సత్యసాయి సంకల్పం మహోన్నతం
- ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప
- వైభవంగా సత్యసాయి జయంతి వేడుకలు
పుట్టపర్తి/కదిరి: కుగ్రామమైన గొల్లపల్లిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిగా తీర్చిదిద్దిన సత్యసాయి సంకల్పం మహోన్నతమైనదని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఆదివారం సత్యసాయి 89వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ, విదేశాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన భక్తుల నడుమ.. శోభాయమానంగా అలంకరించిన సాయికుల్వంత్ సభా మందిరంలోని బాబా మహాసమాధి చెంత ఉదయం ఎనిమిది గంటలకు విద్యార్థుల వేదమంత్రోచ్ఛారణతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
జిల్లాలోని పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో 128 గ్రామాల్లోని 1.5 లక్షల మందికి తాగునీరు అందించేందుకు రూ. 80 కోట్లతో ఏర్పాటు చేసిన పథకాన్ని డిప్యూటీ సీఎం చినరాజప్ప ఇదే వేదికనుంచి ప్రారంభించారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్.జె. రత్నాకర్, చక్రవర్తి, శ్రీనివాసన్ చేతుల మీదుగా తాగునీటి పథకాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ పుట్టపర్తిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని చెప్పారు.
కర్ణాటక గవర్నర్ వజూభాయ్ రుడాభాయ్ వాలా.. సెంట్రల్ ట్రస్ట్ వార్షిక నివేదికను ఆవి ష్కరించి, భక్తులు తయారు చేసిన 89 కిలోల సత్యసాయి బర్త్‌డే కేక్‌ను కట్ చేశారు. సత్యసాయి నీటి పథకాల రూపకల్పన, నిర్మాణాలలో ప్రముఖపాత్ర వహించిన ప్రభుత్వ మాజీ సలహాదారు కొండలరావును, ఎల్‌అండ్‌టీ ఉన్నతోద్యోగులను చినరాజప్ప సన్మానించా రు. వేడుకల్లో మంత్రులు పి. సునీత, పల్లె రఘునాథరెడ్డి, విప్ యూమినీ బాల, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యేలు పార్థసారధి, ఉన్నం హనుమంతరాయచౌదరి, వరదాపురం సూరి, మాజీమంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు.
ప్రయాణికుల బస్సులో డిప్యూటీ సీఎం
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తన సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వచ్చి అనంతపురంలో దిగారు. విజయవాడ నుంచి శనివారం రాత్రి బయలుదేరి సాధారణ ప్రయాణికులతో పాటు ఆయన రావడంతో అధికారులు, పార్టీ నాయకులు ఆశ్చర్యపోయారు.