ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు | Telugu expats in Israel difficult to find work | Sakshi
Sakshi News home page

Telugu Expats: ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు

Published Sat, Feb 15 2025 2:52 PM | Last Updated on Sat, Feb 15 2025 2:53 PM

Telugu expats in Israel difficult to find work

ఇజ్రాయెల్‌లో కన్‌స్ట్రక్షన్‌ రంగంలో పనిచేస్తున్న కార్మికులు (ఫైల్‌)

టామ్‌కామ్‌ ద్వారా పెద్ద ఎత్తున వీసాలు పొందిన నిరుద్యోగులు

నెలలో సగం రోజులు కూడా పనులు దొరకని దుస్థితి

నిర్మాణ రంగంలో భారతీయులను పనిలోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్న చైనా కాంట్రాక్టర్లు  

ఆర్మూర్‌: తెలంగాణ‌ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రవేశపెట్టిన టామ్‌కామ్‌ (TOMCOM) ద్వారా ఇజ్రాయెల్‌ (Israel) నిర్మాణ రంగంలో ఉపాధి కోసం వెళ్లిన నిరుద్యోగులు.. అక్కడ పనులు దొరక్క తీవ్రఇక్కట్లు పడుతున్నారు. ఇజ్రాయెల్‌ లోని నిర్మాణరంగంలో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు చైనాకు చెందినవారు కావడంతో భారతీయ కార్మికులు అనగానే పనులు లేవంటూ తిప్పి పంపుతున్నారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మాణ రంగంలో మల్టిపుల్‌ నైపుణ్యాలు (Multiple Skills) లేని కారణంగానే వారికి పనులు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. సమస్య తీవ్రతను ఇజ్రాయెల్‌లోని భారత రాయబార సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళితే వారు కూడా చేతులు ఎత్తేసినట్టు సమాచారం.

తాము పని కల్పించలేమంటూ కార్మికులే పని వెతుక్కోవాలని వారు సూచిస్తున్నట్టు బాధితులు వాపోతున్నారు. కార్మికులు వెళ్లిన కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పరిధిలో పనులు దొరకని పక్షంలో ఆ కంపెనీని వదిలి బయటకు వెళ్లి రెఫ్యూజీలుగా (Refugees) పని చేసుకుందామంటే ఇజ్రాయెల్‌ దేశ చట్టాలు కఠినంగా ఉన్నాయి. దీంతో ఆ అవకాశమే లేకుండా పోయింది.

పాలస్తీనాకు బ్రేక్‌ వేయడంతో... 
ఇజ్రాయెల్‌లో పాలస్తీనాకు చెందినవారు అధిక సంఖ్యలో ఉపాధి పొందేవారు. అయితే ఈ రెండు దేశాల మధ్య పోరు కొనసాగుతుండటంతో ఇజ్రాయెల్‌.. పాలస్తీనా వలస కార్మికుల రాకపోకలకు బ్రేక్‌ వేసింది. ఫలితంగా ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత తీవ్రమైంది. ఇజ్రాయెల్‌ పౌరులు ఎక్కువగా ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. దీంతో ఆ దేశంలో కార్మికులుగా పనిచేసేందుకు పరాయి దేశస్తుల అవసరం ఎంతో ఉంది.

ఈ నేపథ్యంలో వలస కార్మికులకు దండిగా వీసాలను జారీ చేసేందుకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇజ్రాయెల్‌లో వ్యవసాయ, భవన నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆ దేశం జారీ చేస్తున్న వీసాల ప్రక్రియలో దళారుల జోక్యాన్ని నివారిస్తూ టామ్‌ కామ్‌ (తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌) చర్యలు తీసుకుంది. టామ్‌కామ్‌ ఇజ్రాయెల్‌ వీసాలకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించి తెలంగాణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు వీసాలు కేటాయించి ఇజ్రాయెల్‌కు పంపించారు.  

నిర్మాణ రంగంలో అనుభవం లేని కార్మికులు  
హైదరాబాద్‌లోనే టామ్‌కామ్, న్యాక్‌ (నేషనల్‌ అకాడమీ అఫ్‌ కన్‌స్ట్రక్షన్‌) సంస్థల ఆధ్వర్యంలో వలస కార్మికుల రిక్రూట్‌ చేపట్టారు. అయితే ఈ కార్మికులకు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం పెద్దగా లేని కారణంగా ఇజ్రా యెల్‌లో కాంట్రాక్టర్లు వారిని నిరాకరిస్తున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చిన కార్మికులు సివిల్, కరెంట్, టైల్స్, ప్లంబింగ్‌ లాంటి మల్టిపుల్‌ పనులు చేయడంలో నిష్ణాతులుగా ఉండటంతో అక్కడి కాంట్రాక్టర్లు వారికే ప్రాధాన్యం ఇస్తూ భారతీయ కార్మికులకు పనిఇవ్వడం లేదని తెలుస్తోంది.

చ‌ద‌వండి: ‘అనాబ్‌ – ఎ–షాహి’ ఎక్కడోయి ?

పరిస్థితి ఇలాగే ఉంటే కుటుంబపోషణ కోసం అప్పులు చేసి దేశం కాని దేశంలో తాము ఇక్కట్లు పడటమే కాకుండా తమ కుటుంబ సభ్యులను రోడ్డు మీదకు తెచ్చినట్టు అవుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇజ్రాయెల్‌లోని రాయబార సంస్థ అధికారులతో మాట్లాడి తమకు పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement