సాక్షి, తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలో ఒక అధికారి అంతా తానై వ్యవహరిస్తున్నారు. వీసీ హరిబాబు హయాంలో పలు విమర్శలు మూటకట్టుకున్న ఆయన ఇప్పుడు వీసీ పదవీ కాలంలో ఆయన తీసుకుంటున్న చర్యలు సరికొత్త వివాదాలకు దారి తీస్తున్నాయి. వెటర్నరీ వర్సిటీ పరిపాలన భవనంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆయనపై విమర్శలు, ఆరోపణలు రావడంతో అప్పట్లో వీసీ హరిబాబు ఆయనను ముత్తుకూరులో మత్య్స కళాశాలకు బదిలీ చేశారు. అయితే టీడీపీలో తనకున్న పలుకుబడితో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పీఏగా డిప్యుటేషన్‌పై వెళ్లారు. మూడేళ్ల కాలం డిప్యుటేషన్‌పై వెళ్లిన ఆ అధికారిని.. రిజిస్ట్రార్ నిబంధనలకు వ్యతిరేకంగా వెటర్నరీ పరిపాలన భవనంలోకి కీలక పోస్టులోకి బదిలీపై తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతే కాకుండా మాజీ వీసీ హయాంలో తన దొడ్డిదారి ప్రయత్నాలను అడ్డుకుంటూ వచ్చిన కొందరు ఉద్యోగులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేశారనే ప్రచారంలోకి వచ్చింది.
నిబంధనలకు విరుద్ధం
వర్సిటీలో బదిలీలు, ఉద్యోగోన్నతులు.. ఇలా ఏవి చేయాలన్నా దిగువ స్థాయి ఉద్యోగి నుంచి ఫైల్ రూపొందించి ఉన్నతాధికారులకు చేరాలి. అయితే ఒక అధికారి తన కార్యాలయంలోనే ఫైల్ రూపొందించి ఇన్‌చార్జ్ వీసీ అప్రూవల్ కోసం పెట్టినట్లు సమాచారం. ఇన్‌చార్జ్ వీసీ అన్ని అంశాలు పరిశీలించే పరిస్థితి లేకపోవడంతో సదరు అధికారి పక్కా స్కెచ్ వేసినట్లు వర్సిటీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో దొడ్డిదారి బదిలీలకు తెరతీశారనే విమర్శలు వినవస్తున్నాయి. అలాగే, ఇటీవ ల బదిలీలు, ఉద్యోగోన్నతులు కల్పించిన ఆచా ర్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వీసీకి గవర్నర్ చీవాట్లు పెట్టడం విదితమే.
పరీక్షలు నిర్వహించకనే ప్రమోట్!
వెటర్నరీ వర్సిటీలో బీవీఎస్సీ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాక తదుపరి ఏడాదిలోకి ప్రమోట్ చేస్తారు. అయితే కరోనా సాకుగా చూపి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కరోనా ప్రభావం ముగిసి సాధారణ పరిస్థితి వచ్చాక పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పై తరగతికి ప్రమోట్ అయిన విద్యార్థి ఒకవేళ ఫెయిల్ అయితే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ప్రతిపాదనను కొందరు వర్సిటీ అధికారులు వ్యతిరేకించినట్లు సమాచారం. చదవండి: ‘నిరర్థక’ నిర్ణయం టీడీపీ హయాంలోనే
చంద్రబాబు పీఏ కోసం నిబంధనలకు పాతర
వెటర్నరీ వర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఒక అధికారి గత ఏడాది జూలై 15న చంద్రబాబు పీఏగా నియమితులయ్యా రు. చంద్రబాబు వద్ద పనిచేస్తున్న సదరు అధికారికి 2011లో జారీ చేసిన జీఓ నంబర్ 522 ఆధారంగా వెటర్నరీ వర్సిటీ వేతనం చెల్లిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ వీసీ లేకపోవడంతో టీడీపీ సానుభూతిపరులు తమ పనులు చక్కబెట్టుకోవడం కోసం ఆగమేఘాల మీద వెటర్నరీ పరిపాలన భవనంలో కీలక పదవిలోకి తీసుకొచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇన్‌చార్జ్ వీసీ, ప్రభుత్వం పూర్తి స్థాయి దృష్టి సారిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment