రోడ్డెక్కిన మిర్చి రైతులు | Mirchi Farmers Protests At Guntur Mirchi Yard Over Affordable Prices For Mirchi In AP, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Mirchi Farmers Protest: రోడ్డెక్కిన మిర్చి రైతులు

Published Wed, Mar 26 2025 6:17 AM | Last Updated on Wed, Mar 26 2025 8:51 AM

Mirchi Farmers Protests at Andhra Pradesh

కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ గుంటూరు మిర్చి యార్డు ఎదుట రోడ్డుపై బైఠాయించిన రైతులు

సాక్షి, ప్రతినిధి గుంటూరు/­కొరిటెపాడు­(గుంటూరు): కూటమి ప్రభుత్వ తీరుతో కడుపు మండిన మిర్చి రైతులు మరోసారి రోడ్డెక్కారు. ‘తేజ’ మిర్చి క్వింటా ధర దారుణంగా పడిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కష్టించి పండించిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి చస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

మరీ ఇంత దారుణమా?
గుంటూరు మిర్చి యార్డులో మంగళవారం ఉదయం తేజ రకం మిర్చి క్వింటా ధర కేవలం రూ.8 వేలు పలకడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఉదయం 9.30 ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున గుంటూరు మిర్చి యార్డు మెయిన్‌ గేట్‌ ఎదుట ఉన్న మెయిన్‌ రోడ్డుపైకి చేరుకొని ధర్నాకు దిగారు. మరీ ఇంత దారుణమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఈ సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మిర్చి యార్డుకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడి.. ధర్నాను విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్‌ కలెక్టర్‌ ఎ.భార్గవతేజ, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు ఇన్‌చార్జి సుబ్రమణ్యం.. రైతుల వద్దకు వచ్చారు. ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించిందని.. అంతకన్నా తగ్గితే రైతుల ఖాతాల్లో మిగిలిన మొత్తాన్ని జమ చేస్తామని భార్గవ తేజ చెప్పారు. 

ప్రభుత్వం ప్రకటించాక.. ధరలు మరింత పతనం.. 
జేసీతో పలువురు రైతులు మాట్లాడుతూ.. గతేడాది తేజతో పాటు మిగిలిన రకాలకు క్వింటా ధర రూ.23 వేలు నుంచి రూ.27 వేల వరకు పలికిందని చెప్పారు. తాలు కాయలకు కూడా రూ.15 వేలు నుంచి రూ.18 వేలు వరకు ధర వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించకముందు.. తేజ రకం రూ.13 వేలు నుంచి 15 వేలు వరకు పలికిందని తెలిపారు. 

ప్రభుత్వం ధర ప్రకటించాక.. నిలువు దోపిడీకి గురవుతున్నామని రైతులు మండిపడ్డారు. ఉదయం క్వింటా ధర రూ.9 వేలు పలికిందని చెబుతున్నారని.. మరో గంట తర్వాత రూ.8 వేలేనంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు 2 శాతం బదులు.. 6 శాతం వరకు కమీషన్‌ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో, కూలీలకు డబ్బులెలా ఇవ్వాలో అర్థం కావడం లేదని వాపోయారు. 
 


జేసీ భార్గవ తేజ స్పందిస్తూ.. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి.. యార్డు నుంచి వెళ్లిపోయారు. దీంతో రైతులు మరోసారి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి ఇక్కడే చస్తామని హెచ్చరించారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

కూలీలకు ఇచ్చేందుకూ సరిపోవు..
నాలుగు ఎకరాల్లో తేజ రకం సాగు చేశా. గతేడాది ఎకరాకు సుమారు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.23 వేల నుంచి రూ.27 వేల వరకు వచ్చాయి. ఈ ఏడాది పెట్టుబడి కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు చేశా. ఇప్పుడు గుంటూరు యార్డుకు తేజ రకం మిర్చి 20 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలుకు అడుగుతున్నారు. ఈ డబ్బులు కూలీలకు కూడా సరిపోవు. ఇవే ధరలు కొనసాగితే ఆత్మహత్య చేసుకోవడమే మార్గం. 
– దారం ఎలీసారెడ్డి, దారంవారిపాలెం, ప్రకాశం జిల్లా

ధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు..
గత 15 ఏళ్లుగా మిర్చి సాగు చేస్తున్నా. ఈసారి రెండు ఎకరాల్లో తేజ రకం వేశా. ఎకరాకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశా. తెగుళ్ల వల్ల దిగుబడి 15 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితి లేదు. గుంటూరు యార్డుకు 40 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలకే అడుగుతున్నారు. మిర్చి ధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు. మా ఇంటిల్లిపాది నెలలు పాటు సేద్యం చేసినా.. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ఇలాగైతే సాగు చేయలేం. 
– గొల్ల చిరంజీవి, పరమాదొడ్డి గ్రామం, కర్నూలు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement