సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాలో పలువురు సబ్‌రిజిస్ట్రార్లపై బదిలీ వేటు పడనుందా? గాడ్ ఫాదర్లు, రాజకీయ అండదండలతో ఒకేచోట దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారికి ఈసారి స్థానచలనం కలగనుందా? అవినీతి ఆరోపణలున్నా.. కోరుకున్నచోట పోస్టింగ్ పొందుతున్న వారిపై ఇంటెలిజెన్స్ నివేదికలు సిద్ధమయ్యాయా? ఇందుకు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు పూర్తి చేసిందా? అంటే.. నిజమే అంటున్నారు కొందరు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలోని అధికారులు.
చాలామంది సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తుండడం, కొందరిపై అవినీతి ఆరోపణలు, కొన్నిచోట్ల పనికి తగిన రీతిలో అధికారులు లేకపోవడం వంటి పలు కారణాలపై వివరాలు సేకరించిన ఉన్నతాధికారులు బదిలీపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి రాబడి తెచ్చే వాటిలో కీలకమైన ఈశాఖలో అక్రమాలకు పాల్పడుతున్న వారికి స్థానచలనం కలిగించాలని చూస్తున్నారు. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారిలో కొందరు సంపాదనే లక్ష్యంగా వివాదాస్పద రిజిస్ట్రేషన్లు చేస్తూ.. భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆ శాఖ పరిశీలనలో తేలినట్లు సమాచారం. ఈఆరోపణలపైనే గతేడాది ఉమ్మడి వరంగల్‌లో నలుగురిని సస్పెండ్ చేసిన అధికారులు.. మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
జాబితాలో వారే..
వరంగల్ జిల్లాలో ఓసబ్ రిజిస్ట్రార్ 13 ఏళ్లుగా ఒకేచోట ఉన్నారు. తొమ్మిదేళ్లుగా సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతుండగా.. ఇదే కార్యాలయంలో ఈయన సీనియర్ అసిస్టెంట్‌గా ఐదేళ్లు పనిచేశారు. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్నానన్న ముద్రను తొలగించుకునేందుకు ఓసబ్ రిజిస్ట్రార్ జనగామ జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లాకు బదిలీ చేయించుకున్నారు. కొద్ది రోజులకే ‘గాడ్ ఫాదర్’ను కలిసి ప్రసన్నం చేసుకున్న సదరు అధికారి తిరిగి జనగామ జిల్లాకు మారారు. ఈయనపై కొందరు బాధితులు గతంలో జనగామ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ములుగు జిల్లాలో ఓసబ్ రిజిస్ట్రార్ పదకొండేళ్లకుపైగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
వరంగల్ జిల్లాలో వేర్వేరుచోట్ల పనిచేస్తున్న మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఒకరు ఏడు, ఒకరు ఆరేళ్లుగా ఆ కార్యాలయాలను వీడడం లేదు. చేర్యాల సబ్ రిజిస్ట్రార్ ఎనిమిదేళ్లుగా బదిలీకి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్‌లో కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఒకేచోట లేదా వివిధ హోదాల్లో ఒకే కార్యాలయంలో పని చేస్తున్నారన్న ఆరోపణలతోపాటు కీలక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పలువురు సీనియర్ అసిస్టెంట్లే ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్లుగా కొనసాగిన విషయం తెలిసిందే. ఆసమయంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, వాటిపై వచ్చి న ఫిర్యాదులు, ఆరోపణలపైనా జరిపిన విచారణ నివేదికను కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బదిలీలపై కసరత్తు చేస్తున్న సమాచారంతో ఆ జాబితాలో ఉన్న వారు పోస్టింగ్‌లను పదిలపర్చుకునేందుకు ప్రయత్నాల్లో పడ్డట్లు చర్చ జరుగుతోంది.
పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు..
బదిలీలకు కసరత్తు జరుగుతుందన్న ప్రచారం మేరకు కీలక పోస్టింగ్‌ల కోసం పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వరంగల్‌లో సస్పెండ్ అయిన ఓ అధికారి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ శాఖలోనే ప్రచారం ఉంది. ఆర్డర్లు సిద్ధమయ్యేలోగా సస్పెన్షన్ ఎత్తివేయించుకునేందుకు హైదరాబాద్‌లో ‘గాడ్ ఫాదర్’ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గతేడాది నవంబర్‌లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా పలువురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు వరంగల్ ఆర్వోలో పనిచేస్తున్న ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలపై సస్పెండ్ అయిన వారిలో సంపత్‌కుమార్, సురేంద్రబాబు, శ్రీనివాస్, రామచంద్రయ్య ఉన్నారు. పూర్తిస్థాయి సబ్ రిజిస్ట్రార్లను నియమించే వరకు సూపరింటెండెంట్ భూపాల్, సీనియర్ అసిస్టెంట్ కార్తీక్‌లకు ఇన్‌చార్జ్‌లుగా ఆ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి నలుగురు సస్పెన్షన్‌లోనే కొనసాగుతున్నారు. సస్పెన్షన్ ఎత్తివేసినా జోన్ల మా ర్పులో భాగంగా ఓసబ్ రిజిస్ట్రార్ ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశం ఉండగా.. ఉద్యోగ సంఘాల కీలక నేతతో సత్సంబంధాలు కలిగిన ఓ సస్పెండ్ సబ్ రిజిస్ట్రార్ తిరిగి నియామక ఉత్తర్వులు పొందేందు కు యత్నిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment