దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన బౌద్ధక్షేత్రం
దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న నేలకొండపల్లి
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి వైపు అడుగులు
ఖమ్మం జిల్లా కేంద్రానికి సుమారు 24 కిలోమీటర్ల దూరాన నేలకొండపల్లిలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన బౌద్ధ క్షేత్రం ఉంది. బౌద్ధుల ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిన ఈ క్షేత్రం.. దేశ, విదేశీ పర్యాటకుల రాకతో పర్యాటకంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. – నేలకొండపల్లి
1976లో తొలిసారి తవ్వకాలు..
ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి– ముజ్జుగూడెం మధ్య ఈశాన్య దిక్కుగా బౌద్ధ స్తూపం ఉంది. ఈ స్తూపం చరిత్ర ఎంతో ఘనమైనది. క్రీ.శ. 2 – 3వ శతాబ్దానికి చెందినదిగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. దేశంలో చరిత్ర కలిగిన బౌద్ధమతానికి ఇదొక ప్రధాన కేంద్రం. అయితే పూర్వం స్థానికులు దీనిని ఎర్రదిబ్బ అని పిలిచేవారు.
1976లో పురావస్తు శాఖ అధికారులు ప్రథమంగా తవ్వకాలు జరిపారు. రెండో దఫా 1984లోనూ పెద్దఎత్తున తవ్వకాలు జరిపారు. అనంతరం దీనికి ఒక ఆకారం తీసుకొచ్చాక బౌద్ధ స్తూపంగా గుర్తించారు. ఈ స్తూపం సుమారు 106 అడుగుల వ్యాసం, 60 అడుగుల ఎత్తుతో ఉంటుంది. స్తూపానికి మొత్తం 12 ఎకరాల çస్థలం ఉంది. ఇక్కడి తవ్వకాల్లో బుద్ధుని పాలరాతి విగ్రహాలు, మృణ్మయ పాత్రలు, మట్టిపూసలు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినుల కాలంనాటి నాణేలు, బుద్ధుని పద్మాసనం, పంచలోహ విగ్రహాలు అనేకం బయటపడ్డాయి.
వీటిని పురావస్తు శాఖ అధికారులు మ్యూజియంలో ఉంచారు. ఈ బౌద్ధ స్తూపాన్ని పోలిన ఒక మినీ స్తూపాన్ని దగ్గరే ఏర్పాటు చేశారు. క్రీ.శ. 2 శతాబ్దంలో చరిత్రకారుడు టోలమీ రచించిన భూగోళ చరిత్ర గ్రంథంలో దీన్ని నెల్‌సిండా అని పేర్కొన్నారు. అదే నేడు నేలకొండపల్లిగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం. బౌద్ధ స్తూపం వద్ద నున్న బాలసముద్రం చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి..
నేలకొండపల్లి గ్రామ సమీపంలో గల బౌద్ధ స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2009లో రూ.1.26 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. బౌద్ధ స్తూపంతో పాటు ఫెన్సింగ్, పార్కు ఏర్పాటు చేశారు. ఆర్కియాలజీ వారి ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో దీనిని అభివృద్ధి చేశారు.
గతేడాది మరో రూ.50 లక్షలతో పర్యాటకుల కోసం విశ్రాంతి భవనం నిర్మించారు. ఇటీవల రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. అభివృద్ధి కోసం రూ.2.50 కోట్లు మంజూరు చేశారు. మరో రెండెకరాల స్థలంలో వివిధ అభివృద్ధి పనులు చేసేలా చర్యలు చేపట్టారు.
స్తూపం వద్దకు ఇలా చేరుకోవచ్చు..
» ఖమ్మం నుంచి వచ్చే పర్యాటకుల కోసం నేలకొండపల్లి శివారులో బైపాస్‌రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి నుంచి దాదాపు కిలోమీటరు దూరం వెళితే బౌద్ధక్షేత్రం వద్దకు చేరుకోవచ్చు.
» కోదాడ నుంచి వచ్చే పర్యాటకులు మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి మసీద్ సెంటర్ వైపుగా వెళ్లి ముజ్జుగూడెం రహదారి నుంచి వెళితే బౌద్ధక్షేత్రానికి చేరుకుంటారు.
» కూసుమంచి వైపు నుంచి వచ్చే సందర్శకులు నేలకొండపల్లి వరకు వచ్చి సుందరయ్య చౌక్ మీదుగా ఆంజనేయస్వామి సెంటర్, మర్రి చెట్టు సెంటర్ నుంచి ముజ్జుగూడెం రహదారి వైపుగా వెళ్లాలి.
» బౌద్ధక్షేత్రానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేదు. ప్రత్యేక వాహనాల్లో నేరుగా వెళ్లొచ్చు. లేదంటే నేలకొండపల్లి వరకు బస్సుల్లో చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో వెళ్లాలి.
విదేశీ యాత్రికుల తాకిడి..
దక్షిణ భారతదేశంలోకెల్లా అతిపెద్దదైన బౌద్ధక్షేత్రానికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా చైనా, జపాన్ నుంచి ఎక్కువగా వస్తుంటారు. దేశంలోని బౌద్ధ పర్యాటకులు కూడా వస్తుంటారు. అందుకే బౌద్ధక్షేత్రం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. అంతేకాకుండా ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగానే వస్తున్నారు. పిక్నిక్, విహార యాత్రలకు వచ్చే వారు కోకొల్లలుగా ఉన్నారు. పర్యాటకులకు చరిత్రను వివరించేలా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో బోర్డులు ఏర్పాటుచేశారు.
ప్రత్యేక ఆకర్షణగా చెరువు..
బౌద్ధక్షేత్రాన్ని ఆనుకుని ఉన్న బాలసముద్రం చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బౌద్ధక్షేత్రం చుట్టూ తిరిగిన సందర్శకులు కట్టపైకెక్కి చెరువును తిలకిస్తారు. చెరువులో వివిధ రంగులలో పూలు ఆహ్లాదకరంగా ఉంటాయి. దీనిని గమనించిన టూరిజం అధికారులు చెరువులో బోటు షికారుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పర్యాటక చెరువుగా ఎంపిక చేసి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment