Indian migrant labourers
-
ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు
ఆర్మూర్: తెలంగాణ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రవేశపెట్టిన టామ్‌కామ్ (TOMCOM) ద్వారా ఇజ్రాయెల్ (Israel) నిర్మాణ రంగంలో ఉపాధి కోసం వెళ్లిన నిరుద్యోగులు.. అక్కడ పనులు దొరక్క తీవ్రఇక్కట్లు పడుతున్నారు. ఇజ్రాయెల్ లోని నిర్మాణరంగంలో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు చైనాకు చెందినవారు కావడంతో భారతీయ కార్మికులు అనగానే పనులు లేవంటూ తిప్పి పంపుతున్నారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మాణ రంగంలో మల్టిపుల్ నైపుణ్యాలు (Multiple Skills) లేని కారణంగానే వారికి పనులు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. సమస్య తీవ్రతను ఇజ్రాయెల్‌లోని భారత రాయబార సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళితే వారు కూడా చేతులు ఎత్తేసినట్టు సమాచారం.తాము పని కల్పించలేమంటూ కార్మికులే పని వెతుక్కోవాలని వారు సూచిస్తున్నట్టు బాధితులు వాపోతున్నారు. కార్మికులు వెళ్లిన కన్స్ట్రక్షన్ కంపెనీ పరిధిలో పనులు దొరకని పక్షంలో ఆ కంపెనీని వదిలి బయటకు వెళ్లి రెఫ్యూజీలుగా (Refugees) పని చేసుకుందామంటే ఇజ్రాయెల్ దేశ చట్టాలు కఠినంగా ఉన్నాయి. దీంతో ఆ అవకాశమే లేకుండా పోయింది.పాలస్తీనాకు బ్రేక్ వేయడంతో... ఇజ్రాయెల్‌లో పాలస్తీనాకు చెందినవారు అధిక సంఖ్యలో ఉపాధి పొందేవారు. అయితే ఈ రెండు దేశాల మధ్య పోరు కొనసాగుతుండటంతో ఇజ్రాయెల్.. పాలస్తీనా వలస కార్మికుల రాకపోకలకు బ్రేక్ వేసింది. ఫలితంగా ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత తీవ్రమైంది. ఇజ్రాయెల్ పౌరులు ఎక్కువగా ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. దీంతో ఆ దేశంలో కార్మికులుగా పనిచేసేందుకు పరాయి దేశస్తుల అవసరం ఎంతో ఉంది.ఈ నేపథ్యంలో వలస కార్మికులకు దండిగా వీసాలను జారీ చేసేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇజ్రాయెల్‌లో వ్యవసాయ, భవన నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆ దేశం జారీ చేస్తున్న వీసాల ప్రక్రియలో దళారుల జోక్యాన్ని నివారిస్తూ టామ్ కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్) చర్యలు తీసుకుంది. టామ్‌కామ్ ఇజ్రాయెల్ వీసాలకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించి తెలంగాణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు వీసాలు కేటాయించి ఇజ్రాయెల్‌కు పంపించారు. నిర్మాణ రంగంలో అనుభవం లేని కార్మికులు హైదరాబాద్‌లోనే టామ్‌కామ్, న్యాక్ (నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్) సంస్థల ఆధ్వర్యంలో వలస కార్మికుల రిక్రూట్ చేపట్టారు. అయితే ఈ కార్మికులకు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం పెద్దగా లేని కారణంగా ఇజ్రా యెల్లో కాంట్రాక్టర్లు వారిని నిరాకరిస్తున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చిన కార్మికులు సివిల్, కరెంట్, టైల్స్, ప్లంబింగ్ లాంటి మల్టిపుల్ పనులు చేయడంలో నిష్ణాతులుగా ఉండటంతో అక్కడి కాంట్రాక్టర్లు వారికే ప్రాధాన్యం ఇస్తూ భారతీయ కార్మికులకు పనిఇవ్వడం లేదని తెలుస్తోంది.చదవండి: ‘అనాబ్ – ఎ–షాహి’ ఎక్కడోయి ?పరిస్థితి ఇలాగే ఉంటే కుటుంబపోషణ కోసం అప్పులు చేసి దేశం కాని దేశంలో తాము ఇక్కట్లు పడటమే కాకుండా తమ కుటుంబ సభ్యులను రోడ్డు మీదకు తెచ్చినట్టు అవుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇజ్రాయెల్‌లోని రాయబార సంస్థ అధికారులతో మాట్లాడి తమకు పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను
సౌదీలో రెండేళ్ల పాటు 700 గొర్రెలను ఒంటరిగా మేపాడు. మరో మనిషితో మాట్లాడలేదు. మరో మాట వినలేదు. ఇసుకతో స్నానం ఇసుకే దాహం ఇసుక తప్ప మరేం కనిపించని ఒంటరితనం. బానిస బతుకు. కాని బతికి దేశం తిరిగి వచ్చాడు. 1995లో అతని జీవితం నవలగా వెలువడి మలయాళంలో సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం 138వ ప్రచురణకు వచ్చింది. అతని జీవితం ఆధారంగానే ‘గోట్ లైఫ్’ సినిమా తాజాగా విడుదలైంది. కేరళకు చెందిన నజీబ్ సంఘర్షణ ఇది. కేరళలోని అలెప్పి దగ్గరి చిన్న ఊరికి చెందిన నజీబ్ కోరుకుంది ఒక్కటే. సౌదీకి వెళ్లి ఏదో ఒక పని చేసి కుటుంబానికి నాలుగు డబ్బులు పంపాలన్నదే. ఆ రోజుల్లో కేరళ నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు చాలామంది పని కోసం వలస వెళ్లేవారు. నజీబ్ కూడా సౌదీకి వెళ్లాలనుకున్నాడు. ఏజెంట్ అతనికి ఒక మాల్లో సేల్స్‌మ్యాన్‌గా పని ఉంటుందని పంపాడు. అలా నజీబ్ సౌదీలో అడుగు పెట్టాడు. అది 1993వ సంవత్సరం. రెండు రోజుల తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో దిగాక నజీబ్ రెండు రోజుల పాటు ప్రయాణిస్తూనే ఉన్నాడు... అప్పుడు గాని అర్థం కాలేదు తాను మోసపోయానని. ఎడారి లోపల అతణ్ణి అరబ్ షేక్‌కు అప్పజె΄్పారు. ఆ షేక్ అక్కడే ఒక షెడ్డు వేసుకుని ఉండేవాడు. నజీబ్‌కు 700 గొర్రెలను కాచే పని అప్పజె΄్పాడు. వేరే బట్టలు ఇవ్వలేదు. స్నానానికి నీళ్లు ఇవ్వలేదు. బతకడానికి మాత్రం ముతక రొట్టెలు పడేసేవాడు. ఆ రొట్టెల్ని గొర్రెపాలలో తడిపి కొద్దిగా తినేవాడు నజీబ్. యజమాని, అతని తమ్ముడు ఈ ఇద్దరు మాత్రమే నజీబ్‌కు కనిపించేవారు. వారి అరబిక్ భాష తప్ప మరో భాష వినలేదు. మరో మనిషిని చూడలేదు. ‘నేను ఏడ్చినప్పుడల్లా వారు కొట్టేవారు’ అంటాడు నజీబ్. భ్రాంతులు నజీబ్‌కు ఎడారిలో ఉండి భ్రాంతులు మొదలయ్యాయి. అతడు గొర్రెల మధ్య ఉండి ఉండి తాను కూడా ఒక గొర్రెనేమో అనుకునేవాడు. రెండేళ్ల పాటు ఇలాగే జరిగింది. ఒకరోజు ఆ అన్నదమ్ములిద్దరూ పెళ్లి ఉందని వెళ్లారు. ఆ అదను కోసమే చూస్తున్న నజీబ్ ఎడారిలో పరిగెత్తడం మొదలుపెట్టాడు. దారి లేదు.. గమ్యమూ తెలియదు. పరిగెట్టడమే. ఒకటిన్నర రోజు తర్వాత మరో మలయాళి కనిపించి దారి చె΄్పాడు. అతడు కూడా తనలాంటి పరిస్థితిలో ఉన్నవాడే. చివరకు ఒక రోడ్డు కనిపించి రియాద్ చేరాడు. అక్కడి మలయాళీలు నజీబ్‌ను కాపాడారు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోతే తగిన పత్రాలు లేనందున 10 రోజులు జైల్లో పెట్టి ఇండియా పంపారు. నవల సినిమాగా నజీబ్ తిరిగి వచ్చాక కోలుకొని బెహ్రయిన్ వెళ్లాడు ఈసారి పనికి. అక్కడ పని చేస్తున్న రచయిత బెన్యమిన్‌కు నజీబ్‌తో పరిచయమైంది. నజీబ్ జీవితాన్ని బెన్యమిన్ నవలగా ‘ఆడు జీవితం’ (గొర్రె బతుకు) పేరుతో రాసి 2008లో వెలువరించాడు. అది సంచలనంగా మారింది. ఇప్పటికి వందకు పైగా ఎడిషన్స్ వచ్చాయి. 8 భాషల్లో అనువాదమైంది. ఆ నవల ్రపాశస్త్యం సినిమా రంగాన్ని ఆకర్షించింది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ‘ఆడు జీవితం’ పేరుతో నటించి మొన్న మార్చి 28న విడుదల చేశాడు. తెలుగులో గోట్‌లైఫ్ పేరుతో అనువాదమైంది. వాస్తవిక సినిమాగా ఇప్పటికే గోట్‌లైఫ్ ప్రశంసలు పొందుతోంది. -
యూఏఈలో మన వాళ్లకు గడ్డుకాలం
రాయికల్(కరీంనగర్): ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న అన్ని దేశాలూ ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కొంటుండగా కేవలం చమురును మాత్రమే నమ్ముకున్న యూఏఈ లాంటి దేశాల పరిస్థితి మరింతగా దిగజారింది. దీంతో ఆయూ దేశాల్లోని అరబ్బులతోపాటు ఇతర దేశాలకు చెందిన కార్మికులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. ప్రధాన కంపెనీల్లో పనిచేస్తున్న విదేశీ కార్మికుల స్థానంలో అరబ్బులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న స్థానిక ప్రభుత్వాల నిర్ణయం భారత కార్మికుల పాలిట ఇబ్బందికర పరిణామమైంది. యూఏఈలోని దుబాయ్, అబుదాబీ, షార్జా, అజ్మన్, రస్ ఆల్‌ఖైమా, పుజ్‌రాహీ, ఉమా ఆల్ ఉక్వెన్ వంటి ప్రాంతాల్లో దాదాపు 10 లక్షల మంది భారతీయ కార్మికులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సుమారు పది లక్షల మంది కార్మికులు యూఏఈలో ఉపాధి పొందుతున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆయిల్ కంపెనీలకు అక్కడి బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలేదు. దీంతో అన్ని కంపెనీలు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాక కార్మికులను పనిలో నుంచి తొలగిస్తూ ఆయా కంపెనీలు ఉత్తర్వులు జారీ చేశాయి. అప్పులు చేసిమరీ ఉపాధికోసమని యూఏఈకి వెళ్లి.. అక్కడ పనిలేకనో, ఉన్నపని పోగొట్టుకునో తిరిగి స్వగ్రామాలకు రావాల్సిన పరిస్థితి. ఒట్టిచేతులతో ఇక్కడికొచ్చి చేసిన అప్పులు ఎలా తీర్చాలని, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉద్యోగం ఉందన్న భరోసాతో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారి పరిస్థితి భయానకంగా మారింది. వివిధ కంపెనీల్లో కాస్తో కూస్తో హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులు జీతాలకు అనుగుణంగా అక్కడి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోవడంతో లోన్ కట్టలేకలేకపోతున్నారు. రుణం ఎగవేత కారణం చూపి బ్యాంకులు పాస్‌పోర్ట్‌లను బ్లాక్ చేయిస్తే ఎలా?అని ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. ఇంతేకాదు యూఏఈలోనే పిల్లలను చదివించుకుంటున్న కొందరు ఉద్యోగులు హఠాత్తుగా స్వదేశానికి వెళ్లాల్సి వచ్చేసరికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.