United Nations Conference
-
విషతుల్య రాజధాని
భారత రాజధాని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతి శీతకాలంలానే ఈ ఏడాదీ పాత కథ పునరావృత్తం అయింది. ఒకపక్క పెరిగిన చలికి తోడు ధూళి నిండిన పొగ లాంటి గాలి, కాలుష్య ఉద్గారాలు, పొరుగున ఉన్న పంజాబ్ – హర్యానా లాంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో అక్రమంగా సాగుతున్న కొయ్యకాళ్ళ దహనం... అన్నీ కలిసి అతి తీవ్ర వాయు కాలుష్యంగా పరిణమించాయి. వారంగా అదే పరిస్థితి కొనసాగుతూ ఉండడం, వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) సోమవారం గరిష్ఠంగా దాదాపు 500 మార్కును చేరడంతో సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్కూల్ పిల్లలకు భౌతికంగా తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. చివరకు బాకూలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు సైతం ఈ కాలుష్యాన్ని ఆందోళనకరంగా పరిగణించడం, నిపుణులు దీన్ని ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు తార్కాణం. ఢిల్లీలో సోమవారంæ కాలుష్య స్థాయి దీపావళి నాటి రాత్రి కన్నా దాదాపు 40 శాతం ఎక్కువంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి... భారతీయ ప్రమాణాల కన్నా 14 రెట్లు ఎక్కువ, అదే ఐరాస పర్యావరణ పరిరక్షక సంస్థ (యూఎస్‌ఈపీఏ) నిర్దేశించిన ప్రమాణాల లెక్కలో అయితే 55 రెట్లు ఎక్కువ నమోదైంది. వాయు నాణ్యత ఇంతలా క్షీణించడం పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి ప్రమాదంగా పరిణమిస్తోంది. పీఎం 10 స్థాయిని బట్టి అంచనా వేసే ధూళి కాలుష్యమూ హెచ్చింది. ఆగ్రాలో కళ్ళు పొడుచుకున్నా కనిపించని దట్టమైన పొగ. తాజ్‌మహల్ కట్టడం విషవాయు కౌగిలిలో చేరి, దూరం నుంచి చూపరులకు కనిపించడం మానేసి వారమవుతోంది. మాస్కులు లేకుండా వీధుల్లోకి రాలేని పరిస్థితి. వెరసి, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమనే దుష్కీర్తి ఢిల్లీకి దక్కింది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ తేల్చిన ఈ నిష్ఠురసత్యం ఇన్నేళ్ళ మన బాధ్యతా రాహిత్యానికీ, పాలకుల నిష్క్రియాపరత్వానికీ నిదర్శనం. ఆ మాటకొస్తే, 2018లో కానీ, గడచిన 2023లో కానీ ఏడాదిలో ఏ ఒక్కరోజూ ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి లేదని రికార్డులు చెబుతున్నాయంటే ఏమనాలి? కాలుష్యం దేశవ్యాప్తంగా ఉందనీ, నివారణ బాధ్యత రాష్ట్రానిదే కాదు కేంద్రానిది కూడా అని ఢిల్లీ ‘ఆప్’ సర్కార్ వాదన. కానీ, ఏటేటా శీతకాలంలో రాజధానిలో పెరుగుతూ పోతున్న ఈ కష్టానికి చెక్ పెట్టడంలో పాలకులు ఎందుకు విఫలమయ్యారంటే జవాబు దొరకదు. విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ సర్కార్ కాలుష్య నిరోధానికి యంత్రాల ద్వారా నీటి తుంపర్లు జల్లడం లాంటి చర్యలు చేపడుతోంది. ఇవేవీ చాలక చివరకు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లలో కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. మేఘమథనం జరిపేందుకు ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని అనుమతి కోరినా, జవాబు లేదన్నది ‘ఆప్’ ఆరోపణ. ఇలాంటి ప్రయోగాల వల్ల ప్రయోజనమెంత అనేది చర్చనీయాంశమే. అయితే, ప్రజలకు తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించే ఇలాంటి ప్రయత్నాలకు కేంద్రం మొదటే మోకాలడ్డడం సరికాదు. వాయు కాలుష్యం ‘అతి తీవ్ర’ స్థాయులకు చేరిన నేపథ్యంలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (గ్రాప్) నాలుగోదశ చర్యలను కఠినంగా అమలు చేయాలన్నది సుప్రీమ్ తాజా ఆదేశం. పాఠశాలల్ని మూసివేయడం, ఆఫీసుకు రాకుండా ఇంటి వద్ద నుంచే పనిచేయడం, పరిశ్రమల మూసివేత లాంటి చర్యలన్నీ నాలుగో దశ కిందకు వస్తాయి. ముప్పు ముంచుకొస్తున్నా మూడో దశ, నాలుగో దశ చర్యల్లో అధికారులు ఆలస్యం చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు షరతులు అమలు చేయాల్సిందేనని కోర్ట్ చెప్పాల్సి వచ్చిందంటే అధికార యంత్రాంగం అలసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. నిద్ర లేచిన ప్రభుత్వం ఇప్పుడిక ‘గాప్’ నాలుగో దశ కింద వాహనాల రాకపోకలు, భవన నిర్మాణ కార్యకలాపాలపై షరతులు విధించింది. అయితే, దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో దాదాపు 34 లక్షల చిన్న, మధ్యశ్రేణి సంస్థల్లో ఉత్పత్తి దెబ్బతిననుంది. అంటే కాలుష్య పాపం ఆరోగ్యాన్నే కాక ఆర్థికంగానూ కుంగదీస్తుందన్న మాట. ఢిల్లీలో వాహనాల వల్ల అత్యధిక కాలుష్యం సంభవిస్తుంటే, ఎన్సీఆర్లో పరిశ్రమలు ప్రధాన కాలుష్య కారకాలని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి) 2021లోనే తేల్చింది. అనేకచోట్ల ఇప్పటికీ కట్టెల వాడకం కొనసాగుతోంది. ఇక, పొలాల్లో కొయ్య కాళ్ళ దహనం తాజా దురవస్థకు 40 శాతం కారణమట. అన్నీ కలిసి పీల్చే గాలే విషమయ్యేసరికి, ఢిల్లీ వాసుల ఆయుఃప్రమాణం సగటున ఏడేళ్ళు తగ్గుతోంది. రాజధాని, ఆ పరిసరాల్లోని 3 కోట్ల పైచిలుకు మంది వ్యధ ఇది. నిజానికి, స్వచ్ఛమైన గాలి ప్రాథమిక మానవహక్కని గత నెలతో సహా గత అయిదేళ్ళలో సుప్రీమ్ అనేకసార్లు స్పష్టం చేసింది. వాయునాణ్యతకు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర, రాష్ట్రస్థాయి యంత్రాంగాలను ఆదేశించింది. అయినా జరిగింది తక్కువ. సరైన ప్రాణ వాయువు కూడా అందని ఈ పరిస్థితికి ప్రజల నుంచి పాలకుల దాకా అందరూ బాధ్యులే. కాలుష్య నివారణ, నియంత్రణలకు సృజనాత్మక ఆలోచనలు చేయలేకపోవడం ఘోరం. దాహమేసినప్పుడు బావి తవ్వకుండా ఏడాది పొడుగూతా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టడం అవసరం. ఆధునిక సాంకేతికత, ప్రజారవాణా, ప్రజల అలవాట్లలో మార్పులు సహా అనేక అంశాల్లో రాజకీయ కృత నిశ్చయంతో విధాన నిర్ణేతలు పనిచేయాలి. లేదంటే, సాక్షాత్తూ దేశ రాజధానే నివాసయోగ్యం కాక జనం తరలిపోతుండడం చూసి వికసిత భారత్, లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ లాంటివన్నీ వట్టి గాలి మాటలే అనుకోవాల్సి వస్తుంది. -
పీఓకేను ఖాళీ చేయండి: భారత్ అల్టిమేటమ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్తాన్‌కు భారత్ ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. పాక్ దురాక్రమణలో ఉన్న కశ్మీర్లో భూభాగాలను ఖాళీ చేయాలని, పాక్ గడ్డపైనున్న ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయాలని గట్టిగా చెప్పింది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 78వ సర్వప్రతినిధి సమావేశాల్లో పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో భారత్ గట్టిగా కౌంటర్ ఇచి్చంది. భారత్‌తో పాకిస్తాన్ శాంతిని కోరుకుంటోందని, రెండు దేశాల మధ్య శాంతి స్థాపన జరగాలంటే కశ్మీర్ అంశమే కీలకమని కాకర్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో భారత ఫస్ట్ సెక్రటరీ అయిన పెటల్ గెహ్లోత్ ఈ సమావేశంలో మాట్లాడారు. కాకర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. భారత్‌పై నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారంతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం పాక్‌కు ఒక అలవాటుగా మారిందని ఆమె అన్నారు. పాకిస్తాన్లో మానవ హక్కుల హననం నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చడానికే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారని మండిపడ్డారు. ‘‘జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని మేము పదే పదే చెబుతున్నాం. మా అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే హక్కు పాక్‌కు లేదు’’అని ఆమె గట్టిగా చెప్పారు. దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే పాకిస్తాన్ మూడు పనులు చేయాలని ఆమె సూచించారు. ‘‘మొదటిది సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలి, ఉగ్రవాద శిబిరాలను వెంటనే ధ్వంసం చేయాలి. రెండోది చట్టవిరుద్ధంగా, దురాక్రమణ చేసి ఆక్రమించుకున్న భారత్ భూభాగాలను (పాక్ ఆక్రమిత కశ్మీర్)ను ఖాళీ చేసి వెళ్లిపోవాలి. ఇక మూడోది. పాకిస్తాన్లో మైనారీ్టలైన హిందువుల హక్కుల ఉల్లంఘనను అరికట్టాలి. ’’అని గెహ్లోత్ తీవ్ర స్వరంతో చెప్పారు. భారత్‌ను వేలెత్తి చూపించడానికి ముందు పాక్ తన దేశంలో మైనారీ్ట, మహిళల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. -
నిరుపేద విద్యార్థులను అమెరికా పంపిన సీఎం వైఎస్ జగన్
-
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఘనత
-
ఆలోచనలు భేష్... ఆచరణ?
అవును. నాలుగేళ్ళ చర్చోపచర్చల తర్వాత ప్రపంచ జీవవైవిధ్య పరిరక్షణ ఒప్పందం (సీబీడీ)పై ఆలోచన ముందుకు కదిలింది. ఏకంగా 190కి పైగా దేశాలు ఈ ఒప్పందం చేసుకోవడం, ఘనంగా 23 భారీ లక్ష్యాలు అందులో ప్రస్తావించడం కచ్చితంగా చరిత్రాత్మకం. ఈ భారీ ఆలోచనకు కీలక మైన ఆచరణే ఇక మిగిలింది. కెనడాలోని మాంట్రియల్లో ఐక్యరాజ్య సమితి సారథ్యంలో జరిగిన జీవవైవిధ్యంపై భాగస్వామ్యపక్షాల 15వ సదస్సు (కాప్15) అక్షరాలా ఒక మైలురాయి. అయితే, ఐరాస పెద్దలే అన్నట్టు అన్నీ సత్వరం అమలుచేసి, పురోగతి సాధిస్తేనే విజయం సాధ్యం. అందుకే, ఈ చరిత్రాత్మక పరిణామంపై ఏకకాలంలో ఇటు ఆశలూ, అటు అనుమానాలూ తలెత్తుతున్నాయి. డిసెంబర్ 7 నుంచి 19 వరకు జరిగిన ‘కాప్15’లో 196 దేశాల అధికారిక ప్రతినిధులు, 10 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. మొన్న నవంబర్ 20న ఈజిప్ట్‌లో 27వ ఐరాస పర్యావరణ సదస్సు (కాప్ 27) ముగిసిందో లేదో, ఈ జీవవైవిధ్య సదస్సు జరిగింది. ప్రకృతిని కాపాడకుండా, పునరుద్ధరించకుండా భూతాపోన్నతిని 1.5 డిగ్రీలకే పరిమితం చేయడం కుదిరేపని కాదు. అలా జీవవైవిధ్య సదస్సులు కీలకం. అయితే తుపానులు, కరిగిపోతున్న హిమానీనదాలతో పర్యావరణ సంక్షోభం కళ్ళకు కట్టినట్టు, జీవవైవిధ్య నష్టం తెలియదు. అందుకే, తీవ్రంగా పరిగణించక తప్పు చేస్తుంటారు. ఈ సదస్సులకు దేశాధినేతలెవరూ హాజరు కారు. సీబీడీ నిబంధనలు, లక్ష్యాలపై పర్యవేక్షణా తక్కువే. వెరసి పర్యావరణ సదస్సులంత ప్రచారం, రాజకీయ పటాటోపం కనిపించవు. నిజానికి, మూడు దశాబ్దాల క్రితమే 1992లో రియో డిజెనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులోనే 150 మంది ప్రభుత్వ నేతలు సీబీడీపై తొలిసారి సంతకాలు చేశారు. జీవవైవిధ్య పరిరక్షణ దాని ప్రధాన ఉద్దేశం. ఆపైన ఆ ఒప్పందానికి మొత్తం 196 దేశాలు ఆమోదముద్ర వేశాయి. అమెరికా మాత్రం ఆమోదించలేదు. అలాగని సంక్షోభం లేదని కాదు. రానున్న రోజుల్లో 34 వేల వృక్ష జాతులు, 5200 జంతు జాతులు అంతరించిపోతాయని ఐరాస అంచనా. ప్రపంచంలోని పక్షిజాతుల్లో ప్రతి ఎనిమిదింటిలో ఒకటి కనుమరుగవుతుందట. అలాగే, భౌగోళిక జీవవైవిధ్యానికి ఆలవాలమైన సహజ అరణ్యాల్లో దాదాపు 45 శాతం ఇప్పుడు లేవు. ఇందులో అధికభాగం గత శతాబ్దిలో సాగిన విధ్వంసమే. తలసరి కర్బన ఉద్గారాల పెరుగుదల, ఉష్ణోగ్రతల్లో మార్పులకు ఇది కారణమని గుర్తించట్లేదు. అదే సమస్య. ఈ నేపథ్యంలో జీవవైవిధ్య నష్టాన్ని నివారించి, 2030 నాటి కల్లా ప్రకృతిని మళ్ళీ దోవలో పెట్టడమే లక్ష్యంగా తాజా ‘కాప్15’ జరిగింది. పర్యావరణ మార్పులపై 2015లో జరిగిన ప్యారిస్ ఒప్పందం ఎలాంటిదో, జీవవైవిధ్య పరిరక్షణకు ఈ ‘కాప్15’ మాంట్రియల్ ఒప్పందం అలాంటిదని విశ్లేషకుల మాట. పారిశ్రామికీక రణకు ముందు నాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూతాపోన్నతి 2 డిగ్రీల సెల్సియస్ మించరాదనీ, అసలు 1.5 డిగ్రీల లోపలే ఉండేలా ప్రయత్నించాలనీ దేశాలన్నీ అప్పట్లో ప్యారిస్ ఒప్పందంలో ఏకగ్రీవంగా అంగీకరించాయి. ఇప్పుడీ మాంట్రియల్ ఒప్పందంలో భాగంగా ‘30కి 30’ అంటూ, 2030 నాటికి 30 శాతం భూ, సముద్ర ప్రాంతాలను పరిరక్షించాలని నిర్దేశించుకున్నాయి. జీవ వైవిధ్య పరిరక్షణకు 2030కల్లా 20 వేల కోట్ల డాలర్లు సమీకరించాలని తీర్మానించాయి. పేదదేశాలకు చేరే మొత్తాన్ని 2025 కల్లా ఏటా కనీసం 2 వేల కోట్ల డాలర్లకు పెంచాలని యోచిస్తున్నాయి. విఫలమైన 2010 నాటి జీవవైవిధ్య లక్ష్యాల స్థానంలో మొత్తం 23 లక్ష్యాలను ఈ సదస్సు నిర్ణయించింది. అయితే, వివిధ దేశాలు తమ పరిస్థితులు, ప్రాధాన్యాలు, సామర్థ్యాలకు తగ్గట్టుగా వాటిని మలుచుకొనే స్వేచ్ఛనిచ్చారు. ఇది భారత్ చేసిన సూచనే. ఇక, వర్ధమాన దేశాల్లో వ్యవ సాయ, మత్స్యసబ్సిడీలు, పురుగుమందుల వినియోగంపై వేటు పడకుండా భారత్, జపాన్ తది తర దేశాలు కాచుకున్నాయి. అయితే, లోటుపాట్లూ లేకపోలేదు. ప్రపంచంలోనే పెద్ద వర్షారణ్యా లున్న కాంగో లాంటి ఆఫ్రికన్ దేశాలు చమురు, సహజవాయు అన్వేషణ ప్రమాదంలో పడ్డాయి. అవి కొన్ని అంశాల్లో అసమ్మతి స్వరం వినిపించినా ఈ కొత్త ఒప్పందాన్ని ఖరారు చేశారు. వచ్చే 2030కి సహజ జీవ్యావరణ వ్యవస్థలు 5 శాతం వృద్ధి చెందేలా చూడాలన్న లక్ష్యాన్ని చివరలో తీసేయడమూ నష్టమే. నిర్దిష్ట లక్ష్యాలు లేకుంటే ఆశయాలు మంచివైనా ఆచరణలో విఫలమవుతాం. ‘కాప్–15’ జీవవైవిధ్య ఒప్పందపు సంకల్పంతోనే సరిపోదు. ఒప్పందానికి ఊ కొట్టిన దేశాలు తీరా దాన్ని పాటించకున్నా చర్యలు తీసుకొనే అవకాశం లేదు. అందుకే, 23 లక్ష్యాల సాధనపై అను మానం, ఆందోళన. గతంలో జీవవైవిధ్య ప్రణాళికల అమలులో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫల మయ్యాయి. 2010లో జపాన్‌లోని ఐచీలోనూ ఇలాగే 20 లక్ష్యాలను 2020 నాటికల్లా అందుకోవా లని పెట్టుకున్నాం. కానీ, వాటిలో ఒక్కటీ సాధించలేదు. మరోసారి అలాంటి అప్రతిష్ఠ రాకూడదు. తక్షణం కార్యరంగంలోకి దూకాలి. పరిమితవనరుల్ని యథేచ్ఛగా వాడుతూ, కర్బన ఉద్గారా లకు కారణమవుతున్న ధనిక పాశ్చాత్య ప్రపంచానికి ముకుతాడు వేయాలి. జంతుజాలాన్నీ, పశు పోషణతో అడవుల నరికివేత సాగుతున్న అమెజాన్ వర్షారణ్యాల్నీ కాపాడుకోవాలంటే ఆ దేశాల ఆహారపుటలవాట్లు మారాలి. మూలవాసుల హక్కుల్ని గౌరవించాలన్న మాటా ఆహ్వానించదగ్గదే. దశాబ్దాల క్రితమే చేయాల్సిన పనికి ఇప్పటికైనా నడుం కట్టడం మంచిదే. ప్రపంచం కలసికట్టుగా నడవాల్సిన వేళ కెనడా, చైనాల సహ ఆతిథ్యంలో ఈ సదస్సు, ఒప్పందం శుభపరిణామాలే! -
Photos: హైదరాబాద్‌లో ఐరాస జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్
-
మైత్రీం భజతా...
‘‘ఉపకారికినుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ !’’..అన్న బద్దెనగారి పద్యాన్ని చర్చించుకుంటున్నాం. పిల్లలు, యువతీ యువకులు భవిష్యత్తులో తమ జీవితాన్ని తమకు తాముగా ఎలా సరిదిద్దుకోవచ్చో ఆయన అత్యంత సులభమైన మాటల్లో మనకు తెలియపరుస్తున్నారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులు, ప్రాతఃస్మరణీయులు, అపర శంకరావతారులు, నడిచే దేముడని కీర్తింపబడిన మహాపురుషులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు 23 అక్టోబరు, 1966 న ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచం మొత్తానికీ సంస్కృతంలో ఒక గీతం ద్వారా తన సందేశాన్ని ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ద్వారా ఇప్పించారు. దాని అర్థం విన్న అతిథులు అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు. అందులో వాడిన మొదటి మాట – ‘‘మైత్రీం భజతా అఖిలహృజ్జేత్రిమ్..’’. అంటే ప్రపంచ ప్రజలు యుద్ధాలు, స్పర్థలు, కక్షలు కార్పణ్యాలు వదిలి అందరితో స్నేహంగా ఉండాలి..అని. అపకారం చేసినవాడు, తప్పు చేసినవాడు, ... అది దృష్టిలోపెట్టుకుని నీవు ఎవరినీ దూరం చేసుకోకు. అందరికీ మంచి చేసుకుంటూ పోవడమే నీ కర్తవ్యం. అందరూ వద్ధిలోకి రావాలని కోరుకో...అన్న అర్థంలో ఉందా గీతం. సర్వేజనా సుఖినోభవంతు. అంతే తప్ప ఏదో తప్పు చేసాడని వాడిని ఎలా దూరం చేద్దాం, ఎలా పక్కన పెడదాం... అని ఆలోచిస్తూ నీ సమయం, నీ జీవితం వృథా చేసుకోకు. వాడి తప్పు వాడు తెలుసుకోవాలని త్రికరణ శుద్ధిగా కోరుకో. అన్యాపదేశంగా వాడి తప్పు వాడు తెలుసుకునేటట్లు చేయి. వాడు మారాడా అదృష్టవంతుడు. నువ్వు మాత్రం వాడు తప్పు చేసాడని వాడికి అపకారం చేసే ప్రయత్నంలో నువ్వు పాడయి పోవద్దు. పాపాలను కడగడం, తప్పులను క్షమించడమే తప్ప అవతలివాడు మనపట్ల తప్పుగా వ్యవహరించాడు కాబట్టి మనం దానికి ప్రతిగా కక్ష తీర్చుకుని వాడికి బుద్ధి చెబుదాం... వంటి ధోరణి మహోన్నతమైన వ్యక్తుల జీవితాల్లో ఎక్కడా కనిపించదు. అయోథ్యా నగరవాసులు రాముడి గురించి చెబుతూ ...‘‘కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా...’’ అంటారు. ఓ దశరథ మహారాజా! నీ కొడుకెంత గొప్పవాడో తెలుసా! కావాలని ఉపకారం చేసినవాడినే కాదు, అనుకోకుండా ఉపకారం చేసినవాడిని కూడా రాముడు గుర్తుపెట్టుకుని పదేపదే తలుచుకుంటుంటాడు. అంత చిన్నవాటిని కూడా మర్చిపోడు. సముద్రం ఇవతల నిలబడి అవతలి వైపు లక్ష్యాన్ని తన బాణాలతో ఛేదించగల సమర్ధుడే అయినా రాముడు నూరు అపకారాలు చేసిన వాడిని కూడా శిక్షించకుండా, మరో అవకాశం ఇద్దామని, వాడు మారడానికి వీలు కల్పిద్దామంటూ ఓపికపట్టగల సమర్థుడు. ఉపకారం చేసిన వాడినయితే పదేపదే తలచుకుని మురిసిపోతుంటాడు... అదయ్యా రాముడంటే... అటువంటివాడు వాడు మాకు యువరాజుగా కావాలి.’’ అన్నారు ముక్తకంఠంతో.. అందుకే రాముడు మహాత్ముడయ్యాడు. ఇదీ భారతదేశ సాంస్కృతిక వైభవం. దానికి మనం వారసులం. ఉపకారికి ఉపకారం చేయడం సర్వసాధారణంగా లోకరీతిగా భావిస్తూ, అపకారం చేసిన వాడు కూడా తన తప్పు తెలుసుకుని మారడానికి వీలు కల్పించేవిధంగా పగబట్టకుండా, అతనికి మళ్ళీ అపకారం తలబెట్టకుండా అతనికి అవసరమయినప్పుడు ఉపకారం చేయాలని మన పెద్దలు మనకు చెబుతుంటారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కరువును ఎలా నివారించాలి, ఐరాసలో మోదీ ప్రసంగం
ఐక్యరాజ్యసమితి: ఎడారీకరణ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఈ నెల 14న నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. వర్చువల్ విధానంలో మోదీ హాజరై ప్రసంగిస్తారని ఐరాస వెల్లడించింది. ఎడారీకరణపై ఐరాస నిర్వహిస్తున్న పార్టీల సమాఖ్య (యూఎన్‌సీసీడీ సీఓపీ) 14వ సెషన్‌కు ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. ఎడారీకరణ, భూ క్రమక్షయం అనే అంశాలపై ఆయన ప్రత్యేక సందేశం ఇస్తారని చెప్పింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ యూఎన్ సెక్రటరీ జనరల్ అమినా మొహ్మద్, ఎడారీకరణపై ఐరాస ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఇబ్రహీం తైవా, ఏఎఫ్‌పీఏటీ కోఆర్డినేటర్ హిందౌ ఔమరౌ ఇబ్రహీంలు కూడా మాట్లాడతారని తెలిపింది. వ్యవసాయ పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో ప్రసంగించనున్నట్లు ఐరాస తెలిపింది. మన సమాజాలకు భూమే పునాది అని ఐరాస మార్గదర్శక నివేదిక పేర్కొంది. పర్యావరణ ఆరోగ్యం, ఆకలి లేని సమాజం,, పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యాలని.. వాటిని 2030 సుస్థిరాభివృద్ధి అజెండాగా భావిస్తున్నట్లు తెలిపింది. ఎడారీకరణపై ఐరాస పార్టీల కాన్ఫరెన్స్ 14వ సెషన్‌ను ప్రధాని మోదీ 2019 సెప్టెంబర్‌లో ఢిల్లీలో ప్రారంభించారు. చదవండి : Cabinet Reshuffle: కేంద్ర మంత్రివర్గ విస్తరణ! -
ఫలితం లేకుండానే ముగిసిన ‘కాప్’
మాడ్రిడ్: దాదాపు 200 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులతో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు సీఓపీ25 ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసింది. ఈనెల 2నుంచి 13 వరకూ జరగాల్సిన సమావేశాల్లో ఫలితం తేలకపోవడంతో ఆదివారం వరకూ పొడిగించారు. అయినప్పటికీ కర్బన ఉద్గారాల తగ్గింపుపై 2015 పారిస్ ఒప్పందం చేసిన సూచనలను అమలు చేసే దిశగా అడుగులు పడలేదు. వచ్చే ఏడాది స్కాట్లాండ్ (గ్లాస్గో)లో జరగనున్న సీఓపీ26 సదస్సులో వాటిని చర్చించాలని నిర్ణయించారు. ఈ సదస్సులో పలు అంశాలు చర్చకు వచ్చినప్పటికీ ఎటువంటి అంగీకారం కుదరలేదు. -
ఆదాయం, ఆయుష్షు భేష్
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారత్... మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)లోనూ ముందడుగు వేస్తోంది. వివిధ అంశాల్లో గతంతో పోలిస్తే తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. గత రెండున్నర దశాబ్దాల్లో హెచ్డీఐలో గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి (ఐరాస) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 1990లో భారత్ హెచ్‌డీఐ విలువ 0.427 ఉండగా 2017 నాటికది 0.640కు పెరిగింది. అలాగే అదే కాలానికి భారతీయుల ఆయుర్దాయం 11 ఏళ్లు మెరుగుపడింది. తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అయితే లింగ సమానత్వం మాత్రం ఆందోళనకరంగా ఉందని నివేదిక తెలిపింది. ఆరోగ్యం, విద్యల్లో పురోగతి... స్థూల జాతీయ తలసరి ఆదాయం ఆధారంగా జీవన ప్రమాణాన్ని, ఆయుర్దాయం ఆధారంగా ఆరోగ్యాన్ని, పాఠశాల విద్య ఆధారంగా విద్య స్థాయిని అంచనా వేసి ఐక్యరాజ్యసమితి హెచ్‌డీఐ నివేదిక రూపొందిస్తుంది. ఈ మూడు అంశాల్లో ఆయా దేశాలు సాధించిన ప్రగతి ఆధారంగా వాటికి 0 నుంచి 1 వరకు పాయింట్లు ఇస్తుంది. ఆ పాయింట్లను బట్టి ఆ దేశం ఎన్నో స్థానంలో ఉందో నిర్ణయిస్తుంది. 1990 నుంచి చూసుకుంటే ఈ మూడు అంశాల్లోనూ భారత్ మంచి పురోగతినే సాధించిందని ఐరాస పేర్కొంది. దాదాపు 50 శాతం వృద్ధి నమోదు చేసిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆయుర్దాయం పెరగడం, ఎక్కువ మంది చదువుకోవడం, తలసరి ఆదాయం పెరగడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా హెచ్‌డీఐ విలువ 22 శాతం పెరిగింది. అలాగే తలసరి ఆదాయం ఈ 27 ఏళ్లలో ఏకంగా 266 శాతం పెరిగింది. హెచ్‌డీఐ విలువ తక్కువ ఉన్న దేశాల్లో పిల్లలు 60 ఏళ్లు జీవిస్తారని అంచనా వేయగా అధిక హెచ్‌డీఐ ఉన్న దేశాల్లో పిల్లలు 80 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఆదాయంలో 267 శాతం పెరుగుదల... తలసరి ఆదాయంలో సైతం భారత్ దక్షిణాసియాలోని పొరుగు దేశాలతో పోల్చుకుంటే చెప్పుకోతగ్గ స్థాయిలో అభివృద్ధి చెందింది. 1990లో మన తలసరి ఆదాయం రూ. 1,24,957కాగా 2017 నాటికి 267 శాతం పెరిగి రూ. 4,58,083కు చేరుకుంది. లింగ సమానత్వంలో పరిస్థితి ఆందోళనకరం... అన్ని విషయాల్లో ముందంజలో ఉన్నా లింగ సమానత్వం విషయంలో మాత్రం భారత్ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని యూఎన్డీపీ ఇండియా కంట్రీ డైరెక్టర్ ఫ్రాన్సిన్ పికప్ అన్నారు. విద్య, ఆరోగ్యం, ఆదాయం విషయాల్లో భారత్‌లో లైంగిక అసమానత కొనసాగుతోందని, ఇది దేశాభివృద్ధిపై దుష్ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సగటు కంటే భారత్ సగటు 26.8 శాతం తక్కువ ఉందని నివేదిక స్పష్టం చేసింది. లింగ సమానత్వ సూచీలో భారత్ 160 దేశాల్లో 127వ స్థానంలో ఉంది. విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో భారతీయ మహిళల భాగస్వామ్యం పురుషులతో పోలిస్తే నామమాత్రంగా ఉందని యూఎన్డీపీ నివేదిక తెలిపింది. పార్లమెంటులో కేవలం 11.6 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మాధ్యమిక విద్య వరకు చదివిన వారిలో పురుషులు 64 శాతం ఉండగా మహిళలు 39 శాతమే ఉన్నారు. ఇక శ్రామికశక్తిలో మహిళల వాటా 27.2 శాతంకాగా పురుషులు 78.8 శాతం మంది ఉన్నారు. అంతర్జాతీయంగా శ్రామికశక్తిలో మహిళల వాటా 49 శాతంకాగా, పురుషుల వాటా 75 శాతంగా ఉంది. అభివృద్ధికి కీలకమైన విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై భారత్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫ్రాన్సిన్ అభిప్రాయపడ్డారు. మన ఆయుష్షు పెరిగింది భారతీయులు గతంకంటే ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయుర్దాయంలో 1990 కంటే మెరుగైన ఫలితాలను ఐక్యరాజ్య సమితి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ భారత్‌లో గుర్తించింది. 1990లో భారతీయుల ఆయుఃప్రమాణం కేవలం 57.9 సంవత్సరాలే ఉండగా 2017 మానవాభివృద్ధి సూచీలో భారతీయుల ఆయుఃప్రమాణం ఏకంగా 11 ఏళ్లు పెరిగి దాదాపు 70 ఏళ్లకు చేరువవుతోంది. ప్రస్తుతం మన భారతీయుల ఆయుఃప్రమాణం 68.8 ఏళ్లు. భారతీయులకంటే బంగ్లాదేశీయుల ఆయుఃప్రమాణం అధికంగా నమోదైంది. మన దేశస్తులు దాదాపు 69 ఏళ్లు జీవిస్తుంటే, బంగ్లాదేశీయులు సగటు జీవిత కాలం 73 ఏళ్లు. స్త్రీల ఆయుఃప్రమాణం... భారతదేశంలో 70.4 ఏళ్లు బంగ్లాదేశ్‌లో 74.6 ఏళ్లు పాకిస్తాన్లో 67.7 ఏళ్లు పురుషుల ఆయుఃప్రమాణం... భారతదేశంలో 67.3 ఏళ్లు బంగ్లాదేశ్‌లో 71.2ఏళ్లు పాకిస్తాన్లో 65.6 ఏళ్లు -
హైదరాబాద్‌లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ!
సాక్షి, హైదరాబాద్: మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. వరల్డ్ డిజైన్ అసెంబ్లీ నిర్వహణకు వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ) మన నగరాన్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. అక్టోబర్ 2019లో ఈ ద్వైవార్షిక సదస్సు నిర్వహిస్తామని కెనడా కేంద్రంగా పనిచేస్తున్న డబ్ల్యూడీఓ పేర్కొంది. ఇండస్ట్రియల్ డిజైన్ రంగంలో 60 ఏళ్లుగా కృషిచేస్తున్న ఈ సంస్థ తన 31వ అంతర్జాతీయ సదస్సు నిర్వహణ కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేయడం గర్వకారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ‘హ్యూమనైజింగ్ డిజైన్’ అనే ఇతివృత్తంతో 5 రోజులు నిర్వహించే సదస్సుకు ఇండియా డిజైన్ ఫోరం(ఐడీఎఫ్) భాగస్వా మ్యం వహించనుంది. మనుషుల అవసరాలు, ఆలోచనలు, మనస్తత్వాన్ని గ్రహించి వారికి అవసరమైన సేవలందించగల సాఫ్ట్వేర్, పారిశ్రామిక ఉత్పత్తులను సృష్టించాలనే లక్ష్యంతో వస్తు డిజైన్లను రూపొందించడాన్ని హ్యూమనైజింగ్ డిజైన్ అంటారు. మానవ జీవన ప్రమాణాలను పెంచడంలో వస్తు నమూనాల ప్రాముఖ్యాన్ని తెలిపేలా ఈ సదస్సులో ప్రదర్శనలు, చర్చాగోష్టిలు నిర్వహించనున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల సాధనలో పారిశ్రామిక డిజైన్ల రూపకల్పన కీలకమని నిరూపించడానికి అవసరమైన వనరులు, అవకాశాలను హైదరాబాద్ కలిగి ఉందని, అందుకే ఎంపిక చేశామని డబ్ల్యూడీఓ అధ్యక్షురాలు లూసా బొచ్చిట్టో పేర్కొన్నారు. డిజైన్ల రూపకల్పన రంగం సహకారంతో ప్రగతి శీల, సమ్మిళిత నగరాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం, స్థానిక ఇండియా డిజైన్ ఫోరంతో కలసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ, ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చేందుకున్న మౌలిక సదుపాయాలు, స్థానికంగా డిజైన్ల రూపకల్పన రంగం సాధించిన పురోగతి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌ను ఎంపిక చేశామని డబ్ల్యూడీఓ ప్రకటించింది. హైదరాబాద్‌లో నిర్వహించనున్న సదస్సు తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. -
ఏడాదికో కొత్త షికాగో నిర్మిస్తేనే!
న్యూయార్క్: పట్టణీకరణ విషయంలో భారత్ అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు 2030 వరకు ఏడాదికో కొత్త షికాగో నగరాన్ని నిర్మించాల్సి ఉంటుందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. 2030 కల్లా భారత జనాభాలో 40%మంది పట్టణాల్లో నివసిస్తారన్న అంచనాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలుచేశారు. ఐక్యరాజ్యసమితిలో సమ్మిళిత అభివృద్ధిపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హర్దీప్ మాట్లాడారు. భారత పట్టణీకరణ లక్ష్యాలను చేరుకునేందుకు నేటినుంచి 2030 వరకు ప్రతి ఏటా 70 నుంచి 90 కోట్ల చదరపు మీటర్ల పట్టణాభివృద్ధి జరగాలని ఆయన అన్నారు. మిషన్ 2030లో భాగంగా పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే పట్టణీకరణ కోసం 70% కొత్త మౌలికవసతులను భారత్ ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉందని పురీ తెలిపారు. 1947లో భారత జనాభాలో 17% పట్టణాల్లో నివసిస్తుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 30% ఉంది. 2030 కల్లా ఇది 40%కు చేరవచ్చని అంచనా. -
కేంద్రంపై పోరుకు కార్మికులు సిద్ధం కావాలి
ఖమ్మం జెడ్పీసెంటర్: కేంద్రప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని, కేంద్రంపై పోరాడేందుకు కార్మికులు సిద్ధం కావాలని కార్మిక ఐక్య సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పలు సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కార్మిక చట్టాల సవరణలను వ్యతిరేకిస్తూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శింగు నర్సింహారావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్కె. ముక్తర్‌పాషా, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి జి.రామయ్య, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు జలీల్, జిల్లా నాయకులు హనుమంతరెడ్డిలు మాట్లాడారు. దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తున్న మోడీ సంస్కరణాలను తిప్పికొట్టాలన్నారు. ధరలు పెంచి, సంక్షేమ కార్యక్రమాల్లో కోత విధించి కార్మికుల జీవితాలను ఛిద్రం చేస్తున్న కేంద్రప్రభుత్వ చర్యలపై సమరశంఖం పూరించాలని పిలుపుని చ్చారు. విష్ణువర్ధన్, మేకలసంగయ్య,వీరభద్రం, విజయ్‌కుమార్, నున్నామాధవరావు, వెంకటనారాయణల అధ్యక్షతన జరిగిన సదస్సులో నాయకులు గణపతి, సాంబశివరావు, వేణుగోపాల్, కుమారి, శ్రీనివాసరావు,అంజిరెడ్డి, క్లైమెంట్, సీతామహలక్ష్మి, రామారావు, వెంకటేశ్వర్లు, సత్యం, రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.