transfers issue
-
అట్నుంచి ఇటు.. ఇట్నుంచి అటు.. ఇదీ అక్కడి అధికారులు తీరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాలో పలువురు సబ్రిజిస్ట్రార్లపై బదిలీ వేటు పడనుందా? గాడ్ ఫాదర్లు, రాజకీయ అండదండలతో ఒకేచోట దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారికి ఈసారి స్థానచలనం కలగనుందా? అవినీతి ఆరోపణలున్నా.. కోరుకున్నచోట పోస్టింగ్ పొందుతున్న వారిపై ఇంటెలిజెన్స్ నివేదికలు సిద్ధమయ్యాయా? ఇందుకు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు పూర్తి చేసిందా? అంటే.. నిజమే అంటున్నారు కొందరు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలోని అధికారులు. చాలామంది సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తుండడం, కొందరిపై అవినీతి ఆరోపణలు, కొన్నిచోట్ల పనికి తగిన రీతిలో అధికారులు లేకపోవడం వంటి పలు కారణాలపై వివరాలు సేకరించిన ఉన్నతాధికారులు బదిలీపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి రాబడి తెచ్చే వాటిలో కీలకమైన ఈశాఖలో అక్రమాలకు పాల్పడుతున్న వారికి స్థానచలనం కలిగించాలని చూస్తున్నారు. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారిలో కొందరు సంపాదనే లక్ష్యంగా వివాదాస్పద రిజిస్ట్రేషన్లు చేస్తూ.. భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆ శాఖ పరిశీలనలో తేలినట్లు సమాచారం. ఈఆరోపణలపైనే గతేడాది ఉమ్మడి వరంగల్‌లో నలుగురిని సస్పెండ్ చేసిన అధికారులు.. మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జాబితాలో వారే.. వరంగల్ జిల్లాలో ఓసబ్ రిజిస్ట్రార్ 13 ఏళ్లుగా ఒకేచోట ఉన్నారు. తొమ్మిదేళ్లుగా సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతుండగా.. ఇదే కార్యాలయంలో ఈయన సీనియర్ అసిస్టెంట్‌గా ఐదేళ్లు పనిచేశారు. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్నానన్న ముద్రను తొలగించుకునేందుకు ఓసబ్ రిజిస్ట్రార్ జనగామ జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లాకు బదిలీ చేయించుకున్నారు. కొద్ది రోజులకే ‘గాడ్ ఫాదర్’ను కలిసి ప్రసన్నం చేసుకున్న సదరు అధికారి తిరిగి జనగామ జిల్లాకు మారారు. ఈయనపై కొందరు బాధితులు గతంలో జనగామ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ములుగు జిల్లాలో ఓసబ్ రిజిస్ట్రార్ పదకొండేళ్లకుపైగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో వేర్వేరుచోట్ల పనిచేస్తున్న మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఒకరు ఏడు, ఒకరు ఆరేళ్లుగా ఆ కార్యాలయాలను వీడడం లేదు. చేర్యాల సబ్ రిజిస్ట్రార్ ఎనిమిదేళ్లుగా బదిలీకి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్‌లో కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఒకేచోట లేదా వివిధ హోదాల్లో ఒకే కార్యాలయంలో పని చేస్తున్నారన్న ఆరోపణలతోపాటు కీలక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పలువురు సీనియర్ అసిస్టెంట్లే ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లుగా కొనసాగిన విషయం తెలిసిందే. ఆసమయంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, వాటిపై వచ్చి న ఫిర్యాదులు, ఆరోపణలపైనా జరిపిన విచారణ నివేదికను కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బదిలీలపై కసరత్తు చేస్తున్న సమాచారంతో ఆ జాబితాలో ఉన్న వారు పోస్టింగ్‌లను పదిలపర్చుకునేందుకు ప్రయత్నాల్లో పడ్డట్లు చర్చ జరుగుతోంది. పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు.. బదిలీలకు కసరత్తు జరుగుతుందన్న ప్రచారం మేరకు కీలక పోస్టింగ్‌ల కోసం పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వరంగల్‌లో సస్పెండ్ అయిన ఓ అధికారి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ శాఖలోనే ప్రచారం ఉంది. ఆర్డర్లు సిద్ధమయ్యేలోగా సస్పెన్షన్ ఎత్తివేయించుకునేందుకు హైదరాబాద్‌లో ‘గాడ్ ఫాదర్’ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గతేడాది నవంబర్‌లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా పలువురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు వరంగల్ ఆర్వోలో పనిచేస్తున్న ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలపై సస్పెండ్ అయిన వారిలో సంపత్‌కుమార్, సురేంద్రబాబు, శ్రీనివాస్, రామచంద్రయ్య ఉన్నారు. పూర్తిస్థాయి సబ్ రిజిస్ట్రార్లను నియమించే వరకు సూపరింటెండెంట్ భూపాల్, సీనియర్ అసిస్టెంట్ కార్తీక్‌లకు ఇన్‌చార్జ్‌లుగా ఆ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి నలుగురు సస్పెన్షన్‌లోనే కొనసాగుతున్నారు. సస్పెన్షన్ ఎత్తివేసినా జోన్ల మా ర్పులో భాగంగా ఓసబ్ రిజిస్ట్రార్ ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశం ఉండగా.. ఉద్యోగ సంఘాల కీలక నేతతో సత్సంబంధాలు కలిగిన ఓ సస్పెండ్ సబ్ రిజిస్ట్రార్ తిరిగి నియామక ఉత్తర్వులు పొందేందు కు యత్నిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. -
సీఎం కేసీఆర్‌వి తుగ్లక్ నిర్ణయాలు: బండి సంజయ్
సాక్షి, వరంగల్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల విషయంలో సీఎం కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వరంగల్‌లోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బీజేపీ రాజకీయ శిక్షణా తరగతులు గురువారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంజయ్ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 36 నెలల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంటే.. సీఎం కేసీఆర్ 36 నెలలుగా ఫాంహౌస్‌లో పడుకొని.. ఆగమేఘాలపై జీఓ 317 జారీ చేసి ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాడని ఆరోపించారు. స్థానికత కోసం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే.. అదే స్థానికత పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులను చీల్చి గోస పుచ్చుకుంటున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన 370 యాక్ట్ వచ్చినట్లు ఉందన్నారు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులు, భార్యాభర్తల బదిలీల్లో మూర్ఖంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, అన్యాయం జరిగిందని అర్జీ పెట్టుకున్నా పరిష్కరించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన అన్యాయాన్ని పునః పరిశీలించి అందరికి న్యాయం చేయాలని, 317 జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఉద్యోగుల పక్షాన ఉద్యమ కార్యాచరణ ప్రకటించక తప్పదని సంజయ్ హెచ్చరించారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలి.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలన వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రాబోయే సాధారణ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా పనిచేసినప్పుడే పార్టీ నిర్మాణం బలంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకురాలు బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వి.శ్రీ రాములు, జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, నాయకులు చింతాకుల సునీల్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: దేశాన్ని అమ్మకానికి పెట్టి కమ్యూనిస్టులపై విమర్శలా! -
ఇక్కడ నుంచి కదలరు.. ఎస్సై, సీఐ, ఏసీపీ.. ఏ ప్రమోషన్ వచ్చినా..
సాక్షి , కరీంనగర్: ఎస్సైగా అడుగుపెట్టడంతో మొదలైన ప్రయాణం ఏసీపీగా పదోన్నతి పొందినా స్థానచలనం కదలడం లేదు. రెండు మూడేళ్లు ఒకే పోలీస్‌స్టేషన్‌లో సీఐగా పనిచేసిన తరువాత బదిలీ కావలసివస్తే... పక్క పోలీస్‌స్టేషన్‌కో లేదంటే పక్క నియోజకవర్గానికో మారుతుంది. గత కొన్నేళ్లుగా కరీంనగర్లో కొందరు పోలీస్అధికారుల పోస్టింగులు ఉమ్మడి జిల్లాతో పాటు నార్త్‌జోన్‌లోనే చర్చనీయాంశంగా మారాయి. పోలీస్‌శాఖలో పలుకుబడి, రాజకీయ అండదండలు ఉంటే ఎన్నేళ్లయినా ఒక ప్రాంతంలోనే కొనసాగవచ్చుననే దానికి కరీంనగర్లో పోస్టింగ్‌ల తీరును పరిశీలిస్తే అర్థమవుతోంది. కరీంనగర్ రావడానికి ఇతర నియోజకవర్గాల తరహాలో ‘ఖర్చు’ ఉండకపోవడం... సంపాదనకు ఢోకా లేకపోవడంతో పాటు ఎస్సైలుగా ఉన్నప్పుడే పిల్లల చదువులు, స్థిర నివాసాలకు కరీంనగర్‌ను ఎంపిక చేసుకోవడం కూడా కారణమవుతోంది. దాంతో నగరానికి అలవాటైన అధికారులు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. అయినవారికి అందలం ప్రస్తుత పరిస్థితుల్లో ఓ మండలంలో గానీ పట్టణంలో గానీ సీఐ, ఎస్సైగా పోస్టింగ్ రావాలంటే స్థానిక ఎమ్మెల్యే రికమండేషన్ తప్పనిసరి. సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని అటవీప్రాంతాల నుంచి కరీంనగర్‌కు రావాలన్నా, తప్పనిసరై కరీంనగర్ నుంచి వేరే ‘మంచి’ మండలానికి బదిలీపై వెళ్లాలన్నా తొలుత ఎమ్మెల్యే సిఫారసు ముఖ్యం. కొన్ని నియోజకవర్గాల్లో పోలీస్ అధికారుల పోస్టింగ్ సిఫారసులకు కూడా రేట్లు ఫిక్స్ అయ్యాయనేది బహిరంగ రహస్యం. ఎమ్మెల్యేల సిఫారసులు, పోలీసు ఉన్నతాధికారుల ఆశీస్సులు లేనివారు అటవీ ప్రాంతాల్లోనో, ఎస్బీ, సీసీఎస్ తదితర పోస్టింగుల్లోనో సర్దుకుంటున్నారు. ఎస్సై నుంచి సీఐ, ఏసీపీ/డీఎస్పీ పోస్టింగ్‌లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. సాధారణ ఎన్నికల సమయాల్లో ఒకే జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన అధికారులను బదిలీ చేయడం ఆనవాయితీ. ఆ కారణంగా బదిలీ అయి పక్క జిల్లాలకు వెళ్లినా, ఎన్నికల తరువాత తిరిగి సొంత జిల్లాలకు వచ్చిన వారు ఎక్కువగానే ఉన్నారు. కాగా కరీంనగర్ చుట్టుపక్కల పోస్టింగ్ సంపాదించాలని ప్రయత్నించే చాలా మందికి నిరాశే ఎదురవుతోంది. ఇతర ప్రాంతాల వారు గానీ, ఇతర జిల్లాల వారు గానీ కరీంనగర్‌కు రావడం కష్టమైన పనేఅని పోలీసు వర్గాలే చెపుతున్నాయి. పెద్ద పైరవీ ఉంటే తప్ప వరంగల్ జోన్‌లోని ఇతర జిల్లాల నుంచి కరీంనగర్‌కు రావడం అంత ఈజీ కాదనేది వాస్తవం. ఎస్సై నుంచి సీఐ, ఏసీపీలుగా ఇక్కడే.. ► కరీంనగర్లో ఎస్సైగా పనిచేసిన అధికారి తరువాతకాలంలో స్థానికంగానే సీఐగా, ఏసీపీగా బాధ్యతలు నిర్వహించిన ఉదంతం ఉంది. ఒకే స్టేషన్లో ఎస్సై,సీఐగా బాధ్యతలు నిర్వర్తించిన వారు కూడా ఎక్కువే. ► వరుసగా కరీంనగర్ పరిధిలోని స్టేషన్లలో పనిచేసిన వారు కొందరైతే ... తప్పనిసరి బదిలీపై వేరే స్టేషన్లకు వెళ్లినా, తరువాత మళ్లీ కరీంనగర్లో పోస్టింగ్‌లు పొందిన వారు ఉన్నారు. వేరే ప్రాంతాలకు లేదా జిల్లాలకు వెళ్లిన అధికారులు సైతం ‘మంచి’ స్టేషన్లలో పనిచేసే అవకాశాన్నే పొందుతున్నారు. ► ఇటీవల ఏసీపీలుగా పదోన్నతి పొందిన వారిలో కొందరు కరీంనగర్, చుట్టుపక్కల, ఇతర ప్రాంతాల్లోని కీలక పోలీస్స్టేషన్లలోనే విధులు నిర్వర్తించారు. ► కరీంనగర్ పట్టణంలోని త్రీటౌన్, టూ టౌన్, వన్‌టౌన్.. మూడు స్టేషన్లలో సీఐగా పనిచేసిన చరిత్ర ఓ అధికారికి ఉంది. ఏసీపీగా పదోన్నతి తరువాత కూడా ఆయన కరీంనగర్‌లోనే ఓ విభాగానికి బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం. ► మరో అధికారి కరీంనగర్ ఎస్సైగా పనిచేసి తరువాత సీఐ పదోన్నతితో ఉమ్మడి జిల్లాలో కొంతకాలం విధులు నిర్వర్తించారు. తరువాత కరీంనగర్లో రెండు పోలీస్స్టేషన్లలో సీఐగా పనిచేసి ఇటీవలే ఏసీపీ అయ్యారు. ► గతంలో కరీంనగర్‌లోనే ఓ స్టేషన్ ఎస్సైగా పనిచేసిన అధికారి పదోన్నతి తరువాత టూటౌన్, ట్రాఫిక్, ఎస్బీ, తిమ్మాపూర్‌లో సీఐగా విధులు నిర్వర్తించారు. ఆయన కూడా మరోసారి కీలక విభాగానికి ఏసీపీగా కరీంనగర్‌కే రాబోతున్నట్లు తెలిసింది. ► వీరే కాకుండా ఉమ్మడి జిల్లాలో ఎక్కువకాలం పనిచేసి ఏసీపీలుగా పదోన్నతి పొందిన మరో ఇద్దరు అధికారులు కూడా కరీంనగర్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ► కరీంనగర్‌తో మంచి సంబంధాలున్న నలు గురు ఏసీపీలుగా విధుల్లో చేరనున్నారు. కరీంనగర్ చుట్టుపక్కల పనిచేసిన మరికొందరు.. ► ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ స్టేషన్ సీఐగా పనిచేస్తున్న అధికారి గతంలో కరీంనగర్ రూరల్ ఎస్సైగా çపనిచేశారు. ఆయన గత సంవత్సరం చివరలో జగిత్యాల జిల్లా నుంచి కరీంనగర్‌కు వచ్చారు. ► కరీంనగర్ పక్కనే ఉన్న ఓ కీలక స్టేషన్‌కు ఇటీవల బదిలీ అయిన ఓ అధికారి గతంలో కరీంనగర్‌లోని ఓ స్టేషన్ ఎస్సైగా, రూరల్, టాస్క్‌ఫోర్స్ సీఐగా పనిచేశారు. ► ఓ మహిళా పోలీస్ అధికారి గతంలో కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్, చొప్పదండిలో ఎస్సైగా పనిచేశారు. ఆమె తరువాత కాలంలో అదే మహిళా పోలీస్ స్టేషన్‌కు, పక్కనున్న మానకొండూర్‌కు సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించారు. హుజూరాబాద్‌లో సీఐగా పనిచేశారు. ప్రస్తుతం సీపీటీసీ సీఐగా విధుల్లో కొనసాగుతున్నారు. ► ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ స్టేషన్ సీఐగా పనిచేస్తున్న అధికారి గతంలో హుజూరా బాద్‌తో పాటు ఎస్బీ, మహిళా పోలీస్స్టేషన్లకు సీఐగా విధులు నిర్వర్తించారు. అంతకు ముందు ఎల్ఎండీ, కరీంనగర్ టూటౌన్, వీణవంక ఎస్సైగా పనిచేశారు. ► నిన్న మొన్నటి వరకు కరీంనగర్‌లోని ఓ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్గా ఉన్న అధికారి ఇటీవలే అదే ఆవరణలో ఉన్న మరో పోలీస్ స్టేషన్‌కు సీఐగా బదిలీ అయ్యి విధులు నిర్వహిస్తున్నారు. చదవండి: కొంప ముంచుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ -
బాబు పీఏ కోసం నిబంధనలు తుంగలో తొక్కి..!
సాక్షి, తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలో ఒక అధికారి అంతా తానై వ్యవహరిస్తున్నారు. వీసీ హరిబాబు హయాంలో పలు విమర్శలు మూటకట్టుకున్న ఆయన ఇప్పుడు వీసీ పదవీ కాలంలో ఆయన తీసుకుంటున్న చర్యలు సరికొత్త వివాదాలకు దారి తీస్తున్నాయి. వెటర్నరీ వర్సిటీ పరిపాలన భవనంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆయనపై విమర్శలు, ఆరోపణలు రావడంతో అప్పట్లో వీసీ హరిబాబు ఆయనను ముత్తుకూరులో మత్య్స కళాశాలకు బదిలీ చేశారు. అయితే టీడీపీలో తనకున్న పలుకుబడితో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పీఏగా డిప్యుటేషన్‌పై వెళ్లారు. మూడేళ్ల కాలం డిప్యుటేషన్‌పై వెళ్లిన ఆ అధికారిని.. రిజిస్ట్రార్ నిబంధనలకు వ్యతిరేకంగా వెటర్నరీ పరిపాలన భవనంలోకి కీలక పోస్టులోకి బదిలీపై తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతే కాకుండా మాజీ వీసీ హయాంలో తన దొడ్డిదారి ప్రయత్నాలను అడ్డుకుంటూ వచ్చిన కొందరు ఉద్యోగులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేశారనే ప్రచారంలోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధం వర్సిటీలో బదిలీలు, ఉద్యోగోన్నతులు.. ఇలా ఏవి చేయాలన్నా దిగువ స్థాయి ఉద్యోగి నుంచి ఫైల్ రూపొందించి ఉన్నతాధికారులకు చేరాలి. అయితే ఒక అధికారి తన కార్యాలయంలోనే ఫైల్ రూపొందించి ఇన్చార్జ్ వీసీ అప్రూవల్ కోసం పెట్టినట్లు సమాచారం. ఇన్చార్జ్ వీసీ అన్ని అంశాలు పరిశీలించే పరిస్థితి లేకపోవడంతో సదరు అధికారి పక్కా స్కెచ్ వేసినట్లు వర్సిటీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో దొడ్డిదారి బదిలీలకు తెరతీశారనే విమర్శలు వినవస్తున్నాయి. అలాగే, ఇటీవ ల బదిలీలు, ఉద్యోగోన్నతులు కల్పించిన ఆచా ర్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వీసీకి గవర్నర్ చీవాట్లు పెట్టడం విదితమే. పరీక్షలు నిర్వహించకనే ప్రమోట్! వెటర్నరీ వర్సిటీలో బీవీఎస్సీ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాక తదుపరి ఏడాదిలోకి ప్రమోట్ చేస్తారు. అయితే కరోనా సాకుగా చూపి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కరోనా ప్రభావం ముగిసి సాధారణ పరిస్థితి వచ్చాక పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పై తరగతికి ప్రమోట్ అయిన విద్యార్థి ఒకవేళ ఫెయిల్ అయితే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ప్రతిపాదనను కొందరు వర్సిటీ అధికారులు వ్యతిరేకించినట్లు సమాచారం. చదవండి: ‘నిరర్థక’ నిర్ణయం టీడీపీ హయాంలోనే చంద్రబాబు పీఏ కోసం నిబంధనలకు పాతర వెటర్నరీ వర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఒక అధికారి గత ఏడాది జూలై 15న చంద్రబాబు పీఏగా నియమితులయ్యా రు. చంద్రబాబు వద్ద పనిచేస్తున్న సదరు అధికారికి 2011లో జారీ చేసిన జీఓ నంబర్ 522 ఆధారంగా వెటర్నరీ వర్సిటీ వేతనం చెల్లిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ వీసీ లేకపోవడంతో టీడీపీ సానుభూతిపరులు తమ పనులు చక్కబెట్టుకోవడం కోసం ఆగమేఘాల మీద వెటర్నరీ పరిపాలన భవనంలో కీలక పదవిలోకి తీసుకొచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇన్చార్జ్ వీసీ, ప్రభుత్వం పూర్తి స్థాయి దృష్టి సారిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
గిరి దాటని ‘ఖాకీ’లు
సాక్షి, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీస్స్టేషన్లలో పనిచేసే కొందరు ‘ఖాకీ’లు రెండుమూడు ఠాణాల పరిధిలోనే దీర్ఘకాలికంగా గిరిదాటకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఠాణాలో పనిచేస్తూనే మరొక ఠాణాలో అటాచ్డ్గా.. విధులను అదనంగా నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు పోలీసుల క్రిందిస్థాయి సిబ్బంది.. ఈ అటాచ్డ్ విధుల కోసం ప్రత్యేకంగా ఆయా ఠాణాల్లోనే అటాచ్డ్ విధులను కొనసాగిస్తున్నారు. ఆ కొందరికి మాత్రమే ఈ అటాచ్డ్ విధులను అప్పగించడం వెనుక ఆంతర్యమేమిటో అని మిగతా పోలీస్ సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కమిషనరేట్ పరిధిలో పోలీసుల బదిలీలు అనేకం జరిగినప్పటికీ.. ఆ కొందరు మాత్రం యథావిధిగా ఆయా ఠాణాల్లోనే బదిలీలు లేకుండా, కాకుండా ఎప్పటిలాగే విధులు నిర్వర్తిస్తున్నారు. అనేక మంది పోలీస్ సిబ్బంది పలు పోలీస్స్టేషన్లకు బదిలీలు అయినా ఆ వారు మాత్రం బదిలీలు వచ్చినప్పటికీ, బదిలీ కాకపోవడం వెనుక మతలబు ఏమిటో అంతుచిక్కడం లేదు. రాజకీయంలో జోక్యం.. కమిషనరేట్ పరిధిలోని కొందరు పోలీస్ సిబ్బంది రాజకీయ పలుకుబడితో తమకు నచ్చిన ఠాణాలకు బదిలీ చేయించుకుంటున్నారనే ఆరోపణలు సైతం వినవస్తున్నాయి. అదేవిధంగా మరి కొంతమంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌స్టేషన్‌లోనే కొనసాగేలా రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా దీర్ఘకాలంగా పనిచేసే కొందరు సిబ్బందిని, అదేవిధంగా చాలా రోజులుగా ఒక ఠాణాలో పనిచేస్తూ మరొక ఠాణాలో అటాచ్డ్గా విధులు నిర్వర్తించే వారిపై సైతం ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు.. రామగుండం కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా కమిషనరేట్ ఉన్న ప్రాంతంలోని రెండు ఠాణాల్లో పని చేసే కొందరు కిందిస్థాయి పోలీస్ సిబ్బంది దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. రెండు సంవత్సరాలకు ఒకసారి పోలీసులు బదిలీలు జరుగుతున్పప్పటికీ కొందరు మాత్రం ఆయా ఠాణాల్లో పనిచేస్తూ ఇక్కడిక్కడే మరొక ఠాణాలో అటాచ్డ్గా పనిచేస్తున్నారు. ఆ కొందరి సిబ్బందికి అడ్డూ.. అదుపు లేకుండా ఇక్కడిక్కడే ఏళ్లతరబడి పనిచేస్తున్నారు. 95 శాతం బదిలీలు.. ఇటీవల జరిగిన పోలీసుల బదిలీల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 95 శాతం సిబ్బందికి బదిలీలు అయ్యాయి. జిల్లా మొత్తంలో పదుల సంఖ్యలో మాత్రమే బదిలీలు ఆగాయి. ఇటీవల జరిగిన గణేశ్, నవరాత్రోత్సవాలు, మొహర్రం పండుగల నేపథ్యంలో ఆయా సిబ్బంది స్టేషన్లలో విధుల నిమిత్తం ఉంచడం జరిగింది. కొంత మందికి మాత్రం కుటుంబసభ్యులు అనారోగ్యం కారణంగా, త్వరలో పదవీ విరమణ పొందే వారికి మాత్రం బదిలీలు ఆపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ డివిజన్ నుంచి మరో డివిజన్‌కు బదిలీ చేశాం. దీర్ఘకాలికంగా ఒకే చోట అటాచ్డ్గా ఎక్కువ కాలం విధులు నిర్వహిస్తున్న వారిపై దృష్టి సారిస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకుంటాం. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సిబ్బందిని గుర్తించి బదిలీ అయ్యేలా చూస్తాం. – టి.సుదర్శన్‌గౌడ్, పెద్దపల్లి డీసీపీ -
అటవీ శాఖలో అవినీతి వృక్షం
అటవీ శాఖలో బదిలీలు వివాదాస్పదంగా మారాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన అటవీ శాఖలోని ఒక ఉన్నతాధికారి బదిలీల్లో చేతివాటం ప్రదర్శించారు. గత ప్రభుత్వం వెన్నుదన్నుతో ఐదేళ్లు ఒకే స్థానంలో విధులు వెలగబెట్టిన ఆ అధికారి వసూళ్లకు అడ్డూ అదుపులేకుండా పోయింది. గతంలో తిరుపతి డివిజన్లో పనిచేసిన ఆ అధి కారికి చిత్తూరు డివిజన్లో విధులు నిర్వహించిన అనుభవం ఉంది. దీంతో ఆ శాఖపై పూర్తిస్థాయి పట్టు సాధించారు. ఐదేళ్ల కాలంలో ఆయన అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోయిందనే ప్రచారముంది. సాక్షి, తిరుపతి/పుత్తూరు: రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఇక స్థానచలనం తప్పదని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకున్నారు. ఇంతలో బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇదే అదనుగా భావించి డివిజన్ పరిధిలోని సిబ్బందిని ఇష్టారాజ్యంగా బదిలీలు చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కేవలం నెల క్రితం విధుల్లో చేరిన సిబ్బందిని సైతం బదిలీ చేసినట్లు సమాచారం. ముడుపులే ప్రామాణికంగా ఆ అధికారి బదిలీలకు తెరతీయడంతో సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం బది లీలను రద్దు చేసే అవకాశాలున్నాయి. చేతులు మారిన రూ.30 లక్షలు చిత్తూరు పశ్చిమ డివిజన్లో ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడం ద్వారా సదరు ఉన్నతాధికారి రూ.30 లక్షలు దం డుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డివిజన్ పరిధిలోని బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, గార్డులు, వాచర్లతో చిత్తూరులో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులనే బదిలీ చేయాల్సి ఉంది. ఆ అధికారి ప్రతి ఉద్యోగి నుంచి బదిలీలకు సంబంధించి మూడు ఆప్షన్లు ఇవ్వమన్నారు. కేవలం నెల నుంచి సంవత్సరం క్రితం విధుల్లో చేరిన ఉద్యోగులను సైతం ఒత్తిడి చేసి మరీ ఆప్షన్లు తీసుకున్నారు. తన చేతికి మట్టి అంటకుండా దిగువస్థాయిలో నాయకులుగా చెలామణి అవుతున్న కొందరు ఉద్యోగులను రంగంలోకి దింపారు. వారి ద్వారా ముడుపుల బాగోతానికి తెరదీశారు. ఒక్కొక్కరి బది లీకి సంబంధించి రూ.25– 50 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆది నుంచి వివాదాస్పదమే గతంలో కుప్పం రేంజ్ అధికారిగా పనిచేస్తున్నప్పటి నుంచి ఆ అధికారిపై అవినీతి ఆరోపణలున్నట్లు సమాచారం. అక్కడి నుంచి పదోన్నతిపై తిరుపతి వైల్డ్‌లైఫ్ విభాగానికి బదిలీ కాగా, ఎర్రచందనం స్మగ్లర్లతో పరిచయాలు ఉన్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందా యి. 2014వ సంవత్సరం ఎన్నికలకు ముందు ఉన్నతస్థాయిలో పైరవీలు చేసుకుని గతంలో రేంజర్‌గా పనిచేసిన చిత్తూరు సబ్ డివిజన్‌కే ఉన్నతాధికారిగా బదిలీ చేయించుకున్నట్లు సమాచారం. కుప్పంలో పనిచేసినప్పటి రాజకీయ సంబంధాలు, సామాజిక నేపథ్యాన్ని చక్కగా ఉపయోగించుకున్న అధికారి అవినీతికి అర్రులు చాచినట్లు సమాచారం. డివిజన్ పరిధిలోని పుంగనూరు రేంజ్లో నిబంధనలకు విరుద్ధంగా క్వారీలకు అనుమతిచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటవీ శాఖకు సంబంధించిన భూముల్లో నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ క్వారీలకు అనుమతిస్తూ ఎన్ఓసీ జారీ చేసినట్లు ఉన్నతా«ధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రస్తుతం శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఐదేళ్ల కాలంలో రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అధికారి చేస్తున్న అవినీతి అక్రమాలపై ఆ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటం గమనార్హం. ఒకే తేదీతో రెండు ఎస్ఓలు ► బదిలీల్లో భాగంగా ఈనెల 10వ తేదీన అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లకు సంబంధించి ఎస్ఓ (శాంక్చన్ ఆర్డర్) ఇచ్చిన ఉన్నతాధికారి ఇదే తేదీతో మరో ఎస్ఓను కూడా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే తేదీతో రెండు ఎస్ఓలు విడుదల కావడంతో ఏఎస్వో ప్రకారం బదిలీలు వర్తిస్తాయనే విషయం తెలియక ఉద్యోగులు తికమకపడుతున్నారు. ► ఒక ఎస్ఓ ప్రకారం ఒక అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌ను చిత్తూరు వెస్ట్ రేంజ్ నుంచి పుంగనూరు రేంజ్‌లోని వల్లిగట్ల బీట్‌కు బదిలీ చేశారు. మరో ఎస్ఓలో అదే ఉద్యోగిని పుంగనూరు రేంజ్‌లోని కందూరు బీట్‌కు బదిలీ చేశారు. నిబంధనలకు పాతరేస్తూ... ►డివిజన్ పరిధిలో జరిగిన బదిలీల్లో నిబంధనలకు పూర్తిగా పాతరేసినట్లు తెలుస్తోంది. ముడుపులివ్వని ఉద్యోగులను ఇష్టారాజ్యంగా బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ► నెల క్రితమే మదనపల్లె రేంజ్లో విధుల్లో చేరిన ఒక మహిళా ఉద్యోగిని పలమనేరు రేంజ్‌కు బదిలీ చేశారు. ఆ ఉద్యోగిని నెల వేతనం కూడా తీసుకోకముందే బదిలీ అయ్యింది. ► రెండేళ్ల క్రితం పుంగనూరు రేంజ్లో విధుల్లో చేరి ప్రస్తుతం మెడికల్ సెలవుపై ఉన్న ఒక ఉద్యోగిని కుప్పం రేంజ్‌కు బదిలీ చేశారు. ► గత ఏడాది మదనపల్లె రేంజ్లో విధుల్లో చేరిన మరో ఉద్యోగిని పీలేరు సామాజిక అడవుల పెంపకం విభాగానికి బదిలీ అయ్యారు. ► ఆరు నెలల క్రితం మదనపల్లె రేంజ్‌లోని ఒక బీట్‌కు బదిలీపై వచ్చిన మ హిళా ఉద్యోగిని అదే రేంజ్ పరిధిలోని మరో బీట్‌కు బదిలీ చేశారు. -
ఆ వీఆర్ఓ.. అన్నింటా సిద్ధహస్తుడు..
సాక్షి, అనంతపురం టౌన్: అనంతపురం రూరల్ మండలం చియ్యేడు రెవెన్యూ గ్రామ వీఆర్ఓ 10ఏళ్లుగా అనంతపురం తహసీల్దారు కార్యాలయంలోనే పనిచేస్తున్నాడు. సాధారణ బ దిలీల సందర్భంలో బదిలీ అయినా తిరిగి యథాస్థానంలో ఉండేలా చక్రం తిప్పుతున్నాడు. చియ్యేడు నుంచి ఏ నారాయణపురానికి బదిలీ చేయించుకొని తిరిగి అనంతపురం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నాడు. మరో ఐదేళ్లు ఆయన నిశ్చింతంగా ఇక్కడే పనిచేస్తాడు. తన సర్వీస్‌లో దాదాపు 15 ఏళ్లు ఇక్కడే పనిచేస్తున్నాడంటే ఆయన సత్తా ఏమిటో తెలుస్తోంది. ఓ వీఆర్ఓ 2008నుంచి ఇప్పటి వరకు అనంతపురం తహసీల్దారు కార్యాలయ పరిధిలోనే విధులు నిర్వహిస్తున్నాడు. ప్ర స్తుతం అర్బన్‌లో మూడవ వార్డుకు వీఆర్ఓగా పని చేస్తున్నాడు. తాజా బదిల్లీలో 5వ వార్డుకు బదిలీ చేశారు. ఇతను ఇప్పటికే దాదాపు 11 ఏళ్లు సర్వీస్ అనంతపురం తహసీల్దారు కార్యాలయంలోనే పూర్తి చే శాడు. ఇప్పుడు మరో 5 ఏళ్ల పాటు ఇక్కడే కొనసాగనున్నాడు. ఇలాంటి వీఆర్ఓలు అనంతపురం తహసీల్దారు కార్యాలయంలో అనేక మంది ఉన్నారు. వివరాల్లో కెళ్తే... అనంతపురం తహసీల్దార్ కార్యాలయంలో అనేక మంది గ్రామ రెవెన్యూ అధికారులు కొన్నేళ్లుగా తిష్టవేసి వ్యవహారాలు చక్కబెడ్తున్నారు. సాధారణ బదిలీల సమయంలో వీరు కలెక్టరేట్లోని ఓ డిప్యూటీ తహసీల్దార్‌ను ఆశ్రయిస్తారు. బదిలీలు చేసినా తిరిగి వారు యథాస్థానంలో ఉండేలా ఆయన చక్రం తిప్పుతున్నారన్నది బహిరంగ రహస్యం.అనంతపురం త హసీల్దారు కార్యాలయంలో 25 మంది వీ ఆర్ఓలు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో దాదాపు 10 మందికి పైగా వీఆర్ఓలు కొ న్నేళ్లుగా ఇక్కడ పాతుకుపోయారు. ప్రతి బదిల్లీలోనూ అర్బన్ నుంచి రూరల్‌కు, రూరల్ నుంచి అర్బన్‌కు మారుతూ తమ సర్వీస్ మొత్తం ఇక్కడే పూర్తి చేయనున్నారు. వీఆర్ఓలపై ఆరోపణలు ఎన్నో: ప్రభుత్వ భూములకు పట్టాలను జారీ చేయడంలో అనంతపురం తహసీల్దారు కార్యాలయంలో పని చేస్తున్న కొందరు వీఆర్ఓలు సిద్ధహస్తులు. వీరిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేశారు. అయినా వీరిని బదిలీ చేయకపోవడం గమనార్హం. అనంతపురం రూరల్ మండలం నగరానికి దగ్గరలో ఉంది.. దీంతో ఇక్కడి భూములకు మార్కెట్లో మంచి విలువ ఉంది. గతంలో అర్బన్‌లో పన చేస్తున్న ముగ్గరు వీఆర్ఓ దేవుని మాన్యానికే ఎసర పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. కొడిమి గ్రామంలోని 15 ఎకరాల ఆంజనేయస్వామి మాన్యాన్ని కాజేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతోపాటు పంచాయతీ ఓపెన్ స్థలాలకు సైతం డి.పట్టాలను మంజూరు చేశారు. దీనిపై అప్పట్లోనే ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు ప్రచురించడంతో విరమించుకున్నారు. ఏళ్ల తరబడి ఒకేచోట తిష్టవేసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వీఆర్ఓలకు ఇకనైనా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. బదిలీ నిబంధనలు గాలికి వీఆర్ఓల బదిలీల్లో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వీఆర్ఓలను పనిచేసే చోటు నుంచి మరో మండలానికి బదిలీ చేయాలి. అనంతపురం తహసీల్దారు కార్యాలయంలో కొందరు వీఆర్ఓలను మాత్రమే ఇతర మండలాలకు బదిలీ చేశారు. అయితే 10 మందికిపైగా వీఆర్ఓలను అటు నుంచి ఇటు మార్చి తహసీల్దారు కార్యాలయంలోనే ఉంచారు. ఉదాహరణకు అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి, ఆకుతోటపల్లిలో వీఆర్ఓలు 5 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్నారు. అయితే వీరిని మరో మండలానికి బదిలీ చేయకుండా ఇక్కడే ఉంచారు. -
వదల బొమ్మాళీ..!
సాక్షి, ఒంగోలు సిటీ: ఫోకల్ సీట్లంటే దండిగా డబ్బులొచ్చేవి. పై అధికారుల పలుకుబడి సంపాయించి పెట్టేవి. నాన్ ఫోకల్ సీట్లంటే ఎడతెరిపి లేకుండా.. మెండుగా పని ఉండేవి. క్షణం తీరిక లేకుండా దమ్మిడి ఆదాయం లేకుండా ఉండేవి. సహజంగా ఉద్యోగులు వీటిలో మొదటి సీటుకే ఓటు వేస్తారు. దీంతో ఫోకల్ సీట్లకు గిరాకీ బాగా పెరిగింది. జిల్లా పరిషత్తు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల్లో బదిలీల జాతర మొదలయినప్పటి నుంచి బలవంతుల గురి ఫోకల్ సీట్లపైనే. ఈ సీజన్లో మోతాదు మరికాస్త రెట్టించింది. ఎక్కువ మంది ఫోకల్ సీట్లలో ఉండేందుకే ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. దీంతో జిల్లా పరిషత్తు పరిధిలోని ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీల జాతర జరుగుతోంది. జిల్లా పరిషత్తు, జిల్లా పరిషత్తు పరిధిలోని పాఠశాలలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీలకు దరఖాస్తుల గడువు ముగిసింది. అన్ని కేడర్లలో కలిపి 520 దరఖాస్తులు వచ్చాయి. తొలుత ఈ నెల 5వ తేదీ నాటికి బదిలీ ప్రక్రియ పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం పొడిగించడంతో ఈ నెల10వ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలి. జెడ్పీ చైర్మన్ వ్యవస్థ ఉంటే వారి కనుసన్నల్లో బదిలీలు జరిగేవి. ఈ నెల 4వ తేదీతో చైర్మన్ల వ్యవస్థ రద్దయింది. జెడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లా పరిషత్తు ముఖ్యకార్యనిర్వహణాధికారిగా జాయింట్ కలెక్టర్ సగిలి షన్మోహన్ బాధ్యతలను స్వీకరించారు. బదిలీల వంతు వీరి పర్యవేక్షణకు వచ్చింది. గతంలో జెడ్పీ పరిధిలోని ఉద్యోగులు, పీఆర్ ఇంజినీరింగ్ శాఖల్లోని ఉద్యోగులు బదిలీల వ్యవహారంలో బలాబలాలు చూపించేవారు. పెద్ద ఎత్తున సిఫార్సులు తెచ్చే వారు. గత ప్రభుత్వ హయాంలో మంచి ఫోకల్ సీట్లలో పని చేసిన వారు, గత ఐదేళ్లుగా ఫోకల్లోనే ఉన్న వారు తిరిగి ఈ ప్రభుత్వంలోనూ ఫోకల్ సీట్లను ఆశిస్తున్నారు. గట్టిగా పోటీ పడుతున్నారు. మరీ గట్టిగా సిఫార్సులు చేయిస్తున్నారు. దీంతో రాజకీయం అంతా ఫోకల్ సీట్ల చుట్టూనే గిరాగిరా మంటోంది. వీరెక్కడికి పోరట..! జిల్లా పరిషత్తు పరిధిలోని వివిధ విభాగాలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలోని పీఐయూ, క్వాలిటి కంట్రోల్ ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీకి సీట్లు కోరుకుంటున్నారు. గతంలో ఇక్కడే పని చేసిన వారు తిరిగి ఇక్కడే ఉండేందుకు సిఫార్సులు పొందుతున్నారు. నిబంధనల మేరకు ఇప్పటి వరకు ఫోకల్ సీట్లలో పని చేసిన వారిని నాన్ ఫోకల్ సీట్లకు బదిలీ చేయాలి. జిల్లా పరిషత్తు పాఠశాలలు ఇతర విభాగాలకు అంతగా ప్రాధాన్యం లేని సీట్లకు వీరిని బదిలీ చేయాలి. జెడ్పీలో వివిధ కేడర్లలో ఖాళీలు ఉన్నందున అర్హత అంతగా లేని వారిని కూడా అందలమెక్కిస్తున్నారు. కీలకమైన సీట్లలో రాజసం వెలగబెడుతున్నారు. వీరిని ఇక్కడి నుంచి బదిలీ చేయడానికి తగిన నిబంధనలు ఉన్నా నిబంధనలను పక్కన పెట్టండి. ఫోకల్ సీట్లకు బదిలీ చేయండని అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఏళ్ల నుంచి పాతుకుపోయిన వీరు తిరిగి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లరట.. అని జెడ్పీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. పెరుగుతున్న పోటీ.. బదిలీ ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో పూర్తి చేయాలి. బదిలీ పరిధిలో 520 మంది వివిధ హోదాల్లోని వారు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 260 మంది వరకు ఫోకల్ సీట్లే కావాలని పట్టుబడుతున్నట్లుగా సమాచారం. వీరు నేతల ద్వారా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకరి చూసి మరొకరు పోటీ పడుతున్నారు. బదిలీ నిబంధనలతో పని లేదంటున్నారు. అడిగిన సీట్లకు బదిలీ చేయమంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు కొందరి వ్యవహారాలు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని సమాచారం. గతంలో జరిగిన బదిలీల్లో నిబంధనలు అమలయినా లేకపోయినా నడిచిందంటున్నారు. ఇప్పుడలా కాదు.. జిల్లా అధికారులైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఉద్యోగుల బదిలీలను చూస్తున్నారు. నియమాలు, నిబంధనలు కచ్చితంగా పాటిస్తారని సిఫార్సులు తెచ్చుకోలేని వారు న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులపై బదిలీల వ్యవహారంలో విపరీతమైన ఒత్తిడి కొనసాగుతోంది. ఎక్కువ మంది కోరుతుంది ఇక్కడికే.. ఎక్కువ మంది పీఆర్ ఇంజినీరింగ్ విభాగంలో ఉండేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరాలో ఉన్న వారు అక్కడికే మరో సబ్ డివిజన్, డివిజన్‌కు కోరుకుంటున్నారు. పంచాయతీరాజ్‌లో ఉన్న వారు క్వాలిటీ కంట్రోలు విభాగం, పంచాయతీరాజ్ ప్రాజెక్టు యూనిట్ ఇంజినీరింగ్ విభాగాల్లోనే కొన్ని విభాగాల్లో సీట్లకు కోరుకుంటున్నారు. మండలాల్లోని ఫోకల్ సీట్లకు కూడా ఇదే తరహాలో ఒత్తిడి పెరుగుతోంది. నాన్ ఫోకల్ సీట్లకు పోటీ లేకుండా పోయింది. ఒకే కేంద్రంలో ఐదేళ్లు నిండిన వారు సైతం ఫోకల్ సీట్లకు పోటీ పడుతున్నారు. జెడ్పీ రాజకీయం మొత్తం ఫోకల్ సీట్లపైనే తిరుగుతోంది. -
ఏముందో అక్కడ?
చిత్తూరు పోలీసు శాఖలో జరగాల్సిన బదిలీల కౌన్సెలింగ్‌లో అయినవారిని అందలం ఎక్కించడానికి కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారా..? ఇందులో భాగంగానే ఐదు ప్రధాన విభాగాలను అడగొద్దంటూ సిబ్బందికి ఆప్షనల్ ఫారమ్‌లో సూచించారా..? ఈ లెక్కన పదోన్నతి పొందిన సిబ్బందికి నిర్బంధ బదిలీ చేస్తున్నారా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ బదిలీ కావడంతో.. పోలీసుశాఖలో ‘కీ’లకంగా ఉన్న ఓ అధికారి బదిలీల వ్యవహారంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, చిత్తూరు అర్బన్: పోలీసుల బదిలీల కౌన్సెలింగ్ ఉత్తర్వులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్షనల్స్‌గా కొన్ని విభాగాలను ఎంచుకోకూడదన్న నిబంధనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ శాఖలను ఎందుకు ఎంచుకోకూడదు? ఎవరికోసం ఆ నిబంధన పెట్టారు.. ఇంతకీ అక్కడ ఏముంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందికి పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. చిత్తూరు పోలీసు జిల్లాలో 104 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా.. 46 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతులు లభించాయి. వాస్తవానికి వీరికంతా పదోన్నతి వచ్చిన వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించి ఏ స్టేషన్లలో ఖాళీ ఉంటే అక్కడ పోస్టింగ్‌లు ఇవ్వాలి. అప్పటికింకా ఎన్నికల హడావుడి కూడా లేదు. కనీసం ఈ ఏడాది జనవరిలో బదిలీలు చేసుంటే సరిపోయి ఉండేది. అలా కాకుండా సార్వత్రిక ఎన్నికలు మొత్తం పూర్తయ్యాక పదోన్నతి పొందిన 150 మంది సిబ్బందికి రెండు రోజుల్లో కౌన్సెలింగ్ నిర్వహించడానికి ఓ అధికారి తహతహలాడుతున్నారు. ఇప్పటికే విక్రాంత్ పాటిల్ స్థానంలో చిత్తూరు ఎస్పీగా అప్పలనాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీచేసింది. ఇలాంటి తరుణంలో బదిలీల కౌన్సెలింగ్ పూర్తిచేయాలని చూడడం విమర్శలకు దారితీస్తోంది. ఇంతకూ ఏముందో అక్కడ..? బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సిన 150 మంది సిబ్బందికి జిల్లా పోలీసుశాఖ నుంచి ఓ ప్రొఫార్మా అందింది. ఇందులో సొంత ఊరు కోరుకోకూడదనే ఓ అంశాన్ని ఉంచారు. ఇది బాగానే ఉంది. ఎక్కడకు బదిలీ కావాలో అయిదే స్టేషన్లను ఎంచుకోవాలి సూచించారు. ఇది కూడా బాగానే ఉంది. అయితే స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), డీసీఆర్బీ (క్రైమ్ రికార్డ్స్), ఐటీ కోర్, డీటీసీ, పోలీస్ కంట్రోల్ రూమ్‌లను ఆప్షనల్‌గా ఎంచుకోకూడదని చెప్పడం వివాదానికి తెరలేపినట్లయ్యింది. అంటే ఈ ఐదు విభాగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నవారికి బదిలీలు ఉండవా..? చేయకూడదా..? మరెవరూ ఇక్కడ పనిచేయకూడదా..? వాటికి అంత ప్రత్యేకత ఏముంది..? అంటూ కడుపుమండిన సిబ్బంది అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పైగా ఈ ఐదు విభాగాల్లో ఓ సామాజికవర్గానికి చెందిన సిబ్బంది ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. గత ఐదేళ్లలో అయితే టీడీపీ నేతలు చెప్పిందే అన్నట్లు కొందరు నడుచుకుని రూ.లక్షలు కూడబెట్టుకున్నారు. అలాంటి వారిని కదిలించకుండా బదిలీల్లో వీటిని కోరుకోకూడదని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు అడుగుతున్నారు. పాతుకుపోయిన వారి పొజిషన్ ఏంటో..! జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న సిబ్బందిని కదిలించడానికి ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. గత ఏడాది కూడా ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి బదిలీల కౌన్సెలింగ్ చేపట్టలేదు. కొన్నిచోట్ల అటాచ్మెంట్ల పేరిట కాలం నెటుకొచ్చేవారు ఉన్నారు. పదోన్నతి పొందిన 150 మంది సిబ్బందికి స్టేషన్లు కేటాయించాలంటే లాంగ్ స్టాండింగ్, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆయా స్థానాల్లో కదిలించాలి. అప్పుడు ఏర్పడే ఖాళీలను కౌన్సెలింగ్‌లో ఉంచాలి. కనీసం స్టేషన్ల వారీగా ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని మంజూరయ్యాయనే వివరాలు కూడా చెప్పకుండా ఏకపక్షంగా బదిలీలు చేయడంపై సొంత శాఖలోని సిబ్బంది అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. -
ఖాకీపై ఖద్దరు స్వారీ!
జిల్లా కేంద్రంలో ఓ పోలీసు ఉన్నతాధికారి స్థానిక ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఏ పనీ చేయడం లేదనే చర్చ జరుగుతోంది. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ నేతలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు. ఇటీవల ఇక్కడ జరిగిన బదిలీలు కూడా సదరు నేత కనుసన్నల్లోనే ఉన్నతాధికారి చేపట్టినట్లు సమాచారం. కీలకమైన ఎన్నికల సమయంలో ఇలా ఏకపక్షంగా వ్యవహరించే పోలీసు అధికారి ఎంతమాత్రం పారదర్శకంగా వ్యవహరిస్తారనేది అనుమానం. అనంతపురం, అనంతపురం సెంట్రల్: పోలీసు శాఖలో బదిలీల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమకు అనుకూలమైన అధికారులను బదిలీ చేయించుకునే దిశగా నాయకులు పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన సీఐ, ఎస్ఐల బదిలీలనుపరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నెలాఖరుకు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో కీలకమైన రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు శాఖల్లో అనుకూలమైన సిబ్బంది నియామకం దిశగా అధికార పార్టీ నేతలు దృష్టి సారించారు. తాము సూచించిన అధికారులనే ఆయా స్థానాల్లో నియమించాలనే ఒత్తిడి ఉన్నతాధికారులపై అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణ, సజావుగా ఎన్నికల నిర్వహణ విషయంలో పోలీసు శాఖ అత్యంత కీలకం. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ శాఖపై ఒత్తిడి అధికం. పారదర్శకంగా సేవలు అందిస్తేనే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగుస్తుంది. అయితే ఇటీవల పోలీసు శాఖలో కొనసాగుతున్న బదిలీను పరిశీలిస్తే అధికార పార్టీ నేతల పెత్తనం, ఉన్నతాధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోంది. రాజకీయ బది‘లీలలు’ సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఎన్నికల కమిషన్ గైడ్‌లైన్స్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేపడుతారు. పోలీసుశాఖ మాత్రం ఇందుకు బిన్నం. ఎందుకంటే శాంతిభద్రతల విషయం కావడంతో పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయం ప్రకారం బదిలీలు చేపట్టడం ఆనవాయితీ. అయితే ప్రస్తుత బదిలీలు పూర్తిగా రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. రెండు, మూడు నెలల్లో ఎన్నికలు ఉండడంతో ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో పలువురు రాజకీయ నాయకులు బదిలీలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పోస్టింగ్‌ల విషయంలో అధికార పార్టీ నేతల సిఫారసు లేనిదే బదిలీలు జరగడం లేదనేందుకు ఇటీవల జరిగిన మార్పులే నిదర్శనం. బదిలీ ఉత్తర్వుల్లో గందరగోళం ఇటీవల పోలీసు శాఖ నుంచి వెలువడుతున్న ఉత్తర్వుల్లో గందరగోళం నెలకొంది. ఎవరికి ఎక్కడ పోస్టింగ్ పడుతుందో.. ఎవరిని ఎప్పుడూ బదిలీ చేస్తారో తెలియని పరిస్థితి. దీంతో పాటు బదిలీ ఉత్తర్వులు అందుకున్నా సంబంధిత స్థానంలో బాధ్యతలు తీసుకునే వరకు ఆ స్థానం తమదేననే నమ్మకం కలగని పరిస్థితి. ఇందుకు నిదర్శనం రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన పోలీసుల బదిలీలే. నియోజకవర్గం మొత్తం తమకు అనుకూలమైన అధికారులే ఉండాలనే ఉద్దేశంతో బదిలీలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసమే.. సీఐల బదిలీలను పరిపాలన సౌలభ్యం కోణంలోనే చేపడుతున్నాం. ఇందులో తక్కువ కాలంలో నియమితులైన వారిని కూడా బదిలీ చేశాం. కేవలం పరిపాలనా పరమైన ఇబ్బందుల వల్లే ఈ మార్పులు. అన్నీ సాధారణ బదిలీలే. ఎస్ఐల బదిలీలను జిల్లా ఎస్పీ చూస్తారు. అయినా బదిలీల అంశం అంత పెద్దది కాదు.– కాంతిరాణా టాటా, డీఐజీ, అనంతపురం రేంజ్ ఏపీ డాక్టర్స్ జేఏసీలో పలువురికి చోటు అనంతపురం న్యూసిటీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరు వైద్యులకు చోటు లభించింది. ఇటీవల గుంటూరులో జేఏసీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ప్రభుత్వాస్పత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వీరభద్రయ్య, తరిమెల పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రమణ నాయక్‌లను సభ్యులుగా ఎన్నుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం నూతన కమిటీ ఏర్పాటు కాని విషయం విదితమే. జేఏసీ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు (తిరుపతి) నియమితులయ్యారు. -
ఇంకెన్నాళ్లు..?
