సాక్షి, హైదరాబాద్: భర్త ఒక చోట.. భార్య ఒక చోట.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వందల మంది ఉపాధ్యాయులు ఇలా నాలుగున్నరేళ్లుగా విధులు నిర్వర్తిస్తూ తంటాలు పడుతున్నారు. రాష్ట్ర విభజనతో దూరమైన టీచర్ దంపతులు ఒక్క చోటుకి చేరేందుకు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఎట్టకేలకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు వారిని ఒక్కటి చేసేందుకు గతేడాది అంగీకరించినా అధికారులు రూపొందించిన నిబంధనలు వారి పాలిట శాపంగా మారాయి. ఒక టీచర్ తెలంగాణకు వస్తే మరో టీచర్ ఏపీకి వెళ్లేలా పరస్పర (మ్యూచువల్) బదిలీలకు ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. అయితే ఆ బదిలీల అమలుకు అధికారులు విధించిన నిబంధనలే వారిని దగ్గర కానివ్వడం లేదు. వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నా అధికారులు నిబంధనల కారణంగా పదుల సంఖ్యలో టీచర్లకే లబ్ధి చేకూరింది.
నిబంధనల్లో ఏముందంటే..
అంతర్రాష్ట్ర బదిలీల కోసం టీచర్ల నుంచి వెల్లువెత్తిన విజ్ఞప్తుల మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో గతేడాది ఉన్నతాధికారులతో ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశారు. దాని సిఫారసుల మేరకు అంతర్రాష్ట్ర బదిలీలకు ఆమోదం తెలుపుతూ 2017 ఆగస్టు 7 వరకు దరఖాస్తులను స్వీకరించారు. అయితే స్పౌజ్, పరస్పర కేటగిరీలో బదిలీ కోరుకునే ఇద్దరు టీచర్లు ఒకే సబ్జెక్టు కలిగి ఉండాలని, ఒకే మేనేజ్‌మెంట్ కింద పనిచేస్తూ ఉండాలని, స్థానికత (నేటివిటీ) కలిగి ఉండాలని నిబంధన విధించారు. ఈ నిబంధనే అనేక మందికి శాపంగా మారింది. అంతర్రాష్ట్ర బదిలీ కోసం పరస్పర కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారు వందల మంది ఉన్నా.. ఒకే సబ్జెక్టు, ఒకే మేనేజ్‌మెంట్, నేటివిటీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారు కేవలం పదుల సంఖ్యలోనే ఉన్నారు. దీంతో వందల మంది పరస్పర బదిలీకి అర్హత లేకుండాపోయింది. ఈ నిబంధనల కారణంగా దాదాపు 300 మంది వరకు అసలు దరఖాస్తు కూడా చేసుకోపోగా, దరఖాస్తు చేసుకున్న 250 మందిలో కూడా తక్కువ మందికే లబ్ధి చేకూరింది. కేవలం 20 మంది టీచర్లకు మాత్రమే ఇటీవల బదిలీ జరిగింది. మిగతా వారికి బదిలీలు జరిగే అవకాశం లేకుండాపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆ బదిలీల ప్రక్రియను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఉమ్మడిగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో వారంతా ఆందోళనలో పడ్డారు.
కమిటీ ఉత్తర్వుల ఆలస్యంతో ఆందోళన..
అధికారుల నిబంధనలతో ఎక్కువ మంది టీచర్లకు అంతర్రాష్ట బదిలీకి అవకాశమే లేకుండాపోతోందని టీచర్లు ప్రభుత్వానికి మళ్లీ అనేకసార్లు విజ్ఞప్తులు చేశారు. దీంతో ఉన్నతాధికారుల కమిటీ ఆ నిబంధనలను సడలించాలని నిర్ణయించింది. అయితే కమిటీ నిర్ణయంపై ఇంతవరకు ఉత్తర్వులు జారీ కాకపోవడం, మరోవైపు బదిలీలకు ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో సంబంధిత టీచర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘హెడ్ టు హెడ్’మ్యూచువల్ బదిలీకి అవకాశం ఇవ్వడం వల్ల ఇరు ప్రభుత్వాలకు అదనంగా ఎలాంటి ఆర్థిక భారం ఉండదని, తమకు బదిలీకి అవకాశం కల్పించి తమ కుటుంబాల దగ్గరకు వెళ్లేలా చూడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment