Chillies
-
ఘాటు తగ్గుతున్న మిర్చి!
ఖమ్మం వ్యవసాయం: మిర్చి ధర గణనీయంగా పతనమవుతోంది. రెండు, మూడు రోజులుగా ధర బాగా పడిపోయింది. గత ఏడాది పంట సీజన్లో గరిష్టంగా క్వింటాలుకు రూ.22,300 పలికిన మి ర్చి.. ప్రస్తుతం రూ.16 వేలకు దిగజారింది. మోడల్ ధర రూ.19 వేల నుంచి ఉండగా.. ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.13 వేలకు మించి పలకడం లేదు. పంట సీజన్‌తో ధరతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు రూ.10 వేల మేర ధర పడిపోయింది. ప్రస్తుతం గరిష్ట ధరలు రూ.16,700 నుంచి రూ.16 వేలు గా, మోడల్ ధర రూ.15 వేలు మొదలు రూ.13 వేల వరకు పలుకుతున్నాయి. దీంతో అధిక ధరలు ఆశించి మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకొన్న వ్యాపారులు, రైతులు లబోదిబోమంటున్నారు. నాణ్యత లోపం.. ఎగుమతుల మందగమనం కొత్త పంట సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పుడు మార్కెట్‌కు వస్తున్న మిర్చి అంత నాణ్యంగా లేకపోవడం.. విదేశాలకు ఎగుమతులు మందగించడం వల్లనే ధర క్షీణిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మంతోపాటు చుట్టుపక్కల జిల్లాలు, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పండించే ‘తేజ’రకం మిర్చిని చైనా, బంగ్లాదేశ్, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రధానంగా చైనాకు ఎగుమతులు అధికంగా ఉంటాయి.ఏటా జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు చైనాలో పండుగ సీజన్. ఈ సమయంలో అక్కడ పరిశ్రమలు మూతపడతాయి. ఫలితంగా అక్కడి వ్యాపారులు పంటలను కొనుగోలు చేయరు. మిర్చి ధర పతనానికి ఇది ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. మిర్చి మొదటి కోతను మైలకాయ అంటారు. సాధారణంగా మైలకాయ నాణ్యత తక్కువగా ఉండడంతో ధర కూడా తక్కువ పలుకుతుంది. ఇది ఎగుమతులకు పనికిరాదు. కొత్త పంట రాకతో కోల్డ్› స్టోరేజీల్లో నిల్వచేసిన మిర్చికి డిమాండ్ తగ్గుతుంది. దానిని పాత మిర్చిగానే లెక్కిస్తారు. నిల్వ చేసి నష్టాల పాలు గడిచిన పంట సీజన్లో సగటున క్వింటా మిర్చి ధర రూ.20 వేల వరకు పలకగా.. అన్ సీజన్లో రూ.25 వేలకు చేరుతుందని అంతా ఆశించారు. దీంతో ధర మరింత పెరిగిన తర్వా త అమ్ముకోవచ్చన్న ఆశతో వ్యాపారులు, రైతులు పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. రూ.22 వేలు మొదలు రూ.19 వేల వరకు ధర పలికిన సమయాన కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేయగా.. ఇప్పుడు ధర క్ర మంగా పతనమవుతుండడంతో దిక్కుతో చని స్థితిలో పడ్డారు. ఖమ్మం జిల్లాలోని కో ల్డ్ స్టోరేజీల్లో ఇంకా 30 శాతం వరకు మిర్చి నిల్వలు ఉండిపోయాయి. తక్కువ ధరకు అమ్ముదామనుకున్నా కొనేవారు లేరు అని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
డబుల్ మసాలాతో.. నిద్రలేమి!
కొందరు పగటివేళ చురుగ్గా ఉండటానికి ఆహారం తక్కువగా తీసుకుంటూ, రాత్రి మాత్రం ఫుడ్ కాస్త గట్టిగానే తినేస్తుంటారు. రోజువారీ పనులన్నీ పూర్తయ్యాయనే రిలాక్సేషన్, మర్నాటి ఉదయం వరకు మరో పని ఉండదన్న హాయి ఫీలింగ్‌తో ఇలా చేస్తుంటారు. ఇంకొందరు రాత్రి డిన్నర్లలో ‘బిర్యానీ విత్ డబుల్ మసాలా’ అంటూ కాస్త ఎక్కువగానే ఆరగిస్తుంటారు.అయితే రాత్రిపూట తినే ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉన్నా, అదిప్రోటీన్ చాలా ఎక్కువగా ఉండే ఆహారమైనా తినేవాళ్లు నిద్రలేమికి గురయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు స్లీప్ స్పెషలిస్టులు. రాత్రి నిద్రకు ఉపక్రమించే కనీసం రెండుగంటల ముందుగానే లైట్ ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.ఎక్కువ మసాలాలతో పాటు కొన్నిసార్లు కాఫీ, కొవ్వులు, చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలతోనూ నిద్రపట్టకపోవచ్చనీ... హాయిగా నిద్రపట్టాలంటే గోరువెచ్చని పాలు, అరటిపండ్లు, బాదం, తేనె.. వీటిల్లో ఏదైనా తీసుకుంటే, అవి హాయిగా నిద్రపట్టేందుకు దోహదపడతాయన్నది స్లీప్ స్పెషలిస్టుల మాట.ఇవి చదవండి: ఈ యోగా.. సీతాకోక చిలుక రెక్కల్లా మన కాలి కదలికలు.. -
జోరుగా గుంటూరు మిర్చి ఎగుమతులు..కోల్డ్ స్టోరేజీలు ఖాళీ
(బీవీ రాఘవరెడ్డి) కోవిడ్, బ్లాక్ థ్రిప్స్ తెగులు లాంటి అవరోధాలు ఎదురైనా గుంటూరు మిరప ఘాటు ఏమాత్రం తగ్గలేదు. పెద్ద ఎత్తున ఎగుమతి ఆర్డర్లతో ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలన్నీ ఖాళీ అయ్యాయి. సాధారణంగా ఏటా కనీసం 30 శాతం మిర్చి తర్వాత సీజన్ వరకు నిల్వ ఉంటుంది. కోల్డ్ స్టోరేజీల్లో మొత్తం నిల్వలు ముందుగానే ఖాళీ కావటం ఇటీవల ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత 2–3 ఏళ్లుగా ఎండుమిర్చి ధరలు బాగున్నాయి. క్వింటాల్ రూ.10 వేలకు ఎప్పుడూ తగ్గలేదు. క్వింటాల్‌కు రూ.8 వేల కంటే అధిక ధర లభిస్తే రైతన్నకు లాభాలు దక్కుతాయి. గత రెండేళ్లలో దాదాపు 40 శాతం మిరప తోటలు బ్లాక్ థ్రిప్స్ బారిన పడినప్పటికీ మిగిలిన పంటకు మంచి ధర రావటంతో రైతులు అప్పుల పాలు కాకుండా గట్టెక్కారు. వచ్చే సీజన్లోనూ డిమాండ్.. దేశవ్యాప్తంగా మిర్చి ఉత్పత్తి తగ్గుతుండగా డిమాండ్ మాత్రం భారీగా ఉంటుందని వ్యవసాయరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్ ముగిసి హోటళ్లు తిరిగి ప్రారంభం కావటంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మిర్చికి గిరాకీ పెరిగింది. ఇప్పటికే క్వింటాల్ మిర్చి రూ.15,000–30,000 పలుకుతోంది. గత రెండు సీజన్లలో తేజ, బాడిగ రకం గరిష్టంగా రూ.30 వేలు ధర పలికాయి. మిర్చి పండించే కొన్ని రాష్ట్రాల్లో భారీ వరదలు, వర్షాల కారణంగా ప్రస్తుత సీజన్లో పంట విస్తీర్ణం 15–20 శాతం తగ్గిందని అధికార వర్గాలు తెలిపాయి. కొన్నిచోట్ల ఆలస్యంగా విత్తడంతో పాటు వివిధ కారణాల వల్ల పంట రాక కనీసం 45–60 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రానున్న డిసెంబర్ సీజన్లో ఎగుమతులతో పాటు ధరలు 30 – 40 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. స్పైసెస్ పార్కుతో ఎగుమతులకు ఊపు గుంటూరు శివార్లలో ఏర్పాటైన స్పైసెస్ పార్కు గత మూడేళ్లుగా మిర్చి ఎగుమతులు పెరిగేందుకు ఎంతో దోహదం చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ, స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మైదవోలు–వంకాయలపాడు పరిధిలో సుమారు 125 ఎకరాల విస్తీర్ణంలో సుగంధ ద్రవ్యాల పార్కు ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఆరు చోట్ల సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రాలను నెలకొల్పాలని 2007లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో స్పైసెస్ పార్కు మంజూరైంది. దేశవ్యాప్తంగా 60 శాతం మిరప పంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగవుతున్నందున పార్కు కోసం ప్రతిపాదనలు పంపి ఆమోదింపజేశారు. వెంటనే భూసేకరణ చేపట్టి పనులు ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లు వెచ్చించాయి. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 12 ఎకరాల్లో 23 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో నాలుగు గోడౌన్లను నిర్మించింది. వీటికి 200 కేవీఏ సామర్థ్యం గల రెండు సోలార్ యూనిట్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు పార్కు స్థలంలో ప్లాట్లు అభివృద్ధి చేసి పారిశ్రామికవేత్తలకు బోర్డు లీజుకు ఇస్తోంది. ఈ మేరకు 58 ప్లాట్లను సిద్ధం చేయగా 49 ప్లాట్లను 18 మంది పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. ఐటీసీతో సహా సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ఉన్న పలు ప్రముఖ సంస్థలు రూ.120 కోట్ల అంచనా వ్యయంతో సొంత ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మిస్తున్నాయి. ఉత్తమ విధానాలపై శిక్షణ.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుగంధ ద్రవ్యాలు, మసాలా ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువ జోడింపు కోసం స్పైసెస్ పార్కులు ఏర్పాటయ్యాయి. వీటిలో ఉత్పత్తులను శుభ్రపరచడం, గ్రేడింగ్, గ్రైండింగ్, ప్యాకింగ్, నిల్వ చేసేందుకు గోడౌన్లు ఉంటాయి. పవర్ స్టేషన్లు, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థలు, వేయింగ్ బ్రిడ్జిలు, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నాణ్యతా నిర్ధారణకు ల్యాబ్, బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ కౌంటర్లు, రెస్టారెంట్లు, వ్యాపార కేంద్రాలు, గెస్ట్‌హౌస్ తదితరాలు అందుబాటులో ఉన్నాయి. స్పైసెస్ పార్కు తరఫున రైతులు, వ్యాపారులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, అధునాతన ప్రాసెసింగ్ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. మధ్యవర్తుల ప్రమేయం తగ్గించటం ద్వారా రైతులకు మంచి ధర అందించేలా తోడ్పాటు అందిస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుచుకునేందుకు పార్కులో అందుబాటులో ఉన్న సాధారణ ప్రాసెసింగ్ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. తద్వారా నేరుగా ఎగుమతిదారులకు విక్రయించవచ్చు. మూడేళ్లుగా మంచి ధరలు 12 ఎకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేస్తున్నా. గత మూడేళ్లుగా ధరలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎకరాకు 30–35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గత ఏడాది నల్ల పేను (బ్లాక్ థ్రిప్స్) తెగులు కారణంగా 15–20 క్వింటాళ్లకు మించలేదు. ఎకరా మిర్చి సాగుకు రూ.1.20 లక్షలు ఖర్చు అవుతుంది. డిసెంబరు చివరలో మొదటి కోత వస్తుంది. జనవరి చివరికి మూడు కోతలు పూర్తవుతాయి. ఈసారి దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్లకు తగ్గదని భావిస్తున్నా. – బొడ్లపాటి రామిరెడ్డి, రైతు, చేజర్ల, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా ఆరోగ్యానికి మంచిదే ఔషధ గుణాలను కలిగి ఉండే మిర్చిని మితంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ప్రపంచంలో 400 రకాలకు పైగా మిరపకాయలున్నాయి. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో దాదాపు 16 శాతం మిరప కాయలున్నాయి. మిర్చి ఉత్పత్తిలో భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. ఘాటైన మిరప రకం గుంటూరు సన్నం–ఎస్4 విదేశాలకు ఎగుమతి అయ్యే మిరపలో దాదాపు 30 శాతం వాటా గుంటూరు మిర్చిదే. + ఇక్కడ పండే కాయ నాణ్యత బాగుండటంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. -
ఘాటైన మిర్చీలు తిన్నాడు.. ఆపై!
టొరంటో: సాధారణంగా మిర్చీలను తగిన మోతాదులో వాడటం వల్ల వంటకాలకు అదనపు రుచి చేకూరుతుంది. అదే మోతాదుకు మించి వాడితే నోరు మంటపుట్టడంతో పాటు అనేక జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి, మిర్చీలను వంటకాల్లో భాగంగా కాకుండా నేరుగా ఆరగించడమే వృత్తిగా ఎంచుకున్నాడు. అతను ఆరగించే మిర్చీలు నామమాత్రపు ఘాటు ఉండే సాదాసీదా మిర్చీలనుకుంటే పొరపాటు పడ్డట్టే. ప్రపంచ నలుమూలల్లో లభ్యమయ్యే ఘాటైన మిర్చీలను పోటీపడి మరీ ఆరగిస్తుంటాడు. అతను ప్రపంచవ్యాప్తంగా జరిగే చిల్లీ ఈటింగ్ పోటీల్లో పాల్గొంటుంటాడు. కెనెడాకు చెందిన మైక్ జాక్ అనే వ్యక్తి ప్రపంచంలో అత్యంత ఘాటైన మిర్చీలుగా ప్రసిద్ధి చెందిన మూడు కరోలినా రీపర్ మిర్చీలను 10 సెకెన్లలోపు(9.72 సెకెన్ల) ఆరగించి 4 గిన్నీస్ ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విషయాన్ని గిన్నీస్ ప్రపంచ రికార్డుల ప్రతినిధులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, మైక్ గతంలో కూడా అనేక మిర్చీలు ఆరగించే పోటీల్లో పాల్గొని మూడు ప్రపంచ రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. అతను మున్ముందు ఎనిమిది కరోలినా రీపర్ మిర్చీలను తినడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని గిన్నీస్ రికార్డుల సంస్థ వెల్లడించింది. -
మిర్చి ‘ధర’హాసం
సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా కష్టకాలంలోనూ మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి వచ్చే సమయానికి కరోనా వైరస్ వ్యాప్తితో గుంటూరు మార్కెట్ యార్డు మూతపడి లావాలాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రైతులు తాము పండించిన మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని 118 కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు కోటి టిక్కీలకు పైగా సరుకు నిల్వ చేశారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అమ్మకాలు మొదలైన 60 లక్షల టిక్కీలను విక్రయించగలిగారు. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 40 లక్షలకు పైగా మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నాయి. (చదవండి: మిరపకాయలతో గుండెపోటుకు చెక్!) కలిసొచ్చిన ఎగుమతులు ►గత నెలతో పోలిస్తే ఈ నెలలో మిర్చి ధరలు క్వింటాకు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెరిగాయి. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మిర్చి పంట ఆలస్యం కావడంతో మన రాష్ట్రంలోని మిర్చికి డిమాండ్ పెరిగింది. ►దీనికి తోడు సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్ దేశాల నుంచి ఆర్డర్లు రావడం మిర్చి రైతులకు కలిసొచ్చింది. ►గుంటూరు జిల్లాలో దాదాపు 1.95 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ►దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, ధరలు సైతం బాగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఊపందుకున్న విక్రయాలు ►కరోనా నేపథ్యంలో మార్కెట్ యార్డులో మిర్చి క్రయ, విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. అనంతరం క్రయవిక్రయాలు మొదలైనా రోజుకు కేవలం 10 వేల టిక్కీల లోపు మాత్రమే అమ్ముడయ్యేవి. ►సొంత గ్రామాలకు వెళ్లిన కూలీలు తిరిగి రావడం, ధరలు సైతం పెరగడంతో మిర్చి క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. ►గుంటూరు మార్కెట్ యార్డులో ప్రస్తుతం రోజుకు సగటున 20 వేల టిక్కీల వరకు మిర్చి లావాదేవీలు జరుగుతున్నాయి. ►బయట కోల్డ్ స్టోరేజీల్లో సైతం రోజుకు 30 వేల టిక్కీల వ్యాపారం సాగుతోంది. రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి క్రయ, విక్రయాలు ఊపందుకున్నాయి. రైతులు పంటను విక్రయించుకోవడానికి వీలుగా అన్ని వసతుల్ని మార్కెట్ యార్డులో కల్పిస్తున్నాం. ధరలు సైతం స్థిరంగా ఉండి కొంత పెరగడంతో రైతులు సరుకును అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. – వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి, గుంటూరు (చదవండి: ఇదీ పౌష్టికాహార మెనూ..) -
మిరపకాయలతో గుండెపోటుకు చెక్!
న్యూఢిల్లీ : భోజనంలో వారానికి నాలుగుసార్లు మిరప కాయలు తింటే గుండె పోటు వచ్చే ప్రమాదం దాదాపు 40 శాతం తగ్గుతుందట. ఇటలీకి చెందిన పరిశోధకులు 23 వేల మంది వాలంటీర్లపై ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘ అధ్యయనం జరిపి ఈ విషయాన్ని కనుగొన్నారు. మిరపకాయల్లో ఉండే ‘యాంటి ఆక్సిడెంట్’ గుణం కలిగిన ‘క్యాప్సేసియన్’ పదార్థం వల్లనే గుండెకు రక్షణ కలుగుతోందని వారు తేల్చారు. ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన డైట్‌గా పరిగణిస్తున్న ‘మెడిటెరేనియన్ డైట్ (మధ్యస్థ డైట్)’ను ఎక్కువగా తీసుకొనే ఇటలీలోని మొలిస్ ప్రాంతానికి చెందిన ప్రజలపై ఈ పరిశోధనలు జరిపారు. ఆ ప్రాంతం ప్రజలు ఎక్కువగా కూరగాయలు, గింజ ధాన్యాలు, పండ్లు, చేపలు తీసుకొని తక్కువగా గుడ్లు, మాంసం తీసుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్న వారిపై పరిశోధనలు జరపడం వల్లనే తమకు మంచి ఫలితాలు లభించాయని పరిశోధకులు చెబుతున్నారు. 23 వేల మంది ఆహార అలవాట్లను పర్యవేక్షించగా ఎనిమిదేళ్ల కాలంలో 1236 మంది మరణించారని. వారిలో క్యాన్సర్ కారణంగా మూడొంతుల మంది మరణించగా, గుండె పోటు కారణంగా కూడా దాదాపు అంతే మంది మరణించారని పరిశోధకులు తెలిపారు. గుండెపోటుతో మరణించిన వారిలో మూడొంతుల మంది ఎప్పుడు మిరపకాయలు భోజనంలో తీసుకోలేదని, కేవలం 24 శాతం మంది మాత్రమే తీసుకున్నారని పరిశోధకులు తేల్చారు. చనిపోయిన వారి వయస్సు, వారి ఆహారపు అలవాట్లను పరిగణలోకి తీసుకొని అధ్యయనం జరపడం ద్వారా వారానికి నాలుగుసార్లు ఆహారంలో మిరపకాయలను తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తక్కువని వారు నిర్ధారించారు. ఈ అధ్యయనం వివరాలను ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలోజీ’ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. పర్చి మిరపకాయలు తినాలా, ఎర్రటి మిరప కాయలు తినాలా? వాటిని ఎలా తినాలో మాత్రం వారు అందులో వెల్లడించలేదు. ఇటలీ ప్రజలు వారికి అక్కడ దొరికే ఎర్రటి మిరప కాయలనే తింటారు. వారు వాటిని మసాలా దట్టించి కానీ, పలు రకాల సాస్లతోగానీ తింటారు. అలా వారానికి నాలుగు సార్లు తింటే చాలట. -
ఉల్లి రైతు కుటుంబాన్ని ఆదుకునేదెప్పుడు?
మూడేళ్లుగా పంటలు సక్రమంగా పండక, గిట్టు బాటు ధర లేక, పొలానికి పెట్టిన పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో బోయ తలారి గిడ్డయ్య ఒకరు. అతనిది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్ మండల పరిధిలోని దైవందిన్నె గ్రామం. గిడ్డయ్య(42) అప్పుల బాధతో గత ఏడాది ఆగస్టు 11వ తేదీన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో రెండేళ్లు వరుసగా మిరప, ఉల్లి పంటల సాగు చేశారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటంతో అప్పులపాయ్యాడు. దాదాపు రూ. 10 లక్షల వరకు అప్పు తేలింది. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావటంతో కృంగిపోయాడు. ఆ నేపథ్యంలో 2018 ఆగస్టు 11న ఉల్లి పంట కోసి పొలంలో కుప్ప వేశాడు. ఉల్లికి ధర మరీ తక్కువగా ఉండటంతో కోసిన పంటను పొలంలోనే వదిలేసి నిర్వేదంతో గిడ్డయ్య ఇంటికి వచ్చాడు. అదేరోజు ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడికి భార్య రామలక్ష్మి, కుమారులు చంద్రశేఖర్ నాయుడు(10 వ తరగతి), మల్లికార్జున(9వ తరగతి) ఉన్నారు. తండ్రి మరణించటంతో చదువు మానేసి పొట్ట కూటి కోసం పనులకు వెళ్తున్నారు. పెద్ద కుమారుడు చంద్రశేఖర్ ఫర్టిలైజర్ కంపెనీలో పనిచేస్తుంటే, చిన్నకుమారుడు మల్లికార్జున తల్లికి తోడుగా పనికి వెళ్తున్నాడు. గిడ్డయ్య ఆత్మహత్య చేసుకొని ఆరు నెలలైనప్పటికీ అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలేదు. అప్పులిచ్చిన వారు డబ్బు కట్టమని గిడ్డయ్య భార్య, పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. పొలం అమ్మి అయినా అప్పులు తీర్చుదామనుకొని బేరం పెడితే.. కొనటానికి ఎవరూ ముందుకు రాలేదని రామలక్ష్మి వాపోయింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి తమ కుటుంబం వీధిన పడినా ప్రభుత్వం కనికరించడం లేదని కళ్ల నీరు కుక్కుకుంటున్నదామె. ఎప్పటికైనా ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశతోనే బతుకుతున్నామని తెలిపిందామె. – నాగరాజు సాక్షి, ఎమ్మిగనూరు రూరల్, కర్నూలు జిల్లా -
తీపి పచ్చళ్లు
బెల్లం చుట్టూ చీమలు చేరడం పాత ముచ్చట.కారం చుట్టూ తిరగడం మామూలు ఇచ్చట.తీపి పచ్చళ్లంటే అందరికీ మమకారమే.కారంలో తీపి కలపడం రుచికి గుణకారమే.ఎండాకాలం వచ్చిందంటే చాలు, ఇల్లాళ్ల చేతులు వేగం పుంజుకుంటాయి. జాడీలు ప్రాణం పోసుకుంటాయి. నాలుకలు కొత్త ఆవకాయ ఘాటు కోసం చెవులు కోసుకుంటాయి. మరి కారపు పచ్చళ్లలో వెరైటీగా కొంచెం తీపిని కూడా మిళాయిస్తే ఆ ఘుమఘుమే వేరు, ఆ మధురిమే కొత్త తీరు.మామిడికాయ, ఖర్జూరం, టొమాటో, జామకాయ, నిమ్మకాయ, బీట్రూట్, పచ్చిమిరప, అల్లం, క్యారెట్, కీరదోస, కాలీఫ్లవర్ లాంటి పచ్చళ్లను ఈసారి కొత్తగా ప్రయత్నించండి. ఇల్లంతా తియ్యటి వేడుక చేసుకోండి. నిమ్మకాయ ఊరగాయ కావలసినవి: నిమ్మకాయలు – 12, ఉప్పు – 3 టేబుల్ స్పూన్లు, బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పులు, ఏలకుల పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. ఆపైన వాటిని ముక్కలుగా చేసి, గింజలను తొలగించాలి. ఇప్పుడు ఓ జాడీ తీసుకొని, అందులో నిమ్మకాయ ముక్కలు, ఉప్పు కలపాలి. ఆ జాడీ పదిహేను రోజుల వరకు పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పదిహేను రోజుల తర్వాత ఆ నిమ్మ ముక్కలను ఓ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి అర కప్పు నీళ్లు పోయాలి. అందులో బెల్లం వేసి బాగా కలపాలి. మిశ్రమం గట్టిపడుతుండగా ఏలకుల పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత దాంట్లో నిమ్మ ముక్కలు, అల్లం పేస్ట్, గరం మసాలా, కారం వేసి కలుపుకోవాలి. మిశ్రమం బాగా దగ్గరకయ్యాక జాడీలోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి ఊరగాయ కావలసినవి: పచ్చి మిర్చి (ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉన్నవి) తరుగు – 1 కప్పు, నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు – 2 టీ స్పూన్లు, ఆవాలు – 1 టీ స్పూన్, అల్లం తరుగు – అర టీ స్పూన్, చింతపండు గుజ్జు (నానబెట్టిన తర్వాత వచ్చే గుజ్జు) – పావు కప్పు, బెల్లం తరుగు – అర కప్పు, కారం పొడి – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా నువ్వులు, ఆవాలను వేయించుకొని పొడి చేసుకోవాలి. ఆపైన స్టవ్‌పై మూకుడు పెట్టి నూనె పోయాలి. అందులో పచ్చి మిర్చి, అల్లం తరుగు వేసి కలపాలి. నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మూకుడు దించుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై మరో పాన్ పెట్టి చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేయాలి. మిశ్రమం వేడయ్యాక, నువ్వులు–ఆవాల పొడి, బెల్లం తరుగు వేసి కలపాలి. మిశ్రమం దగ్గరకయ్యాక దింపేసుకోవాలి. ఆపైన అందులో పచ్చి మిర్చి, అల్లం మిశ్రమం వేసి మరో రెండు నిమిషాల పాటు వేడి చేయాలి. తర్వాత మిశ్రమం పూర్తిగా చల్లారాక జాడీలోకి తీసుకోవాలి. ఖర్జూరం ఊరగాయ కావలసినవి: పచ్చి ఖర్జూరాలు – 2 కప్పులు, అల్లం తరుగు – 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తరుగు – 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్, మెంతుల పొడి – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్ ఇంగువ – అర టీ స్పూన్, వెనిగర్ – 1 టీ స్పూన్, ఆవాల పొడి – 1 టేబుల్ స్పూన్, బెల్లం తరుగు – 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మ – 1, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా పాన్‌లో నూనె పోయాలి. అందులో కరివేపాకు, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి కలపాలి. ఆ పైన ఖర్జూరం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు, మెంతుల పొడి, కారం, ఆవాల పొడి, ఉప్పు వేయాలి. చివరగా బెల్లం తరుగు, వెనిగర్ వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరకయ్యాక స్టవ్‌ను ఆఫ్ చేసుకోవాలి. బెల్లం ఆవకాయ కావలసినవి: మామిడి కాయలు – 3, ఆవాలు – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం పొడి – 2 టేబుల్ స్పూన్లు, మెంతుల పొడి – 1 టీ స్పూన్, ఉప్పు – రెండున్నర టేబుల్ స్పూన్లు, బెల్లం తరుగు – 1 కప్పు, ఇంగువ – పావు టీ స్పూన్, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా మామిడి కాయలను ముక్కలుగా చేసుకోవాలి. ఓ బౌల్లో వాటిని తీసుకొని, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని ఓ రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. తెల్లవారాక దాంట్లోని నీటినంతా పారబోసి, ముక్కలను మూడురోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. నాలుగోరోజు, రెండు కప్పుల నీళ్లను మరిగించుకోవాలి. తర్వాత అందులో ఎండిన ముక్కలను వేసి ఓ గంటపాటు పక్కన పెట్టాలి. మరోవైపు బెల్లాన్ని పాకం పట్టుకోవాలి (పాకం ముదురు కాకుండా చూసుకోవాలి). మామిడి ముక్కలను మరో బౌల్లోకి తీసుకొని, కారం, మెంతుల పొడి, ఉప్పు వేసి కలపాలి. ఆపైన అందులో బెల్లం పాకం వేయాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. అందులో ఆవాలు, ఇంగువ వేసి, ఆ పైన మామిడి మిశ్రమాన్ని వేసి కలపాలి. చివరగా ఆవకాయను జాడీలోకి తీసుకోవాలి. టొమాటో ఊరగాయ కావలసినవి: టొమాటో ముక్కలు – అర కప్పు, నూనె – 1 టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం పొడి – అర టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, బెల్లం తరుగు – 3 టీ స్పూన్లు, ఆవాల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. అందులో టొమాటో ముక్కలు వేసి మూడు నిమిషాల పాటు ఉంచాలి. ఆపైన అందులో ఇంగువ, ఆవాల పొడి, పసుపు, కారం, ఉప్పు, బెల్లం వేసి కలపాలి. పాన్‌పై మూత పెట్టి మిశ్రమం దగ్గరకయ్యే వరకు ఉడకనివ్వాలి. ఆపైన దాన్ని దింపేసి, జాడీలోకి తీసుకోవాలి. కీరదోస పచ్చడి కావలసినవి: కీరదోస – 6 (నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి), ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, చక్కెర – అర కప్పు, ధనియాల పొడి – 1 టీ స్పూన్, ఆవాల పొడి – 1 టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి – కొద్దిగా, లవంగాల పొడి – పావు టీ స్పూన్, నూనె – సరిపడా తయారీ: ముందుగా స్టవ్ వెలిగించుకుని, ఒక మూకుడు తీసుకుని అందులో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో కీర ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసుకుని వేయించు కోవాలి. తర్వాత అందులో చక్కెర వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే ధనియాల పొడి, లవంగాల పొడి, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, ఆవాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పచ్చడి కావలసినవి: అల్లం ముక్కలు – 1 కప్పు, పసుపు– పావు టీ స్పూన్, చింతపండు గుజ్జు – పావు కప్పు, బెల్లం తరుగు – అర కప్పు, కారం పొడి – 5 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, మెంతుల పొడి – ముప్పావు టేబుల్ స్పూన్, ఆవాలు – 1 టీ స్పూన్, నూనె – పావు కప్పు, ఎండు మిర్చి ముక్కలు – 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, ఇంగువ – చిటికెడు తయారీ: ముందుగా అల్లం ముక్కలను కొద్దిగా వేయించి, మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో చింతపండు గుజ్జు, కారం, పసుపు, ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓ బౌల్లోకి తీసుకోవాలి. అందులో మెంతుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. తర్వాత ఆవాలు, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి, ఇంగువ వేసి కలపాలి. ఆపైన దాంట్లో అల్లం మిశ్రమాన్ని వేసి ఓ నిమిషం తర్వాత దింపేసుకోవాలి. చల్లారాక జాడీలోకి తీసుకోవాలి. జామకాయ పచ్చడి కావలసినవి: జామకాయ గుజ్జు (దోర కాయలను ముక్కలుగా చేసి మిక్సీలో వేయాలి)– ఒకటిన్నర కప్పులు, నూనె – 1 టేబుల్ స్పూన్, మెంతుల పొడి – పావు టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, బెల్లం తరుగు – 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. అందులో బెల్లం తరుగు, ఇంగువ వేయాలి. అర నిమిషం తర్వాత మిరియాల పొడి, కారం, మెంతుల పొడి వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగేవరకు స్టవ్‌ను మీడియం మంట పైనే ఉంచాలి. ఆ పైన సిమ్‌లో పెట్టి జామకాయ గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. మిశ్రమం దగ్గరకయ్యాక దింపేసి, చల్లారాక జాడీలోకి తీసుకోవాలి. వెల్లుల్లి ఊరగాయ కావలసినవి: వెల్లుల్లి రెబ్బలు – 1 కప్పు, నువ్వుల నూనె – పావు కప్పు, ఆవాలు – 1 టీ స్పూన్, ఇంగువ –పావు టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, కారం – రుచికి తగ్గట్టు, పసుపు – చిటికెడు, చింతపండు గుజ్జు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, నీళ్లు – ఒకటిన్నర కప్పులు, ఉప్పు – తగినంత, బెల్లం తరుగు – రెండున్నర టేబుల్ స్పూన్లు, మెంతుల పొడి – అర టీ స్పూన్ తయారీ: ముందుగా నూనెను వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసి, అవి వేగగానే కరివేపాకు, ఇంగువ వేసుకుని బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంలో వెల్లుల్లి రెబ్బలు వేసుకుని నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు కారం, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు జత చేసి మరోమారు కలపాలి. ఇప్పుడు బెల్లం తరుగు, మెంతుల పొడి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుంటూ దగ్గరయ్యే వరకు ఉడికించి దింపేయాలి. చల్లారాక ఒక జాడీలోకి తీసుకోవాలి. క్యారెట్ ఊరగాయ కావలసినవి: క్యారెట్ తురుము – 3 కప్పులు, అల్లం + వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్లు, ఆవాల పొడి – 1 టీ స్పూన్, మెంతుల పొడి – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, బెల్లం తరుగు – పావు కప్పు, నిమ్మ కాయలు – 2 లేదా 3(మీడియం సైజ్), కారం – 2 టీ స్పూన్లు, ఆవాల పొడి –పావు టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, పసుపు – చిటికెడు, నూనె – పావు కప్పు, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా నూనెను వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో క్యారెట్ తురుము, పసుపు, కారం, ఇంగువ, ఉప్పు, అల్లం + వెల్లుల్లి పేస్ట్ జత చేసుకుని గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో బెల్లం వేసుకుని కలుపుకోవాలి. తర్వాత అన్ని పొడులను మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని జాడీలోకి తీసుకోవాలి. బీట్రూట్ ఊరగాయ కావలసినవి: బీట్రూట్ – 3 (మీడియం సైజ్), చక్కెర – 1 టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, వెనిగర్ – పావు కప్పు, నీళ్లు – పావు కప్పు, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా బీట్రూట్ను బాగా కడిగి, తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఒక పాత్రలో బీట్ రూట్ ముక్కలకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టవ్ మీద ఉంచి ఉడికించాలి. తర్వాత వెనిగర్‌తో పాటు చక్కెర వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని ఇంకాస్త ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకుని నిల్వ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఊరగాయ కావలసినవి: కాలీఫ్లవర్ – 1 (మీడియం సైజ్), ఉల్లిపాయ గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 4, ఆవాలు – 1 టీ స్పూన్, నిమ్మరసం – పావు కప్పు, వెల్లుల్లి గుజ్జు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, కారం – 2 టేబుల్ స్పూన్స్, నూనె – పావు కప్పు, చక్కెర – ఒకటిన్నర కప్పు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు అందులో నిమ్మరసం, వెల్లుల్లి గుజ్జు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నాన్‌స్టిక్ పాత్రలో నూనె వేసుకుని కాస్త వేడిగా అయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలను చెంచాతో తిప్పుతూ వెల్లుల్లి మిశ్రమం, కారం, చక్కెరను అందులో వేసుకుని బాగా కలుపుకుని ఉడికించాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసుకుని ఇంకాసేపు ఉడికించాలి. ఆ తర్వాత దాన్ని జాడీలోకి తీసుకోవాలి. -
ఈ రికార్డు చాలా ‘హాట్’ గురూ..!
ఎంతటి భోజనప్రియులైనా ఏదో కాస్త అభి‘రుచి’ కోసం... రుచుల మీద మమ‘కారం’ కొద్దీ ఒకటో రెండో మిరపకాయలను నమలొచ్చు. సాదాసీదా మిరపకాయలైతే కాస్త గట్టిపిండాలు ఓ గుప్పెడు వరకు లాగించేస్తారు. కాస్త కొరకగానే మంట నసాళానికెక్కేలా చేసే ‘భూత్ జొళొకియా’ మిరపకాయలను ఎవరైనా ఎన్ని నమలగలరు? ఆ రకం మిరపకాయను ఒక్కటి పూర్తిగా తినడమే మామూలు మానవులకు సాధ్యం కాదు. అలాంటిది జాసన్ మెక్ నాబ్ అనే ఈ అమెరికన్ యువకుడు ఏకంగా 66 గ్రాముల ‘భూత్ జొళొకియా’ మిరపకాయలను రెండు నిమిషాల్లోనే పరపరా నమిలేసి గిన్నెస్రికార్డు బద్దలుకొట్టాడు.