సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలకు విదేశాల్లోని వ్యాపార వర్గాల్లో మరింత అవగాహన కల్పించడంలో సహకరించాలని ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారులను మంత్రి కేటీఆర్ కోరారు. 1992, 93, 94 సంవత్సరాల ఐఎఫ్‌ఎస్ సీనియర్ అధికారులు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. వీరితో రాష్ట్ర ప్రభుత్వం ఒక విందు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతం అనేక వ్యాపార అవకాశాలున్నాయని ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలు వినూత్నమైన పాలసీలతో ముందుకు పోతున్నాయని అన్నారు. ఇప్పటికే రాష్ట్రం టీఎస్–ఐపాస్ లాంటి విప్లవాత్మకమైన విధానాలతో పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
తెలంగాణ లాంటి రాష్ట్రాలు చేపడుతున్న పెట్టుబడుల స్నేహపూర్వక విధానాలను విదేశాల్లోని వ్యాపార వర్గాల్లో విస్తృత ప్రచారం కల్పించే దిశగా పని చేయాలని ఈ సందర్భంగా వారిని కోరారు. ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మాక్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్, జీనోమ్ వ్యాలీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఉన్న ఇక్కడి పెట్టుబడి అవకాశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూఫ్లెమింగ్, తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడి అవకాశాలపై ప్రాచుర్యం: కేటీఆర్
Published Wed, Nov 6 2019 3:26 AM | Last Updated on Wed, Nov 6 2019 3:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment