యూఏఈలో మన వాళ్లకు గడ్డుకాలం
రాయికల్(కరీంనగర్): ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న అన్ని దేశాలూ ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కొంటుండగా కేవలం చమురును మాత్రమే నమ్ముకున్న యూఏఈ లాంటి దేశాల పరిస్థితి మరింతగా దిగజారింది. దీంతో ఆయూ దేశాల్లోని అరబ్బులతోపాటు ఇతర దేశాలకు చెందిన కార్మికులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. ప్రధాన కంపెనీల్లో పనిచేస్తున్న విదేశీ కార్మికుల స్థానంలో అరబ్బులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న స్థానిక ప్రభుత్వాల నిర్ణయం భారత కార్మికుల పాలిట ఇబ్బందికర పరిణామమైంది. యూఏఈలోని దుబాయ్, అబుదాబీ, షార్జా, అజ్మన్, రస్ ఆల్‌ఖైమా, పుజ్‌రాహీ, ఉమా ఆల్ ఉక్వెన్ వంటి ప్రాంతాల్లో దాదాపు 10 లక్షల మంది భారతీయ కార్మికులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సుమారు పది లక్షల మంది కార్మికులు యూఏఈలో ఉపాధి పొందుతున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆయిల్ కంపెనీలకు అక్కడి బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలేదు. దీంతో అన్ని కంపెనీలు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాక కార్మికులను పనిలో నుంచి తొలగిస్తూ ఆయా కంపెనీలు ఉత్తర్వులు జారీ చేశాయి. అప్పులు చేసిమరీ ఉపాధికోసమని యూఏఈకి వెళ్లి.. అక్కడ పనిలేకనో, ఉన్నపని పోగొట్టుకునో తిరిగి స్వగ్రామాలకు రావాల్సిన పరిస్థితి. ఒట్టిచేతులతో ఇక్కడికొచ్చి చేసిన అప్పులు ఎలా తీర్చాలని, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ఉద్యోగం ఉందన్న భరోసాతో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారి పరిస్థితి భయానకంగా మారింది. వివిధ కంపెనీల్లో కాస్తో కూస్తో హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులు జీతాలకు అనుగుణంగా అక్కడి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోవడంతో లోన్ కట్టలేకలేకపోతున్నారు. రుణం ఎగవేత కారణం చూపి బ్యాంకులు పాస్‌పోర్ట్‌లను బ్లాక్ చేయిస్తే ఎలా?అని ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. ఇంతేకాదు యూఏఈలోనే పిల్లలను చదివించుకుంటున్న కొందరు ఉద్యోగులు హఠాత్తుగా స్వదేశానికి వెళ్లాల్సి వచ్చేసరికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.