
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి తాజా బదిలీలు చాలు. ఓ వైపు ఉన్నవారికి పదోన్నతులు, పదవులు, బదిలీలు లేక ఆపసోపాలు పడుతుంటే ఏపీ పోలీసుశాఖ మాత్రం చనిపోయిన ఓ అధికారికి బదిలీ చేయడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. తక్షణమే పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వచ్చి జాబ్ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ కావడంతో.. బతికున్న తమను వదిలేసి చనిపోయిన పోలీసులకు పోస్టింగ్స్ ఇవ్వడమేంటని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు విషయం ఏంటంటే..
అనంతపురం జిల్లా కదిరి, గాన్లపెంట గ్రామానికి చెందిన డేరంగుల రామాంజనేయులు ఆరు నెలల కిందట చనిపోయారు. తిరుమల ఎస్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు.. అనారోగ్య సమస్యలతో ఆరు నెలల కిందట మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో 16 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీ ఉత్తర్వులలో కొన్ని నెలల కిందట చనిపోయిన రామాంజనేయులు పేరు ఉంది. ఆయనను తిరుమల నుంచి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ కు బదిలీ చేయడంతో పాటు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చనిపోయిన వ్యక్తిని బదిలీ చేయడం చర్చనీయాంశం కావడంతో నాలుక్కరుచుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ తప్పును కప్పిపుచ్చే యత్నం చేశారు. క్లరికల్ మిస్టేక్ అంటూ వివరణ ఇస్తూ.. బదిలీ జాబితా నుంచి రామాంజనేయులు పేరును తొలగించేశారు. ముందు బతికున్నవారికి పోస్టింగ్స్ ఇవ్వాలని, పద్ధతిలో బదిలీ చేయాలంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment