
మిర్చి ధరపై సీఎం చెప్పేదొకటి.. కేంద్ర మంత్రి చెప్పేది మరొకటి
ధర రూ.11,781కు తక్కువగా ఉంటే కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం
కేంద్రం ఎంఎస్‌ఐ ద్వారా రూ.11,781 మద్దతు ధర నిర్ణయించినట్టు ప్రకటించిన పెమ్మసాని
రూ.10,025 కంటే ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని తేల్చిచెప్పిన ఐసీఏఆర్
ధర పెంచాలంటే కేంద్ర కేబినెట్ ఆమోదం కావాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, గుంటూరు/కొరిటెపాడు: మిర్చి రైతులను కూటమి సర్కార్ అనే తెగులు పట్టిపీడిస్తోంది. నష్టాల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు ఎవరికి వారు యమునా తీరు అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. మిర్చి క్వింటాల్‌కు మద్దతు ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుండగా.. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ (ఎంఎస్‌ఐ) కింద రూ.11,781 మద్దతు ధర నిర్ణయించిందంటూ కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నారు. వీరిద్దరి మాటల్లో ఎవరి మాట నమ్మాలి.. అసలు కేంద్రం ఎంతకు ఒప్పుకుందనే విషయంపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. తద్వారా మిర్చి రైతులను కూటమి సర్కార్ అయోమయంలోకి నెడుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
సీఎం ఒకలా.. మంత్రి మరోలా
ఈ నెల 21న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.10,025 కంటే ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్’ (ఐసీఏఆర్) కేంద్రమంత్రికి తేల్చి చెప్పింది. ఈ నెల 22న సీఎం చంద్రబాబు మిర్చి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, అధికారులతో సమీక్ష నిర్వహించి ‘ప్రభుత్వం నిర్దేశించిన ధర క్వింటాల్‌కు రూ.11,781 కంటే తక్కువగా ఉంటే కేంద్రం ద్వారా కొనుగోలుకు చేసేలా చర్యలు తీసుకుంటాం’ అంటూ డొంకతిరుగుడు సమాధానమిచ్చా రు.
గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాత్రం ఓ అడుగు ముందుకేసి ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఎస్‌ఐ) ద్వారా క్వింటాల్‌కు రూ.11,781 మద్దతు ధరను కేంద్రం నిర్ణయించింది. 25 శాతం ఉత్పత్తిని కొనుగోలు చేస్తుంది. అవసరమైతే కొనుగోలు మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది. రైతులకు ఇది కేవలం ఊరట కాదు–బలమైన అండ’ అంటూ ఆయన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు. సీఎం మాటలు ఒకలా ఉంటే.. కేంద్ర మంత్రి చేస్తున్న ట్వీట్‌లు మరోలా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రం నుంచి మాత్రం ఏవిధమైన స్పష్టత రాకపోవడంతో ఎవరి మాటను నమ్మాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు.
ఐసీఏఆర్ నుంచి స్పష్టత లేదు
మద్దతు ధర రూ.11,781గా నిర్దేశించినట్టు గానీ.. 25 శాతం పంటను కొనుగోలు చేస్తామని, అవసరాన్ని బట్టి మరింత పెంచుతామనే విషయాలపై ఏవిధమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విషయంపై ఐసీఏఆర్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ హిమాన్షు పటాక్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా.. ‘ఇటీవలే కేంద్ర మంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది. రైతులకు మేలైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏపీలో సీఎం చంద్రబాబు కూడా సమావేశం నిర్వహించారు.
ఆయన సమావేశం తర్వాత కూడా దీనిపై ఎలాంటి పురోగతి లేదు’ అని ఆయన బదులిచ్చారు. రూ.11,781 మద్దతు ధర ప్రకటించారా అని ప్రశ్నించగా.. సమాధానాన్ని దాటవేశారు. అధికారి మాటలను బట్టి చూసినా పెంపునకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కేంద్రం నుంచి రాలేదనేది స్పష్టమవుతోంది. రూ.10,025 కంటే ఒక్క రూపాయి పెంచాలన్నా.. కేబినెట్ ఆమోదం కావాల్సిందే. కేబినెట్ ఆమోదించకుండా రైతులను గందరగోళానికి గురిచేసే ప్రకటనలు ఇవ్వడంపై కూటమి నేతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హడావుడి తప్ప.. అడుగులేవీ?
మిర్చి రైతులను ఆదుకుంటామని హడావుడి చేసిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది క్వింటాల్ మిర్చికి గరిష్టంగా రూ. 28 వేలు రాగా.. ఈ ఏడాది రూ.13,500 దాటలేదు. అందులోనూ పది శాతం మిర్చికి మాత్రమే గరిష్ట ధర వస్తుండగా, మిగిలిన సరుకు రూ.ఐదారు వేలు దాటడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు విక్రయిస్తే రైతుకు ఎకరానికి రూ.లక్షకు పైగా నష్టం రావడం ఖాయంగా కనపడుతోంది. ప్రస్తుతం గుంటూరు మార్కెట్ యార్డులో రకం, నాణ్యతను బట్టి క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.13 వేల వరకు ధర పలుకుతోంది.
గతేడాది ఫిబ్రవరిలో క్వింటాల్‌కు రూ.20 వేలు నుంచి రూ.28 వేలు పలికింది. గత ఐదేళ్లలో సగటు ధర రూ.22 వేలు తగ్గలేదు. గరిష్టంగా తేజ, 341, నంబర్–5 రకాలకు రూ.27 వేలు వరకూ, బ్యాడిగ రకానికి రూ.30 వేల వరకూ పలికింది. ప్రస్తుతం తేమ శాతం, తాలు సాకులు చూపి ధరలను మరింత తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మార్కెట్‌లోకి వచ్చి కొనుగోళ్లు ప్రారంభిస్తే ధరలు పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు కనీసం రూ.20 వేలు ప్రకటించాలని, అలా అయితేనే పెట్టుబడులు వస్తాయని రైతులు స్పష్టం చేస్తున్నారు.
రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర నష్టం
ఒకటిన్నర ఎకరాల్లో డీలక్స్ రకం మిర్చి సాగు చేశాను. తామర పురుగు, నల్లి, పచ్చదోమ, తెల్లదోమ మిర్చి పంటకు ఆశించడంతో ఎకరాకు రూ.2.50 లక్షల వరకు ఖర్చయ్యింది. మొత్తం కలిపి రూ.3.75 లక్షల వరకు ఖర్చు వచ్చింది. 15 క్వింటాళ్లు ఎరుపు కాయలు, మరో ఐదు క్వింటాళ్లు తెలుపు కాయలు వచ్చాయి. ఎరుపు కాయలు క్వింటా రూ.11 వేలు, తెలుపు కాయలు క్వింటా రూ.4 వేలు ధర పలికింది. దీంతో మొత్తం రూ.1.85 లక్షలు చేతికి వచ్చాయి. వీటిలో కమీషన్ వ్యాపారి ఎంత తీసుకుంటాడో తెలీదు. మొత్తమ్మీద ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు నష్టం వస్తుంది. – కె.శివప్ప, రైతు, దొడ్డిమేకల, కర్నూలు జిల్లా
గిట్టుబాటు ధర కల్పించాలి
పంటకు రకరకాల తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా నల్లతామర, నల్లి, పచ్చ దోమ, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో పురుగు మందులు పిచికారీ చేసేందుకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పురుగు మందుల ధరలు, కూలీ రేట్లు పెరిగిపోయాయి. పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడి తగ్గి నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – తులసీనాయక్, రైతు, గాడితండా, పల్నాడు జిల్లా
ధర పలికితేనే పెట్టుబడి వస్తుంది
నాలుగు ఎకరాల్లో పంట వేశాను. గతేడాది 25 క్వింటాళ్లు వచ్చిన పంట దిగుబడి తెగుళ్లు, వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితులు లేవు. గత ఏడాది క్వింటా రూ.27 వేలు పలికిన తేజ రకం కాయలకు ఇప్పుడు రూ.12 వేలు వేశారు. ఇవే ధరలు కొనసాగితే ఆత్మహత్యలు చేసుకోవడమే మార్గం. కనీసం క్వింటాల్ రూ.20 వేలకు కొంటేనే గట్టెక్కగలం. –భుక్యా శ్రీను నాయక్, రైతు, రేమిడిచర్ల, పల్నాడు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment