State Industries Department
-
వైఎస్సార్ ఈఎంసీకి కేంద్రం పచ్చజెండా
సాక్షి, అమరావతి: ఈఎంసీ–2 పథకం కింద వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ) నిర్మాణానికి కేంద్రం తుది అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 540 ఎకరాల్లో మొత్తం రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రాంట్ రూపంలో రూ.350 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) లేఖ రాసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్క్రో అకౌంట్ ప్రారంభించి రాష్ట్ర వాటాను జమచేస్తే కేంద్రం మంజూరు చేసిన మొత్తాన్ని మూడు విడతల్లో విడుదల చేస్తుంది. వైఎస్సార్ ఈఎంసీని అభివృద్ధి చేసిన తర్వాత ఎల్రక్టానిక్స్ తయారీ రంగానికి చెందిన కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేసేందుకు 347.40 ఎకరాలు విక్రయానికి లేదా లీజుకు అందుబాటులో ఉంటాయని, 92 ఎకరాల్లో రెడీ టు బిల్ట్ ఫ్యాక్టరీ షెడ్స్ నిర్మిస్తారని కేంద్రం ఆ ఉత్తర్వుల్లో వివరించింది. వైఎస్సార్ ఈఎంసీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ గత సంవత్సరం అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ సమర్పించగా.. నాలుగు నెలల్లోనే తుది అనుమతులు రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ కంపెనీగా డిక్సన్ వైఎస్సార్ ఈఎంసీలో యాంకర్ కంపెనీగా డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 70 ఎకరాలు డిక్సన్ టెక్నాలజీస్‌కు కేటాయిస్తారు. ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి కొప్పర్తిలో పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్రం వైఎస్సార్ ఈఎంసీకి తుది ఆమోదం తెలపడంతో త్వరలోనే యాంకర్ కంపెనీగా డిక్సన్ టెక్నాలజీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుందని ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. లిథియం బ్యాటరీలు తయారు చేసే అవెంజ్, సోలార్ విద్యుత్‌కు వినియోగించే పీవీ మాడ్యుల్స్ తయారు చేసే రోన్యూ వంటి సంస్థలు కొప్పర్తి ఈఎంసీలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపాయి. త్వరలోనే ప్రారంభం వచ్చేనెలలో ఉగాదిలోగా వైఎస్సార్ ఈఎంసీని ప్రారంభించే విధంగా ఏపీఐఐసీ పనులను వేగంగా పూర్తిచేస్తోంది. ఇప్పటికే రూ.50 కోట్లతో నాలుగు రెడీ టు వర్క్ షెడ్ల నిర్మాణం, అంతర్గత రోడ్లు, ఆర్చ్‌ల నిర్మాణం వంటి పనులు చేపట్టింది. ఇందులో రెండు షెడ్ల నిర్మాణం పూర్తి కావచ్చిందని, మరో రెండు షెడ్లు పనులు సగం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీలు నేరుగా వచ్చిన రోజు నుంచే ఉత్పత్తి ప్రారంభించే విధంగా రెడీ టు వర్క్ విధానంలో అన్ని వసతులతో ఈఎంసీని అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం మొత్తం 34 మాడ్యుల్స్ (రెడీ టు వర్క్ షెడ్స్)ను అభివృద్ధి చేస్తున్నారు. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 మాడ్యుల్స్, 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు మాడ్యుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైఎస్సార్ ఈఎంసీ ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, లక్షమందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. వైఎస్సార్ ఈఎంసీలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీచేసిన సంగతి తెలిసిందే. చదవండి: పోలీస్‌శాఖకు సీఎం అభినందన కర్నూలు సిగలో కలికితురాయి -
పెట్టుబడి అవకాశాలపై ప్రాచుర్యం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలకు విదేశాల్లోని వ్యాపార వర్గాల్లో మరింత అవగాహన కల్పించడంలో సహకరించాలని ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులను మంత్రి కేటీఆర్ కోరారు. 1992, 93, 94 సంవత్సరాల ఐఎఫ్ఎస్ సీనియర్ అధికారులు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. వీరితో రాష్ట్ర ప్రభుత్వం ఒక విందు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతం అనేక వ్యాపార అవకాశాలున్నాయని ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలు వినూత్నమైన పాలసీలతో ముందుకు పోతున్నాయని అన్నారు. ఇప్పటికే రాష్ట్రం టీఎస్–ఐపాస్ లాంటి విప్లవాత్మకమైన విధానాలతో పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు చేపడుతున్న పెట్టుబడుల స్నేహపూర్వక విధానాలను విదేశాల్లోని వ్యాపార వర్గాల్లో విస్తృత ప్రచారం కల్పించే దిశగా పని చేయాలని ఈ సందర్భంగా వారిని కోరారు. ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మాక్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్, జీనోమ్ వ్యాలీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఉన్న ఇక్కడి పెట్టుబడి అవకాశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూఫ్లెమింగ్, తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపార సంస్కరణల అమల్లో రాష్ట్రం ముందంజ
సాక్షి, అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకుల్లో కీలకమైన వ్యాపార సంస్కరణల అమల్లో రాష్ట్రం ముందంజలో నిలిచింది. 2019 ఈవోడీబీ ర్యాంకులకు సంబంధించి వ్యాపార సంస్క రణల కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్–బీఆర్ఏపీ)లోని మొత్తం 187 సంస్కరణల అమలు తీరును ఆధారంగా రాష్ట్రాల ర్యాంకులను నిర్ణయిస్తారు. రాష్ట్రాల్లో ఆయా సంస్కరణల అమలు తీరును కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని ‘డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్’ విభాగం పరిశీలించి వాటికి ఆమోదం తెలుపుతుంది. ఆ మేరకు ఏపీకి సంబంధించి శుక్రవారం నాటికి 186 సంస్కరణలకు ఆమోదం లభించింది. మరో సంస్కరణకు అదనపు సమాచారం అడిగారని, దీనికి కూడా 15 రోజుల్లో సమాధానం ఇవ్వనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. వ్యాపార సంస్కరణలు ఆమోదం పొందడంలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఇంకా 56 సంస్కరణలకు, కర్ణాటకలో 34 సంస్కరణలకు ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది. గతేడాది ఈవోడీబీ ర్యాంకుల్లో ఆంధ్రా, తెలంగాణ తర్వాత మూడో స్థానంలో నిలిచిన హర్యానా సంస్కరణల ఆమోదంలో మన రాష్ట్రంతో గట్టిగా పోటీపడుతోంది. హర్యానాకు సంబంధించి ఇప్పటికే 183 సంస్కరణలకు ఆమోదం లభించగా, నాలుగు సంస్కరణలకే ఆమోదం లభించాల్సి ఉంది. మొత్తంగా ఈ 187 సంస్కరణలను ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత కమిటీ ఆమోదం తెలుపుతుంది. వీటి ఆధారంగా ఈవోడీబీ ర్యాంకులు నిర్ణయమవుతాయి. సులభతర వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రాన్ని ఈ ర్యాంకులు సూచిస్తాయి. ఈ ర్యాంకుల ఆధారంగానే ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నదానిపై పారిశ్రామికవేత్తలు నిర్ణయం తీసుకుంటారు. ఫీడ్‌బ్యాకే కీలకం... ఈసారి ఈవోడీబీ ర్యాంకుల్లో పారిశ్రామిక ప్రతినిధుల నుంచి తీసుకునే ఫీడ్‌బ్యాక్ కీలక పాత్ర పోషించనుంది. మొత్తం 187 సంస్కరణలకుగాను 80 సంస్కరణల అమలు తీరుకు సంబంధించి నేరుగా వ్యాపారవేత్తల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఒక్కో రంగం నుంచి కనీసం 20 మందిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి అభిప్రాయాలు సేకరిస్తారు. ఇందులో కనీసం 14 మంది సంస్కరణల అమలుపై అనుకూలంగా చెపితేనే పాయింటు వస్తుంది. గతేడాది రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోపాటు పరిశ్రమల ప్రతినిధుల ఫీడ్ బ్యాక్‌ను తీసుకున్నారు. ఈసారి పూర్తిగా పరిశ్రమల ప్రతినిధుల నుంచే తీసుకోనున్నారు. అలాగే ఈ సర్వే ఎప్పుడు, ఎలా చేస్తారో అన్నది బయటకు తెలియదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పరిశ్రమల శాఖ ‘ఔట్ రీచ్’ పేరిట అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తూ స్థానిక పారిశ్రామికవేత్తల సందేహాలు, సమస్యలను పరిష్కరిస్తోంది. ఈ సదస్సులకు మంచి స్పందన వస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సదస్సులు నిర్వహించామని, మిగిలిన జిల్లాల్లోనూ ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్టు చెప్పారు. -
హైదరాబాద్‌లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ!
సాక్షి, హైదరాబాద్: మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. వరల్డ్ డిజైన్ అసెంబ్లీ నిర్వహణకు వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ) మన నగరాన్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. అక్టోబర్ 2019లో ఈ ద్వైవార్షిక సదస్సు నిర్వహిస్తామని కెనడా కేంద్రంగా పనిచేస్తున్న డబ్ల్యూడీఓ పేర్కొంది. ఇండస్ట్రియల్ డిజైన్ రంగంలో 60 ఏళ్లుగా కృషిచేస్తున్న ఈ సంస్థ తన 31వ అంతర్జాతీయ సదస్సు నిర్వహణ కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేయడం గర్వకారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ‘హ్యూమనైజింగ్ డిజైన్’ అనే ఇతివృత్తంతో 5 రోజులు నిర్వహించే సదస్సుకు ఇండియా డిజైన్ ఫోరం(ఐడీఎఫ్) భాగస్వా మ్యం వహించనుంది. మనుషుల అవసరాలు, ఆలోచనలు, మనస్తత్వాన్ని గ్రహించి వారికి అవసరమైన సేవలందించగల సాఫ్ట్వేర్, పారిశ్రామిక ఉత్పత్తులను సృష్టించాలనే లక్ష్యంతో వస్తు డిజైన్లను రూపొందించడాన్ని హ్యూమనైజింగ్ డిజైన్ అంటారు. మానవ జీవన ప్రమాణాలను పెంచడంలో వస్తు నమూనాల ప్రాముఖ్యాన్ని తెలిపేలా ఈ సదస్సులో ప్రదర్శనలు, చర్చాగోష్టిలు నిర్వహించనున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల సాధనలో పారిశ్రామిక డిజైన్ల రూపకల్పన కీలకమని నిరూపించడానికి అవసరమైన వనరులు, అవకాశాలను హైదరాబాద్ కలిగి ఉందని, అందుకే ఎంపిక చేశామని డబ్ల్యూడీఓ అధ్యక్షురాలు లూసా బొచ్చిట్టో పేర్కొన్నారు. డిజైన్ల రూపకల్పన రంగం సహకారంతో ప్రగతి శీల, సమ్మిళిత నగరాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం, స్థానిక ఇండియా డిజైన్ ఫోరంతో కలసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ, ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చేందుకున్న మౌలిక సదుపాయాలు, స్థానికంగా డిజైన్ల రూపకల్పన రంగం సాధించిన పురోగతి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌ను ఎంపిక చేశామని డబ్ల్యూడీఓ ప్రకటించింది. హైదరాబాద్‌లో నిర్వహించనున్న సదస్సు తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. -
ఐటీ, ఆటోమొబైల్‌లో పుష్కల అవకాశాలు
మలేసియా మంత్రికి వివరించిన కేటీఆర్ - పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు - రాష్ట్రంలో మలేసియా కంపెనీల పార్కుకు ప్రతిపాదన - పెట్టుబడులపై ఆసక్తి చూపిన అక్కడి కంపెనీలు సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో తెలంగాణ రాష్ట్రంతో కలిసి మలేసియా పనిచేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. మలేసియా పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఆ దేశ మౌలిక వసతుల శాఖ మంత్రి డాటోసెరి సామీతో సమావేశమయ్యారు. మలేషియన్ కంపెనీలతో ప్రత్యేకంగా తెలంగాణలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయనకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు మలేసియా ప్రభుత్వం ఆసక్తిగా ఉందని డాటోసెరి సామీ కేటీఆర్‌కు తెలిపారు. ఉమ్మడి భాగస్వామ్యాలు అవసరం... ఆ తర్వాత మంత్రి కేటీఆర్ మలేసియా ఇండియా బిజినెస్ కౌన్సిల్‌తో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను 20కి పైగా కంపెనీల ప్రతినిధులకు వివరించారు. పరిశ్రమలకు అనుమతుల జారీలో అనుసరిస్తున్న నూతన పారిశ్రామిక విధానం ఉపయోగాలను తెలిపారు. స్వీయ ధ్రువీకరణతో పరిశ్రమల స్థాపనకు అనుమతి తదితర అంశాలను వారి ముందుంచారు. సమర్థవంత, సుస్థిర నాయకత్వంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ భారత్‌లో పెట్టుబడులకు అత్యంత అనువైందన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉమ్మడి భాగస్వామ్యాలు అవసరమని, వీటితో వ్యాపారావకాశాలు విశ్వవ్యాప్తం అవుతాయన్నారు. కంపెనీల ప్రతినిధుల సూచనల మేరకు వ్యాపార, వాణిజ్య అవకాశాల సమాచారాన్ని పరస్పరం పంచుకోడానికి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఇన్ఫర్మేషన్ రిపాసిటరీ సెల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొం దించి రాష్ట్రంలోని చిన్న, మధ్యతర పరిశ్రమల సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. అదే విధంగా ఎల్ఈడీ తయారీ మార్గదర్శకాలను సరళీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమావేశంలో పాల్గొన్న ఎల్ఈడీ ఉత్పత్తిదారులకి మంత్రి చెప్పారు. ‘తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్’తో కలిసి పనిచేసేందుకు ‘కౌలాలంపూర్ రీజినల్ సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్’ ఆసక్తి చూపింది. మలేసియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ విందులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి 70 మంది సీఈఓలు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు, పాలసీలను తెలుసుకుని అభినందించారు. ఇంటర్సిటీ బస్ టెర్మినల్ నిర్మించండి మలేసియన్ రీసోర్స్ కార్పొరేషన్ బెర్హాడ్(ఎంసీఆర్బీ) చెర్మైన్ అజ్లాన్ జైనోల్, ఎండీ మహమ్మద్ సలీం ఫతే బిన్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. కౌలాలంపూర్‌లోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థను కేటీఆర్ హైదరాబాద్‌లో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ నిర్మించేందుకు ఆహ్వానించారు. అదే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఓ కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.