
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరలేపిన కొత్త డ్రామా ఆసక్తికరంగా ఉంది. దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాల సందర్శన పేరుతో ఆయన చేస్తున్న యాత్ర భక్తితో చేస్తున్నదా?లేక రాజకీయ ఉద్దేశాలతోనా అన్న చర్చ జోరుగా నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగా పవన్ యాత్ర సాగుతోందా? లేక చంద్రబాబు ముందు తన ప్రాధాన్యతను నిరూపించుకునేందుకు ఆయన చేస్తున్నారా? అని కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా తెలియకుండా పవన్ ఈ యాత్ర చేపట్టడం... ఆయన ఫోన్లకూ స్పందించకపోవడం కచ్చితంగా గమనించదగ్గ అంశాలే. పవన్ బాబుల మధ్య భేటీ జరిగి ఇరవై రోజులవుతోందంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది. తనకు ఎదురైన అవమానాన్ని, అసమ్మతిని వ్యక్తం చేసేందుకే పవన్ మౌనవ్రతం చేపట్టారా? అన్న అభిప్రాయమూ కొందరు వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల లడ్డూ వ్యవహారంలో పవన్ తాను, చంద్రబాబు సమానమే అన్న చందంగా ప్రవర్తించడం టీడీపీకి నచ్చలేదు. ఎల్లో మీడియాలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కథనాలు రావడం ఇందుకు నిదర్శనం. అదే సమయంలో పవన్ ఆయా సందర్భాల్లో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయడం కూడా జనసేనకు అంతగా రుచించలేదు. పవన్ కళ్యాణ్ మరీ అంతగా అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదన్నది జనసేన కార్యకర్తల అభిప్రాయంగా ఉంది. అంతేకాకుండా.. లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ఉద్దేశం టీడీపీ నుంచి వ్యక్తం కావడం... దాంతో తమ నేతకు ప్రాధాన్యం తగ్గిపోతుందని, భవిష్యత్తులో లోకేషే ముఖ్యమంత్రి అయితే పవన్ ఎన్నటికీ ఆ స్థానానికి ఎదగలేడని వీరు ఆందోళన చెందారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియా యుద్ధమూ సాగింది. పవన్ అన్న అయిన నాగబాబును మంత్రిని చేయబోతున్నట్లు ప్రకటించి నెలలు గడుస్తున్నా, ఇంతవరకు దాని గురించి చంద్రబాబు మాట్లాడుతున్నట్లు లేరు. ఇది కూడా మిస్టరీగానే ఉంది.
అయితే... తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ అపచారానికి పాల్పడ్డారనడంలో సందేహం లేదు. లడ్డూ ప్రసాదం తయారీలో జంతుకొవ్వు కలిసిందన్న చంద్రబాబు మాటను పవన్ గుడ్డిగా నమ్మి అదే అబద్ధాన్ని చెప్పడం ద్వారా తప్పులో కాలేశారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సందర్భంలోనూ టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, మంత్రి లోకేష్‌లు అసలు పవన్ కళ్యాణ్ ఎవరన్నట్టుగా వ్యవహరించారు. తొక్కిసలాటకు బాధ్యత వహించి టీటీడీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న పవన్ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో పవన్ పరువు పోయినట్లయింది. ఆ తర్వాత చంద్రబాబు మంత్రులకు ప్రకటించిన ర్యాంకుల్లో పవన్‌కు పదో స్థానం దక్కడం పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది. ఫైళ్ల పరిష్కారంలో వెనుకబడ్డ ప్రాతిపదికన ర్యాంకులిచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే పవన్ అప్పటికే మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరైన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ నిజంగానే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారేమోలే, అందుకే రాలేదేమోలే అని పలువురు అనుకున్నారు. కానీ చంద్రబాబు కీలకంగా పరిగణించిన ప్రభుత్వ కార్యదర్శుల, మంత్రుల సమావేశానికి కూడా పవన్ రాకపోవడంతో వీరిద్దిరి మధ్య ఏదో గొడవ జరుగుతోందన్న చర్చ మొదలైంది.
ఆ సమావేశంలోనే చంద్రబాబు డిప్యూటీ సీఎం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆరా తీయగా నడుంనొప్పి వల్ల రాలేకపోయారన్న సమాధానం వచ్చింది. తాను పోన్ చేసినా పవన్ అందుబాటులోకి రాలేదని చంద్రబాబు అనడం, ఆ విషయం తెలుగుదేశం పత్రిక ఈనాడులోనే రావడం సంచలనమైంది. టీడీపీ వర్గాలే ఈ సమాచారాన్ని ఎల్లో మీడియాలో వచ్చేలా చేశారా అన్న సందేహమూ వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ సీఎంతో పద్ధతిగా వ్యవహరించలేదన్న సంగతి ప్రజలకు చెప్పాలని అనుకుని ఉండవచ్చు. దానివల్ల భవిష్యత్తులో పవన్ ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకున్నా, తప్పు ఆయన వైపే ఉండేలా చేయడం లక్ష్యంగా కనిపిస్తుంది. ఇందుకు తగ్గట్లే చంద్రబాబు కార్యదర్శుల సమావేశంలో ఫైళ్ల అంశాన్ని ప్రస్తావించి, పైళ్ల పరిష్కారానికి ఆరు నెలలు, ఏడాదా అని ప్రశ్నించారు. నిజానికి ఫైళ్లు కేవలం కార్యదర్శులు మాత్రమే క్లియర్ చేస్తే సరిపోదని, మంత్రులు, సీఎం కూడా ఆమోదించాలని చంద్రబాబుకు తెలియంది కాదు. పవన్‌ను ఇరుకున పెట్టడానికి మాత్రమే ఈ సంగతిని ప్రస్తావించారు.
గత నెల రోజులుగా పవన్ కళ్యాణ్ పేషీలో వందల కొద్ది ఫైళ్లు పేరుకుపోయాయని చెబుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఫైళ్లు ఎప్పుడూ పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. విచిత్రం ఏమిటంటే సొంత శాఖలో ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ ఇతర శాఖలలో జోక్యం చేసుకోవడాన్ని టీడీపీ తెలివిగా వాడుకుంది. దీనిని టీడీపీ ఎక్స్ పోజ్ చేసిందని చెప్పాలి. జనసేన కు చెందిన ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్‌కు, కందుల దుర్గేష్‌కు మంచి ర్యాంకులు ఇచ్చి, పవన్ కళ్యాణ్‌ను పదో ర్యాంకుకు పడవేయడం ద్వారా టీడీపీ ఇవ్వాల్సిన సందేశం ఇచ్చేసినట్లయింది. అంతకు ముందు హోం శాఖ, టూరిజం, సివిల్ సప్లయిస్ మొదలైన శాఖలలో వేలు పెట్టిన పవన్ వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయిన విషయాన్ని, సీజ్ ద షిప్ ఘటనలో ప్రభుత్వ అసమర్థతను టీటీడీ యాజమాన్యం చేతకానీతనాన్ని ఆయన తనకు తెలియకుండానే బయట పెట్టేశారు. మరో వైపు మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తూ ఢిఫ్యాక్టో సీఎంగా ఉన్నారన్న భావన ఉంది. ఇది కూడా పవన్ కు నచ్చడం లేదు. తన పేషీలో అధికారులను కూడా లోకేష్ నియమించారని ఆయన ఆగ్రహం చెందినట్లు వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం పోలీసు శాఖ మొత్తం లోకేష్ చెప్పినట్లే వింటోందన్న భావన ఏపీ అంతటా ఉంది. ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా పిఠాపురంలో పోలీసుల పనితీరును, గంజాయి వంటి మాదకద్రవ్యాలు యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయని పవన్ తప్పుపట్టారు. లోకేష్ రెడ్ బుక్ వ్యవహారం కూడా ఏపీలో గందరగోళం సృష్టిస్తోంది. లోకేష్ శైలిపై పవన్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఇవన్ని ఒక ఎత్తయితే చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికపై నోరు విప్పలేని పరిస్థితి పవన్‌కు ఏర్పడింది. అసలు ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో తెలియని అయోమయంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు ఏమి చేయాలో తోచక ఈ తీర్థయాత్ర పెట్టుకుని ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు.అయితే సీఎంకు చెప్పకపోవడం, ఫోన్‌కు కూడా స్పందించకపోవడంతో పాత ఘటనలన్నిటికి ప్రాధాన్యత ఏర్పడింది. నడుం నొప్పి నిజంగానే అంత తీవ్రంగా ఉండి ఉంటే, కేరళ పర్యటనలో ఎక్కడా అలసట లేకుండా తిరుగుతారా అన్న డౌటు వస్తుంది. ఈ పరిణామాలతో ఇప్పటికిప్పుడు టీడీపీ, జనసేనల మధ్య ఏదో జరిగిపోతుందని చెప్పలేం .చంద్రబాబు, పవన్ ల మధ్య ఉప్పు, నిప్పులా పరిస్థితి మారిందని అనలేం. కాకపోతే ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా నడుస్తోంది వెల్లడైంది. పవన్ ప్రస్తుతం పవర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో కొంతకాలం అలిగి, తనకు కావల్సినవి సాధించుకోవడానికి ఏమైనా ఇలా చేస్తుండవచ్చు.
మరో వైపు బీజేపీ పవన్ కళ్యాణ్‌ను దక్షిణాది రాష్ట్రాలలో తిప్పి, రాజకీయ ప్రయోజనాల కోసం యత్నిస్తుందా అన్న సందేహం కూడా చాలామందిలో ఉంది. భవిష్యత్తులో దక్షిణాదిలో బీజేపీ ఎదగడానికి ఇలాంటి సినీ నటులు కొందరిని వాడుకుంటే వాడుకోవచ్చని చెబుతున్నారు. కేరళలో ఇప్పటికే ప్రముఖ నటుడు గోపికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. ఏపీలో పవన్ సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తమవైపు ఉన్నట్లు చూపించే యత్నం చేస్తోంది. ఇవన్ని కూడా రాజకీయాలలో కీలకమైన అంశాలే అవుతాయి. పవన్ కళ్యాణ్‌కు భక్తి విశ్వాసాల మీద కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఒకసారి క్రైస్తవ మతానికి, మరోసారి ముస్లిం మతానికి అనుకూలంగా మాట్లాడడం, తన కుటుంబంలోనే తన పిల్లలే క్రైస్తవం తీసుకోవడం వంటి అంశాలు ఆయనపై విమర్శలకు దారి తీస్తుంటాయి. అధికారం వచ్చాక తిరుమల లడ్డూ ఘటన సమయంలో సనాతని వేషం కట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లు మామూలుగానే కనిపించినా, దక్షిణాది తీర్థయాత్రలో మళ్లీ సనాతని వేషంలోకి రావడం అంతా నాటకీయంగా ఉంది.
తన కుమారుడు అఖిరా నందన్‌ను ప్రమోట్ చేయడానికి కూడా ఈ యాత్రను ఆయన వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.రాజకీయంగా అయినా, భక్తిపరంగా అయినా ఆయన చిత్తశుద్దితో చేస్తే ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రతిదానిని డ్రామా చేస్తూ పబ్బం గడుపుకుంటూ పోతే మాత్రం పవన్ కళ్యాణ్ కే నష్టం జరగవచ్చు.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment