spiritual center
-
గోదారమ్మ పుట్టింటికి వెళ్లొద్దామా?
నాసిక్ త్రయంబకం ఈ రెండింటినీ కలిపి పలుకుతారు. కానీ ఈ రెండింటికీ మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉంది. త్రయంబకం జ్యోతిర్లింగం. ఇక్కడ పానవట్టం మీద మూడు చిన్న చిన్న శివలింగాలుంటాయి. నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీటిని చేత్తో తీసి బయట ΄ోస్తుంటారు పూజారులు. ఆ నీరు బ్రహ్మగిరి కొండల్లో నుంచి ఉబికి వస్తున్న గోదావరి నీరని చెబుతారు. త్రయంబకం ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. గ్రానైట్ రాయిలో చెక్కిన గోపురం, ఆ గోపురంలో చెక్కిన శిల్పాల సౌందర్యం కనువిందు చేస్తుంది. శిల్పకారులకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఆలయంలో నాలుగు వైపులా ద్వారాలుంటాయి. స్పెషల్ దర్శనం కోసం ఆలయ సంస్థానం నిర్వహిస్తున్న దర్శనం కౌంటర్ ఉంటుంది. కానీ సమాంతరంగా స్థానికులు అవినీతిని ప్రోత్సహిస్తుంటారు. టికెట్ తీసుకోకుండా వాళ్ల చేతికి డబ్బిస్తే మరో ద్వారం నుంచి ఆలయంలో ప్రవేశపెడతారు. ఈ అవినీతిపరులు పర్యాటకులను మిస్లీడ్ చేస్తూ కౌంటర్ దగ్గరకు వెళ్లనివ్వకుండా దారి మళ్లిస్తుంటారు. ఆలయ కౌంటర్ నిడివి పెంచితే అవినీతి తగ్గుతుంది, ఆలయ గౌరవం పెరుగుతుంది. ఆలయం లోపల మాత్రం గంభీరమైన వాతావరణం, మనసును శివుడి మీద లగ్నం చేస్తుంది. త్రయంబకేశ్వరుడి దర్శనం తర్వాత ఎదురుగా కనిపిస్తున్న గుట్ట మీద అమ్మవారి ఆలయం ఉంది. త్రయంబకేశ్వరుడి ఆలయం పూర్తిగా నల్లగా ఉంటే అమ్మవారి విగ్రహంతోపాటు ఆలయం నేల నుంచి శిఖరం వరకు మొత్తం పాలరాతి నిర్మాణం. కొండ మీద గోదావరి త్రయంబకం తర్వాత బ్రహ్మగిరి కొండల వైపు సాగాలి. గోదావరి నది పుట్టిన ప్రదేశాన్ని చూడాలంటే నిట్టనిలువుగా ఉన్న కొండను నడిచి ఎక్కాల్సిందే. రెండు కొండల మధ్య ఇరుకు మెట్ల మీద పైకి వెళ్తుంటే నది పాయలు పర్యాటకులను పలకరించడానికి ఎదురు వచ్చినట్లు తల మీదకు జాలువారుతుంటాయి. కర్రసాయంతో కొండ ఎక్కడమే మంచిది. మెట్లెక్కి కొండ మీదకు చేరిన తర్వాత తెలుస్తుంది అది ఒక కొండ కాదని. విశాలంగా విస్తరించిన పశ్చిమ కనుమల శిఖరాల నుంచి ధారలు జలజలమని శబ్దం చేస్తూ కొండల మధ్య విశాలమైన ప్రదేశంలోకి చేరతాయి. అదే గోదావరి కుండ్. భక్తులు ఆ నీటిలో పుణ్యస్నానాలు చేస్తుంటారు. గోదావరి పుట్టిన ప్రదేశాన్ని చూసిన తర్వాత తిరుగు ప్రయాణంలో నాసిక్‌లో ఆగాలి. పంచవటి, సీతాగుహ, కాలారామ్ మందిర్ ప్రధానమైనవి. సీతాగుహలోకి వెళ్లి రావడం ఆసక్తిగా ఉంటుంది. కానీ రద్దీ చాలా ఎక్కువ. క్యూలైన్లోనే ఎక్కువ టైమ్ అయిపోతుంది. కాలారామ్ ఆలయంలో రాముడి విగ్రహం అందంగా ఉంటుంది. ఆలయ నిర్మాణం ఉత్తర దక్షిణాది శైలి సమ్మేళనంగా ఉంటుంది. నాసిక్‌లో నాణేల ముద్రణాలయం ఉంది. ఎత్తైన కాంపౌండ్ వాల్‌ను మాత్రమే చూడగలం. టూర్ ఆపరేటర్ని అడిగితే ఆ రోడ్డులో తీసుకువెళ్తారు. షిరిడీ ప్రయాణంలో నాసిక్, త్రయంబకాలను కలుపుకోవచ్చు. షిరిడీ నుంచి బయలుదేరిన తర్వాత మొదట ముక్తిధామ్ వస్తుంది. ఈ పాలరాతి ఆలయంలో కృష్ణుడితోపాటు శివుడు... ఇంకా చాలామంది దేవతల రాజస్థాన్ మార్బుల్ విగ్రహాలుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాల నమూనాలుంటాయి. త్రయంబకేశ్వరుడిని కూడా చూడవచ్చు. షిరిడీ టూర్ ఆపరేటర్లు నిర్వహించే కంబైండ్ ప్యాకేజ్‌లలో బ్రహ్మగిరి ఉండదు. విడిగా వాహనం మాట్లాడుకోవాలి. కొండ మీదకు ట్రెకింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రీ టైమ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక నాసిక్‌లో సీతాగుహలోకి వెళ్లడం కంటే క్యూలో మనవంతు కోసం వెయిట్ చేయడమే కష్టం. ఇక్కడ టోకెన్ సిస్టమ్ పెడితే బాగుంటుంది. పర్యాటకులు టోకెన్ తీసుకుని తమ వంతు వచ్చే వరకు ఎదరుగా ఉన్న ఇతర ఆలయాలు, పంచవటి వృక్షాలను చూస్తూ, తినుబండారాలతో కాలక్షేపం చేయవచ్చు. ఇంత సిస్టమాటిక్‌గా ఏమీ ఉండకపోవడంతో పర్యాటకులే స్వయంగా తమ వెనుక వారికి చెప్పి క్యూ లైన్ నుంచి బయటకు వచ్చి టీ స్టాల్లో టీ తాగి, స్నాక్స్ తిని మళ్లీ క్యూలో చేరుతుంటారు.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నేలకొండపల్లి.. బౌద్ధం వర్ధిల్లి..
ఖమ్మం జిల్లా కేంద్రానికి సుమారు 24 కిలోమీటర్ల దూరాన నేలకొండపల్లిలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన బౌద్ధ క్షేత్రం ఉంది. బౌద్ధుల ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిన ఈ క్షేత్రం.. దేశ, విదేశీ పర్యాటకుల రాకతో పర్యాటకంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. – నేలకొండపల్లి1976లో తొలిసారి తవ్వకాలు..ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి– ముజ్జుగూడెం మధ్య ఈశాన్య దిక్కుగా బౌద్ధ స్తూపం ఉంది. ఈ స్తూపం చరిత్ర ఎంతో ఘనమైనది. క్రీ.శ. 2 – 3వ శతాబ్దానికి చెందినదిగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. దేశంలో చరిత్ర కలిగిన బౌద్ధమతానికి ఇదొక ప్రధాన కేంద్రం. అయితే పూర్వం స్థానికులు దీనిని ఎర్రదిబ్బ అని పిలిచేవారు. 1976లో పురావస్తు శాఖ అధికారులు ప్రథమంగా తవ్వకాలు జరిపారు. రెండో దఫా 1984లోనూ పెద్దఎత్తున తవ్వకాలు జరిపారు. అనంతరం దీనికి ఒక ఆకారం తీసుకొచ్చాక బౌద్ధ స్తూపంగా గుర్తించారు. ఈ స్తూపం సుమారు 106 అడుగుల వ్యాసం, 60 అడుగుల ఎత్తుతో ఉంటుంది. స్తూపానికి మొత్తం 12 ఎకరాల çస్థలం ఉంది. ఇక్కడి తవ్వకాల్లో బుద్ధుని పాలరాతి విగ్రహాలు, మృణ్మయ పాత్రలు, మట్టిపూసలు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినుల కాలంనాటి నాణేలు, బుద్ధుని పద్మాసనం, పంచలోహ విగ్రహాలు అనేకం బయటపడ్డాయి. వీటిని పురావస్తు శాఖ అధికారులు మ్యూజియంలో ఉంచారు. ఈ బౌద్ధ స్తూపాన్ని పోలిన ఒక మినీ స్తూపాన్ని దగ్గరే ఏర్పాటు చేశారు. క్రీ.శ. 2 శతాబ్దంలో చరిత్రకారుడు టోలమీ రచించిన భూగోళ చరిత్ర గ్రంథంలో దీన్ని నెల్సిండా అని పేర్కొన్నారు. అదే నేడు నేలకొండపల్లిగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం. బౌద్ధ స్తూపం వద్ద నున్న బాలసముద్రం చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి.. నేలకొండపల్లి గ్రామ సమీపంలో గల బౌద్ధ స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2009లో రూ.1.26 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. బౌద్ధ స్తూపంతో పాటు ఫెన్సింగ్, పార్కు ఏర్పాటు చేశారు. ఆర్కియాలజీ వారి ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో దీనిని అభివృద్ధి చేశారు. గతేడాది మరో రూ.50 లక్షలతో పర్యాటకుల కోసం విశ్రాంతి భవనం నిర్మించారు. ఇటీవల రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. అభివృద్ధి కోసం రూ.2.50 కోట్లు మంజూరు చేశారు. మరో రెండెకరాల స్థలంలో వివిధ అభివృద్ధి పనులు చేసేలా చర్యలు చేపట్టారు. స్తూపం వద్దకు ఇలా చేరుకోవచ్చు..» ఖమ్మం నుంచి వచ్చే పర్యాటకుల కోసం నేలకొండపల్లి శివారులో బైపాస్‌రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి నుంచి దాదాపు కిలోమీటరు దూరం వెళితే బౌద్ధక్షేత్రం వద్దకు చేరుకోవచ్చు. » కోదాడ నుంచి వచ్చే పర్యాటకులు మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి మసీద్ సెంటర్ వైపుగా వెళ్లి ముజ్జుగూడెం రహదారి నుంచి వెళితే బౌద్ధక్షేత్రానికి చేరుకుంటారు. » కూసుమంచి వైపు నుంచి వచ్చే సందర్శకులు నేలకొండపల్లి వరకు వచ్చి సుందరయ్య చౌక్ మీదుగా ఆంజనేయస్వామి సెంటర్, మర్రి చెట్టు సెంటర్ నుంచి ముజ్జుగూడెం రహదారి వైపుగా వెళ్లాలి.» బౌద్ధక్షేత్రానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేదు. ప్రత్యేక వాహనాల్లో నేరుగా వెళ్లొచ్చు. లేదంటే నేలకొండపల్లి వరకు బస్సుల్లో చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో వెళ్లాలి. విదేశీ యాత్రికుల తాకిడి.. దక్షిణ భారతదేశంలోకెల్లా అతిపెద్దదైన బౌద్ధక్షేత్రానికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా చైనా, జపాన్ నుంచి ఎక్కువగా వస్తుంటారు. దేశంలోని బౌద్ధ పర్యాటకులు కూడా వస్తుంటారు. అందుకే బౌద్ధక్షేత్రం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. అంతేకాకుండా ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగానే వస్తున్నారు. పిక్నిక్, విహార యాత్రలకు వచ్చే వారు కోకొల్లలుగా ఉన్నారు. పర్యాటకులకు చరిత్రను వివరించేలా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో బోర్డులు ఏర్పాటుచేశారు. ప్రత్యేక ఆకర్షణగా చెరువు..బౌద్ధక్షేత్రాన్ని ఆనుకుని ఉన్న బాలసముద్రం చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బౌద్ధక్షేత్రం చుట్టూ తిరిగిన సందర్శకులు కట్టపైకెక్కి చెరువును తిలకిస్తారు. చెరువులో వివిధ రంగులలో పూలు ఆహ్లాదకరంగా ఉంటాయి. దీనిని గమనించిన టూరిజం అధికారులు చెరువులో బోటు షికారుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పర్యాటక చెరువుగా ఎంపిక చేసి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసింది. -
ఆధ్యాత్మిక పర్యాటకంతో ఉపాధి
ముంబై: ఆధ్యాత్మిక పర్యాటకంతో వచ్చే 4–5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గ్లోబల్ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఎన్ఎల్బీ సరీ్వసెస్ తెలిపింది. భారత్‌లో ఈ రంగం 2023–30 మధ్య ఏటా 16 శాతం వృద్ధి చెందుతుందని సంస్థ సీఈవో సచిన్ అలుగ్ ఒక అంచనాగా చెప్పారు. ‘దేశీయ టూరిజంలో ఆధ్యాత్మిక పర్యాట కం వాటా ఏకంగా 60 శాతముంది. 2028 నాటికి ఈ విభాగం 60 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేయగలదు. శాశ్వత, తాత్కాలిక ఉద్యోగ అవకాశాలకు కొత్త వేదికలను సృష్టిస్తుంది. కోవిడ్ మహ మ్మారి తర్వాత యాత్రలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021–22లో ఆధ్యాత్మిక చందాలు 14 శాతం అధికం అయ్యాయి. అయోధ్యలో ఇటీవల ప్రారంభించిన రామ్ మందిర్‌తో ఆధ్యాత్మిక పర్యాటకానికి జోష్ నింపనుంది. ఒక్క రామ్ మందిర్ రాక కారణంగా వంటవారు, ఫ్రంట్ డెస్క్ మేనేజర్, హౌజ్‌కీపింగ్, టూర్ గైడ్స్ వంటి సుమారు 25,000 జాబ్స్ కొత్తగా రానున్నాయి. ఆహార సేవలు, కంజ్యూమర్ గూడ్స్, ఆతిథ్యం, రవాణా, మతపర ఉత్పత్తులు, చేతివృత్తులు, వ్రస్తాలు, సరుకు రవాణా, గిడ్డంగులు, ప్యాకింగ్ తదితర విభాగాల్లో కొత్తగా వ్యాపార అవకాశాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకులకు ప్రత్యేకంగా సేవలందించే కొత్త సంస్థల సంఖ్యలో 6–8 శాతం పెరుగుదల అంచనా వేస్తున్నాము’ అని వివరించారు. -
అణగారిన వర్గాల సాధికారతే ధ్యేయం
జైపూర్: ‘‘సమాజంలో అణగారిన వర్గాల సాధికారతే మా ప్రభుత్వ ధ్యేయం. అందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వంచిత్ కో వరీయత (పీడితులకు తొలి ప్రాధాన్యం) నినాదంతో సాగుతున్నామన్నారు. శనివారం రాజస్తాన్‌లో భిల్వారా జిల్లా మాలాసేరీ డుంగ్రీలో గుజ్జర్ల ఆరాధ్యుడు శ్రీదేవనారాయణ్ ఆధ్యాత్మిక వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ప్రపంచ దేశాలు ఆశలు, ఆకాంక్షలతో భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ తన బలాన్ని, అధికారాన్ని ప్రదర్శిస్తోంది, అంతర్జాతీయ వేదికలపై శక్తిని నిరూపించుకుంటోంది’’ అన్నారు. పొరపాట్లను సరిదిద్దుకుంటున్న ‘నవ భారత్’ స్వాతంత్య్ర పోరాటంతోపాటు ఇతర ఉద్యమాల్లో గుజ్జర్ల పాత్ర మరువలేనిదని మోదీ ప్రశంసించారు. వారికి చరిత్రలో తగిన గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరమని అన్నారు. ‘‘గత పొరపాట్లను ‘నవ భారత్’ సరిదిద్దుకుంటోంది. దేశాన్ని సిద్ధాంతపరంగా విచ్ఛిన్నం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా విఫలమయ్యాయి. నాగరికత, సంస్కృతి, సామరస్యం, శక్తి సామర్థ్యాల వ్యక్తీకరణే భారత్’’ అన్నారు. దేశ ఐక్యతను భగ్నం చేసే వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మన వారసత్వం మనకు గర్వకారణం వేలాది సంవత్సరాల భారతదేశ ప్రయాణంలో సామాజిక బలం గణనీయమైన పాత్ర పోషించిందని నరేంద్ర మోదీ వివరించారు. మన వారసత్వం మనకు గర్వకారణమని, బానిస మనస్తత్వం నుంచి బయటపడాలని ఉద్బోధించారు. దేశం పట్ల మనం నిర్వర్తించాల్సిన విధులను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కోరారు. ‘‘ప్రజాసేవకు శ్రీదేవనారాయణ్ ప్రాధాన్యమిచ్చారు. ఆయన కమలంలో ఉద్భవించారు. భారత్ సారథ్యం వహిస్తున్న జి–20 లోగోలో కమలం ఉంది. బీజేపీ ఎన్నికల గుర్తయిన కమలంతో నాకెంతో అనుబంధముంది. గుజ్జర్ సామాజిక వర్గంతోనూ చక్కటి స్నేహ సంబంధాలున్నాయి’’ అన్నారు. ఐక్యతా మంత్రమే విరుగుడు న్యూఢిల్లీ: ప్రజల మధ్య విభేదాలు, అంతరాలను సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఎన్నడూ విజయవంతం కాబోవని మోదీ అన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప గ్రౌండ్లో ఎన్సీసీ ర్యాలీనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘దేశ పునర్వైభవ సాధనకు ఐక్యతే ఏకైక మార్గం. అన్నింటికీ అదే ఏకైక విరుగుడు. యువత తన ముంగిట ఉన్న అపార అవకాశాలను వాడుకోవాలి’’ అన్నారు. ఎన్సీసీ 75వ వ్యవస్థాపక దినం సందర్భంగా ముద్రించిన 75 రూపాయల నాణేన్ని, కవర్‌ను విడుదల చేశారు. -
రూ.40 కోట్లు కుచ్చు టోపీ, బురిడీ బాబా అరెస్ట్
-
పెళ్లికి రూ.3 కోట్లు ఖర్చు, బురిడీ బాబా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఆధ్యాత్మికవేత్తగా ప్రజలను మోసం చేస్తున్న కుమార్ గిరిష్ సింగ్ అనే బురిడి బాబాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీమ్ బ్రిడ్జ్ మనీ సర్క్యూలేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న గిరీష్ సింగ్‌తోపాటు అతని సోదరుడు దిలిప్ సింగ్‌ను ఎస్ఆర్ నగర్లో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు కార్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన గిరీష్ సింగ్ ఆధ్యాత్మిక వేత్తగా ప్రజలను మోసం చేస్తూ దాదాపు రూ.40 కోట్లు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన గిరీష్ సింగ్ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడంతో ఆధ్యాత్మికతను బోధించడం ప్రారంభించాడు. అనంతరం సోదరుడు దిలీప్ సింగ్‌తోపాటు ‘అద్వైత ఆధ్యాత్మిక రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ (ASRCE) ను ప్రారంభించాడు. ఇంటర్ ఫెయిల్ అయిన గిరీష్ కుమార్ హిమాలయాన్ యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ పట్టా పొందాడు. అయితే తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల మీద మంచి పట్టు ఉండటంతో బురిడీ బాబా బుట్టలో ఈజీగా పడిపోయేవాళ్లు. గత ఏడాది గిరీష్ సింగ్ తన అనుచరురాలైన దివ్యను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి డబ్బుపై ఆశ పెంచుకున్న గిరీష్...యువతులను టార్గెట్ చేసుకొని నేరుగా వెళ్లి కలిసి వాళ్లకి ఆధ్యాత్మిక బోధనలు ఇచ్చేవాడు. పలు టీవీ ఛానల్లో సైతం ఆధ్యాత్మిక బోధనలు ఇస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలో గిరీష్ సింగ్ అనేక మంది నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి, చివరికి వారికి కుచ్చు టోపీ పెట్టడంతో బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గిరీష్ సింగ్, అతని సోదరుడు దిలీప్‌ను పలు కేసుల కింద అరెస్టు చేశారు. జనాల నుంచి వసూలు చేసిన డబ్బుతో అతగాడు దాదాపు ఇరవై దేశాలు చుట్టేసి... అక్కడ జల్సాలు చేశావాడు. అతగాడు ఏర్పాటు చేసిన గొలుసుకట్టు వ్యాపారంలో లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి చివరికి మోసపోయామని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించారు. గత ఏడాదే గిరీష్ కుమార్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా అతగాడిలో ఏ మార్పు రాలేదు. ఆధ్యాత్మికం ముసుగులో మళ్లీ దందా షురూ చేశాడు. రాచకొండ ఉమ్మడి కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో గిరీష్, దివ్యల వివాహం కోసం ప్రజల నుంచి రూ.3 కోట్ల సేకరించి ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అలాగే అతని తరగతులకు హాజరయ్యే వారి నుంచి రూ.10,000 నుంచి రూ .2 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇతనిపై 4 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయని, గిరీష్, అతని సోదరుడి పేరుతో భారీగా ఆస్తులు కూడబెట్టారని పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి డిబెంచర్లు, డ్రీం బ్రిడ్జ్‌ల రూపంలో రూ.40 కోట్లు కాజేశారని తెలిపారు. -
ఆధ్యాత్మికం @ ఆన్లైన్!
న్యూఢిల్లీ: అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆన్లైన్లో ఆధ్యాత్మిక కంటెంట్‌కు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొంగొత్త స్టార్టప్ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. భక్తులు, గురువులు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మొదలైన వాటన్నింటినీ అనుసంధానిస్తూ, ఆయా వర్గాలకు అవసరమైన సేవలు అందించడంపై ఇవి దృష్టి పెడుతున్నాయి. దేశీయంగా మైమందిర్, ఆర్‌జ్ఞాన్, కాల్పనిక్ టెక్నాలజీస్ లాంటివి ఈ కోవకు చెందినవే. భారత్‌లో మతపరమైన, ఆధ్యాత్మిక సేవలకు సంబంధించిన మార్కెట్ పరిమాణం 30 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని అంచనా. షేర్‌చాట్ లాంటి సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫాంపై 25 మంది పైగా ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. వీరిలో యోగా గురు బాబా రాందేవ్ కూడా ఉన్నారు. షేర్‌చాట్ త్వరలో మరింత మందిని తమ ప్లాట్‌ఫాంలో చేర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. చిన్న ఆలయాలు, స్వామీజీలతో టైఅప్.. కొత్తగా 20–25 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లకు చేరువయ్యేందుకు ఈ ఆధ్యాత్మిక సేవల సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆధ్యాత్మిక గురువులు, భక్తులను అనుసంధానం చేసే పనిలో ఉన్నాయని మైమందిర్ పోర్టల్‌లో ఇన్వెస్ట్ చేసిన యాక్సెల్ పార్ట్నర్స్ సంస్థ భాగస్వామి ప్రశాంత్ ప్రకాష్ తెలిపారు. ఆన్లైన్లో ఆధ్యాత్మిక గురువుల ఆధారిత కమ్యూనిటీలను తయారు చేయడంపై ఇవి దృష్టి పెడుతున్నాయి. సాధారణంగా కాస్త ఆర్థిక సామర్ధ్యం ఉన్న ఆధ్యాత్మిక గురువులు .. తమ ప్రచార కార్యక్రమాలకు తోడ్పడే టెక్నాలజీలపై సొంతంగానే నిధులు వెచ్చించుకుంటున్నారు. ప్రస్తుతం దాదాపు ప్రతి ఆధ్యాత్మిక గురువుకు, ఆలయం, ప్రార్థనామందిరాలకు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో ఓ పేజీ ఉంటోంది. దీంతో వివిధ ప్రాంతాల్లో స్థానికంగా కాస్త పేరొందిన చిన్న స్థాయి ఆలయాలు, స్థానిక ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలపై ఆధ్యాత్మిక పోర్టల్స్ దృష్టి సారిస్తున్నాయి. పండుగలు, జ్యోతిష్యం వివరాలు కూడా... ‘మేం కాస్త చిన్న స్థాయి గురువులు, ఆలయాలను .. వాటి కంటెంట్‌ను ఇప్పుడు మా ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి తెస్తున్నాం‘ అని ఆర్‌జ్ఞాన్ సహ వ్యవస్థాపకుడు ఉమేష్ ఖత్రి తెలిపారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి గలవారికి ఈ వెబ్సైట్ ఒక .. ఇన్స్ట్రాగాంలాంటిది. ఆర్‌జ్ఞాన్, మైమందిర్లకు ప్రతి నెలా చెరో అయిదు లక్షల మంది దాకా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరు మతపరమైన కంటెంట్, తమ ఇష్ట దేవతలు.. గురువుల ఫొటోలు, వీడియోలు వీటిలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ సైట్లు.. పండుగలు, హిందు క్యాలెండర్లు, జ్యోతిష్యం మొదలైన అంశాలకు సంబంధించిన వివరాలు, సమాచారాన్ని కూడా యూజర్లకు పంపిస్తుంటాయి. తమ ప్లాట్‌ఫాంపై నాణ్యమైన కంటెంట్ అందించేందుకు కాల్పనిక్ టెక్నాలజీస్ నేరుగా ఆలయాలతోనే ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం కాల్పనిక్ టెక్నాలజీస్ దగ్గర 230 ఆలయాలకు సంబంధించిన లైవ్, రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి 50 మంది గురువులు, 500 ఆలయాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్దేశించుకుంది. మారుతున్న అభిరుచులు... మతపరమైన, ఆధ్యాత్మికమైన కంటెంట్ విషయంలో భారతీయుల ధోరణులు మారుతున్నాయి. గత మూడేళ్లలో చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో చాలా మందికి తొలిసారిగా సోషల్ నెట్వర్క్ సైట్లు పరిచయమవుతున్నాయి. నగరాల్లో ఉండే వారితో పోలిస్తే ఇలాంటి చిన్న పట్టణాలు, గ్రామాల వారి కంటెంట్ వినియోగ ధోరణుల్లో గణనీయమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. ‘భారతీయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ధోరణులు మారుతున్నాయి. చాలా మంది గుళ్లకు వెళ్లినప్పుడు ఫొటోలు తీసుకోవడం, వాటిని ఫేస్‌బుక్‌లాంటి వాటిల్లో పోస్ట్ చేయడంలాంటివి చేస్తుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక భావాలున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ అవసరమన్న అభిప్రాయం నెలకొంది‘ అని మైమందిర్ వ్యవస్థాపకుడు రాహుల్ గుప్తా పేర్కొన్నారు. ఇటు భక్తులు, అటు ఆలయం కోణంలో ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో విస్తరించని మార్కెట్‌పై దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. చాలా మంది ఆధ్యాత్మిక గురువులకు లక్షల కొద్దీ సంఖ్యలో భక్తులు ఉంటున్నారు. పాత తరం వారితో పాటు టెక్నాలజీ విపరీతంగా వాడే కొత్త తరం యువత కూడా వీరిలో ఉంటున్నారు. వీరికి ఆశ్రమాలకు వెళ్లేంత సమయం దొరక్కపోవడంతో ఆయా గురువుల ప్రవచనాలను ఆన్లైన్లో వినడానికి మొగ్గుచూపుతున్నారని కాల్పనిక్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అశ్వనీ గర్గ్ చెప్పారు. -
రాముడు నడయాడిన ‘రామతీర్థం’
త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ తూర్పు తీరాన వెళుతుండగా శివ పూజకు వేళ కావడంతో ఓ ప్రాంతానికి చేరుకుని అక్కడే శివ సైకత లింగాన్ని ప్రతిష్టించి కొలిచారని, అదే నేడు రామతీర్థంగా విరాజిల్లుతోందని పురాణ ప్రతీతి. శ్రీరాముడు నడయాడిన తీరంగా.. రామతీర్థం ప్రసిద్ధికెక్కింది. రాముడు నడయాడిన తీరంలో బ్రహ్మోత్సవాల వేళ సముద్ర స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతిష్టించిన స్పటిక లింగాన్ని గుర్తించిన పల్లవరాజులు 14వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. సాక్షి, రామతీర్థం(నెల్లూరు) : కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయం. ఈ ఆలయం రామతీర్థం గ్రామంలో సముద్రతీరాన ఉన్నది. సముద్ర తీరాన సూర్యోదయ సమయంలో శ్రీరామచంద్రుడు, సైకతం (ఇసుక)తో శివలింగాన్ని చేసి, శివార్చన చేసిన పవిత్రస్థలి ఇది. ఆంధ్రరాష్ట్ర రామేశ్వరంగా, దక్షిణ కాశీగా విలసిల్లుతున్న పవిత్ర శివక్షేత్రం. రాముడు శివార్చన చేసిన ఈ ప్రదేశంలో భక్తులు సముద్రస్నానం ఆచరించి, స్వామి వారికి మొక్కుకుంటే, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. యుగాలు మారినా తరగని భక్తితో స్వామివారి దర్శనానికి భారీగా తరలి రావడం విశేషం. రాముడు సేవించిన తీర్థం కావడంతో ‘రామతీర్థం’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే, శివకేశవులను ఒకేసారి దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రాచీనకాలం నుంచి దివ్యక్షేత్రంగా వెలుగొందుచూ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అమావాస్య నాడు సముద్ర స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవరాజులు స్వామి వారికి దేవాలయం నిర్మించారని ఇక్కడ చారిత్రిక ఆధారాలు ఉన్నవి. 18వ శతాబ్దంలో స్థానికుడైన కోటంరెడ్డి శేషాద్రిరెడ్డికి స్వామివారు స్వప్న దర్శనంతో ప్రేరణ పొంది ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోన్న కామాక్షి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమై సుమారు 10 రోజుల పాటు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే స్వామి వారి వివిధ అలంకరణలకు రామతీర్థం పరిసర ప్రాంతాల భక్తులు ఉభయకర్తలుగా వ్యవహరించడం ఆనవాయితీ. నేటికి ఇదే ఆచారంగా కోనసాగడం విశేషం. బ్రహ్మోత్సవాలు సందర్భంగా వరవడిన భక్తులకు సంతానం కలుగుతుందని భక్తులకు అపార నమ్మకం. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు పలు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ వివరాలు అతి పురాతనమైన శైవక్షేత్రం రామతీర్థంలోని కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 23వ తేదీ ఆదివారం అంకురార్పణతో ప్రారంభమవుతాయి, 24వ తేదీ ధ్వజారోహణ, 25న చిలక వాహనం, 26న హంస వాహనం, 27న పులి వాహనం, 28న రావణసేవ, 29న నందిసేవ, 30న రథోత్సవం, జూలై 1న స్వామి వారికి కల్యాణం, 2న ముఖ్య ఘట్టం తీర్థవాది (సముద్రస్నానం), అదే రోజు రాత్రికి తెప్పోత్సవం, అశ్వ వాహనం, 3వ తేదీన ధ్వజావరోహణ, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే రథోత్సవం, స్వామి వారి కల్యాణం, తీర్థవాది ఘట్టాలకు స్వామి వారిని తరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తీర్థవాదికి సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఆలయ అధికారు మౌలిక వసతులను కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఎలా చేరుకోవాలంటే.. ఉత్సవాలు సందర్భంగా జిల్లా కేంద్రం నెల్లూరు నుంచి విడవలూరు మండలం రామతీర్థం గ్రామానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. నెల్లూరు నుంచి దాదాపు 30 కిలో మీటర్లు ఉంటుంది. అల్లూరు, పద్మనాభసత్రం నుంచి కూడా ప్రైవేట్ వాహనాలు నిత్యం రామతీర్థం వరకు నడుస్తుంటాయి. కావలి నుంచి కూడా నేరుగా రామతీర్థానికి బస్సు సౌకర్యం ఉంది. -
యాదాద్రికి సరికొత్త రూపు
♦ అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్పు ♦ పది జిల్లాల నుంచీ నేరుగా వచ్చేలా విశాలమైన రోడ్లు ♦ ఇళ్లు కోల్పోయేవారికి ప్రత్యామ్నాయ స్థలం, నిర్మాణ ఖర్చులు ♦ వ్యాపారాల్లో స్థానికులకే ప్రాధాన్యం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: యాదాద్రిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, సాహిత్య, సాంస్కృతిక, వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న రూపంలో కాకుండా పూర్తిస్థాయిలో నూతనంగా ఆవిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. యాదాద్రి పునర్నిర్మాణంపై శుక్రవారం సీఎం సమీక్ష జరిపారు.మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, ఆర్కిటెక్ట్, డిజైనర్ ఆనంద్‌సాయి, ఉన్నతాధికారులతో పాటు యాదాద్రి అభివృద్ధి పనుల్లో దుకాణాలు, ఇళ్లు కోల్పోతున్న వారి తరఫు ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. యాదాద్రి పనుల్లో జాప్యంపై గురువారం స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులపై ఆగ్రహించిన సీఎం, ఈ సమీక్షలో వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జరిగిన పనులతో పాటు మిగతావాటి పరిపూర్తికి పట్టే సమయాన్ని వారు సీఎంకు వివరించారు. యాదాద్రికి రవాణా వ్యవస్థను పటిష్టపరచాలని సీఎం పేర్కొన్నారు. ‘‘తెలంగాణ పది జిల్లాల నుంచి నేరుగా చేరుకునేలా విశాలమైన రోడ్లను నిర్మించండి. అనువుగా ఉన్న నివాసాలను వ్యాపార కేంద్రాలుగా మార్చండి. దేవాలయంతో పాటు పరిసరాలూ ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలి. దేశవిదేశాల నుంచి భక్తులొచ్చే వాతావరణం క ల్పించాలి’’ అని చెప్పారు. ప్రధానాలయ ముఖద్వారం, వీధిపోటు తదితర వాస్తుల అంశాల నమూనా చిత్రాలను తిలకించి అధికారులకు సూచనలు చేశారు. గిరి ప్రదర్శన కోసం గుట్ట చుట్టూ రోడ్లను వెడల్పు చేయాలన్నారు. ఆ క్రమంలో భవనాలు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపడమేగాక భవనాల పునర్నిర్మాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. గుట్టపైకి రెండు దారులు గుట్టపైకి ఒకే మార్గంలో వాహనాలు వెళ్లి రావటం సరికాదని, రెండు విడి విడి దారులుండాలని సీఎం సూచించారు. వాటి వెంట పాదచారుల కోసం విశాలమైన కాలిబాటలు ఏర్పాటు చేయాలన్నారు. కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్న ఆలయ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. వారికి మానవతా దృక్పథంతో ప్రత్యామ్నాయం చూపించాలని సూచించారు. ‘‘ఇక గుట్టపై ఏర్పాటు చేసే దుకాణాలను ఎట్టి పరిస్థితిలోనూ ఇతరులకు కేటాయించబోం. కనీసం టెండర్లు కూడా పిలవం. స్థానికులకే కేటాయిస్తాం. వెయ్యెకరాల్లో తలపెట్టిన టెంపుల్ సిటీలో భారీ మినహా ఇతర వ్యాపారాల్లో స్థానికులకే ప్రాధాన్యమిస్తాం’’ అని వివరించారు. ఇంత విసృ్తత స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ మద్దతుంటుందని భవనాలు కోల్పోతున్న వారి తరపు ప్రతినిధులు సీఎంకు హామీ ఇచ్చారు. తమకిచ్చిన హామీలను సీఎం నెరవేరుస్తారన్న పూర్తి భరోసా ఉందన్నారు. అనంతరం వారికి భోజనం ఏర్పాటు చేశారు. -
'తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతాం'
తిరుపతి : తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం తిరుపతిలో ఫుడ్ ఫెస్టివల్‌ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... పేదవాడికి పప్పన్నం పెట్టాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం చంద్రన్న కానుక ప్రవేశపెట్టినట్లు చెప్పారు. టూరిజం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు అధికమవుతాయన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని చెరువుల అభివృద్ధిని టీటీడీకి అప్పగించామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీలోని హోటల్స్ రంగం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. హస్తకళల అభివృద్ధికి రూ.17 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. -
బంజారాహిల్స్ లక్ష్మీనరసింహస్వామికి స్వర్ణ దేవాలయం
హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో నిర్మాణం సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తున్నట్టు అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్, ఇస్కా న్ బెంగళూరు అధ్యక్షుడు మధు పండిట్ దాస చెప్పారు. 4.38 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల వ్యయంతో ఈ ఆలయం నిర్మాణ బాధ్యతలను హరే కృష్ణా మూవ్మెంట్ చేపట్టింది. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో స్వర్ణ దేవాలయ నమూనాను మధు పండిట్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ... ‘ఈ ఆలయం నగరంలో ఓ చారిత్రక కట్టడంగా నిలిచిపోతుంది. ఇది పూర్తయితే ఆధ్యాత్మిక పర్యాటకం కింద వారానికి లక్ష మంది వస్తారు. ఇందులో మల్టీపర్పస్ ఆటోమేటిక్ బ్లాక్, చారిటీ కల్యాణమండపం, నిత్యాన్నదానం, మెడిటేషన్, యోగ, గ్రంథాలయం, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ ప్రమోషన్ బ్లాక్ నిర్మిస్తాం. త్వరలోనే మాస్టర్ ప్లాన్ విడుదల చేస్తాం. ఆరు నెలల్లో గర్భాలయ ప్రాకారాలు పూర్తి చేసి దర్శనం కల్పిస్తాం. ఏడాదిలో మొత్తం నిర్మాణం పూర్తవుతుంది’ అన్నారు. అలాగే మధుర సమీపంలో ని బృందావనంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం నిర్మిస్తున్నామన్నారు. మెదక్ జిల్లాలో శాశ్వత కిచెన్... మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద రూ.25 కోట్లతో పర్మినెంట్ కిచెన్ సెంటర్ నిర్మిస్తున్నట్టు దాస చెప్పారు. నాలుగు ఎకరాల్లో నిర్మించేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందన్నారు. ప్రస్తుతం పటాన్చెరు వద్ద ఉన్న కిచెన్ సెంటర్ సరిపోవటం లేదన్నారు. ఏడాదిన్నరలో దీన్ని పూర్తిచేసి అక్కడి నుంచే అన్ని ప్రాంతాలకూ ఆహారం సరఫరా చేస్తామన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ తెలంగాణ- ఏపీ రాష్ట్రాల యూనిట్, హరే కృష్ణా మూవ్మెంట్ అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాస, బిందు మాధవ దాస, రవి లోచన దాస, యజ్ఞేశ్య దాస పాల్గొన్నారు. -
ఆదిమానవుల అడ్డా
మౌలాలి గుట్ట... ఈ పేరు వినగానే మనకు స్ఫురించేది దానిపై ఉన్న చారిత్రక దర్గా. అసఫ్‌జాహీల కాలంలో నిర్మితమైన దర్గా చాలామందికి ఆరాధ్య ప్రాంతం. ఇప్పుడో ఆధ్యాత్మిక కేంద్రం. కానీ... ఎత్తుపల్లాలంటూ లేకుండా అన్ని వైపులా జారుడుగా ఉన్న విశాలమైన ఈ ప్రాంతం ఒకప్పుడు ఆదిమానవుల ప్రధాన ఆవాస కేంద్రం. మధ్య శిలాయుగం నుంచి ఇనుప యుగం వరకు ఇక్కడ మానవ మనుగడ విలసిల్లిన అద్భుత ప్రాంతం. కానీ ఈ విషయం మరుగున పడిపోయింది. దాని గురించి పరిశోధించి తేల్చాల్సిన పురావస్తు శాఖ పట్టించుకోకపోవటంతో ఇప్పుడు నాటి మానవ జాడలు కూడా కనుమరుగయ్యాయి. చుట్టూ అడవులు... విస్తారంగా నీటి వనరులు. జంతువులు దాడి చేసే అవకాశం లేని ఎత్తయిన.. చదునైన గుట్ట. ఆదిమానవులు ప్రధానంగా ఇష్టపడే అన్ని లక్షణాలున్న ప్రాంతం కావటంతో మౌలాలి గుట్టను అప్పట్లో ఆవాసంగా చేసుకున్నారు. దాదాపు 8 వేల సంవత్సరాల క్రితం ఇక్కడ మానవ సంచారం ఉండేదని పురావస్తు పరిశోధకులు అభిప్రాయం. బయటపడిందిలా... ఆంగ్లేయుల కాలంలో పురావుస్తు పరిశోధకుడిగా వెలుగొందిన రాబర్ట్ బ్రూస్ ఫుటే తొలిసారిగా మౌలాలి ప్రాంతంలో అధ్యయనం జరిపారు. అక్కడ అద్భుత రీతిలో ఆదిమానవుల మనుగడ సాగిందనే సత్యాన్ని తొలిసారి ఆయన 1863 ప్రాంతంలో ప్రపంచానికి చాటి చెప్పారు. సాధారణంగా ఆదిమానవులు కొంతకాలం పాటు జీవనం సాగించిన ప్రాంతాల్లో వారి సమాధులు కనిపిస్తాయి. మౌలాలి గుట్ట కింద అధిక సంఖ్యలో అలాంటి సమాధులను ఆయన గుర్తించారు. ఖననం చేసిన తర్వాత గుర్తుగా భూమి ఉపరితలంలో గుండ్రంగా రాళ్లను పాతుతారు. ఇలాంటి రాళ్ల సంఖ్య 18 నుంచి 25 వరకు ఉంటుంటాయి. ఇప్పటి వరకు గుర్తించిన అలాంటి సమాధుల వద్ద అంతే సంఖ్యలో రాళ్లు కనిపించాయి. కానీ మౌలాలి గుట్ట దిగువ భాగంలో ఓ సమాధి చుట్టూ 40 వరకు రాళ్లున్నట్టు అప్పట్లో గుర్తించారు. నాటి సమూహానికి అధిపతిగా వ్యవహరించిన వ్యక్తి సమాధి అయి ఉంటుందనేది నాటి అంచనా. అసఫ్‌జాహీల కాలంలో పురావస్తు విభాగాన్ని పర్యవేక్షించిన గులాం యజ్దానీ కూడా 1924 ప్రాంతంలో మౌలాలి గుట్టపై పరిశోధనలు జరిపారు. దక్కన్ పీఠభూమికి సంబంధించిన పురావస్తు విషయాలపై ఆయన రాసిన పుస్తకంలో మౌలాలి గుట్టలో ఆదిమానవుల మనుగడను ప్రస్తావించారు. ఆ సమయంలో అక్కడ జరిపిన పరిశోధనల్లో రాతి పనిముట్లు, ఆయుధాలతో పాటు కత్తులు, డాగర్లు, త్రిశూలాకృతులను పోలిన ఇనుప ఆయుధాలు కూడా లభించాయి. అంటే మధ్య రాతి యుగం నుంచి ఇనుప యుగం వరకు ఇక్కడ మానవ మనుగడ సాగిందని స్పష్టమైంది. అయితే అంతకుమించి పరిశోధనలు జరపలేదు. ఆ తర్వాత పురావస్తు విభాగం పెద్దగా స్పందించకపోవటం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో గుట్ట చుట్టూ కాలనీలు వెలిశాయి. నాటి మానవ మనుగడ గుర్తులన్నీ క్రమంగా ధ్వంసమయ్యాయి. రాయగిరి అవశేషాలతో పోలిక మౌలాలి గుట్ట వద్ద ఆదిమానవుల అవశేషాలు... నల్గొండ జిల్లా రాయగిరి గుట్ట వద్ద లభించిన అవశేషాలతో పోలి ఉన్నాయి. అక్కడ లభించిన పెంకులపై ఉన్న గుర్తులు బ్రాహ్మీ లిపిని పోలి ఉన్నాయి. అవే తరహా చిహ్నాలు మౌలాలి గుట్ట వద్ద లభించిన అవశేషాల్లోనూ కనిపించాయి. ఆదిమానవులు అంతుబట్టని రీతిలో రూపొందించిన దాదాపు 140 వరకు చిహ్నాలను ఇప్పటి వరకు పురావస్తు పరిశోధకులు గుర్తించగా... ఈ రెండు ప్రాంతాల మధ్య ఏడు చిహ్నాలు ఒకే రకంగా ఉన్నట్టు నాటి పరిశోధనల్లో తేలింది. భట్టిప్రోలు వద్ద లభించిన బ్రాహ్మీ లిపి శాసనంలోని కొన్ని గుర్తులతో ఇవి పోలి ఉండటం విశేషం. -
సత్యసాయి సంకల్పం మహోన్నతం
ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప వైభవంగా సత్యసాయి జయంతి వేడుకలు పుట్టపర్తి/కదిరి: కుగ్రామమైన గొల్లపల్లిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిగా తీర్చిదిద్దిన సత్యసాయి సంకల్పం మహోన్నతమైనదని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఆదివారం సత్యసాయి 89వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ, విదేశాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన భక్తుల నడుమ.. శోభాయమానంగా అలంకరించిన సాయికుల్వంత్ సభా మందిరంలోని బాబా మహాసమాధి చెంత ఉదయం ఎనిమిది గంటలకు విద్యార్థుల వేదమంత్రోచ్ఛారణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో 128 గ్రామాల్లోని 1.5 లక్షల మందికి తాగునీరు అందించేందుకు రూ. 80 కోట్లతో ఏర్పాటు చేసిన పథకాన్ని డిప్యూటీ సీఎం చినరాజప్ప ఇదే వేదికనుంచి ప్రారంభించారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్.జె. రత్నాకర్, చక్రవర్తి, శ్రీనివాసన్ చేతుల మీదుగా తాగునీటి పథకాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ పుట్టపర్తిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని చెప్పారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్ రుడాభాయ్ వాలా.. సెంట్రల్ ట్రస్ట్ వార్షిక నివేదికను ఆవి ష్కరించి, భక్తులు తయారు చేసిన 89 కిలోల సత్యసాయి బర్త్‌డే కేక్‌ను కట్ చేశారు. సత్యసాయి నీటి పథకాల రూపకల్పన, నిర్మాణాలలో ప్రముఖపాత్ర వహించిన ప్రభుత్వ మాజీ సలహాదారు కొండలరావును, ఎల్అండ్టీ ఉన్నతోద్యోగులను చినరాజప్ప సన్మానించా రు. వేడుకల్లో మంత్రులు పి. సునీత, పల్లె రఘునాథరెడ్డి, విప్ యూమినీ బాల, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యేలు పార్థసారధి, ఉన్నం హనుమంతరాయచౌదరి, వరదాపురం సూరి, మాజీమంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు. ప్రయాణికుల బస్సులో డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తన సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వచ్చి అనంతపురంలో దిగారు. విజయవాడ నుంచి శనివారం రాత్రి బయలుదేరి సాధారణ ప్రయాణికులతో పాటు ఆయన రావడంతో అధికారులు, పార్టీ నాయకులు ఆశ్చర్యపోయారు. -
ఆధ్యాత్మిక కేంద్రంలో.. చారిత్రక ఘట్టం!
14వ ఆర్థిక సంఘం సమావేశానికి వేదికైన తిరుపతి సాధారణంగా రాజధానిలోనే ఆర్థిక సంఘం సమావేశం విజయవాడలో కోడ్ అమల్లో ఉండటంతో వేదిక మారిన వైనం చారిత్రక ఘట్టానికి ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి వేదికైంది. విభజన తర్వాత రాష్ట్రంలో ప్రధానమైన 14వ ఆర్థిక సంఘం సమావేశానికి తిరుపతి వేదికగా మారింది. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతికి చేరుకున్న 14 ఆర్థిక సంఘం.. శుక్రవారం మొత్తం పలు అంశాలపై రాష్ర్ట ప్రతినిధులతో చర్చించింది. శనివారం ఉదయం పది గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే ఆదా యం రాష్ట్రానికి పంపిణీచేసే ప్రక్రియను ఆర్థిక సంఘం పర్యవేక్షిస్తుంది. రాజ్యాంగంలో 280 వ అధికరణ ద్వారా ఆర్థిక సంఘానికి ప్రత్యేకమైన విధులు, అధికారాలు కల్పించారు. తద్వారా ఆ సంస్థకు రాజ్యాంగ హోదా కల్పిం చారు. 2014-15 నుంచి 2019-20 వరకూ 14వ ఆర్థిక సంఘంచేసే ప్రతిపాదనలు అమ ల్లో ఉంటాయి. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే వైవీ.రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘాన్ని కేంద్రం ఏర్పాటుచేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర నిధుల పంపిణీపై సమావేశాలు నిర్వహించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆర్థిక సంఘాన్ని ఆదేశించారు. ఆ మేరకు 14వ ఆర్థిక సంఘం పర్యటన ఖరారైంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకూ పర్యటించాలని ఆర్థిక సంఘం నిర్ణయిం చింది. ఆర్థిక సంఘం సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించడం సమంజసం కాదని భావించిన ప్రభుత్వం.. తొలుత విజయవాడను వేదికగా ఎంపిక చేసింది. కానీ.. కృష్ణాజిల్లాలోని నంది గామ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. దాంతో.. అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో 14వ ఆర్థిక సంఘం సమావేశాలకు తిరుపతి వేదికగా మారింది. ఢిల్లీ నుంచి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతికి చేరుకున్న 14వ ఆర్థిక సంఘం జిల్లా అధికారయంత్రాంగంతో సమావేశమైంది. గురువారం రాత్రి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. శుక్రవారం ఉద యం పది గంటలకు 14వ ఆర్థిక సంఘంతో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు, ఆర్థికశాఖ కార్యదర్శి పీవీ.రమేష్ తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆర్థిక సంఘం ముందు ఏకరవు పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకూ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో సమావేశమైన ఆర్థిక సంఘం.. వారి ప్రతిపాదనలను స్వీకరించింది. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆర్థిక సంఘం.. నిధుల కేటాయింపులో అభిప్రాయాలను సేకరించింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి 5.30 గంటల వరకూ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. నిధుల కేటాయింపు.. పంపిణీలో రాజకీయపార్టీల అభిప్రాయాలనూ.. సూచనలను సేకరించింది. వీటిని క్రోడీకరించి కేంద్రానికి అక్టోబర్‌లో నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్రం మన రాష్ట్రానికి నిధులను కేటాయించనుంది. శుక్రవారం సమావేశాలు ముగిశాక 14వ ఆర్థిక సంఘం సభ్యులు తిరుపతిలో ఓ ప్రైవేటు హోటల్లో బస చేసి శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.