బాకూలో కాప్29 సదస్సు
అభిప్రాయం
అజర్‌బైజాన్ రాజధాని బాకూలో ఇటీవలే ముగిసిన వాతావరణ చర్చలకు సంబంధించిన ‘కాప్’ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) 29, వివాదాస్పద ఒప్పందంతో ముగిసింది. వాతావరణపరమైన సహాయాన్ని (క్లైమేట్ ఫైనాన్స్) ఈ చర్చల్లో కేంద్ర ఇతివృత్తంగా భావించారు. ఇది వాతావరణ మార్పులను పరిష్కరించే ఉపశమనం, అనుసరణ చర్యలకు మద్దతునిచ్చే స్థానిక, జాతీయ లేదా అంతర్జాతీయ ఫైనాన్సింగ్‌ను సూచిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు... వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కోవటానికి సమర్థవంతమైన చర్యలు చేపట్టడానికి ఉపయోగపడే అదనపు నిధులను దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయి.
అదీ ధనిక దేశాలు ఎక్కువ బాధ్యత వహించాలని అంటున్నాయి. ప్రస్తుత సంక్షోభానికి ప్రధానంగా వారిదే బాధ్యత కాబట్టి. పారిశ్రామిక విప్లవ కాలం నుండి ఉత్తరార్ధ గోళం నుండి వచ్చిన చారిత్రక ఉద్గారాలు వాతావరణ సంక్షోభానికి దారితీశాయి. క్లైమేట్ ఫైనాన్స్‌లోని గణనీయ భాగం, దాని మూలం చాలా కాలంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య రగులుకుంటున్న అంశంగా ఉంటూ వస్తోంది.
ఈ నేపథ్యంలోనే బాకూ చర్చలు... ఒప్పందంపై మంచి అంచనాలను, ఆశలను పెంచాయి. మొత్తానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2035 నాటికి ప్రతి సంవత్సరం కనీసం 300 బిలియన్ డాలర్ల క్లైమేట్ ఫైనాన్స్ చేయాలనేది ఈ సదస్సు అంతిమ నిర్దేశం అయ్యింది. పబ్లిక్, ప్రైవేట్, ద్వైపాక్షిక, బహుపాక్షిక, ప్రత్యామ్నాయ వనరులతో సహా డబ్బు అనేక రకాల వనరుల నుండి సేకరించాలని నిర్దేశించుకున్నారు. ఈ నిధులను అందించడంలో, అభివృద్ధి చెందిన దేశాలు ముందుంటాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వచ్ఛందంగా సహకారం అందించవచ్చు.
బాకూ చర్చల సమయంలో నిర్దేశించబడిన ఆర్థిక లక్ష్యం, ఉండవలసిన లక్ష్యం కంటే చాలా తక్కువగా ఉంది. పైగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరిన కాలపరిమితి ప్రకారం 2025 నుండి అభివృద్ధి చెందిన దేశాలు ప్రతి సంవత్సరం 1.3 ట్రిలియన్ డాలర్ల ఫైనాన్స్‌ని సమీకరించాల్సి ఉంది. ఎటువంటి తక్షణ కట్టుబాట్లనైనా నివారించడం కోసం లక్ష్యాన్ని నీరుగార్చడం, చాలా ఎక్కువ కాల వ్యవధిని విధించడం అనేది ఇప్పుడు గ్లోబల్ నార్త్ సుపరిచితమైన వ్యూహం.
అంతేకాకుండా, వాగ్దానం చేసిన నిధులు కేవలం ధనికుల నుండి మాత్రమే రావు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా దీనికి సహకరించాలి. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలను కలవరపెడుతుందని చెప్పవచ్చు. చర్చల ముగింపు సమయంలో, భారతదేశం, బొలీవియా, నైజీరియా ఈ బలహీనమైన ఒప్పందంపై తమ ఆందోళనలను వ్యక్తం చేశాయి. దీనిని అధికారికంగా ‘న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్’ అని పిలిచారు.
వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక వనరులు అవసరం. ఉపశమనానికి డబ్బు అవసరం. దీనర్థం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, ఇంధన సామర్థ్యం, జీవన సహజ వనరులు, భూ వినియోగం నిర్వహణ, భూ– జల జీవవైవిధ్యం, స్వచ్ఛమైన రవాణా వంటి వాటికి మద్దతు ఇవ్వడానికి నిధులు సమకూర్చడమన్నమాట. వాతావరణ ప్రతికూల ప్రభావాలను తగ్గించడం, తట్టుకోవడం కోసం అదనపు నిధులు అవసరం అనేది రెండో ఆవశ్యకత.
ఉదాహరణకు, తుఫానులను, వరదలను తట్టుకోగల మౌలిక సదుపాయాలను నిర్మించడానికి నిధులు; పెరుగుతున్న సముద్ర మట్టాలు ఉన్న ప్రాంతాల నుండి అవస్థాపన ప్రాజెక్టుల పునఃస్థాపనకు ఆర్థిక సహాయం, కరువు నిరోధక విత్తనాలను అభివృద్ధి చేయడం– సరఫరా చేయడం మొదలైన చర్యలు చేపట్టడానికి నిధుల అవసరం ఎంతైనా ఉంది. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో దేశాలకు సహాయం చేయడానికి ‘లాస్ అండ్ డామేజ్’ అని పిలువబడే మూడవ వర్గం చర్యలు చేపట్టాడానికీ అదనంగా క్లైమేట్ ఫైనాన్స్ అవసరం.
ఆర్థిక లక్ష్యాన్ని కనిష్టంగా ఉంచడానికీ, వీలైనంత వరకు ఆలస్యం చేయడానికీ పాశ్చాత్య సంపన్న దేశాలు ఎత్తులు వేయడానికి ప్రయత్నించాయి. కొత్త, అదనపు నిధులు ఇవ్వడానికి కట్టుబడి ఉండే బదులు, ప్రస్తుతం ఉన్న అభివృద్ధి సహాయాన్నే క్లైమేట్ ఫైనాన్స్‌గా ముద్రవేయడానికి ప్రయత్నం జరిగింది. దీంతో ప్రైవేట్ పెట్టుబడులు, అలాగే అభివృద్ధి–బ్యాంకు రుణాలు, ప్రభుత్వ వ్యయం ద్వారా ‘సమీకరించబడిన’ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా... క్లైమేట్ ఫైనాన్స్ గొడుగు కిందకు వచ్చాయి. ఇవన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుకుంటున్న ఆర్థిక నాణ్యతను పలుచన చేశాయి.
అమెరికాలో ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడం, ఆయన వాతావరణ వ్యతిరేక వైఖరులు... బలహీనమైన ఆర్థిక ఒప్పందాన్ని ముందుకు తీసుకురావడానికి అభివృద్ధి చెందిన దేశాలను ప్రభావితం చేశాయి. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన విధంగానే అమెరికా బహుపాక్షిక వాతావరణ ఫ్రేమ్‌వర్క్ నుండి వైదొలిగితే, అది యూఎన్‌ఎఫ్ సీసీసీని నిర్వీర్యం చేయడంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఈ దేశాలు భయపడ్డాయి.
ఐరోపాలోని మితవాద ప్రభుత్వాలు కూడా విదేశీ క్లైమేట్ ఫైనాన్స్‌కు తమ కట్టుబాట్లను తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఐక్యరాజ్యసమితి ప్రక్రియ ప్రకారం, అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్‌తో సహా 24 అభివృద్ధి చెందిన దేశాలు... అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ ఆర్థిక సహాయం అందించాలి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఈ ప్రక్రియ నుండి వైదొలగితే, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ భారాన్ని మోయవలసి ఉంటుంది. అందువల్ల, అభివృద్ధి చెందుతున్న దేశాలు బలహీనమైన ఒప్పందానికి అంగీకరించేలా అభివృద్ధి చెందుతున్న దేశాలను ఒప్పించాయి.
వాస్తవ ద్రవ్యం అందుబాటులో లేని స్థితిలో, బాకూ వాతావరణ ఒప్పందం వల్ల వాతావరణ మార్పులను పరిష్కరించడానికి ఎటువంటి తోడ్పాటు వచ్చే అవకాశం లేదు. కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. శిలాజ ఇంధనాలకు దూరంగా పరివర్తనం చేయడం పెద్దగా పురోగతిని సాధించలేదు. దుబాయ్‌లో జరిగిన కాప్28 సదస్సు బొగ్గు, చమురు, గ్యాస్‌లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే దేశాలు కూడా ఆ పిలుపుకు మద్దతు ఇవ్వడంతో ఇది ఒక సంచలనాత్మక పరిణామంగా ప్రశంసించబడింది. కానీ ఆ పిలుపును కార్యాచరణలోకి తేవడానికి బాకూలో తదుపరి చర్యల గురించి చర్చించలేదు. కాబట్టి, మరో కాప్ సదస్సు వరకు ఇది యథావిధి వ్యవహారం కానుంది.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment