
అకుంఠిత దీక్షతో ఆశయ సాధన..
తొలియత్నంలోనే గ్రూప్-1లో విజయం
సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ స్థాయికి ఎదిగిన భానోదయ
కూచిపూడిలో నృత్యంలో గిన్నిస్ బుక్ రికార్డు
అకుంఠిత దీక్షతో గెలుపుతీరాలను చేరొచ్చని నిరూపించారు భానోదయ. తండ్రి మరణించినా ఆమె కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో.. తల్లి ప్రోత్సాహంతో ముందడుగు వేశారు. తన కోసం తల్లి పడే కష్టాన్ని చూసి చదువుతోపాటు కూచిపూడి నృత్యంపైనా శ్రద్ధపెట్టారు. నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు చలించిన ఆమె వాటి నివారణకు తనవంతు కృషి చేయాలని తలంచి గ్రూప్-1కు సిద్ధమయ్యారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ప్రస్తుతం గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె పూర్తి పేరు గొందేశి భానోదయ.
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): విశాఖ ప్రాంతానికి చెందిన గొందేశి భానోదయ తండ్రి రమణారెడ్డి స్టీల్ ప్లాంటులో చిరుద్యోగి. ఈమెకు తల్లి, ఓ సోదరి కూడా ఉన్నారు. చిన్ననాటి నుంచి కూచిపూడి నాట్యంపై అభిరుచితో తర్ఫీదు పొందారు. సిలికాన్ ఆంధ్ర సంస్థ వెయ్యి మందితో నిర్వహించిన నృత్య పోటీలో భానోదయ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 2011లో గిన్నిస్ బుక్ రికార్డును కైవసం చేసుకున్నారు. 2012లో కూచిపూడిలో డిప్లమా సాధించారు. 2013లో తండ్రి మరణించడంతో తల్లి వెంకటలక్ష్మి ఇంటి బాధ్యతలు భుజాన వేసుకున్నారు. ఇద్దరు కూతుళ్ల విద్యాభ్యాసంపై దృష్టిపె ట్టారు.
తల్లి ప్రోత్సాహంతో 2018లో ఎంఏ పూర్తిచేసిన భానోదయ సివిల్స్ సర్వీసెస్ కు శిక్షణ తీసుకున్నారు. తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 మెయిన్స్ పూర్తిచేశారు. రిజల్ట్ పెండింగ్ పడింది. 2020లో హైదరాబాద్ లో నిర్మాణ రంగ వ్యాపారం చేస్తున్న రామ్‌మనోహర్‌తో పెళ్లయింది. 2022లో గ్రూప్-1 ఫలితాలు వచ్చాయి. భానోదయ విజయం సాధించారు. డీఎస్పీగా శిక్షణ పూర్తిచేసుకుని తొలుత గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. ప్రస్తుతం గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిసున్నారు. భానోదయ దంపతులకు మూడేళ్ల కూమార్తె జుషరిత ఉన్నారు.
తల్లి, భర్త ప్రోత్సాహంతోనే -ఈస్థాయికి..
సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు బాధ కలిగిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు నా వంతు కృషి చేయాలని పోలీస్ శాఖ వైపు అడుగులు వేశా. నా తల్లి వెంకట లక్ష్మి నా భర్త రామ్మనోహర్ ప్రోత్సాహంతో ఈస్థాయికి వచ్చా. యువత దృఢమైన ఆశయంతో కష్టపడితే గెలుపు తీరాలకు చేరడం సులువే.
- గొందేశి భానోదయ, సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment