నాసిక్ త్రయంబకం ఈ రెండింటినీ కలిపి పలుకుతారు. కానీ ఈ రెండింటికీ మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉంది. త్రయంబకం జ్యోతిర్లింగం. ఇక్కడ పానవట్టం మీద మూడు చిన్న చిన్న శివలింగాలుంటాయి. నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీటిని చేత్తో తీసి బయట ΄ోస్తుంటారు పూజారులు. ఆ నీరు బ్రహ్మగిరి కొండల్లో నుంచి ఉబికి వస్తున్న గోదావరి నీరని చెబుతారు. త్రయంబకం ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. గ్రానైట్ రాయిలో చెక్కిన గోపురం, ఆ గోపురంలో చెక్కిన శిల్పాల సౌందర్యం కనువిందు చేస్తుంది. శిల్పకారులకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఆలయంలో నాలుగు వైపులా ద్వారాలుంటాయి.
స్పెషల్ దర్శనం కోసం ఆలయ సంస్థానం నిర్వహిస్తున్న దర్శనం కౌంటర్ ఉంటుంది. కానీ సమాంతరంగా స్థానికులు అవినీతిని ప్రోత్సహిస్తుంటారు. టికెట్ తీసుకోకుండా వాళ్ల చేతికి డబ్బిస్తే మరో ద్వారం నుంచి ఆలయంలో ప్రవేశపెడతారు. ఈ అవినీతిపరులు పర్యాటకులను మిస్‌లీడ్ చేస్తూ కౌంటర్ దగ్గరకు వెళ్లనివ్వకుండా దారి మళ్లిస్తుంటారు. ఆలయ కౌంటర్ నిడివి పెంచితే అవినీతి తగ్గుతుంది, ఆలయ గౌరవం పెరుగుతుంది. ఆలయం లోపల మాత్రం గంభీరమైన వాతావరణం, మనసును శివుడి మీద లగ్నం చేస్తుంది. త్రయంబకేశ్వరుడి దర్శనం తర్వాత ఎదురుగా కనిపిస్తున్న గుట్ట మీద అమ్మవారి ఆలయం ఉంది. త్రయంబకేశ్వరుడి ఆలయం పూర్తిగా నల్లగా ఉంటే అమ్మవారి విగ్రహంతోపాటు ఆలయం నేల నుంచి శిఖరం వరకు మొత్తం పాలరాతి నిర్మాణం.
కొండ మీద గోదావరి
త్రయంబకం తర్వాత బ్రహ్మగిరి కొండల వైపు సాగాలి. గోదావరి నది పుట్టిన ప్రదేశాన్ని చూడాలంటే నిట్టనిలువుగా ఉన్న కొండను నడిచి ఎక్కాల్సిందే. రెండు కొండల మధ్య ఇరుకు మెట్ల మీద పైకి వెళ్తుంటే నది పాయలు పర్యాటకులను పలకరించడానికి ఎదురు వచ్చినట్లు తల మీదకు జాలువారుతుంటాయి. కర్రసాయంతో కొండ ఎక్కడమే మంచిది. మెట్లెక్కి కొండ మీదకు చేరిన తర్వాత తెలుస్తుంది అది ఒక కొండ కాదని. విశాలంగా విస్తరించిన పశ్చిమ కనుమల శిఖరాల నుంచి ధారలు జలజలమని శబ్దం చేస్తూ కొండల మధ్య విశాలమైన ప్రదేశంలోకి చేరతాయి. అదే గోదావరి కుండ్. భక్తులు ఆ నీటిలో పుణ్యస్నానాలు చేస్తుంటారు. గోదావరి పుట్టిన ప్రదేశాన్ని చూసిన తర్వాత తిరుగు ప్రయాణంలో నాసిక్‌లో ఆగాలి. పంచవటి, సీతాగుహ, కాలారామ్ మందిర్ ప్రధానమైనవి. సీతాగుహలోకి వెళ్లి రావడం ఆసక్తిగా ఉంటుంది. కానీ రద్దీ చాలా ఎక్కువ. క్యూలైన్‌లోనే ఎక్కువ టైమ్ అయిపోతుంది. కాలారామ్ ఆలయంలో రాముడి విగ్రహం అందంగా ఉంటుంది. ఆలయ నిర్మాణం ఉత్తర దక్షిణాది శైలి సమ్మేళనంగా ఉంటుంది.
నాసిక్‌లో నాణేల ముద్రణాలయం ఉంది. ఎత్తైన కాంపౌండ్ వాల్‌ను మాత్రమే చూడగలం. టూర్ ఆపరేటర్‌ని అడిగితే ఆ రోడ్డులో తీసుకువెళ్తారు. షిరిడీ ప్రయాణంలో నాసిక్, త్రయంబకాలను కలుపుకోవచ్చు. షిరిడీ నుంచి బయలుదేరిన తర్వాత మొదట ముక్తిధామ్ వస్తుంది. ఈ పాలరాతి ఆలయంలో కృష్ణుడితోపాటు శివుడు... ఇంకా చాలామంది దేవతల రాజస్థాన్ మార్బుల్ విగ్రహాలుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాల నమూనాలుంటాయి. త్రయంబకేశ్వరుడిని కూడా చూడవచ్చు. షిరిడీ టూర్ ఆపరేటర్‌లు నిర్వహించే కంబైండ్ ప్యాకేజ్‌లలో బ్రహ్మగిరి ఉండదు. విడిగా వాహనం మాట్లాడుకోవాలి.
కొండ మీదకు ట్రెకింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రీ టైమ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక నాసిక్‌లో సీతాగుహలోకి వెళ్లడం కంటే క్యూలో మనవంతు కోసం వెయిట్ చేయడమే కష్టం. ఇక్కడ టోకెన్ సిస్టమ్ పెడితే బాగుంటుంది. పర్యాటకులు టోకెన్ తీసుకుని తమ వంతు వచ్చే వరకు ఎదరుగా ఉన్న ఇతర ఆలయాలు, పంచవటి వృక్షాలను చూస్తూ, తినుబండారాలతో కాలక్షేపం చేయవచ్చు. ఇంత సిస్టమాటిక్‌గా ఏమీ ఉండకపోవడంతో పర్యాటకులే స్వయంగా తమ వెనుక వారికి చెప్పి క్యూ లైన్ నుంచి బయటకు వచ్చి టీ స్టాల్‌లో టీ తాగి, స్నాక్స్ తిని మళ్లీ క్యూలో చేరుతుంటారు.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment