తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు జర్నలిస్టుగా నాది ఒక సవాల్... ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో చేస్తున్న వాగ్దానాల అమలుకు ఎంత వ్యయం అవుతుందో లెక్కగట్టి, ఆ నిధులు ఎక్కడ నుంచి తెస్తారో గణాంకాలతో సంతృప్తికరంగా చెప్పగలిగితే నేను ఆయనపై ఆర్టికల్స్ రాయడం మానేస్తాను. అలా కాని పక్షంలో మరోసారి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు సిద్ధం అవుతున్నారని భావించవలసి వస్తుంది. ఎందుకంటే జగన్ అమలు చేస్తున్న వివిధ పథకాలతో రాష్ట్రం నాశనం అయిపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తాము కూడా సంక్షేమ కార్య క్రమాలను అమలు చేస్తామనీ, జగన్ ఇస్తున్న దానికన్నా మూడు, నాలుగు రెట్లు అధికంగా ఇస్తామని చెబుతున్నారు.
‘అమ్మ ఒడి’ స్కీముకు జగన్ ఇంటికి ఒకరికి పదిహేను వేలు ఇస్తుంటే, తాను ఎందరు పిల్లలు ఉన్నా... ఒక్కొక్కరికి పది హేనువేల చొప్పున ఇస్తానంటున్నారు. ప్రతి కుటుంబంలోని మహిళలకు రూ. 1500 చొప్పున డబ్బు ఇస్తారట. ఈ స్కీము ఒక్కదానికే 37 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఒక అంచనా. రైతులకు 20 వేల చొప్పున ఇస్తారట. ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అట. నిరుద్యోగులకు భృతిగా మూడు వేల చొప్పున ఇస్తారట. ఇవి కాకుండా వృద్ధాప్య పెన్ష న్‌లు ఉండనే ఉన్నాయి. ఎన్నికల నాటికి మరికొన్ని ప్రకటిస్తారట. వీటన్నిటినీ అమలు చేస్తారంటే విజ్ఞులైనవారు ఎవరైనా నమ్ము తారా? అసలు అవి నమ్మశక్యం ఎలా అన్నది మాత్రం చంద్ర బాబు ఎందుకు వివరించడం లేదు?.
✍️ పవన్ కల్యాణ్ అంటే ఆయనకు పెద్దగా చదువు లేదు, పాలన అనుభవం లేదు కనుక ఏదో ఒకటి చెబుతున్నారులే అని సరిపెట్టుకోవచ్చు. కాని పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న మనిషి వచ్చే సాధారణ ఎన్నికల కోసం చేస్తున్న గాలి వాగ్దానాలు చేస్తుంటే, వాటికి ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారంటీ’ అని పేరు పెట్టడం గమనిస్తుంటే ఈయన అనుభవం అంతా ప్రజలను మోసం చేయడానికేనా అన్న అనుమానం వస్తుంది. ఆయనకు ‘ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5’ వంటి మీడియా సంస్థలు మద్దతు ఇస్తూ ఊదర గొట్టవచ్చు. అంత మాత్రాన ప్రజలంతా ఆ హామీలను నమ్ము తారనుకుంటే పొరపాటు. ఎందుకంటే..
2014 ఎన్నికలలో రైతుల రుణాలన్నిటినీ, రైతుల భార్యల మెడలలోని బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన రుణాలతో సహా అన్నిటినీ మాఫీ చేస్తానని చెప్పినప్పుడు నాబోటి వాళ్లం అదెలా సాధ్యమని అడిగేవారం. దానికి చంద్ర బాబు ఆర్థిక సలహాదారు కుటుంబరావు వంటివారు... ‘అబ్బో మా చంద్రబాబుకు చాలా అనుభవం ఉంది, ఆయన చేసి చూపి స్తారు’ అని బొల్లేవారు. తీరా ప్రభుత్వం వచ్చాక మొత్తం రక రకాల కమిటీలు వేసి రైతుల రుణాలు మొత్తం కాకుండా లక్షన్నరకు పరిమితం అన్నారు. దానినైనా ఇవ్వగలిగారా అంటే అదీ చేయలేకపోయారు. ఏవో బాండ్లు అన్నారు. వాయిదాలు అన్నారు. కేంద్రం సహకరించడం లేదనీ, రిజర్వు బ్యాంక్ అంగీ కరించడం లేదనీ ఏవేవో చెప్పి జనాన్ని మోసం చేశారన్న విమర్శకు గురయ్యారు.
✍️ రైతుల రుణాలతో పాటు డ్వాక్రా మహిళల రుణాల విషయంలోనూ అంతే చేశారు. ఇవే కాదు. టీడీపీ మానిఫెస్టోలో సుమారు 400 హామీలు ఇచ్చి వాటిని అమలు చేసే పరిస్థితి లేక, చివరికి పార్టీ వెబ్ సైట్ నుంచి దానిని తీసేశారు. అంతకుముందు 1995 నుంచి చేసిన తొమ్మిదేళ్ల పాలనలో కూడా అలాగే చేశారు. మద్య నిషేధం అమలు చేస్తాననీ, కిలో బియ్యం రెండు రూపా యలకే ఇస్తాననీ ఇలా పలు హామీలు ఇచ్చిన ఆయన ఆ తర్వాత వాటన్నింటికీ మంగళం పాడారు.
✍️ మళ్లీ 2024 ఎన్నికలలో అలాగే ప్రజలను మభ్య పెట్టడానికి ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో టీడీపీ గెలిస్తే ప్రజలకు ఎవరెవరికి ఎంత మొత్తం వస్తుందో చెబుతూ బాండ్లు కూడా ఇస్తారట. ప్రభుత్వపరంగా ఇచ్చిన బాండ్లకే దిక్కు లేక పోతే, పార్టీ పరంగా ఇంటింటికి తిరిగి ఇచ్చే బాండ్లకు ఏమి గ్యారంటీ ఉంటుంది? ఎందుకంటే చంద్రబాబు చేస్తున్న తాజా వాగ్దానాలకు ఏడాదికి సుమారు లక్షన్నర కోట్లు అవసరం కావచ్చు. జగన్ ఇస్తున్న దానికన్నా మూడురెట్లు అధికంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని అంటున్నారు. దీనిని బట్టి ఆ హామీల ఖర్చును అంచనా వేయవచ్చు.
✍️ జగన్ అమలు చేస్తున్న అన్ని హామీల విలువ సుమారు 45 వేల కోట్లు ఉంటుందని ఒక లెక్క. దీనికే రాష్ట్రం అప్పుల పాలైపోయిందనీ, నాశనం అయిపోయిందనీ చంద్రబాబు ప్రచారం చేశారు. మరి కొత్తగా బాబు ఇస్తున్న హామీలను నెరవేర్చడానికి ఏటా లక్షన్నర కోట్ల నిధులు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు సమకూర్చుకోవాలి కదా! అవి ఎక్కడ నుంచి వస్తాయో చెప్పాలి కదా! అప్పుడు అప్పులు ఏ మేరకు చేయవలసి ఉంటుందో ప్రజలకు వివరించాలి కదా! వాటిని ఎలా తీర్చవచ్చో తెలపాలి కదా! అవేవీ చేయకుండా బాండ్లు రాసిస్తామంటే జనం ఎలా నమ్మాలి. సంక్షేమ పథకాలకు పోను మిగిలిన ఖర్చులకు ఎక్కడ నుంచి డబ్బు వస్తుంది? అప్పుడు రాష్ట్రం నాశనం కాకుండా ఉంటుందని ఎలా హామీ ఇవ్వగలరు? ఇవన్నీ ప్రజలను మోసం చేయడానికే.
✍️ విజ్ఞులైన ప్రజలు వీటి గురించి ఆలోచించకపోతే పెద్ద ప్రమాదం కాదు.. కాదు.. పెను సంక్షోభంలో పడతారని చెప్పడమే ఒక జర్నలిస్టుగా నా లక్ష్యం. సంక్షేమ పథకాల విషయంలో జగన్‌ను కాపీ కొట్టి నట్లుగానే, ఇప్పుడు ఇంటింటికి తిరిగి ప్రజలకు వారి హామీలు వివరిస్తూ ఒక్కొక్కరికి ఎంత లబ్ధి చేకూరుతుందో చెప్పడం కూడా కాపీనే. జగన్ గడప గడపకు అధికారిక కార్యక్రమం నిర్వహించి ప్రతి ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందీ వారికి పత్రాలు ఇప్పించారు. టీడీపీ నేతలు అదే రీతిలో భవిష్యత్తుకు గ్యారంటీ అని పత్రాలు ఇస్తారట.
ప్రజలను మభ్యపెట్టాలన్నది వారి తాపత్రయం. తెలుగు దేశంలో పిచ్చి ఎంతవరకు వెళ్లిందంటే చంద్రయాన్ 3 సఫలం అయిందనీ, అలాగే ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తారనీ చెప్పేంతవరకు! ఇలాంటివారిని ఎన్నుకుంటే ప్రజలకు దక్కేది చందమామ కథలే. నా ఛాలెంజ్‌ను చంద్రబాబు గానీ, ఆయన తరఫున ఎవరైనా గానీ స్వీకరిస్తారా?.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment