భారీగా పడిపోతున్న మిర్చి ధర
గత సీజన్‌తో పోల్చితే రూ.10 వేలు తగ్గుదల
కొత్త పంట రాకతో పాత మిర్చికి తగ్గిన డిమాండ్
నాణ్యత లేమితో పడిపోయిన ఎగుమతులు
ఖమ్మం వ్యవసాయం: మిర్చి ధర గణనీయంగా పతనమవుతోంది. రెండు, మూడు రోజులుగా ధర బాగా పడిపోయింది. గత ఏడాది పంట సీజన్‌లో గరిష్టంగా క్వింటాలుకు రూ.22,300 పలికిన మి ర్చి.. ప్రస్తుతం రూ.16 వేలకు దిగజారింది. మోడల్ ధర రూ.19 వేల నుంచి ఉండగా.. ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.13 వేలకు మించి పలకడం లేదు. పంట సీజన్‌తో ధరతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు రూ.10 వేల మేర ధర పడిపోయింది. ప్రస్తుతం గరిష్ట ధరలు రూ.16,700 నుంచి రూ.16 వేలు గా, మోడల్ ధర రూ.15 వేలు మొదలు రూ.13 వేల వరకు పలుకుతున్నాయి. దీంతో అధిక ధరలు ఆశించి మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకొన్న వ్యాపారులు, రైతులు లబోదిబోమంటున్నారు.
నాణ్యత లోపం.. ఎగుమతుల మందగమనం
కొత్త పంట సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పుడు మార్కెట్‌కు వస్తున్న మిర్చి అంత నాణ్యంగా లేకపోవడం.. విదేశాలకు ఎగుమతులు మందగించడం వల్లనే ధర క్షీణిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మంతోపాటు చుట్టుపక్కల జిల్లాలు, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పండించే ‘తేజ’రకం మిర్చిని చైనా, బంగ్లాదేశ్, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రధానంగా చైనాకు ఎగుమతులు అధికంగా ఉంటాయి.
ఏటా జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు చైనాలో పండుగ సీజన్. ఈ సమయంలో అక్కడ పరిశ్రమలు మూతపడతాయి. ఫలితంగా అక్కడి వ్యాపారులు పంటలను కొనుగోలు చేయరు. మిర్చి ధర పతనానికి ఇది ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. మిర్చి మొదటి కోతను మైలకాయ అంటారు. సాధారణంగా మైలకాయ నాణ్యత తక్కువగా ఉండడంతో ధర కూడా తక్కువ పలుకుతుంది. ఇది ఎగుమతులకు పనికిరాదు. కొత్త పంట రాకతో కోల్డ్› స్టోరేజీల్లో నిల్వచేసిన మిర్చికి డిమాండ్ తగ్గుతుంది. దానిని పాత మిర్చిగానే లెక్కిస్తారు.
నిల్వ చేసి నష్టాల పాలు
గడిచిన పంట సీజన్‌లో సగటున క్వింటా మిర్చి ధర రూ.20 వేల వరకు పలకగా.. అన్ సీజన్‌లో రూ.25 వేలకు చేరుతుందని అంతా ఆశించారు. దీంతో ధర మరింత పెరిగిన తర్వా త అమ్ముకోవచ్చన్న ఆశతో వ్యాపారులు, రైతులు పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. రూ.22 వేలు మొదలు రూ.19 వేల వరకు ధర పలికిన సమయాన కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేయగా.. ఇప్పుడు ధర క్ర మంగా పతనమవుతుండడంతో దిక్కుతో చని స్థితిలో పడ్డారు. ఖమ్మం జిల్లాలోని కో ల్డ్ స్టోరేజీల్లో ఇంకా 30 శాతం వరకు మిర్చి నిల్వలు ఉండిపోయాయి. తక్కువ ధరకు అమ్ముదామనుకున్నా కొనేవారు లేరు అని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment