climate conference
-
కాప్29... గత చరిత్రకు కొనసాగింపే!
అజర్బైజాన్ రాజధాని బాకూలో ఇటీవలే ముగిసిన వాతావరణ చర్చలకు సంబంధించిన ‘కాప్’ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) 29, వివాదాస్పద ఒప్పందంతో ముగిసింది. వాతావరణపరమైన సహాయాన్ని (క్లైమేట్ ఫైనాన్స్) ఈ చర్చల్లో కేంద్ర ఇతివృత్తంగా భావించారు. ఇది వాతావరణ మార్పులను పరిష్కరించే ఉపశమనం, అనుసరణ చర్యలకు మద్దతునిచ్చే స్థానిక, జాతీయ లేదా అంతర్జాతీయ ఫైనాన్సింగ్‌ను సూచిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు... వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కోవటానికి సమర్థవంతమైన చర్యలు చేపట్టడానికి ఉపయోగపడే అదనపు నిధులను దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయి. అదీ ధనిక దేశాలు ఎక్కువ బాధ్యత వహించాలని అంటున్నాయి. ప్రస్తుత సంక్షోభానికి ప్రధానంగా వారిదే బాధ్యత కాబట్టి. పారిశ్రామిక విప్లవ కాలం నుండి ఉత్తరార్ధ గోళం నుండి వచ్చిన చారిత్రక ఉద్గారాలు వాతావరణ సంక్షోభానికి దారితీశాయి. క్లైమేట్ ఫైనాన్స్‌లోని గణనీయ భాగం, దాని మూలం చాలా కాలంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య రగులుకుంటున్న అంశంగా ఉంటూ వస్తోంది.ఈ నేపథ్యంలోనే బాకూ చర్చలు... ఒప్పందంపై మంచి అంచనాలను, ఆశలను పెంచాయి. మొత్తానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2035 నాటికి ప్రతి సంవత్సరం కనీసం 300 బిలియన్ డాలర్ల క్లైమేట్ ఫైనాన్స్ చేయాలనేది ఈ సదస్సు అంతిమ నిర్దేశం అయ్యింది. పబ్లిక్, ప్రైవేట్, ద్వైపాక్షిక, బహుపాక్షిక, ప్రత్యామ్నాయ వనరులతో సహా డబ్బు అనేక రకాల వనరుల నుండి సేకరించాలని నిర్దేశించుకున్నారు. ఈ నిధులను అందించడంలో, అభివృద్ధి చెందిన దేశాలు ముందుంటాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వచ్ఛందంగా సహకారం అందించవచ్చు.బాకూ చర్చల సమయంలో నిర్దేశించబడిన ఆర్థిక లక్ష్యం, ఉండవలసిన లక్ష్యం కంటే చాలా తక్కువగా ఉంది. పైగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరిన కాలపరిమితి ప్రకారం 2025 నుండి అభివృద్ధి చెందిన దేశాలు ప్రతి సంవత్సరం 1.3 ట్రిలియన్ డాలర్ల ఫైనాన్స్‌ని సమీకరించాల్సి ఉంది. ఎటువంటి తక్షణ కట్టుబాట్లనైనా నివారించడం కోసం లక్ష్యాన్ని నీరుగార్చడం, చాలా ఎక్కువ కాల వ్యవధిని విధించడం అనేది ఇప్పుడు గ్లోబల్ నార్త్ సుపరిచితమైన వ్యూహం. అంతేకాకుండా, వాగ్దానం చేసిన నిధులు కేవలం ధనికుల నుండి మాత్రమే రావు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా దీనికి సహకరించాలి. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలను కలవరపెడుతుందని చెప్పవచ్చు. చర్చల ముగింపు సమయంలో, భారతదేశం, బొలీవియా, నైజీరియా ఈ బలహీనమైన ఒప్పందంపై తమ ఆందోళనలను వ్యక్తం చేశాయి. దీనిని అధికారికంగా ‘న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్’ అని పిలిచారు. వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక వనరులు అవసరం. ఉపశమనానికి డబ్బు అవసరం. దీనర్థం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, ఇంధన సామర్థ్యం, జీవన సహజ వనరులు, భూ వినియోగం నిర్వహణ, భూ– జల జీవవైవిధ్యం, స్వచ్ఛమైన రవాణా వంటి వాటికి మద్దతు ఇవ్వడానికి నిధులు సమకూర్చడమన్నమాట. వాతావరణ ప్రతికూల ప్రభావాలను తగ్గించడం, తట్టుకోవడం కోసం అదనపు నిధులు అవసరం అనేది రెండో ఆవశ్యకత. ఉదాహరణకు, తుఫానులను, వరదలను తట్టుకోగల మౌలిక సదుపాయాలను నిర్మించడానికి నిధులు; పెరుగుతున్న సముద్ర మట్టాలు ఉన్న ప్రాంతాల నుండి అవస్థాపన ప్రాజెక్టుల పునఃస్థాపనకు ఆర్థిక సహాయం, కరువు నిరోధక విత్తనాలను అభివృద్ధి చేయడం– సరఫరా చేయడం మొదలైన చర్యలు చేపట్టడానికి నిధుల అవసరం ఎంతైనా ఉంది. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో దేశాలకు సహాయం చేయడానికి ‘లాస్ అండ్ డామేజ్’ అని పిలువబడే మూడవ వర్గం చర్యలు చేపట్టాడానికీ అదనంగా క్లైమేట్ ఫైనాన్స్ అవసరం.ఆర్థిక లక్ష్యాన్ని కనిష్టంగా ఉంచడానికీ, వీలైనంత వరకు ఆలస్యం చేయడానికీ పాశ్చాత్య సంపన్న దేశాలు ఎత్తులు వేయడానికి ప్రయత్నించాయి. కొత్త, అదనపు నిధులు ఇవ్వడానికి కట్టుబడి ఉండే బదులు, ప్రస్తుతం ఉన్న అభివృద్ధి సహాయాన్నే క్లైమేట్ ఫైనాన్స్‌గా ముద్రవేయడానికి ప్రయత్నం జరిగింది. దీంతో ప్రైవేట్ పెట్టుబడులు, అలాగే అభివృద్ధి–బ్యాంకు రుణాలు, ప్రభుత్వ వ్యయం ద్వారా ‘సమీకరించబడిన’ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా... క్లైమేట్ ఫైనాన్స్ గొడుగు కిందకు వచ్చాయి. ఇవన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుకుంటున్న ఆర్థిక నాణ్యతను పలుచన చేశాయి. అమెరికాలో ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడం, ఆయన వాతావరణ వ్యతిరేక వైఖరులు... బలహీనమైన ఆర్థిక ఒప్పందాన్ని ముందుకు తీసుకురావడానికి అభివృద్ధి చెందిన దేశాలను ప్రభావితం చేశాయి. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన విధంగానే అమెరికా బహుపాక్షిక వాతావరణ ఫ్రేమ్‌వర్క్ నుండి వైదొలిగితే, అది యూఎన్ఎఫ్ సీసీసీని నిర్వీర్యం చేయడంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఈ దేశాలు భయపడ్డాయి. ఐరోపాలోని మితవాద ప్రభుత్వాలు కూడా విదేశీ క్లైమేట్ ఫైనాన్స్‌కు తమ కట్టుబాట్లను తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఐక్యరాజ్యసమితి ప్రక్రియ ప్రకారం, అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్‌తో సహా 24 అభివృద్ధి చెందిన దేశాలు... అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ ఆర్థిక సహాయం అందించాలి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఈ ప్రక్రియ నుండి వైదొలగితే, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ భారాన్ని మోయవలసి ఉంటుంది. అందువల్ల, అభివృద్ధి చెందుతున్న దేశాలు బలహీనమైన ఒప్పందానికి అంగీకరించేలా అభివృద్ధి చెందుతున్న దేశాలను ఒప్పించాయి.వాస్తవ ద్రవ్యం అందుబాటులో లేని స్థితిలో, బాకూ వాతావరణ ఒప్పందం వల్ల వాతావరణ మార్పులను పరిష్కరించడానికి ఎటువంటి తోడ్పాటు వచ్చే అవకాశం లేదు. కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. శిలాజ ఇంధనాలకు దూరంగా పరివర్తనం చేయడం పెద్దగా పురోగతిని సాధించలేదు. దుబాయ్‌లో జరిగిన కాప్28 సదస్సు బొగ్గు, చమురు, గ్యాస్‌లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే దేశాలు కూడా ఆ పిలుపుకు మద్దతు ఇవ్వడంతో ఇది ఒక సంచలనాత్మక పరిణామంగా ప్రశంసించబడింది. కానీ ఆ పిలుపును కార్యాచరణలోకి తేవడానికి బాకూలో తదుపరి చర్యల గురించి చర్చించలేదు. కాబట్టి, మరో కాప్ సదస్సు వరకు ఇది యథావిధి వ్యవహారం కానుంది.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కాప్-28 వేదికపై మణిపూర్ బాలిక నిరసన
దుబాయ్: వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించే లక్ష్యంతో దుబాయిలో జరుగుత్నున కాప్-28 సమావేశాల్లో మంగళవారం కలకలం చెలరేగింది. మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కాన్‌గుజమ్ అనే 12 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా చర్చా వేదికపైకి చేరి పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేసింది. ఈ క్రమంలో వేదికపై ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపింది. అయితే, లిసిప్రియా కాన్‌గుజమ్ శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తోంది. కాగా, శిలాజ ఇంధనాల విచ్చల విడి వాడకం కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామం ఫలితంగా భవిష్యత్తులో అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటు చేసుకంటాయని, సముద్రమట్టాలు పెరిగిపోయి తీరప్రాంతాల్లోని ముంబాయి వంటి నగరాలు మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లిసిప్రియ శిలాజ ఇంధనాలపై తన వ్యతిరేకతను స్పష్టం చేస్తూ నినాదాలు చేయడంతో కొంత సమయం అక్కడ గందరగోళం నెలకొంది. ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా శిలాజ ఇంధనాల వాడకాన్ని వెంటనే తగ్గించాలంటూ లిసిప్రియ నినదించారు. చర్చలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న వ్యక్తి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా లిసిప్రియ వినలేదు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని విస్పష్టంగా అందరికీ వివరించింది. చివరకు ఇద్దరు భద్రత సిబ్బంది లిసిప్రియను వేదిక నుంచి పక్కకు తీసుకెళ్లారు. అయితే, చర్చల్లో పాల్గొన్న వివిధ దేశాల సభ్యులు మాత్రం లిసిప్రియ చర్యను సమర్థిస్తూ చప్పట్లతో అభినందించారు. నిర్వాహకులు కూడా లిసిప్రియ చర్యను తప్పు పట్టకపోగా.. ఈ కాలపు యువత ఆశయాలకు లిసిప్రియ నిదర్శనమని.. ఆమె చర్యను కొనియాడటం కొసమెరుపు!. 🚨 12 year old Indian girl from Manipur, Licypriya Kangujam, stormed the stage during an event at the United Nations Climate Conference (COP28) in Dubai. She was protesting against fossil fuels. pic.twitter.com/9n9FEZbWCM — Indian Tech & Infra (@IndianTechGuide) December 12, 2023 అలాగే తన నిరసన అనంతరం లిసిప్రియా ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది . ‘నేను నిరసన తెలియజేయడంతో వారు నన్ను 30 నిమిషాల పాటు అదుపులోకి తీసుకున్నారు. శిలాజ ఇంధనాలు వాడొద్దని చెప్పడమే నేను చేసిన నేరం. మీరు నిజంగా శిలాజ ఇంధనాలను వ్యతిరేకిస్తే.. నాకు మద్దతు ఇవ్వండి. నిబంధలకు విరుద్ధంగా ఐరాస ప్రాంగణంలోనే బాలల హక్కుల ఉల్లంఘన జరిగింది. ఐరాస వద్ద నా గళాన్ని వినిపించే హక్కు ఉంది’ అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ను ట్విట్టర్లో ట్యాగ్ చేసింది. Here is the full video of my protest today disrupting the UN High Level Plenary Session of #COP28UAE. They detained me for over 30 minutes after this protest. My only crime- Asking to Phase Out Fossil Fuels, the top cause of climate crisis today. Now they kicked me out of COP28. pic.twitter.com/ToPIJ3K9zM — Licypriya Kangujam (@LicypriyaK) December 11, 2023 -
COP28: మానవాళి స్వార్థంతో ప్రపంచానికి పెను చీకట్లే
దుబాయ్: గత శతాబ్ద కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ప్రపంచానికి ఎక్కువ సమయం లేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేవలం మన ప్రయోజనాలు మాత్రమే కాపాడుకోవాలన్న మానవాళి వైఖరి అంతిమంగా భూగోళాన్ని చీకట్లోకి నెట్టేస్తుందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, తద్వారా ప్రకృతి విపత్తులతో భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, వాటి దుష్ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రపంచానికి సవాలు విసురుతున్న కర్బన ఉద్గారాలను ప్రజల భాగస్వామ్యం ద్వారా తగ్గించుకోవడానికి ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి వాతవరణ సదస్సు ‘కాప్–33’ని 2028లో భారత్‌లో నిర్వహిస్తామని ప్రతిపాదించారు. శుక్రవారం యూఏఈలోని దుబాయ్‌లో జరిగిన కాప్–28లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాలుష్యం, విపత్తుల నుంచి భూగోళాన్ని కాపాడుకొనే చర్యలను వెంటనే ప్రారంభించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ను ప్రస్తావించారు. వ్యాపారాత్మక ధోరణికి భిన్నంగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగే ఇందులో పాలుపంచుకోవాలని కోరారు. మూల్యం చెల్లిస్తున్న మానవాళి అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకాన్ని భారత్ చక్కగా పాటిస్తోందని, ఈ విషయంలో ప్రపంచానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భూగోళ ఉపరితల ఉష్ణోగ్రత(గ్లోబల్ వార్మింగ్) పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరమితం చేయాలన్న లక్ష్య సాధనకు నిబద్ధతతో కృషి చేస్తున్న అతికొన్ని దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. గత శతాబ్ద కాలంలో మానవళిలో ఒక చిన్న సమూహం ప్రకృతికి ఎనలేని నష్టం కలిగించిందని మోదీ ఆక్షేపించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయండి వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలకు నరేంద్ర మోదీ సూచించారు.అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్లోబల్ కార్బన్ బడ్జెట్లో తగిన వాటా ఇవ్వాలన్నారు. ‘కాప్–33’ని 2028లో భారత్‌లో నిర్వహించడానికి ప్రపంచ దేశాలు అంగీకరిస్తే తమ దేశంలో ఇటీవల జరిగిన జీ20 సదస్సు తర్వాత ఇదే అతిపెద్ద సదస్సు అవుతుందని పేర్కొన్నారు. ఏమిటీ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్? భారత ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్‌లో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కూడా దాదాపు ఇలాంటిదే. ఇదొక వినూత్నమైన మార్కెట్ ఆధారిత కార్యక్రమం. వేర్వేరు రంగాల్లో పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛందంగా కృషి చేసిన వ్యక్తులకు, వ్యవస్థలకు, కమ్యూనిటీలకు, ప్రైవేట్ రంగానికి ప్రత్యేక గుర్తింపునిస్తారు. ప్రోత్సాహకాలు అందజేస్తారు. అమెరికా, చైనా అధినేతల గైర్హాజరు దుబాయ్‌లో జరుగుతున్న కాప్–28కు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ప్రతిఏటా కర్బన ఉద్గారాల్లో ఏకంగా 44 శాతం వాటా అమెరికా, చైనాలదే కావడం గమనార్హం. ఈ రెండు బడా దేశాల నిర్లక్ష్యం వల్ల ఇతర దేశాలకు నష్టపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, చైనా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
బొగ్గు వినియోగం నిలిపివేతపై ఇంకా అస్పష్టత
గ్లాస్గో: భూతాపం(గ్లోబల్ వార్మింగ్)పై పోరాటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ సదస్సు తుది నిర్ణయానికి రాలేదు. గ్లాస్గోలో కాప్–26 వాతావరణ సదస్సు ముగిసిపోయినప్పటికీ తాజా ప్రతిపాదనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బొగ్గు వాడకానికి, శిలాజ ఇంధనాల వినియోగానికి స్వస్తి పలకాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునివ్వాలన్న సూచనలను పరిశీలిస్తున్నట్టు శనివారం విడుదల చేసిన ముసాయిదా ప్రకటన స్పష్టం చేసింది. కాప్–26 నిర్ణయాలను 197 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే అవి అమల్లోకి వస్తాయి. అందుకే సదస్సు ముగిసిన తర్వాత కూడా అతి పెద్ద దేశాలు చర్చల ప్రక్రియని ముందుకు తీసుకువెళతాయి. కాప్–26 శిఖరాగ్ర సదస్సుకి నేతృత్వం వహించిన బ్రిటన్ మంత్రి, భారత సంతతికి చెందిన అలోక్ శర్మ ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పులపై అత్యుత్తమ పరిష్కారాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలేవీ భూతాపం పెరుగుదలను నిరోధించలేవని, మరిన్ని గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాప్–26లో పాల్గొన్న పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు. -
వినీషా పవర్ ఫుల్ స్పీచ్ : మీ తీరు చూస్తోంటే.. కోపం వస్తోంది!
గ్లాస్గో: వాతావరణ మార్పులపై గ్లాస్గోలోని కాప్–26 సదస్సులో భారత్‌కు చెందిన 14 ఏళ్ల వయసున్న టీనేజ్ బాలిక వినీశా ఉమాశంకర్ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాధినేతల్ని ఫిదా చేసింది. ఎకో ఆస్కార్ అవార్డులుగా భావించే ఎర్త్ షాట్ ప్రైజ్ ఫైనలిస్ట్ అయిన వినీశ కాప్ ఇతర పర్యావరణ పరిరక్షకులతో కలిసి ప్రిన్స్ విలియమ్ విజ్ఞప్తి మేరకు సదస్సులో మాట్లాడింది. ‘‘మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. ఇక మీరు మాటలు ఆపాలి. చేతలు మొదలు పెట్టాలి. భూమి ఉష్ణోగ్రతల్ని తగ్గించడానికి ఇక కొత్త ఆలోచనలు చేయాలి. మీరు ఏమీ చేయకపోతే ఎర్త్‌షాట్ ప్రైజ్ విజేతలు, ఫైనలిస్టులు చర్యలు తీసుకుంటారు. మా దగ్గర ఎన్నో వినూత్న ప్రాజెక్టులు , పరిష్కార మార్గాలు ఉన్నాయి’ అని చెప్పింది. ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని జాన్సన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ల సమక్షంలో తమిళనాడుకి చెందిన వినీశ ధైర్యంగా మాట్లాడింది. ’‘మీరు ఇచ్చిన శుష్క వాగ్దానాలతో మా తరం విసిగిపోయింది. మీ అందరిపైనా ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. అయినా అవన్నీ ప్రదర్శించడానికి మాకు టైమ్ లేదు. మేము పని చెయ్యాలి. నేను కేవలం భారత్‌కు చెందిన అమ్మాయిని మాత్రమే కాదు. ఈ పుడమి పుత్రికని. అలా చెప్పుకోవడానికే గర్విస్తాను. భూమిని కాపాడుకోవడానికి పాత పద్ధతుల్ని ఇక విడిచిపెట్టండి. సృజనాత్మక ఆలోచనలు చేసే మాకు మద్దతుగా నిలవండి. మీ సమయాన్ని, డబ్బుల్ని మాపై వెచ్చించండి. మా భవిష్యత్‌ని మేమే నిర్మంచుకోవడానికి మద్దతునివ్వండి’’’ అని వినీశ చేసిన ప్రసంగానికి సభ కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. So incredibly proud of @Vinisha27738476, from Tiruvannamalai, Tamil Nadu. A girl “not just from India, but from Earth”, talking to the world @COP26. She gives us hope!pic.twitter.com/QC05oThLW9 — Oliver Ballhatchet MBE (@oballhatchet) November 3, 2021 -
ఫలితం లేకుండానే ముగిసిన ‘కాప్’
మాడ్రిడ్: దాదాపు 200 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులతో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు సీఓపీ25 ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసింది. ఈనెల 2నుంచి 13 వరకూ జరగాల్సిన సమావేశాల్లో ఫలితం తేలకపోవడంతో ఆదివారం వరకూ పొడిగించారు. అయినప్పటికీ కర్బన ఉద్గారాల తగ్గింపుపై 2015 పారిస్ ఒప్పందం చేసిన సూచనలను అమలు చేసే దిశగా అడుగులు పడలేదు. వచ్చే ఏడాది స్కాట్లాండ్ (గ్లాస్గో)లో జరగనున్న సీఓపీ26 సదస్సులో వాటిని చర్చించాలని నిర్ణయించారు. ఈ సదస్సులో పలు అంశాలు చర్చకు వచ్చినప్పటికీ ఎటువంటి అంగీకారం కుదరలేదు. -
ప్రపంచాన్ని కదిలిస్తున్న బాల పర్యావరణవేత్తలు
మాడ్రిడ్: వారిద్దరూ స్కూలుకెళ్లి చక్కగా చదువుకుంటూ, ఆడుకుంటూ కాలం గడపాల్సిన వాళ్లు. కానీ పర్యావరణ పరిరక్షణపై వారికున్న ఆసక్తి ప్రపంచ దేశాల నేతల ముందు వక్తలుగా మార్చింది. మణిపూర్‌కు చెందిన ఎనిమిదేళ్ల లిసిప్రియా కంగుజమ్ వాతావరణంలో వస్తున్న మార్పులపై చర్యలు తీసుకోండి అంటూ ప్రపంచ అధినేతలను కోరుతోంది. స్పెయిన్ వేదికగా ఈనెల 13 వరకు జరుగుతున్న సీఓపీ25 వాతావరణ సదస్సులో భాగంగా ఆమె ప్రసంగించారు. ఆడుకోవాల్సిన వయసులో తమ భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె తండ్రి కేకే.సింగ్ మాట్లాడుతూ..తమ కూతురు ఇప్పటికే 21 దేశాల్లో వాతావరణ మార్పుల గురించి ప్రసంగాలు చేసిందన్నారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో ‘హౌ డేర్ యూ ?’ అంటూ ప్రపంచ నేతలనుద్దేశించి ప్రశ్నించిన స్వీడన్ టీనేజర్ గ్రెటా థన్‌బర్గ్ (16) టైమ్స్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా నిలిచింది. మానవాళికి ఉన్న ఒకే గృహాన్ని నాశనం చేయవద్దంటూ ఆమె చేసిన పోరాటం మన్ననలు అందుకుందని టైమ్స్ మేగజీన్ బుధవారం తెలిపింది. వ్యక్తిగతంగా ఈ రికార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలు గ్రెటానే అంటూ టైమ్స్ ఆమెను కొనియాడింది. లిసిప్రియా, గ్రెటాలు ఇద్దరూ పర్యావరణం గురించి నిరసనల్లో పాల్గొనేందుకు స్కూలుకు సైతం సరిగా వెళ్లేవారు కాదు. టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా గ్రెటా థన్‌బర్గ్ -
‘పారిస్ కల’ నెరవేర్చే దిశగా...
పారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో మూడేళ్లక్రితం 200 దేశాల మధ్య కుదిరిన ఒడంబడికలోని అంశాల అమలుకు సంబంధించిన ఆచరణాత్మక ప్రణాళికల్ని రూపొందించేందుకు పోలాండ్లోని కటోవీస్‌లో పక్షం రోజులు జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)–24 సదస్సు మొదలైంది. బొగ్గు, మరికొన్ని శిలాజ ఇంధనాల వినియోగాన్ని నియంత్రించుకోనట్టయితే కర్బన ఉద్గారాల కారణంగా పర్యావరణ వ్యవస్థ ధ్వంసమయ్యే ప్రమాదమున్నదని చాన్నాళ్లుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించుకున్న లక్ష్యాలను మించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని రెండు నెలలక్రితం ఐక్యరాజ్యసమితి వాతావరణ అధ్యయన బృందం తేల్చిచెప్పింది. ఆ బృందం కీలకమైన అంశాన్ని అందరి దృష్టికీ తెచ్చింది. పారిస్ ఒడంబడిక ‘భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ స్థాయికి పరిమితం చేయాల’ని పిలుపునిచ్చింది. అయితే సమితి బృందం దీన్ని స్పష్టంగా 1.5 డిగ్రీల సెల్సియస్ వద్ద నిలిపితేనే ముంచుకొస్తున్న ముప్పును నివారించగలమని అంటున్నది. లేనట్టయితే వాతావరణ మార్పులు ఊహించని స్థాయిలో ఉత్పాతాన్ని తీసుకొస్తాయని హెచ్చరించింది. పారిస్ ఒడంబడిక అమలుకు రూపొందించుకోవాల్సిన నియమ నిబంధనలపై గత రెండే ళ్లుగా చర్చలు సాగుతున్నాయి. నిర్దేశిత లక్ష్యాలను అందుకోలేని దేశాలపైనా, దాన్ని ఉల్లంఘిస్తున్న దేశాలపైనా తీసుకునే చర్యలు, దీన్నంతటినీ పర్యవేక్షించాల్సిన యంత్రాంగం స్వరూపస్వభావాలు నియమనిబంధనల్లో పొందుపర్చాల్సి ఉంది. అలాగే సభ్యదేశాలకు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన మార్గదర్శకాలు తయారు చేయాల్సి ఉంది. వాటితోపాటు ఉద్గారాలను కొలిచే ప్రమాణాలను, పర్యవేక్షక యంత్రాంగానికి అవసరమైన వనరుల కల్పనను కూడా చర్చించారు. కటోవీస్ సదస్సు నాటికల్లా ఈ చర్చలు పూర్తయి అప్పటికల్లా ఇవన్నీ ఖరారు కావాలన్నది కాప్–24 నిర్వాహకుల లక్ష్యం. వచ్చే వారమంతా కూడా కొనసాగే ఈ సదస్సు నిర్వాహకులు రూపొందించిన నియమ నిబంధనలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదం తెలపవలసి ఉంది. అలాగే ఉద్గారాల తగ్గింపు నకు ముందుకొచ్చే వెనకబడిన దేశాలకు అవసరమైన ఆర్థిక వనరుల్ని, సాంకేతికతను సమకూర్చేం దుకు సంపన్న దేశాలు ఏమేరకు హామీ ఇవ్వగలవో ఈ సదస్సులో నిర్ణయం కావాల్సి ఉంది. 2016 లో మొరాకోలోని మర్రకేష్‌లో కాప్–22 సదస్సు జరిగినప్పుడు 2018 కల్లా నియమ నిబంధనలు ఖరారు కావాలని నిర్ణయించారు. అయితే కటోవీస్ సదస్సు ముంగిట్లోకొచ్చినా చర్చల పరంపర పూర్తికాలేదు. అంతర్జాతీయ ఒడంబడికల్ని అమలు చేసి తీరాలని వెనకబడిన దేశాలను ఒప్పించడం చాలా సులభం. కానీ సంపన్న దేశాలపై ఇలా ఒత్తిడి తీసుకురావడం ఓ పట్టాన సాధ్యం కాదు. అలాగే వెనకబడిన దేశాలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని, సాంకేతికతను అందించమని వాటికి నచ్చజెప్పి ఒప్పించడం కూడా కష్టం. ఈ రెండేళ్లలోనూ నిర్వాహకులకు అది బాగా అర్ధమైంది. ఉద్గారాల తగ్గింపుపై పారిస్ శిఖరాగ్ర సదస్సులో తాము వాగ్దానం చేసిన లక్ష్యాలను గడువుకు ముందే నెరవేరుస్తామని, ఆ లక్ష్యాలను దాటి కూడా ముందుకెళ్తామని కాప్–24లో మన దేశం తర ఫున పాల్గొన్న కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఇది సంతోషించదగ్గదే. పారిస్ సదస్సులో మన దేశం 2030కల్లా ఉద్గారాల తీవ్రతను 2005నాటి స్థాయితో పోలిస్తే 33–35 శాతం మేర తగ్గించుకుంటామని హామీ ఇచ్చింది. ఆమేరకు పునర్వినియోగ ఇంధన వనరుల్ని పెంచుకో వాల్సి ఉంది. ఈ విషయంలో హామీ ఇచ్చినదాని కంటే ఎక్కువగా... గడువుకంటే ముందుగా భారత్ చేసి చూపగలిగితే అది అటు సంపన్న దేశాలకూ, ఇటు వర్ధమాన దేశాలకూ ఆదర్శనీయ మవుతుంది. ప్రపంచంలో కర్బన ఉద్గారాలను భారీగా విడుదల చేసే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ శతాబ్దాంతానికి భూతాపం మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ పెరగొచ్చునని శాస్త్రవేత్తలు వేస్తున్న అంచనాలు అందరిలో గుబులు పుట్టిస్తున్నాయి. భూతాపం పెరుగుతున్నకొద్దీ రుతువులు గతి తప్పి కరవుకాటకాల బారినపడతాయి. అదే జరిగితే 2030నాటికి మరో 12.2 కోట్లమంది పేదరికంలోకి జారిపోతారని ఆమధ్య ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. అంతేకాదు... జనం అంతుచిక్కని ప్రాణాంతక అంటు రోగాలబారిన పడతారని తెలిపింది. అనేక తీర ప్రాంత దేశాలు ముంపు బారిన పడతాయని వివరించింది. ఇప్పుడు ఉగ్రవాదం కారణంగా సిరియా, నైజీ రియా, లిబియా వంటి దేశాలనుంచి శరణార్థులు యూరప్ దేశాలకు వలసపోతున్నట్టే మున్ముందు భూతాపం హెచ్చడం వల్ల కలిగే అనర్థాలను తట్టుకోలేక మాల్దీవులు, ఫిలిప్పీన్స్ తదితర దేశాల జనం వలసబాట పట్టే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిణామాలు యుద్ధాలకు దారితీస్తాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి ఇవేమీ పట్టడం లేదు. అసలు పర్యావరణ ఉత్పాతం భావనే శాస్త్రవేత్తల విశ్వామిత్ర సృష్టిగా ఆయన కొట్టిపారేస్తున్నారు. ఈ సదస్సుకు కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్ మినహా అమెరికా నుంచి చెప్పుకోదగ్గ ముఖ్య నాయకులెవరూ రాలేదు. అటు ముప్పును అంగీకరించే ఇతర సంపన్న దేశాలైనా ఉదారంగా వ్యవహరించడం లేదు. ఒకపక్క పర్యావరణ పరిరక్షణకు సహకరించడంలేదని అమెరికాను దుయ్యబడుతూనే ఆ దేశాలు కూడా ఆచరణలో అందుకు భిన్నంగా ఏమీ ఉండటం లేదు. వర్ధమాన దేశాలకు అందించాల్సిన ఆర్థిక సాయం విషయంలోనూ, అవసరమైన సాంకేతికతను సమకూర్చడంలోనూ ఊగిసలాట ప్రదర్శిస్తున్నాయి. ఈ దశలో కటోవీస్ సదస్సు విజయవంతమవుతుందా అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. భూమండలం ముప్పు ముంగిట్లో ఉన్న ఈ తరుణంలోనైనా సంపన్న దేశాలు, పేద దేశాలు సమష్టిగా, సమన్వయంతో కదలవలసిన అవసరం ఉంది. పారిస్ ఒడంబడిక లక్ష్యాలు నెర వేరడానికి అనువైన సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను కటోవీస్ సదస్సు రూపొందిస్తుందని ఆశిద్దాం. -
కలసి కృషి చేద్దాం: ఒబామా
వాతావరణ ఒప్పందంపై మోదీకి ఫోన్ వాషింగ్టన్/పారిస్: అంతర్జాతీయ వాతావరణ ఒప్పందంపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మోదీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫోన్ చేసి మాట్లాడారు. సమర్థవంతమైన ఒప్పందం దిశగా కృషి చేద్దామని వారు నిర్ణయించారు. పారిస్ ఐరాస్ వాతావరణ సదస్సులో భాగంగా మంగళవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి కెర్రీ భేటీ అయ్యారు. ఇది జరిగిన మరుసటి రోజే మోదీకి ఒబామా ఫోన్ చేశారు. ఈ వివరాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా వంద బిలియన్ డాలర్ల ఫండ్ ఏర్పాటు ప్రక్రియ పురోగతి సాధించిందంటూ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చిన నివేదికను బ్రెజిల్, ఇండియా, దక్షిణాఫ్రికా, చైనా తప్పుబట్టాయి. -
ఏకతాటిపైకి దేశాలు
-
ఏకతాటిపైకి దేశాలు
నేటి నుంచే పారిస్ సదస్సు పర్యావరణ పరిరక్షణకు సిద్ధం * వాతావరణ మార్పుపై అంతర్జాతీయ ఒప్పందం లక్ష్యం * భారత్ తరఫున పాల్గొంటున్న ప్రధాని మోదీ * సౌర శక్తి దేశాల కూటమికి అంకురార్పణ పారిస్: ప్రపంచానికి పెను సవాలుగా పరిణమించిన భూ తాపోన్నతిపై పోరుకు రంగం సిద్ధమైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 150కి పైగా దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు సమావేశమై వాతావరణ మార్పుపై పోరాటానికి కార్యాచరణను నిర్ణయించనున్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపు, తద్వారా పర్యావరణ పరిరక్షణకుద్దేశించిన చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందం లక్ష్యంగా నేటి(నవంబర్ 30) నుంచి డిసెంబర్ 11 వరకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ సదస్సు(సీఓపీ21) జరగనుంది. భూ తాపోన్నతిని 2 డిగ్రీల సెల్సియస్ లోపునకు పరిమితి చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా, రష్యా, చైనాల అధ్యక్షులు బరాక్ ఒబామా, వ్లాదిమిర్ పుతిన్, జీ జిన్‌పింగ్ పాల్గొంటున్నారు. పారిస్‌పై ఇటీవల జరిగిన భారీ స్థాయి ఉగ్రదాడి నేపథ్యంలో నగరమంతటా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు. వాతావరణ మార్పుపై 2009లో కోపెన్హెగన్లో జరిగిన సదస్సులో 115 సభ్య దేశాలు పాల్గొన్నాయి. సదస్సు సందర్భంగా ఇటీవలి పారిస్ ఉగ్రదాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలో వేలాదిమంది మానవహారం ప్రదర్శించారు. వాతావరణ ఉత్పాతం నుంచి భూగోళాన్ని రక్షించేందుకు ప్రపంచదేశాల నేతలు కృషి చేయాలంటూ నినదించారు. పారిస్‌లోని లె బౌర్జెట్‌లో జరగనున్న ఈ సదస్సులో 50 వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోలు, ఐరాస సంస్థలు, పౌర సమాజం, మీడియా.. తదితరాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇండియా పెవిలియన్.. ‘పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించనున్నాం’ అని ఆదివారం పారిస్ బయల్దేరి వెళ్లేముందు మోదీ ట్వీట్ చేశారు. ప్రతీ నెల తాను రేడియోలో ఇచ్చే ప్రసంగం ‘మన్ కీ బాత్’లోనూ.. ‘వాతావరణ మార్పుపై ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది.. ఆందోళన వ్యక్తమవుతోంది. భూగోళ ఉష్ణోగ్రత ఇంకా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని పేర్కొన్నారు. సదస్సు ప్రాంగణంలో సోమవారం ఇండియా పెవిలియన్‌ను మోదీ ప్రారంభిస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌తో కలిసి అంతర్జాతీయ సౌరశక్తి దేశాల కూటమిని మోదీ ప్రారంభిస్తారు. ఈ కూటమి ఆలోచన ఆయనదే. సదస్సు మొదటి రోజు మోదీ, ఒబామాల భేటీ జరగనుంది. ఒప్పందంపై ఏకాభిప్రాయం సాధించే దిశగా కీలక పక్షాలతో సంప్రదింపులు జరిపే కార్యక్రమంలో భాగంగా సదస్సు తొలి రోజు ఒబామా,, మోదీతో భేటీ అవుతున్నారు. కోపెన్హెగన్లో జరిగిన గత కాప్ సదస్సులో కీలక దేశాల అధినేతలు చివరలో పాల్గొనడంతో ఎలాంటి నిర్దిష్టమైన ఫలితం వెలువడలేదు. ఒప్పందం సమధర్మంగా ఉండాలి: భారత్ పారిస్: భూ తాపోన్నతిని పరిమితం చేసేందుకు ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందం న్యాయబద్ధంగా, సమధర్మంతో, సంతులితంగా ఉండాలని భారత్ స్పష్టం చేసింది. సమధర్మ నియమాలు ఒప్పందంలో నిబిడీకృతమై ఉండాలని పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పారిస్‌లో పేర్కొన్నారు. పరస్పర విశ్వాసంతో కూడిన ఆచరణాత్మక ఒప్పందం కుదరాల్సిన అవసరం ఉందన్నారు. అందుబాటులో ఉన్న కార్బన్ స్పేస్‌లో మూడింట రెండొంతులు అభివృద్ధి చెందిన దేశాలు ఉపయోగిస్తున్నాయన్నారు. కామన్వెల్త్ లోనూ.. వాలెట్టా: పారిస్ సదస్సులో చట్టబద్ధ, ఆచరణాత్మక అంతర్జాతీయ ఒప్పందం కోసం కృషి చేయాలని మాల్టాలో జరుగుతున్న కామన్వెల్త్ దేశాల 24వ సదస్సులో సభ్య దేశాలు నిర్ణయించాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు కృషి చేస్తున్న పేద దేశాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాయి. వాతావరణ మార్పుపై లోతుగా చర్చించారు. తీవ్రవాదంపై పోరుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాలకు దాని ద్వారా నిధులందజేయాలని నిర్ణయం తీసుకున్నాయి. మాల్టా ప్రధాని మస్కట్ 100 కోట్ల డాలర్లు మూలనిధిగా ‘కామన్వెల్త్ గ్రీన్ ఫైనాన్స్ ఫెసిలిటీ’ని ప్రారంభించారు. వాతావరణ మార్పుపై పోరు కోసం పేద దేశాలకు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలు 2.5 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించాయి. భారత్, మరికొన్ని దేశాలు కలిసి కామన్వెల్త్ దేశాల్లోని బలహీన దేశాలకు స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో సహకారం అందించే లక్ష్యంతో 25 లక్షల డాలర్ల నిధిని సమకూర్చాలని నిర్ణయించాయి. కామన్వెల్త్లోని చిన్నదేశాల వాణిజ్య సహకారం కోసం 25 లక్షల డాలర్ల సాయాన్ని భారత్ ప్రకటించింది. సదస్సుకు తెలుగు వ్యక్తి! సాక్షి, హైదరాబాద్: పారిస్ సదస్సులో తెలుగు యువకుడు నాగుల శివ ప్రసాద్ పాల్గొననున్నారు. ఇండియన్ యూత్ క్లైమేట్ నెట్వర్క్ ప్రాంతీయ సమన్వయకర్తగా కొన్నేళ్లుగా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్.. అనేక పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల్లో క్రియాశీలక సభ్యుడు కూడా. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల పెరిగిపోతున్న భూ ఉష్ణోగ్రతలు, తద్వారా వస్తున్న వాతావరణ మార్పులపై మరింత అవగాహన కల్పించే లక్ష్యంతో కొన్నేళ్లుగా యువకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. -
‘ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐకమత్యం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ పథకాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ పథకం ఎలా ఉండాలి? లోగో, ప్రజల భాగస్వామ్యం పెంచటం, సమాజం బాధ్యతేంటి? వంటి విషయాలపై పౌరులందరూ సూచనలు ఇవ్వాలని కోరారు. అసహనంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను దృష్టిలో పెట్టుకునే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు అవయవదానంపై కూడా ప్రజలు ముందుకు రావాలని కోరారు. వైకల్యంతో బాధపడుతున్న వారు ఆ పరిస్థితిని అధిగమించేందుకు పడుతున్న శ్రమ స్ఫూర్తిని కలిగిస్తోందన్నారు. 1996లో కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో గాయపడి వెన్నెముకకు తీవ్రగాయంతో లేచి నడవలేని స్థితిలో ఉన్న జావెద్ అహ్మద్ అనే వ్యక్తి గురించి చెప్పారు. ఆయన జీవితమంతా వృథా అయినా.. తనలా వైకల్యంతో బాధపడుతున్న వారి భవిష్యత్తు బాగుండాలని ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. 20 ఏళ్లుగా విద్యార్థులకు పాఠాలు చెబుతూనే.. వికలాంగుల పరిస్థితి మెరుగుపడే మౌలిక వసతులకోసం పోరాటం చేస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన నూర్జహాన్ (55) అనే మహిళ పెద్దగా చదువుకోకపోయినా.. సోలార్ లాంతర్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన విషయాన్ని తెలిపారు. నెలకు ఒక లాంతరుకు రూ.100 అద్దెతో (రోజుకు 3.3 రూపాయల ఖర్చుతో) 500 ఇళ్లకు ఈ లాంతర్లను సరఫరా చేస్తున్నారన్నారు. పర్యావరణంపై పోరు ప్రపంచం ముందున్న సవాలని, అగ్రదేశాలే ఎక్కువ కాలుష్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. సౌరవిద్యుత్ వినియోగంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. వ్యవసాయ అవశేషాలను తగలబెట్టి పర్యావరణ కాలుష్యం చేసేకన్నా.. దాన్ని ఎరువుగా మార్చుకోవటంపై దృష్టి పెట్టాలన్నారు. ‘ధన్యవాద్.. ప్రభుత్వ సాయం చేస్తే!’ మన్ కీ బాత్‌లో ప్రధాని తన గురించి చెప్పడంపై నూర్జహాన్ హర్షం వ్యక్తం చేశారు. ‘మూడేళ్ల క్రితం ఓ ఎన్జీవో సహకారంతో సౌర విద్యుత్ లాంతర్లను అద్దెకివ్వటంపై దృష్టి పెట్టాను. ప్రధాని ఆర్థిక సాయం చేస్తే.. 100 ఇళ్లలో వెలుగులు పంచుతాను’ అని అన్నారు. -
'వాతావరణం'మారేనా?
మానవాళికిది జీవన్మరణ సమస్య. మానవ నాగరికతకు అస్తిత్వ సమస్య. పారిస్‌లో నేడు ప్రారంభం కానున్న వాతావరణ మార్పుల సదస్సు, పరిష్కారాన్ని చూపాల్సిన అంతర్జాతీయ వేదిక. దాదాపు ప్రపంచ దేశాలన్నీ హాజరవుతున్న ఆ సదస్సు అలాంటి భరోసాను ఇవ్వాలని ప్రపంచ ప్రజల ఆకాంక్ష. రెండు దశాబ్దాలుగా వాతావరణ మార్పులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతున్నా, శాస్త్ర వేత్తలంతా కోరుతున్నట్టు ఈ శతాబ్ది చివరికి భూమి సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల పారిశ్రామికీకరణ పూర్వ దశ కంటే 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు మించి పెరగదనే హామీ ఎండమావిగానే ఉంటోంది. ఆ పరిమితిని దాటితే తిరిగి మరల్చరాని విపత్కర వాతావరణ మార్పులు తప్పవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2015 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించే ఒప్పందాన్ని సాధించాలని ఐక్య రాజ్య సమితి వాతావరణ మార్పుల వేదిక (యూఎన్ఎఫ్సీసీ), తన 2011 దర్బన్ వార్షిక సమావేశంలో (కాప్-17) లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి పారిస్‌లో జరుగుతున్న 21వ వార్షిక సదస్సు(కాప్-21)లోనైనా ప్రపంచదేశాలన్నీ చట్టపరంగా కట్టుబడి ఉండాల్సిన ఉద్గారాల కోతలకు, భూతాపం పెరుగుదల వల్ల కలుగుతున్న వాతావరణ మార్పుల దుష్ర్పభావాలను ఉపశమింపజేసే చర్యలకు అంగీకరిస్తాయని అంతా ఆశిస్తున్నారు. అయితే రెండు దశాబ్దాలుగా వాదోపవాదాలే తప్ప కర్బన ఉద్గారాల విడుదల, అందుకు ప్రధాన కారణమైన బొగ్గు, చమురు, సహజ వాయువుల వంటి కర్బన ఇంధనాల వాడకం పెరుగుతూనే ఉన్నాయి. ప్రత్యామ్నాయ, శాశ్వత ఇంధన వనరుల అభివృద్ధి, ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి లేదు. పర్యవసానంగా భూతాపం పెరుగుతూనే ఉంది. ప్రపంచం అనూహ్యమైన వాతావరణ మార్పులను చవిచూడాల్సి వస్తోంది. పారిస్ సదస్సుకు హెచ్చరికలాగా ఐరాస వాతావరణ సంస్థ, 2015 అత్యంత అధిక ఉష్ణోగ్రతను నమోదు చేసిన సంవత్సరం కావచ్చనే చేదు వార్తను వినిపిం చింది. ఈ వేసవిలో కనీవినీ ఎరుగని విధంగా 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండలను మన దేశం భరించాల్సివచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాది వేసవితో పోలిస్తే ఈ వేసవిలో రెట్టింపుకు పైగా ఎండలకు చనిపోయారు. వచ్చే ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని భావిస్తున్నారు. గత రెండేళ్లుగా దుర్భిక్షం, అకాల, అధిక వర్షాలతో తల్లడిల్లుతున్న దేశ ప్రజలు, ప్రత్యేకించి తెలుగు రైతాంగం వాతావరణ మార్పుల దుష్ర్పభావాలకు ప్రత్యక్ష సాక్షులు. ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న 350 కోట్ల పేదలే వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా నష్ట పోతున్నవారు. అంటే భారత్ వంటి వర్ధమాన దేశాలే ప్రధానంగా వాతావరణ మార్పుల పర్యవసానాలను మోయాల్సివస్తోంది. చేయని తప్పుకు శిక్షను అనుభ వించాల్సి వస్తోంది. 150 ఏళ్లుగా విచ్చలవిడిగా చౌకగా లభించే కర్బన ఇంధనాలను వాడి భూతాపం పెరుగుదలకు కారణమైనవి అభివృద్ధిచెందిన దేశాలే. అవే నేడు సమాన బాధ్యతా సూత్రాన్ని వల్లెవేస్తూ, తమ చారిత్రక బాధ్యతను దాటవేయాలని చూడటం విచిత్రం. 1992 ఐరాస ధరిత్రీ సదస్సు 'వాతావరణపరమైన క్షీణతకు వివిధ దేశాలు భిన్న స్థాయిల్లో కారణమైన రీత్యా వాటికి ఉమ్మడి లక్ష్యాలు, వేరు వేరు స్థాయిల బాధ్యతలు ఉంటాయి'అని సూత్రీకరించింది. ఆ చారిత్రక బాధ్యత నుంచి తప్పించుకోడానికే అమెరికా 1997 క్యోటో వాతావరణ మార్పుల ఒప్పం దానికి దూరంగా ఉంది. నేటికీ అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలది అదే వైఖరి. పారిస్ సదస్సుకు 'భారత్ ఒక సవాలు కానుంది' అంటూ అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పది రోజుల క్రితం చేసిన వ్యాఖ్య దాని కొనసాగింపే. చైనా, భారత్, బ్రెజిల్, దక్షిణాఫిక్రా, దక్షిణ కొరియా తదితర దేశాలను వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా వర్గీకరించారు. అవి కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పాటూ ఉద్గారాల కోతలకు, ఉపశమన చర్యల వ్యయాలను భరించడానికి అంగీకరించాలని అమెరికా చాలా కాలంగా వాదిస్తోంది. భారత్ వంటి వర్ధమాన దేశాలు కొత్తగా పారిశ్రామికీకరణను ప్రారంభించిన దేశాలు. చౌకగా లభించే కర్బన ఇంధనాలపై ఆధారపడటం వాటికి తప్పనిసరి. లేదా అవి ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారడానికి అయ్యే వ్యయాన్ని అభివృద్ధి చెందిన దేశాలే భరించాలి. ప్రధాని నరేంద్ర మోదీ 2022 నాటికి భారత శాశ్వత ఇంధన ఆధారిత విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 175 జిగా వాట్లకు పెంచుతామన్నారు. ఈ భారీ లక్ష్యం సాధ్యా సాధ్యాలపై ఉన్న విమర్శల సంగతి పక్కనపెడితే, అందుకు తగిన ఆర్థిక, సాంకేతిక వనరులను సమకూర్చుకోవడం ఎలా? అనే సమస్యకు మోదీ ప్రభుత్వం సమా దానం పారిస్ సదస్సుకు సంబంధించి కీలకమైనది. 'పాశ్చాత్య దేశాలు ప్రపం చానికి, భూమికి కలుగజేసిన నష్టానికి మూల్యాన్ని చెల్లించాల్సిందే' అని విద్యుత్, శాశ్వత ఇంధన వనరుల సహాయ మంత్రి పియూష్ గోయల్ ఈ ఏడాది మేలో లండన్‌లో వాతావరణ మార్పుల సమావేశంలో స్పష్టం చేశారు. తలసరి ఇంధనం లేదా విద్యుత్తు వినియోగం దృష్ట్యా చూసినా, తలసరి కర్బన ఉద్గారాల విడుదల దృష్ట్యా చూసినా అభివృద్ధిచెందిన దేశాలతో పోలిస్తే భారత్ వంటి దేశాలపైన వాతావరణ మార్పుల విషయంలో ఆంక్షలు, భారం మోపలేమనే వాస్తవాన్ని సంపన్న దేశాలు గుర్తించనంతవరకు వాతావరణ మార్పుల సమస్యకు పరిష్కారం దొరకదు. వర్ధమాన దేశాలలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభి వృద్ధికి ఆర్థిక, సాంకేతిక సహాయం చేయడంతోపాటూ అవి స్వయంగా కర్బన ఇంధనాల నుంచి హరిత ఇంధనాలకు మరలాల్సి ఉంటుంది. అప్పుడే వెనుకబడిన దేశాల అభివృద్ధికి వీలుగా మరింత కార్బన్ స్పేస్ వాటికి అందుబాటులోకి వస్తుంది. వర్ధమాన దేశాల న్యాయమైన ఈ డిమాండ్లేవీ సంపన్న దేశాలకు సమంజ సంగా కనబడటం లేదు. ఈ నేపథ్యంలో పారిస్ సదస్సులో భారత్ కీలక పాత్రధారి కానుంది. అమెరికాసహా సంపన్న దేశాలు తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తూ, వాతావరణాన్ని శుభ్రం చేసే భారాన్ని ఎక్కువగా మోసేలా ఒప్పించడానికి భారత్, వర్ధమానదేశాల జీ-77తోనూ, చైనాతోనూ కలిసి కృషి చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అభివృద్ధిచెందిన దేశాలు తమ సంకుచిత, స్వార్థపూరిత వైఖరిని విడనా డందే వాతావరణ మార్పుల విపత్తుకు సమర్థవంతమైన సమాధానం దొరకదు. సంపన్న దేశాలలో అలాంటి మార్పునకు పారిస్ నాంది కాగలదని ఆశిద్దాం. -
పారిస్ బయల్దేరిన ప్రధాని మోదీ
-
పారిస్ బయల్దేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరివెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగే వాతావరణ సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ నెల 30న ప్రారంభంకానున్న ఈ సదస్సు డిసెంబర్ 11 వరకు జరుగుతుంది. సదస్సు ప్రారంభ రోజున భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు. ఉగ్రవాదుల మారణకాండ అనంతరం పారిస్ తొలిసారిగా ఆతిధ్యమిస్తున్న ఈ అత్యున్నత స్థాయి సదస్సుకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సులో ప్రపంచ దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి ప్రతినిధులు పాల్గొననున్నారు. -
పారిస్‌లో వాతావరణ సదస్సుకు భారీ భద్రత