
సాధారణంగా శాసనసభలో లేని వ్యక్తుల గురించి ఏవైనా ఆరోపణలు,విమర్శలు చేయడం సమంజసం కాదన్నది సంప్రదాయం. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా అలా మాట్లాడితే స్పీకర్ స్థానంలో ఉన్నవారు వారిస్తుంటారు. కాని స్వయంగా ముఖ్యమంత్రే అలా మాట్లాడితే ఏమి చేస్తారు! ఎపి శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ గురించి చేస్తున్న విమర్శలు అసంబద్దంగా ,అసందర్భంగా ఉంటున్నాయి.
కారణం ఏమైనా సభలో జగన్ లేనప్పుడు ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి చంద్రబాబు సభా సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తుంది. తాము ఎన్నికల సమయంలో చేసిన సూపర్ సిక్స్ తో పాటు మరో 143 హామీల అమలు గురించి కన్నా జగన్ పైనే ఆరోపణలు చేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. మహిళా సాధికారిత గురించి ఆయన సభలో ప్రసంగం చేసినప్పుడు ఏ అంశాల గురించి చెప్పాలి? తాము ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల గురించి కదా!వాటిని పక్కనబెట్టి కొత్త హామీలు ఇస్తూ కధ నడిపడమే కాకుండా ,జగన్ ఆడబిడ్డల ద్రోహానికి పాల్పడ్డారని ,అదో కేస్ స్టడీ అని చెబుతున్నారంటే ప్రజలు విస్తుపోవడం తప్ప చేయగలిగింది ఏముంది?
చంద్రబాబు నాయుడు మహిళలకు ఏఏ హామీలు ఇచ్చారు? వాటిలో ఎన్నిటిని అమలు చేశారో అంశాలవారిగా లెక్కలు చెబితే అది ఆడబిడ్డలకు మేలు చేసినట్లు అవుతుంది .అలాకాకుండా అసలు ఆ అంశాలనే ప్రస్తావించకుండా జగన్ పైనో, మరొకరిపైనో ఆరోపణలు చేస్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది. అది చంద్రబాబు ప్రభుత్వం ఆడబిడ్డలకు ద్రోహం చేసినట్లు కాదా!ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తకుండా ఎగవేయడం ద్రోహం అవుతుందా? కాదా?
కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంతమంది మహిళలు అఘాయిత్యాలకు గురయ్యారో వివరించి, వాటిని అరికట్టడానికి ఏమి చర్య తీసుకుంటున్నారో చెప్పాలి కదా?అవన్ని ఎందుకు !ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో సుగాలి ప్రీతి అంటూ గొంతు చించుకుని మాట్లాడేవారు కదా! ఆ కేసు గురించి ఎన్నడైనా చంద్రబాబు మాట్లాడారా? పవన్ మాట నిలబెట్టుకున్నారా?దానిని ద్రోహం అంటారా?అనరా?ప్రతి ముఖ్యమైన పండగకు మహిళలకు కానుకలు ఇస్తామని ప్రకటించారు కదా?ఈ ఏడాది కాలంలో పండగలు రాలేదా!అయినా ఏ ఒక్క మహిళకైనా కానుకలు అందాయా?పెళ్లికానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారే!మహిళలు ఎవరికైనా అందచేశారా?వలంటీర్లకు పదివేల వేతనం ఇస్తామని చెప్పి,అసలుకే ఎసరు పెట్టారు కదా!
ఆ వలంటీర్లలో లక్షమందికి పైగా మహిళలుఉన్నారు కదా!వారికి ఇచ్చిన సాధికారిత ఇదేనా!ఆర్డిసి బస్ లలో ఉచిత ప్రయాణం హామీ ఇచ్చారు కదా!దానికి బడ్జెట్ లో ఒక్క రూపాయి అయినా పెట్టారా?తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి 15వేలు ఇచ్చే వాగ్దానం ఒక ఏడాదిపాటు అతీగతీ లేదే!వచ్చే ఏడాది ఏ మేరకు ఇస్తారో తెలియదు.ఆ తల్లికి ఆ డబ్బు ద్వారా సాధికారిత వచ్చేది కదా!జగన్ తాను మహిళలకు ఇచ్చిన హామీలన్ని దాదాపు అమలు చేశారే.అన్ని స్కీమ్ లు మహిళల పేరిటే ఇచ్చారు కదా!అమ్మ ఒడి, 31 లక్షల ఇళ్ల పట్టాలు, చేయూత,ఆసరా,కాపు నేస్తం , ఆర్ధికంగా బలహీనవర్గాల నేస్తం..ఇలా ఆయా స్కీములలో డబ్బులు ఇచ్చారే.చేయూత కింద మహిళలకు 18500 రూపాయల చొప్పున ఆర్దిక సాయం చేసి,వారితో వ్యాపారాలు పెట్టించి, రిలయన్స్, ఐటిసి తదితర ప్రముఖ సంస్థలతో టై అప్ చేశారే.
మహిళల భద్రతకు దిశ యాప్ తెచ్చారే.ఇప్పుడు అదే యాప్ ను పేరు మార్చి చంద్రబాబు వాడుతున్నారా?లేదా?ఇన్ని చేసిన జగన్ ఆడబిడ్డల ద్రోహి అవుతారా?లేక చేసిన బాసలకు మంగళం పలుకుతున్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు ద్రోహి అవుతారా అన్న ప్రశ్న వస్తే ఏమి జవాబు ఇస్తాం. ఇవన్ని వదలివేసి జగన్ కుటుంబంలో ఏదో జరిగిందని,తల్లికి ,చెల్లికి న్యాయం చేయలేదంటూ అసత్య ఆరపణలు చేయడం ఎంతమేర సమంజసం.చెల్లికి 200 కోట్ల మేర డివిడెండ్ల రూపంలో చెల్లించిన జగన్ ద్రోహం చేసినట్లు ఎలా అవుతుందో చంద్రబాబే చెప్పాలి. పోనీ తన తోబుట్టువులకు చంద్రబాబు ఏ విధంగా సాయం చేసింది చెప్పి ఉంటే బాగుండేది కదా!
చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రతిగా వైఎస్సార్‌సీపీ స్పందిస్తూ పలు ప్రశ్నలు వేసింది.హైదరాబాద్ లో ఇతర చోట్ల చంద్రబాబు కుటుంబానికి ఉన్న వందల కోట్ల ఆస్తులలో తన తోబుట్టువులకు ఎంత ఇచ్చారని అడిగింది.తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుటుంబానికి ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించింది. తనతల్లి పేరు మీద ఉన్న మదీనగూడ భూమిలో వారికి వాటా ఇవ్వకుండా లోకేష్ ఒక్కరి పేరు మీదే ఎందుకు మార్పించింది వాస్తవం కాదా అని అప్రశ్నించింది.ముందుగా తన ఇంటిలో సమన్యాయం పాటించకుండా ఇంకొకరి ఇంటి వ్యవహారాన్ని ప్రస్తావించడం అన్యాయం కాదా అని వైఎస్సార్‌సీపీవ్యాఖ్యానించింది. డ్వాక్రా మహిళలకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటనలు కూడా ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియదు.
కొద్ది రోజుల క్రితం ఏడాదికి లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని అన్నారు.తాజాగా ఆ సంఖ్యను లక్షా డెబ్బైఐదువేలకు పెంచారు. డ్వాక్రా మహిళలకు 65వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని,అందులో సగం పెట్టుబడి తీసుకురాగలిగితే ఆరువేల కోట్ల లాభాలు వచ్చేస్తాయని కూడా ఆయన ఊరించారు. డీ లిమిటేషన్ జరిగితే భవిష్యత్తులో శాసనసభలో 75 మంది మహిళలకు అవకాశం రావచ్చని ఆయన అన్నారు. డి లిమిటేషన్ లో ఎపికి కూడా నష్టం జరుగుతుంందని అంతా వాపోతుంటే, దాని గురించి మాట్లాడకుండా మహిళలకు సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనండని ఆయన ప్రచారం చేస్తున్నారు.కాని తద్వారా ఎదురయ్యే సమస్యల గురించి వివరించి, వాటిని అధిగమించడానికి ఏమి చేయాలో చెప్పరు. మహిళలకు తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చి తద్వారా సాధికారిత తెచ్చామని చెబితే ఎవరైనా నమ్ముతారు కాని, ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేసి అంతా అయిపోయినట్లు భ్రమలో పెట్టాలని అనుకుంటే ఏమి ప్రయోజనం ?
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment