
సాక్షి, హైదరాబాద్: మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. వరల్డ్ డిజైన్ అసెంబ్లీ నిర్వహణకు వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ) మన నగరాన్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. అక్టోబర్ 2019లో ఈ ద్వైవార్షిక సదస్సు నిర్వహిస్తామని కెనడా కేంద్రంగా పనిచేస్తున్న డబ్ల్యూడీఓ పేర్కొంది. ఇండస్ట్రియల్ డిజైన్ రంగంలో 60 ఏళ్లుగా కృషిచేస్తున్న ఈ సంస్థ తన 31వ అంతర్జాతీయ సదస్సు నిర్వహణ కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేయడం గర్వకారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ‘హ్యూమనైజింగ్ డిజైన్’ అనే ఇతివృత్తంతో 5 రోజులు నిర్వహించే సదస్సుకు ఇండియా డిజైన్ ఫోరం(ఐడీఎఫ్) భాగస్వా మ్యం వహించనుంది.
మనుషుల అవసరాలు, ఆలోచనలు, మనస్తత్వాన్ని గ్రహించి వారికి అవసరమైన సేవలందించగల సాఫ్ట్‌వేర్, పారిశ్రామిక ఉత్పత్తులను సృష్టించాలనే లక్ష్యంతో వస్తు డిజైన్లను రూపొందించడాన్ని హ్యూమనైజింగ్ డిజైన్ అంటారు.
మానవ జీవన ప్రమాణాలను పెంచడంలో వస్తు నమూనాల ప్రాముఖ్యాన్ని తెలిపేలా ఈ సదస్సులో ప్రదర్శనలు, చర్చాగోష్టిలు నిర్వహించనున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల సాధనలో పారిశ్రామిక డిజైన్ల రూపకల్పన కీలకమని నిరూపించడానికి అవసరమైన వనరులు, అవకాశాలను హైదరాబాద్ కలిగి ఉందని, అందుకే ఎంపిక చేశామని డబ్ల్యూడీఓ అధ్యక్షురాలు లూసా బొచ్చిట్టో పేర్కొన్నారు. డిజైన్ల రూపకల్పన రంగం సహకారంతో ప్రగతి శీల, సమ్మిళిత నగరాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం, స్థానిక ఇండియా డిజైన్ ఫోరంతో కలసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నామన్నారు.
అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ, ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చేందుకున్న మౌలిక సదుపాయాలు, స్థానికంగా డిజైన్ల రూపకల్పన రంగం సాధించిన పురోగతి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌ను ఎంపిక చేశామని డబ్ల్యూడీఓ ప్రకటించింది. హైదరాబాద్‌లో నిర్వహించనున్న సదస్సు తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment