RJ Ratnakar
-
సత్యసాయి మహా సమాధి దర్శనం రద్దు
పుట్టపర్తి అర్బన్: కరోనా నేపథ్యంలో సత్యసాయి మహాసమాధి దర్శనాన్ని ఈ నెల 28 నుంచి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ మంగళవారం తెలిపారు. సాయికుల్వంత్ మందిరంలో ప్రతి రోజూ జరిగే వేదపఠనం, భజన కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. భక్తులు వీటిని ఆన్లైన్, ఫేస్‌బుక్‌లలో తిలకించవచ్చన్నారు. మహాసమాధి దర్శనం తిరిగి ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు. -
సత్యసాయి సంకల్పం మహోన్నతం
ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప వైభవంగా సత్యసాయి జయంతి వేడుకలు పుట్టపర్తి/కదిరి: కుగ్రామమైన గొల్లపల్లిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిగా తీర్చిదిద్దిన సత్యసాయి సంకల్పం మహోన్నతమైనదని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఆదివారం సత్యసాయి 89వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ, విదేశాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన భక్తుల నడుమ.. శోభాయమానంగా అలంకరించిన సాయికుల్వంత్ సభా మందిరంలోని బాబా మహాసమాధి చెంత ఉదయం ఎనిమిది గంటలకు విద్యార్థుల వేదమంత్రోచ్ఛారణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో 128 గ్రామాల్లోని 1.5 లక్షల మందికి తాగునీరు అందించేందుకు రూ. 80 కోట్లతో ఏర్పాటు చేసిన పథకాన్ని డిప్యూటీ సీఎం చినరాజప్ప ఇదే వేదికనుంచి ప్రారంభించారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్.జె. రత్నాకర్, చక్రవర్తి, శ్రీనివాసన్ చేతుల మీదుగా తాగునీటి పథకాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ పుట్టపర్తిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని చెప్పారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్ రుడాభాయ్ వాలా.. సెంట్రల్ ట్రస్ట్ వార్షిక నివేదికను ఆవి ష్కరించి, భక్తులు తయారు చేసిన 89 కిలోల సత్యసాయి బర్త్‌డే కేక్‌ను కట్ చేశారు. సత్యసాయి నీటి పథకాల రూపకల్పన, నిర్మాణాలలో ప్రముఖపాత్ర వహించిన ప్రభుత్వ మాజీ సలహాదారు కొండలరావును, ఎల్అండ్టీ ఉన్నతోద్యోగులను చినరాజప్ప సన్మానించా రు. వేడుకల్లో మంత్రులు పి. సునీత, పల్లె రఘునాథరెడ్డి, విప్ యూమినీ బాల, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యేలు పార్థసారధి, ఉన్నం హనుమంతరాయచౌదరి, వరదాపురం సూరి, మాజీమంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు. ప్రయాణికుల బస్సులో డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తన సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వచ్చి అనంతపురంలో దిగారు. విజయవాడ నుంచి శనివారం రాత్రి బయలుదేరి సాధారణ ప్రయాణికులతో పాటు ఆయన రావడంతో అధికారులు, పార్టీ నాయకులు ఆశ్చర్యపోయారు. -
సామాజిక సేవే సత్యసాయి ట్రస్టు లక్ష్యం
తాడిపత్రి టౌన్ : సేవా ధృక్పథమే శ్రీ సత్యసాయి బాబా లక్ష్యమని, వాటికి అనుగుణంగా శ్రీసత్యసాయి సేవా సంస్థలు, సత్యసాయి ట్రస్ట్ పని చేస్తున్నాయని సత్యసాయి సేవా సమితి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్జె రత్నాకర్ పేర్కొన్నారు. స్థానిక వాటర్ వర్స్స్ రోడ్డులో సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి లక్ష్మీనారాయణ స్వామి వృత్తి విద్యా శిక్షణా కేంద్రాన్ని గురువారం సత్యసాయి సేవా సమితి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ప్రారంభించారు. అనంతరం స్థానిక సత్యసాయి సేవా సమితి ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రత్నాకర్ మాట్లాడుతూ సత్యసాయి స్పూర్తిగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా గత 18 సంవత్సరాలు 1500 గ్రామాల్లో సత్యసాయి ట్రస్ట్ ద్వారా ప్రజలకు నీటి సదుపాయం కల్పిస్తున్నామన్నారు. సత్యసాయి సేవా ట్రస్టు ద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉచిత వృత్తి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. క్రమశిక్షణతో శిక్షణ పొందాలని నిరుద్యోగ యువకులకు ఆయన పిలుపు నిచ్చారు. సత్యసాయి సేవా ట్రస్ట్ అధ్యక్షుడు హెచ్‌జె దొర మాట్లాడుతూ ఉపాధి శిక్షణతోపాటు, ఆధ్యాత్మిక చింతన విద్యార్థులు అలవరచుకోవాలన్నారు. శ్రీ సత్యనాయి సాధన ట్రస్ట్ సభ్యుడు లక్ష్మినారాయణ, సత్యసాయి సేవా సంస్థల ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రమణి, రాష్ట్ర అధ్యక్షుడు చలం, అనంతపురం సేవా సంస్థల అధ్యక్షుడు రామాంజప్ప,స్టేట్ కో ఆర్డినేటర్ కృష్ట కుమార్, తాడిపత్రి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వృత్తి విద్యా శిక్షణ కోర్సు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు దుస్తులు పంపిణీ చేశారు. -
గురుపౌర్ణమి నాటికి 120 గ్రామాలకు తాగునీరు
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ పుట్టపర్తి అర్బన్,న్యూస్‌లైన్: సత్యసాయి తాగునీటి పథకం ద్వారా వచ్చే గురుపౌర్ణమి నాటికి పుట్టపర్తి నియోజకవర్గంలోని 120 గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించనున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ పేర్కొన్నారు. గురువారం సత్యసాయి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని హిల్‌వ్యూ స్టేడియంలో నారాయణసేవను ప్రారంభించడానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 11 గంటలకు సత్యసాయి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలనం చేసి నారాయణ సేవను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఆరాధనోత్సవాల సందర్భంగా 50 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. జూలై 12న జరిగే గురుపౌర్ణమి నాటికి కొత్తచెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి మండలాల్లోని 120 గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమం అనంతరం సత్యసాయి చిత్రపటానికి మహా మంగళహారతి ఇచ్చారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మెంబర్లు చక్రవర్తి, ఆర్జే రత్నాకర్, శ్రీనివాసన్, నాగానంద, కార్యదర్శి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.