దుబాయ్: గత శతాబ్ద కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ప్రపంచానికి ఎక్కువ సమయం లేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేవలం మన ప్రయోజనాలు మాత్రమే కాపాడుకోవాలన్న మానవాళి వైఖరి అంతిమంగా భూగోళాన్ని చీకట్లోకి నెట్టేస్తుందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, తద్వారా ప్రకృతి విపత్తులతో భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, వాటి దుష్ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెప్పారు.
ప్రపంచానికి సవాలు విసురుతున్న కర్బన ఉద్గారాలను ప్రజల భాగస్వామ్యం ద్వారా తగ్గించుకోవడానికి ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి వాతవరణ సదస్సు ‘కాప్–33’ని 2028లో భారత్‌లో నిర్వహిస్తామని ప్రతిపాదించారు. శుక్రవారం యూఏఈలోని దుబాయ్‌లో జరిగిన కాప్–28లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాలుష్యం, విపత్తుల నుంచి భూగోళాన్ని కాపాడుకొనే చర్యలను వెంటనే ప్రారంభించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ను ప్రస్తావించారు. వ్యాపారాత్మక ధోరణికి భిన్నంగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగే ఇందులో పాలుపంచుకోవాలని కోరారు.
మూల్యం చెల్లిస్తున్న మానవాళి
అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకాన్ని భారత్ చక్కగా పాటిస్తోందని, ఈ విషయంలో ప్రపంచానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భూగోళ ఉపరితల ఉష్ణోగ్రత(గ్లోబల్ వార్మింగ్) పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరమితం చేయాలన్న లక్ష్య సాధనకు నిబద్ధతతో కృషి చేస్తున్న అతికొన్ని దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. గత శతాబ్ద కాలంలో మానవళిలో ఒక చిన్న సమూహం ప్రకృతికి ఎనలేని నష్టం కలిగించిందని మోదీ ఆక్షేపించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయండి
వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలకు నరేంద్ర మోదీ సూచించారు.అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్లోబల్ కార్బన్ బడ్జెట్‌లో తగిన వాటా ఇవ్వాలన్నారు. ‘కాప్–33’ని 2028లో భారత్‌లో నిర్వహించడానికి ప్రపంచ దేశాలు అంగీకరిస్తే తమ దేశంలో ఇటీవల జరిగిన జీ20 సదస్సు తర్వాత ఇదే అతిపెద్ద సదస్సు అవుతుందని పేర్కొన్నారు.
ఏమిటీ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్?
భారత ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్‌లో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కూడా దాదాపు ఇలాంటిదే. ఇదొక వినూత్నమైన మార్కెట్ ఆధారిత కార్యక్రమం. వేర్వేరు రంగాల్లో పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛందంగా కృషి చేసిన వ్యక్తులకు, వ్యవస్థలకు, కమ్యూనిటీలకు, ప్రైవేట్ రంగానికి ప్రత్యేక గుర్తింపునిస్తారు. ప్రోత్సాహకాలు అందజేస్తారు.
అమెరికా, చైనా అధినేతల గైర్హాజరు
దుబాయ్‌లో జరుగుతున్న కాప్–28కు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ప్రతిఏటా కర్బన ఉద్గారాల్లో ఏకంగా 44 శాతం వాటా అమెరికా, చైనాలదే కావడం గమనార్హం. ఈ రెండు బడా దేశాల నిర్లక్ష్యం వల్ల ఇతర దేశాలకు నష్టపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, చైనా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment