నైజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన జిల్లా ప్రజలు
ఆకట్టుకుంటున్న పర్యాటక ప్రాంతాలు ఖమ్మం కోటకు ఘన చరిత్ర
ఖమ్మం మయూరి సెంటర్: చారిత్రక నేపథ్యం కలిగిన ఖమ్మం జిల్లాను 1953లో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఖమ్మం జిల్లా.. వరంగల్ జిల్లాలో భాగంగా ఉంది. ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. అలాగే 1959లో అప్పటివరకు తూర్పుగోదావరి జిల్లాలోని భద్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్లను జిల్లాలో కలిపారు. ఈ జిల్లా భూభాగం వేర్వేరు రాజవంశాల కాలాల్లో వేరుగా ఉంది.
ఖమ్మం నగరం మధ్యలోని స్తంభాద్రి నుంచే మండపాలు, స్తంభాలకు కావల్సిన రాళ్లు తరలిస్తూ ఉండేవారు. అందుకే ఖమ్మంకు స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉంది. చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు.. నగరంలోని నృసింహాద్రి అని పిలిచే నారసింహాలయం నుంచి వచి్చనట్లు, కాలక్రమంలో స్తంభ శిఖరిగా.. ఆ పై స్తంభాద్రిగా మారినట్లు చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. ఉర్దూ భాషలో కంబ అంటే రాతి స్తంభం అని.. అందుకే ఖమ్మం అనే పేరు నగరంలోని నల రాతి శిఖరం నుంచి వచి్చనట్లు మరో వాదన ఉంది.
నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా..
చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలుతీరిన నాయకులు, యోధులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. 1931లో ఖమ్మంలో మొదటి స్వాతంత్య్ర ఉద్యమం జరిగింది. 1945లో ఖమ్మంలో 12వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ నిర్వహించారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునే గాంధీ ఖమ్మం సందర్శన 1946లో జరిగింది. 1946 ఆగస్టు 5న మహాత్మాగాంధీ ఖమ్మం సందర్శించారు.
ఖమ్మం కోట చారిత్రక నేపథ్యం..
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సీతాబ్‌ఖాన్ (సీతాపతిరాజు)ను ఓడించి ఖమ్మం కోటను స్వా«దీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దుర్గం కుతుబ్‌షాహి పాలనలో ఉంది. గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ పటిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కోటకు 10 ద్వారాలున్నాయి. పశి్చమం వైపు దిగువ కోట ప్రధాన ద్వారం, తూర్పు వైపు రాతి దర్వాజా, కోట చుట్టూ 60 ఫిరంగులను మోహరించే వీలుంది. కోట లోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్‌టౌలి అనే బావి కూడా ఉంది. కోట ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది.
అభివృద్ధి వైపు అడుగులు..
ఖమ్మం కోటగా కీర్తి గడించిన ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కోటలోని జాఫర్‌టౌలి (బావి)ని ఆధునికీకరించారు. కోటపైకి పర్యాటకులు వెళ్లేందుకు రోప్ వే నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టింది. రోప్‌వే నిర్మాణం జరిగితే ఖిల్లాను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, దీనిద్వారా కోటకు ఉన్న ఘనమైన చరిత్ర ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment