
ఏకశిల కొండపై నుంచి నగర వీక్షణం
గుట్టపై ఆలయం, సైనిక బురుజు, విశ్రాంతి గదులు
అందాల కొండపై ఆహ్లాదకర వాతావరణం
పర్యాటకాభివృద్ధి చేయాలని స్థానికుల వినతి
ఖిలా వరంగల్: రాజులు పోయారు.. రాజ్యాలు అంతరించాయి. రాచరికపు వైభోగాలు కనుమరుగయ్యాయి. కానీ నాటి కట్టడాలు, జ్ఞాపకాలు నేటికీ చెక్కు చెదరలేదు. శతాబ్దాల చరిత్ర.. శత్రు దుర్బేధ్య నగరం.. శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది ఏకశిల కొండ. నాడు ఏకశిల నగరం, ఓరుగల్లుగా పలు పేర్లతో ప్రఖ్యాతిగాంచింది. కాలక్రమేణా దీనికి వరంగల్ (Warangal) పేరు స్థిరపడింది.
వారసత్వ నగరంగా..
భారతదేశంలోని ఉత్తమ వారతస్వ నగరాల్లో ఒకటిగా ఓరుగల్లు (Orugallu) గుర్తింపు పొందింది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరం. ఓరు.. అంటే ఒకటి, గల్లు.. అనే పదానికి రాయి అని అర్థాలున్నాయి. 11వ శతాబ్ధంలో ఈ అందమైన నగరాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని 300 ఏళ్లు కాకతీయులు పాలించారు. ఈ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. రాజధానిగా చెప్పుకుంటున్న ఖిలా వరంగల్ కోట అద్భుతమైన పురాతన కట్టడాలు, అనేక స్మారక చిహ్నాలు, వాస్తు శిల్ప కళా సంపదకు నిలయం.
వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే..
కాకతీయుల రాజధానిగా చెప్పుకునే ఖిలా వరంగల్ కోటలో ఏకశిల గుట్ట (ఎత్తయిన రాతి కొండ)గా ఉంది. ఏక (ఒక) శిల (రాయి) ఏకశిలా నగరం.. దీన్నే ఓరు (ఒకటి) గల్లు (రాయి) అని.. ఈ ఎత్తయిన కొండ పేరుతోనే ఓరుగల్లు నగరంగా పిలుస్తుంటారు. శతాబ్దాల కాలం నుంచి ఏకశిల, ఓరుగల్లు నగరం కనుమరుగై.. ప్రస్తుతం వరంగల్‌గా పేరొందింది. అందాల కొండ ఏకశిల గుట్టను ఎక్కి చూస్తే.. నగరంతోపాటు చుట్టు పక్క గ్రామాలు, కొండలు, గుట్టలు, కనువిందు చేస్తాయి. ఈకొండపై ఆలయం, బురుజు, సైనిక స్థావరం, విశ్రాంతి గదులు, ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. ఈ కొండపై ఉన్న ఎత్తయిన బురుజుపై ఫిరంగి, భారీ తోపులు ఏర్పాటు చేశారు. శత్రు సైన్యం రాకను పసిగట్టినప్పుడు ఫిరంగులు, తోపుల్ని పేల్చడం వల్ల.. కోట చుట్టూ ఉన్న సైన్యం అప్రమత్తమయ్యేదని చరిత్రకారులు చెబుతున్నారు.

కొండపై సైనిక స్థావరం
హనుమకొండ పద్మాక్షి దేవాలయం కేంద్రంగా మూడు కొండలను ఏకం చేసి కాకతీయుల తొలి రాజధానిని ఏర్పాటు చేశారు. కాకతీమాత అనుగ్రహంతో గణపతి దేవ చక్రవర్తి 1199 నుంచి 1262 మధ్యకాలంలో రాజధానిని ఓరుగల్లుకు మార్చేసి 300 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించారు. తొలుత 3వేల ఆడుగుల ఎత్తయిన ఏకశిల కొండపై సైనిక స్థావరం ఏర్పాటు చేశారు. ఇందుకు కొండపై ఎత్తయిన బురుజే సాక్ష్యం. బురుజు ఎక్కేందుకు అంతర్భాగంలోనే వేర్వేరుగా మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గం ఎక్కి చూస్తే నగరంతోపాటు చుట్టూ ఉన్న కొండలు గుట్టలు, అందమైన నగరం కనువిందు చేస్తాయి. బురుజుపై తోపులు పెట్టి పేల్చిన ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. సైనికులు గాయపడకుండా.. నిలువెత్తు పటిష్టమైన నాలుగు రాళ్లు నాలుగు వైపులా నిలబెట్టి ఉంటాయి. దీనిపైకి పర్యాటకులు ఎక్కి.. రాతి కట్టడాలు.. ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకించి ఆస్వాదిస్తున్నారు.
సైనికులకు విశ్రాంతి గదులు
ఆనాడు కొండపై సైనికులకు విశ్రాంతి గదులు నిర్మించారు. ఫిరంగుల్లో మందు నింపేందుకు ప్రత్యేక గదులు వేర్వేరుగా ఉండేవని చెబుతారు. ఈ నిర్మాణాలన్నీ 20 ఏళ్ల క్రితం వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆదరణ లేక శిథిలమై కూలిపోయాయి. ఈగుట్టపైకి రహస్య సొరంగ మార్గాలు ఉండేవని.. వాటి ద్వారా చేరుకుని సైనికులకు మార్గనిర్ధేశం చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు.
చదవండి: ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు
అభివృద్ధికి దూరంగా..
ఏకశిల గుట్ట నేటికీ అభివృద్ధికి దూరంగా ఉంది. గుట్టపై విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. కనీసం ఐదువేల మంది ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. గుట్టపై పర్యాటకులు చల్లని వాతావరణం, ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ.. నగర అందాలను వీక్షిస్తూ సేదదీరుతుంటారు. కానీ గుట్టపై దాహార్తి తీరేందుకు మంచినీటి సౌకర్యం లేదు. మెట్ల మార్గం ద్వారా పర్యాటకులు ఎంతో కష్టపడి ఎక్కినా.. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేక అవస్థలు పడుతుంటారు. ఒకే రాయితో ఏర్పడిన సుందరమైన చారిత్రక గుట్టను ఆధునికీకరిస్తే.. పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని, తద్వారా స్థానిక యువతకు స్వయం ఉపాధి మెరుగుపడుతుందని స్థానికులు భావిస్తున్నారు.

కొండపై ఆలయం
ఏకశిల కొండపై అద్భుతమైన శిల్ప కళా సౌందర్యంతో కూడిన ఓ ఆలయం ఉంది. ఆలయంలో 28 స్తంభాలతో గర్భగుడి, విశాలమైన కల్యాణ మండపం ఉంది. శిల్ప కళా సౌందర్యంతో కనిపించే ఈ ఆలయ గర్భగుడి దేవతా విగ్రహాలు లేక బోసిపోయి కనిపిస్తోంది. ఆనాడు సైనికులు సైతం ఇక్కడ శివారాధన చేసిన తర్వాతే విధుల్లో చేరేవారని చారిత్రక నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment