
రైతులు, వ్యాపారులతో రెండున్నర గంటల సమీక్ష
ధర, కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వని సీఎం.. రైతుల అసహనం
వారం తర్వాత మళ్లీ సమావేశమవుదామన్న చంద్రబాబు
అప్పటికీ ధర రూ.11,781 కంటే తక్కువుంటే కేంద్ర
ప్రభుత్వం ద్వారా కొంటామని స్పష్టీకరణ.. వ్యాపారులు,
ఏజెంట్లు సహకరిస్తే రైతులను ఆదుకుంటామని వెల్లడి
సాక్షి, అమరావతి: ధర పతనమై ఇబ్బంది పడుతున్న మిరప రైతులను ఆదుకొనే విషయంలో సీఎం చంద్రబాబు ఎటూ తేల్చలేదు. ఆయన శనివారం సచివాలయంలో మిర్చి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పటికీ, మిర్చి ధర, కొనుగోళ్లపై రైతులకు స్పష్టత ఇవ్వలేదు. ఎగుమతిదారులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు సహకరిస్తే రైతులను ఆదుకుంటామని చెప్పారు.
వారం, పది రోజుల్లో మరోసారి సమావేశమై, అప్పటికీ మిర్చి ధర పెరగకపోతే, ప్రభుత్వం నిర్దేశించిన క్వింటా ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే కేంద్రం ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామంటూ దాటవేశారు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో కొనుగోళ్లు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో సీఎం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు అసహనం వ్యక్తంచేశారు.
సాగు ఖర్చులు ఏటా పెరిగిపోతున్నాయన్న రైతులు
మిరప సాగుకు ఏటా పెట్టుబడి పెరుగుతోందని, ఎకరాకు రూ. 3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకూ ఖర్చవుతోందని రైతులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. యార్డుకు తెచ్చిన పంటకు ఉదయం నిర్ణయించిన ధర, మధ్యాహ్నానికి క్వింటాకు రూ.500 చొప్పున వ్యాపారులు తగ్గిస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే క్వాలిటీ సరిగా లేదంటున్నారని వాపోయారు.
ఉదయం ఉన్న క్వాలిటీ మధ్యాహ్నానికే ఎలా తగ్గుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. యార్డుకు టిక్కీలు తేవాలంటే లారీల కిరాయి ఖర్చూ ఎక్కువవుతోందని చెప్పారు. యూనియన్‌లో లేని లారీలను బాడిగకు తీసుకొస్తే, వాటి యజమానులను మిగతా లారీ యజమానులు బెదిరించి, కేసులు పెడుతున్నారని చెప్పారు. క్వింటాకు బోనస్ ప్రకటిస్తే రైతులకు మేలు జరుగుతుందని సూచించారు.
క్వాలిటీ, ఎగుమతులు తగ్గాయన్న వ్యాపారులు
ప్రకృతి వైపరీత్యాల వల్ల మిర్చి పంట క్వాలిటీ తగ్గిందని వ్యాపారులు చెప్పారు. కోల్డ్ స్టోరేజీల్లో గతేడాది పంట నిల్వ ఉండడంతో ఈ ఏడాది వచ్చిన పంటను నేరుగా యార్డుకు తెస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది ఎగుమతులు తగ్గడంవల్ల రాష్ట్రంలో మిర్చికి కొంత ధర తగ్గిందని చెప్పారు.
రాష్ట్రంలో పండే మిర్చిలో 60 శాతం విదేశాలకు ఎగుమతి అవుతుందని, 410 మంది ప్రధాన ఎగుమతిదారుల్లో ప్రస్తుతం 250 మందే యాక్టివ్‌గా ఉన్నారని తెలిపారు. కృష్ణపట్నం కంటెయినర్ టెర్మినల్ ద్వారా మిర్చి కంటెయినర్లను అనుమతించాలని కోరారు.
కిరాయి ఎక్కువ వసూలు చేసేలారీ యజమానులపై కఠిన చర్యలు
మిర్చి రైతుల నుంచి కిరాయి ఎక్కువ వసూలు చేసే లారీ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చెప్పారు. యార్డులో ఎలక్ట్రానిక్ కాటాలు ఏర్పాటు చేయాలని, రైతుల ఫోన్లకు మెసేజ్‌లు పంపాలని అన్నారు. కోల్డ్ స్టోరేజీలో టిక్కీలు నిల్వ చేసుకున్న రైతులకు బాండ్ల ఆధారంగా రుణాలిచ్చేలా కృషి చేస్తానన్నారు.
క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. ఈ–క్రాప్‌లో నమోదైన రైతుల వివరాలు, యార్డులో పంటను అమ్ముకున్న రైతుల వివరాల ఆధారంగా సాయం చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment