
ఖమ్మంలో స్వయం సహాయక సంఘాల ‘స్త్రీ టీ క్యాంటీన్లు’
వారికి శిక్షణ, యూనిట్ల కేటాయింపు
చొరవ చూపినకలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్
విజయవంతంగా నడుస్తున్న 22 క్యాంటీన్లు.. మరో 300 యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ
ఒక్కో క్యాంటీన్‌కు బ్యాంకు లింకేజీతో రూ.1.5 లక్షల రుణం
రోజూ ఇంట్లో పొద్దున్నే చాయ్ చేసి కుటుంబసభ్యులకు అందించే చేతులు.. ఇప్పుడు అదే చాయ్‌తో, అదే కుటుంబానికి ఆదాయాన్ని అందిస్తున్నాయి. స్వయం ఉపాధితోపాటు మరొకరికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో స్త్రీ టీ క్యాంటీన్లు నడుపుతున్న మహిళల విజయ ప్రస్థానమిది. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ చొరవతో ఏర్పాటైన ఈ క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. దీంతో మరికొన్ని క్యాంటీన్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. - సాక్షి ప్రతినిధి, ఖమ్మం
ఉపాధి కల్పనే లక్ష్యం
స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గం చూపించాలని భావించిన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్.. అందుకోసం వారితో టీ క్యాంటీన్లు ఏర్పాటు చేయించాలని సంకల్పించారు. అందుకోసం అన్ని శాఖల అధికారులతో చర్చించి ముందుడుగు వేశారు. టీ క్యాంటీన్‌కు ప్రత్యేక లోగో, బ్రాండ్ తయారు చేయించారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మొదటి విడతలో జిల్లాలో 41 షాపులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. తొలి షాపును కలెక్టరేట్ వద్దే ప్రారంభించారు.
కలెక్టరేట్ ఆవరణలోని క్యాంటీన్ ఆదాయంతో పోలిస్తే గేటు బయట ఏర్పాటైన స్త్రీ టీ క్యాంటీన్‌కు రెట్టింపు ఆదాయం వస్తుండటంతో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10, మండలాల్లో మరో 30కి పైగా మంజూరు చేశారు. ప్రస్తుతం 22 టీ క్యాంటీన్లను నడుస్తున్నాయి. మొత్తం 300 వరకు స్త్రీ టీ క్యాంటీన్లు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి ఏర్పాటుకు బ్యాంకు లింకేజీతో సంఘం తరఫున రూ.1.5 లక్షల వరకు రుణం అందిస్తున్నారు. సంఘంలోని మహిళలందరికీ ఒకటే కాకుండా అర్హత, ఆసక్తిని బట్టి ఒక్కొక్కరికి ఒక క్యాంటీన్ కేటాయిస్తున్నారు.
నిరంతరం పర్యవేక్షణ...
స్త్రీ టీ క్యాంటీన్ మంజూరు చేసే సమయంలో లబ్ధిదారులు గతంలో ఏదైనా వ్యాపారం చేశారా లేదా? అన్నది పరిగణనలోకి తీసుకున్నారు. యూనిట్ కేటాయించాక ఏ మేరకు లాభాలుంటాయనే అంశంపై రెండు నెలలపాటు మండల, జిల్లా సమాఖ్యల్లో చర్చించారు. చట్టాలు, పన్నుల చెల్లింపు, వ్యాపార నిర్వహణపై 400 మంది మహిళలకు హైదరాబాద్‌కు చెందిన నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ఆపై రద్దీ ప్రాంతాలను గుర్తించి క్యాంటీన్లు ఏర్పాటుచేయించారు.
అంతటితో వదిలేయకుండా మూడు నెలల పాటు వాటి నిర్వహణ, లాభాలను పరిశీలిస్తున్నారు. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఈ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. యూనిట్లలో దివ్యాంగులకు 25 శాతం కేటాయించారు. టీతోపాటు కూల్‌డ్రింక్స్, ఇతరత్రా కలిపి కాస్త పెద్ద యూనిట్లు కూడా ఏర్పాటుచేయించాలని నిర్ణయించారు. ఇవి ఖమ్మం కార్పొరేషన్‌లో మూడు, మండలాల్లో 10 వరకు ఏర్పాటు కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ఇవి గ్రౌండ్ అవుతాయి. పదేళ్ల తర్వాత కూడా కొనసాగాలనే సంకల్పంతో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఇంకొకరికి ఉపాధి
గ్రామంలో మాకు టీ స్టాల్ ఉన్నా పెద్దగా ఆదాయం ఉండేది కాదు. కలెక్టర్ ఇచ్చిన అవకాశంతో కలెక్టరేట్ వద్ద టీ స్టాల్ పెట్టాను. ఇప్పుడు మరొకరికి ఉపాధి కల్పిస్తున్నా. నెలకు రూ.30 వేల వరకు ఆదాయం వస్తుండగా, రూ.10 వేలు మిగులుతున్నాయి. – పోతగాని రాజేశ్వరి, స్త్రీ టీ క్యాంటీన్ ఓనర్, కలెక్టరేట్ బస్టాప్, ఖమ్మం.
స్వయం ఉపాధి లభించింది..
మా స్త్రీ టీ క్యాంటీన్ గతనెల 4న ప్రారంభమైంది. ప్రస్తుతం టీ, కాఫీ, అల్లం టీ అమ్ముతున్నాం. కరెంట్ సౌకర్యం రాగానే పాలు, పెరుగు కూడా అమ్ముతాం. రోజురోజుకు వ్యాపారం పుంజుకుంటోంది. మొదటి నెల రూ.50 వేలు వచి్చంది. రుణ కిస్తీ చెల్లించగా.. కొంత మిగులుతోంది. – శ్రీరంగం గీత, జలగం నగర్, నవ్య గ్రామసమాఖ్య.
మహిళల ఆర్థిక ఎదుగుదల కోసమే..
మహిళలు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో స్త్రీ టీ క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. ప్రభుత్వం తరఫున యూనిట్ గ్రౌండింగ్ చేశాం కదా అని వదిలేయకుండా స్థల గుర్తింపు, ఏమేం అమ్మాలి, నాణ్యతపై క్షుణ్ణంగా చర్చించి, శిక్షణ ఇప్పించాకే ముందడుగు వేశాం. యూనిట్ ఏర్పాటయ్యాక నిత్యం పరిశీలిస్తూ ఏళ్ల తరబడి కొనసాగేలా చూస్తున్నాం. – ముజమ్మిల్‌ఖాన్, కలెక్టర్, ఖమ్మం.
Comments
Please login to add a commentAdd a comment