సాక్షి, హైదరాబాద్: భర్త ఒక చోట.. భార్య ఒక చోట.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వందల మంది ఉపాధ్యాయులు ఇలా నాలుగున్నరేళ్లుగా విధులు నిర్వర్తిస్తూ తంటాలు పడుతున్నారు. రాష్ట్ర విభజనతో దూరమైన టీచర్ దంపతులు ఒక్క చోటుకి చేరేందుకు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఎట్టకేలకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు వారిని ఒక్కటి చేసేందుకు గతేడాది అంగీకరించినా అధికారులు రూపొందించిన నిబంధనలు వారి పాలిట శాపంగా మారాయి. ఒక టీచర్ తెలంగాణకు వస్తే మరో టీచర్ ఏపీకి వెళ్లేలా పరస్పర (మ్యూచువల్) బదిలీలకు ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. అయితే ఆ బదిలీల అమలుకు అధికారులు విధించిన నిబంధనలే వారిని దగ్గర కానివ్వడం లేదు. వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నా అధికారులు నిబంధనల కారణంగా పదుల సంఖ్యలో టీచర్లకే లబ్ధి చేకూరింది. నిబంధనల్లో ఏముందంటే.. అంతర్రాష్ట్ర బదిలీల కోసం టీచర్ల నుంచి వెల్లువెత్తిన విజ్ఞప్తుల మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో గతేడాది ఉన్నతాధికారులతో ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశారు. దాని సిఫారసుల మేరకు అంతర్రాష్ట్ర బదిలీలకు ఆమోదం తెలుపుతూ 2017 ఆగస్టు 7 వరకు దరఖాస్తులను స్వీకరించారు. అయితే స్పౌజ్, పరస్పర కేటగిరీలో బదిలీ కోరుకునే ఇద్దరు టీచర్లు ఒకే సబ్జెక్టు కలిగి ఉండాలని, ఒకే మేనేజ్మెంట్ కింద పనిచేస్తూ ఉండాలని, స్థానికత (నేటివిటీ) కలిగి ఉండాలని నిబంధన విధించారు. ఈ నిబంధనే అనేక మందికి శాపంగా మారింది. అంతర్రాష్ట్ర బదిలీ కోసం పరస్పర కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారు వందల మంది ఉన్నా.. ఒకే సబ్జెక్టు, ఒకే మేనేజ్మెంట్, నేటివిటీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారు కేవలం పదుల సంఖ్యలోనే ఉన్నారు. దీంతో వందల మంది పరస్పర బదిలీకి అర్హత లేకుండాపోయింది. ఈ నిబంధనల కారణంగా దాదాపు 300 మంది వరకు అసలు దరఖాస్తు కూడా చేసుకోపోగా, దరఖాస్తు చేసుకున్న 250 మందిలో కూడా తక్కువ మందికే లబ్ధి చేకూరింది. కేవలం 20 మంది టీచర్లకు మాత్రమే ఇటీవల బదిలీ జరిగింది. మిగతా వారికి బదిలీలు జరిగే అవకాశం లేకుండాపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆ బదిలీల ప్రక్రియను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఉమ్మడిగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో వారంతా ఆందోళనలో పడ్డారు. కమిటీ ఉత్తర్వుల ఆలస్యంతో ఆందోళన.. అధికారుల నిబంధనలతో ఎక్కువ మంది టీచర్లకు అంతర్రాష్ట బదిలీకి అవకాశమే లేకుండాపోతోందని టీచర్లు ప్రభుత్వానికి మళ్లీ అనేకసార్లు విజ్ఞప్తులు చేశారు. దీంతో ఉన్నతాధికారుల కమిటీ ఆ నిబంధనలను సడలించాలని నిర్ణయించింది. అయితే కమిటీ నిర్ణయంపై ఇంతవరకు ఉత్తర్వులు జారీ కాకపోవడం, మరోవైపు బదిలీలకు ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో సంబంధిత టీచర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘హెడ్ టు హెడ్’మ్యూచువల్ బదిలీకి అవకాశం ఇవ్వడం వల్ల ఇరు ప్రభుత్వాలకు అదనంగా ఎలాంటి ఆర్థిక భారం ఉండదని, తమకు బదిలీకి అవకాశం కల్పించి తమ కుటుంబాల దగ్గరకు వెళ్లేలా చూడాలని కోరుతున్నారు. -
సీబీఐలో మిడ్నైట్ డ్రామా
వర్గపోరు, అత్యున్నతాధికారులపై కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో సీబీఐ ప్రతిష్ట మసకబారుతున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం అర్ధరాత్రి ఆ సంస్థలో అనూహ్య మార్పులు చేపట్టింది. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను విధుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జేడీగా ఉన్న తెలుగు వ్యక్తి నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. విచారణకు సహకరించకపోవడంతో సీవీసీ సిఫారసుల మేరకే అలోక్ వర్మను పదవి నుంచి తొలగించామంది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఇలా డైరెక్టర్‌ను మార్చడం ఇదే తొలిసారి. నాగేశ్వరరావు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 12 మంది అధికారులను బదిలీ చేశారు. అస్థానా, అలోక్‌ల పరస్పర అవినీతి ఆరోపణలపై విచారణకు కొత్త బృందాన్ని నియమించారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు కాగా అంతకుముందే తనను తొలగించడం ద్వారా సీబీఐ స్వతంత్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అలోక్ వర్మ సుప్రీంను ఆశ్రయించారు. మరోవైపు ఈ అంశంలో కేంద్రం తీరును విపక్షాలు తప్పుబట్టాయి. రఫేల్ స్కాం పత్రాలను అలోక్ వర్మ సేకరిస్తున్నందునే ఆయన్ను ప్రధాని తప్పించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. న్యూఢిల్లీ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో వర్గపోరుతో మొదలైన ముసలం కొనసాగుతోంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రభుత్వం పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన 1986 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావును ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఎన్నడూ లేని తీవ్ర సంఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలకు దిగింది. కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) సిఫారసుల మేరకే అలోక్, అస్థానాలను సెలవుపై పంపామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీవీసీ విచారణకు అలోక్ సహకరించకపోవడం వల్లే ఆయనను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు తనను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ అలోక్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించనుంది. కేసుల విచారణల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం లేదనే కక్షతోనే తనను పదవి నుంచి తప్పించారని అలోక్ ఆరోపించారు. ఇటు సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావు మంగళవారం అర్ధరాత్రే విధుల్లో చేరి చర్యలు ప్రారంభించారు. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయ భవనంలోని రెండు అంతస్తులను సీజ్ చేసి, అలోక్ వర్మకు సన్నిహితులుగా పేరున్న మొత్తం 12 మంది అధికారులను ఉన్నపళంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపేందుకు అలోక్ ఆసక్తిగా ఉన్నందునే ఆయనను ప్రభుత్వం విధుల నుంచి తప్పించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే సీబీఐ గౌరవాన్ని, నిబద్ధతను కాపాడేందుకు ఈ బదిలీలు కచ్చితంగా అత్యవసరమని ప్రభుత్వం సమర్థించుకుంది. వివిధ ప్రాంతాలకు బదిలీలు నాగేశ్వర రావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీబీఐలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలోక్ వర్మకు సన్నిహితులుగా ఉన్న 12 మంది అధికారులను ఉన్నపళంగా అండమాన్ నికోబార్ దీవులు సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు నాగేశ్వర రావు బదిలీ చేశారు. అస్థానాపై నమోదైన కేసులను విచారిస్తున్న పాత బృందంలోని సభ్యులను పూర్తిగా తొలగించి, మొత్తం కొత్త వారితో ప్రత్యేక బృందాన్ని నియమించారు. అస్థానాపై కేసు విచారణకు సీబీఐ జేడీ మురుగేశన్ పర్యవేక్షణలో డీఐజీ తరుణ్ గౌబా, ఎస్పీ సతీశ్ దగర్‌లతో నాగేశ్వర రావు కొత్త బృందాన్ని ఏర్పాటు చేశారు. గతంలో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ కేసును సతీశ్ విచారించగా, తరుణ్ గౌబా మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం దర్యాప్తులో పాలుపంచుకున్నారు. మురుగేశన్ బొగ్గు కుంభకోణం కేసును విచారించారు. అటు అస్థానాపై నమోదైన కేసును విచారిస్తున్న ఏకే బస్సీని అండమాన్ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌కు, ఆయన పై అధికారి, అదనపు ఎస్పీ ఎస్ఎస్ గుర్మ్‌ను జబల్పూర్కు, అస్థానా కేసు విచారణను పర్యవేక్షిస్తున్న డీఐజీ ఎంకే సిన్హాను నాగ్‌పూర్‌కు నాగేశ్వర రావు బదిలీపై పంపారు. జేడీ (పాలసీ)గా ఉన్న అరుణ్ కుమార్ శర్మను.. రాజీవ్ గాంధీ హత్య కేసును విచారిస్తున్న ఎండీఎంఏకు జేడీగా, సీనియర్ అధికారి సాయి మనోహర్‌ను చండీగఢ్ జోన్ జేడీగా బదిలీ చేశారు. కాగా విజయ్ మాల్యా, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులు, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు బ్యాంకులను మోసగించడం తదితర సున్నితమైన కేసులను అస్థానా నేతృత్వంలోని బృందాలే ఇన్నాళ్లూ విచారించగా, తాజా పరిణామాలతో ఆ కేసుల విచారణ తీవ్రంగా ప్రభావితం అవ్వొచ్చని సీబీఐ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణకు కొత్త బృందం మంగళవారం అర్ధరాత్రి మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, అలోక్, అస్థానాలను సెలవుపై పంపుతున్నట్లు అత్యవసరంగా ఆదేశాలు జారీచేసింది. మంత్రివర్గ సమావేశ వివరాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వివరించారు. ఇరువురు అధికారులు పరస్పరం చేసుకున్న అవినీతి ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతుందని చెప్పారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అలోక్, అస్థానాలు సెలవుపైనే ఉంటారని జైట్లీ తెలిపారు. సీవీసీ సిఫారసుల ఆధారంగానే ఇరువురు అధికారులను విధుల నుంచి తప్పించామని చెప్పారు. ‘దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలోని ఇద్దరు అత్యున్నతాధికారులు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో విపరీత, దురదృష్టకర పరిస్థితులకు దారితీసింది’ అని అన్నారు. కాంగ్రెస్ ఆరోపణలను ఆయన ఖండించారు. సీబీఐలోని సీనియర్ అధికారులపై ఇంతటి తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం అత్యంత అసాధారణ విషయమనీ, విచారణకు కూడా సహకరించకపోతుండటంతోనే అలోక్‌ను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అటు అలోక్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ.. తనను ఉన్నపళంగా విధుల నుంచి తప్పించడం ద్వారా సీబీఐకి ఉన్న స్వతంత్ర అధికారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం విచారించనుంది. హెడ్‌క్వార్టర్స్‌లో హంగామా సాధారణంగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో రాత్రయితే సీఐఎస్ఎఫ్కు చెందిన కాపలాదారులు తప్ప ఎవరూ ఉండరు. కానీ మంగళవారం రాత్రి మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాత్రి 7.30 గంటలకు అలోక్ వర్మ తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఒక్కసారిగా ఆ కార్యాలయం వద్ద అలజడి ప్రారంభమైంది. ఢిల్లీ పోలీసులు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 10 గంటలకు 15 మంది అధికారులు కార్లలో అక్కడికి వచ్చారు. తర్వాత నాగేశ్వర రావు కూడా తన కారులో అక్కడకు చేరుకున్నారు. 11.30 గంటల సమయంలో ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే అలోక్, అస్థానాల కార్యాలయాలకు సీల్ వేయించారు. ఆ తర్వాత అలోక్ వర్మ బృందంలోని అధికారులు ఏకే శర్మ, మనీశ్ సిన్హాలను కూడా సెలవుపై పంపుతూ ఆదేశాలిచ్చారు. వారి డ్రైవర్లు, ఇతర సిబ్బందిని తన కార్యాలయ పరిసరాల్లోకి కూడా రాకుండా నిలువరించారు. అంతకుముందు రాత్రి 8–8.30 సమయంలోనే అలోక్, అస్థానాలను తొలగించాల్సిందిగా సిఫారసు చేస్తూ సీవీసీ కేంద్రానికి సమాచారం పంపింది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంది. తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నియామకాల విభాగం అధికారులను అర్ధరాత్రి కార్యాలయానికి పిలిపించి వారిచేత అలోక్, అస్థానాలకు ఉత్తర్వులు ఇప్పించారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉండేలా గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అలోక్ వర్మను నియమించి రెండేళ్లు కాకముందే సీవీసీ సిఫారసును కారణంగా చూపి ఆయనను పదవి నుంచి తొలగించింది. ఇంత ఉత్కంఠ నడుమ సీబీఐ డైరెక్టర్‌ను మార్చడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం బయట గుమిగూడిన మీడియా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతున్న జైట్లీ, రవిశంకర్ -
సీబీఐలో ప్రక్షాళన : అధికారుల బదిలీ
సాక్షి, న్యూఢిల్లీ : విభేదాలతో రచ్చకెక్కిన సీబీఐని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలువురు అధికారులపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం రాకేష్ ఆస్తానా, అలోక్ వర్మ బృందాల్లో పనిచేస్తూ వారితో సన్నిహితంగా ఉంటున్న వారిని బదిలీల్లో టార్గెట్ చేసింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్‌ను చండీగఢ్‌కు బదిలీ చేశారు. రాకేష్ ఆస్థానా కేసు దర్యాప్తు చేస్తున్న ముగ్గురు అధికారులను సీబీఐ బదిలీ చేసింది. సీబీఐ బదిలీలు చేసిన సీనియర్ అధికారుల్లో డిప్యూటీ ఎస్పీ ఏకే బస్సీ, అదనపు ఎస్పీ ఎస్ఎస్ గుర్మ్, డీఐజీ మనీష్ కుమార్ సింగ్, ఏసీబీ డీఐజీ తరుణ్ గౌబా, డీఐజీలు జస్బీర్ సింగ్, అనిష్ ప్రసాద్, కేఆర్ చురాసియా, రామ్ గోపాల్, ఎస్పీ సతీష్ దగార్, అరుణ్ కుమార్ శర్మ, ఏ సాయి మనోహర్, వి. మురుగేశన్, అమిత్ కుమార్‌లున్నారు. మొత్తం 13 మంది అధికారులను సీబీఐ బదిలీ చేసింది. మరోవైపు సీబీఐ నూతన చీఫ్‌గా నియమితులైన నాగేశ్వరరావుపైనా అవినీతి ఆరోపణలున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. -
ఐపీఎస్‌లతో బదిలీల బంతాట
సాక్షి, అమరావతి: అధికారపార్టీ ప్రజాప్రతినిధుల మాట వినని పలువురు ఎస్పీలపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో జీ హుజూర్ అనేవారిని ప్రభుత్వ పెద్దలు ఏరికోరి నియమించుకున్నారు. మొత్తం 14 మంది ఐపీఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. టీడీపీ నేతల ఒత్తిళ్లకుతోడు.. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బదిలీలు జరగడం గమనార్హం. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వ పెద్దలు కావాల్సిన వారికి పోస్టింగ్ ఇచ్చుకున్నారు. అయితే పలు జిల్లాల్లో శాంతిభద్రతల నిర్వహణలో అధికారపార్టీ నేతల సిఫారసులను లెక్కచేయని పలువురు ఎస్పీలపై 16 నెలలు గడవకుండానే బదిలీ వేటేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. పేకాట, క్రికెట్ బుకీలు, శాంతిభద్రతల నిర్వహణలో తమ మాట వినలేదని గుంటూరు రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు, నెల్లూరు ఎస్పీ రామకృష్ణ, కడప ఎస్పీ అట్టాడ బాపూజీ వంటి వారిని బదిలీ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు వేర్వేరు పోస్టుల్లో ఉన్న కొందరిని సోమవారం రాత్రి పిలిపించుకున్న సీఎం చంద్రబాబు వారితో ప్రత్యేకంగా మాట్లాడి పలు జిల్లాలకు ఎస్పీలుగా పోస్టింగ్‌లు ఇవ్వడం విశేషం. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తోపాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుతో సోమవారం అర్థరాత్రి వరకు పలుమార్లు చర్చలు జరిపిన సీఎం చంద్రబాబు బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మొత్తానికి ఈ బదిలీల్లో అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు, పైరవీలకే పెద్దపీట వేశారనే విమర్శలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని ‘ఐపీఎస్ బదిలీలకు రంగం సిద్ధం’ శీర్షికన ఈ నెల 20న సాక్షి ముందే చెప్పింది. కాగా, ఈ నెల 20న నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడే బదిలీలు ఉంటాయని, ఎటువంటి అపోహలకు తావుండదని చెప్పారు. కానీ మంగళవారం జరిగిన బదిలీలు అందుకు పూర్తి భిన్నంగా జరగడం విమర్శలకు తావిస్తోంది. డీజీపీ చెప్పిన మాటల ప్రకారం చూస్తే.. మూడేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి, గత ఎన్నికల సమయంలో పనిచేసిన జిల్లాల్లో ఉన్నవారికి, సొంత జిల్లా వారికి బదిలీలు ఉండాలి. అందుకు పూర్తి భిన్నంగా టీడీపీ ప్రజాప్రతినిధులు ఏకపక్షంగా చేసిన సిఫార్సులకు తలొగ్గి ఎస్పీలను బదిలీ చేయడం గమనించాల్సిన విషయం. టీడీపీ అక్రమ దందాలకు చెక్ పెట్టడమే కారణం! గతేడాది జూన్‌లో గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన చింతం వెంకటప్పలనాయుడు క్రికెట్ బెట్టింగ్, పేకాట క్లబ్‌లు, ఇసుక, రేషన్ బియ్యం, గుట్కాల అక్రమ రవాణా వంటి అక్రమ దందాలకు చెక్‌పెట్టారు. ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో నిర్వహించే దాచేపల్లి పేకాట క్లబ్‌ను మూయించడంతో ఎస్పీ బదిలీకి బీజం పడింది. అధికారపార్టీ నేతల అండదండలున్న కీలక క్రికెట్ బుకీలను అరెస్టు చేయడమేగాక బుకీల వద్ద మామూళ్లు తీసుకునే డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు, సిబ్బందిపై వేటేశారు. అంతేగాక తమకు నచ్చనివారిపై అక్రమ కేసులు పెట్టాలన్న అధికారపార్టీ నేతల మాటలు వినలేదు. దీంతో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులంతా ఏకమై వెంకటప్పలనాయుడు బదిలీకి ఆరునెలలుగా పావులు కదిపి తమ పంతం నెగ్గించుకున్నారు. అవినాష్‌రెడ్డి రాకను ఆపలేదని.. దాదాపు 14 నెలలక్రితం వైఎస్సార్ జిల్లాకు ఎస్పీగా వచ్చిన అట్టాడ బాపూజీ బదిలీ వెనుకా టీడీపీ ప్రజాప్రతినిధుల ఒత్తిడే కారణమని తెలుస్తోంది. జిల్లాలోని పెదదండ్లూరు గ్రామంలోని ఎస్సీల ఇంట పెళ్లికి వైఎస్సార్సీపీకి చెందిన వైఎస్ అవినాష్‌రెడ్డి రాకను ఎస్పీ బాపూజీ ఆపలేదనే కోపంతో ఆయన్ను టీడీపీ టార్గెట్ చేసినట్టు చర్చ సాగుతోంది. గ్రామంలో శాంతిభద్రతల సమస్య ఉందని సాకుగా చెప్పి అవినాష్‌రెడ్డిని అడ్డుకోవాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చినా ఎస్పీ వారి మాట ఖాతరు చేయకపోవడంతో బదిలీకి పావులు కదిపినట్టు చర్చ నడుస్తోంది. అనేక విషయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించిన ఎస్పీ బదిలీకి పట్టుబట్టిన మంత్రి ఆదినారాయణరెడ్డికి జిల్లా టీడీపీ నేతలు కలసిరావడంతో వారికి ఒత్తిడికి సీఎం తలొగ్గినట్టు ప్రచారం జరుగుతోంది. తమ మాట నెగ్గలేదని.. నెల్లూరు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ బదిలీకి ఏడు నెలలుగా ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు పంతం నెగ్గించుకున్నారు. శాంతిభద్రతల నిర్వహణలో తనదైనశైలిలో వ్యవహరించే రామకృష్ణ చిత్తూరు, గుంటూరు, కడప.. తరువాత నెల్లూరు ఎస్పీగా పనిచేశారు. ఎక్కడా 14 నెలలకు మించి పనిచేయని రామకృష్ణ నెల్లూరులో మాత్రం 16 నెలలు కొనసాగడం రికార్డే. ప్రధానంగా ఆయన క్రికెట్ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపారు. 85 క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి439 మంది బుకీలపై కేసులు నమోదు చేయడం అధికారపార్టీకి మింగుడుపడలేదు. అనేక కేసుల్లో అధికారపార్టీ నేతల మాటను పట్టించుకోలేదు. ఆయన బదిలీకి ఇదే కారణమైందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ విధంగా పలువురు ఎస్పీలను అధికారపార్టీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం బదిలీ చేయించడంపై పోలీసు శాఖలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘సీనియార్టీ’పై అభ్యంతరాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్ : బదిలీలకు సంబంధించి విద్యాశాఖ ప్రకటించిన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దాదాపు మూడోవంతు టీచర్లు ఈ జాబితాపై అభ్యంతరాలు నమోదు చేశారు. ఒక్కో జిల్లాలో సగటున 2 వేలకుపైగా అభ్యంతరాలు రావడం గమనార్హం. బదిలీలకు రాష్ట్రవ్యాప్తంగా 75,317 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31,514 మందికి ఒకేచోట పని చేసే సర్వీసు గడువు ముగియడంతో తప్పనిసరిగా బదిలీ కానుంది. మరో 43,803 మంది నిర్దేశిత సర్వీసు పూర్తి కానప్పటికీ స్థానచలనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు పరిశీలించిన విద్యాశాఖ అధికారులు ఈ నెల 15న ప్రాథమిక సీనియార్టీ జాబితా విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలుంటే ఈ నెల 17 వరకు తెలపాలని ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది టీచర్లు సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు తెలిపారు. వీటిని పరిష్కరించి ఈ నెల 19న తుది సీనియార్టీ జాబితాను విద్యాశాఖ ప్రకటించాల్సి ఉంది. అయితే పరిశీలించాల్సిన అభ్యంతరాలు పెద్దసంఖ్యలో ఉండడంతో తుది జాబితాను ఈ నెల 20న ఇవ్వనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. పరిశీలన ప్రహసనమే సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన విద్యాశాఖ అధికారులకు ప్రహసనంగా మారింది. వేలకొద్దీ వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితా విడుదల చేయడం అధికారులకు కత్తి మీద సాముగా మారింది. దీంతో కొన్ని జిల్లాల్లో అధికారులు హడావుడిగా పరిశీలిస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, తుది జాబితాలో తప్పులు దొర్లితే ఊరుకునేది లేదని పీఆర్టీయూ అధ్యక్షులు సరోత్తంరెడ్డి విద్యాశాఖను హెచ్చరించారు. మరోవైపు బదిలీ షెడ్యూల్ గడువును పొడిగించాలని ఎస్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు భుజంగరావు, సదానంద్‌గౌడ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను కలసి వినతిపత్రం అందజేశారు. 21 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లు టీచర్ల బదిలీ ప్రక్రియలో వెబ్ ఆప్షన్ల నమోదు తేదీల్లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్లను 21 నుంచి 24 వరకు నిర్వహించనుంది. ఈ మేరకు విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. 26న కమిటీ ఆమోదం కోసం జాబితాను డౌన్లోడ్ చేసి 27న బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారని వివరించింది. -
ఉద్యోగుల బదిలీలపై కసరత్తు ప్రారంభం
-
మ్యూజికల్ చైర్
జిల్లాలో కలెక్టర్ నుంచి మొదలుకొని మండల స్థాయి ఎంఈఓల వరకు అందరూ అంతటా ఇన్చార్జిల పాలనే. ఎక్కడ కూడా రెగ్యులర్ అధికారులు కనిపించరు. ముఖ్యంగా జిల్లా విద్యాధికారులను మార్చుతున్న తీరు జిల్లా ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. కేవలం 16 నెలల్లో ఐదుగురు ఇన్చార్జి డీఈఓలు మారారంటే అర్థం చేసుకోవచ్చు జిల్లాలోని విద్యావ్యవస్థ ఏ విధంగా ఉందో? దీంతో పాటు జిల్లాలోని 20 మండలాలకు ఎక్కడా కూడా రెగ్యులర్ ఎంఈఓలు లేరు. ఉన్న తొమ్మిది మంది ఎంఈలతో 20 మండలాలను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల డీఆర్డీఓ పీడీ కూడా దీర్ఘకాలిక సెలవులపై వెళ్లారు. ఇలా ఇన్చార్జిలతో జిల్లా పాలనంతా అస్తవ్యస్తంగా తయారైంది. వేగంగా మారుతున్న జిల్లా విద్యాధికారులపై‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి,మెదక్: జిల్లాలోని విద్యార్థుల చదువులతో సర్కార్ ఆటలాడుతోంది. జిల్లా విద్యాధికారి పోస్టు మ్యూజికల్ చైర్ ఆటలాగా మారింది. ఏ క్షణాన ఎవరు వస్తారో..? ఏ రోజుకు ఎవరు మారుతారో ? తెలియని పరిస్థితి. పరీక్షల వేళ రాష్ట్ర విద్యాశాఖ చేస్తున్న బదిలీ ప్రయోగాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నెల 17న సంగారెడ్డి ఇన్చార్జి డీఈఓ విజయకుమారిని మెదక్ జిల్లా పూర్తిస్థాయి డీఈఓగా నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ 24 గంటల్లోనే ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకొని సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా కేవలం 16 నెలల కాలంలో 5మంది డీఈఓలు నియామకం కావడంతో ఒక్కో డీఈఓ పదవి కాలం కేవలం 3 నెలలకే మించి లేదు. వచ్చిన వారు కనీసం జిల్లాలోని పాఠశాలల పరిస్థితిని అవగాహన చేసుకునేలోగానే వారిపై బదిలీ వేటు పడుతోంది.దీంతో జిల్లా విద్యాశాఖలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పనితీరుపై అసంతృప్తి.. జిల్లా కేంద్రం కావాలన్న ఇక్కడి ప్రజల 50 యేళ్ల పోరాటం 10 అక్టోబర్ 2016లో సాకారమైంది. దీంతో జిల్లాకు మొట్ట మొదటి డీఈఓగా రేణుకదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె నూతన జిల్లా ఏర్పడిన రోజునే పదవి బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేక నెలరోజుల వ్యవధిలోనే దీర్ఘకాలికపై సెలవుపై వెళ్లారు. అనంతరం 2016 అక్టోబర్ 27 నుంచి సిద్దిపేట డీఈఓ కృష్ణారెడ్డికి జిల్లా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆయన కాలంలోనే అప్పటి పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. 10 నెలల అనంతరం ఆయన రిటైర్మెంట్ అయ్యాడు. దీంతో ఆయన స్థానంలో సరోజినిదేవిని ఇన్చార్జి డీఈఓగా నియమించారు. ఆ కొద్దిరోజుల్లోనే కలెక్టర్ ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తరుణంలో సరోజిని ఆమె మాతృసంస్థకు వెళ్లిపోయారు. అనంతరం సంగారెడ్డి ఇన్చార్జి డీఈఓ విజయకుమారికి మెదక్ జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఈనెల 17న సిద్దిపేట డీఈఓ విజయలక్ష్మిని సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమిస్తూ సంగారెడ్డి ఇన్చార్జి విజయకుమారికి మెదక్‌జిల్లా డీఈఓగా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ మెదక్ జిల్లాలో పనిచేయడం ఇష్టంలేని విజయకుమారి కేవలం 24గంటల్లోనే తన బదిలీని రద్దు చేయించుకొని మేడ్చల్ డీఈఓగా పోస్టింగ్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సంగారెడ్డి డీఈఓ విజయలక్ష్మికి మళ్లీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే మెదక్ బాధ్యతలను స్వీకరించేందుకు ఆమె ఇష్టపడటం లేదని సమాచారం. ఒక్కోరికి మూడు మండలాలు.. అలాగే మెదక్‌లో 20 మండలాలు ఉండగా ఒక్క రెగ్యులర్ ఎంఈఓ కూడా లేకపోగా 9మంది ఇన్చార్జి ఎంఈఓలు 20 మండలాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో ఒక్కో ఎంఈఓగా మూడు మండలాల అదనపు బాధ్యతలు ఉండటంతో రెంటికి చెడ్డ రేవడిగా వారి పరిస్థితి మారుతోంది. ఇటీవల కమిషనర్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కిషన్ తీసుకున్న నిర్ణయాలు నిలకడలేని నీటిమీది రాతలుగా మారుతున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని టీచర్లు సెలవులు తీసుకోవాలంటే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, ఎంఈఓల అనుమతి తప్పనిసరి అని జీఓ నం.83 విడుదల చేశారు. కానీ ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలతో ఆ జీఓను వెనక్కి తీసుకున్నారు. అలాగే మోడల్ స్కూటీచర్ల ఇంక్రిమెంట్ మంజూరీ అధికారాలు సంబంధిత ప్రిన్సిపాల్ కాకుండా డీఈఓలకే ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ ఉపాధ్యాయ సంఘాల ఆందోళనతో వీటిని సైతం ఉపసంహరించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈనెల 17న జారీ చేసిన డీఈఓల బదిలీ ఉత్తర్వులు సైతం 24గంటల్లోనే మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. జిల్లాకు ఇన్‌చార్జిలే దిక్కా? మెదక్ జిల్లాలో మొదటి నుంచి ఇన్చార్జిల పాలనే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన డీఈఓలంతా ఇన్‌చార్జిలే కావడం గమనార్హం. ప్రస్తుతం కలెక్టర్ పోస్టు కూడా ఇన్చార్జితోనే కొనసాగుతుంది. డీఆర్డీఏ పీడీ కూడా ఇటీవల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇల్లా పాలనంతా ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. పదో తరగతి పరీక్షలు ఎలా? జిల్లాకు పూర్తిస్థాయి విద్యాశాఖ అధికారి లేకుండా పదో తరగతి పరీక్షలు నిర్వహించడం కత్తిమీద సాములాంటిదే. మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో ఫిబ్రవరి నెల విద్యార్థులకు అత్యంత కీలకమైంది. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ లోగడ రూపొందిం చిన ప్రణాళికను పక్కాగా అమలు చేయాల్సిన తరుణమి ది. కానీ రెండు జిల్లాలకు ఒకే డీఈఓ ఉండటంతో రెండు పడవలపై సాగే ప్రయాణం సత్ఫలితాలు ఇచ్చే అవకాశం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బదిలీ కావాలా నాయనా!
సాధారణ బదిలీలకు ‘బ్యాన్’ ఉందని ఏమాత్రం చింతించవలదు. అడ్డదారుల్లో చట్టబద్ధంగా చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందుకు ‘మెడికల్ లీవ్’ల ప్రక్రియ ఉంది. లేదంటే ‘అలిగేషన్ సరెండర్’ కింద అక్కడ బదిలీలు చేస్తాం. కాస్త పలుకుబడి.. చేయితడిపే స్తోమత ఉంటే చాలు 20 శాతం హెచ్ఆర్ఏ కలిగిన ప్రాంతానికి ‘ట్రాన్స్ఫర్’ జరిగిపోతుంది అని రాయలసీమ జిల్లాల వైద్య ఆరోగ్య సిబ్బంది అంటున్నారు. తాజాగా మారిన పరిస్థితుల్లో ఈ వ్యవహారం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. కడప రూరల్: కడప పాత రిమ్స్‌లోని వైద్య ఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం పరిధిలోకి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలు వస్తాయి. ఈ శాఖ పరిధిలో నాలుగు జిల్లాల ఉద్యోగులకు గడిచిన జూన్‌లో సాధారణ బదిలీలు జరిగాయి. అనంతరం బదిలీలను ప్రభుత్వం ‘బ్యాన్’ చేసింది. అంటే బ్యాన్‌ను ఎత్తేసే వరకు సాధారణ బదిలీలను చేపట్టకూడదు. ఈ తరుణంలో ఉద్యోగులు కోరుకున్న చోటికి ‘ట్రాన్స్ఫర్’ చేయించుకోవడానికి అడ్డదారుల్లో వెలుతున్నారు. ఆ అడ్డదారిని చట్టబద్ధ రహదారిగా మార్చడానికి కొంతమంది సహకరిస్తున్నారు. ఈ అంశం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అందరి నోటా ఈ బది‘లీలలు’ మాటే వినిపిస్తోంది. ‘మెడికల్ లీవ్’ల నెపంతో ... ఒక స్థానంలో పనిచేసే ఉద్యోగి అనా రోగ్యానికి గురైతే జీఓ 119 ప్రకారం ‘మెడికల్ లీవ్’ (6 నెలల పాటు అంటే 180 రోజుల లాంగ్ లీవ్)లో వెళతారు. ఆ ప్రక్రియ సరైనదా కాదా? ఆ ఉద్యోగి అనా రోగ్యానికి గురయ్యారా..లేదా..? అనారో గ్యంతో ఉంటే ఎన్నిరోజులు సెలవు అవసరం అనేది సభ్యులతో కూడిన ఒక కమిటీ (మెడికల్ బోర్డు) నిర్ధారిస్తుంది. అలా ఆ వ్యక్తి 6నెలల పాటు మెడికల్ లీవ్‌లో ఉన్న సమయంలో ఖాళీగా ఉన్న ఆ స్థానంలో మరొక ఉద్యోగి గనుక పనిచేస్తూ ఉంటే మెడికల్ లీవ్‌లో ఉన్న ఉద్యోగిని నాలుగు జిల్లాలలో ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడికి బదిలీ చేయాలి. ఒకవేళ ఆ స్థానంలో అలాగే ఖాళీగా ఉంటే మెడికల్ లీవ్‌లో ఉన్న ఉద్యోగి యథావిధిగా అక్కడే పనిచేయాలి. ఇదీ మెడికల్ లీవ్‌ల తంతు. అయితే ఇక్కడ మరోవిధంగా జరుగుతోంది. ముందుగానే తమకు అనుకూలమైన ప్రాంతాల్లో ఖాళీలను సిబ్బంది గుర్తిస్తారు. అక్కడికి బదిలీ కావడానికి ‘మెడికల్ లీవ్’ను ఆశ్రయిస్తున్నారు. ఆరు నెలల తర్వాత కూడా ఆ స్థానం ఖాళీగా ఉన్నప్పటికీ కోరిన చోటికి బదిలీ అవుతున్నారు. అదీ 20 శాతం హెచ్ఆర్ఏ వర్తించే పట్టణ ప్రాంతాలకు దాదాపుగా బదిలీలు జరుగుతున్నాయి. ఇలా ఒక బదిలీకి రూ.2.50 లక్షలకు పైగా వసూలు చేస్తున్నట్లు ఆ శాఖ ఉద్యోగవర్గాలు చెప్పుకుంటున్నారు. ‘అలిగేషన్’ కింద... ఇక మరొక మార్గం ఉంది. అదే ‘అలిగేషన్ సరెండర్. అంటే ఆ ఉద్యోగి భారీగా అవినీతికి పాల్పడినా, సహచర ఉద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా, విధి నిర్వహణలో తీవ్ర అలక్ష్యం ప్రదర్శించినా ఆ ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు చేపడతారు. అందులోభాగంగా ‘అలిగేషన్ సరెండర్’ వేటు వేస్తారు. ఆ ఉద్యోగిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నప్పడు మాత్రమే ఆ శాఖ ఈ చర్యలు చేపడుతుంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆ ఉద్యోగిపై కఠినచర్యలు చేపట్టాలి. ఆ వ్యక్తిని వేరే జిల్లాలకు అదీ మారుమూల ప్రాంతాలకు బదిలీచేయాలి. ఇందులోనూ నిబంధనలకు విరుద్ధంగానే బదిలీలు జరుగుతున్నాయి. అనంతపురం కేంద్రంగా... తాజాగా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల బదిలీలు తదితర వ్యవహారాలు చాలా వరకు అనంతపురం జిల్లా కేంద్రంగా నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇప్పటికే కడప పాత రిమ్స్‌లోని ఆ శాఖ ఆర్డీ కార్యాలయంలో గతంలో జరిగిన అవకతవకలపై ఆ శాఖకే చెందిన కొంతమంది ఉద్యోగులు ఫిర్యాదులు చేశారు. దీంతో అవినీతి నిరోధక శాఖ ఇటీవల రంగప్రవేశం చేసింది. పలు ఫైళ్లను తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరుగుతున్నాయని ఆ శాఖ ఉద్యోగులు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఈ బదిలీలు వాస్తవమైనవా..కాదా ? అనేది నిర్ధారించి నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టాలని లేనిపక్షంలో అందుకు కారకులైన వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బది‘లీలలు’ వివరాలు ఇలా... ఆప్రకారం ఇటీవలే అదీ ‘ఫారన్ డిప్యుటేషన్’ కింద అనంతపురం ప్రభుత్వ హస్పిటల్ నుంచి కడపలోని వేరే శాఖకు ఒక ఉద్యోగి, ఇదే తరహాలో వివిధ ప్రాంతాలకు మరో ఇద్దరు బదిలీ కావడం గమనార్హం. ఇక ‘మెడికల్ లీవ్’ల కింద కడప రిమ్స్ నుంచి తిరుపతి రూయా హస్పిటల్‌కు ఒకరు బదిలీ అయ్యారు. ఇకపై బదిలీలకు సిద్ధంగా ఉన్నవారి వివరాలను పరిశీలిస్తే కర్నూలు జీఎల్సీ యూనిట్ నుంచి అనంతపురానికి ఒకరు, అనంతపురం ప్రభుత్వ హస్పిటల్ నుంచి కడపకు ఒకరు, అక్కడి నుంచే కడపకు మరొకరు బదిలీ కావడానికి సిద్ధమవుతున్నారు. అంటే వారంతా ప్రస్తుతం ‘మెడికల్ లీవ్’లో ఉన్నారు. అందుకు సంబంధించి ఆయా జిల్లాల్లోని ఆరోగ్యశాఖ కార్యాలయాల నుంచి కడపలోని ఆర్డీ కార్యాలయానికి ఫైల్స్ రావాల్సివుంది. ‘అలిగేషన్ సరెండర్’ కింద కడపకు సమీపంలోని ఒక మండలంలోని పీహెచ్సీ నుంచి కడప రిమ్స్‌కు, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కర్నూలు జనరల్ హస్పిటల్‌కు బదిలీ కావడానికి ఫైల్స్ సిద్ధమవుతున్నాయి. ఈ అలిగేషన్ కిందనే ఇప్పటికే కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి అనంతపురానికి ఒకరు బదిలీ కావడం గమనార్హం. నిబంధనల ప్రకారమే బదిలీలు గతంలో ఏమి జరిగాయో నాకు తెలియదు. ఇక్కడ నేను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ బదిలీలు అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి. ‘ఫారన్ డిప్యుటేషన్ ’ బదిలీలను ప్రభుత్వమే చేపడుతుంది. వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగిఉంటే, ఆ విషయాలు నా దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు చేపడుతా. – డాక్టర్ వీణాకుమారి, రీజనల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ,కడప -
చనిపోయిన డీఎస్పీ ట్రాన్స్ఫర్..!
-
అవునా... చనిపోయిన డీఎస్పీ ట్రాన్స్ఫర్..!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి తాజా బదిలీలు చాలు. ఓ వైపు ఉన్నవారికి పదోన్నతులు, పదవులు, బదిలీలు లేక ఆపసోపాలు పడుతుంటే ఏపీ పోలీసుశాఖ మాత్రం చనిపోయిన ఓ అధికారికి బదిలీ చేయడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. తక్షణమే పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వచ్చి జాబ్ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ కావడంతో.. బతికున్న తమను వదిలేసి చనిపోయిన పోలీసులకు పోస్టింగ్స్ ఇవ్వడమేంటని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. అనంతపురం జిల్లా కదిరి, గాన్లపెంట గ్రామానికి చెందిన డేరంగుల రామాంజనేయులు ఆరు నెలల కిందట చనిపోయారు. తిరుమల ఎస్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు.. అనారోగ్య సమస్యలతో ఆరు నెలల కిందట మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో 16 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీ ఉత్తర్వులలో కొన్ని నెలల కిందట చనిపోయిన రామాంజనేయులు పేరు ఉంది. ఆయనను తిరుమల నుంచి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ కు బదిలీ చేయడంతో పాటు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చనిపోయిన వ్యక్తిని బదిలీ చేయడం చర్చనీయాంశం కావడంతో నాలుక్కరుచుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ తప్పును కప్పిపుచ్చే యత్నం చేశారు. క్లరికల్ మిస్టేక్ అంటూ వివరణ ఇస్తూ.. బదిలీ జాబితా నుంచి రామాంజనేయులు పేరును తొలగించేశారు. ముందు బతికున్నవారికి పోస్టింగ్స్ ఇవ్వాలని, పద్ధతిలో బదిలీ చేయాలంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
ఖద్దరు నీడన ఖాకీ
– పోలీసు శాఖలో బదిలీల మాయాజాలం – రాజకీయ పలుకుబడి ఉంటే కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్ – ఏళ్ల తరబడి జిల్లా సరిహద్దుల్లో మగ్గిపోతున్న కొందరు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీస్ శాఖలో అందరికీ సమన్యాయం జరగడం లేదు. రాజకీయ పలుకుబడి ఉంటే కోరుకున్న ప్రాంతంలో దర్జాగా బతకవచ్చు. ఎలాంటి పలుకుబడి లేకపోతే మారుమూల మండలాల్లో మగ్గిపోవాల్సిందే. రాజకీయ నాయకుల కన్నుసన్నల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం నడుస్తుండడం వల్లనే పోలీస్ సిబ్బంది దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. - అనంతపురం సెంట్రల్(అనంతపురం): పోలీసు శాఖలో బదిలీల మాయాజాలం అంతా ఇంతా కాదు. రాజకీయ పలుకుబడి లేని చాలా మంది జిల్లా సరిహద్దు మండలాల్లో మగ్గిపోతున్నారు. ఇలాంటి వారి సంఖ్య దాదాపు రెండు వందలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయా పోలీసు స్టేషన్లో ఉన్నతాధికారులతో సఖ్యతగా లేరనే సాకుతో కొంతమందిని దూరప్రాంతాలకు బదిలీ చేశారు. మిగిలిన శాఖలతో పోలీస్ శాఖలో ఇలాంటి కక్ష సాధింపు బదిలీల మోతాడు ఎక్కువగానే ఉంటోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అయితే ఇలాంటి బదిలీలు మంచిగానే ఉన్నా.. సంవత్సరాల తరబడి సుదూర ప్రాంతాలకే వారిని పరిమితం చేయడం విమర్శలకు దారితీస్తోంది. నిబంధనలకు విరుద్ధంగానే.. బదిలీల నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్ల ఒకసారి ఉద్యోగిని మరో ప్రాంతానికి బదిలీ చేయాల్సి ఉంది. ఒకే ప్రాంతంలో మూడేళ్లు దాటిన ఉద్యోగికి, అతని ఇష్టపూర్వకంగానే మరో ప్రాంతానికి బదిలీ చేయవచ్చు. అయితే ఈ నిబంధనలు పోలీస్ శాఖ పరిగణలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా ఒకే ప్రాంతంలో ఆరేళ్లకు పైగా పనిచేస్తున్న పోలీస్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 200కు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది వయోభారంతో అనారోగ్య సమస్యల బారిన పడిన వారు ఉన్నారు. అంతేకాక ఉద్యోగ విరమణకు అత్యంత సమీపంలో ఉన్న వారు కూడా ఉన్నారు. శాసిస్తున్న రాజకీయం నేర నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తూ అంతర్గత అరాచక శక్తుల నుంచి దేశాన్ని కాపాడే కీలక బాధ్యత నెత్తిన వేసుకున్న పోలీస్ శాఖకు విధుల నిర్వహణలో స్వయం ప్రతిపత్తి ఉంది. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఈ పరిస్థితి పోలీస్ శాఖలో ఎక్కడా కనిపించడం లేదు. యావత్ పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయం శాసిస్తోంది. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయాల్సిన దుస్థితి నేడు పోలీస్ శాఖకు పట్టింది. రాజకీయ నాయకులను ధిక్కరిస్తే తమను మారుమూల మండలాలకు బదిలీ చేస్తారన్న భయం చాలా మంది పోలీస్ సిబ్బందిని వెన్నాడుతోంది. దీంతో ఒకవిధమైన అభద్రతాభావంతో వారు పనిచేయాల్సి వస్తోంది. బదిలీల్లోనూ నేతల హవా పోలీస్ శాఖ బదిలీలను సైతం రాజకీయ నేతలు తమ గుప్పిట్లో ఉంచుకున్నారు. వారి సిఫారసు ఉంటే తాము కోరుకున్న చోటులో దర్జాగా బతికేయవచ్చునన్న ఊహ చాలా మంది పోలీస్ సిబ్బందిలోనూ వ్యక్తమవుతోంది. ఇందుకు అద్దం పడుతోంది ఇటీవల ముగిసిన పోలీసుల బదిలీల పర్వం. ఫలితంగా జిల్లాలోని పలు సబ్డివిజన్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇటీవల కొంతమంది ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోగా స్వయానా ఓ డీఎస్పీ కలుగుజేసుకుని వాటిని నిలుపుదల చేయాలని ఎస్పీని కోరారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. సిఫార్సులను పరిగణలోకి తీసుకుని ఉన్నవారిని బదిలీ చేస్తే శాంతిభద్రతలను కాపాడటం చాలా కష్టమని ఎస్పీ ఎదుట సదరు డీఎస్పీ వాపోయినట్లు సమాచారం. కొత్త ఎస్పీపై ఆశలు నెలరోజుల క్రితం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జీవీజీ అశోక్‌కుమార్‌పై పలువురు పోలీసులు ఆశలు పెంచుకుంటున్నారు. తమ సమస్యలను అర్థం చేసుకుని బదిలీల్లో న్యాయం చేకూరుస్తారనే చాలామంది అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే తమ అనారోగ్య పరిస్థితులను విన్నవిస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి దరఖాస్తులు వెల్లువలా వచ్చి చేరుతున్నాయి. దృష్టి సారిస్తున్నాం కొంతమంది ఐదేళ్లకు పైబడి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. తొలి ప్రాధాన్యత కింద వారి సమస్యలను పరిగణలోకి తీసుకుంటాం. నిజంగా ఇబ్బందులు ఉన్న వారికి న్యాయం చేస్తా. ఇందు కోసం గ్రీవెన్స్ ఏర్పాటు చేయబోతున్నాం. అందులో వారి సమస్యను తెలుపుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. - జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
వ్యవసాయ శాఖలో బదిలీల కలకలం
గుంటూరు: ఎక్కడైనా సీనియర్లకు పదోన్నతిలో ప్రాధాన్యం ఇవ్వడం పరిపాటి. రాష్ట్ర వ్యవసాయశాఖ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో తీసుకున్న నిర్ణయాలు ఆ శాఖను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేశాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడుగురు జాయింట్ డెరైక్టర్ కేడర్ అధికారులు ఉన్నప్పటికీ, ఎనిమిది జిల్లాల్లో జేడీఏ పోస్టులను ఖాళీగా ఉంచి డిప్యూటీ డెరైక్టర్లను ఇన్‌ఛార్జి జేడీఏలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి జాబితాలో ఉన్న డిప్యూటీ డెరైక్టర్లు రింగ్‌గా ఏర్పడి వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను ప్రభావితం చేసి జేడీఏ పోస్టును ముందుగానే రిజర్వు చేసుకున్నారని, ఇందుకు భారీగా అడ్వాన్సులు చెల్లించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ బదిలీల ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలకూ ప్రాధాన్యం ఇవ్వలేదు. అర్హత కలిగిన ఒక అధికారికి ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా, వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో చర్చనీయాంశమైంది. జిల్లాల వారీగా జరిగిన బదిలీల ప్రక్రియను పరిశీలిస్తే.. -శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ డెరైక్టర్ అప్పలస్వామిని ఇన్‌ఛార్జి జేడీఏగా నియమించారు. పదోన్నతి జాబితాలో ఉన్న అప్పలస్వామిని త్వరలో రెగ్యులర్ జేడిఏగా అక్కడే కొనసాగించడానికి ప్లాన్ రూపొందించినట్టు అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. -విజయనగరం జేడీఏగా పనిచేస్తున్న డి.ప్రమీలను శ్రీకాకుళం ఆత్మా పీడీగా బదిలీ చేసి, ఆ పోస్టులో విశాఖపట్నంలో డీడీగా పనిచేస్తున్న లీలావతిని విజయనగరం జేడీఏ ఇన్ఛార్జిగా నియమిస్తూ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. -తూర్పుగోదావరి జిల్లాలో 15 ఏళ్లకుపైగా ఏఓగాను, ఏడీఏగాను, 5 ఏళ్లు డీడీగా పనిచేస్తున్న విజయకుమార్‌ను బదిలీ చేయకుండా ఇన్‌ఛార్జి జేడీఏగా నియమించారు. ఆయన కూడా పదోన్నతి జాబితాలో ఉండటంతో అక్కడే పదోన్నతి పొంది ఆ జిల్లాకు జేడీఏగా నియమించడానికి ఈ బదిలీ ఉత్తర్వులు జరిగినట్టు తెలుస్తోంది. -కృష్ణాజిల్లాలో 15 ఏళ్లు ఏఓ, ఏడీఏగానూ, ఆరేళ్లకుపైగా డీడీఏగా పనిచేస్తున్న బాలూనాయక్‌ను బదిలీ చేయకుండా జేడీఏగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ఏళ్ల నుంచి డిడిఏగా పనిచేస్తున్న కృపాదాస్‌ను గుంటూరు జిల్లాకు బదిలీ చేసి జేడీఏగా అదనపు బాధ్యతలు కల్పించారు. -గుంటూరు జేడీఏ ఆఫీసులో 6 ఏళ్లుగా డీడీఏగా పనిచేస్తున్న పద్మావతిని వేరే జిల్లాకు బదిలీ చేయకుండా అదే జిల్లాలో ఆత్మా పీడీ ఆఫీసుకు బదిలీ చేశారు. -గుంటూరు జిల్లా బాపట్ల డీడీఏగా పనిచేస్తున్న వి.మురళీకృష్ణను ప్రకాశం జిల్లాకు బదిలీ చేసి జేడీఏగా అదనపు బాధ్యతలు కల్పించారు. -చిత్తూరు జిల్లాలో ఎనిమిదేళ్లకు పైగా ఏడీఏగా, డీడీఏగా పనిచేస్తున్న నిర్మల కుమార్‌ను బదిలీ చేయకుండా జేడీఏగా అదనపు బాధ్యతలు కల్పించారు. -అనంతపురం జిల్లాలో ఐదేళ్లుగా డీడీఏగా పనిచేస్తున్న శ్రీరామమూర్తిని బదిలీ చేయకుండా అక్కడే ఉంచి జేడీఏగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు రెగ్యులర్ జేడీఏలుగా కొనసాగుతున్న సీనియర్ అధికారులను ఆత్మా పీడీలుగా బదిలీ చేశారు. ఈ తరహా బదిలీలు గత 30 ఏళ్లకు పైగా వ్యవసాయశాఖ చరిత్రలో జరగలేదనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. -
అదేదో చంద్రబాబు వద్దే తేల్చుకుందాం: అయ్యన్న
బదిలీల విషయంలో టీడీపీ నాయకులకు, ఉన్నతాధికారులకు మధ్య ఇన్నాళ్లూ నడిచిన ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారింది. విశాఖ జిల్లాలో తాము చేయించిన బదిలీని ఎందుకు నిలిపివేయించారంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి, సీఎం ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రను టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి నిలదీశారు. అసలు తాము చేయించిన బదిలీని ఆపేందుకు మీరెవరంటూ మండిపడ్డారు. తాను ఈ విషయం ఏదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్దే తేల్చుకుందామంటూ ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. వాస్తవానికి ఇది ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్యపోరని తెలిసింది. విశాఖజిల్లాలో ఉన్న ఒక ఆర్డీవో బదిలీ విషయంలో సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు, మరో మంత్రి గంటా శ్రీనివాసరావుల మధ్య చెలరేగిన వివాదమే దీనంతటికీ కారణమైందని అంటున్నారు. తాను చేయించిన బదిలీని గంటా శ్రీనివాసరావు ఆపించడంతో.. ఒక్క అధికారిని కూడా బదిలీ చేయంచలేనా అంటూ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. ఇంతకుముందు కూడా బదిలీల అంశం తెలుగుదేశం పార్టీలో కొంత ముసలానికి కారణమైంది. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ విషయంలో నేరుగా సీఎం చంద్రబాబుతోనే కొంత గొడవ పడ్డారు. తాను సిఫార్సు చేసిన బదిలీలు జరగకపోతే ఇక తనకు విలువ ఏముంటుందని కూడా అప్పట్పలో ఆయన నిలదీశారు.