హైదరాబాద్, చుట్టుపక్కల కాని, తెలంగాణ వ్యాప్తంగా స్థిరపడ్డ ఆంధ్రా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కేసీఆర్ కానీ టీఆర్‌ఎస్ నేతలు కాని పలుమార్లు చెబుతుంటారు. ఆంధ్రా ప్రజలకు పెద్దగా ఇబ్బందులు రాకపోయినా, ఇలా అంబులెన్స్‌లను నిలుపుదల చేయడం వంటి ఘట్టాలు జరిగినప్పుడు పాత గాయాలు గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య వైమనస్యాలు పెంచే విధంగా సరిహద్దులలో అంబులెన్స్‌లు ఆపిన తీరు ప్రభుత్వంపై అసంతృప్తికి దారి తీసింది. దానివల్ల మళ్లీ రెండు ప్రాంతాలవారి మధ్య వైషమ్యాలు పెచ్చరిల్లవచ్చు. కరోనా సంక్షోభంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, కేసీఆర్ వంటి నేతలు రాజనీతిజ్ఞతను ప్రదర్శించవలసి ఉంటుంది.
ఒక నాయకుడు చేసే తప్పు ప్రజలకు ఎంత అనర్థంగా మారుతుందో చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అవుతుంది. 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి పార్లమెంటు చట్టం చేసింది. దాని ప్రకారం 2024 వరకు హైదరాబాద్ తెలంగాణతో పాటు ఏపీకి కూడా రాజధానిగా కొనసాగవచ్చు. కాని ఆ అవకాశాన్ని ఆనాటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేజేతులారా వదులుకుంది. దాని విపరిణామాలను ఆంధ్రా ప్రజలు అనుభవించవలసిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం. కరోనా సంక్షోభం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం అవుతుందని ఎవరైనా ఊహించగలరా? కరోనా బారిన పడినవారు హైదరాబాద్‌లో అయితే మరింత మంచి వైద్యం లభిస్తుందన్న నమ్మకమో, లేక వారికి ఉన్న పరిచయాల రీత్యా హైదరాబాద్ బెటర్ అనుకునో అంబులెన్స్‌ల ద్వారా ట్రీట్‌మెంట్ కోసం వస్తుంటే తెలంగాణ పోలీసులు వాటిని నిలుపుదల చేశారు. తెలంగాణ హైకోర్టు కూడా ఇది మంచి పద్ధతి కాదని, మానవత్వంతో వ్యవహరించాలని సూచించింది. అయినా మే 14వ తేదీన మళ్లీ తెలంగాణ పోలీసులు ఆయా సరిహద్దులలో ఏపీ అంబులెన్స్‌లను ఆపివేశారు. ఆయా చోట్ల ఏపీకి చెందిన ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడినా ప్రయోజనం దక్కలేదు. ఏపీ అధికారులు తెలంగాణ అధికారులతో సంప్రదింపులు జరుపవలసి వచ్చింది. అలాగే రాజకీయపరంగా కూడా తెలంగాణ నేతలతో ఏపీ నేతలు మాట్లాడారు. చివరికి హైకోర్టు తలుపు తడితే కానీ అంబులెన్స్‌లకు దారి వదలలేదు. హైకోర్టు వారు తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఎందుకు ఏపీ అంబులెన్స్‌లను నిలుపుదల చేస్తున్నారు?
దానికి ఒకటే కారణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో అనేక ప్రైవేటు ఆస్పత్రులలో కరోనా బాధితులతో బెడ్స్ అన్నీ నిండిపోయాయి. దాంతో కొత్త పేషంట్లు వచ్చినా చేర్చుకునే పరిస్థితి కనిపిం చడం లేదు. ఏపీ వారు కాబట్టి సహజంగానే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లకపోవచ్చు. అసలే హైదరాబాద్‌లో బెడ్స్ రద్దీ ఏర్పడితే, పొరుగు రాష్ట్రాల బాధితులు కూడా ఇక్కడకే వస్తే, తెలంగాణలో కరోనా బారినపడ్డ బాధితులకు బెడ్స్ దొరకవన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన కావచ్చు. అయినప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చేవారిని అనుమతించక తప్పదు. రాష్ట్రాల సరిహద్దులను మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అలాగే మిగిలిన రాష్ట్రాలకు, ఏపీకి తేడా ఉంది. ఏపీ ప్రజలు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా వాడుకోవడానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం. మొదటి వేవ్ సమయంలో కొన్ని వేల మంది హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లారు. అప్పుడు సరిహద్దులు మూసివేయడంతో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఏపీలోకి అనుమతించారు. అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడున్న పరిస్థితి వేరు. ప్రస్తుతం అంబులెన్స్‌లనే నిరోధిస్తున్నారు. దీనివల్ల కొందరు బాధితులు అంబులెన్స్‌లలోనే ప్రాణాలు కోల్పోవడం వంటి దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. గతంలో సాగర్ వద్ద కూడా రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య జరిగిన తోపులాట ఆందోళన కలిగించింది. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య ఆయా సంస్థల విభజన పూర్తి కాలేదు. ఆస్తుల పంపిణీ జరగడం లేదు. వీటన్నిటికి మూలం ఏమిటి? పదేళ్ల ఉమ్మడి రాజధానిని ఎవరు, ఎందుకు వదులుకున్నారు?
వీటన్నిటికీ ఒకటే కారణం కనిపిస్తుంది. 2015లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూల్చడానికి ప్రయత్నించారన్నది అప్పట్లో వచ్చిన అభియోగం. ఆ క్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని ఐదు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి టీడీపీని గెలిపించుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారు. అది ఎలాగో కేసీఆర్‌కు తెలిసిపోయింది. ఆయన తెలివిగా, వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి వచ్చిన ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పట్టుకుని అరెస్టు చేశారు. అదే తరుణంలో ఈ కేసులో చంద్రబాబుకు కూడా సంబంధం ఉందని ఒక ఆడియో సాక్ష్యం కూడా దొరికింది. దాంతో చిక్కుల్లో పడ్డ చంద్రబాబు అప్పట్లో తన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పెద్దల ద్వారా కేసీఆర్‌తో రాజీ చేయించుకున్నారు. అప్పుడు చంద్రబాబు హైదరాబాద్‌ను వీడి ఏపీకి వెళ్లిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కండిషన్ పెట్టారని అంటారు.
దాంతో చంద్రబాబు రాత్రికి, రాత్రే తట్టా, బుట్టా సర్దుకుని విజయవాడ వెళ్లిపోయారు. అక్కడ ఒక్క వసతి లేకపోయినా, అతిథి గృహాలలో ఉంటూనో, ఐదు కోట్ల రూపాయల విలువైన బస్‌లో గడుపుతోనో పాలన సాగించారు. పైగా దానికి ఒక బిల్డప్ కూడా ఇచ్చారు. ఏపీ ప్రజలకు దగ్గరగా ఉండడం కోసమే ఏపీకి వెళ్లానని అబద్ధాలు ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత తాత్కాలిక నిర్మాణాలు చేసి సచివాలయాన్ని తరలించారు. ఆ రకంగా హైదరాబాద్‌పై ఏపీ ప్రజలకు ఉన్న హక్కులను వదులుకున్నారు. నిజానికి అప్పట్లో మా బోటివాళ్లం ఏపీ ప్రజలకు హైదరాబాద్‌లో విద్య, వైద్యం, ఉపాధి, నివాస హక్కులు ఉండేలా ప్రభుత్వం ప్రయత్నించాలని స్పష్టంగా వాదించేవారం. ఆ హక్కుల సంగతేమో కానీ, ఉన్న హక్కు కూడా వదులుకుని ఏపీకి వెళ్లిపోయారు.
ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాం. ఏపీలో సరైన సదుపాయాలు ఇంకా అభివృద్ధి కాలేదు. అదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న సదుపాయాలను ఆంధ్ర నుంచి వచ్చేవారు వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం షరతులు పెడుతోంది. ఇలా ఆయా సందర్భాలలో జరిగే పరిస్థితి రావడం బాధాకరం. హైదరాబాద్, చుట్టుపక్కల కాని, తెలంగాణ వ్యాప్తంగా స్థిరపడ్డ ఆం్ర«ధా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కేసీఆర్ కానీ టీఆర్‌ఎస్ నేతలు కాని పలుమార్లు చెబుతుంటారు. ఆంధ్రా ప్రజలకు పెద్దగా ఇబ్బందులు రాకపోయినా, ఇలా అంబులెన్స్‌లను నిలుపుదల చేయడం వంటి ఘట్టాలు జరిగినప్పుడు పాత గాయాలు గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్లీ రెండు ప్రాంతాలవారి మధ్య వైషమ్యాలు పెచ్చరిల్ల్ల వచ్చు.
అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి ఒక పరిష్కారం కనుగొని ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలి. ఇది ఆయన బాధ్యత కూడా. దానిని ఆయన విస్మరిస్తే రాజకీయంగా కూడా అది నష్టం చేస్తుంది. ఆ విషయం ఆయనకు తెలియదని అనలేం. ఉదాహరణకు 2018 శాసనసభ ఎన్నికలలో కాని, ఇటీవలి మున్సిపల్ ఎన్నికలలో కాని సెటిలర్లు మెజార్టీ టీఆర్‌ఎస్‌కే ఓటు వేశారు. ఆంధ్ర రాజకీయాల ప్రభావంతో టీడీపీతో కలిసిన కాంగ్రెస్‌కు జనం ఓట్లు వేయలేదు. అలాగే ఇటీవలి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా కూకట్ పల్లి, శేరీలింగంపల్లి, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాలలోని డివిజన్‌లలో టీఆర్‌ఎస్ అత్యధికంగా గెలిచింది. అక్కడి సెటిలర్లు టీఆర్‌ఎస్‌కు ఓటువేయడమే కారణం. ఆ విషయాలను టీఆర్‌ఎస్ విస్మరించరాదు. అనూహ్యంగా ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వైమనస్యాలు పెంచే విధంగా సరిహద్దులలో అంబులెన్స్‌లు ఆపిన తీరు ప్రభుత్వంపై అసంతృప్తి్తకి దారి తీసింది. కానీ చిత్రం ఏమిటంటే ప్రతిదానికీ స్పందించే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అంబులెన్స్‌లను సరిహద్దులలో ఆపడాన్ని ఖండించకపోవడం కూడా అంతా గమనించారు. ఏది ఏమైనా కరోనా సంక్షోభంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు , కేసీఆర్ వంటి నేతలు రాజనీతిజ్ఞతను ప్రదర్శించవలసి ఉంటుంది. మరోసారి ఇలాంటివి జరగరాదని ఆశిద్దాం.
వ్యాసకర్త : కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
అంబులెన్స్‌లను ఆపడం విజ్ఞతేనా?
Published Wed, May 19 2021 12:07 AM | Last Updated on Wed, May 19 2021 12:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment