Telangana govt
-
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
హైదరాబాద్: రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్‌లు బదిలీ జరిగింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు బదిలీ కాగా, సుధీర్‌బాబును హైదరాబాద్ మల్టీజోన్ ఐజీగా నియమించారు. ఇక రాచకొండ సీపీగా తరుణ్జోషిని నియమించారు. రామగుండం సీపీగా ఎం శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్, సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్, టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు, హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీగా గిరిధర్, హైదరాబాద్ సౌత్‌వెస్ట్ డీసీపీగా ఉదయ్‌కుమార్‌రెడ్డి, జోగులాంబ డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా మురళీధర్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఉద్యమంతో మొదలై... ఉజ్వలమై..
త్వరలో పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ అర్హులైన పేదలకు ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించాం. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను ఇండ్ల నిర్మాణాల కోసం కేటాయిస్తాం. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఉద్యమ ప్రస్థానంతో మొదలై.. ఉజ్వల ప్రగతి వైపు తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని.. తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగిడుతున్న రాష్ట్రం దేశానికే మార్గదర్శిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. దేశంలోనే తక్కువ వయసున్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధి పరుగులో ముందు వరుసలో నిలబడిందని.. తొమ్మిదేళ్లలోనే ప్రతి రంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయేలా ఫలితాలను సాధించి, పదో సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఒక మైలురాయి అని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటిచెబుదామని పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు వెనుకబడిన తరగతులు, ఇతర వర్గాలకు కొత్త పథకాలను ప్రకటించారు. కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ తొలి ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రిగా నేను వాగ్దానం చేశాను. తెలంగాణను దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చాను. ఆ ఉక్కు సంకల్పాన్ని ఏమాత్రం చెదరనివ్వలేదు. తొమ్మిదేళ్లలో అనేక రంగాల్లో దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ తొమ్మిదేళ్లలో కరోనా మహమ్మారి వల్ల దాదాపు మూడేళ్ల కాలం వృధాగా పోయింది. మిగతా ఆరేళ్లలోనే వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించింది. దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మారుమోగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా మన్ననలు అందుకుంటోంది. అనేక సవాళ్లు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. ఇప్పుడు పరుగులు తీస్తోందంటే అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, ప్రజల సహకారమే కారణం. బీసీల్లోని కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తిదారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తాం. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాలకు ఈ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా గొల్ల, కురుమలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టాం. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. ప్రస్తుతం రెండో విడతలో రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభిస్తాం. ఈ నెల 24 నుంచి పోడు పట్టాలు రాష్ట్రంలో పోడు సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీల చిరకాల ఆకాంక్షను ప్రభుత్వం తీరుస్తోంది. ఈ నెల జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. అటవీ భూములపై ఆధారపడిన 15 లక్షల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కలి్పంచనున్నాం. అదేవిధంగా వారికి రైతుబంధు పథకాన్ని కూడా వర్తింపజేస్తాం. అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ పేదల ప్రతి సమస్యనూ సూక్ష్మంగా అర్థం చేసుకొని పరిష్కరించే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గర్భిణులలో రక్తహీనత సమస్యను నివారించడం, గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదగడం కోసం ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పోషకాహారాన్ని న్యూట్రిషన్ కిట్ల ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటికే ఈ పథకాన్ని 9 జిల్లాల్లో ప్రారంభించగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే మిగతా 24 జిల్లాల్లోనూ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రారంభిస్తాం. ఉద్యమంలా దళితబంధు దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో ‘దళితబంధు’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు నూరు శాతం గ్రాంట్‌గా అందిస్తోంది. దళితులు తమకు నచి్చన ఉపాధిని ఎంచుకొని ఆత్మగౌరవంతో జీవించడానికి అండదండగా నిలుస్తోంది. దళితబంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు 50వేల మంది లబి్ధదారులకు రూ.5వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించాం. రెండో విడతలో భాగంగా 1.30లక్షల మందికి దళిత బంధు అందించనున్నాం. రైతు బంధువులకు రూ.65 వేల కోట్ల సాయం రాష్ట్రంలో రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు పది విడతల్లో 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు అందించాం. భూరికార్డుల డిజిటలైజేషన్‌తో రైతుల భూముల వివరాలపై వచి్చన స్పష్టత ఆధారంగా.. నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయగలుగుతున్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతులకు ఇంత భారీగా పెట్టుబడి సాయం అందించలేదు. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే.. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశపెట్టాం. రైతు మరణించిన పది రోజుల్లోపే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నాం. నూతన సచివాలయం.. భారీ అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున వెలసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయ సౌధం రాష్ట్ర ప్రతిష్టకు ఉజ్వల సంకేతంగా నిలిచింది. గతంలో ముఖ్యమంత్రి కూర్చునే చాంబర్‌కు వెళ్లేదారి ఒక చీకటి గుహలోకి ప్రవేశించినట్టుగా ఉండేది. ఉద్యోగులు ఆఫీసు టేబుళ్ల మీదనే భోజనం చేయాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి ఇక్కట్లేవీ లేకుండా అధునాతన హంగులతో, అన్ని శాఖల కార్యాలయాలను అనుసంధానిస్తూ, వాస్తు నిర్మాణ కౌశలం ఉట్టిపడేలా కొత్త సచివాలయ సౌధాన్ని నిర్మించుకున్నాం. బాబాసాహెబ్ ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో సచివాలయానికి ఆయన పేరు పెట్టుకోవడంతోపాటు.. సచివాలయం సమీపంలోనే 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. సచివాలయానికి మరోవైపు అమరవీరుల స్మారకం నిర్మించుకున్నాం. ఒకవైపు భారీ అంబేడ్కర్ విగ్రహం, దానికి ఎదురుగా హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుని విగ్రహం, నభూతో న భవిష్యతి అన్నరీతిన నిర్మించిన సచివాలయ సౌధం, అమరవీరులను ప్రతిరోజూ స్మరణకు తెచ్చే అమరజ్యోతి.. ఇవన్నీ మనకు నిత్యం కర్తవ్య బోధ చేస్తుంటాయి. సచివాలయం ఎదురుగా ఉన్న విశాలస్థలంలో తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుకోబోతున్నాం. నిరంతర ప్రక్రియగా పేదలకు గృహ నిర్మాణం నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాం. పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇచ్చే పథకం మరెక్కడా లేదు. కొల్లూరులో 124 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల సముదాయం ఓ టౌన్íÙప్ను తలపించేలా ఉంది. అక్కడ 117 బ్లాకుల్లో 15,660 ప్లాట్లు నిర్మించాం. ఇదో ఉదాహరణ మాత్రమే. పేదలకు గృహ నిర్మాణం అనేది ఓ నిరంతర ప్రక్రియ. దీనిని కొనసాగిస్తునే ఉంటాం. సురక్షిత జలాల మిషన్ భగీరథ మిషన్ భగీరథ ద్వారా నూటికి నూరు శాతం ఇళ్లకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుంటే.. ప్రజలను ఓట్లు అడగబోనని రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాను. ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడోస్థానంలో ఉంది. తెలంగాణ ప్రారంభించిన మిషన్ భగీరథను అనుకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ జల్ యోజన’ పేరిట పథకాన్ని అమల్లోకి తెచ్చింది. విద్యుత్ విజయం తెలంగాణ ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుకాగా.. ఇప్పుడు 18,453 మెగావాట్లకు పెంచుకున్నాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు సోలార్ పవర్ ఉత్పత్తి 74 మెగావాట్లే ఉండగా.. ఇప్పుడు 5,741 మెగావాట్లకు పెంచగలిగాం. సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించింది. సంస్థలో అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. సాగునీటి రంగంలో స్వర్ణయుగం సమైక్య రాష్ట్రంలో మూలనపడ్డ కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేయడంతో 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. వలసల జిల్లా ఉమ్మడి పాలమూరు ఈరోజు పంట కాలువలతో పచ్చని చేలతో కళకళలాడుతోంది. వలస వెళ్లిన జనం సొంతూర్లకు తిరిగి వచి్చ.. పొలాలు సాగు చేసుకుంటున్నారు. అద్భుతమైన ఈ మార్పుకు అద్దంపడుతూ ‘‘వలసలతో వలవల విలపించు కరువు జిల్లా, పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేసి, చెరువులన్ని నింపి, పన్నీటి జలకమాడి, పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది..’’ అని నేనే స్వయంగా పాట రాశాను. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80శాతానికిపైగా పూర్తయింది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయి. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవం తెలంగాణ ఆధ్యాత్మిక వైభవ ప్రతీక అయిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతమని యావన్మందీ కొనియాడుతున్నారు. అలాగే కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేశాం. ఇటీవల నేను స్వయంగా ఆ ఆలయానికి వెళ్లి పరిశీలించి, దేశంలో కెల్లా ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంగా దీన్ని తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇదే తరహాలో వేములవాడ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల చొప్పున కేటాయించాం. పనులు పురోగతిలో ఉన్నాయి. భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయం సైతం ఇదేవిధంగా వైభవంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మన రాష్ట్రంలో కాకతీయుల కళావైభవానికి ప్రతీకగా నిలచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు వెనుక ప్రభుత్వం చేసిన కృషి ఎంతో ఉంది. రైతుబంధుకు రూ. 65 వేల కోట్ల సాయం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు పది విడతల్లో 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు అందించాం. భూరికార్డుల డిజిటలైజేషన్‌తో రైతుల భూముల వివరాలపై స్పష్టత ఆధారంగా.. నగదును రైతుల ఖాతాల్లో జమ చేయగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా రైతులకు ఇంత భారీగా పెట్టుబడి సాయం అందట్లేదు. ఒకవేళ రైతు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశపెట్టాం. రైతు మరణించిన 10 రోజుల్లోపే రూ. 5 లక్షల పరిహారం అందిస్తున్నాం. బీసీల్లోని కులవృత్తిదారులకు రూ. లక్ష సాయం రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తిదారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తాం. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాలకు ఈ పథకంతో ఎంతో లబ్ధి చేకూరుతుంది. గొల్ల, కురుమలకు భారీగా గొర్రెల పంపిణీని చేపట్టాం. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. ప్రస్తుతం రెండో విడతలో రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీని దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభిస్తాం. ఉద్యమంలా దళితబంధు దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో ‘దళితబంధు’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు నూరు శాతం గ్రాంట్‌గా అందిస్తోంది. దళితులు తమకు నచి్చన ఉపాధిని ఎంచుకొని ఆత్మగౌరవంతో జీవించడానికి అండదండగా నిలుస్తోంది. దళితబంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు 50వేల మంది లబి్ధదారులకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,700 కో ట్లు కేటాయించాం. రెండో విడతలో భాగంగా 1.30 లక్షల మందికి దళితబంధు అందించనున్నాం. కాశీ, శబరిమలలో వసతిగృహాలు సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని సందర్శించాలని కోరుకుంటారు. తెలంగాణ నుంచి కాశీకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం 60 వేల చదరపు అడుగుల్లో అక్కడ ఓ వసతి గృహం నిర్మించబోతున్నాం. అదేవిధంగా శబరిమలకు వెళ్లే తెలంగాణ భక్తుల కోసం అక్కడ వసతి గృహం నిర్మిస్తున్నాం. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధ వనాన్ని అద్భుతంగా నిర్మించింది..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చివరిగా ‘ధర్మస్య విజయోస్తు.. అధర్మస్య నాశోస్తు.. ప్రాణిషు సద్భావనాస్తు.. విశ్వస్య కల్యాణమస్తు..’ అని శ్లోకంతో ప్రసంగం ముగించారు. -
రిమాండ్‌ను సవాల్ చేస్తూ బండి సంజయ్ పిటిషన్
-
మునుగోడు లో టీఆర్ఎస్ విజయం ఖాయం : మల్లారెడ్డి
-
'ఆచార్య' టీంకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన చిత్రం ఆచార్య. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆచార్య టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనెల 29 నుంచి మే 5వరకు టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో రూ. 50, సాధారణ థియేటర్స్‌లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు వారం రోజుల పాటు అనుమతి కల్పించింది. -
అందరి ఆకాంక్షల చదువు
ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఆహ్వానించదగ్గది. ఇప్పటికే ఈ విషయంలో చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటిదాకా విద్యావ్యవస్థ ధనికులను మరింత ధనవంతులుగా మారిస్తే... పేదలను మరింత దరిద్రంలోకి నెట్టేసింది. పేద, ధనిక తారతమ్యాన్ని తగ్గించడం విద్య వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలిప్పుడు గట్టిగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు తోడైతే అవి ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడగలవు. విద్యాసంబంధిత అంశాల్లో పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకూ అధ్యాపకులందరినీ వృత్తిపరమైన క్రమశిక్షణను అనుసరించేట్టు చేయడం తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న తెలంగాణ మంత్రివర్గ నిర్ణయం భారతీయ జనతా పార్టీ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి వేసిన మాస్టర్ స్ట్రోక్! ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్ మీడియం విద్య, అమ్మ ఒడి వంటి పథకాలు జనసామాన్యంలో ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అటు పట్ట ణాలు, నగరాల్లో మాత్రమే కాదు... పల్లెపట్టుల్లోనూ వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యానికి మంచి ఆదరణ కనిపిస్తోంది. దీంతో తెలంగాణ ప్రజల్లోనూ అలాంటి పథకాలు తమకూ అందుబాటులోకి వస్తే బాగుంటుందన్న కాంక్ష బలపడటం అసహజమేమీ కాదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కల్వ కుంట్ల చంద్రశేఖరరావుకు ఈ రెండు పథకాలు కలిసివస్తాయనడం లోనూ ఎలాంటి సందేహం లేదు; 2018 ఎన్నికల్లో రైతు బంధు మాదిరిగా! జాతీయ పార్టీల తీరు అటు బీజేపీ గానీ, ఇటు కాంగ్రెస్ గానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను అంగీకరించలేవు. ఎందుకంటే ప్రాంతీయ భాషల సెంటిమెంటుతోనే ఈ పార్టీలు 70 ఏళ్లుగా తమను తాము బలపరుచుకుంటున్నాయి మరి! కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యతో ఈ అంశంపై ఒకసారి చర్చ జరిగింది. అయితే రాష్ట్రంలో ఉండే మేధావి వర్గం ఇంగ్లిష్ మీడియం బోధనపై సమస్యలు సృష్టిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కేరళ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) నేత పినరయి విజయన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని నాతో వ్యక్తం చేశారు. అయితే... ఈ మేధా వులు, చదువుకున్న వారందరూ కూడా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలోనే చదివిస్తున్నారన్న సంగతి మరచిపోకూడదు. భారతీయ జనతా పార్టీని తీసుకుంటే... రాష్ట్ర, జాతీయ స్థాయిలు రెండింటిలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనపై ఆలోచన చేయడం లేదు. కానీ.. ధనికుల పిల్లలు చదువుకునేందుకు ప్రైవేట్ స్కూళ్లు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే నడిపేందుకు మాత్రం ఓకే చేస్తుంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాఠ శాలల, విశ్వవిద్యాలయ స్థాయిలో విద్య పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ అవుతున్న విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ప్రాంతీయ భాషల్లోనే విద్యాబోధన జరగాలని అంటోంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్య చాలా అధ్వాన్న స్థితిలో ఉంది. ఆ పార్టీకి ఆర్థికంగా మద్దతిచ్చే పారిశ్రామిక వేత్తలు, భూస్వామ్య పోకడలున్న వారు సులువుగా డబ్బు సంపా దించేందుకు దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియం విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర విభాగాలేవీ కూడా ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాము ఇంగ్లిష్ బోధన అందిస్తామని చెప్పలేక పోతు న్నాయి. మతం, కమ్యూనలిజంల చుట్టే ఆ పార్టీ అజెండా ఉంటుం దన్నది వేరే సంగతి. కానీ వీటివల్ల ప్రయోజనం లేదని ఇప్పుడు గ్రామీణ ప్రజలు సైతం అర్థం చేసుకున్నారు. పేద, ధనిక తార తమ్యాన్ని తగ్గించడం విద్య వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలి ప్పుడు గట్టిగా విశ్వసిస్తున్నారు. మౌలిక సదుపాయాలు తోడైతేనే... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు మౌలిక సదు పాయాలూ తోడైతే అవి ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడగలిగే పరిస్థితి వస్తుంది. మౌలిక సదుపాయాలంటే ఎయిర్ కండీషన్ ఉన్న తరగతి గదులు కావాలని కాదు. ఈ దేశానికి అలాంటివి అస్సలు అవసరం లేదు. కావాల్సిందల్లా ప్రాథమిక అవసరాలను తీర్చగలిగేవి మాత్రమే. మంచి తరగతి గదులు, కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం వంటివన్నమాట. వీటన్నింటికీ మించి నిబద్ధతతో పాఠాలు బోధించే మంచి ఉపాధ్యాయుల అవసరమూ ఎంతో ఉంది. పాఠ్యపుస్తకాల్లోనివి వల్లెవేసే వారు కాకుండా... పరిస రాలను అర్థం చేసుకుని కనీస జ్ఞానంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జా తీయ అంశాలను పిల్లలకు పరిచయం చేయగలిగిన వారు కావాలి. పాఠ్యపుస్తకాలు ఇతర టీచింగ్ మెటీరియల్ సరఫరా కూడా కీలకమే. 73 ఏళ్లుగా ద్వంద్వ విధానాలు... దేశంలో విద్యకు సంబంధించి గత 73 ఏళ్లుగా ద్వంద్వ విధానాలే అమల్లో ఉన్నాయి. ధనికులకు ఇంగ్లిష్‌లో, పేదలకు ప్రాంతీయ భాషల్లో బోధన సాగుతూ వచ్చింది. ఇరు వర్గాల మధ్య సౌకర్యాల అంతరమూ చాలా ఎక్కువే. ఫలితంగా పేదవారు, గ్రామీణ విద్యా ర్థులు జీవితంలో అన్ని దశల్లోనూ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఈ విద్యావ్యవస్థ ధనికులను మరింత ధనవం తులుగా మారిస్తే... పేదలను మరింత దరిద్రంలోకి నెట్టేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం పాఠశాల విద్యలో సమూల మార్పులకు ధైర్యంగా నిర్ణయించడంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అప్పటివరకూ దేశంలోని ఏ ముఖ్యమంత్రీ ఇంతటి వినూత్నమైన, విప్లవాత్మకమైన మార్పుకు యోచన కూడా చేయలేదు. 2014లో తెలంగాణ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని ప్రకటించినా ఏడేళ్లపాటు కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన గురించి ఆలోచన కూడా చేయలేకపోయారు. ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థలను బలపరిచే చర్యలు చేపట్టినా... గ్రామీణ స్థాయిలో పాఠశాల విద్యా బోధన నాణ్యత పెంచడం పెద్దగా జరగలేదనే చెప్పాలి. ఒక దశలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంతో బలహీనమైంది కూడా. పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉద్యోగాలకు పోటీ పడే పరిస్థితి కూడా లేకపోయింది. ఇంటర్మీడియెట్ స్థాయిలో బోధన సక్రమంగా లేకపోవడంతో కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపింది. పాఠశాల స్థాయి ఉపా ధ్యాయులు మాత్రమే కాదు.. విశ్వవిద్యాలయ స్థాయి అధ్యాపకుల ఇంగ్లిష్ ప్రావీణ్యత అధ్వాన్న స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యావ్యవస్థలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఏర్పడింది. ఆహ్వానించదగ్గ పరిణామం ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ తగిన మౌలిక సదుపాయాలతో ఇంగ్లిష్ మీడియం వైపు మళ్లించడం ఈ మార్పుల దిశగా వేసే తొలి అడుగు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రయత్నం మొదలు పెట్టడం ఎంతైనా ఆహ్వానించదగ్గది. అయితే ఇది ఇక్కడితో ఆగి పోరాదు. పాఠశాల ఉపాధ్యాయులకు భాషతోపాటు కంటెంట్‌కు సంబంధించి తగిన శిక్షణ ఇవ్వడం ఒక పార్శ్వమైతే... టీచింగ్ వ్యవ స్థకు కొంత క్రమశిక్షణ నేర్పటం ఇంకోటి. ఉపాధ్యాయులు, అధ్యాప కుల ప్రజాస్వామ్య హక్కులకు గౌరవమిస్తూనే... విద్యాసంబంధిత అంశాల్లో పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకూ అందరినీ వృత్తి పరమైన క్రమశిక్షణ అనుసరించేట్టు చేయడం తప్పనిసరి. చైనీయుల మాదిరిగా విద్య నాణ్యత పెంచాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి అంతగా ఉన్నట్లు లేదు. జాతీయ విద్యా విధానం ఒక్కటే వ్యవస్థలో అన్ని మార్పులూ తీసుకురాదు. బీజేపీ మతతత్వ వాదం మైనార్టీలను ఆ పార్టీకి దూరం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా గతంలో విద్యావ్యవస్థనేమీ అంతర్జాతీయ స్థాయికి చేర్చలేదు. లేదా గ్రామీణ విద్యావ్యవస్థను చైనా మాదిరిగా మెరుగు పరచలేదు. అందుకే ప్రాంతీయ పార్టీలు ఈ దిశగా వేస్తున్న అడుగు లకు అందరూ తమవంతు మద్దతివ్వాల్సి ఉంది. వ్యాసకర్త: ప్రొ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
నాది హామీ..కోటి టన్నులైనా కొంటాం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘వానాకాలానికి సంబంధించి తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యం గింజను చివరివరకు కొంటాం. ఈ సీజన్లో ఎంతమేర ధాన్యం సేకరించాలన్న దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందానికి మించి ధాన్యం వచ్చినా సేకరిస్తాం. ఎంతైనా కొంటాం.. అది కోటి మెట్రిక్ టన్నులు అయినాసరే. పచ్చిబియ్యం, ఉప్పుడు బియ్యం అన్నతేడా లేకుండా కనీస మద్దతు ధరలతో తీసుకునేందుకు సిద్ధం. ఈ విషయంలో తెలంగాణ రైతాంగానికి కేంద్రమంత్రిగా నాది హామీ’’అని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం ఆయన ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, సోయం బాపూరావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వానాకాలం సీజన్లో ధాన్యం కొనబోమని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా, చెపితే చూపించాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 25 రోజులుగా కొనుగోళ్లను నిలిపేయడంతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని.. ధాన్యాన్ని మిల్లులకు పంపించే సోయి లేదుగానీ కేంద్రాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అసంబద్ధ నిర్ణయాల వల్లే రైతులు గందరగోళంలో పడ్డారని.. కొనుగోళ్లు జరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి అనంతరం కేసీఆర్ తీవ్రంగా భయపడుతున్నారని.. ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అవుతాడో లేడో అన్న ఆందోళనలో ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పుత్ర వాత్సల్యం ప్రగతిభవన్ నుంచి పార్లమెంట్‌కు చేరుకుందని, అందుకే లేని సమస్యను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. యాసంగి ప్రణాళిక రాష్ట్రానిదే.. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్రం చెప్పిందని.. రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పంటలకు విత్తనాలు, ఎరువులు, రుణాలపై ఓ విధానం రూపొం దించుకోవాల్సింది రాష్ట్రమేనని.. దానిని వదిలేసి కేంద్రంపై విమర్శలు చేయడం ఏమిటని నిలదీశారు. పంజాబ్‌లోనైనా, తెలంగాణలోనైనా కేంద్రం ఒకే విధానంతో ముందుకెళుతుందని.. సీఎం కేసీఆర్ తరహాలో గజ్వేల్‌కు ఓ న్యాయం, దుబ్బాకకు మరో న్యాయం ఉండదని వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం..!
సాక్షి, హైదరాబాద్: భూముల వేలం ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తుండటంతో తాజాగా మరో 117.35 ఎకరాల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా ఖానామెట్, పుప్పాలగూడలోని 35 ప్లాట్లను వచ్చే నెల 27, 29 తేదీల్లో వేలం వేసేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆదివారం సాయంత్రం నుంచే ఆన్లైన్లో వేలం వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఖానామెట్‌లో 22.79 ఎకరాల విస్తీర్ణంలో 9 ప్లాట్లు, పుప్పాలగూడలో 94.56 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 26 ప్లాట్లు వేలం వేయనున్నారు. సెప్టెంబర్ 27న ఖానామెట్, 29న పుప్పాలగూడలో ఈ వేలం నిర్వహిస్తారు. వేలం ప్రక్రియ నిర్వహణకు టీఎస్ఐఐసీని రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా నియమించింది. ఈ నేపథ్యంలో దరఖాస్తు విధానం, వేలం ప్రక్రియ తదితరాలపై అవగాహన కల్పించేందుకు వచ్చే నెలలో టీఎస్ఐఐసీ ప్రీ–బిడ్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం తేదీలు, అప్సెట్ ధర, ఈఎండీ, ఇతర నిబంధనలు సోమవారం వెలువడే నోటిఫికేషన్లో ఉంటాయని టీఎస్ఐఐసీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే 6 నెలల్లో మరిన్ని భూములు సైతం! ప్రభుత్వ భూముల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ.20వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే కరోనా, లాక్డౌన్ తదితర పరిస్థితుల్లో గత నెలలో జరిగిన వేలం పాటలో రూ.2729.78 కోట్లు సమకూరాయి. ప్రస్తుత వేలం ద్వారా సుమారు రూ. 6 వేల కోట్లు సమకూరుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. వచ్చే 6 నెలల్లో ఉప్పల్ భగాయత్ పరిధిలో ఖాళీగా ఉన్న ప్లాట్లతోపాటు మియాపూర్ మెట్రో సమీపంలోని స్థలాలను కూడా వేలం వేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మియాపూర్ సమీపంలోని హెచ్ఎండీఏ భూములతోపాటు జవహర్‌నగర్, బుద్వేల్, రావిర్యాల, కొంగర ఖుర్ద్, మహేశ్వరం, తుమ్మలూరు ప్రాంతాల్లోనూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్లాట్లను రాబోయే రోజుల్లో వేలం వేసే అవకాశమున్నట్లు తెలిసింది. -
ఒక్క మెట్టు ఎక్కితే ‘వారసత్వ’ హోదా!
వెబ్‌డెస్క్: అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. కాకతీయ వైభవం వరంగల్ కేంద్రంగా తెలుగు ప్రాంతాలను పాలించిన కాకతీయులు ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. వరంగల్ ఖిల్లా, వేయిస్థంభాలగుడి, పానగల్ దేవాలయం, గొలుసుకట్టు చెరువులు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే వీటన్నింటీలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయం ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఈ కట్టడానికి వారసత్వ హోదా తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. జులై 16న ప్రపంచంలోని చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు హెరిటేజ్ హోదా ఇచ్చే యునెస్కో హెరిటేజ్ కమిటీ 2021 జులై 16న చైనా కేంద్రంగా వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. సమావేశంలో 21 సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొని వారసత్వ హోదా ప్రదానంపై ఆన్లైన్లోనే తమ ఓట్లు వేయనున్నారు. 16న జరిగే రామప్ప ఆలయానికి హోదా రావాలంటే మెజారిటీ ఓట్లు రావాల్సి ఉంటుంది బరిలో 255 కట్టడాలు ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాలకు చెందిన 1,121 కట్టడాలు, ప్రదేశాలు యునెస్కో జాబితాలో ఉండగా భారతదేశం నుంచి 38 కట్టడాలకు, ప్రదేశాలకు చోటుదక్కింది. ప్రస్తుతం ప్రపంచం నలుమూలల నుంచి 255 కట్టడాలు, ప్రదేశాలు యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడుతున్నాయి. భారతదేశం నుంచి 2020 సంవత్సరానికి గాను రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించగా, 2021 సంవత్సరానికి గాను గుజరాత్ రాష్ట్రంలోని హరప్పా నాగరికతలో భాగమైన ధోలవీర ఆలయాన్ని ప్రతిపాదించారు. శిల్పి పేరుతోనే కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు శివుని మీద ఉన్న ఆపారమైన భక్తితో 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే శిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరునే ప్రాచుర్యంలోకి వచ్చింది. శాండ్బాక్స్ టెక్నాలజీ రామప్ప ఆలయాన్ని నిర్మించి 808 ఏళ్లు కావస్తున్నప్పటికీ చెక్కు చెదరకుండా చూపరులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయ నిర్మాణంలో శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించారు. అంటే ఇసుకపై ఆలయాన్ని నిర్మించారన్నమాట. మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపి దానిపై రాళ్లను, శిలలను పేర్చుకుంటూ పోయి ఆలయాన్ని నిర్మించారు. నీటిపై తేలియాడే ఇటుకలు ఆలయ గోపురం బరువు తగ్గించేందుకు తేలికైన ఇటుకలు ఉపయోగించారు. వీటిని ప్రత్యేక పద్దతిలో తయారు చేశారు. ఈ ఇటుకలు నీటిలో తేలియాడుతాయి. సాధారణంగా నిర్మాణంలో వినియోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగి ఉంటాయి. రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకల సాంద్రత కేవలం 0.8 . దీంతో ఇవి నీటిలో తేలియాడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ విశేషాలు ఆలయానికి లేత ఎరుపువర్ణం కలిగిన అరుదైన రాయిని వినియోగించడంతో నిర్మాణం చెక్కుచెదరకుండా ఉండటానికి కారణంగా పేర్కొంటున్నారు. కట్టడం బరువు ఎక్కువగా ఉన్న చోట తేలికగా ఉండే గ్రానైట్, డోలమైట్, బ్లాక్ గ్రానైట్లను వినియోగించి ఆలయాన్ని నిర్మించడం రామప్ప శిల్పికే సాధ్యమైంది. శిల్పకళ ఆలయం నలువైపులా ఉన్న మదనికల శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. బ్లాక్ గ్రానైట్ రాయిపై చెక్కిన మదనికల సొగసు వర్ణణాతీతం. ఇక ఆలయం నలువైపులా ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఈజిఫ్టు, మంగోలియన యాత్రికుల శిల్పాలు అబ్బరు పరుస్తాయి. ఇక ఆలయం లోపల నాట్యమంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి తార్కాణంలా నిలిచిపోతుంది. సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ఐదేళ్ల శ్రమ రామప్ప ఆలయాన్ని యునెస్కో జాబితాలో చోటు కల్పించేందుకు కాతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇన్టాక్ వరంగల్ చాప్టర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్లుగా కృషి చేస్తున్నాయి. దీంతో 2017లో యూనెస్కో హెరిటేజ్ సైట్ టెంటిటీవ్ లిస్టులో చోటు సాధించింది. ఆ తర్వాత ఐకోమాస్ (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్) సభ్యుడు, యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన (థాయ్‌లాండ్) 2019 సెప్టెంబర్‌లో ఆలయాన్ని సందర్శించారు. ప్రతి ఆంశాన్ని క్షుణ్ణంగా పరీశీలించి రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపునకు కావాల్సిన అర్హతలు ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రామప్ప ఆలయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన పుస్తకం (డోషియర్) రూపొందించి యూనెస్కోకు సమర్పించారు. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి యునెస్కో గుర్తింపుకోసం రామప్ప ఆలయాన్ని ప్రతిపాదించడంతో, దీనిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్‌లతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత స్థాయి బృందం జూన్ 24న ఢిల్లీకి వెళ్లింది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని కోరుతూ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌కు వినతిపత్రం అందించింది. అలాగే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆలయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. చరిత్రకు సత్కారం ఈ హోదా లభిస్తే ఘనమైన కాకతీయుల చరిత్రకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతుంది. ఆలయం పూర్తిగా యునెస్కో అధీనంలోకి వెళుతుంది. ప్రత్యేకంగా నిధులు అందే అవకాశంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, ఆలయంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుంది. యునెస్కో గుర్తింపు నేపథ్యంలో విదేశీ పర్యాటకులు పెరుగుతారు. స్థానికులకు అన్ని విధాలా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. -
నీళ్లను ఆంధ్రాకు అమ్మేశారు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మొదటి నినాదమైన నీళ్లను ఆంధ్రాకు అమ్మేసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి తెలంగాణ నంబర్ 1 ద్రోహిగా కేసీఆర్ నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి అపెక్స్ కమిటీలోనే ఆంధ్రాకు 512 టీఎంసీలిచ్చి, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకుని ద్రోహం చేశారని, ఏ సోయితో కేసీఆర్ ఒప్పుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీళ్ల కేటాయింపులు, ప్రాజెక్ట్‌ల విషయంలో తాము చెప్పిన విషయాలపై శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాము చెప్పినవి తప్పయితే ముక్కు నేలకు రాయడమే కాదు శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లలో దూకి చావడానికి సిద్ధమన్నారు. వాస్తవాలని నిరూపిస్తే.. కేసీఆర్ తప్పు ఒప్పుకుని ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కంటే ఏడాది ముందే పాలమూరు–రంగారెడ్డి పనులకు శంకుస్థాపన చేసినా ఇంతవరకు పూర్తి చేయలేకపోయిన దద్దమ్మ కేసీఆర్ అని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించాలి... దళిత సాధికారత సమావేశంలో ఇచ్చిన హామీకి కట్టుబడి వెంటనే సచివాలయంలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని సీఎం కేసీఆర్‌ను బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం తక్షణమే పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సంజయ్‌ను కోరుతూ బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కళ్యాణ్ నాయక్ మంగళవారం కలిశారు. పార్టీ ఎస్సీ మోర్చా నాయకులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, సీఎంకు కళ్యాణ్‌నాయక్ పంపించిన వినతిపత్రం ప్రతులను జతచేసి సీఎంకు సంజయ్ లేఖ రాశారు. -
ఏపీకి ఏకపక్ష ధోరణి సరి కాదు: మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, ఒప్పందాలు కుదిరాకే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని.. కానీ ఏపీ మాత్రం ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్షంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టును విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారని.. కానీ తాగునీటి కోసమనే పేరిట ఈ ప్రాజెక్టు నుంచి రాయలసీమ, నెల్లూరుకు సాగునీరు తరలిస్తున్నారని విమర్శించారు. కృష్ణా నదిలో తెలంగాణ కంటే తక్కువ పరీవాహక ప్రాంతం ఉన్న ఏపీకి 512 టీఎంసీలు కేటాయించడం అన్యాయమన్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 300 మీటర్ల వెడల్పుతో కాల్వలు తవ్వుతోందని.. మొత్తం నదినే మళ్లించి, రిజర్వాయర్‌ను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో తెలంగాణకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని వాడుకునేందుకే జోగుళాంబ బ్యారేజీ, భీమా ఇరిగేషన్ కాల్వను ప్రతిపాదించామని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను కేంద్రం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసులు వేయరేం.. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. మరి ఏపీ అక్రమ ప్రాజెక్టుల మీద ఎందుకు కేసులు వేయడం లేదని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తయి కేసీఆర్‌కు మంచి పేరు వస్తే ఎలాగనే దురుద్దేశంతోనే కాంగ్రెస్, బీజేపీ స్పందించడం లేదని ఆరోపించారు. నదీ జలాలు, ఉద్యోగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలకు కాంగ్రెస్‌దే బాధ్యత అని విమర్శించారు. -
అంబులెన్స్‌లను ఆపడం విజ్ఞతేనా?
హైదరాబాద్, చుట్టుపక్కల కాని, తెలంగాణ వ్యాప్తంగా స్థిరపడ్డ ఆంధ్రా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నేతలు కాని పలుమార్లు చెబుతుంటారు. ఆంధ్రా ప్రజలకు పెద్దగా ఇబ్బందులు రాకపోయినా, ఇలా అంబులెన్స్‌లను నిలుపుదల చేయడం వంటి ఘట్టాలు జరిగినప్పుడు పాత గాయాలు గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య వైమనస్యాలు పెంచే విధంగా సరిహద్దులలో అంబులెన్స్‌లు ఆపిన తీరు ప్రభుత్వంపై అసంతృప్తికి దారి తీసింది. దానివల్ల మళ్లీ రెండు ప్రాంతాలవారి మధ్య వైషమ్యాలు పెచ్చరిల్లవచ్చు. కరోనా సంక్షోభంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, కేసీఆర్ వంటి నేతలు రాజనీతిజ్ఞతను ప్రదర్శించవలసి ఉంటుంది. ఒక నాయకుడు చేసే తప్పు ప్రజలకు ఎంత అనర్థంగా మారుతుందో చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అవుతుంది. 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి పార్లమెంటు చట్టం చేసింది. దాని ప్రకారం 2024 వరకు హైదరాబాద్ తెలంగాణతో పాటు ఏపీకి కూడా రాజధానిగా కొనసాగవచ్చు. కాని ఆ అవకాశాన్ని ఆనాటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేజేతులారా వదులుకుంది. దాని విపరిణామాలను ఆంధ్రా ప్రజలు అనుభవించవలసిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం. కరోనా సంక్షోభం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం అవుతుందని ఎవరైనా ఊహించగలరా? కరోనా బారిన పడినవారు హైదరాబాద్‌లో అయితే మరింత మంచి వైద్యం లభిస్తుందన్న నమ్మకమో, లేక వారికి ఉన్న పరిచయాల రీత్యా హైదరాబాద్ బెటర్ అనుకునో అంబులెన్స్‌ల ద్వారా ట్రీట్మెంట్ కోసం వస్తుంటే తెలంగాణ పోలీసులు వాటిని నిలుపుదల చేశారు. తెలంగాణ హైకోర్టు కూడా ఇది మంచి పద్ధతి కాదని, మానవత్వంతో వ్యవహరించాలని సూచించింది. అయినా మే 14వ తేదీన మళ్లీ తెలంగాణ పోలీసులు ఆయా సరిహద్దులలో ఏపీ అంబులెన్స్‌లను ఆపివేశారు. ఆయా చోట్ల ఏపీకి చెందిన ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడినా ప్రయోజనం దక్కలేదు. ఏపీ అధికారులు తెలంగాణ అధికారులతో సంప్రదింపులు జరుపవలసి వచ్చింది. అలాగే రాజకీయపరంగా కూడా తెలంగాణ నేతలతో ఏపీ నేతలు మాట్లాడారు. చివరికి హైకోర్టు తలుపు తడితే కానీ అంబులెన్స్‌లకు దారి వదలలేదు. హైకోర్టు వారు తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఎందుకు ఏపీ అంబులెన్స్‌లను నిలుపుదల చేస్తున్నారు? దానికి ఒకటే కారణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో అనేక ప్రైవేటు ఆస్పత్రులలో కరోనా బాధితులతో బెడ్స్ అన్నీ నిండిపోయాయి. దాంతో కొత్త పేషంట్లు వచ్చినా చేర్చుకునే పరిస్థితి కనిపిం చడం లేదు. ఏపీ వారు కాబట్టి సహజంగానే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లకపోవచ్చు. అసలే హైదరాబాద్‌లో బెడ్స్ రద్దీ ఏర్పడితే, పొరుగు రాష్ట్రాల బాధితులు కూడా ఇక్కడకే వస్తే, తెలంగాణలో కరోనా బారినపడ్డ బాధితులకు బెడ్స్ దొరకవన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన కావచ్చు. అయినప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చేవారిని అనుమతించక తప్పదు. రాష్ట్రాల సరిహద్దులను మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అలాగే మిగిలిన రాష్ట్రాలకు, ఏపీకి తేడా ఉంది. ఏపీ ప్రజలు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా వాడుకోవడానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం. మొదటి వేవ్ సమయంలో కొన్ని వేల మంది హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లారు. అప్పుడు సరిహద్దులు మూసివేయడంతో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఏపీలోకి అనుమతించారు. అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడున్న పరిస్థితి వేరు. ప్రస్తుతం అంబులెన్స్‌లనే నిరోధిస్తున్నారు. దీనివల్ల కొందరు బాధితులు అంబులెన్స్లలోనే ప్రాణాలు కోల్పోవడం వంటి దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. గతంలో సాగర్ వద్ద కూడా రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య జరిగిన తోపులాట ఆందోళన కలిగించింది. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య ఆయా సంస్థల విభజన పూర్తి కాలేదు. ఆస్తుల పంపిణీ జరగడం లేదు. వీటన్నిటికి మూలం ఏమిటి? పదేళ్ల ఉమ్మడి రాజధానిని ఎవరు, ఎందుకు వదులుకున్నారు? వీటన్నిటికీ ఒకటే కారణం కనిపిస్తుంది. 2015లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూల్చడానికి ప్రయత్నించారన్నది అప్పట్లో వచ్చిన అభియోగం. ఆ క్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని ఐదు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి టీడీపీని గెలిపించుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారు. అది ఎలాగో కేసీఆర్‌కు తెలిసిపోయింది. ఆయన తెలివిగా, వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి వచ్చిన ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పట్టుకుని అరెస్టు చేశారు. అదే తరుణంలో ఈ కేసులో చంద్రబాబుకు కూడా సంబంధం ఉందని ఒక ఆడియో సాక్ష్యం కూడా దొరికింది. దాంతో చిక్కుల్లో పడ్డ చంద్రబాబు అప్పట్లో తన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పెద్దల ద్వారా కేసీఆర్‌తో రాజీ చేయించుకున్నారు. అప్పుడు చంద్రబాబు హైదరాబాద్‌ను వీడి ఏపీకి వెళ్లిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కండిషన్ పెట్టారని అంటారు. దాంతో చంద్రబాబు రాత్రికి, రాత్రే తట్టా, బుట్టా సర్దుకుని విజయవాడ వెళ్లిపోయారు. అక్కడ ఒక్క వసతి లేకపోయినా, అతిథి గృహాలలో ఉంటూనో, ఐదు కోట్ల రూపాయల విలువైన బస్‌లో గడుపుతోనో పాలన సాగించారు. పైగా దానికి ఒక బిల్డప్ కూడా ఇచ్చారు. ఏపీ ప్రజలకు దగ్గరగా ఉండడం కోసమే ఏపీకి వెళ్లానని అబద్ధాలు ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత తాత్కాలిక నిర్మాణాలు చేసి సచివాలయాన్ని తరలించారు. ఆ రకంగా హైదరాబాద్‌పై ఏపీ ప్రజలకు ఉన్న హక్కులను వదులుకున్నారు. నిజానికి అప్పట్లో మా బోటివాళ్లం ఏపీ ప్రజలకు హైదరాబాద్‌లో విద్య, వైద్యం, ఉపాధి, నివాస హక్కులు ఉండేలా ప్రభుత్వం ప్రయత్నించాలని స్పష్టంగా వాదించేవారం. ఆ హక్కుల సంగతేమో కానీ, ఉన్న హక్కు కూడా వదులుకుని ఏపీకి వెళ్లిపోయారు. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాం. ఏపీలో సరైన సదుపాయాలు ఇంకా అభివృద్ధి కాలేదు. అదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న సదుపాయాలను ఆంధ్ర నుంచి వచ్చేవారు వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం షరతులు పెడుతోంది. ఇలా ఆయా సందర్భాలలో జరిగే పరిస్థితి రావడం బాధాకరం. హైదరాబాద్, చుట్టుపక్కల కాని, తెలంగాణ వ్యాప్తంగా స్థిరపడ్డ ఆం్ర«ధా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నేతలు కాని పలుమార్లు చెబుతుంటారు. ఆంధ్రా ప్రజలకు పెద్దగా ఇబ్బందులు రాకపోయినా, ఇలా అంబులెన్స్‌లను నిలుపుదల చేయడం వంటి ఘట్టాలు జరిగినప్పుడు పాత గాయాలు గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్లీ రెండు ప్రాంతాలవారి మధ్య వైషమ్యాలు పెచ్చరిల్ల్ల వచ్చు. అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి ఒక పరిష్కారం కనుగొని ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలి. ఇది ఆయన బాధ్యత కూడా. దానిని ఆయన విస్మరిస్తే రాజకీయంగా కూడా అది నష్టం చేస్తుంది. ఆ విషయం ఆయనకు తెలియదని అనలేం. ఉదాహరణకు 2018 శాసనసభ ఎన్నికలలో కాని, ఇటీవలి మున్సిపల్ ఎన్నికలలో కాని సెటిలర్లు మెజార్టీ టీఆర్ఎస్కే ఓటు వేశారు. ఆంధ్ర రాజకీయాల ప్రభావంతో టీడీపీతో కలిసిన కాంగ్రెస్‌కు జనం ఓట్లు వేయలేదు. అలాగే ఇటీవలి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా కూకట్ పల్లి, శేరీలింగంపల్లి, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాలలోని డివిజన్లలో టీఆర్ఎస్ అత్యధికంగా గెలిచింది. అక్కడి సెటిలర్లు టీఆర్ఎస్కు ఓటువేయడమే కారణం. ఆ విషయాలను టీఆర్ఎస్ విస్మరించరాదు. అనూహ్యంగా ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వైమనస్యాలు పెంచే విధంగా సరిహద్దులలో అంబులెన్స్‌లు ఆపిన తీరు ప్రభుత్వంపై అసంతృప్తి్తకి దారి తీసింది. కానీ చిత్రం ఏమిటంటే ప్రతిదానికీ స్పందించే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అంబులెన్స్‌లను సరిహద్దులలో ఆపడాన్ని ఖండించకపోవడం కూడా అంతా గమనించారు. ఏది ఏమైనా కరోనా సంక్షోభంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు , కేసీఆర్ వంటి నేతలు రాజనీతిజ్ఞతను ప్రదర్శించవలసి ఉంటుంది. మరోసారి ఇలాంటివి జరగరాదని ఆశిద్దాం. వ్యాసకర్త : కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
కోవాగ్జిన్ రెండో డోసుపై ప్రభుత్వం కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కోవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ నిలిపి వేయగా.. కేంద్రం నుంచి సరఫరా లేకపోవడంతో వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి వ్యాక్సినేషన్ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామన్న ఆరోగ్యశాఖ వెల్లడించింది. ( చదవండి: కరోనాకు ధైర్యమే మందు అంటూ... ) -
మరోసారి 4 లక్షలు దాటిన కేసులు, 4 వేల మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. మరోసారి దేశంలో 4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,03,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,22,96,414 కు చేరింది. గడిచిన 24గంటల్లో 4,092 మంది కోవిడ్ బాధితులు మరణిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,42,362 కు చేరింది. వైరస్ బాధితుల్లో ఇప్పటివరకు 1,83,17,404 మంది కోలుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో 37,36,648 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,186 కోవిడ్ కేసులు నమోదవడగా.. వైరస్ బాధితుల్లో 38మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 2,704 పెరిగింది. -
భూదాన్ భూముల కబ్జాపై గురి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా ఉంది. ఆక్రమణల అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూదాన భూములపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. తాజాగా అసైన్డ్, దేవాదాయ భూముల కబ్జాలు తెరపైకి రావడంతో పనిలోపనిగా భూదాన భూముల నిగ్గు తేల్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం భూముల డిజిటల్ సర్వే చేపట్టాలని భావిస్తోంది. అక్రమార్కులను గుర్తించేందుకుగాను గతంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచనలను, కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోనుంది. మరోవైపు భూదాన భూముల వివాదాలను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆచార్య వినోభాభావే స్ఫూర్తితో.. ఆచార్య వినోభాభావే స్ఫూర్తితో నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామం నుంచి భూదాన ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాలను సేకరించారు. భూస్వాముల వద్ద నుంచి భూములను దానం కింద తీసుకుని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయడం ఈ ఉద్యమం ఉద్దేశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2.51 లక్షల ఎకరాలకుపైగా భూమి భూదానోద్యమంలో జమ అయింది. పేదలకు పంపిణీ చేయగా ఇంకా అందులో 1.65 లక్షల ఎకరాలు మిగిలి ఉన్నాయి. నల్లగొండలో 28 వేలు, ఖమ్మంలో 30 వేలు, మహబూబ్‌నగర్‌లో 40 వేలు, రంగారెడ్డి జిల్లాలో 20 వేలకుపైగా ఎకరాల భూములున్నాయి. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా భూధాన భూములన్నాయని రెవెన్యూ రికార్డులు చెపుతున్నాయి. వీటిలో కొన్ని భూములను పేదలకు వ్యవసాయం, ఇండ్ల స్థలాల కోసం భూదాన బోర్డు అప్పట్లో పంపిణీ చేసింది. ఆక్రమణలు.. రియల్ దందాలు పేదలకు పంపిణీ చేయగా మిగిలిన భూములపై అక్రమార్కులు కన్నేసి వేలాది ఎకరాలను కబ్జా చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఎకరాల కొద్దీ భూములను కొందరు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. మియాపూర్ భూములు, బీబీనగర్‌లలో వేల ఎకరాల భూదాన భూములను కూడా ఇలాగే మింగేశారు. అటు సివిల్ కోర్టుల్లోనూ, ఇటు రెవెన్యూ కోర్టుల్లోనూ కేసులు వేసి ఆ భూములు తమవేనంటూ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. భూదానబోర్డు చాలా భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దానిని రద్దు చేసింది. ఈ భూములపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసింది. రికార్డులు సేకరించే పనిలో... డిజిటల్ సర్వేలో భాగంగా సర్వే నంబర్లవారీగా భూదాన భూముల లెక్క తేల్చేందుకు అవసరమైన రికార్డులన్నింటినీ సేకరించేపనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. భూదాన భూముల ఆక్రమణలపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించి వాటిని ప్రజావసరాలకు వినియోగించుకోవాలని భావిస్తోంది. సర్వే అనంతరం ఈ భూదాన భూములపై వచ్చే వివాదాలను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ట్రిబ్యునల్ ద్వారా వివాదాలన్నింటినీ పరిష్కరించి దశాబ్దాలుగా నలుగుతున్న భూదాన భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. -
కరోనా కల్లోలం : తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం
హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం కీలక నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడున్న బెడ్లకు అదనంగా, మరో 25 శాతం పెంచాలని అధికారులను ఆదేశించింది. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలెక్టివ్ ఆపరేషన్లలను వాయిదా వేసుకోవాలని సూచించింది. అదేవిధంగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా బెడ్స్ సంఖ్యని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో చేర్చేందకు ప్రత్యేక ప్రొటోకాల్ ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలందరు మాస్క్‌ను విధిగా ధరిస్తూ, సామాజిక దూరంపాటించాలని.. దీనిపై ఏమాత్రం అశ్రధ్ధ చేయోద్దని వైద్యారోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. చదవండి: కొంప ముంచిన అంత్యక్రియలు.. చనిపోయాక పాజిటీవ్.. దీంతో! -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంచడం వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అలాగే.. కొత్త ఉద్యోగ నియామకాలకు ఆటంకం కలగదన్నారు. గురువారం శాసనసభలో పెన్షన్ సవరణ బిల్లును, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును మంత్రి ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మాజీ శాసనసభ్యుల పెన్షన్‌ను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే.. అప్పర్ సీలింగ్ రూ.70 వేలుగా ఖరారు చేసినట్లు చెప్పారు. వైద్య చికిత్సల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు పెంచుతున్నట్లు మంత్రి సభకు వివరించారు. ఈ పథకాన్ని మాజీ సభ్యులతో పాటు వారి సహ చరులు కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే భాగన్న వైద్య చికిత్స సమయంలో సీలింగ్ రూ.లక్ష మాత్రమే ఉండటంతో మరింత నగదు చెల్లించాల్సి వచ్చిందని, అప్పట్లో తలెత్తిన ఇబ్బందులు పునరావృతం కాకూడదని సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ 61కి పెంపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇదివరకే నాల్గో తరగతి ఉద్యోగులకు అరవై ఏళ్లు, ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన సిబ్బందికి 65 సంవత్సరాలు, న్యాయ సిబ్బందికి 60 ఏళ్లు పదవీ విరమణ వయోపరిమితి ఉందని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో 60 ఏళ్ల వరకు ఉందన్నారు. ఉద్యోగుల సీనియార్టీని, అనుభవాన్ని వినియోగించు కునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వేతన సవరణ సంఘం కూడా ఈ మేరకు ప్రతిపాదించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మానవుని సగటు జీవిత కాలం కూడా పెరిగిందని, దీంతో ఉద్యోగులకు మరో మూడేళ్ల పాటు పనిచేసే వెసులుబాటు ఇస్తున్నామని ఆయన వివరించారు. -
తెలంగాణపై చిన్నచూపు!
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి నిధుల హామీలు పారిస్తున్నారు. తెలంగాణకు నిధులిచ్చేందుకు మాత్రం కేంద్రానికి మనసు రావడం లేదు’ అని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను ఆదుకుని, ప్రాధాన్యతా రంగాలకు నిధులు కేటాయించే విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తవుతున్నాయని, 70 దేశాల రాయబారులు ఇక్కడి జీనోమ్ వ్యాలీని సందర్శించారని.. ఇంత ప్రాముఖ్యత ఉన్న నగరానికి తగిన సహాయ, సహకారాలు అందించేందుకు కేంద్రం ముందుకు రావడం లేదేమని నిలదీశారు. బుధవారం శాసనసభలో మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల పద్దులు.. సీఎం తరఫున ప్రభుత్వ రంగసంస్థలు, ఐఅండ్ పీఆర్ పద్దులపై కేటీఆర్ సమాధానమిచ్చారు. వ్యాక్సిన్ ఇక్కడ.. బాట్లింగ్ అక్కడనా?: అంతర్జాతీయంగా మూడో వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోనే తయారవుతుండగా.. 1,200 కిలోమీటర్ల దూరంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఖసోలిలో వ్యాక్సిన్ బాట్లింగ్ను చేపడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నో విషయాల్లో దేశానికే ఆద ర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ వరదల్లో మునిగిపోతే.. కేంద్రం నుంచి అందిన సాయం సున్నా అని విమర్శించారు. ‘‘104 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా వరదల బారినపడ్డ హైదరాబాద్‌కు రూ.1,350 కోట్ల తక్షణ సాయం అందించాలని సీఎం కేసీఆర్ లేఖ రాసినా కేంద్రం నుంచి ఒక్కపైసా రాలేదు. ఐటీ, ఎయిరోస్పేస్, వ్యాక్సిన్ తయారీ రాజధానిగా ఉన్న తెలంగాణకు రూ.832 కోట్లు అందించాలని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరికి లేఖ రాస్తే.. ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదంటూ తిరుగుటపా వచ్చింది. దేశాభివృద్ధిలో హైదరాబాద్ కు ఐదు శాతం జీడీపీ వాటా ఉన్నా.. కేంద్రం ఎందుకు తోడ్పాటు అందించడం లేదు. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్.. హైదరాబాద్ ఫార్మాసిటీ, బయోటెక్‌పార్క్, మెగా టెక్స్టైల్ తదితరాలపై రాష్ట్రం మొర ఆలకించడం లేదు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై ఉలుకూ పలుకు లేదు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో రక్షణ సంస్థలు ఉన్నా కూడా.. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఎక్కడో ఉన్న బుందేల్‌ఖండ్‌కు తరలించారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పసుపు విస్తారంగా పండుతుంటే.. అక్కడ తమిళనాడులో పసుపు బోర్డు పెడతామని ఎన్నికల హామీలిస్తారు. ఇవన్నీ చూస్తుంటే అసలు కేంద్రం ఆలోచన ఏమిటో అర్థం కావడం లేదు. ఎదుగుతున్న రాష్ట్రాన్ని వేరుగా చూడటం సరికాదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 30 వరకు ఆధార్ లింకేజీ పొడిగింపు హైదరాబాద్‌లో 20వేల లీటర్ల వరకు ఉచిత నీరు పొందేందుకు ఆధార్ లింకేజీ తప్పనిసరని, దీనికి తుది గడువును వచ్చేనెల 30 వరకు పొడిగించామని కేటీఆర్ చెప్పారు. ఉచిత నీటికి సంబంధించి ఏడాదికి రూ.480 కోట్లను ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ ప్రస్తావించిన అంశాలపై ఆయన ఈ సమాధానాలు ఇచ్చారు. మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్ల పనులను 71 మున్సిపాలిటీల్లో మొదలుపెట్టగా 11 చోట్ల పూర్తయ్యాయని, మిగతా చోట్ల త్వరలో ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరానికి గత ఆరున్నరేళ్లలో వివిధ శాఖలు, పథకాలు, కార్యక్రమాల కింద మొత్తం రూ.67,149.23 కోట్లు ఖర్చుచేసినట్టు వెల్లడించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రతిపక్ష సభ్యులను ఉద్దేవించి.. ‘‘మీరు అక్కడే ఉంటారు. మేం ఇక్కడే ఉంటాం. అనుకున్నవన్నీ పూర్తి చేస్తాం. అనుమానం వద్దు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
అసలు ట్రాఫికే లేకుండా గమ్యాన్ని చేరుకోగలిగితే!
ట్రాఫిక్ చిక్కులకు దూరంగా... సీట్లు దొరకని కిక్కిరిసే ప్రయాణాలకు భిన్నంగా... అలసట అనే మాటే వినపడకుండా... కాలుష్యమనేదే లేకుండా... ఆకాశవీధిలో విహరిస్తూ... ‘కాంక్రీట్ జంగల్’ మధ్యలోంచి నిమిషాల వ్యవధిలో గమ్యం చేరుకోగలిగితే..! కలల అలలపై తేలియాడేలా నిత్యం ఈ అనుభూతి కొనసాగితే? పర్యాటక ప్రాంతాలను గగన వీక్షణం ద్వారా తిలకించగలిగితే!! విదేశాల్లోనో లేదా పర్యాటక ప్రాధాన్యతగల రాష్ట్రాల్లోనో ఉండే ఈ సౌకర్యం మనకూ అందుబాటులోకి వస్తే ఎంతటి ‘భాగ్యం’ అనుకుంటున్నారా? సరిగ్గా ఇదే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరవాసులు ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేందుకు, నగర ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ట్రాఫిక్ నరకప్రాయంగా మారిన సిటీలో మెట్రో రైలు సౌకర్యం వచ్చాక పరిస్థితి కాస్త మెరుగుపడినా కీలక సమయాల్లో మెట్రో రైళ్లు సైతం కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మరో రవాణా సాధనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే వివిధ దేశాల్లో విజయవంతంగా నడుస్తున్న రోప్‌వే మార్గాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసే దిశగా యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మూడు మార్గాల్లో రోప్‌వే మార్గాన్ని ప్రవేశపెట్టే దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. హైదరాబాద్‌లో రెండు కారిడార్లతోపాటు యాదాద్రిలో మరో కారిడార్ ఏర్పాటుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తోంది. ఈ మూడు మార్గాల్లో దాదాపు 17 కిలోమీటర్ల మేర రోప్‌వే నిర్మించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అస్సాం, గుజరాత్ గిర్నార్, తూర్పు ముంబైలోని సెవ్రీ నుంచి ఎలిఫెంటా గుహల వరకు ఉన్న రోప్‌వే మార్గాల తరçహాలోనే హైదరాబాద్‌లోనూ రోప్‌వే ఏర్పాటు చేయాలనుకుంటోంది. 50 నుంచి 150 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసే ఈ రవాణా వ్యవస్థలో ఉండే ఒక్కో క్యాబిన్లో 8 మంది ప్రయాణికులు కూర్చొనే డిజైన్‌ను పరిశీలిస్తోంది. అలాగే కేబుల్ రిలే టవర్స్‌లో 30 మంది వరకు కూర్చొనేలా కూడా ఈ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తోంది. సింగపూర్‌లో రహదారులపై ఏర్పాటు చేసిన రోప్‌వే మార్గం ఎలా ఉందనే దానిపై ఇప్పటికే అధ్యయనం చేసింది. ఏయే ప్రాంతాల్లో..? హైదరాబాదీలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు.. అంటే పర్యాటకులు ఎక్కువగా వెళ్లే ప్రాంతాల మధ్య రోప్‌వే రవాణా ఏర్పాటు చేయాలని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మెట్రో లేని మార్గమైన ఎంజీబీఎస్ నుంచి నెహ్రూ జంతు ప్రదర్శనశాల, ఖైరతాబాద్ నుంచి సచివాలయం, ప్యారడైజ్ నుంచి సచివాలయం మార్గంలో దాదాపు 12 కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సెక్రటేరియట్‌కు సమీపంలోనే హుస్సేన్‌సాగర్‌తోపాటు లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కు ఉన్నాయి. అలాగే పర్యాటకులతోపాటు భక్తులు ఎక్కువగా వెళ్లే యాదాద్రి జిల్లాలోని రాయగిరి నుంచి యాదాద్రి గుడి వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర రోప్ వేను అందుబాటులోకి తీసుకొచ్చేలా అధ్యయనం చేస్తున్నారు. -
గణతంత్రంపై కరోనా ఎఫెక్ట్.. సంబరాలు రద్దు
చెన్నై: మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం ప్రపంచంపై ఇంకా తొలగలేదు. కేసుల నమోదు కొనసాగుతుండడంతో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు మొదలైనా నిబంధనలు... తగు జాగ్రత్తలతో ప్రజలు తమ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వస్తున్న గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం పడింది. సంబరంగా కాకుండా నామమాత్రంగా వేడుకలు నిర్వహించాలని పలు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో కాకుండా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో సాదాసీదాగా గణతంత్ర వేడుకలు నిర్వహించాలనే యోచనలో ఉంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకుంది. అట్టహాసంగా వేడుకలు వద్దని.. ర్యాలీలు నిషేధమని ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొంటే కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని వేడుకలపై ఆంక్షలు విధించింది. సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండానే జెండా వందనం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలకు విద్యార్థులను దూరంగా ఉంచాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక స్వాతంత్ర్య సమరయోధులను వారి ఇళ్లకే వెళ్లి సన్మానించాలని తెలిపింది. విద్యార్థులు, వయోధికులు, ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా టీవీ, రేడియో, సోషల్ మీడియాలో గణతంత్ర వేడుకలు వీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
హైదరాబాద్‌లో ఉచితంగా 57 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఇకపై ఎక్స్ రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, రేడియాలజీ పరీక్షలు ఉచితంగా అందనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో 8 తెలంగాణ డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. లాలాపేట, శ్రీరాంనగర్, అంబర్పేట్, బార్కాస్, జంగంపేట, పానీపురా, పురానాపూల్, సీతాఫల్‌మండిల్లో ఉప ముఖ్యమంత్రి, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు. బస్తీ దవాఖానాల్లో పేదలకు ఉచిత వైద్య పరీక్షల కోసం డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పేదలు వేలాది రూపాయలు ఖర్చుచేసి వేద్యం చేయించుకునే పరిస్థితి లేదని, వారికి అందుబాటులో ఉండేలా డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారని లాలాపేట డయాగ్నొస్టిక్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆస్పత్రిలో రూ.35 కోట్లతో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 57 రకాల పరీక్షలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీరామ్‌నగర్‌లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, ఇప్పుడు కొత్తగా ఎంఆర్ఐ, ఆల్ర్టా సౌండ్, సిటీ స్కాన్ వంటి పరీక్షలు కూడా అందుబాటులోకి వస్తాయని మంత్రి కేటీఆర్ వివరించారు. డయాగ్నోస్టిక్ సెంటర్లలో మొత్తం 57 రకాల రక్త పరీక్షలను చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. డయాగ్నోస్టిక్ సెంటర్లను భవిష్యత్‌లో జిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. -
వ్యాక్సినేషన్‌పై తెలంగాణకు కేంద్రం ప్రశంస
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహిస్తోందంటూ కితాబు ఇచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువ శాతం మంది వైద్య సిబ్బంది ముందుకు వచ్చి టీకా వేయించుకోవడంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావుకు, డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డికి, వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్లకు రిజ్వీ అభినందనలు తెలిపారు. తెలంగాణలో ఈ నెల 16వ తేదీ నుంచి టీకాల పంపిణీ మొదలైంది. 16వ తేదీ తొలిరోజు 140 కేంద్రాల్లో, రెండో రోజు (18వ తేదీ) 335 కేంద్రాల్లో టీకాలు వేశారు. మూడోరోజు మంగళవారం (19వ తేదీ) 894 కేంద్రాలకు విస్తరించారు. ఈ మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,625 మందికి వ్యాక్సిన్లు వేశారు. -
దేశంలోనే తొలిసారి పాలమూరులో అబ్బురం
సాక్షి, మహబూబ్‌నగర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌లో బుధవారం జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఏరో స్పోర్ట్స్, పారా మోటార్ ఛాంపియన్ షిప్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీపడుతున్న ఈ ఉత్సవాలు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, వరల్డ్ అడ్వెంచర్స్, ఎయిర్ స్పోర్ట్స్ ఎయిర్ షో ఆధ్వర్యంలో హాట్ ఎయిర్ బెలూన్, స్కై డైవింగ్, పారా మోటార్ విన్యాసాలు జరుగుతున్నాయి. ఆకాశంలో మోటార్ పైలెట్ల విన్యాసాలు అబ్బురపరిచాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్ షో, పారామోటార్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలకు చెందినవారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆరు టాస్క్‌లలో ఈ పోటీలు జరగనున్నాయి. గతేడాది గాలిపటాల ఉత్సవాలను నిర్వహించగా ఈసారి అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించారు. అన్ని రంగాల్లో పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. త్వరలోనే అతిపెద్ద పరిశ్రమ మహబూబ్‌నగర్ జిల్లాకు రాబోతుందని ప్రకటించారు. దేశంలోనే తొలి ఏరో స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లాలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
క్షణాల్లో ఈ–పాస్‌బుక్
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత వెబ్సైట్ ద్వారానే అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులను నిర్ణయించే విషయంలో సబ్ రిజిస్ట్రార్లకు గతంలో ఉన్న విచక్షణాధికారాలను రద్దు చేసినట్లు తెలిపారు. స్లాట్‌లోని తేదీ, సమయానికి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే 5 నుంచి 7 నిమిషాల్లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఆ వెంటనే మొబైల్ ఫోన్‌కు ఈ–పాస్‌బుక్ వస్తుందని, వారం పది రోజుల్లో పోస్టు ద్వారా మెరూన్ రంగు పట్టాదారు పుస్తకం ఇంటికి వస్తుందని తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం కొత్తగా రూపొందించిన స్లాట్ బుకింగ్ విధానాన్ని శుక్రవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో ఆవిష్కరించారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పునరుద్ధరిస్తామన్నారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల అనుమతి విషయంలో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. స్లాట్ బుకింగ్ ఉంటేనే.. స్లాట్ బుక్ చేసుకుంటేనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తారని సీఎస్ స్పష్టం చేశారు. https:// registration.telangana.gov.in వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్‌లో విక్రయదారు, కొనుగోలుదారు, ఆస్తికి సంబంధించిన వివరాలతో పాటు ఆస్తికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్ (పీటిన్) ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పీటిన్ లేని వారు ఇదే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రెండ్రోజుల్లోగా వారి మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో జారీ అవుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నంబర్ తప్పనిసరి కాదని, అయితే ఆధార్ నంబర్ ఇచ్చిన వారికి తక్షణ రిజిస్ట్రేషన్, తక్షణ మ్యూటేషన్ సేవలు లభిస్తాయని పేర్కొన్నారు. ఆధార్ నంబర్ ఇవ్వని వారికి ప్రత్యేక ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారని, దీనికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఆధార్ ఉంటే ఆస్తి యజమాని గుర్తింపు నిర్ధారణ సులువు అవుతుందని, మోసాలకు తావుండదని పేర్కొన్నారు. చలాన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు.. రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన ఫీజులు, డ్యూటీల మొత్తానికి సంబంధించిన చలాన్‌ను ఆటోమెటిక్‌గా సిస్టం జనరేట్ చేస్తుందని సీఎస్ చెప్పారు. రిజిస్ట్రేషన్ల కోసం స్టాంప్ పేపర్, బాండ్ పేపర్లు కొనాల్సిన అవసరం లేదని, చలాన్లో పేర్కొన్న ఫీజు చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. చలాన్‌ను తీసుకెళ్లి ఏదైనా ఎస్బీఐ శాఖలో ఫీజు చెల్లించాలని చెప్పారు. ఆన్లైన్ బ్యాకింగ్ ద్వారా కూడా తక్షణమే చెల్లించొచ్చన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడికి వెళ్లాలి? ఎంత మంది సాకు‡్ష్యలను తీసుకెళ్లాలి? ఏమేం తీసుకెళ్లాలన్న వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో దరఖాస్తుదారులకు వస్తుందని చెప్పారు. డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేకుండానే సొంతంగా దస్తావేజు రాసుకునేందుకు వీలుగా వెబ్సైట్లో నమూనా దస్తావేజులు (టెంప్లెట్లు) అందుబాటులో ఉంచామన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్ సైతం పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. ఒక్కో స్లాట్‌కు 15 నిమిషాల చొప్పున ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌కు రోజుకు 24 స్లాట్ల రిజిస్ట్రేషన్లను కేటాయించామన్నారు. త్వరలో ఈ సంఖ్యను అవసరం మేరకు 48 నుంచి 100కు పెంచుతామన్నారు. అవసరమున్న చోట ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు డీటీపీ ఆపరేటర్లను నియమిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల డేటా భద్రతకు హైకోర్టు చేసిన సూచనలను తప్పకుండా పాటిస్తున్నామని చెప్పారు. ఎక్కడా డేటా లీక్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వివరించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అనుమానాలుంటే రిజిస్ట్రేషన్ల శాఖ ఐటీ కార్యాలయం టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 4788కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. ధరణిలో పెండింగ్ మ్యూటేషన్లకు అవకాశం.. పెండింగ్ మ్యూటేషన్లు పూర్తి చేసేందుకు ధరణి పోర్టల్‌లో అవకాశం కల్పించామని సీఎస్ తెలిపారు. 16,110 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో 1.24 కోట్ల క్లిక్కులు, 74 వేల స్లాట్ బుకింగ్‌లు, 55,216 లావాదేవీలు జరిగాయని సీఎస్ వెల్లడించారు. పోర్టల్‌కు ట్రాఫిక్ విపరీతంగా పెరగడం వల్ల సర్వర్ స్తంభించగా, వెంటనే పునరుద్ధరించామన్నారు. తొలిరోజే రూ.85 లక్షల ఆదాయం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజైన శుక్రవారం సాయంత్రం నాటికి 37 స్లాట్లు బుక్ కాగా, రూ.85 లక్షలు ఫీజులు, సుంకాల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 17,567 మంది సైట్‌ను సందర్శించగా, 3,987 వినియోగదారులు సైట్లో తమ పేరున ఖాతాలే రిజిస్టర్ చేసుకున్నారు. 4,143 లావాదేవీలకు శ్రీకారం చుట్టారు. మీ–సేవ కేంద్రాల ద్వారా కూడా రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చని సీఎస్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బిల్డర్లు, డెవలపర్లు ఒకేసారి బల్క్‌గా అన్ని ఆస్తులనూ అప్లోడ్ చేసేందుకు సైట్లో కొత్త విండో సదుపాయం కల్పించారు. 451 మంది బిల్డర్లు, డెవలపర్లు 93,874 ఆస్తులను అప్లోడ్ చేశారు. 12,699 ఆస్తులకు సంబంధించిన పీటిన్లను స్థానిక సంస్థలు జారీ చేశాయి. ప్రస్తుతం చేపడుతున్న రిజిస్ట్రేషన్లు ఇవే.. సేల్ కేటగిరీ కింద సేల్ డీడ్, సేల్ అగ్రిమెంట్ వితౌట్ పొసెషన్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, మార్టగేజ్ కేటగిరీ కింద మార్టగేజ్ వితౌట్ పొసెషన్, మార్టగేజ్ విత్ పొసెషన్, మెమోరాండంఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్, గిఫ్ట్ కేటగిరీ కింద గిఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిలేటివ్ తదితర రిజిస్ట్రేషన్ సేవలను పునరుద్ధరించారు. 97 శాతం రిజిస్ట్రేషన్లు ఈ కేటగిరీకి సంబంధించినవే ఉంటాయని సీఎస్ తెలిపారు. క్రమంగా మిగిలిన రిజిస్ట్రేషన్ సేవలను సైతం పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. -
ఎల్ఆర్ఎస్ గడువు 31 వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో పలుచోట్ల విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్కు అంతరాయం కలగడంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారని, ఈ నేపథ్యంలో గడువు పొడిగిం చాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. సీఎం కేసీఆర్.. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లితో సమీక్షించి దరఖాస్తుల గడువు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఎల్ఆర్ ఎస్‌కు సంబంధించి గురువారం రాత్రి 9 గంటల వరకు 19.33 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో చివరి రోజే గురువారం 2.53 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అక్రమ, అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను తప్పనిసరి చేస్తూ ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణ చేయించుకోకుంటే, సదరు అక్రమ ప్లాట్ల తదుపరి క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్ జరపబోమని, ఇళ్ల నిర్మాణ అనుమతులు సైతం జారీ చేయబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో 45 రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 19.33 లక్షల దరఖాస్తులు రాగా, గురువారం అర్ధరాత్రికి ఈ సంఖ్య 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గడువు పొడిగింపు ఉత్తర్వులు శుక్రవారం వెలువడే అవకాశం ఉంది. (చదవండి: కానిస్టేబుళ్లకు కమిషనర్ సెల్యూట్!)