండపల్లి జగన్మోహన్రావు వాదిస్తూ... రైతుల బెయిల్ పిటిషన్లను వ్యతిరేకించారు. కేసుల విచారణ ఇంకా పూర్తికాలేదని, కొందరు సాక్షులను విచారించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. రైతుల తరఫున న్యాయవాదులు జమ్ముల శరత్‌కుమార్‌రెడ్డి, మువ్వా నాగేశ్వరరావు, రామా రావు, శ్రీనివాసరావు తదితరులు వాదనలు వినిపించారు. ఈ కేసుల విచారణ పూర్తయిందని, సాక్షుల వాంగ్మూలాలను సైతం నమోదుచేశారని స్పష్టం చేశారు. రైతులకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బేడీలు వేయడం హక్కుల ఉల్లంఘనే! ఖమ్మంలీగల్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. తరచూ నేరాలు చేసే వారికి, నేరప్రవృత్తి గల వారికి, దొంగతనం, దోపిడీలకు, మతవిద్వేషాలకు పాల్పడినవారికి, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులు, పారిపోయే ప్రమాదంముందన్న అనుమానమున్న వారికి మాత్రమే బేడీలు వేసి కోర్టులో హాజరుపర్చాలి. అది కూడా కేవలం ప్రయాణ సమయంలో మాత్రమే, కోర్టు అనుమతితోనే బేడీలు వేయాలి. 1995లో క్లాజ్ త్రీ డివిజన్ ఫర్ డెమోక్రసీ వర్సెస్ అస్సాం ప్రభుత్వానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈవిషయాన్ని స్పష్టం చేసింది. ఆ ఘటనలో గిరిజనులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకు వచ్చినందుకు ఐదుగురు పోలీసు అధికారులను శిక్షించింది కూడా. సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కేసులోనూ సుప్రీం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీయకూడదని, కోర్టు అనుమతితో మాత్రమే బేడీలు వేయాలని సూచించింది. ఇద్దరు ఏఆర్ ఎస్సైలపై వేటు రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకు రావడంపై ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా అడిషనల్ డీసీపీ సాయికృష్ణను నియమించారు. వెంటనే దీనిపై నివేదిక ఇవ్వడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎనిమిది మంది రైతులకు ఏఆర్ సిబ్బంది సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చారు. ఇందులో ఏఆర్ ఎస్సైలు పూర్ణానాయక్, వెంకటేశ్వరరావులను సస్పెండ్ చేస్తున్నట్లు డీఐజీ నాగిరెడ్డి ప్రకటించారు. విడుదలైన రైతులు.. మండెపుడి ఆనందరావు (చిరుమర్రి, ముదిగొండ మండలం) నెల్లూరి వెంకటేశ్వర్లు, సత్తు కొండయ్య (బాణాపురం, ముదిగొండ మండలం) ఇస్రాల బాలు (లక్ష్మీపురంతండా, కల్లూరు మండలం) భూక్యా అశోక్ (మహబూబాబాద్ జిల్లా సూదనపల్లి) భూక్యా నర్సింహారావు (శ్రీరామపురంతండా, ఏన్కూరు) భూక్యా శ్రీను, బానోతు సైదులు (బచ్చోడుతండా, తిరుమలాయపాలెం మండలం) తేజావత్ భావ్‌సింగ్ (దుబ్బతండా, కారేపల్లి మండలం) బానోతు ఉపేందర్ (శంకరగిరితండా, నేలకొండపల్లి) -
మిర్చి రైతులను అదుకోండి:సీపీఐ నేతలు
-
మిర్చి రైతుల కష్టాలపై మంత్రుల అధ్యయనం
♦ కేబినెట్ నిర్ణయం ♦ కేంద్ర సాయానికి సీఎం లేఖ రాయాలని తీర్మానం సాక్షి, అమరావతి: మిర్చి రైతులు పడుతున్న బాధలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రులు పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలను ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆదేశించారు. గురువారం సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పునర్ వ్యవస్థీకరణ తరువాత తొలి సారిగా జరిగిన సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం రాత్రి సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు విలేకరులకు మంత్రి వర్గ నిర్ణయాలు వివరించారు. పార్టీ ఫిరాయించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనేనని, చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంపై కేబినెట్లో ఏమన్నా చర్చించారా అని ఓ విలేకరి అడగ్గా కాల్వ మౌనం వహించారు. మంత్రుల నివేదిక ఆధారంగా... మిర్చి రైతులతో ఇద్దరు మంత్రులు మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని, పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలు ప్రభుత్వానికి నివేదించాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కోరాలనేది కూడా సిఫార్సు చేయాలని, ఆ నివేదికను ఆధారంగా సహాయం కోసం కేంద్రానికి సీఎం లేఖరాయాలని కేబినెట్ తీర్మానించింది. ఉపాధి కూలీల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017పై మున్సిపాలిటీలకు గాను ముసాయిదాను రూపొందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదించింది. మునిసిపాలిటీలన్నింటికీ ఒకే రకమైన చట్టాన్ని తీసుకు రావాలని మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉపాధి కూలీలు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భూ కేటాయింపులూ.. లీజులు.. హీరో మోటార్స్‌కు భూ కేటాయింపునకు కొన్ని సవరణలను కేబినెట్ ఆమోదించింది. దీనిపై ఏపీఐఐసీకి అదేశాలు జారీ చేసింది. విజయవాడలోని మునిసిపల్ కార్పొరేషన్ సీవీఆర్ కాంప్లెక్స్‌లో ఉన్న ఆంధ్రా హాస్పిటల్ బ్లాక్ లీజ్ కాలపరిమితిని 12 నుంచి 25 ఏళ్లకు పెంచాలని తీర్మానించింది. కడప జిల్లా బాయిలపల్లి గ్రామంలో సర్వే నెం: 685/1, 68 పరిధిలో ఉన్న 4.95 ఎకరాల భూమికి సంబంధించిన లీజు గడువును పెంచాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. -
మిర్చి రైతుల పడిగాపులు
⇒ బస్తాలు లోపలికి రాకుండా అడ్డుకుంటున్న సిబ్బంది ⇒ 15 వేల బస్తాలకు 4,459 బస్తాలు మాత్రమే కొనుగోలు ⇒ ఏప్రిల్ 2 వరకు మార్కెట్ బంద్ సాక్షి, మహబూబాబాద్: మిర్చి పంట ఈ సారి రైతాంగాన్ని చిన్నబుచ్చింది. గతేడాది మంచి ధర పలికిందని ఈ ఏడాది మిర్చి అధికంగా సాగు చేస్తే గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీనికి తోడు మార్కెట్ అధికారుల తీరు వారిని మరింత కుంగదీస్తోంది. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో వారంలో మూడు రోజులు(సోమ, మంగళ, బుధ) మాత్రమే మిర్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ఆదివారమే భారీగా మిర్చితో మార్కెట్‌కు చేరుకుంటుండడంతో యార్డ్ అంతా మిర్చి బస్తాలతో నిండి పోతోంది. రోజూ వందలకొద్దీ బస్తాలు మార్కెట్‌కు రావడమే ఇందుకు కారణమని మార్కెట్ అధికారులు పేర్కొంటుండగా రైతులు మాత్రం సరుకు అమ్ముడుపోక రోజుల తరబడి మార్కెట్లోనే ఉండాల్సి వస్తోందంటున్నారు. వాహనాలను అడ్డుకుంటున్న సిబ్బంది రైతులు మార్కెట్‌కు మిర్చిని తీసుకొస్తే మార్కెట్ సిబ్బంది మూడు రోజులుగా అడ్డుకుంటున్నారు. గేట్‌కు తాళం వేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు వస్తున్న రైతులను లోపలికి రానివ్వకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఆదివారం నుంచి బుధవారం వరకు 15 వేల బస్తాలు మార్కెట్‌కు చేరుకోగా కేవలం 4,459 బస్తాలు మాత్రమే కొనుగోలు చేశారు. గిట్టుబాటూ దక్కడం లేదు.. నకిలీ విత్తనాలకు సరిగా దిగుబడిరాక ఇప్పటికే అవస్థలు పడుతున్న రైతులను గిట్టుబాటు ధర లేకపోవడం మరింత కలవరపరుస్తోంది. మిర్చికి క్వింటాకు గరిష్ట ధర రూ.7,400 నుంచి కనిష్ట ధర రూ.5,575 వరకు పలుకుతోంది. ఏప్రిల్ 2 వరకు కొనుగోళ్లు బంద్ సోమవారం ప్రారంభమైన కొనుగోళ్లు శుక్రవారంతో ముగియనున్నాయి. వాస్తవానికి బుధవారంతోనే కొనుగోళ్లు ఆపాల్సి ఉన్నప్పటికీ మరో రెండు రోజులు మార్కెట్ యార్డులో ఉన్న బస్తాలు కొనుగోలు చేస్తామని మార్కెట్ సిబ్బంది పేర్కొన్నారు. అందుకే కొత్తగా బస్తాలు తీసుకురావొద్దంటూ గేట్ వద్ద నుంచే వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. వచ్చే శని, ఆదివారాలు బ్యాంకులు బంద్ ఉండడం వల్ల సోమవారం కూడా కొనుగోళ్లు చేయబోమని, మంగళ బుధవారాలు మార్కెట్‌కు ఉగాది సెలవు ప్రకటించినట్లు సిబ్బంది వెల్లడించారు. అందుకే ఏప్రిల్ 2 వరకు మిర్చిని కొత్తగా మార్కెట్‌కు తీసుకురావొద్దని అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. -
పంట లేకపోయినా.. ధర పతనం.!
మిరప రైతులకు నోట్ల కష్టాలు ముందుకు రాని వ్యాపారులు పంట ఉత్పత్తులు సమృద్ధిగా ఉన్నప్పుడు ధర పతనం కావడం సహజమే. అయితే పంట లేనప్పుడు ధర పతనమైతే... అది రైతు దౌర్భగం కాక మరేమవుతుంది! అచ్చం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ రైతులు. రూ. లక్షలు వ్యయంతో మిరప సాగు చేసిన అన్నదాతలకు నోటు కష్టాలు చావుదెబ్బతీశాయి. కరెన్సీ కొరతతో పంట దిగుబడులు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో మిర్చి నిల్వలు పేరుకుపోతున్నాయి. అదే సమయంలో రైతు అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారులు ప్రవేశించి మిర్చి ధరను సగానికిపైగా తగ్గించి అడుగుతున్నారు. ఈ పరిస్థితితో మిర్చి రైతులు కుదేలవుతున్నారు. - డి.హీరేహాళ్ డి.హీరేహాళ్ మండల వ్యాప్తంగా గత ఏడాది (2015) 3,800 ఎకరాల్లో వివిధ రకాల మిర్చిని రైతులు సాగు చేశారు. ఎకరాకు 17 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అప్పట్లో క్వింటాల్ మిర్చి రకాన్ని బట్టి రూ. 18 వేల నుంచి రూ. 22 వేల వరకు అమ్ముడు పోయింది. దిగుబడి తగ్గినా... గతంలో మిర్చి లాభాలను కురిపించడంతో ఈ ఏడాది (2016)లో డి.హీరేహాళ్ మండల వ్యాప్తంగా 4,800 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేపట్టారు. ఇందు కోసం రూ. 4.50 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. వర్షాభావ పరిస్థితులకు తోడు భూగర్భ జలాలు అడుగంటడంతో పంట సాగుకు అవసరమైన నీరు లభ్యం కాలేదు. దీంతో అనూహ్యంగా పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. మొత్తం పంటను లెక్కించినా.. రూ. 3 కోట్లకు మించి లేదు. పెట్టుబడులను కూడా నష్టపోయిన రైతులు వందల్లోనే ఉన్నారు. కరెన్సీ కొరతతో మరిన్ని కష్టాలు మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. అసలే ఆశించిన మేర పంట దిగుబడి లేక కుదేలైన రైతులకు నోట్ల రద్దు ప్రభావం మరింత భారమైంది. పండిన అరకొర పంట కొనుగోళ్లకు కరెన్సీ కొరత అడ్డుగా నిలుస్తోంది. డబ్బు లేకపోవడంతో పంట కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఇదే అదనుగా కొందరు దళారులు రంగ ప్రవేశం చేసి ధరను సగానికిపైగా తగ్గించి అడుగుతున్నారు. నోట్ల రద్దుకు ముందు గుంటూరు రకం మిర్చి క్వింటాళ్ రూ. 12 వేల నుంచి రూ. 13 వేల వరకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం రూ. 6వేల నుంచి రూ. 7 వేల లోపు అడుగుతున్నారు. అదేవిధంగా రూ. 24వేలతో అమ్ముడు పోయిన డబ్బి రకం మిర్చి రూ. 12 వేలకు మించి అడగడం లేదు. కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్‌కు మిర్చిని తీసుకెళ్లి విక్రయించినా.. కరెన్సీ కొరత ప్రభావంతో మరో నెల రోజులు డబ్బు కోసం ఆగాల్సి వస్తోంది. ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి డి.హీరేహాళ్ మండలంలోని ఎం.హనుమాపురం, మురడి, హొసగుడ్డం, సోమలాపురం, హడగలి, మల్లికేతి, చెర్లోపల్లి తదితర గ్రామాల్లో మిర్చిని విస్తారంగా సాగు చేశారు. ఎకరా విస్తీర్ణంలో మిర్చి సాగు కోసం రూ. లక్షవరకు పెట్టుబడులు పెట్టినట్లు రైతులు మల్లికార్జునరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, వన్నూరు స్వామి, హనుమయ్య, క్రిష్ణ, పరమేశ్వరప్ప తదితరులు తెలిపారు. ప్రస్తుతం ధర పతనం కావడంతో పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి డబ్బు రావడం లేదు నోట్ల రద్దు ప్రభావంతో పెద్దల ఇబ్బంది దేవుడెరుగు, సామాన్య రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. పంట అమ్ముకునేందుకు మార్కెట్‌కు వెళితే... డబ్బు లేదంటూ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఒకవేళ పంట అమ్ముకున్న చేతికి డబ్బు అందడం లేదు. – లక్ష్మిరెడ్డి, సోమలాపురం గ్రామ రైతు ధర పడిపోయింది నీరు లేకపోవడంతో పంట అంతంత మాత్రంగానే వచ్చింది. గతంలో మాదిరిగానే మంచి ధర ఉంటుందని అనుకున్నాం. అయితే నోట్ల రద్దు కారణంగా పంటను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పెట్టబడులు కూడా గిట్టుబాటు కానంత తక్కువ ధరకు పంటను అడుగుతున్నారు. – హనుమయ్య, హడగలి రైతు మిర్చి ధరలు ఇలా ఉన్నాయి... మిరప రకం నోట్ల రద్దుకు ముందు రద్దు తర్వాత డబ్బి కాయ 24,000 12,500 బ్యాడిగి 18,000 12,000 గుంటూరు కడ్డికాయ 13,500 6,000